[శ్రీమతి ఆకొండి అన్నపూర్ణ విశాలాక్షి గారు రచించిన ‘అడుగులో అడుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
బస్సు నెమ్మదిగా నడుస్తోంది. ఘాట్ రోడ్డు వలన మెలికలు తిరుగుతూ వెడుతోంది కొండు అంచులో.. ఘాట్ రోడ్డు కదా! బయటకు చూస్తుంటే. ‘అమ్మో!’ ఒంట్లో ఒక రకమైన భయం. గుండెలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే. బస్సు గాని అదుపు తప్పితేనా.. జస్ట్.. లోయలో.. నామరూపాలు లేకుండా.. ఇక అంతే. దానికి సాయం ఎదురుగా ఏదైనా వెహికల్స్ గానీ, బస్సులు గాని వస్తున్నాయేమో నని హారన్ మ్రోగించుకుంటూ నడపాల్సిందే. ఆ రూట్‌లో వెళ్ళాలంటే డ్రైవర్ ఎంతటి ఏకాగ్రత, డ్రైవింగ్‌లో వైపుణ్యం, చాలా సహనం కలిగి వుండాలి. తరచూ ఆ ప్రాంతాలలో ప్రయాణం చేసేవారికి, ఆ ప్రాంతంలో నివసించే వారికి భయం వుండదేమో గాని.. కొత్తగా వెళ్ళేవారికి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలిందే. అలా అనిపిస్తున్నా.. చుట్టూ వున్న ప్రకృతి సౌందర్యం మాత్రం వర్ణనాతీతం.. ఎవరో సినీ కవి రాసినట్టు ‘ఎంతో రసికుడు దేవుడు’ అని ఎంత చక్కటి ప్రకృతి సౌందర్యాన్ని మనకు ప్రసాదించాడో కదా! అలా చూస్తూ వుండిపోతే చాలు జీవితంలో ఇంకే మీ అక్కర్లేదు అనిపిస్తుంది అని అనిపిస్తోంది. కండక్టర్ వెనుక సీటులో కూర్చుని వున్న భాస్కర్‌కి మాత్రం ఏమీ అనిపించడం లేదేమో! బస్సు ఎక్కింది మొదలు ఆ ముఖం ఒకే ఫీలింగ్ లోనే వుంది ఆందోళన లేదు, ప్రకృ తిని చూసి ఆనందమూ లేదు. ఏమైనా ఆలోచిస్తున్నాడో మరి యేమో! అలా బస్సు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తూ.. నెమ్మదిగా లోయ ప్రాంతం లోకి వచ్చింది. “పాండురంగిని, పెద్ద బయలు” అంటున్న కండక్టర్ పిలుపుకి ఉలిక్కిపడి తేరుకున్న భాస్కర్ లేచి, బస్సు దిగుతూ సామానులు తీసుకుని కండక్టర్‍ని “పెద్ద బయలు ఎలా వెళ్ళాలి? నాకు ఈ ప్రాంతం కొత్త” అని అంటుంటే కండక్టర్ “సార్, ఇక్కడ ఆటోలు వుంటాయి” అని, అటుగా వస్తున్న ఆటోని ఆపి డ్రైవర్‌తో.. “సార్‌కి ఈ రూటు కొత్త. పెద్ద బయలు తీసుకు వెళ్ళు” అని చెప్పి “సార్! మీరు ఆటో ఎక్కండి జాగ్రత్తగా తీసుకు వెడతాడు” అని చెప్పి బస్సు ఎక్కేసాడు కండక్టర్.
భాస్కర్ ఆటో ఎక్కి స్కూల్ వాళ్ళు యిచ్చిన అడ్రస్ చూపించాడు. దానికి అటో డ్రైవర్ “సరే సార్” అంటూ ఆటో స్టార్ చేసి “సార్! మీరు యెక్కడ నుండి వస్తున్నారు?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి “విజయనగరం” అని సమాధానం యిచ్చి. అలా ప్రకృతిని చూస్తూ వుండిపోయాడు భాస్కర్.
