Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-2

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అది 1921 సంవత్సరం. రాజమండ్రికి దక్షిణాన ఉన్న గోదావరీ తీరం. కార్తీకమాసం. నరసింహశాస్త్రి అలవాటు ప్రకరాం ఉదయమే వచ్చి నదిలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. ఆయన వెంట కుమారుడు అద్వైత్, మేనల్లుడు పాండురంగశర్మ ఉంటారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారిగా కలకత్తా నుంచి వచ్చిన తెల్లదొర రాబర్డ్ గుర్రం, ఇద్దరు అనుచరులతో అక్కడికి వస్తాడు. ఆ అనుచరులలో ఒకడు తెల్లదొర కాగా మరొకడు ఆంధ్రుడు, ద్విభాషి, పేరు సుల్తాన్. రాబర్ట్ నరసింహశాస్త్రిని చూసి, ఆయన గురించి సుల్తాన్‍ని అడుగుతాడు. గొప్ప వేదపండితుడు, ఆచార సంపన్నుడు అని చెప్తాడు. ఆయన్ని అంతగా మెచ్చుకోవడం రాబర్ట్‌కి నచ్చదు. ఆయన్ని పిలవమంటాడు. సుల్తాన్ వెళ్ళి నరసింహశాస్త్రిని పిలుచుకుని వస్తాడు. నరసింహశాస్త్రి రాబర్ట్‌ని ఇంగ్లీషులో పలకరిస్తారు. నదిలో ఏం చేస్తున్నావని రాబర్ట్ అడుగుతాడు. చెప్పినా నీకర్థం కాదని అంటారు నరసింహశాస్త్రి. విశ్వశాంతి కోసం ప్రార్థిస్తున్నారని సుల్తాన్ ఆంగ్లంలో చెప్తాడు. తనకి తెలుగు నేర్పుతావా అని అడుగుతాడు రాబర్ట్. తనకి సమయం లేదని అంటారు శాస్త్రి. ఆయన నాట్యాచార్యులని, సుమారు 30మంది పిల్లలకు నాట్యం నేర్పుతుంటారనీ, అందుకే తీరిక ఉండదని చెప్తాడు సుల్తాన్. రాబర్ట్‌కి వీడ్కోలు పలికి శాస్త్రిగారు, అద్వైత్, పాండులతో వెళ్ళిపోతారు. శాస్త్రిగారిది పొగరని భావిస్తాడు రాబర్ట్. తన తడాఖా చూపించాలనుకుంటాడు. ఇంటికి వెళ్ళాకా, లోపలికి వెళ్ళబోతూ శాస్త్రిగారిని పిలుచుకురమ్మని సుల్తాన్‍కి చెప్తాడు. శాస్త్రిగారు ఇంటికి వెళ్ళాకా, పూజాదికాలు ముగించి, అల్పాహారం సేవించి, నాట్యశాలలోకి ప్రవేశిస్తారు. ఈలోపు సుల్తాన్ శాస్త్రిగారింటికి చేరుతాడు. అయ్యగారు బయటికి వచ్చేదానికి ఒక గంట పడుతుందని చెప్తుంది శాస్త్రి గారి భార్య సావిత్రి. శాస్త్రిగారిని రాబర్ట్ తీసుకురమ్మన్నాడనీ, వేచి ఉంటానని చెప్తాడు సుల్తాన్. ఇంతలో సావిత్రి బంధువు రాఘవ అక్కడికి వచ్చి ఆమెకి నమస్కరిస్తాడు. ఎప్పుడు వచ్చావంటే నిన్న రాత్రి ఓ పెళ్ళి జరిపించడానికి వచ్చాను అత్తయ్యా, రాత్రి గోపాల్ తాతయ్య గారి ఇంట్లో ఉండిపోయాను అని చెబుతాడు. కాసేపు సుల్తాన్‍తో మాట్లాడుతాడు రాఘవ. కాసేపయ్యాకా, బయటకి వచ్చిన శాస్త్రి సుల్తాన్‍ని చూసి విషయమేమిటని అడిగితే, రాబర్ట్ పిలుచుకు రమ్మన్నారని అంటాడు. ఎందుకట అని శాస్త్రి అడిగితే, కారణం నాకు చెప్పలేదని అంటాడు సుల్తాన్. అప్పుడు అద్వైత్ కలగజేసుకుని, అతనికి తెలుగు నేర్పించే విషయమే అయి ఉంటుందని, చెప్పి తండ్రి అనుమతిస్తే తాను వెళ్ళి అతనికి తెలుగు నేర్పుతానంటాడు. వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడి రమ్మని చెప్తారు శాస్త్రి. అద్వైత్ వెంట తానూ వెళ్తాడు రాఘవ. దారిలో అల్లూరి సీతారామరాజు తెల్లదొరలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం గురించి చెప్తాడు రాఘవ. రాబర్ట్‌ని కలిసి, అతనికి తాను తెలుగు నేర్పుతానని చెప్తాడు అద్వైత్. సరేనంటాడు రాబర్ట్. అద్వైత్ పేరుకి అర్థం తెలుసుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 3:

రైలు వచ్చి రాజమండ్రి స్టేషన్‍లో ఆగింది. రాబర్ట్ సతీమణి ఆండ్రియా, కూతురు ఇండియా రైలు దిగారు. రాబర్ట్, సుల్తాన్ మరి యిరువురు తెల్ల రక్షక భటులు వారిని రిసీవ్ చేసికొన్నారు.

