Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-31

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[సీత గర్భవతి అని తెలియగానే, ఊరిలోని బంధువులను, సన్నిహితులను పిలిచి – సీతకు, అద్వైత్‍కు వివాహం జరిగిందని చెప్పి వాళ్ళ నోరు తీపి చేశారు శాస్త్రిగారు. నెలలు గడిచే కొద్దీ ప్రసవ సమయానికి బావ తనతో ఉండాలనే కోరిక బలపడింది సీతలో. శాస్త్రి గారు అద్వైత్‍కు రాసే ఉత్తరాలలో తన గురించి ప్రస్తావించలేదని గ్రహించిన సీత, అద్వైత్‌కు తానే ఓ ఉత్తరం రాసి పోస్ట్ చేస్తుంది. గంటన్న కూతురు వెన్నెలపై అత్యాచారం చేస్తాడు రిచ్చర్డ్. తనకు జరిగిన అన్యాయానికి ఆమె నదిలో దూకి చనిపోతుంది. మేకలు తిరిగొచ్చినా, వెన్నెల రాకపోవటంతో ఆమె తల్లి గూడెం వాళ్ళతో కలిసి వెతుకుతుంది. వెన్నెల కనబడదు. అందరూ ఏడుస్తూ ఇళ్ళకి చేరుతారు. బాగా పొద్దుపోయాకా, గంటన్న గూడెం చేరుతాడు. విషయం తెలిసి అతనూ ఏడుస్తాడు. మర్నాడు ఉదయం రిచ్చర్డ్ వారికి ఎదురవుతాడు. వెన్నెలని పులి తరమడం తాను చూశాననీ, పులికి భయపడి వెన్నెల పారిపోయిందని చెప్తాడు. కాసేపటికి వెన్నెల శవాన్ని కనుగొంటారు. పదిగంటలకు అక్కడకు వెళ్ళిన రాఘవ వెన్నెల చనిపోయిందని తెలిసి బాధపడతాడు. వెన్నెలను పులి తరమడం రిచ్చర్డ్ చూచాడట అన్న మాట విన్నాకా రాఘవకి అనుమానం వస్తుంది. రిచ్చర్డ్ టెంట్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న వంటవాడిని అడిగితే, తనకేం తెలియదంటూ అతను పారిపోతాడు. రాఘవ అతన్ని పట్టుకుని నాలుగు వాయిస్తే, వెన్నెలని రిచ్చర్డ్ బలవంతంగా టెంట్ లోకి తీసుకొచ్చాడని చెప్తాడు. వెన్నల అంత్యక్రియలు ముగిసాకా, ఆ రాత్రి, గంటన్నని పక్కకి తీసుకెళ్ళి జరిగినది చెప్తాడు రాఘవ. ప్రతీకారం చేయాలని భావిస్తారు. నలుగురు నమ్మకస్థులయిన కోయలను వెంట తీసుకుని వెళ్ళి తమ ప్రణాళికను అమలు చేస్తారు. దారి కాచి, జీపులో వస్తున్న రిచ్చర్డ్‌ను, అతని అనుచరులను చావుదెబ్బలు కొట్టి, వాళ్ళని జీపులో పడేసి, జీపుని ఓ లోయలో తోసేస్తారు. మర్నాడు ఉదయం పోలీసులు వచ్చి శవాలను బయటకు తీస్తారు. విషయం రాబర్ట్‌కు తెలిసి, వెంటనే భద్రాచలం వస్తాడు. ఏం జరిగిందని రాఘవని ఆరాతీస్తాడు. రాఘవ చెప్పిన సమాధానం విని మౌనంగా ఉండిపోతాడు. పారిపోయిన వంటవాడి బావమరిది రాజమండ్రి వచ్చి రాబర్ట్‌ని కలిసి గూడెంవాసుల ప్రమేయం గురించి చెప్తాడు. రాబర్ట్ ఇద్దరు తెల్లవాళ్ళు, ఇద్దరు మనవారు – మొత్తం నలుగురు పోలీసులను పంపుతాడు. తెల్లవాళ్ళు బెదిరించగా, కోపగించుకున్న గిరిజనులు పోలీసులపై దాడి చేసి ముగ్గురిని చంపేస్తారు. ఒక తెల్లవాడు తప్పించుకుని పారిపోతాడు. గంటన్న రాఘవను అక్కడ్నించి వెళ్ళిపొమ్మని చెబితే, తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్తాడు రాఘవ. లండన్‍లో మేరీ, ఇండియా మాట్లాడుకుంటారు. తన మనసులోని మాటను అద్వైత్‌కు చెప్పేయమని మనవరాలికి చెప్తుంది మేరీ. అద్వైత్ తన ప్రేమను తిరస్కరిస్తే, తాను తట్టుకోలేనని చెబుతుంది ఇండియా. ఓ చిట్కా చెబుతుంది మేరీ. ఆ ప్లాన్ నచ్చిన ఇండియా – అద్వైత్‍ని తనవాడిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 61:

రాత్రి.. ఇండియా, ఆండ్రియా, మేరీలు కలిసి కబుర్లు చెప్పుకొంటూ భోంచేశారు. ఇండియా సీతలా అలంకరించుకొని అద్వైత్ ప్రక్కన కూర్చొని ఎంతో ప్రేమగా అతనికి కొసరి కొసరి వడ్డించింది.

ఆ రాత్రి ఇండియా అలంకరణను చూచిన అద్వైత్‌కు ఇండియా సీతలా కనుపించింది. ‘యీ డ్రస్‌లో ఇండియా ఎంత అందంగా వుంది.. ఆమె ఆకృతి యీనాడు నాకు ఎంతో ఆకర్షణీయంగా ఆనందంగా వుంది. కొసరి కొసరి వడ్డించడం.. తినండి.. తినండి మీరు బాగా తిని ఆరోగ్యంగా వుండాలి. దినానికి ఎనిమిది గంటలు నాట్యం చేస్తారు కదా!..’ అందంగా నవ్వుతూ ఆమె చెప్పిన మాటలు ఆమె తనను ఎంతగానో అభిమానిస్తున్నదనే దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.. అనుకొన్నాడు అద్వైత్.

భోజనాన్ని ముగించి అద్వైత్ గుడ్‌నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. మంచంపై వాలి ఇండియా వ్రాసిన ‘నేను చూచిన ఇండియా..’ నవలను చేతికి తీసుకొని చదవగా మిగిలిన చివరి పేజీలను చదవసాగాడు.

ఆ రోజు పౌర్ణమి.. అక్టోబర్ మాసం.. చలి కాలం.. గాలి వేగంగా వీచసాగింది. ఆకాశంలోని వెన్నెల చెదిరిపోయింది. కారు మేఘాలు క్రమ్ముకొన్నాయి. సన్నని తూర ప్రారంభమయింది. చలిగాలిని అద్వైత్ శరీరం భరించలేక పోయింది. తెరచి వున్న గది తలుపును మూసేటందుకు చేతిలోని పుస్తకానిన ప్రక్కన వున్న టేబుల్‌పై వుంచి ద్వారం వైపు నడిచాడు.

తల్లో మల్లెపూలు.. తెల్లచీర.. జాకెట్ ముఖాన సింధూరపు బొట్టు.. ముఖంలో తనకు సహజమైన చిరునవ్వు.. ఇండియా ద్వారం మధ్య నిలబడింది.

ఆమెను అప్రయత్నంగా చూచిన అద్వైత్ ఆశ్చర్యంతో ఆమెను.. చూస్తూ నిలబడిపోయాడు.

ఇండియా లోనికి వచ్చి తలుపును మూసి అద్వైత్‌ను సమీపించింది. అచేతనంగా అద్వైత్ ఆమెను చూస్తూ పరవశంతో వుండిపోయాడు.

“ఐ లవ్ యు ఆది.. నీవు నా వాడివి..” ప్రేమాభిమానాలతో అద్వైత్‌ను గట్టిగా కౌగలించుకొంది ఇండియా. ఆమె అందాల పారవశ్యంలో వున్న అద్వైత్.. ఆమె చర్యను వ్యతిరేకించే శక్తిని కోల్పోయాడు. ఆమె స్పర్శతో అతని తనువు పులకరించింది. అతనూ ఆమెను గట్టిగా పెనవేసుకొన్నాడు.

ఆ క్షణం.. ఆ యిరువురి మనస్సుల్లో ఒకరి పట్ల ఒకరికి ఎంతో ఆకర్షణ. ఇరు తనువులు కలయికతో పారవశ్యం..

బయట ప్రకృతి.. వారికి ఎంతగానో సహకారం.. జోరు గాలి.. కుండపోతగా వర్షం.. గదిలో ఎంతో చల్లదనం.. శరీరాల్లో ఎంతో మధురమైన వేడి. మనస్సుల్లో భావావేశం.. యింకా ఏదో కావాలనే ఆరాటం..