పచ్చని చెట్లు. అల్లంత దూరాన కొండ చరియల పైన పచ్చ పచ్చగా పచ్చని రంగు కార్పెట్ పరచినట్లుగా వుంది. పుడమి తల్లి ఆకుపచ్చ, పసుపు మేలు కలయిక రంగు చీర ధరించినట్లుగా భాస్కర్‌కి అనిపించింది. ప్రకృతిలో అలా మమైకం అయిపోయాడు భాస్కర్, ఆటో ఆగింది అని కూడా తెలియనంతగా.
“సార్! వచ్చేశాము” అన్న ఆటో డ్రైవర్ మాటలకి ఉలిక్కిపడి ‘అప్పుడే వచ్చేశామా!’ అనుకుంటూ ఆటో దిగి సామానులు తీసుకోబోతుంటే “సార్! ఆగండి!” అన్నాడు.
ఒక అతను వచ్చి ఆటోలో వున్న సామానంత దింపి కింద బెట్టాడు. భాస్కర్ ఆటో డ్రైవర్‍కి డబ్బు యివ్వబోతుంటే “సార్! మీరాగండి” అంటూ డ్రైవర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ భాషలో ఏదో చెప్పాడు. “సరే” అంటూ ఆ డ్రైవర్.. “సార్! మీరు ఎక్కడికైనా పోవాలంటే.. ఈ నెంబర్‍కి ఫోన్ చేయండి!” అంటూ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు, భాస్కర్ “అదేమిటి?” అని అడిగేలోపే. ముందు ఓ చిన్న గేటు చుట్టూ యినుప తీగెలతో ఫెన్సింగ్. కొంచెం లోపలికి డాబా యిల్లు. వచ్చినతను “సార్! నా పేరు అర్జున్. నేను మీ స్కూల్‌లో వాచ్‌మన్‌ని” అని చెప్పేసి; సామానులు తీసుకుని ఆ యింటి అరుగు మీద పెట్టి, ప్రక్కగా వెళ్ళి అక్కడ ఒక రేకుల ఇంటిలో వున్న వాళ్ళను వాళ్ళ భాషలో పిలిచాడు. లోపలి నుండి ఓ ముసలి జంట, బయటకి వచ్చి వాళ్ళ బాషలలో ఏదో అన్నారు. తాళం చెవులు తీసుకుని, అర్జున్ యింటి తాళాలు తీశాడు. లోపల ఎంతో పరిశుభ్రంగా, ఎంతో అందంగా వుందా యిల్లు. అర్జున్ సామానులన్నీ చక్కగా సర్దేశాడు. “సారు మీరు వంట చేసుకోనవసరం లేదు! వాళ్ళు వండుతారు, లేకపోతే మా మిస్సెస్ వచ్చి అన్ని పనులు చేసిపెడుతుంది. ఇక ఏమైనా కావలిస్తే ఆ ముసలతను తెస్తాడు. అతని పేరు సైదులు.. ఆమె పేరు సీతమ్మ. ఇద్దరూ చాలా మంచోళ్ళు” అని చెపుతుండగానే రేకులషెడ్డులో నుండి వాళ్ళ పెద్ద పెద్ద కేకలు అరుపులు, ఏడుపులు, వినిపిస్తున్నాయి. ఆ ముసలాడు ఆమెను కొడుతున్నాడు, బయటకి తోసెస్తున్నాడు. ఆమె అరుస్తోంది, ఏడుస్తోంది.
అది చూస్తున్న భాస్కర్ “అర్జున్! అదేమిటి అలా కొడుతుంటే చూస్తూ వూరుకున్నావేమిటి? వెళ్ళి విడిపించ వచ్చుగా!” అన్నాడు.
