Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-17

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ప్రతి ఏడాది లానే తోలుబొమ్మల వాళ్ళు వస్తారు. వాళ్ళ నాయకుడు జోగయ్య శాస్త్రి గారిని కలవటానికి వస్తాడు. నాన్నగారు వాళ్ళు కాశీ వెళ్ళారని చెప్పి, అతనికి ఐదు వందల రూపాయలిచ్చి పంపుతాడు అద్వైత్. ఏం నాటకం వేస్తున్నారని సీత అడిగితే, నాటకం కాదు, తోలు బొమ్మలాట అని చెప్తాడు జోగయ్య. లంకాదహనం ఆడమని చెప్తుంది సీత. సరేనంటాడు జోగయ్య. తోలుబొమ్మల ముఠా – శాస్త్రిగారింటి దగ్గర లోని చింతచెట్టు కింద గుడారాలు వేసుకుని, ఆటకి అన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇండియా వాళ్ళెవరిని అద్వైత్‍ని అడుగుతుంది. తోలుబొమ్మల ఆటగాళ్ళు అని చెప్తాడు. ఆ మాట మొదటిసారి వింటూండడంతో సుల్తాన్ భాయ్‍తో వెళ్ళి – తోలుబొమ్మలాట వాళ్ళని కలిసి – బొమ్మలన్నీ చూసి, వాళ్ళని అభినందిస్తుంది. అప్పటికి చీకటి పడుతుండడంతో మర్నాడు మళ్ళీ వచ్చి చూస్తానని చెప్తుంది ఇండియా. మర్నాడు ఉదయం వెళ్ళి అన్ని తోలు బొమ్మలను ఫొటోలు తీసుకుంటుంది. సాయంత్రం జరిగే లంకా దహనం ఆటకి తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తాడు జోగయ్య. సరేనంటుంది. ఆటకి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. ఆట మొదలవుతుండుగా, ఇండియా తన అమ్మమ్మ మేరీతో కలిసి అక్కడికి వస్తుంది. వాళ్ళని తన మంచం మీద కూర్చోమంటాడు అద్వైత్. ఆటలోని అంశాలేవీ అర్థం కాని మేరీకి వాటిని ఆంగ్లంలో వివరిస్తాడు అద్వైత్. అతనికి చెరో వైపు ఇండియా, మేరీలు కూర్చోవడంతో ఉడుక్కుంటుంది సీత. మధ్యలో లేచి ఇంటికి వెళ్ళిపోతుంది. కాసేపటికి హఠాత్తుగా వాన మొదలవటంతో ప్రదర్శనని నిలిపివేయాల్సి వస్తుంది. ఇండియా, మేరీలను దింపేసి, వెంటనే రమ్మని అనడంతో – సుల్తాన్ భాయ్ వెళ్ళిపోతాడు. అందుకని మేరీని, ఇండియాని ఇంటికి రమ్మని తీసుకువెళ్ళి, వాళ్ళకి టవల్స్ ఇచ్చి తుడుచుకోమని చెప్పి, తన తల్లి చీరలని, రవికలని ఇచ్చి మార్చుకోమంటాడు. ఇదంతా చూస్తున్న సీత రోషంతో లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటికి సుల్తాన్ భాయ్ రావడంతో మేరీ, ఇండియాలు వెళ్ళిపోతారు. కాశీ వెళ్ళిన నరసింహశాస్త్రి గారి బృందం క్షేమంగా తిరిగొస్తుంది. ఆండ్రియా, మేరీ వచ్చి శాస్త్రి గారిని కలిసి, తమ లండన్ ప్రయాణం గురించి చెప్పి, అద్వైత్‍ని తమతో పంపించే విషయం మరోసారి గుర్తు చేసి వెళ్తారు. శాస్త్రి గారు అద్వైత్‍ని పిలిచి మేరీతో లండన్ వెళ్ళమని చెప్తాడు. తాను వాళ్ళకి మాటిచ్చానని చెప్తారు. తప్పకు వెళ్తానని అంటాడు అద్వైత్. కాసేపయ్యాకా, రెడ్డి రామిరెడ్డి గారు వస్తారు. తాను కేసు గెలిచాననీ, ముందు అనుకున్న విధంగా బంగారు లక్ష్మీ మాత విగ్రహం చేయిస్తున్నాని చెప్తారు. అద్వైత్‍ని లండన్ పంపుతున్నట్లు శాస్త్రి గారు చెబితే, మంచి అవకాశం పంపండి అంటారాయన. – ఇక చదవండి.]

అధ్యాయం 34:

కాశీ నుంచి వచ్చినప్పటి నుంచి నరసింహశాస్త్రిగారి పెద్ద సోదరి వసుంధర ఆరోగ్యం సరిగా లేనందున.. వారి మేనమాను సీనియర్ లాయర్ గోపాల్ శర్మ గారి యింట్లో వుంటూ వుంది.. వారి ఇంటి ప్రక్కనే మంచి ఆయుర్వేద డాక్టర్ విశ్వనాథ్ గారు వున్న కారణంగా.

ఆమె విశాఖపట్నం వెళ్ళితే ఆరోగ్యం చక్కబడుతుందని అక్కడికి వెళ్ళి కొంతకాలం తన సొంత ఇంట్లో వుండాలని నిర్ణయించుకొంది. తమ్ముడు నరసింహశాస్త్రితో ఆ విషయాన్ని చెప్పింది.

ఆ రోజు మంగళవారం. వచ్చే సోమవారం నాడు అద్వైత్, ఇండియా.. ఆండ్రియా.. మేరీలతో లండన్ వెళ్ళవలసి వున్నందున స్కూలు వుద్యోగానికి ఆరు మాసాలు లీవు పెట్టాడు. తన బాధ్యతలను అంటే.. పిల్లల సంవత్సరీక పరీక్ష పేపర్లు కరక్టు చేస్తూ తీరిక లేనందున వసుంధరతో నరసింహశాస్త్రి.. సావిత్రి విశాఖపట్టణానికి వెళ్ళాలని.. మూడు రోజులు వుండి శనివారం తిరిగి రావాలని నిర్ణయించుకొన్నారు. అదే రీతిగా వారు వసుంధరతో కలసి ఆ మరుదినం వుదయం విశాఖకు వెళ్ళిపోయారు.