ముగ్గురు ముందు.. వారి వెనకాల సుల్తాన్, మిగిన ఇరువురు స్టేషన్ బయటికి వచ్చారు. సుల్తాన్ కార్ డోర్లను తెరిచాడు. డ్రైవర్ మేడం గారికి గుడ్‍మార్నింగ్ చెప్పాడు. వారు కార్లో కూర్చున్నారు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.

స్టేషన్ ముందు రాఘవ అతని స్నేహితులు నలుగురు రాము, శంకర్, ప్రభాకర్, సలీమ్‍లు నిలబడి శ్రీ సీతారామరాజుగారిని గురించి మాట్లాడుకొంటున్నారు. కారు వారి ముందు నుండి వెళ్ళిపోయింది.

రాఘవ కార్లో వున్న వారిని గమనించాడు. రాబర్ట్ కుటుంబం వచ్చిందనుకొన్నాడు. ఇండియా రూపును తలచుకొన్నాడు. అతని పెదవులపైన చిరునవ్వు.. బొమ్మ చాలా బాగుందనుకొన్నాడు. తాను చూచిన విషయాన్ని అద్వైత్‍కు తెలియజేయాలనుకొన్నాడు. స్నేహితులకు ‘బై’ చెప్పి నరశింహశాస్త్రి గారి యింటి వైపుకు నడిచాడు రాఘవ.

వాకిట్లో వున్న పూల మొక్కలకు నీరు పెడుతున్నాడు అద్వైత్.

“బావా.. శుభోదయం!..” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

“ఏమిట్రా విశేషం వుదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళావ్?.. చాలా ఆనందంగా వున్నావ్?..” అడిగాడు అద్వైత్.

“వారు వచ్చారు..”

“ఎవరు?..”

“నీకు కావలసిన వారు..” పకపకా నవ్వాడు.

“రేయ్!.. ఏంట్రా నీ పిచ్చి నవ్వు. నాకు కావలసిన వారెవరురా!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“రాబర్ట్ కూతురు..” మళ్ళా అదే నవ్వు. క్షణం ఆగి తర్వాత..

“కూతురే కాదు. అమ్మ కూడా వచ్చింది” అన్నాడు రాఘవ.

“వాళ్ళు వస్తే మనకేమిట్రా!.. వాళ్ళేమైనా మనకు బంధువులా!..”

“ఏమో.. కాలగతిలో కావచ్చునేమో!..”

“ఎవరికి నీకా.. నాకా!..”

“నీకే!.. బావా!.. ఏమాటకా మాట చెప్పుకోవాలి.. పిల్ల.. చందమామ.” అన్నాడు.

“ఇక నీ వాగుడు ఆపుతావా!..”

వరండాలో కొచ్చిన సావిత్రి రాఘవ చివరగా అన్న ‘చందమామ’ అనే పదాన్ని వినింది.

“ఎవర్రా చందమామ?..” ఆ యిరువురినీ సమీపించింది.

“అమ్మా!.. వీడు పిచ్చి నాయాలు. నోటి కొచ్చినట్లు అర్థం పర్థం లేకుండా ఏదేదో వాగుతాడు.” విసుగ్గా అన్నాడు అద్వైత్.

“చందమామ అంటే.. అది అందరికీ వర్తించే పదం.. కాదురా!.. మంచి అందానికి ఆ పదం వర్తిస్తుంది.” నవ్వుతూ అంది సావిత్రి.

“అత్తయ్యా!.. యిప్పటిదాకా యీ బావగారితో నేను చెప్పింది ఒక అమ్మాయి అందాన్ని గురించే. బావ.. వట్టి రస శూన్యుడత్తయ్యా!..” నవ్వాడు రాఘవ.

అద్వైత్.. రాఘవ కళ్ళల్లో తీక్షణంగా చూచాడు. రాఘవ నవ్వుతూ తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

“రాఘవా!.. ఎవర్రా ఆ అమ్మాయి?..”

“బావా!.. అత్తయ్య అడుగుతూ వుంది. చెప్పేస్తున్నా!..”

“చెప్పుకోరా.. నాకేం భయమా!.. అమ్మా… వీడు ఆ రాబర్ట్ కూతుర్ని చూచాడట. ఆమె చందమామలా వుందట. యిదీ విషయం.”

అద్వైత్ మాటలు విని సావిత్రి జావ కారిపోయింది. నిట్టూర్చి..

“ఏమిట్రా.. రాఘవా!.. నీవు చందమామ అని చెప్పింది ఆ తెల్లపిల్లను గురించా!..” ఆశ్చర్యంతో రాఘవ ముఖంలోకి చూచింది.

“అవునత్తయ్యా!..’

“అఘోరించినట్లుంది. తెల్లదొర కూతురు తెల్లగా కాక.. నల్లగా ఎలా వుంటుందిరా.. అందులో ఆశ్చర్యం ఏముంది?.. నేను యింకా..”

“ఎవరో మన తెలుగు పిల్ల అని అనుకున్నావు కదా అమ్మా!..” వెటకారంగా నవ్వుతూ అడిగాడు అద్వైత్.

“అవునురా!..” అమాయకంగా అంది సావిత్రి.

వాకిట్లోకి నలుగురు మొగవారు.. యిరువురు ఆడవాళ్ళు వచ్చారు. వారిని చూచిన వెంటనే వీరి సంభాషణ ఆగిపోయింది.

రాఘవ వీధి గేటును సమీపించాడు. సావిత్రి ఎవరో భర్తతో పని మీద వచ్చారని యింట్లోకి, శాస్త్రిగారికి విషయాన్ని చెప్పేదానికి వెళ్ళింది.