దానికి సమాధానంగా “సార్! అది వాళ్ళకి మామూలే, రోజు వుండేవే.. ఆ ముసలమ్మ మందు తాగింది, వాడు తాగాడు. కొంతసేపు అయ్యాక చూడండి సార్!” అన్నాడు. “ఇలాంటి జంటలు చాలా వుంటాయి సార్”, అని అంటుండగానే.. సీతమ్మ బయటికి వచ్చి కొంచెం ప్రక్కగా వున్న చిన్న నీటి కొలను ఒడ్డున కూర్చుంది ముఖం ముడుచుకుని. వెనుకగా ముసలాడు వచ్చాడు. నెమ్మదిగా కొలనులో వున్న చిన్న బండ మీద ఆమెను కూర్చోబెట్టి అందులో నీళ్ళు తీసి ఆమె మోమును కడిగి భుజంపై వున్న తువ్వాలుతో ఆమె మోమును తుడుస్తూ ఏదో చెపుతుంటే చిన్న పాపలా నవ్వుతూ తలుపుతూ తను ఆ నీళ్ళు తీస భర్త ముఖాన్ని కడిగి.. తన పమిట కొంగుతో ముఖాన్ని, అతని చేతుల్ని తుడుస్తోంది, అతని నుదుట ముద్దు పెట్టుకుంది. అలా ఇద్దరూ ముద్దుముచ్చట్లల్లో మునిగిపోయారు. భాస్కర్‌కి చాలా సరదాగా అని పించింది. ఇగోలు లేని వాళ్ళ బంధం! అదే కదా భార్యాభర్తల అనుబంధం!
అర్జున్ “అన్నీ సర్దేశాను సార్! నేను ప్రొద్దునే వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.
కాస్త ఫ్రెష్ అయితే బావుంటుందని బాత్‌రూమ్, టాయ్‌లెట్ల కోసం చూస్తే కాస్త దూరంగానే వున్నాయి. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సైదులు భోజనం తీసుకు వచ్చాడు. తినే వరకు కూర్చున్నాడు. అతనికి కొద్ది కొద్దిగా తెలుగు వచ్చు. “భోజనం బావుందా? కూరలు బావున్నాయా?” లాంటి ప్రశ్నలు వేశాడు. “చాలా బావున్నాయి” అని చెప్పాడు. నిజంగా కూరలు, పెరుగు, చాలా బావున్నాయి. బియ్యం దంపుడు బియ్యం వలన అన్నం కొంచెం ఎరుపు రంగులో వున్నా చాలా రుచిగా వుంది. అక్కడి వాళ్లు రోజు వడ్లు దంచుకుని అన్నం వండుకుంటారు అని చెప్పాడు సైదులు. అతను వెళ్ళిపోయాక ప్రయాణం బడలికతో భాస్కర్ పడుకుండి పోయాడు. తెల్లవారేదాకా మెలుకువ రాలేదు. సరిగ్గా లేస్తుంటే అర్జున్ తలుపు తట్టాడు. లేచి, వెళ్ళి తలుపు తీసేసరికి, అర్జున్. “సార్! ప్రిన్స్‌పాల్ సార్ మిమ్మల్ని ఈ రోజు రెస్ట్ తీసుకోమని, రేపు జాయిన్ అవ్వమని చెప్పారు.” అంటూ చెప్పాడు.
