[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[లక్ష్మీదేవి స్వర్ణ విగ్రహాన్ని ఎలాగైనా తెచ్చివ్వాలని రాబర్ట్ కరీమ్‍ని ఒత్తిడి చేస్తాడు. గుడికి రెడ్డి రామిరెడ్డి గారు నియమించిన కాపలాదారులకు మిత్రుడైన జాలయ్యతో కరీమ్ స్నేహం చేస్తాడు. జాలయ్య తన మిత్రులైన కాపాలదారులని మద్యంతో లోబరుచుకుంటాడు. ఓ అమావాస రోజున జాలయ్య కాపలాదారుని మద్యం మత్తులో ఉంచగా, కరీమ్, అతని అనుచరుడు గుడిలో ప్రవేశించి, తాళాలు బద్దలుకొట్టి స్వర్ణ విగ్రహాన్ని చేజిక్కించుకుంటారు. కరీమ్ ఆ విగ్రహాన్ని రాబర్ట్‌కి అందజేస్తాడు. అదే సమయంలో ఆలయంలో చోరీ జరిగినట్లు కల వచ్చి, శాస్త్రిగారు నిద్ర లేచి ఆలయానికి వస్తారు. కాపాలవాళ్ళు మత్తులో పడి ఉండడం, ఆలయం తలుపుల తాళాలు బద్దలై ఉండడం లోపల, అమ్మవారి స్వర్ణ విగ్రహం లేకపోవడం చూసి – విగ్రహం నిజంగానే చోరీకి గురైందని గ్రహిస్తారు. కాపలాదారులు పూర్ణయ్యను చంద్రయ్యను పేర్లు పెట్టి పిలుస్తారు. వాళ్ళు రాకపోవడంతో కొంచెం ముందుకు నడిచి చూస్తే, కాస్త దూరంలో ఓ వేప చెట్టు క్రింద ఇద్దరు మైకంలో ఒళ్ళు తెలియకుండా పడి ఉండడం చూస్తారు. పూజారి శంకరశర్మ గారింటికి వెళ్ళి ఆయన్ని నిద్ర లేపి విషయం చెప్తారు. తనకి కల వచ్చిన సంగతి, వెంటనే గుడికి వచ్చే చూస్తే, అది నిజమవడం గురించి చెప్తారు. ఉదయాన్నే పోలీసు కంప్లయింట్ ఇవ్వాలని నిశ్ఛయించుకుని ఇంటికి తిరిగివస్తారు. అర్ధరాత్రి అంత హఠాత్తుగా బయటకు వెళ్ళిన భర్త, తిరిగి రాగానే కారణం అడుగుతుంది సావిత్రి. విచారవదనంతో జరిగినది చెప్తారు శాస్త్రి గారు. మర్నాడు శాస్త్రి గారు, పూజారి కాపాలదారులిద్దరిని పిలిచి అడిగితే, వారు తమకేమీ తెలియదని అబద్ధం చెప్తారు. రెడ్డి రామిరెడ్డి గారు ఊర్లో లేకపోవడంతో, ఆయనకి విషయం తెలియబరిచేందుకు ఒకతన్ని మద్రాసుకి పంపుతారు. కాపాలదార్లు అబద్ధం చెబుతున్నారని గ్రహించిన రెడ్డిగారి పినతండ్రి కొడుకు రాఘవరెడ్డి – వాళ్ళిద్దర్ని కాలిన గునపాన్ని పట్టుకుని ప్రమాణం చేయమంటాడు. అప్పుడు ఆ ఇద్దరూ ఏడుస్తూ, వాస్తవాన్ని వెల్లడిస్తారు. రాఘవరెడ్డి మరో నలుగురితో కలసి, పూర్ణయ్యను చంద్రయ్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి కేసు పెడతాడు. ఆ ఇద్దరిని పోలీసులు జైల్లో వేస్తారు. జాలయ్య ఊరొదిలి పారిపోతాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 69:
అద్వైత్ పయనించే స్టీమర్ అరేబియన్ సముద్రంలో ముందుకు సాగుతుండగా పెనుతుఫానులో చిక్కుకుంది. అది హిందూ మహాసముద్రంలో ప్రవేశించి మద్రాస్ చేరవలసినది.. తుఫాను కారణంగా.. అరేబియా సముద్రంలో బొంబాయి ప్రాంతంలో గాలి వేగానికి తీరం చేరి ఇసుకలో కూరుకుపోయింది. ఆ హోరు గాలికి నడి సముద్రంలో తల్లక్రిందులై.. అందులో పయనించే వారంతా సాగర జలచరాలకు ఆహారంగా మారిపోవలసినవారు.. ఆ ప్రయాణీకులలో ఎవరి ప్రార్థనల ప్రభావంతోనో ఆ ముప్పు తప్పింది. ప్రయాణీకుల నందరినీ రక్షించమని సర్వేశ్వరుని అద్వైత్ ఆ కష్టకాలంలో ఎంతగానో వేడుకొన్నాడు.
