Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సామాజిక మార్పులను ఒడిసిపట్టిన దేశరాజు కథాసంపుటి – ఎ‘ఫైర్’

[దేశరాజుగారి ‘ఎ‘ఫైర్’’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రముఖ కవి, కథకుడు దేశరాజు గారి ఐదవ కథాసంపుటి ఎ‘ఫైర్’. ఈ కథాసంపుటి వర్తమాన సమాజంలోని విభిన్న కోణాలను, మానవ నైజాలను ప్రతిబింబించే ఒక చక్కని సామాజిక దర్పణం. ఈ సంపుటిలో 15 కథలు ఉన్నాయి.

దేశరాజు గారు వృత్తిరీత్యా జర్నలిస్ట్ కావడంతో సమాజంలోని చీకటి కోణాలను చాలా నిశితంగా గమనించినట్టు తెలుస్తుంది. కథల్లో మెత్తగా చెబుతున్నట్లు కనిపిస్తూనే, వ్యవస్థలోని లోపాలపై గట్టిగా చురకలు వేసే వ్యంగ్య శైలి కనిపిస్తుంది.

కేవలం సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా, మానవ ప్రవర్తనల వెనుక ఉన్న మనస్తత్వాలను తాత్విక రీతిలో విశ్లేషించడం ఈ కథల ప్రత్యేకత.

కొన్ని కథలలో సగటు మనుషులు ఎదుర్కొనే నైతిక సంఘర్షణలు, ఆర్థిక ఇబ్బందులు వస్తువు కాగా, మరికొన్ని కథలు మారుతున్న ఆధునిక జీవనశైలిని, మనుషుల మధ్య పెరుగుతున్న దూరాన్ని, సడలుతున్న నమ్మకాలను ప్రశ్నిస్తాయి.

~

కలవారింటి కోడలు ఆడపిల్లకి జన్మనిస్తూ, చనిపోతుంది. తండ్రి ఆ పసిగుడ్డును ఓ పనామెకిచ్చేస్తాడు. తర్వాత కొన్నాళ్ళకి మరో పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమెకి చాలా కాలం దాకా పిల్లలు పుట్టరు. చివరకు ఓ కొడుకు పుడతాడు. బాగా గారం చేయడంతో, వాడికి చదువు వంటపట్టదు. ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. పనిమనిషి దగ్గర పెరిగిన అమ్మాయి పెంపుడుతల్లి దగ్గర పసరు వైద్యం నేర్చుకుని, ఊళ్ళో వాళ్ళకి చికిత్స చేస్తుంది. కాలక్రమంలో కన్నతండ్రీ, పెంపుడుతల్లి చనిపోతారు. తమ్ముడికి పెళ్ళవుతుంది. కానీ పిల్లలు పుట్టరు. అన్ని ప్రయత్నాలు చేసిన మరదలు చివరికి వదినని ఆశ్రయించి పసరు మందు తాగి, కొన్నాళ్ళకి తల్లవుతుంది. పసిబిడ్డకి అనారోగ్యం చేస్తుంది. హోరున వాన. కాలవ పొంగుతోంది. పక్క ఊర్లోని ఆసుపత్రికి వెళ్ళలేరు. మళ్ళీ పసరుమందే దిక్కవుతుంది. అక్క అంతటి వానలోనూ వెళ్ళి, తనకు కావల్సిన ఆకులు కోసుకొచ్చి, ఒక మందు తీసుకుని తమ్ముడి ఇంటికి చేరుతుంది.  ఆకులను నూరి, తను తెచ్చిన మందు కలిపి ఆ పసిగుడ్డు నోట్లో పిండుతుంది. కొన్ని నిమిషాలకు ఆ పిల్లాడు కోలుకుంటాడు. తమ్ముడు, మరదలు వచ్చి ఆమె కాళ్ళు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆమె మాత్రం చికిత్స ఎందుకు చేయాలో, దేనికో చేయాలో చెప్పిన పెంపుడుతల్లిని తల్చుకుంటుంది. ‘చికిత్స’ చదివించే కథ.