“సరే” అంటూ భాస్కర్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చేసరికి అర్జున్ పక్కలు అన్నీ సర్దేశాడు. ఇంతలో సైదులు ఒక పెద్దగ్లాసుతో చిక్కని చక్కని కాఫీ తెచ్చాడు. నిజంగా ఆ కాఫీ త్రాగితే చాలు, తినడానికి ఇంకేమి అక్కర్లేదు అనిపించింది “సారు, మీరేమి చేసుకోకండి. నా భార్య చేస్తుంది” అని చెప్పేసి వెళ్ళిపోయాడు. భాస్కర్ స్నానం అవి కానిచ్చి బట్టలు వేసుకుని అలా బయటకు వచ్చి వరండాలో నిలబడి చూశాడు. చుట్టుప్రక్కల కొండలు, కోనలు. చెట్లు, గుబురు పొదలు అంతా ఆకుపచ్చమయం. ప్రశాంతంగా వుంది. మనస్సుకు ఎంతో హాయిగా ఉంది. జీవిత కాలం అంతా యిక్కడే వుండి పోతే చాలు, వేరేది అక్కేల్లేదు.. అనుకుంటూ చుట్టు ప్రక్కల చూసున్నాడు. యిళ్ళన్నీ, మట్టి మిద్దెలు, రేకుల యిళ్ళు, అక్కడక్కడ డాబాలు, రెండో మూడో మేడలు వున్నాయి. ముందుకు వెడితే ఎలా వుంటుందో అనుకుంటూ తలుపులు వేసి బయటకు వెడుతున్నాడు. రకరకాల మనుషులు, రకరకాల వస్త్రధారణలు. ఎవరి పనులలో వాళ్ళు. గొడవలు, కొట్లాటలు లాంటివి లేవు. పొలం పనులు చేసుకుంటూనో, పశువులను మేపుకుంటూనో, కూలి పనులు చేసుకుంటునో.. ఇలా ఎవరు చేసుకోగలిగే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది తనని చూసి పలకరింపుగా నవ్వుతున్నారు, కొంతమంది దండం పెడుతున్నారు.
ఇంతలో ఒక ఆమె వచ్చి “సారు మీ యింటామె రాలేదా? మీరొక్క వచ్చారంట గదా! సారు?” అని ప్రశ్నించింది. దానికి సమాధానంగా తడబడినా, తరువాత రాలేదని సమాధానం యిచ్చాడు. ముందుకు నడిచాడు. అన్నీ మరచిపోయి ఆ వాతావరణానికి తను అలవాటు చేసుకుంటున్నా భాస్కర్‌కి మద్య మధ్యలో తన భార్యను గురించిన ప్రశ్నలు ఎదురయ్యేవి, సమాధానం ఈయక మౌనం వహించేవాడు. అలా కాలం సాగిపోతోంది. చాలామంది చాలా వరకు అర్థం అయ్యి అడగడం మానేసారు. కొంతమంది పెళ్ళి చేసుకోమని అంటున్నా సున్నితంగా తిరస్కరించాడు. కారణం తనకి తన భార్య సునీత అంటే పిచ్చి ప్రేమ, ఎంతో ఇష్టం. అంతే కారణం.
***
భాస్కర్‌కి దూరమైన సునీత ఉద్యోగం చేసుకుంటూ కూతురిని, పెంచి పెద్ద చేసింది. చాలా కష్టపడింది. బాగా చదివించింది, పై చదువులకి అమెరికా పంపించింది. పాపం సమాజంలో ఒక ఒంటరి స్త్రీ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. జరిగింది తెలిసినా మళ్ళీ మళ్ళీ దీని గురించే ప్రశ్నలు వేస్తూ కావాలనే గుర్తు చేసి బాధిస్తూ వున్నా సునీత తన మనోధైర్యంతో ఓ చిరునవ్వే సమాదానం ఇచ్చేది. విడాకులు యిచ్చి, పెళ్ళి చేసుకోమని సలహాలు యిచ్చేవాళ్ళు రకరకాల మనుష్యులు. కాని చెక్కు చెదరని గుండె నిబ్బరంతో కూతురు పావనిని మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటోంది.
సునీతకి ఒక్కొక్కసారి అర్థం కాదు. అసలు తను తన భర్త భాస్కర్ ఇద్దరూ విడిపోయారా? సునీత తల్లిదండ్రులు, అత్తమామలు ఇద్దరికీ చెప్పి చూసారు. అసలు సునీతకే అర్థం కానప్పుడు ఏమి చెప్పగలదు? ఆ భగవంతునికే ఎరుక. మౌనం వహిస్తుంది అంతే. విడాకులు తీసుకోలేదు మరి.