“ఎవరండీ!…” అడిగాడు రాఘవ.

“మాది ప్రక్కవూరు.. అయ్యగారు వున్నారా బాబు.”

“వున్నారు..”

“వారితో మాట్లాడాలి బాబు”

“అలాగా.. రండి లోపలికి..”

వీధి గేటు తెరిచాడు రాఘవ. వారు లోనికి వచ్చారు. తలుపు మూసి వారి కన్నా ముందు యింట్లోకి వెళ్ళాడు. వచ్చిన వారిని అద్వైత్ కూర్చొండని చెప్పాడు. వారి ముఖాలను పరీక్షగా చూచాడు. అందరి వదనాల్లో విషాదం. ఏదో సమస్యతో నాన్నగారిని కలవడానికి వచ్చారనుకొన్నాడు.

ముందు నరసింహశాస్త్రి.. వెనుక రాఘవ ప్రక్కన సావిత్రి వరండాలోకి వచ్చారు.

అంతవరకూ అద్వైత్ చెప్పినా కూర్చొనకుండా నిలబడి వున్నవారు.. చేతులు జోడించి నరశింహశాస్త్రికి నమస్కరించారు.

“ఏం రంగయ్యా!.. బాగున్నావా!.. రండి కూర్చోండి” సాదరంగా తనకు తెలిసిన వ్యక్తిని పలకరించారు నరశింహశాస్త్రి.

అందరూ అరుగు మీద కూర్చున్నారు. అందరి ముఖాలనూ పరీక్షగా చూచి.. వారు ఏదో సమస్య కారణంగా తన వద్దకు వచ్చారని గ్రహించి..

“ఏమిటి విషయం!..” అడిగాడు నరశింహశాస్త్రి.

“అయ్యా!.. వీడు నా తమ్ముడు సూరయ్య. మీకు తెలుసు. వారిద్దరూ నా బావమరుదులు. యీమె నా భార్య.. ఆమె నా పెద్ద బావమరిది భార్య. వారికి ఒక కూతురు కొడుకు. కూతురి వయస్సు పద్దెనిమిది. పిల్లోడి వయస్సు పన్నిండు” చెప్పడం ఆపి బావమరది ముఖంలోకి చూచాడు రంగయ్య.

‘నీవే చెప్పు”.. అన్నట్లు ఆ బావమరది బాలయ్య తల ఆడించాడు.

“సమస్య ఏమిటి రంగయ్యా చెప్పు.” అనునయంగా అడిగారు నరశింహశాస్త్రి.

“ఆ పిల్ల పేరు చామంతి. దొర యింట్లో పని చేస్తూ వుండేది.”

“యిప్పుడు చేయడం లేదా!..”

“లేదయ్యా నిలిపేశాం..”

“కారణం?..”

“మూడు నెలలకు ముందు దొర కొడుకు కలకత్తా నుండి యీడకి వచ్చాడు” “అయితే!..” ఆశ్చర్యంతో అడిగారు నరశింహశాస్త్రి.

“యీ పిల్లవాడి మాయలో పడిపోయింది. జరగకూడనిది జరిగి పోయింది. నెల తప్పింది.” మెల్లగా రంగయ్య చెప్పిన ఆ మాటలను విని అందరూ ఏడవసాగారు.

అందరినీ చూచి.. “ఏడవకండి.. వూరుకొండి. రంగయ్యా!.. యిప్పుడు దొర కొడుకు ఎక్కడ వున్నాడు?..”

“పది రోజులుండి వాడు కలకత్తాకు ఎల్లిపోయాడంట సామీ!..”

నరశింహశాస్త్రి సాలోచనగా కళ్ళు మూసుకొన్నాడు. సావిత్రి అద్వైత్.. రాఘవ నిలబడి వారి సంభాషణను వింటున్నారు. కొన్ని క్షణాల తర్వాత.. “రంగయ్యా!.. భయపడకండి.. బాధపడకండి. యిప్పుడు నేను అడిగే ప్రశ్నకు మీ నిర్ణయం ఏమిటో చెప్పాలి. మీరు చెప్పేదాన్ని అనుసరించి నేను ఏం చేయాలనే నిర్ణయానికి రావలసి వుంటుంది”

“మీ ప్రశ్న ఏమిటి సామీ!..” అడిగాడు రంగయ్య.

“మీరు.. మీ పిల్లను వాడికి యిచ్చి పెండ్లి చేయగలరా!..”

“అందుకు వాళ్ళు ఒప్పుకుంటారా సామీ!..”

“వాళ్ళు ఒప్పుకోవడం.. ఒప్పుకోకపోవడం అది వాళ్ళకు సంబంధించిన విషయం. నేను అడిగింది మీ నిర్ణయాన్ని గురించి” రంగయ్యను చూస్తూ అడిగారు నరశింహశాస్త్రి.

రంగయ్య దీనంగా తన బావమరది బాలయ్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.

“సామీ!..” దీనంగా అన్నాడు బాలయ్య.

“నీ పేరేమిటి?..”

“బాలయ్య..”

“చెప్పు బాలయ్యా!..”

“యీ విషయంలో తమరేమంటారు సామీ!..”

“వాళ్ళను ఒప్పించి పిల్లను వాడికి యిచ్చి పెండ్లి చేయడం మంచిదని నా అభిప్రాయం.”

“ఆ ప్రయత్నాన్ని తమరు చేస్తారా సామీ!..” రంగయ్య అడిగాడు.