ఇరువురూ.. మంచంపై వాలిపోయారు. మెరుపులు.. ఉరుములు.. వారి మనోభావన వాటికి అతీతం.. ఇరు హృదయాల స్పందనా వేగం.. ఆకాంక్ష.. ఒక్కటే!..

ఒకరిలో ఒకరు పరవశంతో ఐక్యం అయిపోయారు. క్రొత్త ప్రపంచంలో విహంగాలై విహరించారు. పరవశించారు. మాటలకు అందని మధురానుభవంలో తేలిపోయారు. మురిసిపోయారు.

రెండు గంటల తర్వాత.. బయట ప్రకృతిలో మార్పు.. ప్రశాంతత. గదిలో ప్రేమికుల శరీరాలు చల్లబడ్డాయి. ఆవేశాల పొంగులు చల్లారాయి. అయినా యిరువురూ బిగి కౌగిళ్ళలో ఏదో మత్తులో వుండిపోయారు.

ఆ రాత్రి.. ఇండియా ప్రేమ ఫలించింది. ఆమె హృదయం ఆనంద సాగరాన మునిగిపోయింది. అద్వైత్‌కు.. ఆరు గంటలకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూచాడు.

ఇండియా.. అతని హృదయంపై తన తలను వుంచి నిద్రపోతూ వుంది. ఆమె ముఖంలోకి చూచాడు. ఎంతో తృప్తి.. ఆనందం.. పరవశం.. ఆ ముఖంలో గోచరించాయి అద్వైత్‌కు.

వాస్తవంలోకి వచ్చిన అద్వైత్.. ఆమె తలను పైకెత్తి జరిగి దిండును ముండుకు లాగి వుంచబోయాడు. ఆ కదలికతో ఇండియా కళ్ళు తెరచింది. చిరునవ్వుతో ప్రీతిగా అద్వైత్ ముఖంలోకి చూచింది.

ఆ చూపుల్లో.. ఎంతో ఆరాధనా భావం కనుపించింది అద్వైత్‍కు.

ఇండియా సిగ్గుతో నవ్వుతూ తలను ప్రక్కకు త్రిప్పింది. “ఆదీ!..” మెల్లగా పిలిచింది ఇండియా.

నేరం చేసిన వాడిలా దిగులుగా ఆమె ముఖంలోకి చూచాడు అద్వైత్. “మనం తప్పు చేశాం ఇండియా!..” లోస్వరంతో చెప్పాడు.

“లేదు ఆది..”

“అది తప్పు కాదా!..”

“ఇరువురి ఇష్టానుసారంగా జరిగింది తప్పు ఎలా అవుతుంది?..” అడిగింది ఇండియా.

“నీవు..”

“నిన్ను ప్రేమించాను. నా వాడివిగా భావించాను. నీవు నా చేతికి ఉంగరాన్ని తొడిగావు. నేను నీ చేతి వుంగరాన్ని తొడిగాను. మనకు గాంధర్వ వివాహం జరిగిపోయింది. మన మధ్య జరిగింది సహజమే!..”

“నాకు!..” శూన్యంలోకి చూస్తూ ఆగిపోయాడు అద్వైత్.

“మీకు.. చెప్పండి!..” అతని ముఖంలోకి చూస్తూ అడిగింది ఇండియా.

“వివాహం అయింది..” మెల్లగా చెప్పాడు.

ఇండియా కొన్నిక్షణాలు అతని ముఖంలోకి పరీక్షగా చూచింది.

“ఎవరితో.. సీతతోనా!..” అంది ఇండియా ఆశ్చర్యంతో.

‘అవును’ అన్నట్లు తల ఆడించాడు అద్వైత్ విచార వదనంతో.

“ఎప్పుడు!..”

“ఇక్కడికి రాబోయే ముందు..”

“ఆ విషయం.. ఇంతవరకూ నాతో చెప్పలేదేం?..”

“అవసరం రాలేదు కనుక!..”

“హు.. ఆదీ!.. సీతా నిన్ను ప్రేమించింది. నేను నిన్ను ప్రేమించాను. ఆమె నీ యింట్లో వున్నందున ఆమెను పెండ్లి చేసుకొన్నావు. ఆమె స్థానంలో నేను వుండి వుంటే నన్నూ పెండ్లి చేసికొని వుండేవాడివేగా!.. అవునా!.. కాదా!..” సూటిగా అద్వైత్ ముఖంలోకి చూస్తూ అడిగింది ఇండియా.

అద్వైత్.. ఏం చెప్పాలో తోచక మౌనంగా వుండిపోయాడు.