భాస్కర్ తనని చాలా ప్రేమగా చూసుకునేవాడు. తను భాస్కర్‌ని ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకుంది. భాస్కర్ తనని యిష్టపడ్డాడు.. పాప పావని పుట్టింది ముచ్చటగా వుండే వారు ముగ్గురు. పావనితో ఎంతో ఆనందం పొందేవారు. పావని పెద్దది అవుతోంది. సుమారు అయిదారు సంవత్సరాలు వచ్చాయి. మరి ఎందుకో భాస్కర్‌ని దూరం పెడుతోంది, అలా అని ఎవరితో చనువులు, స్నేహలు లేవు. కారణం చెప్పలేదు.
ఒక రోజు భాస్కర్, “సునీ, నీకు నాకు మద్య దూరం ఏర్పడిపోతోంది. కారణం ఏమిటో? నాకు తెలీదు. నా ప్రవర్తన నీకు చిరాకు రప్పిస్తోందా! ఏ విషయంలోనైనా నిన్ను హార్ట్ చేసానా?” అంటూ ప్రశ్నించాడు లాలిస్తున్నట్లుగా..
సునీత యేమీ మాట్లాడలేదు. మానంగా వెళ్ళిపోయింది సరే ఇక చేసేదేమీ లేక భాస్కర్ వంటింటి లోకి వెళ్ళి కంచంలో భోజనం పెట్టుకుని వచ్చి “సునీ! భోజనం చెయ్యి. బహుశా ఇదే నేను నీకు తినిపించగలిగే ఆఖరి భోజనం కావచ్చు, ఎందుకంటే నా నీడే నీకు భరించలేనిదిగా వుంది. మనం కలిసి వుండాలో, విడిపోవాలో నిర్ణయం నీదే. బలవంతంగా నువ్వు నాతో కాపురం చేయనవసరం లేదు. వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, నీ యిష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు. విడాకులు కావాలంటే యిచ్చేస్తాను” అనేసి పావనిని ఎత్తుకుని గదిలోకి వెళ్ళిపోయి భోరుమని ఏడిచాడు.
తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? రాత్రంతా కలత నిదురే. తెల్లవారింది. మామూలుగా యిద్దరూ లేచారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. పావనిని స్కూల్‌కి పంపించారు. ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంకాలం యింటికి చేరుకున్న ఆ జంట మౌనంగానే వున్నారు. భాస్కర్ సునీతకి తన చేతిలో కవరు చూపించాడు. సునీత ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఏమిటి? విడాకులా, మరేమిటి? అనే సందిగ్ధంలో పడింది. కవర్ ఓపెన్ చేసి చూసింది. ట్రాన్స్‌ఫర్. విశాఖ జిల్లా మన్యం ప్రాంతం. అలా వుండి పోయింది. భూమి కంపించినట్లు అయ్యింది. మనస్సులో ఒక రకమైన కంగారు. ఏమిటి తనకి దూరంగా వెళ్ళిపోతాడా! ఎలాగో రాత్రి తెల్లారింది. ఎదురుగా భాస్కర్ తల్లిదండ్రులు, సునీత తల్లిదండ్రులు.
“అమ్మా! మీరు?” అంటున్న సునీత మాటలకు “భాస్కర్ రమ్మనమని ఫోను చేసాడు” అన్నారు ఆ నలుగురు. ఇంతలో భాస్కర్ వచ్చాడు. పిలవడానికి కారణం అడిగారు ఇద్దర్నీ. ఇద్దరూ మౌనం. దానితో వాళ్ళకి కోపం వచ్చి “అలాంటప్పుడు మమ్మల్నెందుకు పిలిచావు?” అని నిలదీశారు. భాస్కర్ విషయం చెప్పారు. తామిద్దమము విడిపోతున్నామని అన్నాడు. ఒక్కసారి పెద్దవాళ్ళు అవాక్కయ్యారు. ఎందుకు అని ప్రశ్నించారు జవాబు లేదు.