“మీరు సరే అంటే తప్పకుండా చేస్తాను”

“వారు కాదంటే!..” తన సందేహాన్ని మెల్లగా చెప్పాడు బాలయ్య.

“అడిగే రీతిగా అడిగితే కాదనలేరని నా అభిప్రాయం బాలయ్యా!…”

“తమరికి తెలియనిదంటూ లేదు సామీ!.. పిల్ల బతుకు నాశనం కాకుండా తమరే చేయాలి. మీ నిర్ణయం మాకు సమ్మతం సామీ!..” దీనంగా చెప్పాడు రంగయ్య.

“సరే!.. యిక మీరు వెళ్ళండి. నేను కబురు పంపినప్పుడు రండి.”

అందరూ లేచి చేతులు జోడించారు.

“మంచి జరగాలని కోరుకోండి. తప్పక జరుగుతుంది” అన్నారు నరశింహశాస్త్రి.

అందరూ ఒకరి వెనకాల ఒకరు వీధిలో ప్రవేశించారు.

“ఏమండీ!.. యీ విషయాన్ని గురించి మీరు రాబర్ట్ దొరతో.. మాట్లాడుతారా..” భర్తను సమీపించి అడిగింది సావిత్రి

“మాట్లాడబోయేది రాబర్ట్‌తో కాదు సావిత్రి. చర్చి ఫాదర్ జీజస్‍తో..” పాండురంగ ముఖంలోకి చూచారు నరశింహశాస్త్రి. ఆ చూపులోని అర్థాన్ని గ్రహించిన..

పాండు వారిని సమీపించాడు.

“పాండూ!..”

“చెప్పండి మామయ్యా!..”

“చర్చికి వెళ్ళి జీజస్‌ను పిలుచుకొనిరా!..’

“అలాగే మామయ్యా!..” పాండు వీధి వైపుకు నడిచాడు. రాఘవ.. నరశింహశాస్త్రి ముఖంలోకి పరీక్షగా చూచాడు. అతని మనస్సులో.. నరశింహశాస్త్రిని ఏదో అడగాలని వుంది.. కానీ.. అడగలేక సందేహిస్తున్నాడు. తలను ప్రక్కకు త్రిప్పుకొని నిట్టూర్చాడు.

అతని స్థితిని గ్రహించిన నరశింహశాస్త్రి..

“రాఘవా!…” ప్రీతిగా పిలిచారు.

“ఏమిటి మామయ్యా!..”

“నీవు నన్ను ఏదో అడగాలనుకొంటున్నావు కదూ!..” చిరునవ్వుతో అడిగారు నరశింహశాస్త్రి.

“అవును మామయ్యా!..”

“నిర్భయంగా అడుగు..”

“మీకు వర్ణాంతర వివాహాలు సమ్మతమా మామయ్యా!..”

సావిత్రి.. అద్వైత్.. అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు. యిరువురూ.. రాఘవ వారిని యిలాంటి ప్రశ్నను అడిగినందుకు ఒకరి ముఖాలొకరు ఆశ్చర్యంతో చూచుకొన్నారు. ‘వీడికి ఆవేశం జాస్తి.. ఆలోచన తక్కువ..’ అనుకొన్నాడు అద్వైత్.

‘వెధవకు.. వారిని ఏది అడగాలో, ఏది అడగకూడదో యింత వయస్సు వచ్చినా తెలీలేదు’ అనుకొంది సావిత్రి.

“మీ ముగ్గురి మనసులూ నన్ను గురించే ఆలోచిస్తున్నాయి..” చిరునవ్వుతో నవ్వారు నరశింహశాస్త్రి.

“రాఘవా!.. కులం.. మతం.. సాంప్రదాయం.. ఆచారం.. వీటిని ఏర్పరచుకొన్నది.. మనవారే.. మన పూర్వీకులు.. వారి ముందు తరాల వారు.. తల్లీ తండ్రి నడచిన మార్గాన్నే నడిచారు. మనమంతా.. మనం చూచే అన్య మతస్థులంతా తమ పెద్దలు నడిచిన మార్గంలోనే నడుస్తున్నారు. కానీ యావత్ జగత్రక్షకుడు ఒక్కడే.. ఆ దైవానికి అందరూ సమానులే. వారి వారికి నచ్చిన పేరుతో వారు ఆ ఏకోనారాయణ్ణి.. సర్వేస్వరుణ్ణి స్మరిస్తారు. పేర్లు భేదంగా వినిపిస్తాయి కాని అందరి తలపుల్లో వుండే భావన.. ఆరాధన ఆచరణ.. ఒక్కటే.. యిక వర్ణాంతర వివాహం.. విచక్షణా జ్ఞానం లేని యుక్తవయస్సులో కేవలం పై మెరుగులకు కొందరు యువతీయువకులు ప్రేమ పేరుతో సన్నిహితులౌతారు. వారు పలికే ఆ ప్రేమ పదం అసలైన ప్రేమ కాదు. అది కేవలం ఆకర్షణతో కూడుకున్న వ్యామోహం. అది శాశ్వతం కాదు. అశాశ్వతం. కానీ.. పవిత్ర ప్రేమ శాశ్వతం.. ఒకరి మీద ఏర్పడిన ఆ మధుర భావన ఆ వ్యక్తి జీవితాంతం అతని హృదయంలో పదిలంగా వుంటుంది. అలాంటి ప్రేమ కొందరి విషయంలో త్యాగాన్ని కోరుతుంది. ప్రేమకు పరాకాష్టత త్యాగమే!.. ఏది ఏమైనా.. యీ విషయంలో పురుషుడు తనకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకోగలడు. కానీ స్త్రీకి వారిరువురి మధ్యన ఆవేశంతో విచక్షణా రహితంగా జరిగిన చర్య వలన కళంకం ఏర్పడుతుంది. అలా ఏ స్త్రీ మూర్తి ఆ అపవాదుతో తల దించుకోవడం.. యితరుల విమర్శలకు గురి కావడం.. కన్నీరు కార్చడం.. ఆత్మహత్యకు పాల్పడడం.. నాకు నచ్చనివి. అలాంటి సందర్భాల్లో వారిరువురూ అన్య మతస్థులైనా.. వేరు వేరు కులలా వారైనా.. వారిరువురికి వివాహం జరపడం మానవత్వానికి నిదర్శనం అవుతుంది. సమతకు మమతకు అర్థవంతమవుతుంది. భిన్నత్వంలో వున్నది ఏకత్వం అని ఋజువౌతుంది. ఆ తత్వం అందరికీ శాంతిని ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి మానవత్వం వున్న మనుషులు.. అందరి ఆనందాన్ని కోరుకుంటారు. నేను ఆ కోవకు చెందిన వాడిని.” నరశింహశాస్త్రి తన సుదీర్ఘ వుపన్యాసాన్ని ముగించి అందరి వైపు చూచారు. వారంతా వారినే ఆశ్చర్యంతో చూస్తున్నారు.