తమ భర్తలు తాగి ఎక్కడో పడిపోకుండా ఉండాలంటే, తమ ఇళ్ళకు దగ్గరలోనే ఒక మందు దుకాణం ఉండాలని ఇద్దరు తాగుబోతుల భార్యలు ఓ టీవీ ఛానెల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. తమని ఏమీ తెలియనివాళ్ళలా జమకట్టి, తమ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుందామనుకున్న యాంకర్‌ని విస్తుపోయేలా చేస్తారు ‘మార్పు’ కథలో. ఈ కథ గురించి రచయిత ఏం చెప్పారో, ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవండి.

అతి తెలివి భర్త కోరికని సులువుగా పరిష్కరించి, బంధువులు అవాక్కయేలా చేస్తుందో శ్రీమతి ‘చరణదాసి’ అనే చిన్న కథలో. చిన్న కథైనా, పట్టించుకుని, బుర్రకెక్కించుకోవాల్సిన విషయం ఉందీ కథలో.

ఆరోగ్య పరీక్షలు చేయించుకుందామని డయాగ్నిస్టిక్స్ సెంటర్‍కి వెళ్తాడో వ్యక్తి. అక్కడ పెద్ద లైను. కాసేపు లైన్‌లో నిల్చున్నాకా, హారన్ వినబడితే, వెనక్కి తిరిగి చూస్తాడు. తన బాస్! ఇక్కడెందుకు నిలబడ్డావ్ అని అడిగితే, ఏదో వంకర సమాధానం చెప్దామని అనుకుని తమాయించుకుని టెస్టుల కోసం సర్ అని అంటాడు. “ఇక్కడెందుకు, ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, మన ఆఫీసుకి దగ్గరలో ఆ మిషన్ ఉంది. వెళ్ళి అక్కడ చేయించు” అని వివరాలు చెప్తాడు. మర్నాడు తన యూరిన్, బ్లడ్ తదితర శాంపుల్స్ తీసుకుని వెళ్ళి ఆ కొత్త మెషిన్‌లో వేసి, అక్కడి సూచనల మేరకు బటన్స్ నొక్కుతాడు. క్షణాల్లో రిపోర్టులు వస్తాయి. తొలుత ఆశ్చర్యపోయినా, ఎన్నో సందేహాలొస్తాయి. ఆ మెషీన్‌నే పరీక్షించాలనుకుంటాడు. కొన్ని రోజులకి శాంపుల్స్ తీసుకెళ్ళి మెషీన్‌లో వేస్తాడు. మెషిన్ ఇచ్చిన రిపోర్టు చూసి, అక్కడే కుప్పకూలిపోతాడు. కాస్త అతిశయంగా అనిపించినా, పూర్తిగా అసాధ్యమని తోసిపుచ్చలేము. మన జీవితాల్లోకి దూసుకువస్తున్న టెక్నాలజీతో ‘టెక్కు-నాలజీ’ కథలో సూచించినట్టు కొంతైనా జరిగే అవకాశం ఉంది.

ఈ సంపుటిలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ ‘ముసలమ్మ సాహసం’. రెండు పేజీల కథే అయినా, నిస్పృహ నిండిన జీవితాలకు ప్రేరణనిస్తుంది. కొడుకు, కోడలు వ్యవసాయంలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటారు. మిగిలిన మనవడిని తమ పల్లెటూరికి దూరంగా పట్నంలో హాస్టల్‌లో ఉంచి చదివిస్తుందామె. ఓ రోజు ఆమెకి ప్రమాదం ఎదురైతే, ధైర్యంతోనూ, చాకచక్యం తోను దాన్ని ఎదుర్కుంటుంది. ‘ధైర్యమే అస్త్రంగా కాలాన్ని శాసించు’ అన్న రచయిత మాటలు ఎంతో వాస్తవం!

“డబ్బొచ్చేటప్పుడు డబ్బే అగుపిస్తాది. దాంతోని రహస్యంగా చాలా వస్తాయి” అంటూ ఓ ముసలి వాచ్‌మన్ చెప్పిన కఠిన వాస్తవం గురించి ‘గౌరవం’ కథ చెబుతుంది. నడమంత్రపు సిరి ఎన్నో వ్యసనాలను దరిచేర్చి, గౌరవాన్ని దూరం చేస్తుందని ఈ కథ చెబుతుంది.

