Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిర్బంధ కార్మికుల విషాదగాథ ‘అగమ్య గమ్యాలు’

[శ్రీ ముకుంద రామారావు గారి ‘అగమ్య గమ్యాలు’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]

బ్రిటిష్ వలస పాలకుల దురాశ వల్ల లక్షల మంది గ్రామీణ శ్రామికులు అమాయకంగా దళారులు, ‘గిర్మిటీ’ల మాటలు నమ్మి శాశ్వతంగా మాతృదేశానికి, కన్నవారికి దూరమై ఎన్నెన్నో ఇడుముల పాలైన చరిత్రను ఆత్మీయ మిత్రులు శ్రీ ముకుంద రామారావు ‘అగమ్య గమ్యాలు’ పుస్తకంలో చిత్రించారు. ఇదొక కరుణా రసాత్మకమైన కావ్యం, ప్రధాన స్రవంతి దృష్టికి రాని దీన గాథ, కొత్త దేశాలకు వెళ్ళి రెండు వందల ఏళ్ళ కాలంలో ఈ ‘కూలీల’ని పిలవబడిన శ్రామిక ప్రజలు పడిన అవస్థలు, గడిపిన జీవితం, క్రమంగా వాళ్ళు ఆయా దేశాల్లో స్థిరపడిన చరిత్రను ముకుంద రామారావు సాధికారికంగా ‘అగమ్య గమ్యాలు’లో గ్రంథస్థం చేశారు. పుస్తకం తెరిచిన తర్వాత పూర్తయ్యే వరకు పక్కన పెట్టబుద్ధి కాలేదు.

ఈ పుస్తకానికి జోహాన్సబర్గ్ విశ్వవిద్యాలయం అచార్యులు ప్రొఫెసర్ అశ్విన్ దేశాయ్ రాసిన పరిచయంలో “ఒప్పంద కార్మికులను ఇక్కడికి తీసుకొని వచ్చినపుడు పురుషులు మహిళల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నారు.. పురాతన దస్తావేజులు (పత్రాలు, రికార్డుల) ద్వారా ఒప్పంద ప్రక్రియ ఎలా మార్పు చెందుతూ వచ్చిందో వెల్లడవుతుంది” అని దేశాయ్ అంటారు. కరువు కాటకాలు, కులవివక్ష, పేదరికం, నిరుద్యోగం, మధ్యవర్తుల మోసపు మాటలు – ఈ కార్మికులు ఆయా దేశాలకు వలసలు వెళ్ళడానికి కారణాలు.

ముకుంద రామారావు తాతగారు, తాతగారి చెల్లెలు 1914లో ఒప్పంద కార్మికులుగా దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. తాతగారు తిరిగి రాగలిగారు గాని ఆయన సోదరి అక్కడే స్థిరపడ్డారు.

ఆంధ్ర దేశంలో ప్రధానంగా విశాఖ, శ్రీకాకుళం, సూళ్ళూరుపేట, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వలసలు వెళ్ళారు.

యూరోపు దేశాల వలసవాద చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం, ఈ విస్మృత చరిత్రను, దాదాపు మన నిరుపేదల శ్రమశక్తి దోపిడి, నూరేళ్ళకు పైగా సాగిన చరిత్రను ముకుంద రామారావు గ్రంథస్థం చేశారు. గ్రామీణ శ్రామికులు దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి అమాయకంగా ఓడలెక్కి సుదూర తీరాలలో, పేరు కూడా తెలియని కొత్త దేశాలకో, ప్రాంతాలకో వెళ్ళి చెరకు, కాఫీ తోటల యజమానుల చేతుల్లో బానిసల కన్నా హీనంగా చిత్రహింసలను అనుభవించారు. ఆ సముద్ర ప్రయాణాలు నరకద్వారాలు. ప్రతి ఓడ గమ్యం చేరేవరకు అనేకులు సరైన ఆహారం, వైద్యం లేక మరణించి సముద్ర జలచరాలకు ఆహారమయ్యేవారు.