వాకిట్లోకి పాండురంగ.. ఫాదర్ జీజస్ వచ్చి నిలబడ్డారు. వారిని చూచిన నరశింహశాస్త్రి చిరునవ్వుతో వారి వైపుకు నడిచారు.

“నమస్కారం సార్!..” చేతులు జోడించాడు జీజస్.

“నమస్తే జీజస్!.. రండి” ఆదరంగా చెప్పారు నరశింహశాస్త్రి.

వరండాలో నిలబడి వున్న సావిత్రి.. అద్వైత్.. రాఘవ ఇంట్లోకి వెళ్ళారు.

యీ ముగ్గురూ.. వరండాలో ప్రవేశించారు.

“కూర్చోండి జీజస్..”

నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు జీజస్.

“మామయ్యగారూ!.. నేను మన సందు మలుపు తిరగగానే వీరు నాకు ఎదురైనారు. మీరు రమ్మన్నారని చెప్పాను. వెంటనే నాతో వచ్చేశారు” చెప్పాడు పాండురంగ.

నరశింహశాస్త్రి క్షణంసేపు పాండు ముఖంలోకి చూచి.. జీజస్ వైపు చూచి నవ్వుతూ..

“నా మాటను మన్నించి మీరు వెంటనే వచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు జీజస్!..”

“సార్!.. మీరు పిలిచారంటే.. ఏదో ముఖ్యమైన విషయం అయ్యి వుంటుంది. అవునా!..”

“అవును జీజస్ !..”

“విషయం ఏమిటో చెప్పండి సార్!..”

వారిరువురినీ క్షణంసేపు చూచి పాండురంగ లోనికి వెళ్ళిపోయాడు.

అద్వైత్.. కాఫీ గ్లాసుతో వరండాలోకి వచ్చాడు. జీజస్‌ను సమీపించి..

“ఫాదర్ తీసుకోండి.” అన్నాడు.

నరశింహశాస్త్రి.. సింహద్వారం వైపు చూచాడు. ద్వారం ప్రక్కనే సావిత్రి నిలబడి వుంది. వారి చూపు ఆ వైపు మరలింది సావిత్రి కోసమే.. యిరువురి చూపులు కలిశాయి. ‘సమయస్ఫూర్తిలో నీకు నీవే సాటి సావిత్రి!..’ చిరునవ్వుతో అనుకొన్నారు నరశింహశాస్త్రి.

జీజస్.. అద్వైత్ అందించిన గ్లాసును అందుకొన్నాడు. “సార్!.. వీరు తమరి అబ్బాయి కదూ!..”

“అవును.. పేరు అద్వైత్.. యం. ఎ. బియ్యిడీ చేసి హైస్కూల్‍లో టీచర్‍గా పని చేస్తున్నాడు. నా వద్ద నాట్యంలో కూడా శిక్షణ పొందాడు” అద్వైత్‌ను గురించి జీజన్ మరో ప్రశ్న అడగకుండా వుండాలనే వుద్దేశంతో అన్ని వివరాలు ఒక్కసారిగా చెప్పారు నరశింహశాస్త్రి.

అద్వైత్.. లోనికి వెళ్ళిపోయాడు. జీజస్ ఖాళీ కాఫీ గ్లాసుని క్రింద పెట్టి..

“చెప్పండి సార్!.. నన్ను పిలిపించిన దానికి కారణం?..” చిరునవ్వుతో అడిగాడు.

“జీజస్!..”

“సార్!..”

“మిమ్మల్ని చూస్తుంటే.. మన నలభై అయిదు సంవత్సరాల నాటి బాల్యం గుర్తుకు వస్తూ వుంది జీజస్. ఆ గోడ ప్రక్కన గోతపు సంచి మీద కూర్చొని..”

“నేను మీ వద్ద తెలుగు అక్షరాలను నేర్చుకొన్నాను. నా ఆదిగురువులు మీరు.. ఆ రోజులు నాకు యిప్పటికీ బాగా గుర్తున్నాయి సార్!.. అప్పుడు మీ వయస్సు హదిహేడు. నా వయస్సు తొమ్మిది. మీ వద్ద నా చదువు మూడేళ్ళు మీ సాగింది. ఆ తర్వాత మీరు కాలేజీలో చేరేటందుకు మీ అమ్మమ్మ గారి వూరైన విశాఖపట్నం వెళ్ళారు. అవును కదా సార్!..”