రాబర్ట్ కలకత్తా నుండి తిరిగి వచ్చాడు. వారి పై అధికారులు రాబర్ట్‌కు తమ ప్రభుత్వం పట్ల వున్న విశ్వాసానికి.. వారికి నచ్చే రీతిలో అతను నిర్దయగా తన ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుతున్నందుకు మెచ్చి కల్నల్ ప్రమోషన్ యిచ్చారు. పదవీ ఉన్నతితో రాబర్ట్‌కు ఎంతో ఆనందం, గర్వం కలిగాయి.

మిస్టర్ మూన్ తన చార్జిని రాబర్ట్‌కు హ్యాండోవర్ చేశాడు. అతనూ.. ఇండియా బృందంతో కలసి స్వదేశానికి వెళ్ళేదానికి సిద్ధం అయినాడు.

రాబర్ట్.. తన వారికందరికీ ఆ రోజు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీని ఏర్పాటు చేశాడు. మేరీతో మాట్లాడాటానికి వెళ్ళిన అద్వైత్‌ను చూచాడు. విషయం విన్న అద్వైత్..

“కంగ్రాచ్యులేషన్స్ సార్!..” వినయంగా చెప్పి చేతిని ముందుకు సాచాడు.

రాబర్ట్ తన చేతిని అతని చేతితో కలపలేదు. తన చేతిని విదిలించి “ఏ మ్యాన్!.. యీ సాయంత్రం నేను అందరికీ పార్టీ యిస్తున్నా. నీవు రా!..” సగర్వంగా నవ్వుతూ చెప్పాడు.

“మీ వారినందరినీ చూచేదానికి తప్పకుండా వస్తాను సార్!..”

“మరి.. నా కోసం రావా!..”

“ఆ పార్టీకి మీరే కదా హీరో సార్… మీ మూలంగానే కదా నేను మీ వారినందరినీ చూడబోతున్నాను. అందుకని అలా అన్నాను..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“హౌ యీజ్ యువర్ ఓల్డ్ ఫాదర్…”

“హి యీజ్ ఫైన్ సార్!..”

“యు ఆర్ వెరీ లక్కీ!.. సూన్ విజిటింగ్ లండన్..”

“బికాజ్ ఆఫ్ యవర్ మదర్‍-ఇన్‍లా.. ఒకే సార్.. ఐ విల్ టేక్ లీవ్.. బై..” అద్వైత్ రాబర్ట్ గృహప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించాడు.

అతని.. సుల్తాన్ కుమారుడు అంజాద్ ఎదురైనాడు. అతనిని చూడనట్లుగా ముందుకు పోబోయాడు అద్వైత్. అంజాద్ అతన్ని సమీపించి చేయి పట్టుకొని ఆపాడు.

“ఆగురా భాయ్.. ఆగు!.. ఎలా వున్నావ్?..”

కొన్ని క్షణాలు అంజాద్ ముఖంలోకి చూచి.. చిరునవ్వుతో “బాగున్నాను..” అన్నాడు అద్వైత్.

“మరి వాడు.. వాడు.. నీ బామ్మరది..”

“రాఘవ..”

“ఆ.. వాడెలాగుండాడు?..”

“అల్లా దయ వల్ల.. బాగున్నాడు.. పని వుంది వెళ్ళాలి..” ముందు కదిలాడు అద్వైత్.

“నీవు మంచోడివి.. కానీ వాడు పొగరుబోతు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వుండమని నేను చెప్పినట్టుగా వాడికి చెప్పు.”

“చెబుతాను..” ఆగకుండా ముందుకు ఒక అడుగు వేసి..

“చూడు అంజాద్ భాయ్!.. మీ నాన్న.. సుల్తాన్ భాయ్.. చాలా మంచివాడు. ఆ మాటను నీవూ మరువకు.” చెప్పి వేగంగా ముందుకు నడిచాడు అద్వైత్.

ఠీవిగా ముందుకు వెళుతున్న అద్వైత్‌ను కొన్నిక్షణాలు చూచి అంజాద్ రాబర్ట్ ఇంటి వైపుకు నడిచాడు. ‘వీడూ తక్కువైనవాడు కాదు..’ అనుకొన్నాడు.

అద్వైత్ ఇంటికి వెళ్ళి.. మిగిలి వున్న పరీక్ష పేపర్లను కరెక్ట్ చేయడం ప్రారంభించాడు.

సీత దగ్గరకు వచ్చింది.

“బావా!.. నేను సాయం చేయనా!..” చిరునవ్వుతో అడిగింది.

“నీవు నన్ను మాట్లాడించకుండా వుంటే.. చాలా సాయం చేసిన దానివౌతావు.” సీతను చూడకుండానే జవాబు చెప్పాడు.

“నేనూ టీచరేనేగా!..” కొంటెగా అద్వైత్ ముఖంలోకి చూస్తూ అంది సీత.

“నన్ను ప్రశాంతంగా నా పనిని చేసుకోనిస్తావా!.. లేక..” సీత ముఖంలోకి విసుగ్గా చూచాడు అద్వైత్.

“నేను నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి…” మెల్లగా ఆకాశాన్ని చూస్తూ అంది సీత.

“ఇప్పుడు కాదు సాయంత్రం, లోనికి వెళ్ళు..”

సీత క్షణంసేపు అతని ముఖంలోకి చూచి రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అద్వైత్ తన పనిలో నిమగ్నుడైనాడు.

సీత.. తన గదిలో వున్న తాను గీచిన అద్వైత్ పెయింటింగును చేతికి తీసికొంది.