ఇక ఈ శ్రామికులు అడుగు పెట్టిన దేశాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఆత్మహత్యలు, శీలం మీద అనుమానంతో హత్యలు జరిగాయి. తెల్లదొరల ఇంట్లో వంటవారుగా, ఆయాలుగా, సేవకులుగా మన శ్రామికులు అనేకానేక అవతారాలు ఎత్తారు. వీళ్ళు పని చేసే ప్రదేశాలు నిర్బంధ శిబిరాలుగా, బహిరంగ కారాగారాలుగా మార్పు చెందాయి. తోటల యజమానుల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగినా, నిర్బంధ కార్మికుల జీవితాల్లో మార్పేమీ లేదు.

ఈ విషాదగాథను, చరిత్రను ముకుంద రామారావుగారు, ఎంతో శ్రమకోర్చి, పరిశోధన చేసి, ‘అగమ్య గమ్యాలు’ పేరిట మన ముందుంచి, నూతన గవాక్షాన్ని మన ముందు తెరిచి, ఆ గాథలన్నింటినీ చూపించారు. ఇది ముకుంద రామారావు ఐచ్ఛికంగా, ప్రేమతో చేసిన పరిశ్రమ, పరిశోధన. “ముకుంద రామారావు ఒక దేశం కథ చెప్పడం కంటే ఎక్కువే చేశాడు” అని ప్రొఫెసర్ అశ్విన్ దేశాయ్ రామారావుగారి పరిశ్రమను ప్రశంసించారు.

తమ తాతయ్య, ఆయన చెల్లెలు, ఇంకా ఆ కుటుంబాలకు చెందినవారు చాలా మంది దక్షిణాఫ్రికా తదితర దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి ఖరగపూర్ (బెంగాల్) లో స్థిరపడినట్లు, తామూ అటువంటి కుటుంబానికి చెందినవారేనేని ముకుంద రామారావు చెప్పుకొన్నారు. తమ తాతయ్యలాగా “అనేక దేశాలకు రైతుకూలీలు గానో, కార్మికులు గానో వలసలు వెళ్ళిన వారి కష్టాలను, పరిస్థితులను పరిశోధించి ఈ అప్రియమైన సత్యాన్ని” గ్రంథస్థం చేశారు. కొందరు తాము అటువంటి శ్రామిక కుటుంబాలకు సంబంధించిన వారమని చెప్పుకోడానికి కూడా ఇష్టపడరనేది వాస్తవం.

1833లో బ్రిటిష్ ప్రభుత్వం బానిసత్వ నిర్మూలన చట్టం ఆమోదించినా, ప్రచ్ఛన్నంగా బానిస విధానం – ఒప్పంద శ్రామికుల విషయంలో అనేక రూపాల్లో అమలులో ఉండినది. బానిసత్వం రద్దయినపుడు చెరకు తోటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చినా “బానిసలకు మాత్రం ఎలాంటి పరిహారాన్ని ఇవ్వలేదు”. పైగా ఈ సమస్యకు తోటల యజమానులకు ‘నిర్బంధ కూలీలు’ అనే రూపంలో మరో రకమైన బానిస విధానం 20వ శతాబ్ది వరకూ కొనసాగింది. 13 లక్షలమంది భారతీయ శ్రామిలు వలస కూలీల ముద్రతో ఒప్పంద కార్మికులుగా బ్రిటిష్ సామ్రాజ్యపు మూల మూలలకు వలస వెళ్ళారు. ముకుంద రామారావు వారి దీన గాథలను ఈ ప్రస్తకంలో సాధికారికంగా రికార్డు చేశారు. పేదరికం, బాగుపడుతామన్న ఆశే వలసలకు అసలు కారణం.

అనేకమంది మన సమాజంలో పీడన నుంచి తప్పించుకోడానికి, అలాగే బహిష్క్రుతులు, పలాయితులు బాధాకరమైన కష్టతరమైన జీవితాన్ని, ఇష్టపడి సముద్రాలు దాటి ఏకాకులుగా, ఒంటరిగా వలసలు పోయారు. ప్రతి ఒకరికి ఒక విషాదగాథ, చరిత్ర, ‘దాచేస్తే దాగని సత్యం’ ఉండి ఉంటుంది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఈ పలాయితుల బ్రతుకు బాధలను గురించి ఒక వేదన మనసును పట్టి పీడిస్తూనే ఉంటుంది.