“సరే మీ జీవితాలు మీ యిష్టం” అన్నారు. “కానీ మీ కూతురి బాధ్యత పూర్తిగా ఒక్కరే వహించండి” అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఒక్క ఆశ. ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ వుంది. ఏదో అలకలు తాపాలు తగ్గి మళ్ళీ కలుస్తారనే ఆశ.
“సునీత! నీకు యీ యిల్లు సామాను అంతా వదిలేస్తున్నాను” అన్నాడు. ఆ మరునాడే భాస్కర్ ప్రయాణమై వెళ్ళిపోయాడు, తనతో కొంత సామానులతో.
***
ఇలా ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిన సునీతకి అనిపించింది. తనకుగా తెలిసి ఏ తప్పు చేయలేదు. కానీ ఈ మధ్య మనసులో ఒక నిర్లిప్తత ఎందుకు ఏర్పడిందో?
అందుకేనా తను భాస్కర్‌ని దూరం పెట్టింది! ఏదైతేనేమి? జీవితాలు దూరమై పోయాయి.
పెళ్ళై కూతురు అత్తవారింటికి అమెరికా వెళ్ళిపోతూ ఓ మాట చెప్పింది. “అమ్మా! నేను నీకు చెప్పగలిగే దానిని కాను. చెప్పకూడదు కూడా. నేను వెళ్ళిపోయాక నీ పరిస్థితి ఏమిటి? నా మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచావు. పెద్దదాన్ని చేసి, ప్రయోజకురాలిని చేసావు. ఎంతో కష్టపడ్డావు. పెళ్ళి చేసావు. కాని నీవు ఒంటరివి అయిపోతావు. అదే బాధ. ఎలా వుంటావమ్మా? నేను నిన్ను నాతో తీసుకు వెళ్ళలేను. కార్తిక్ మంచివాడు. చాలా మంచి మనసున్న మనిషి. కానీ ఎల్లకాలం ఒకే తీరుగా మనుషులు వుండలేరు కదా అమ్మా! ఒకవేళ నిన్ను తను ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. నేనూ తట్టుకోలేను. దాని వలన ఏదైనా పొరబాటు జరిగితే మరి..” అంటూ విమానం ఎక్కేసింది.
కూతురు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మరి ఒంటరితనమే తనకు అనుకుంటూ ఒక్కసారిగా దుఃఖం ఆగక భోరున ఏడిచింది. భాస్కర్‌కి తను ఒకసారీ కూడా గుర్తుకు రాలేదా! అలా ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంది.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది మాటలు వినబడుతున్నాయి. ఆఁ, తెల్లవారినట్లుంది.. ఎవరై వుంటారా? అనుకుంది. మనస్పుకు ఏదో తెలియని పరిస్థితి, అది వేదనా లేక ఆనందమా? ‘ఒకవేళ భాస్కర్ వచ్చాడా? తన జీవితంలోకి ఆహ్వానిస్తాడా!’ అనుకుని తలుపులు తీసింది. ఎదురుగా తల్లి కనిపించింది. వెనుకగా అత్తగారు. ఒక్కసారిగా నిరాశగా అనిపించి తన ఆశ ఫలించలేదని “మీరా!” అనేసి ‘ఎందుకు వస్తాడు?’ అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి పోతుంటే్..
“సునీతా! నీ కోసం ఎవరో వచ్చారు చూడు” అంటున్న అత్తగారి మాటలకి సమాధానంగా “నా కోసం వచ్చే వాళ్ళు మీరేగా” అంటూ వెనక్కి తిరిగింది. అలా అలా చూస్తూ అవాక్కయ్యింది. “ఇది కలా! నిజమా!” అరచినంత పనిచేయబోయింది.
“ఇది నిజమే సునీతా మేడమ్ గారు” అంటూ భాస్కర్ చప్పట్లు కొడుతూ ఆనందంగా నవ్వుతూ సునీతని హృదయ పూర్వకంగా ఎదకు హత్తుకున్నాడు.