చదువు, సమయస్ఫూర్తి, లోకజ్ఞానం, సీనియర్స్ నుంచి నేర్చుకున్న పాఠాలు, తల్లి చెప్పిన జీవన సూత్రం అన్నింటినీ సమన్వయం చేసుకుని – తనకెదురైన ఓ సమస్యని అత్యంత సులువుగా పరిష్కరించుకుంటుందో ఆధునిక యువతి ‘క్లిష్ట సమయం’ కథలో.

‘గర్వభంగం’ ఓ తెలివైన రిటైర్డ్ టీచర్ కథ, డబ్బు తప్ప జ్జానం దక్కని ఓ మూర్ఖపు విద్యార్థి కథ. మాస్టారుగారిని దెబ్బతీద్దామని వెళ్ళి, ఎదురుదెబ్బ తినొచ్చిన మందమతి ఆ శిష్యుడు.

తోటివారి ఆకలి తీర్చడానికి వీలైనంత ప్రయత్నించే తండ్రిని ఆయన కొడుకులు ఎగతాళి చేస్తుంటారు. రోడ్డు మీద బిచ్చగాళ్ళకి డబ్బులిస్తే, బెగ్గింగ్ మాఫియాని ప్రోత్సహిస్తున్నట్లే అంటుంది పెద్ద కోడలు. ఓ రాత్రి అనుకోకుండా వర్షంలో చిక్కుక్కున్న చిన్నకొడుకు బాగా ఆకలితో ఇంటికి బయల్దేరుతాడు. దారిలో ఓ బిచ్చగత్తె ఆకలి అని అడుక్కుంటే, ఆమెను కసురుకుంటాడు. ఇల్లు చేరాకా మెట్లు ఎక్కబోతూ, వాట్సప్ మెసేజ్‌లు చూసుకుంటాడు. ఆ పూట ఏమీ వండలేదనీ, పిల్లలకి పిజ్జా తెప్పించి పెట్టాననీ, అతన్ని బయట ఏదైనా తినేసి రమ్మని భార్య మెసేజ్ చేస్తుంది. చిరాకుతో పైకి వెళ్ళకుండా, అమ్మవాళ్ళింటికి వెళ్తాడు. కొడుకుని చూస్తూనే ఆకలి మీదున్నాడని గ్రహిస్తుంది తల్లి. ఇంట్లో ఉన్న కొద్దిగా అన్నంలో ఆవకాయ కల్పి ఇస్తుంది. ‘ఆకలి గురించి ఓ తల్లికి తెలుస్తుంది, ఓ రైతుకు తెలుస్తుంది’ అని తల్లిదండ్రుల గురించి అనుకుంటాడు. మళ్ళీ ఇంటికి వెడుతూ, దారిలో, ఇందాక కనబడ్డ బిచ్చగత్తె మళ్ళీ కనబడితే, ఆమెకి యాభై రూపాయలు ఇచ్చి వెడతాడు ఆ ‘రైతుబిడ్డ’.

భగవంతుడు ఎక్కడ ఉంటాడో, అక్కడే ఎందుకుంటాడో చక్కగా చెప్పిన చిన్న కథ ‘దేవుని తావు’. సాటి మనిషిలో దేవుడిని చూస్తే, నీ హృదయంలోని దేవుడు నీకు కనబడతాన్న సూచన చేస్తుందీ కథ.

‘ఈ ఐస్‌తో కిక్కే కిక్కు’ కథ, తోటి మనుషుల వ్యసనాలని సొమ్ము చేసుకునేందుకు జనాలు ఎంతకైనా దిగజారుతారని చెబుతుంది. రెండు ఊర్ల మధ్య చిన్న అడవి లాంటి ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఆ రోడ్డు మీదుగా వెళ్ళే లారీల డ్రైవర్లు రాత్రుళ్ళు అక్కడ ఆపుకుని, ఆసుపత్రి వెనకాల ఉన్న గుబురుచెట్ల క్రింద మద్యం సేవిస్తారు. కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళకి మందులోకి ఐస్ కావాలి. అంత రాత్రి పూట ఐస్ ఎక్కడ దొరుకుతుంది? లారీ డ్రైవర్ల మద్యపానం వ్యసనాన్ని సొమ్ము చేసుకుంటాడో ఆసుపత్రి ఉద్యోగి! ఈ ఉదంతాన్ని కనిపెట్టి వీడియో తీసి తన ఛానెల్‌లో పెట్టి పబ్లిసిటీ పొందుతాడు ఓ యూట్యూబర్‌.