“ఆదీ!.. తప్పు చేశానని బాధ పడుతున్నావా!..” అతనికి దగ్గరగా జరిగి ప్రీతిగా అడిగింది. అవునన్నట్లు ఆది తలవూపాడు.

“నీవు తప్పు చేయలేదు. నేను నిన్ను ప్రేమించాను. నా సర్వస్వాన్ని నీకు ఆనందంగా అర్పించాను. నా కోర్కె నెరవేరింది. ఇకపై నేనూ నీకు భార్యనే.. నా మీద నీకు సర్వహక్కులూ వున్నాయి. నేను నీ దానను. కొందరి మగవాళ్ళ జీవితంలో ఇరువురు ఆడవాళ్ళు భాగస్వాములు అవుతారు. అది ఆ దేవుని నిర్ణయం. అలాంటి వారు ఇండియాలోనూ వున్నారు.. ఇక్కడా వున్నారు. తప్పు చేశానని బాధ పడకు. నీవు బాధపడితే నేనూ బాధ పడవలసి వస్తుంది. మరో మాట.. నీవు నా చేతిలో చేయి వేసి నేను నీకు వుంగరం తొడిగిన రాత్రి ఏం చెప్పావో జ్ఞప్తికి తెచ్చుకో.. నా దగ్గర వున్నదాన్ని నీవు ఏది అడిగినా నీకు యిస్తానన్నావు.. ఆ మాట ప్రకారం.. నాకు కావలసిన దాన్ని నాకు నీవు ఇచ్చావు. నీ మాటను నిలబెట్టుకున్నావు. డియర్.. ఐయాం.. సో హ్యాపీ.. మై లవ్..” అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆనందంగా అతని నొసటన ముద్దు పెట్టింది ఇండియా.

అధ్యాయం 62:

ఇండియా చెప్పినట్లుగానే జరిగింది దైవ నిర్ణయం ప్రకారంగానే జరిగిందని.. దీర్ఘ ఆలోచన తర్వాత.. ఆ నిర్ణయానికి వచ్చాడు అద్వైత్. తన కుడిచేతిని త్రిప్పి చూచుకొన్నాడు. ఐదారేళ్ళ క్రింద చెట్టు క్రింద కూర్చొని జోస్యం చెప్పే ఓ కోయదొరకు తన చేతిని చూపించాడు. ఆ దొర.

“దొరా!.. నీకు రెండు మనుపులు.. సముద్రాలను దాటుతావు. గొప్ప పేరు.. ఎందరో అభిమానులు నీకుంటరు. చచ్చేంతవరకూ నీవు నీతిని, ధర్మాన్ని తప్పవు. ఇద్దరు బిడ్డలకి తండ్రివౌతావు. బంగారు బొమ్మలాంటి కూతురు. చందమామ లాంటి కొడుకు.. ఇది నా పలుకు కాదు దొరా!.. మేము కొలిచే మా వనదేవత పలుకులు..” చెప్పాడు కోయదొర.

ఆ కోయ పెద్ద, మాటలు అద్వైత్‍కు గుర్తుకు వచ్చాయి.

‘ఆయన చెప్పినట్లుగానే అతివల విషయంలో జరిగింది. ఇక సంతతి.. అదీ జరుగుతుందేమో!.. సర్వేశ్వరా అంతా నీ చిద్విలాసం.. నేను నీవు ఆడించే ఆట బొమ్మను..’ అనుకొన్నాడు అద్వైత్.

ఆ రోజు ఆదివారం. విశ్రాంతి రోజు. ఇండియా గదిలోకి నవ్వుతూ వచ్చింది.

“నా రాజా వారు ఏం చేస్తున్నారు..” అంది అద్వైత్‌ను సమీపించి.

“వెనక చేతులు పెట్టుకొన్నావ్ ఏం?..”

“నా చేతుల్లో ఏముందో చెప్పండి..”

“చూపించవా!..

“ఒక ముద్దు యిస్తే చూపిస్తాను..” ఓరకంట చూస్తూ అందంగా నవ్వింది ఇండియా.

“నీ ఆ చూపు.. ఆ నవ్వు.. నన్ను నీ పిచ్చివాణ్ణి చేశాయి. నీ కోర్కె తీర్చటం ఇప్పుడు నా ధర్మం కదా!..” నవ్వుతూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రీతిగా నొసటన ముద్దు పెట్టాడు అద్వైత్.

ఇండియా.. తన చేతిలోని కవర్‌ను అద్వైత్‍కు అందించింది.

“ఉత్తరమా!..”