“అవును జీజస్.. పెరిగి పెద్దవారైన తర్వాత మీరు.. గౌరవంగా.. గొప్పగా బ్రతకాలని మతం మారారు. మీ కొత్త మతం.. మిమ్మల్ని అభిమానించి మీకు ఫాదర్ నామధేయాన్ని కల్పించింది. జీజస్!.. ఫాదర్ అంటే ‘తండ్రి’ కదూ!..”

“సార్!.. అర్థాన్ని నేను మీకు చెప్పేటంతటి వాడినా!.. మీకు తెలియనిది ఏముంది?..”

“జీజస్!.. తండ్రి అంటే నా వుద్దేశ్యంలో రక్షకుడూ అని.. మీరు నాతో ఏకీభవిస్తారా?..”

“తప్పనిసరిగా సార్!.. మీరు చెప్పింది సత్యం!..”

“తప్పు చేసిన మన చిన్నవారికి నచ్చచెప్పి.. వారిని సరైన మార్గంలో నడుచుకొనేలా చేయడం అనేది అన్ని మతాల తత్వమే కదా జీజస్!..”

“అవును సార్!.. మీరు చెప్పింది నిజం..”

నరశింహశాస్త్రి కళ్ళు మూసుకొన్నారు. వారి వదనం ఎంతో గంభీరంగా వుంది.

‘నాకు సంబంధించిన వారెవరో ఏదో తప్పు చేశారు. అది వీరికి తెలిసింది. ఆ విషయాన్ని నాకు చెప్పేదానికే వీరు నన్ను పిలిపించారు’ అనుకొన్నాడు జీజస్.

“జీజస్!.. మీకు సంబంధించిన ఒక వ్యక్తి పెద్ద తప్పు చేశాడు.” కళ్ళు మూసుకొనే చెప్పారు నరశింహశాస్త్రి.

“అతను ఎవరు సార్!..” ఆతృతతో అడిగాడు జీజస్

“రాబర్ట్ కుమారుడు..”

“అతను వుండేది కలకత్తాలో సార్!..’

“మూడు మాసాల ముందు అతను యిక్కడికి వచ్చాడు. యిక్కడ పది రోజులు వున్నాడు. ఆ రోజుల్లోనే అతను మనిషిగా చేయకూడని తప్పు చేశాడు.. పది రోజుల తర్వాత కలకత్తాకు వెళ్ళిపోయాడు. అతని రాక్షస చర్యకు గురైన యువతి.. యిప్పుడు గర్భవతి. చావబోయిన ఆమెను తల్లిదండ్రులు ఆపారు. వారు నా వద్దకు వచ్చారు”

“ఆ అమ్మాయి ఎవరి అమ్మాయి సార్!..”

“రంగయ్య బావమరది బాలయ్య కూతురు. రాబర్ట్ యింట్లో పని పిల్లలా వుండేది. యిప్పుడు చెప్పండి జీజస్!.. ఆ పిల్లకు మీరు ఏ రీతిగా న్యాయాన్ని ప్రసాదించగలరు?..” నరశింహశాస్త్రి గారి చివరి మాటలు జీజస్ చెవుల్లో ప్రతిధ్వనించాయి. తాను వూహించని విషయాన్ని విన్న జీజస్ ఆశ్చర్యంతో తల దించుకొన్నాడు. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మౌనంగా వుండిపోయాడు.

ఐదు నిముషాల తర్వాత..

“జీజస్!.. ఒక ఫాదర్‍గా మీ కర్తవ్యం ఏమిటో మీకు తోచడం లేదా!..” మెల్లగా అడిగారు నరశింహశాస్త్రి. మెల్లగా తల ఎత్తి.. నరశింహశాస్త్రి ముఖంలోకి దీనంగా చూచాడు జీజస్.

“ఏం చేయాలో తేచడం లేదా జీజస్!.. నేను చెప్పనా!.. మీరు రాబర్ట్‌తో మాట్లాడి.. అతని కొడుకును యిక్కడికి పిలిపించి.. అతనికి ఆ అమ్మాయికీ వివాహం జరిపించాలి. అదే ఫాదర్‍గా మీ ధర్మం. యీ పనిని మీరు చేయగలరా!.. చేయలేరా!.. చెప్పండి జీజస్..”

“సార్!.. రాబర్ట్..”

“మీ మాటను వినడని మీకు భయమా!..”

“అతను అదో రకం మనిషి సార్!..”

“ఏ రకం?..”

“అహంకారి..”

“అది అతని గుణం.. మనకు కావలసింది న్యాయం.. న్యాయం అనేది అహంకారికైన.. ఆదర్శవాదికైనా ఒక్కటే. వ్యక్తుల తత్వాలననుసరించి న్యాయానికి రూపాంతరాలు ఏర్పడకూడదు. అలా జరిగితే అది అన్యాయం అవుతుంది. యీ సమస్య.. ఒక అమాయకురాలి నిండు నూరేళ్ళకు సంబంధించినది. ఆ పిల్ల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని.. చర్చి ఫాదర్‍గా మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించాలి. రాబర్ట్‌తో మాట్లాడాలి. అతన్ని.. ఆ యిరువురి వివాహానికి ఒప్పించాలి. యిది మీకు సాధ్యం కాదనిపిస్తే.. యిప్పుడే చెప్పండి జీజస్!.. నేను వారికి మాట యిచ్చాను.” ఆవేశంగా చెప్పిన నరశింహశాస్త్రి గారి మాటలకు జీజస్ చలించిపోయాడు. అతనికి రోషం కలిగింది.