“ఏయ్ బావా!.. నన్ను గురించి నీవు ఏమనుకొంటున్నావ్!.. నీ మీద నాకు సర్వహక్కులూ వున్నాయి. అలాగే నీకు నా మీద కూడా!.. యీ విషయం నీ బుర్రకు తోచదా!.. నేను ప్రేమగా నీకు సాయం చేయాలని వస్తే కసురుతావా!.. విసుక్కుంటావా!.. తేల్చేస్తాను, యీ రోజు సాయంత్రం.. నన్ను కాదని నీవు మరో ఆడపిల్లను చూడకూడదు. తెలిసిందా!..” బొమ్మను చూస్తూ బెదిరించినట్లు అడిగింది సీత.

ఆమె మనస్సులో.. అద్వైత్ లండన్ ప్రయాణం గుర్తుకు వచ్చింది. ఇండియా ఆమె కనుల ముందు వెలసింది.

‘ఆ తెల్లకోతితో బావ లండన్ వెళుతున్నాడు. అక్కడ అది.. బావను మాయజేసి తన బుట్టలో వేసికొంటే.. నేను ఏమైపోవాలి!.. బావ నా వాడు.. నేను తన దాన్ని.. యీ రాత్రికి బావకు నేను శాశ్వితంగా గుర్తుండేలా మాట్లాడాలి.. తన పట్ల నాకున్న నిర్ణయాన్ని తెలియజేయాలి. మంచి అవకాశం.. అత్తయ్యా మామగారూ కూడా ఊర్లో లేరు. సుమతిని వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపేయాలి. అప్పుడే నేను బావనే ఇంట్లో వుంటాం. హాయిగా.. బావతో నిర్భయంగా అన్ని విషయాలూ మాట్లాడవచ్చు.. ముందు సుమతిని వారి ఇంటికి సాగనంపాలి. సుమతి మంచిది. నా మాటలను వింటుంది’ అనుకొని.. నవ్వుతూ అద్వైత్ ఫొటోను యథాస్థానంలో వుంచి.. వంట యింట్లోకి ప్రవేశించింది.

ఆమెను చూచిన సుమతి.. “సీతా!.. అన్నయ్య ఏం చేస్తున్నాడు?..” అని అడిగింది.

“పిల్లల పేపర్లను దిద్దుతున్నాడు..”

“నీవు సాయం చేయవచ్చుగా!..”

“సాయం చేస్తానని చెప్పాను..”

“ఏమన్నాడు!..”

“వద్దు అన్నాడు.. మహా మొండి..” క్షణమాగి.. “సుమతీ నీవు నాకో సాయం చేయాలి”

“చెప్పు సీతా!..”

“చేస్తావా!..”

“తప్పకుండా!.. ఏం చేయాలి?..”

“నీవు ఈ రాత్రికి పాండురంగతో కలసి మీ యింటికి వెళ్ళాలి..” సుమతి.. ఆశ్చర్యంతో సీత ముఖంలోకి చూచింది.

సీత నవ్వుతూ.. “సుమతీ!.. నేను బావను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆ విషయం యీ యింట్లో వున్న వారికందరికీ తెలుసు. పై సోమవారం బావ లండన్ వెళ్ళి పోతున్నాడుగా!.. తిరిగి ఎప్పుడు వస్తాడో ఏమో!.. నీవు పాండురంగా మీ అమ్మగారి యింటికి వెళ్ళితే.. నేను బావతో ఫ్రీగా మాట్లాడాలనుకొంటున్నాను. నా మనోభావన నీకు అర్థం అయింది కదూ!..” జాలిగా సుమతి కళ్ళల్లోకి చూచింది సీత.

ఆమె మాటల సారాంశాన్ని గ్రహించిన సుమతి.. సీతకు సాయం చేయాలనుకొంది.

“నీవు కోరినట్లుగానే నేను ఆయన మా అమ్మగారి యింటికి వెళ్ళిపోతాం. రేపు మధ్యాహ్నం వస్తాం.. యీ లోపు నీకు.. నీ బావకు కావలసిననంత ఏకాంతం.. ఇదేగా నీవు కోరేది!..” నవ్వుతూ అడిగింది సుమతి. “అవును.. అదే నాకు కావలసింది..” అంది సీత.

పాండురంగ ఓ పెండ్లి చేయించి ఇంటికి వచ్చాడు. వరండాలో వున్న అద్వైత్‌ను పలకరించి లోనికి వెళ్ళాడు. సుమతి అతన్ని సమీపించింది. సీత తన గదిలోనికి వెళ్ళిపోయింది.

సుమతి.. సీత.. తన్ను కోరిన కోర్కెను పాండురంగకు మెల్లగా వినిపించింది.

ఆద్వైత్ సీతల పెండ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న పాండురంగ.. వారికి ఏకాంతాన్ని కల్పించాలని నిర్ణయించుకొన్నాడు. సుమతి చెప్పిన మాటలకు ‘సరే’ అన్నాడు.

పాండురంగ అద్వైత్‌ను భోజనానికి పిలిచాడు. నలుగురూ భోజనం చేయడం ప్రారంభించాడు. “బావా!.. నీతో ఓ మాట చెప్పాలి..” అన్నాడు పాండురంగ.

“చెప్పరా!..”

“భోంచేసి.. నేను సుమతీ వాళ్ళ ఇంటిదాకా వెళ్ళొస్తాము. మామయ్య ఏదో మాట్లాడాలని రమ్మన్నారు” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు పాండురంగ.

“ఇంతేనా!.. నేను ఏదో అనుకొన్నాను. వెళ్ళండి.. త్వరగా రండి..”

“సరే బావా!..”

సుమతి సీత ముఖంలోకి చూచింది. సీత ముఖంలో పున్నమి వెన్నెల విరిసింది.

భోజనాలు ముగిసాయి. సీత సుమతికి సాయంగా అన్నింటినీ సర్దింది.

అరగంటలో సుమతీ పాండురంగలు తయారై బయలుదేరారు.

అద్వైత్.. వరండాలో కూర్చొని పేపర్లను దిద్దుతున్నాడు.

సుమతీ.. పాండురంగలు వరండాలోకి వచ్చారు.