“అవును మా మామయ్యగారు వ్రాశారు తమరికి..” నవ్వుతూ చెప్పింది ఇండియా.. అందించింది. ఆత్రంగా.. కవర్‌ను వూడదీసి అందులోని కాగితాన్ని బయటికి తీసాడు అద్వైత్.. అక్షరాలను చూచి ఆశ్చర్యపోయాడు.

“వ్రాసింది నాన్నగారు కాదు.. సీత..” అప్రయత్నంగా ఆ మాటలు అతని నోటి నుంచి వెలువడ్డాయి.

“ఏం వ్రాసింది!..” అడిగింది ఇండియా.

“చదివి చెబుతాను..” వుత్తరాన్ని చదవడం ప్రారంభించాడు అద్వైత్..

“పూజ్యులు.. గౌరవనీయులైన బావగారికి నీ ‘సీత’ వ్రాయునది.. బావా… నీవు రహస్యంగా తిరిగి వచ్చేవరకూ దాచమన్న విషయాన్ని నేను దాచలేకపోయాను. కారణం.. నాలో పెరుగుతున్న నీ ప్రతిరూపం. నా పరిస్థితి నాకు అర్థమైనపుడు నేను.. నీవు నా మెడలో కట్టిన మాంగల్యాన్ని అత్తగారికి చూపించాను. దాన్ని కట్టింది మీరని చెప్పాను. ఆమె ఆశ్చర్యపోయింది. నన్ను ఏమీ అనలేదు. అంతవరకూ విషయం సుమతికి.. పాండురంగకు తెలిసి వున్నది ఇంట్లోని అందరికీ తెలిసి పోయింది.

నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు.. అందరూ పూర్వం కన్నా ఎంతో ప్రేమాభిమానాలతో చూచుకొంటున్నారు. సుమతికి పాప పుట్టింది. పాండు ఎంతగానో సంతోషించాడు. పాప బాలసారెకు రాఘవ అన్నయ్య వచ్చాడు. నన్ను చూచి ఆశ్చర్యపోయాడు. బావను త్వరగా రమ్మని జాబు వ్రాస్తానన్నాడు. వ్రాశాడో లేదో నాకు తెలియదు. నాకు నవమాసాలూ నిండాయి. త్వరలో ప్రసవం జరుగుతుంది.. నేను స్కూలుకు వెళ్ళడం లేదు. మామయ్య గౌరీ మేడంతో మాట్లాడి నన్ను స్కూలుకు వెళ్ళవద్దన్నారు. నీవు వెంటనే బయలుదేరి నా ప్రసవానికి ముందే రావాలని నా కోరిక.

రాత్రింబవళ్ళు నా ధ్యాసంతా నీ మీదే.. నీవక్కడ ఎలా వున్నావో.. ఏం తింటున్నావో అనే దిగులు ఈ స్థితిలో నీకు దూరంగా వుండడం నాకు చాలా బాధగా వుంది బావా!.. నా మనోవేదనను నీవు వూహించుకోగలవని నా నమ్మకం. యీ ఉత్తరం చూచిన వెంటనే నీవు బయలుదేరి వస్తావని నాకు కొండంత ఆశ.. నా యీ స్థితిని గురించి మామయ్యగారు నీకు వ్రాశారో లేదో నాకు తెలియదు. నేను వారిని అడగలేదు. అడగలేను కదా!.. నా పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే బయలుదేరు బావా!.. వస్తున్నానని ఉత్తరాన్ని వ్రాయి. నీ జవాబు కోసం.. రాక కోసం.. వేయి కళ్ళతో ఎదురు చూస్తూ వుంటాను.

ఇట్లు

నీ.. సీత”

సీత ఉత్తరం వ్రాసేటప్పుడు ఆమె కళ్ళనుండి కారిన కన్నీటి గురుతులు అక్షరాలు చెదిరి.. చెరిగిన అక్షరాలను సీత మరలా దిద్దిన గుర్తులు ఆ వుత్తరం ఆరు ఏడు చోట్ల వుండడాన్ని అద్వైత్ గమనించాడు. అతని వదనం ఎంతో గంభీరంగా మారిపోయింది. హృదయంలో రేగిన సంచలనాన్ని అణచుకొనేటందుకు కళ్ళు మూసుకొన్నాడు అద్వైత్. ఇండియా అతని భుజంపై చెయ్యి వేసి..

“ఆదీ!.. అంతా బాగున్నారు కదా!..”

అవునన్నట్లు తల ఆడించాడు ఆది కళ్ళు తెరవకుండానే.

“అయితే ఎందుకు బాధపడుతున్నావు ఆదీ!..” మెల్లగా అడిగింది ఇండియా.