“బాచీ, సారు, మీరు.. నువ్వు” అంటూ మాటలు తడబడుతున్న సునీతతో, “అన్నీ నేనే” అంటూ ఆమెను అలా పదిలంగా పట్టుకుని బెడ్ రూమ్ వైపు నడిచి సునీతని బెడ్ మీద కూర్చొబెట్టి బెడ్ మీద వాలిపోయాడు.
సునీత “బాచీ! చాలా అలసిపోయాను నీవు లేని ఈ జీవన పయనంలో” అంటూ ఇన్నాళ్ళు కంటి రెప్పల మాటున దాచుకున్న కన్నీటి వరదను ఆపలేకపోయింది.
“అలసట తీర్చుకో! నేను మ్రోడు లాగ ఇన్నేళ్ళు గడిపాను. నీ దగ్గరకు వచ్చెయ్యాలని నా మనస్సు లాగింది. నువ్వు నా కోసమే చూస్తావని చూస్తూనే వుంటావని..” అన్నాడు కన్నీరు తుడుస్తూ.
“ఒక విషయం చెప్పనా! నేను తొందరగా రావడానికి కారణం..” అని ఆపి, “అమ్మా, అత్తయ్యా!” అంటూ పిలిచాడు భాస్కర్. వాళ్ళిద్దరూ వచ్చారు.
“నేను వుండే వూరిలో యింటి ప్రక్కల రెండు ముసలి జంటలు వున్నారు. పగలంతా పనులు చేసుకునేవారు. సాయంకాలం వేళ ఒక జంట తాగేసి డ్యాన్స్‌లు చేసుకునేవారు, మరొక జంట తాగేసి, ఒకరినొకరు కొట్టుకుని తిట్టుకునేవారు. ఆమె దూరంగా వెళ్ళి పోయి ఏడుస్తూ కూర్చుంటే ముసలతను నీళ్ళు కాచి అక్కడ చిన్న మడుగు దగ్గర ఆమెని కూర్చోబెట్టి ఆమెకు స్నానం చేయించేవాడు. ఆమె అతనికి చేయించేది. వంట చేసి, ఆరుబయట మంచంపై కూర్చుని అతను ఆమెకు దెబ్బలు తగిలిన చోట నూనె రాస్తుంటే, ఆమె గోరు ముద్దలు తినిపించేది.
ఒలసారి నేను ఆమెను అడిగాను ‘ఎందుకు? అలా కొడుతున్నాడు? నువ్వెందుకు..’ అనగానే ఆమె ‘అదే కదా సారు భార్యాభర్తల బంధం. ఈ తాళి విలువ’ అంటూ ‘సారు! ఆడు నాకు దేవుడు. నా కిడ్నీ చెడిపోయిందని తెలిసి, తన కిడ్నీ నాకు ఇచ్చాడు. నన్ను బ్రతికించుకున్నాడు. తనకి నేను, నాకు తనూ ఇద్దరూ కలిస్తే..’ అని ఆమె అంటుంటే ‘కడదాకా వుండే బంధం’ అనిపించింది. మళ్ళీ ‘సారు అమ్మను సెమించెయ్యి. తప్పు సేస్తే ఇక్కడ పెట్టుకో. దూరం సేసుకోకు’ అంది. ఇంతలో మరో జంటలో ముసలాడు వచ్చి ‘సారూ, నాకు కేన్సర్. నేను ఎక్కువ కాలం బ్రతకను. అది తెలిసి పుట్టింటికి పోకుండా తన కిడ్నీ అమ్మి వైద్యం చేయిస్తోంది సారు’ అంటూ ‘అదే కదా బందం’ అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది.. నేను నీ మనస్సుకు, మాటకు విలువ యివ్వలేకపోతున్నానేమోనని. భార్యాభర్తలు జీవితాంతం ఒకరికొకరు కదా! నాతో ఏడడుగులు నడిచావు. కానీ ఈనాటి నుండి జీవితాంతం వరకు నా అడుగులో అడుగు వేస్తావా, నా చేయి పట్టుకుని?” అన్నాడు భాస్కర్.