“బావా!.. వెళ్ళొస్తాం..” అన్నాడు పాండురంగ.

“మంచిది. జాగ్రత్తగా వెళ్లి రండి..”

“అన్నయ్యా!..”

“ఆ.. ఆ.. మంచిదమ్మా!..” సుమతి పూర్తి చేయక మునుపే చెప్పాడు అద్వైత్.

సీత వారి వెనకాలే వీధి గేటు వరకూ నడిచింది.

వారిరువురూ.. వీధిలో ప్రవేశించారు.

సీత గేటు మధ్యన నిలబడి వుంది నవ్వుతూ సుమతి వెనక్కు వచ్చి..

“సీతా!.. మంచి అవకాశం.. సద్వినియోగం చేసికో… మా అన్నయ్య చాలా మంచివాడు. బెదిరించకేం.. గుడ్ లక్..” నవ్వుతూ చెప్పి సుమతి భర్తను సమీపించింది.

వారిరువురూ ప్రక్క ప్రక్క నడుచుకొంటూ ముందుకు సాగారు.

‘సుమతి.. మంచి మనస్సు కలది. నా బాధను అర్థం చేసికొంది. నేను చెప్పిన మాట ప్రకారం నడుచుకొంది. ఆ యిద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకొంటూ ముందుకు ఆనందంగా వెళుతున్నారు. మరి.. నేను యీ ప్రవరాఖ్యుడిని ఎలా ముగ్గులోకి దించాలి!..’ కొంతసేపు వారిని చూచి వెను తిరిగి వరండాలోకి వచ్చింది సీత.

గొంతు సవరించింది. అద్వైత్ ఆమెను చూడలేదు. తన పనిలో లగ్నమై వున్నాడు. కొన్నిక్షణాలు పరీక్షగా అద్వైత్‌ను చూచింది. తర్వాత..

“బావా!.. కాఫీ కలిపి యివ్వనా!..”

అద్వైత్ తల ఎత్తి చూచాడు.. “ఏమిటీ!..” అడిగాడు.

“కాఫీ!..” దీర్ఘం తీసింది సీత.

“ఆఁ..”

“తెచ్చేదా బావా!..”

“తిండి తిని గంట కాలేదు. ఇప్పుడేం కాఫీ.!.. నీవు ఓ పని చెయ్యి!..”

“ఏమిటి బావా!..”

“వెళ్ళి మంచంపై పడుకొని హాయిగా నిద్రపో!..”

“నిద్ర రావడం లేదే!..”

“ఆఁ.. నేను వస్తున్నాని నీతో చెప్పి నిద్ర రాదు. పడుకొని కళ్ళు మూసుకొంటే.. తనకు తానుగా వస్తుంది. చెప్పిన మాట విను..”

“ఏ మాట బావా!..”

“చెప్పానుగా నిద్ర పొమ్మని..”

“నేను నీతో మాట్లాడాలి అన్నానుగా!.. ఇప్పుడు..”

“చెప్పానుగా.. సాయంత్రం అని.. అంతవరకూ మాట్లాడకుండా నీ గదికి వెళ్ళి పడుకో..”

సీతకు అద్వైత్ మాటలు.. చిరాకును కలిగించాయి. తన మాటలను అతను లెక్క చేయనందుకు అద్వైత్ పై ఆమెకు కినుక కలిగింది. వేగంగా వెళ్ళి తన గదిలో మంచంపై వాలిపోయింది.

‘సుమతి.. నేను కోరిన విధంగా అవకాశాన్ని కల్పించింది. కానీ యీ మూర్ఖుడు నా మొర ఆలకించడం లేదే!.. నా వైపు చూడటం కూడా లేదే!.. అసలు నా మీద తనకు ప్రేమ అంటూ వుందా!.. లేదా!.. నా గురించి బావ మనస్సులో వున్న అభిప్రాయం ఏమిటి!..’ ఎంతగా ఆలోచించినా సీతకు జవాబు దొరకలేదు. అదే కలవరంతో కళ్ళు మూసుకుంది.. నిద్రపోయింది.

***

సమయం.. సాయంత్రం ఆరున్నర.. అద్వైత్ పనిని పూర్తి చేశాడు. అన్ని పేపర్లను కట్టకట్టి తన గదిలో టేబుల్ పై వుంచాడు. హాల్లోకి వచ్చి నాలుగు వైపులా చూచాడు. నిశ్శబ్దం.. ఇంట్లో ఎవరూ లేని కారణంగా!..

సీత గుర్తుకు వచ్చింది. మెల్లగా ఆమె గది తలుపును త్రోశాడు. గడియ బిగించనందున తెరుచుకొంది. గదిలో ప్రవేశించాడు. సీతను చూచాడు. ఆమె నిద్రపోతూ ఉంది.

ఆమె ఎదపై.. తన ఫోటో వుంది. దానిపై ఆమె చేతులు వున్నాయి. ఆ దృశ్యాన్ని చూచి అద్వైత్ ఆశ్చర్యపోయాడు. ‘సీత ఆ చర్యకు అర్ధం ఏమిటి!.. తాను, నన్ను ప్రేమిస్తూ వుందా..’ సీతను గురించి ఆలోచించసాగాడు అద్వైత్.. కొన్ని నిముషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి.

ఆ సాయంత్రం జరుగనున్న రాబర్ట్ పార్టీ అతనికి గుర్తుకు వచ్చింది. రాబర్ట్ తనను రమ్మని ఆహ్వానించాడు. తనూ వస్తానన్నాడు.. తాను తయారై వెళ్ళాలి..

అద్వైత్ గది నుండి బయటికి వచ్చి.. స్నానాల గదికి వెళ్ళి స్నానం చేసి తన గదికి వచ్చి డ్రస్ చేసికొన్నాడు. సీత గదిని సమీపించాడు. లోనికి నడిచి చూచాడు. సీత నిద్రపోతూ వుంది. ఆమె పెదవులు కదిలాయి.