స్టీమర్‍లో ప్రయాణం చేసిన వారంతా ఆంగ్లేయులే. మాటల సందర్భంలో అద్వైత్ తన ఊరు పేరు తెలిపి రాబర్ట్ దొరతో తనకు మంచి పరిచయం వుందని.. వారికి నేను తెలుగు నేర్పానని చెప్పాడు.
అక్కడి కర్నల్ అందరితో పాటు అద్వైత్‌కు కూడా ఆశ్రయాన్ని కల్పించి ఆంధ్రప్రాంతానికి చేరవలసిన ఆంగ్లేయుల పేర్లలో చివరన అద్వైత్ పేరును వ్రాసి రాబర్ట్‌కు పంపాడు. ఫలానా రోజు వారు రైల్లో బయలుదేరి రాజమండ్రి చేరబోతున్నారని కూడా వ్రాసాడు.
రెడ్డిరామిరెడ్డిగారు సకుటుంబంతో సాగించిన యాత్ర చివరి క్షేత్రం కాంచీపురం. వారితో వెళ్ళిన ఎనభై ఏళ్ళ వసుంధర వారు కంచికి చేరగానే మంచం పట్టింది. వయోభారం.. తీవ్ర జ్వరంతో బాధపడింది. రెడ్డిగారు ఆమెను మంచి వైద్య నిపుణులకు చూపించారు. మందులు ఇప్పించారు. కానీ.. ఆమెకు సమయం ఆసన్నమైన కారణంగా మందులు పని చేయలేదు. ఒకనాటి వేకువన వసుంధర ‘భజగోవిందం.. భజగోవిందం.. భజగోవిందం మూఢమతే..’ అనే గోవిందుడి నామాన్ని జపిస్తూ కన్ను మూసింది.
యాత్ర చివరి ఘట్టంలో జరిగిన యీ పరిణామానికి రెడ్డిగారు వారి కుటుంబసభ్యులూ ఎంతగానో బాధపడ్డారు. అదే సమయానికి.. రెడ్డిగారిని అన్వేషిస్తూ వెళ్ళిన వ్యక్తి కంచిలో వారిని కలసి.. శ్రీమహాలక్ష్మి మాతా విగ్రహాన్ని దొంగలు ఎత్తుకపోయారనే విషయాన్ని వారికి తెలియజేశారు. అటు వసుంధర మరణం.. ఇటు తన వూరి నుంచి వచ్చిన వ్యక్తి చెప్పిన చేదు వార్త.. రెడ్డిగారికి, వారి కుటుంబ సభ్యులకు ఎంతో విచారాన్ని కలిగించాయి. మరో వ్యాన్.. మాట్లాడుకొని బయలుదేరి వసుంధర (శవం).. వూరి నుండి వెళ్ళి వారిని కలసిన వ్యక్తితో.. రెడ్డిగారి కుటుంబం రాజమండ్రికి చేరారు.
వసుంధర శవం వున్న వ్యాను శాస్త్రిగారి యింటి ముందు ఆపి రెడ్డిగారు వరండాలో ప్రవేశించారు. అప్పుడు సమయం రాత్రి ఎనిమిదిన్నర. శాస్త్రిగారు భోజనానికి కూర్చోబోతుండగా వినిపించిన రెడ్డిగారి పిలుపు విని.. వారు వరండాలోకి వచ్చారు.
రామిరెడ్డి.
“శాస్త్రిగారూ!.. అక్కయ్య!..” ఏడుపు పొంగి రాగా చెప్పలేక పోయారు రెడ్డిగారు.
“అక్కయ్యకు ఏమయింది రెడ్డిగారూ!..” ఆందోళనతో అడిగారు శాస్త్రిగారు.
