Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవించడానికి దొరకని ప్రేమకై జరిపే అన్వేషణని ప్రతిబింబించిన పాట ‘ఆఫ్టర్ ది ఫైర్ ఈస్ గాన్’

[లోరెట్టా లిన్, కాన్వే ట్విట్టి పాడిన ‘ఆఫ్టర్ ది ఫైర్ ఈస్ గాన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

కంట్రీ సంగీత చరిత్రలోనే అత్యంత విజయవంతమైన డ్యూయెట్ గాయకులలో కాన్వే ట్విట్టి, లోరెట్టా లిన్‌ల జంట ముందు వరుసలో నిలుస్తుంది. వీరిద్దరూ కలిసి పాడిన పాటలన్నీ స్త్రీ పురుషుల సంబంధాలు, అనుబంధాల చుట్టూ తిరుగుతాయి. 1970 నుండి 1980ల ప్రారంభ కాలం వరకు విస్తరించిన వీరి సహకారం, 10 స్టూడియో ఆల్బమ్‌లు, 13 సింగిల్స్, వరుసగా ఐదు బిల్బోర్డ్ నం. 1 కంట్రీ హిట్లను అందించింది. ఇద్దరి గాత్రాలలో సారూప్యత ఉండడం, ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకే స్థాయిలో ఆ పాటలను పాడి అలరించడంతో వీరి జంటకు కంట్రీ మ్యూజిక్‌లో ప్రత్యేక స్థానం ఉంది.

‘ఆఫ్టర్ ది ఫైర్ ఇస్ గాన్’ ఎల్. ఈ వైట్ రచించిన గీతం. దీనిని లోరెట్టా లిన్, కాన్వే ట్విట్టి ఒక యుగళగీతంగా రికార్డు చేశారు. జనవరి 1971లో, ‘వీ ఒన్లీ మేక్ బిలీవ్’ అనే LP ఆల్బమ్ నుండి విడుదలైన ఏకైక సింగిల్‌గా ఇది వెలుగు చూసింది. ఈ పాటతో ఈ జంట అమెరికా కంట్రీ చార్టులో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. వారిద్దరికీ మొట్టమొదట ఆ విజయాన్ని అందించిన గీతం ఇదే. ఇది రెండు వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగి, మొత్తం 14 వారాల పాటు ఆ చార్టులో చోటు దక్కించుకుంది. బిల్బోర్డ్ హాట్ 100 చార్టులో, ఈ సింగిల్ 56వ స్థానాన్ని చేరుకుంది. అంతేకాకుండా, ‘బెస్ట్ కంట్రీ ఫర్మామెన్స్ బై ఏ డ్యుయో ఆర్ గ్రూప్ విత్ వోకల్’ విభాగంలో ఈ పాట గ్రామీ అవార్డ్‌ను కూడా గెలుచుకుంది.

కంట్రీ గీతాలలో సాధారణ ప్రజల జీవితాల నుండే కథనాలు తీసుకుని ఆ భావోద్వేగాలను చాలా నిజాయితీగా వ్యక్తీకరిస్తారు గాయకులు. ఇందులోని కథనాలన్నిటిలోనూ సాధారణమైన మనుష్యులు కనిపిస్తారు. అర్థం కాని ఉదాత్తత, భయం గొలిపే విశిష్టతలు కాకుండా, మానవ బలహీనతలు, చిన్ని చిన్ని కోరికలు, జీవిత పాఠాలు, జీవితంలో జరిగిన తప్పులు, వీటి మధ్య నలిగిపోతున్న జీవితాలు కనిపిస్తాయి. ఎంతో అసహాయత, కొంత ఇష్టం ఎంతో కష్టం కలగలిసిన జన జీవితాలు అందులో దర్శనమిస్తాయి. గొప్ప దైవత్వం కాకుండా సాధారణ ప్రజానీకం కనిపించి ఆ పాటలన్నీ రక్తమాంసాలున్న అతి మామూలు జీవుల జీవిత సారాలని అనిపించడం వల్లే ఈ పాటలకు ఈ నాటికీ ప్రత్యేక అభిమానులున్నారు.

ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకున్నారు. కాని కుదరలేదు. సర్దుకుపోయి తమ జీవితంలోకి వచ్చిన వేరొకరిని వివాహం చేసుకున్నారు. ఎన్నోకలలతో కొత్త జీవితాలను మొదలెట్టారు. అయితే వారి జీవిత భాగస్వాములు వీరి జీవితాలను గందరగోళంతో ముంచేసారు. వైవాహిక జీవితంలో ప్రేమ లేదు, జీవితం నిస్సారంగా సాగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ పాత స్నేహితులు తిరిగి తమ బంధం కొనసాగిస్తారు. వారికి తెలుసు తాము కలుసుకోకూడదని, కాని ఆ కలయిక వారు పోగొట్టుకున్న ఆనందాన్ని గుర్తు చేస్తుంది. ఇంట్లో జీవితం అనాసక్తిగా సాగుతుంది. కాస్త ఓదార్పు, కొంత ఆనందం కొంత ఆహ్లాదం కోసం ఇద్దరూ తపించి పోతూ ఉంటారు. దానికోసం మళ్ళీ మళ్ళీ కలుస్తారు. కలిసి ఆనందాన్ని, విషాదాన్నీ అనుభవిస్తారు. తమ జీవితాలు ఎందుకిలా ఉన్నాయన్న బాధ, ప్రేమ లేని బంధాలలోని ఉక్కపోత వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాము చేసున్న పని వారికి ఇష్టమయింది కూడా కాదు. ఇక మళ్ళీ కలవద్దు అని ఇంటికి తిరిగి వెళతారు. కాని మళ్లీ మళ్ళీ కలవక తప్పదు.

ఇలాంటి బంధాలలో తెగింపు ఉండవచ్చు. కాని దాన్ని అంటుకుని విషాదం కూడా ఉంటుంది. వారికి కావల్సిన ప్రేమ తమ జీవిత భాగస్వామి దగ్గర దొరికితే ఈ తప్పు వాళ్ళు చేసేవారే కాదు. ఏ ఆనందం లేని తమ జీవితాలకు ఈ దొంగ ప్రేమ ఆలంబన అవడం వారు కోరి చేసినది కాదు, అది నిస్సహాయతలోనించి వచ్చిన మార్గం.

వివాహేతర సంబంధాలకు కారణమయిన ఆ అసహాయతను అద్భుతంగా పలికించే గీతం ఇది. నిజానికి ఆ జంట ఆ స్థితికి రావడానికి కారణం అయిన ఆ పరిస్థితుల వైపుకు శ్రోతలు ఆలోచించేలా చేసే విధంగా అతి విషాదంగా లోరిట్టా లిన్, కాన్వే విట్టి గానం చేసిన విధానం అత్యద్భుతం. వివాహేతర సంబంధాలలోని ఆసక్తి కలిగించే శారీరిక బంధాలు, కోరికలను దాటి వారు అనుభవించే ఒంటరితనం, ప్రేమరాహిత్యం, తోడు లేని గానుగెద్దు జీవితం వారిని ఎలాంటి దారిలోకి తీసుకొచ్చిందో స్పష్టంగా అర్థం అవుతుంది.

సమాజంలో ఓ సమస్య ఉన్నప్పుడు, అంతకంతకూ దాని తీవ్రత పెరుగుతున్నప్పుడు ఈ సమస్య మూలాలలోకి వెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కాని ఓ సంఘటనకు సంబంధించిన విస్పోటక ఉత్సాహం వరకే పరిమితమై మానవ సంబంధాలను ఇంకా సంక్లిష్టం చేసుకుంటుందీ సమాజం. వివాహేతర బంధాలకు కారణం వివాహ వ్యవస్థలోని లోపం, ఆ వ్యవస్థను తమ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునే వ్యక్తుల స్వార్థం. ఆ దిశగా ఆలోచించేలా గానం చేసిన ఈ పాటలో ఆ ఇద్దరి గాయకులు పలికించే విషాదాన్ని విని అనుభూతి చెందాలి తప్ప అదే లోతుతో వర్ణించలేం.

Love is where you find it
When you find no love at home
And there’s nothin’ cold as ashes
After the fire is gone

(ప్రేమ అంటే అది దొరికే చోటు మాత్రమే. ఇంట్లో ప్రేమ లేకపోతే ఆ వెచ్చటి దగ్గరితనం మాయమయిపోతే మిగిలిన బూడిద మరణం అంత చల్లగా ఉంటుంది)

ఎంతో విషాదకరమైన వాక్యాలు ఇవి. ఇది స్త్రీ పురుషుల ప్రేమకు సంబంధించిన లోటుగా మాత్రమే అనుకోనక్కర్లేదు. ప్రేమకు అర్థం అది దొరికే చోటే. తల్లి తండ్రి భార్యా, పిల్లలు, ప్రియురాలు వీళ్ల ప్రాముఖ్యత జీవితంలో పెరిగేది, వారితో అనుబంధం బలపడేది వారి దగ్గర దొరికే ప్రేమ ఆధారంగానే. ప్రేమ ఎక్కడో ఉండదు, మనల్ని ప్రేమించే వారి దగ్గరే ఉంటుంది. అది జీవిన సహచరులు ఇస్తే అదృష్టమే. లేకపోతే ఆ జంటల మధ్య మిగిలేది అవసరం, అలవాటు తప్ప ప్రేమ కాదు. అందుకే ప్రేమ అంటే అది దొరికే చోటు మాత్రమే అని చెప్తుంది ఈ పాట. ఇంట్లో ఆ వెచ్చటి ప్రేమ, ఆ దగ్గరతనం, నీను నేనున్నాను అనే భరోసా లేకపోతే ఆ ఇల్లు శ్మశానంలా ఉంటుంది. ఆ చల్లదనం కాలిన బుడిదను గుర్తుకు చేస్తూ భవిష్యత్తే లేని బంధంలోని మరణాన్ని అనుభవంలోకి తీసుకువచ్చి మనుషుల్ని ఉక్కిరి బిక్కి చేస్తూ ఉంటుంది.