‘బావా.. నీవంటే నాకు ప్రాణం.. నీవు నావాడివి.. నీవు నన్ను కాదంటే.. నేను చచ్చిపోతాను’ కళ్ళు మూసుకుని కదలిక లేని సీత నోటి వెంట వెలువడిన ఆ మాటలను విని అద్వైత్ ఆశ్చర్యపోయాడు.

‘నిద్రలో కూడా నన్నే కలవరిస్తూ వుంది సీత. అంటే తాను నన్ను ప్రేమిస్తూ వుంది. పెండ్లి చేసికోవాలనుకొంటూ వుంది. అందుకే.. ‘నీవు నా వాడివి’ అంది.’

‘మరి నేను..’ అతని చూపులు చేతి వాచీపై పడ్డాయి. టైమ్ ఏడయింది. నేను పార్టీకి వస్తానని చెప్పిన కారణంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే మాట తప్పిన వాడిని అవుతాను. సీతను లేపి.. నేను బయలుదేరాలి అనుకొన్నాడు అద్వైత్.

“సీతా!..” పిలిచాడు.

సీత కదల్లేదు.

వంగి ఆమె చవి దగ్గర.. “సీతా!..” మరోసారి కాస్త బిగ్గరగా పిలిచాడు. సీత.. త్రోటుపాటుతో కళ్ళు తెరచింది. అద్వైత్‌ను చూచింది. వేగంగా మంచం దిగింది.

“సారీ బావా!.. మొద్దు నిద్ర పోయాను..” పశ్చాత్తాపంతో అంది సీత.

“సీతా!.. ఎందుకు కంగారు పడతావ్!.. ఇప్పుడేమయిందని!.. నేను బయటికి వెళ్ళి వస్తాను. నీతో చెప్పాలని లేపాను. నేను వెళ్ళి వస్తాను. కాసేపట్లో సుమతి.. పాండురంగా వస్తారుగా!..”

“ఏమో!.. నాకు తెలీదు”

“సరే.. ముఖం కడుక్కొని ప్లాస్క్ కాఫీ పోసి వుంచాను. తాగు వరండాలో కూర్చో ఏదైనా పుస్తకాన్ని తీసికొని చదువు. వాళ్ళిద్దరూ యీ పాటికి బయలుదేరి వుంటారు. నేను గంటలో వస్తాను. సరేనా!..”

సీత అమాయకంగా తల ఆడించింది.

“నేను నీతో మాట్లాడాలన్నానుగా!..”

“వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం సీత!..”

అద్వైత్ వరండా వైపుకు నడిచాడు. సీత అతన్ని అనుసరించింది.

మెట్లు దిగి వెనక్కు చూచాడు అద్వైత్. సీత వరండా చివరన నిలబడి అతన్నే చూస్తూ వుంది. “బావా!.. త్వరగా రావాలి..”

“వస్తాను..” చెప్పి అద్వైత్ వేగంగా ముందుకు నడిచాడు. వీధి గేటు తెరచుకొని ముందుకు వెళ్ళిపోయాడు. సీత.. అతను వెనక్కు తిరిగి తన్ను చూస్తాడని ఆశించింది. అది జరగలేదు. ‘యీ బావ మనస్తత్వం ఏమిటో.. నన్ను గురించి ఏమనుకొంటున్నాడో..’ నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

అద్వైత్.. రాబర్ట్ పార్టీని ఏర్పాటు చేసిన చోటికి వెళ్ళాడు. దాదాపు ముఫై మంది తెల్లవాళ్ళు.. పదిమంది ఆంధ్రులు పార్టీకి వచ్చి వున్నారు.

ఆ భవంతి ముందు వరండాలో.. సుల్తాన్ నిలబడి వున్నాడు. అద్వైత్‌ను చూచాడు.

“బాబూ!.. మీరు ఇక్కడికి..”

“రాబర్ట్ గారు రమ్మన్నారు. వచ్చాను. ఆండ్రియా మేడం.. వారి తల్లిగారూ వచ్చారా!..” సుల్తాన్ పూర్తి చేయక మునుపే చెప్పి.. వారిని గురించి అడిగాడు.

“లోపల.. ఆడవాళ్ళు లేరు బాబు. అంతా మగవారే!..”

అద్వైత్.. తల ఆడించి మెల్లగా లోన ప్రవేశించారు.

అతన్ని చూచింది ముందుగా మిస్టర్ మూన్ నవ్వుతూ అద్వైత్‌ను సమీపించాడు.

“గుడ్ యీవినింగ్ సార్…” చెప్పాడు అద్వైత్.

“యస్.. గుడ్ యీవినింగ్ జంటిల్మన్.. ఆండ్రియా.. ఇండియా నీ గురించి నాతో ఎంతో గొప్పగా చెప్పారు. నీవూ వారితో లండన్ వెళుతున్నావట కదూ!..” ఆంగ్లంలో అడిగాడు.

“యస్ సార్… నాన్నగారు వెళ్ళి రమ్మన్నారు.”

“యువర్ ఫాదర్ యీజ్.. వెరీ గ్రేట్ మ్యాన్. ఐ లైక్ హిం వెరీ మచ్.. నేను నా పదవి రాజీనామా చేశాను. చార్జి రాబర్ట్ తీసికొన్నాడు.

నేనూ లండన్ వెళ్ళిపోతున్నాను. అయాం నాట్ హ్యాపీ అబౌట్ మై.. ఇండియా సర్వీస్. దట్స్ పై గోయింగ్ బ్యాక్..” నవ్వాడు మూన్.

రాబర్ట్.. వారిరువురినీ చూచాడు. మాట్లాడుతున్న వారికి ఎక్స్‌క్స్క్యూజ్ చెప్పి వారిరువురినీ సమీపించాడు. దగ్గరకు వచ్చిన రాబర్ట్ అద్వైత్ చేయి జాచి..

“కంగ్రాచ్యులేషన్స్ సార్…”

తాగిన మూడ్‍లో ఆనందంగా వున్న రాబర్ట్ తన చేతిని అద్వైత్ చేతితో కలిపి..