“కంచీ క్షేత్రంలో అన్ని ఆలయాలను దర్శించి నిన్న వేకువన శాశ్వతంగా కన్నుమూశారు..” రోదిస్తూనే చెప్పాడు
హాల్లోకి వచ్చిన సావిత్రి.. పాండురంగ.. సుమతి.. సీత ఆ మాటలను విని నిర్ఘాంతపోయారు. ముందుకు కదలలేక నిలబడిపోయారు.
“రెడ్డిగారూ!.. అక్క ఎక్కడ?..” గద్గద స్వరంతో మెల్లగా అడిగారు శాస్త్రిగారు.
“వ్యాన్‌లో..”
శాస్త్రిగారు వేగంగా వ్యాన్‌ను సమీపించారు. రెడ్డిగారు వారిని అనుసరించారు. సావిత్రి.. పాండురంగ వారి వెనకాల పరుగెత్తారు. డ్రయివర్.. రెడ్డిగారు.. వసుంధర శవాన్ని వ్యాన్ నుండి దించారు. శాస్త్రిగారు భోరున రోదిస్తూ వసుంధర తలవైపు పట్టుకొనగా పాండురంగ కాళ్ళవైపు రెడ్డిగారు.. సావిత్రి నడుము క్రింద చేతులు వేసి.. రోదిస్తూ.. వసుంధర శవాన్ని హాల్లోకి చేర్చి నేల వుంచారు.
“‘వెళ్ళి వస్తాను రా తమ్ముడూ’ అని చెప్పి వెళ్ళిన నీవు యిలా తిరిగి వచ్చావే.. అక్కా!.. అక్కా..” కన్నీటితో ఆమె తలపైన తన తలను వుంచి ఏడ్చారు శాస్త్రిగారు.
ఆ రాత్రి వారందరి పాలిటా.. కాళరాత్రి..
అధ్యాయం 70:
దౌహిత్రుడు రాఘవ ఎక్కడ వున్నదీ తెలియని కారణంగా వసుంధరమ్మ సోదరి కుమారుడు పాండురంగ.. ఆమె క్రతువు కర్మలను నరసింహశాస్త్రిగారి నిర్ణయం ప్రకారం జరిపాడు.. ఆ కార్యక్రమాలన్నీ ముగిసేంత వరకూ రెడ్డి రామిరెడ్డిగారు నరసింహశాస్త్రిగారిని అనుసరించి వున్నేడు. తనతో యాత్రకు వచ్చి ఇంటికి తన వారికి దూరంగా వుండి.. తన చేతుల్లో వసుంధర ప్రాణం పోవడం రెడ్డిగారికి ఎంతో వేదనను కలిగించింది.
నరసింహశాస్త్రిగారిని ఇంట్లో నుంచి బయటికి కదలనీయకుండా కావలసిన ఏర్పాట్లనన్నింటినీ రెడ్డిగారు.. శాస్త్రిగారి మాట ప్రకారం అమర్చారు. వారికి సాయంగా సుల్తాన్ వున్నాడు.
వైకుంఠ సమారాధన నాడు శాస్త్రిగారు రామిరెడ్డిగారిని వారు కుటుంబసభ్యులనందరినీ భోజనానికి రావలసినదిగా ఆహ్వానించారు. వారంతా వచ్చి శాస్త్రిగారి మాట ప్రకారం భోంచేశారు. ఆ ప్రసాదాలను అందరితో కలసి సుల్తాన్ కూడా ఆరగించాడు.
అప్పటికి వసుంధరమ్మ గతించి రెండు వారాలు. ఆ సాయంత్రం నరసింహశాస్త్రి.. రామిరెడ్డి సుల్తాన్‌లు గోదావరీ నది ఒడ్డుకు చేరారు.
“శాస్త్రిగారూ!.. అమ్మవారి బంగారు విగ్రహం దొంగిలింపబడడంలో రాబర్ట్ హస్తం వుందని నా అనుమానం.. మీరేమనుకొంటున్నారు!..” అడిగాడు రామిరెడ్డి.
“వాడు నీచుడే.. అయినా అమ్మతల్లి విగ్రహాన్ని దొంగిలించే దానికి పాల్పడడని నా అభిప్రాయం..”
“ఆ విగ్రహం బంగారు కదయ్యా!..” రాబర్ట్ పై తనకున్న అనుమానాన్ని ఆ రీతిగా వ్యక్తం చేశాడు సుల్తాన్.