“ఇండియా!.. సీత గర్భవతి. యిప్పుడు ఆమె కనే సమయం”

“అలాగా!..” ఆశ్చర్యంతో అడిగింది ఇండియా.

“అవును..” కొన్ని క్షణాల తర్వాత అద్వైత్.

“ఇందూ!.. నేను ఇండియాకు వెంటనే బయలుదేరాలి…”

“మరి నేను!..”

“నీవు!..”

“ఆగిపోయారేం చెప్పండి. మీరు ఏది చెప్పినా నాకు సమ్మతమే!..”

“మనకు ఇక్కడ డాన్స్ స్కూలు వుంది కదా!..”

“అవును..”

“దాన్ని నీవు చూచుకోవాలిగా!..”

“ఎంత కాలం!..”

యీ ప్రశ్నకు అద్వైత్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. మౌనంగా ఆలోచనలో వుండిపోయాడు. “మీరు తిరిగి ఎప్పుడు వస్తారు!..” ఇండియానే అడిగింది.

“ఇందూ!.. ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఎలా చెప్పగలను!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.

“వెళ్ళగానే వుత్తరం వ్రాస్తారుగా!..”

“తప్పకుండా!..”

ఇండియా వెంటనే ఏమీ అనలేదు.. మౌనంగా వుండిపోయింది.

“ఇందూ! బాధగా వుందా!..”

“నిజం చెప్పనా!.. అబద్దం చెప్పనా!..”

“నీవు నాతో అబద్దం చెప్పగలవా!..”

“హు.. చెప్పలేను. మీరు వూరికి వెళ్ళి సీతను మన వాళ్ళందరినీ చూడాలి. అది మీ ధర్మం.. ఆ మన అన్నదానిలో నాకు భాగం వుందన్న విషయాన్ని మీరు..”

“నా జీవితాంతం మరచిపోలేనిది..”

“నిజంగా!..”

“ప్రామిస్!..”

“అయితే త్వరలో వస్తారుగా!..”

“లండన్‌ను చూచేదానికి కాదు. డాన్స్ స్కూలు ఆర్జనకు కాదు నా ఇండియా.. ఇందు కోసం త్వరలో తిరిగి వస్తాను. నాన్నగారికి మన మధ్య జరిగిన విషయాన్ని చెబుతాను. వారు ధర్మపక్షపాతి. కులమతాలకు అతీతులు. మానవతావాది. ‘వెళ్ళి ఇండియాను తీసికొనిరా..’ అని తప్పక చెబుతారు. అందుకోసం.. నిన్ను నాతో తీసికొని వెళ్ళేదానికోసం.. నేను తప్పక త్వరలో వస్తాను ఇందూ!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.

“ఎన్ని నెలల్లో వస్తారు!..”

“ఓ అయిదారు నెలల్లో!..”

“తప్పక వస్తారుగా..”

“నన్ను నీవు అర్థం చేసికొన్నది ఇంతేనా ఇందూ..”

“పూర్తిగా అర్థం చేసుకున్న దానివల్లనే నాకీ బాధ. మూడు సంవత్సరాల స్నేహం.. నెల రోజులుగా దాంపత్య జీవితం.. నీవు నాకు దూరం అయితే.. నేను బ్రతక లేననిపిస్తూ వుంది ఆదీ!..” దీనంగా బొంగురు పోయిన కంఠంతో కన్నీటితో చెప్పింది ఇండియా.

అద్వైత్ లేచి తన చేతిని ఆమె భుజంపై వేసి ఆమె తలను తన హృదయానికి హత్తుకొన్నాడు.

“విన్నావా!.. నా హృదయ కంపనాన్ని!.. నీవు ఏడిస్తే నేను చూడలేను ఇందూ… నీవు ఎప్పుడూ నా కోసం.. చిరునవ్వుతోనే వుండాలి..”

“మనకు ఎడబాటు అనుకొన్నప్పుడు నా మనస్సు..” ఆపింది ఇండియా

“ఆ బాధ నాకు లేదనుకొంటున్నావా!..”

“అలా అని ఎలా అనగలను!..”

“అయితే!.. నన్ను చిరునవ్వుతో సాగనంపడం..”

“నా ధర్మం!..” అద్వైత్ పూర్తి చేయకముందే ఇండియా అంది. పవిటతో కన్నీళ్ళను తుడుచుకొని.. “మూన్ అంకుల్‌తో మాట్లాడుతాను. మీ ఇష్టప్రకారం.. త్వరలో మీరు ఇండియాకు బయలుదేరుతారు” బాధను దిగమ్రింగి చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

“థ్యాంక్యూ!.. ఇందూ!..” ఆమె ముఖంలోకి ప్రీతిగా చూస్తూ చెప్పాడు అద్వైత్.