The bottle is almost empty
The clock just now struck ten
Darlin’ I had to call you
To our favorite place again

(సీసా ఇంచుమించు ఖాళీ అయిపోయింది. గడియారం ఇప్పుడే పది గంటలు కొట్టింది. ప్రియతమా నిన్ను మనకిష్టమైన చోటుకు పిలవక తప్పలేదు నాకు)

అతను ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు. సాయంత్రం అంతా తాగుతూనే ఉన్నాడు. సీసా ఖాళీ అయిపోయింది. రాత్రి పదయ్యింది. అయినా లేవలేకపోతున్నాడు. తోడు కావాలనిపిస్తోంది. ఇల్లు భయపెడుతోంది. అందుకే తన ప్రేయసిని తామిద్దరికీ ఇష్టం అయిన ఆ చోటుకు రమ్మని పిలిచాడు. తనను తాను నియంత్రించు కోలేకపోతున్నాడు. అతని జీవితంలో అతనికి లభించే ఆనందం ఆమె సాంగత్యం మాత్రమే.

We know it’s wrong for us to meet
But the fire’s gone out at home
And there’s nothin’ cold as ashes
After the fire is gone

(మనిద్దరికీ తెలుసు ఇలా కలవడం తప్పని, కాని ఇంట్లో ఆ వెచ్చదనం కరువైంది. ప్రేమ లేని ఆ ఇంట కాలిపోయిన బూడిద తప్ప మరేమీ లేదు. ఆ చల్లదనం భరించడం సాధ్యం కావట్లేదు)

పై చరణం పాడేటప్పుడు లోరెట్టా గొంతులో విషాదం మనలోకి పాకుతుంది. ఇద్దరికీ తాము ఇలా కలుసుకోవడం తప్పని తెలుసు. కాని తమ ఇంట్లోని వాతావరణం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వారి ఇంట మరణించిన ప్రేమ నింపిన ఆ చల్లదనం వారిని భయపెడుతుంది. వెచ్చని ప్రేమ కోసం అర్రులు చాచుతున్నారు, దాని కోసం ఆ తప్పు చేస్తున్నారు.

Love is where you find it
When you find no love at home
And there’s nothin’ cold as ashes
After the fire is gone

(ప్రేమ అంటే అది దొరికే చోటు మాత్రమే. ఇంట్లో ప్రేమ లేకపోతే ఆ వెచ్చటి దగ్గరితనం మాయమయిపోతే మిగిలిన బూడిద మరణం అంత చల్లగా ఉంటుంది)

రెండోసారి వచ్చే ఈ పల్లవిలో ఆ జంట మధ్య నడిచే కథలో అసహాయతపాలు ఎక్కువగా వినిపిస్తుంది. ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు కూడా ప్రేమ లేని ఆ ఇంటిని గుర్తు చేసుకోలేక పోతున్నారిద్దరు. ఇంటిని వదిలి ఏవో ఆనందాలను పోందాలన్న ఉత్సాహం కాక జీవించడానికి దొరకని ప్రేమకై వెతుకులాట ఇందులో ప్రతి పదంలోనూ వినిపిస్తుంది. ఆ ప్రేమే వారికి తమ ఇంట దొరికితే ఈ రహస్య సమావేశాలు ఉండేవి కావు కదా అన్న ఆలోచన అనాలోచితంగానే మన మనసుల్లో కలుగుతుంది. అదే ఈ పాట ఉద్దేశం కూడా.