‘రాబర్ట్.. అతని సతీమణితో మాట్లాడి.. వారిని ఒప్పించాలి. ఆ పిల్లకు వాడికి వివాహం జరిపించాలి. అదే న్యాయం, ధర్మం’ అనుకొన్నాడు జీజస్.

“ఏం ఆలోచించారు జీజస్…” మెల్లగా అడిగాడు నరశింహశాస్త్రి.

“సార్!.. రాబర్ట్ మాట్లాడి, అతని కొడుకును యిక్కడికి పిలిపించి.. వారి వివాహం జరిగేలా చూస్తాను” సాలోచనతో చెప్పాడు జీజస్.

“మంచిది జీజస్. మంచి నిర్ణయానికి వచ్చారు. నాకు చాలా సంతోషం” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి. జీజస్ లేచి నమస్కరించి నెమ్మదిగా వీధి వైపుకు నడిచాడు.

అధ్యాయం 4:

అద్వైత్.. ఆరున్నరకల్లా రాబర్ట్ నిలయం చేరాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. కొన్ని నిమిషాల్లో తెరవబడవలసిన సింహద్వారం తెరవబడలేదు. రొండోసారి.. ఒకటికి మూడు సార్లు బెల్ నొక్కాడు.

ఆ శబ్దాన్ని రాబర్ట్ సతీమణి ఆండ్రియా విని మేల్కొంది. మంచం దిగి ప్రక్క గదిలో పడుకొని వున్న కూతురు ఇండియాను లేపి..

“గో అండ్ ఓపెన్ ది డోర్!..” చెప్పి రెస్టురూమ్‍లో దూరింది.

అసహనంతో.. అద్వైత్ మరో రొండుసార్లు బెల్ నొక్కాడు. ఇండియా వులిక్కి పడి లేచి మంచంపై కూర్చుంది. తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మంచం దిగి వేగంగా సింహద్వారాన్ని సమీపించి తలుపు తెరచింది. నిద్ర కళ్ళతో తూలి ముందుకు పడబోయింది. తన కుడి చేతిని అడ్డం పెట్టి ఆమె పడకుండా ఆపాడు అద్వైత్.

సర్దుకొని నిలబడి ఇండియా..

“హు ఆర్ యు!..” ఆశ్చర్యంతో అడిగింది.

“యువర్ ఫాదర్స్ తెలుగు మాస్టర్…”

“వాట్..”

“యస్!.. ఐ కేం టు టీచ్ తెలుగు టు యువర్ ఫాదర్..”

“వాట్ యీజ్ యువర్ నేమ్!..’

“అద్వైత్..”

“ఓ.. ప్లీజ్ కమ్ యిన్..”

చిరునవ్వుతో తన్నే చూస్తున్న ఇండియాను చూస్తూ “గుడ్ మార్నింగ్..” నవ్వుతూ చెప్పాడు అద్వైత్. “యస్.. గుడ్ మార్నింగ్.. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఐ విల్ సెండ్ మై ఫాదర్..” నవ్వుతూ చెప్పి లోనికి వెళ్ళిపోయింది ఇండియా.

‘అహా!.. నిజంగా దేవతలా వుంది. నవ్వు ముఖం.. విశాలమైన కళ్ళు గోధుమ వర్ణపు విరియబోసిన శిరోజాలు.. చక్కటి నాశిక.. పున్నమి చంద్ర కాంతికి మించిన దేహచ్ఛాయ. దివినుంచి భువికి దిగి వచ్చిన దేవతా కన్యలా వుంది. మా రాఘవగాడి మాటలు నిజమే!..’ అనుకొన్నాడు అద్వైత్.

ఆండ్రియా హాల్లోకి వచ్చింది. ఆమెను చూచి వెంటనే లేచి “గుడ్ మార్నింగ్ మేడమ్..” అన్నాడు అద్వైత్.

“గుడ్ మార్నింగ్. వారు మీ గురించి నాకు చెప్పారు. పది నిముషాల్లో వస్తారు. కూర్చోండి” యింగ్లీష్ అందంగా చెప్పి లోనికి వెళ్ళిపోయింది ఆండ్రియా.

లేచి వరండాలోకి వచ్చి పరిసరాలను గమనించాడు అద్వైత్. యింటి ముందు, గోడల ప్రక్కన అందమైన పూల మొక్కలు క్రమంగా నాటబడి ఏపుగా పెరిగి పూలతో నిండి వున్నాయి.

‘వీళ్ళకు పూలకు చాలా దూరం. తలలో పెట్టుకోరు. దేవునికి పూలతో పూజ చేయరు. అదే అమ్మ అయితే.. పూలనన్నింటినీ కోసి మాలగా కట్టి దేవుడి పటాలకు అందంగా అలంకరిస్తుంది. విడి పూలతో నాన్నగారు దేవుని సహస్రనామ స్తోత్రం చేస్తూ పూజిస్తారు. అలా చేయడంలో వారికి మానసిక ఆనందం. మరి వీరికి వీటిని యిలా చూడడంలో నేత్రానందం. ఏది ఏమైనా ఆనందం అనేది ఎవరి విషయంలోనైనా ఒక్కటేగా. ఎవరి యిష్టం.. అభిరుచి వారిది. ఏది తప్పు ఏది ఒప్పు అనే తర్కం తగదు. తర్కం అభిప్రాయ భేదాలకు.. మనస్తాపాలకు.. విరోధాలకు.. దారి తీస్తుంది కదా!..’ అనుకొన్నాడు అద్వైత్.