ఈ సంపుటికి శీర్షికగా నిలిచిన కథ – ఎ‘ఫైర్’. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు, పెద్ద వయసులో గర్భవతైన తమ తల్లి గురించి మాట్లాడుకుంటారు. తండ్రి ఎప్పుడో చనిపోయాడు, మరి ఇప్పుడు తల్లి ఎవరి వల్ల గర్భవతైందో వాళ్ళకి అర్థం కాదు. కథ ఎక్కువగా సంభాషణల ద్వారా నడుస్తుంది. సంభాషణల్లోనే, ఇతివృత్తానికి తగిన నేపథ్యాన్నీ నింపారు. టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా పట్ల ఏవగింపునీ, డాన్స్‌ షోల పేరిట పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోడం; సమాజంలో క్షీణిస్తున నైతిక విలువ గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తారు. ‘కారకుడెవరో కనుక్కోబోయావా’ అంటుంది చెల్లి. “బుద్ధుందా, అవన్నీ ఏమైనా మాట్లాడే విషయాలా? అదీ ఎవరితో, అమ్మతో” అంటుంది అక్క. అదే అక్క కాసేపటి తర్వాత “ప్రేమ కాదు కానీ.. అలాంటిదే ఏదో అయ్యుంటుందని అనుకుంటున్నా” అంటుంది. మరుసటిరోజు ఉదయం మళ్ళీ మాట్లాడుకుంటూ చెల్లెలు అమ్మ పట్ల సానుభూతి చూపితే, అక్క మాత్రం కరకుగా మాట్లాడుతుంది. రకరకాలుగా మాట్లాడుకుని, చివరికి అమ్మతో మాట్లాడదామని ఆమెకి ఫోన్ చేస్తారు. ఆమె నెంబరు కలవదు. “ఆప్‌కె ద్వారా డయల్ కియా గయా నంబర్ అభి ‘వ్యర్థ్’ హై” అని వస్తుంది. రచయిత తమ మార్క్‌ని ఇక్కడ చూపించారు. మామూలుగా అయితే, మనం ఫోన్ చేసినప్పుడు ఎదుటి వారి ఫోన్ ఎంగేజ్‌లో ఉంటే, ఆ మెసేజ్ వస్తుంది. కానీ అందులో “నెంబర్ ‘వ్యస్త్’ హై” అని అంటారు. అంటే బిజీగా ఉంది అని అర్థం. కానీ రచయిత “నంబర్ అభీ ‘వ్యర్థ్’ హై” అన్నారు. ఇక ఆ నెంబర్‌కి ఫోన్ చెయ్యడం వ్యర్థం అని సూచించారేమో అనిపిస్తుంది. ఈ కథ జవాబులు లేని ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ కథ గురించి రచయిత ఏం చెప్పారో, ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవండి.

ఉద్యోగంలో అధికారిణి హోదాలో ఉన్న ఓ మహిళకీ, ఆమె ఇంటికి పనికి వచ్చే మరో స్త్రీకి మధ్య జరిగిన కథ ‘అభిజాత్యం’. మెయిడ్ స్వభావాన్ని తక్కువ అంచనా వేస్తుంది. ఆమెకు అన్ని విషయాలు తెలుసునని హేళన చేస్తుంది. ఆత్మాభిమానంతో, ఉన్నంతలో తృప్తిగా బ్రతుకు నడుపుతున్న ఆమె పద్ధతి అధికారిణికి నచ్చదు. తమ మంచితనాన్ని ప్రదర్శించుకుందామంటే, అవకాశం దొరకదు. ఒకరోజు మెయిడ్ పనికి రాదు. మొదట తిట్టుకున్నా, చివరికి ఓ అయిడియా వస్తుంది. మెయిడ్ ఇంటికే వెళ్ళి కారణం కనుక్కుంటే, బెటర్ అనుకుంటుంది. తీరా బస్తీలో ఆమె ఇల్లు కనుక్కుని వెళ్ళేసరికి, ఆమె ఇంట్లో ఉండదు. ఆమెకీ, భర్తకీ కూడా జ్వరమని తెలుస్తుంది. మీరెవరని భర్త అడిగితే, తన అపార్ట్‌మెంట్ పేరు, ఫ్లాట్ నెంబర్ చెప్పగానే, అతను గుర్తుపడతాడు. ‘మీ మంచితనం గురించి మా ఇంటామె బాగా చెప్తుండండీ’ అంటాడు. మందులకి అవసరమవుతుందేమో డబ్బివ్వబోయి, ఏదో గుర్తొచ్చి ఆగిపోయి, వెనుదిరుగుతుంది.