Your lips are warm and tender
Your arms hold me just right
Sweet words of love you remember
That the one at home forgot

(నీ పెదాలు వెచ్చగానూ సున్నితంగానూ నన్ను స్పృశిస్తున్నాయి. నీ చేతులు నాకు సరిగ్గా కావల్సిన విధంగా చుట్టుకున్నాయి. ఇంట ఉన్న అతనికి గుర్తులేని తీపి ప్రేమ సంభాషణలు నీకు గుర్తున్నాయి)

స్త్రీ పురుషునితో ఏర్పరుచుకున్న బంధంలో అనుభవించాలనుకునే భద్రత, ఓదార్పు లోపించినప్పుడు ఆమె జీవితంలో శూన్యం ఆవహిస్తుంది. ఇక్కడ వారి కలయికలో సెక్స్ ప్రదానం కాదు. సున్నితత్వం మరచి, ప్రేమకు సమయాన్ని వెతికి పట్టుకోవాలనే ఆలోచన లేని భర్తతో ఆమె జీవితం ఎడారిలా ఉంది. కేవలం శరీర వాంఛ తీర్చుకోవడానికి ఆమె అక్కడకు రావట్లేదు. అతను చేసే ప్రేమ సంభాషణలు, తనను సున్నితంగా చూసుకునే పద్దతి, ఇలాంటి అనుభూతుల కోసం అతని సాంగత్యాన్ని ఆమె కోరుతుంది. బంధం యాంత్రిమయి ఒకరికొకరు అలవాటయిపోయి నిస్సారంగా గడిపే జీవితాలు ప్రేమ కోసం ఎంత తహతహలాడతాయో వివరించే చరణం ఇది. ఇలాంటి సందర్భాలు జీవితంలో ఎదురవకుండా ఉండాలంటే జీవిత భాగస్వామితో పంచుకోవలసిన దగ్గరితనాన్ని యాంత్రికం చేసుకోకుండా ఉండవలసిన అవసరం స్త్రీ పురుషులిద్దరిదీ కూడా. ఆ అవసరమే వారిని తప్పు వైపుకు నెడుతుంది. ఇలాంటి సంబంధాలకు కారణం అవసరం, అసహాయత తప్ప కోరిక ఎంత మాత్రమూ కాదనే భావాన్ని అంతర్లీనంగా ఈ చరణం వివరిస్తుంది.

Each time we say is the last time
But we keep hangin’ on
And there’s nothin’ cold as ashes
After the fire is gone

(ప్రతీ సారి ఇది ఆఖరి సారి అని చెప్పుకుంటాం. కాని మళ్ళి మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ప్రేమ వెచ్చదనం లేని ఆ చల్లదనాన్ని భరించడం కష్టం)

ఈ వాక్యాలలో వారి అవసరం, జీవితంలోని లోటుని పూరించుకోవడానికి ఆ ఇద్దరూ చేసే అసహాయ ప్రయత్నం కనిపిస్తుంది. ఆ జంట పట్ల జాలి కలిగించే వాక్యాలు ఇవి.

Love is where you find it
When you find no love at home
And there’s nothin’ cold as ashes
After the fire is gone

(ప్రేమ అంటే అది దొరికే చోటు మాత్రమే. ఇంట్లో ప్రేమ లేకపోతే ఆ వెచ్చటి దగ్గరితనం మాయమయిపోతే మిగిలిన బూడిద మరణం అంత చల్లగా ఉంటుంది)

ఈ పాటను గానం చేసిన విధానమే ఇందులోని విషయం పట్ల సహేతుకమైన ఆలోచనలను కలిగిస్తుంది. వివాహ వ్యవస్థలోని మోనోటొనీ, జీవితం పట్ల అవగాహన లేమి, మనిషిని ఎంత బలహీనపరుస్తాయో వివరించే గీతం ఇది. మానవ సంబంధాలలో నైతికత ముఖ్యం అని నమ్మేవారిని సైతం కరిగించే గీతం ఇది.

ఒక విషయాన్ని చర్చకు పెట్టేటప్పుడు విషయాన్ని ప్రస్తావించే విధానం దాన్ని ప్రజలు ఆమోదించే దిశగా తీసుకెళుతుంది. గాయకులకు తమ గొంతులో భావాలను పలికించే నేర్పుతో పాటు, ఆ పదాల నడుమ కేవలం భావ వ్యక్తీకరణతో సంభాషించగల చాతుర్యం ఉండాలి. అది మెండుగా ఉన్న ఈ ఇద్దరు కళాకారుల గానం ఈ పాటను అందరూ మెచ్చేలా చేసింది. ఇందులో వివాహేతర సంబంధాల పట్ల ఒప్పుదల ఉండదు. అలాంటి బంధాలకై ఉసిగొలిపే కారణాల దిశగా శ్రోతల అలోచనలను నెట్టే ప్రయత్నం ఉంది. తమ గాత్రంతో ఇందులో వాళ్లు పలికించిన విషాదమే ఈ పాటను గ్రామీ అవార్డు దిశగా నడిపించింది.

~

(ఈ పాట యూ ట్యూబ్ లింక్ ఇది.
https://www.youtube.com/watch?v=_7tQ4VPfzkE )

Exit mobile version