రాబర్ట్ హాల్లోకి వచ్చాడు. వరండాలో నిలబడి వున్న అద్వైత్‍ను చూచాడు.

“హే మ్యాన్ కమిన్..” అన్నాడు.

అద్వైత్.. వెను తిరిగి చూచి కుడిచేతిని పైకెత్తి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి లోనికి నడిచాడు. అరగంటసేపు తెలుగు కొన్ని పదాలను రాబర్ట్ యింగ్లీష్ అడిగిన వాటికి చెప్పి.. ఆ రోజుకు ట్యూషన్ క్లాస్ ముగించి యింటికి బయలుదేరాడు అద్వైత్.

దారిలో సుల్తాన్ భాయి కుమారుడు అంజాద్.. అద్వైత్‌కు కనుపించాడు. అతను తెల్లవారి వద్ద పని చేస్తున్నాడు. అతను అద్వైత్ కన్నా మూడేళ్ళు పెద్ద. యిరువురికీ పరిచయం వుంది.

“రేయ్! అద్వైత్ ఆగు!..” అన్నాడు అంజాద్.

అద్వైత్ ఆగాడు. అంజాద్ అతన్ని సమీపించాడు.

“బాగున్నావా అంజాద్ భాయ్!..” ప్రీతిగా పలకరించాడు అద్వైత్.

“ఆఁ ఆ.. అవునూ!.. నీ బామ్మరది రాఘవ యీ వూరికి వచ్చిండా!..”

“వచ్చాడు.. ఏం?..”

“ఎప్పుడు!..”

“నిన్న..”

“వాడికి మంచి పేరు లేదు!…”

“ఏ విషయంలో!..”“

“ఎదురు తిరగాలనుకొంటున్నాడంట. వాడెవడో అల్లూరి సీతారామరాజు మీ వాడికి ఆదర్శమంట. చూడు బిడ్డా!.. దొరలకు ఎదురు తిరిగినోడు మసై పోతాడు. వాడికి చెప్పు. బతికి బట్ట కట్టాలంటే కుక్కిన పేనులా పడి వుండమని చెప్పు. పొట్ట కూటికి ఏదో దారి చూచుకొని గుట్టుగా బతకమని చెప్పు. నీకు వాడు చుట్టం. నీవు మంచోడివి. అందుకే నీకిదంతా చెప్పినా!..” కసిగా చెప్పాడు అంజాద్.

అతని మాటలు, ధోరణి అద్వైత్‍కు.. ఆందోళనను కలిగించాయి. సహజంగా శాంతస్వభావుడైన కారణంగా చిరునవ్వుతో.. “అంజాద్ భాయ్!.. నీవు విన్నది నిజమో.. అబద్ధమో నాకు తెలీదు. వాడితో నేను మాట్లాడుతాను. వాడు చాలా మంచివాడు. అందరి మంచిని ఎప్పుడూ కోరేవాడు. వాడికి మన దేశమన్నా.. మన ప్రజలన్నా.. ఎంతో ప్రీతి. ఆపదలో వున్నవారిని రక్షించేటందుకు వాడు ఎప్పుడూ ముందుంటాడు. వాడి మనస్సు చాలా గొప్పది అంజాద్ భాయ్!.. నీవు విన్నది మరెవరిని గురించో ఏమో!..” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు అద్వైత్.

“కాదు.. విన్నది వాడిని గురించే!.. జాగ్రత్త పడమని చెప్పు.” బెదిరించినట్లు చెప్పాడు అంజాద్.

“అలాగే..” చెప్పి ముందుకు బయలుదేరాడు అద్వైత్. అతని మనస్సు నిండా రాఘవను గురించిన ఆలోచనలు. అంజాద్.. రాఘవను గురించి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి.. అద్వైత్.. కలవర పడ్డాడు. అల్లూరి సీతారామరాజుగారిని గురించి.. రాఘవ వచ్చిన రోజున చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ‘వాడికి ఆవేశం జాస్తి. సహనం తక్కువ. ఎంతో దేశభక్తి వున్నవాడు. కొంపదీసి అలాంటి ఉద్యమాన్ని సాగించాలను కొంటున్నాడా!.. వారి చేతిలో పాలన.. ఆయుధాలు.. సిపాయిలు వున్నారు. యీ దేశవాసులు ఎందరో వారి అడుగులకు మడుగు ఒత్తుతున్నారు ఎలాగైనా బ్రతకడమే ముఖ్యమని. రాజ్యాలనే తమ వికృత రాజనీతితో కూర్చిన వారికి, సామాన్య ప్రజానీకపు తిరుగుబాటును అణచడం.. ఎదురైన వారిని చంపడం.. అతి తేలిక పని. రాఘవతో మాట్లాడి వారి మనోభావాలను గ్రహించాలి. ఉద్యమాన్ని సాగించాలనే అభిప్రాయం వాడిలో వుంటే.. తగదని నచ్చచెప్పాలి. వాడి మనస్తత్వాన్ని మార్చాలి. నిప్పులేనిదే పొగ రాదుగా!.. అంజాద్ చెప్పిన మాటలు నిజమేనేమో!.. రాఘవ పెడదారి పట్టకుండా చూడాలి. వాణ్ణి రక్షించాలి’ రాఘవను గురించిన ఆలోచనలతో ముందుకు సాగాడు అద్వైత్.

(ఇంకా ఉంది)

Exit mobile version