“ధ్యాంక్యూ!.. వాట్ డు యు లైక్ టు హ్యావ్!..”

“నో హాట్ డ్రింక్స్.. జస్ట్ ఎనీ కూల్ డ్రింక్ ప్లీజ్..” నవ్వుతూ చెప్పాడు అద్వైత్.

“వాట్.. కూల్ డ్రింక్..” ఆశ్చర్యంతో అడిగాడు రాబర్ట్.

“యస్ సార్.. ఓన్లీ కూల్ డ్రింక్ ప్లీజ్..”

రాబర్ట్ నవ్వాడు..

“ప్రొవైడ్ వాట్ హి వాంట్స్ రాబర్ట్..” అన్నాడు మూన్.

వారిరువురినీ క్షణంసేపు చిత్రంగా చూచి.. “ఓకే.. బేరర్…” అంటూ ప్రక్కకు నడిచాడు.

ఐదు నిముషాలలో బేరర్ అద్వైత్‌ను సమీపించి గ్లాసును అందించాడు.

“ఏమిటిది..” అడిగాడు అద్వైత్ .

“కూల్ డ్రింక్ సార్!..”

“ప్లీజ్ హ్యావిట్ మిస్టర్ అద్వైత్..” అన్నాడు మూన్. తన గ్లాసును అతని గ్లాసుకు తాకించి ఛియర్స్ చెప్పాడు. అద్వైత్ గ్లాస్ లోని సగం ద్రవాన్ని గొంతులో పోసుకున్నాడు. కొంచెం ఘాటుగా అనిపించింది. ఎంతో చల్లగా గొంతుకు హాయిగా వుంది.

రాబర్ట్.. అద్వైత్‌ను సమీపించాడు.

“హౌ యీజ్ యిట్…”

“యిటీజ్ నైస్..” మిగతా అరగ్లాసు ద్రవాన్ని తాగేశాడు అద్వైత్ రాబర్ట్ బేరర్ వైపు చూచాడు.

అతను మరో గ్లాసుతో వచ్చి, అద్వైత్ చేతిలోని ఖాళీ గ్లాసును తన చేతిలోకి తీసుకుని, తన చేతిలోని గ్లాసును అద్వైత్‍కు అందించాడు. ప్రక్కకు వెళ్ళిపోయాడు బేరర్.

“హ్యావ్ ఇట్..” చెప్పాడు మూన్.

అద్వైత్ రెండో గ్లాసును సిప్ చేశాడు. రుచిలో కొంత తేడా!.. క్రింద పెడితే అందరూ తన్నే చిత్రంగా చూస్తారు. రాబర్ట్ పరిహసిస్తాడు. హేళన చేస్తాడు. అందరిలో తనకు అవమానం అవుతుంది. ఇలాంటి పార్టీలకు రావడమే తప్పు. వచ్చిన తర్వాత సభ్యతను పాటించక తప్పదు. అవమానం పాలు కావడం అద్వైత్ గిట్టని విషయం. స్నేహితులతో కాలేజీ రోజుల్లో పిక్నిక్స్‌కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు సురాపానాన్ని కొంతకాలం క్రిందట సేవించిన అనుభవం వుంది.

‘రాబర్ట్ మనస్సులో తనను అవమాన పరచాలనే భావన వుండి వుండవచ్చు. వాడికి నాకు వున్న పరిచయంలో ప్రీతిగా మాట్లాడింది యిదే మొదటిసారి. వాడు నాకు పరీక్ష పెట్టాలని అనుకొని వుండవచ్చు. త్రాగకపోతే.. అవమానం.. త్రాగి రాబర్ట్‌కు ఎదురుగా నిలబడితే వాడికి షాక్.. యివ్వాలి, వాడికి షాక్ యిచ్చి తీరాలి..’ అనుకొని ఒక్క వూపులో చేతిలోని గ్లాసులోని ద్రవాన్ని ఖాళీ చేసి.. బేరర్‌ను చూచి..

“బాయ్!.. గెట్ మీ వన్!..” అన్నాడు అద్వైత్.

‘కొంచం తడిస్తే చలి.. పూర్తిగా మునిగితే.. చలీ లేదు గిలీ లేదు’ అనుకొన్నాడు అద్వైత్ బాయ్ అందించిన స్నాక్స్ తింటూ.

ఆ క్షణంలో అతని నిర్ణయం.. తాను త్రాగి రాబర్ట్‌కు సమానంగా నిలబడి వాడు అడిగే మాటలకు జవాబు చెప్పి.. వాడు పెట్టిన యీ పరీక్షలో గెలవాలనేది.

బేరర్ మరో గ్లాస్ను అందించాడు. నవ్వుతూ అద్వైత్ దాన్ని అందుకొన్నాడు.

రాబర్ట్ ముఖంలో ఆశ్చర్యం.

గ్లాస్ లోని ద్రవాన్ని సగం త్రాగి.. నవ్వుతూ

“రాబర్ట్ సార్!.. యువర్ ఇంటెన్షన్ ఐ నో.. మై ఇంటెన్ఘన్ యు డోంట్ నో!.. వాటీజ్ దట్ యు నో!.. హు ఎవర్ కమ్ అక్రాస్ అవర్ లైఫ్ పాత్.. వుయ్ మస్ట్ ఆనర్ దెమ్. హెల్ప్ దెమ్.. దటీజ్ హెవన్లీ క్వాలిటీ.. హ్యాయు రెడ్ షేక్పియర్ ‘క్వాలిటీ ఆప్ మర్సీ!..’ వా.. వాటే నెరేషన్!!!..” అందంగా నవ్వాడు అద్వైత్.