ఈ ఒంటరి మహిళలు కొత్త ప్రపంచాల్లో కొత్త భారతీయ భాగస్వాములను ఎంచుకోగలగడం ధనాంశం. దాదాపు నూరేళ్ళు ఈ శ్రామికులు ఆయా దేశాల్లో ధైర్యసాహసాలతో నూతన పరిస్థితులకు అలవాటవుతూ తోటల యజమానులకు లాభాలు గడించి పెట్టారు. దక్షిణ ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా, సెషెల్సు, మారిషస్, ట్రినిడాడ్, గయానా, గ్రెనెడా వరకు ఇరవై దేశాలు స్థిరపడి కొత్త సంస్కృతిని, జీవితాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. రికార్డులతో పాటు మౌఖిక సాహిత్యం, జానపద గీతాలు, కథల ద్వారా అనేక అంశాలు తెలుస్తున్నాయి. తేనెటీగలు తేనె సేకరించినట్లు చిన్న చిన్న విషయాలను కూడా సేకరించి, ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి సొంత నేలకు తిరిగి రాని ‘ఒప్పంద కూలీ’ల, శ్రామికుల జీవిత విషయాలను, చరిత్రను ఈ పుస్తక రూపంలో తెలుగు పాఠకులకు రామారావు సమర్పించారు.

అవసరం తీరాకా, స్థానికులు ఒప్పంద కార్మికులను పరాయివారుగా చూచి, తమ సమాజంలో కలుపుకోలేక పోవడం మరొక దురదృష్టం. కార్మికులను దూరదూరాలకు మోసుకొనిపోయిన ఓడల వివరాలు, ఏ ఏ రేవు నుంచి ఏ ఓడ ఎంతమందితో బయలుదేరి ఎంత కాలానికి, గమ్యస్థానం చేరింది కూడా రచయిత సాధికారికంగా ఇచ్చారు. ‘రూట్స్’ నవల వీరి ప్రయత్నం ముందు చాలా చిన్న ప్రయత్నం అని అనిపిస్తుంది. తెలుగు ప్రజలు ఏటా కార్మికులు – కడుపు చేతబట్టుకొని దేశంతరాలు వెళ్తున్న వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదని; ఒక ‘సామూహిక మరుపు’కు అలవాటయ్యారని, ఈ దురదృష్టవంతులను గుర్తుకు తెచ్చుకునేందుకు ఇష్టపడనట్లు ఉండిపోయారని రచయిత వ్యాఖ్య చదివినపుడు శూలంతో పొడిచినట్లనిపించింది! అవును! వారంతా వ్యాపారులా! సంపన్న పర్యాటకులా? ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలా! గుర్తుంచుకొని పట్టించుకోడానికి? సముద్ర కెరటాలకు ఓడల్లో వలసలు వెళ్ళినవారి కన్నీటి కెరటాలకు తేడా లేదని రచయిత వ్యాఖ్యానిస్తారు.

‘అగమ్య గమ్యాలు’ గ్రంథం మొదటి ఛాప్టరులో ఒప్పంద కార్మికుల వ్యవస్థ – నేపథ్యం వివరంగా ఉంది. రెండవ ఛాప్టరులో ఒప్పంద కార్మికుల వ్యవస్థలో బ్రిటిష్ వలసదేశాలు (ఖండాలు) గురించిన, భౌగోళిక, సాంఘిక పరిస్థితులు వివరంగా చెప్పారు. తర్వాతి విభాగాల్లో ఆయా దేశాల్లో వలస కార్మికుల విస్తృతమైన జీవిత వివరణ ఉంది.