“శాస్త్రిగారూ!.. రాబర్ట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను పిలిపించి ఏదో మాట్లాడినట్లు విన్నాను. మనవారు వెళ్ళి అతన్ని అడిగితే.. ‘విచారిస్తున్నాము. ఇంకా మాకు దొంగలను గురించిన వివరాలు అందలేద’ని జవాబు చెప్పాడట. దాన్నిబట్టి యీ విషయంలో రాబర్ట్ జోక్యం చేసికొని ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించాడని నా అనుమానం” సాలోచనగా చెప్పాడు రెడ్డిగారు.
“జాలయ్య దొరికితే.. అన్నీ వివరాలు తెలుస్తాయి. అయ్యా!.. కానీ వాడు ఎటో పారిపోయాడు కదా!..” విచారంగా అన్నాడు సుల్తాన్.
చీకటి నలుమూలలా క్రమ్ముకొంది. నాలుగువైపులా చూచి శాస్త్రిగారు..
“రెడ్డిగారూ! ఇక ఇంటికి వెళదామా!..”
నది ఒడ్డున నడచుకొంటూ తమవైపుకే వస్తున్న ఓ వ్యక్తిని చూచాడు సుల్తాన్.
“అయ్యా!.. ఆ వచ్చే వ్యక్తి జాలయ్య అని నా అనుమానం..”
“సరే.. పదండి మనం అతని వైపుకు నడుద్దాం..” అన్నారు శాస్త్రిగారు.
ముగ్గురూ తమకు ఎదురుగా వస్తున్న వ్యక్తి వైపుకు నడిచారు. ఐదారు నిముషాల్లో ఆ వ్యక్తి.. వీరిని సమీపించాడు. అతను.. సుల్తాన్ భాయ్ అన్నట్లుగానే జాలయ్య. తన ఎదుటి వారిని చూచి..
“అయ్యలారా!.. దండాలు.. నేను పెద్ద తప్పు చేశానయ్యా!.. నన్ను మన్నించండి సామీ.. నన్ను మన్నించండి.” బోరున ఏడుస్తూ రామిరెడ్డిగారి కాళ్ళను తన చేతులతో చుట్టేశాడు.
రెడ్డిగారు క్షణంసేపు అతని వైపు చూచి.. తర్వాత శాస్త్రి గారి వైపు.. సుల్తాన్ వైపు ఆశ్చర్యంతో చూచాడు.
“జాలయ్యా!.. పైకి లే!..” అన్నాడు రెడ్డిగారు.
సుల్తాన్ వంగి అతని భుజాన్ని పట్టుకొని పైకి లేపాడు. భయంతో జాలయ్య వణకసాగాడు.
“భయపడకు జాలయ్యా!.. మేము నిన్ను ఏమీ చేయము. జరిగిన యథార్థాన్ని నీవు మాతో చెప్పు” అన్నాడు రెడ్డిగారు.
జాలయ్య.. కరీమ్ తనను కలసికొని చెప్పిన మాటలు.. ఆ తర్వాత తాను ఏ రీతిగా కరీము సహకరించినది.. వివరంగా చెప్పాడు. రెడ్డిగారి అనుమానం నిజం అయింది.
“శాస్త్రిగారు!.. విన్నారు కదా!..”
“విన్నాను రెడ్డిగారూ!..” విచారంగా చెప్పారు శాస్త్రిగారు.
“కరీమ్ అనుచరులు నేను మీకు ఎక్కడ నిజం చెబుతానో అని నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను మీరే కాపాడాలి సామీ!..”
నరసింహశాస్త్రి ముఖంలోకి దీనంగా కన్నీటితో చూచాడు జాలయ్య.
శాస్త్రిగారు రెడ్డిగారి ముఖంలో చూచారు.
“ఒరే జాలయ్యా!.. నీవు మంచోడివనుకున్నా. నీవు ఆ వెధవతో చేరి పెద్ద తప్పు చేశావు కదరా!..” అన్నాడు సుల్తానా భాయ్.
“అవును అన్నా!.. అవును. నన్ను క్షమించండి.. మీరే నన్ను కాపాడాలి” తప్పును ఒప్పుకొన్నాడు జాలయ్య.
“నీవు మాతో రా!..” ఎంతో గంభీరంగా ఆ మాటను చెప్పాడు రెడ్డిగారు. ఆ చీకటిలో నలుగురూ వూరి వైపుకు నడిచారు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.