మిస్టర్ మూన్.. ఆండ్రియాల సహకారంతో అద్వైత్ ఇండియా ప్రయాణానికి ఏర్పాటు జరిగింది.

ఆ ఉదయం.. ఆరుగంటలకు అద్వైత్ ప్రయాణం. మూన్ కారు ముందు సీట్లో కూర్చొని సిద్ధంగా వున్నాడు.

అద్వైత్.. మేరీకి ఆండ్రియాకు సవినయంగా చేతులు జోడించి వెళ్ళి.. వస్తానని చెప్పాడు. వారి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలను తెలియజేశాడు.

మూన్ కారు హారన్ మ్రోగించాడు.

అందరూ వరండాలోకి వచ్చారు.

“నేను హార్బర్ దాకా వెళ్ళి వస్తానమ్మా!..” తల్లితో ఆంగ్లంలో చెప్పింది ఇండియా.

“నేను ఒక కేస్ అటెండ్ కావాలి. లేకపోతే నేను వచ్చి వుండేదాన్ని. వెళ్ళిరా బేబీ!..” అంది ఆండ్రియా. అద్వైత్ ముందు సీట్లో కూర్చోబోయాడు.

“ఏయ్ బేబీ!.. ఇండియా నీవు రావడం లేదా!” అడిగాడు మూన్.

“వస్తున్నానంకుల్…”

“గుడ్!.. అద్వైత్.. నీవు ఇండియా వెనక కూర్చోండి.. ఫర్ ప్యూ అవర్స్ అయాం యువర్ డ్రయివర్!..” నవ్వాడు మూన్

అద్వైత్ ఇండియా వెనక సీట్లో కూర్చున్నారు. ప్రక్కన నిలబడి వున్న మేరీ.. ఆండ్రియాలు అద్వైత్‌కు ‘బై’ చెప్పారు.

మూన్ కారును కదిలించాడు. గృహ ఆవరణం దాది కారు రోడ్లో ప్రవేశించింది. అక్కడి హార్బర్.. ఎనభై కిలోమీటర్లు. సరదాగా కబుర్లు చెబుతూ మూన్ కారును డ్రైవ్ చేస్తున్నాడు.

“అద్వైత్.. వన్ థింగ్. యిటీజ్ మై అండ్ ఆండ్రియా యాంబిషన్!..”

“ప్లీజ్ టెల్మి సార్..”

“అన్ యువర్ రిటన్.. యు హ్యావ్ టు మ్యారీ ఇండియా!.. వాడ్ డు యు సే!..” అడిగాడు మిస్టర్ మూన్. అద్వైత్.. ఇండియాలు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు.

“నో ఆన్సర్ ఫ్రం యు అద్వైత్…”

అద్వైత్ ఇండియా ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.

“సే సంథింగ్..” తన నోటికి అద్వైత్ చెవి దగ్గర పెట్టి మెల్లగా అంది ఇండియా.

“యస్ సార్..” అప్రయత్నంగా అనేశాడు అద్వైత్.

మూన్ నవ్వుతూ.. “ఐనో యంగ్ మ్యాన్.. యు విల్ సే ది సేమ్!..”

“ఇండియా!.. వాడ్ డు యు సే!..” అడిగాడు మూన్.

“యస్ అంకుల్..” అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పింది ఇండియా.

రెండు గంటల లోపల కారు బోర్డింగ్ పాయింటుకు చేరింది. ముగ్గురూ దిగారు.

అక్కడ.. మూన్‌కు పరిచయస్థుడు కనిపించాడు. వారిరువురూ మాటల్లో పడిపోయారు.

ఇండియా అద్వైత్ చేతిని తన చేతిలోనికి తీసుకొంది. వారిరువురూ మూన్‌కు కొంత దూరంగా నడిచారు.

“ఆదీ!..”

“ఏం ఇందూ!..”

“నన్ను వదిలి వెళ్ళడంలో నీకు దిగులుగా లేదా!..”

“వుంది.. కానీ వెళ్ళక తప్పదు కదా!..”

అవునన్నట్లు ఇండియా తల ఆడించింది.

“మరో ప్రశ్న!..”

“ఏమిటది?..”

“ఒకవేళ.. నా పరిస్థితీ.. సీతలాగా మారితే.. నేనేం చేయాలి ఆదీ?” విచారంగా అడిగింది ఇండియా.