అతని పై మాటలను విన్న వారంతా అతన్ని ఆశ్చర్యంగా చూచారు. “జంటిల్‌మెన్!.. హి.. మిస్టర్ రాబర్ట్, యీజ్ వెరీ క్లవర్ మ్యాన్.. హి యీజ్ మై స్టూడెంట్ యిన్ టెలుగు లెర్నింగ్. ఇఫ్ హి విష్ గుడ్.. హి కెన్ డూ గుడ్.. దటీజ్ హీరోయిజమ్.. ఇఫ్ హి విష్ బ్యాడ్ హి కెన్ డూ బ్యాడ్.. దట్ యీజ్ డెవిలిజమ్. హి యీజ్ హ్యావింగ్ పవర్. పవర్ కెన్ డూ ఎనీథింగ్.. బట్.. దేరీజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. వుయరాల్ హ్యుమన్స్. వుయ్ షుడ్ థింక్ అబౌట్ గుడ్.. అండ్ డు గుడ్ టు అవర్ ఫెలోమెన్. మిస్టర్ రాబర్ట్!.. ఫర్‌గెట్ అబౌట్ ఫాస్ట్.. విత్ ద న్యూ పవర్ ప్లీజ్ డు గుడ్ టు ఆల్, దెన్ యువర్ నేమ్ విల్ బీ ఇన్ ద హిస్టరీ.. జస్ట్ సమ్ హౌ లివింగ్ యీజ్ నాట్ కాల్డ్ హిస్టరీ. విత్ స్పెసిఫిక్ మొటివేషన్ ఇంప్లిమెంటేషన్ విల్ ప్రొవైడ్ గుడ్ హిస్టరీ. ఐ హోప్… వు విల్ డు సో యిన్ ఫ్యూచర్..” చెప్పడం ఆపి అందరి వైపూ గర్వంగా చూచాడు అద్వైత్.

అద్వైత్ ఇంగ్లీష్ ధోరణికి కూడిన తెల్లవారు.. నల్లవారూ ఆశ్చర్యపోయారు. అందరూ కరతాళధ్వనులనుచేశారు.

మూన్ అద్వైత్‌ను సమీపించి నవ్వుతూ.. “అద్వైత్!.. వెల్ సెడ్ మై డియర్.. వెల్ సెడ్..” అద్వైత్ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు.

రోషంతో ఆ యిరువురినీ మార్చి మార్చి చూచాడు రాబర్ట్.

“మిస్టర్ రాబర్ట్ సార్!.. యు హ్యావ్ కాల్డ్ మి టు ద పార్టీ. ఐ హ్యావ్ కమ్. యు ఆఫర్డ్ మి ది డ్రింక్. ఐ హ్యాడ్. వాట్ ఆల్ ఐ సెడ్.. ఆర్ ఫర్ యువర్ బెటర్మెంట్. నాట్ క్రిటిసిజం..” అందరినీ కలయజూచి.. “ఓకే సార్!.. ఫర్ ఆల్ గుడ్ నైట్..” హాలు నుంచి బయటికి వచ్చాడు అద్వైత్.

సుల్తాన్.. అద్వైత్‌ను చూచాడు. విషయాన్ని గ్రహించాడు. దగ్గరకు వచ్చాడు.

“బాబూ!.. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను రండి” అద్వైత్ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. కార్లో కూర్చోపెట్టి.. కారును స్టార్ట్ చేశాడు.

“బాబుగారూ!..” పిలిచాడు సుల్తాన్.

“చెప్పండి సుల్తాన్ భాయ్!..”

“మీరు..” అద్వైత్ ముఖంలోకి చూచాడు సుల్తాన్.

“త్రాగాను.. రాబర్ట్ నన్ను త్రాగించి ఫూల్‍ను చేయాలనుకొన్నాడు. ఆనందించాలనుకొన్నాడు. నేను.. తాగి వాణ్ణి ఫూల‌ను చేశాను. మనస్సుకు ఎంతో ఆనందంగా వుంది” నవ్వాడు అద్వైత్.

“అమ్మా నాన్నా మిమ్మల్ని యీ స్థితిలో చూస్తే!..”

“వారు ఊర్లో లేరుగా.. విశాఖపట్నం వెళ్ళారుగా!..” అమాయకంగా నవ్వాడు అద్వైత్.

ఒకసారి అద్వైత్ ముఖంలోకి చూచి, నిట్టూర్చి సుల్తాన్ రోడ్డును చూస్తూ కారును నడపసాగాడు.

“ఇంట్లో ఎవరూ లేరా బాబూ!..”

“లేరు.. ఆ.. నో.. నో.. సీత.. సీత వుంది. పాండురంగ సమతీ కూడా.. ఇంటికి వచ్చుంటారు..”

“వారు మిమ్మల్ని చూచి..”

“వాళ్ళను చూడ్డంతోనే.. నేనే చెప్పేస్తాన్ సుల్తాన్ భాయ్.. తాగానని.. ఎవరితోనూ.. ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు.”

అద్వైత్‌కు సీత గుర్తుకు వచ్చింది.. “పాపం.. సీత!..” అన్నాడు.

“బాబూ సీతమ్మగారికి..”

“ఏం కాలేదు సుల్తాన్ భాయ్!.. ఉదయాన్నించి.. నాతో ఏదో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించింది. స్కూలు పిల్లల పరీక్ష పేపర్లను దిద్దుతూ.. నేను సీతకు అవకాశం యివ్వలేదు. సుల్తాన్ భాయ్!.. ఆ పిచ్చిదానికి నేనంటే.. నే..నం..టే..”

“చాలా యిష్టం బాబూ!.. ఆ విషయం నాకు తెలుసు..”

“భాయ్!..”

“చెప్పండి బాబూ!..”

“ఇండియా వాళ్ళ మదర్.. పార్టీకి.. ఎందుకు రాలేదు!..”

“రాబర్ట్ రావడం వారికి ఇష్టంలేక సాయంత్రం.. ఆశ్రమానికి వెళ్ళిపోయారు”

“ఓ.. అలాగా!..” మందు మైకం.. అద్వైత్‌కు ఎక్కింది. కళ్ళు మూతలు పడ్డాయి. సీట్లో ఒరిగిపోయాడు.

కారును నరసింహశాస్త్రిగారి ఇంటి ముందు ఆపాడు.

అద్వైత్ వైపు చూచాడు. స్పృహ లేకుండా ఒరిగిపోయి వున్నాడు అద్వైత్.