బ్రిటిష్ వారు భారతదేశంలోని వ్యవసాయం, కుటీర పరిశ్రమలను నాశనం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రామికులు వలసలు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒప్పంద కార్మిక వ్యవస్థ మొత్తాన్ని రచయిత జైలుతో పోల్చారు. ఏ పరిస్థితుల్లో మహిళలు – ఒంటరిగా వెళ్ళవలసి వచ్చిందో, శ్రామికులు ఐకమత్యంగా ఉండడానికి వీల్లేని పరిస్థితులు, తోటల యజమానుల నక్కజిత్తులు, చిన్న చిన్న వివరాలతో సహా రామారావు ఇచ్చారు. అనుబంధ పట్టికల్లో ఏ ఏ దేశాలకు వలస కార్మికులు, ఎంతెంతమంది ఏ ఓడ రేవుల్లో బయలుదేరి వెళ్ళింది, ఆ ఓడల పేర్లు ఉన్నాయి. అరుదైన ఫొటోలు సేకరించి ఈ పుస్తకంలో చేర్చారు. పాత రికార్డుల్లో శ్రామికులకు గుర్తింపుగా ఇచ్చిన నంబర్లు తప్ప పేర్లు కూడా ఉండవట. వలస వెళ్ళి స్థిరపడినవారు సృష్టించిన సాహిత్యం, కవిత్వం, జానపద గీతాలు అన్నీ సమగ్రంగా ఇందులో ప్రస్తావిస్తారు.

పొగ ఓడలు రాక పూర్వం తెరచాప నౌకల్లో కలకత్తా నుంచి జమైకాకు 180 రోజులు పట్టేదట! పొగ ఓడలు వచ్చిన తరువాత ప్రయాణ కాలం, ప్రయాణంలో మరణాల సంఖ్య తగ్గాయట. ఎక్కువగా యువకుల్ని శ్రామికులుగా తీసుకొని వెళ్ళేవారు. అనేక దేశాల వారు వలస కార్మికుల సమగ్ర భోగట్టాను జాగ్రత్తపరచారు. ఆ జాబితాల జాడలు, ఆనవాళ్ళు లేని దేశం మనదొకటేనట! ఎంత అశ్రద్ధ!

రకరకాల కుయుక్తులు, కుట్రల ద్వారా, దుశ్చర్యల ద్వారా తోటల యజమానులు వలస కార్మికులు తమ మీద ఆధారపడేలా చేసేవారు. కార్మికులపై అదుపు సాధించడంలో ఇదొక ఆయుధం. కడుపు మండిన కార్మికులు విత్తనాలను, మొక్కల్ని నాశనం చేసి కావాలనే తోటల్లో అగ్ని ప్రమాదాల ద్వారా యజమానులకు నష్టం కలగించి కచ్చ తీర్చుకొనేవారు. తోటల యజమానులు కార్మికుల ఐకమత్యం నాశనం చెయ్యడానికి వేరు వేరు జాతుల శ్రామికులను నియమించేవారు. ఒప్పందం గుడువు తీరిన తర్వాత శ్రామికులు భారతదేశానికి తిరిగి వెళ్ళేందుకు తగినంత ఆర్థిక స్తోమత లేక, అక్కడే చేనో చెలకో కొని స్థిరపడేవారు.

ఒప్పంద కార్మికులు ఎదుర్కున్న మరొక తీవ్రమైన సమస్య భాషా సమస్య. దుబాసీలు ఎప్పుడూ యజమానులకు అనుకూలంగా వ్యవహరించేవారు. ఓడ ప్రయాణాల్లో, వలస వెళ్ళిన దేశాల్లోనూ చర్మరోగాలు, సంక్రమిత రోగాలు, కలరా వంటి వ్యాధుల బారిన పడి సరైన వైద్యం లేక మరగించేవారు. స్త్రీలు అదనంగా లైంగిక వివక్ష, వేధింపులు భరించవలసి వచ్చింది. దేశాంతరం వెళ్ళిన తమను మళ్ళీ భారతీయ సమాజం అంగీకరించదనే భయంతో స్త్రీలు తిరిగి భారతదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించలేదట! చైనా ఒప్పంద కార్మికుల కన్నా మన కార్మికులకు బ్రిటిష్ తోటల యజమాను ప్రాధాన్యత ఇచ్చారు. అది అభిమానంతో మాత్రం కాదు, ప్రశ్నించకుండా చెప్పింది చేస్తారని! అన్నిటికన్నా దుర్మార్గం సెలవు దినాల్లో శ్రామికులకు యజమానులు రేషన్ ఇచ్చేవారు కాదు. చిన్న పిల్లలకు తక్కువ రేషన్. ఆ దోపిడి ఎన్నో ప్రచ్ఛన్న రూపాల్లో ఉండేది.