ఉద్యోగంలోని ఒత్తిడిని తప్పించుకోడానికి, రీఛార్జ్ అవటానికి, జాబ్‌కి రిజైన్ చేద్దామనుకుంటాడో వ్యక్తి. తన ఆప్త మిత్రుడితో చెప్తాడు. మరోసారి ఆలోచించుకోమంటాడతను. ఓ ఏడాది తర్వాత మళ్ళీ కలుస్తారు. మొదటి మిత్రుడు కాస్త లావయినట్టు గమనిస్తాడు రెండో మిత్రుడు. పెద్దగా క్వాలిటేటివ్ వర్క్ ఏదీ చేయలేదని కూడా గ్రహిస్తాడు. అప్పుడు అతనికి ఓ ఆలోచన వస్తుంది. ‘పెట్టుబడి నేను పెడతాను, కార్యాచరణ నీది’ అంటూ మిత్రుడితో ఒక ప్రతిపాదన చేస్తాడు. ఫలితంగా కొత్త రకం వ్యవసాయం లోకి దిగుతారు. రైతుల్లో స్ఫూర్తి నింపుదామనుకుంటారు. వారి ప్రయత్నాలు ఫలించాయో లేదో తెలియాలంటే ‘ప్రకృతి – వికృతి’ కథ చదవాలి. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాని కొంత స్ఫురింపజేస్తుందీ కథ.

అపరిచితుడిని, అపరిచితుడిగానే ఉంచాలని, అతనిలోని మరో కోణం తెలుసుకోకుండా ఎవరికీ పరిచయం చేయకూడని చెప్తుంది ‘అపరిచితుడు’ కథ. తనని సానుకూలం ప్రభావితం చేసి మారేలా చేసిన మనిషి, అత్యంత దుర్గార్ముడనీ, తనతో ప్రదర్శించిన అతనిలోని నటనా వైదుష్యమనీ తెల్సి విస్తుపోతాడు మారిన మనిషి.

~

కథల్లో పాత్రలకి పేర్లు లేవు, అతను, ఆమె అనో నేను అనో సాగిపోతాయి. పాఠకులను తికమకకి లోను చేయకుండా సర్వనామ వాచకంలో కథ నడపడం అంత సులువు కాదు. ఆ ఒడుపు తెల్సిన రచయిత దేశరాజు.

పుస్తకం పేరు ‘ఎఫైర్’ (Affair) అని పెట్టినా, దానిని ‘ఎ ఫైర్’ (A Fire – ఒక నిప్పుకణిక) అని కూడా ధ్వనించేలా మలిచారు రచయిత. సమాజంలో అపసవ్యంగా సాగుతున్న వ్యవహారాలపై (Affairs) ఒక నిప్పుకణికల్లా (Fire) ఈ కథలు చురకలు వేస్తాయని శీర్షిక సూచిస్తుంది.

***

ఎ‘ఫైర్’ (కథా సంపుటి)
రచన: దేశరాజు
ప్రచురణ: దారా మీడియా, హైదరాబాద్
పేజీలు: 107
వెల: ₹ 200/-
ప్రతులకు:
దారా మీడియా హైదరాబాద్
ఫోన్: 9110569542
~
దేశరాజు
ఫోన్‌: 9948680009
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా క్రాస్‌రోడ్, హైదరాబాద్.

ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Affair-Telugu-Stories-Desaraju/dp/B0GD76G1MJ

~
దేశరాజుగారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-desaraju/

Exit mobile version