రాక్షసుడు రాబర్ట్.. ‘అలవాటు లేని యీ బాబుకు మందు తాగించాడు వాడి వినోదం కోసం.. ఇప్పటి వీరి స్థితిని చూచి ఇంట్లో వాళ్ళు ఏమనుకొంటారో!..’ అనుకొని సుల్తాన్..

“బాబూ!..” అద్వైత్ భుజంపై మెల్లగా తట్టాడు.

అద్వైత్‍లో చలనం లేదు.

సుల్తాన్ కారు దిగి మెల్లగా సందేహంతో నడిచి వరండాను సమీపించాడు. ఇంటి ముఖద్వారం మూసి వుంది. “పాండురంగ బాబూ!..” పిలిచాడు.

కొన్నిక్షణాలు ఆగాడు. తలుపును ఎవరూ తెరవలేదు. ఇక చేసేది లేక.. తలుపును తట్టాడు.

కొన్ని క్షణాల్లో తలుపు తెరవబడింది. సీత కనబడింది.

“అమ్మా!.. పాండురంగ బాబు ఎక్కడ!..”

“మా బావను చూచావా సుల్తాన్ భాయ్!..” అద్వైత్ గంటలో ఇంటికి తిరిగి వెళ్ళని కారణంగా సీత ఎంతో ఆందోళనగా వుంది.

“బాబు కార్లో వున్నారమ్మా!..”

“దిగి రాలేదేం!…”

“అమ్మా!..”

“చెప్పు సుల్తాన్ భాయ్.. మా బావకేమయింది!…”

“రాబర్ట్…”

“రాబర్ట్!!!..”

“వారి చేత త్రాగించారమ్మా!..” విచారంగా చెప్పాడు సుల్తాన్.

సీత వేగంగా కారు వైపుకు నడిచింది.. సుల్తాన్ ఆమెను అనుసరించాడు.

సీత తలవంచి లోనికి చూచింది. ఆమె ముఖంలో ఎంతో విచారం.. ఆవేదన.

సుల్తాన్ అద్వైత్ కూర్చొని వున్న వైపు తలుపు తెరిచాడు.

అద్వైత్‌ను మెల్లగా కారు నుంచి దించాడు. సీత తన చేతిని అద్వైత్.. నడుము చుట్టూ తిప్పి గట్టిగా పట్టుకొంది. సుల్తాన్ అద్వైత్ చేతిని తన భుజంపై వేసికొన్నాడు. ఆ ఇరువురూ మెల్లగా అద్వైత్‍తో కలసి వరండాలోకి వచ్చారు. మెల్లగా అద్వైత్‌ను నడిపించి అతని గదిలో ప్రవేశించి మంచం పైకి చేర్చారు. పడుకోబెట్టారు.

సీత అద్వైత్ ముఖంలోకి తీక్షణంగా చూచింది.

“అమ్మా!.. బాబుగారిది ఏ తప్పూలేదమ్మా. తప్పంతా ఆ రాబర్ట్ గాడిదే!..” ఆమెలోని ఆవేశాన్ని తగ్గించాలని మెల్లగా చెప్పాడు సుల్తాన్.

“అమ్మా!.. పాండురంగ..”

“సుమతీ.. పాండు.. వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారు సుల్తాన్ భాయ్!.. మీరు మా బావను క్షేమంగా ఇంటికి చేర్చారు. ధన్యవాదాలు.” చేతులను జోడించింది సీత.

“అమ్మా!.. నేనెవరమ్మా.. మీ వాడిని.. నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. నాకు మీరు ధన్యవాదాలు.. చెప్పకూడదమ్మా!.. బాబును జాగ్రత్తగా చూచుకొండి. వెళ్ళొస్తాను” అన్నాడు విచారంగా సుల్తాన్.

“మంచిది సుల్తాన్ భాయ్!..” అంది సీత.

సుల్తాన్ మెల్లగా గది నుండి బయటికి వచ్చి.. కార్లో కూర్చొని.. వెళ్ళిపోయాడు.

సీత కొన్ని క్షణాలు అద్వైత్‌ను పరీక్షగా చూచింది. వెళ్ళి సింహద్వారాన్ని మూసింది. గదిలోకి వచ్చి అద్వైత్ ప్రక్కన మంచంపై కూర్చుంది అతన్నే చూస్తూ.. అతన్ని గురించే ఆలోచించసాగింది సీత.

‘బావతో మాట్లాడాలని వుదయాన్నించి తపించావు. అతను నీకు అవకాశం యివ్వలేదు. బయటికి వెళ్ళిపోయాడు. స్నానం చేశావు. మీ బావకు యిష్టమైన చందనపు రంగు చీర రవికను ధరించావు. సన్నజాజి పరిమళం నీ బావకు ఇష్టమని మొగ్గలను కోసి దండగా కట్టి తలలో తురుముకున్నావు. దాదాపు మూడు గంటలసేపు బావ రాకకు ఎదురు చూచావు. అతన్ని తిట్టావు. నిన్ను నీవు తిట్టుకొన్నావు. నీవు ఊహించని స్థితిలో నీ బావ తిరిగి వచ్చాడు. అతను నీతో ఇప్పట్లో మాట్లాడలేడు. యిలాగే అతన్ని చూస్తూ కూర్చుంటే.. భళ్ళున తెల్లవారి పోతుంది. పాండురంగ సుమతులు వస్తారు. నీ ఆశయం.. నెరవేరదు. నీ బావ నీవాడు కావాలంటే.. నిన్ను తన దాన్నిగా చేసికోవాలంటే!! వెఱ్ఱి ఆలోచనలను వదలు. హాయిగా నీ బావ ప్రక్కన పవళించు..’

ఆలోచించి ఆలోచించి ఆ నిర్ణయానికే వచ్చింది సీత.. వెలుగుతున్న దీపాన్ని ఆర్పి అద్వైత్ పక్కన పడుకొంది.

(ఇంకా ఉంది)

Exit mobile version