“నాకు ఉత్తరం వ్రాయి. నేను వచ్చేస్తాను..”

“అక్కడి పరిస్థితులు నీవు ఇక్కడికి వచ్చేదానికి అనుకూలించకపోతే!..”

“నిన్ను ఇండియాకు రమ్మని రాస్తాను.. వచ్చెయ్..”

“సీత.. నన్ను నీ జీవిత భాగస్వామిగా అంగీకరిస్తుందా?..”

“విషయాన్ని వివరంగా చెబితే అంగీకరిస్తుందని నా నమ్మకం..”

“హు.. నీవు మంచి మనసున్న వాడివి. అందరి విషయంలోనూ మంచిగానే ఆలోచిస్తావు..” విరక్తిగా నవ్వింది ఇండియా. కొన్ని క్షణాల తర్వాత..

“నా నిర్ణయాన్ని విను ఆది.. సీతలా నా పరిస్థితి కాకుంటే.. నేను ఇక్కడే వుండి నీకోసం.. జీవితాంతం ఎదురు చూస్తాను. ఒకవేళ సీతలా అయితే.. నేను మన బిడ్డతో.. అక్కడికి వస్తాను. జీవితాంతం ఆ బిడ్డలో నిన్ను చూచుకొంటూ నీ దానిగానే బ్రతుకుతాను. నా మూలంగా నీకు సీతకు కష్టాలు కలగడం.. మీ యిరువురి మధ్యనా భేదాభిప్రాయాలు రావడం నాకు ఇష్టం లేదు. నిన్ను నేను కోరుకొన్నాను. పొందాను. ఆ తృప్తి.. నీ జ్ఞాపకాలతో నేను జీవితాంతం జీవించగలను ఆదీ” దీనంగా చెప్పింది ఇండియా.

“ఇందూ!.. నీది నాకంటే మంచి మనస్సు. ఆ సర్వేశ్వరుడు నీ మనస్సుకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాడు” సైరన్ మ్రోగింది. ప్రయాణీకులు స్టీమర్‌లో ఎక్కుతున్నారు.

అద్వైత్ ఇండియాలు అక్కడి చేరుకున్నారు. మూన్ వారిని సమీపించాడు. అద్వైత్ వారికి చెప్పి స్టీమర్ ఎ‍క్కబోయాడు. బై.. బై చెప్పింది ఇండియా..

మూన్ అద్వైత్‌ను చూచి నవ్వుతూ చేతిని ఆడించాడు.

ఇండియాకు ఏదో గుర్తుకు వచ్చి..

“ఆదీ.. ఆగు..” అంది.

ఆది ఆగి ఇండియా ముఖంలోకి చూచాడు.

ఇండియా వేగంగా కారును సమీపించి డోర్ తెరచి తన హ్యాండ్ బ్యాగ్‌ను తెరచి అందులోని చిన్న పార్సిల్‌ని చేతికి తీసుకుంది. పరుగున అద్వైత్‌ను సమీపించి..

“ఆదీ.. సీతకు పుట్టబోయే బిడ్డకు నేను ఏమౌతాను?..”

ఆది ఆశ్చర్యంతో నవ్వుతూ ఇండియా ముఖంలోకి చూచాడు.

“జవాబు చెప్పండి..” ప్రాధేయపూర్వకంగా అడిగింది ఇండియా.

“పెద్దమ్మవు అవుతావు..” నవ్వుతూ చెప్పాడు ఆది.

“పుట్టబోయేది ఎవరో నాకు తెలియదు. ఎవరైనా సరే.. ఆ బిడ్డకు ఇది నా కానుక.. సీతకు ఇవ్వండి..” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

“ఏమిటది?..”

“ఇండియాకు వెళ్ళిన తర్వాత చూడండి.. ఇప్పుడు కాదు..”

“సరే..”

ఇండియా చేతిలోని పాకెట్‌ను అందుకున్నాడు ఆది..

“ఇందు!.. ఇక బయలుదేరతాను.”

“మంచిది.. జాగ్రత్త..” కొన్ని క్షణాలు అద్వైత్ ముఖాన్ని పరీక్షగా చూచింది ఇండియా. వేగంగా వెనుదిరిగి మూన్‌ను సమీపించింది.

అద్వైత్ స్టీమర్ పైకి ఎక్కి టాటా చెప్పాడు.

అద్వైత్ కనుమరుగైన తర్వాత ఇండియా, మూన్ కారులో కూర్చున్నారు. మూన్ కారును స్టార్ట్ చేసాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version