వలసలు వెళ్ళిన భారతీయ కార్మికుల్లో రెండు లక్షల డెబ్బయిమూడు వేల మంది మాత్రమే స్వదేశానికి తిరిగిరాగలిగారు. మిగతావాళ్ళు కరేబియన్ ప్రాంతాలలో, గయానాలో ఉండిపోయారు. కులాల మధ్య పెళ్ళిళ్ళ వంటి విధానాల వల్ల సమాజంలో వలస కార్మికుల పునరేకీకరణ అసాధ్యం అయింది. ‘అనాగరిక పర్యాటకుల కథల వలె’ ఒప్పంద కార్మికుల కథలు మరుగున పడిపోయాయి. వలసలు అనేక సంస్కృతుల మీద, నాగరికతాత మీద ప్రభావాన్ని చూపాయి. ఆతిథేయ సమాజాల మీద ప్రభావం కలిగించాయి. ఒప్పంద కార్మికులు ఆయా దేశాలు, ప్రాంతాల అభివృద్ధికి చేసిన దోహదాన్ని రామారావుగారు అనేక చిత్రాలు, గణాంకాలు ద్వారా నిరూపించారు కూడా!

1834లో భారతీయ వలస కార్మికులను మొదటిసారి దిగుమతి చేసుకున్నా దేశం మారిషస్. చక్కెర పంటను విస్తరించడంతో మన శ్రామికుల వలసలు మారిషస్‌కు జోరుగా సాగాయి. 1839 కల్లా 25 వేల పై చిలుకు ఆ దేశానికి వెళ్ళారు. అక్కడ దారుణమైన పరిస్థితులు, పనిరాకపోయినా, అనారోగ్యం వల్ల పనికి వెళ్ళకపోయినా జైలు శిక్షలు. భారతీయ మహిళలు శ్వేత జాతీయుల ఇళ్ళలో ఆయాలుగా, పనివారుగా కూడా చేశారు. హింసాత్మకమైన ఒప్పంద విధానమే అయినా, క్రమంగా భారతీయ శ్రామికులు తోటల యజమానులయ్యారు. సుమారు ఐదులక్షల భారతీయ వలస కార్మికులు మారిషస్ ద్వీపంలో స్థిరపడ్డారు. నేడు మారిషస్ జనాభాలో మూడింట రెండు వంతులు భారత సంతతికి చెందినవారే. ఇప్పుడు మారిసష్ ‘ఆప్రవాసి ఘాట్‌’లో ఒప్పంద కార్మికుల మొదలు పాదముద్రలు పడిన చోట స్మృతి చిహ్నాలు కూడా ఏర్పాటయాయి. విశాఖ ప్రాంతాల నించి మారిషస్ వలస వెళ్లిన ఒప్పంద కార్మికులే అధికమట!

మారిషస్‌లో మన ఒప్పంద కార్మికులు, స్థానిక, పాలకుల, భారతీయ భాషాపదాలను మిశ్రమం చేసి ఒక కొత్త క్రియోల్ (నిర్వాసిత మిశ్రమ భాష)ని వాడుకలోకి తీసుకొని వచ్చారు.

ఇప్పుడు మారిషస్ స్వతంత్ర దేశం, దేశ పాలనలో మన వలస శ్రామికులకు భాగస్వామ్యం వుంది. వారి కవిత్వంలో, సాహిత్యంలో గతంలో తాము పడిన బాధలు, మాతృదేశం మీద ప్రేమ, ఆశ్రయమిచ్చిన దేశం మీద అభిమానం, కొత్త జీవితం అన్నీ ప్రతిఫలిస్తాయి.

బ్రిటిష్ పాలిత దేశం సెషెల్స్ (ఆఫ్రికా) లో వలస కార్మికులు ఫ్రెంచి, ఇంగ్లీషు పదాలతో ఒక క్రియోల్ భాషను వాడుక లోకి తెచ్చారు. పసిఫిక్ సముద్రంలోని బ్రిటిష్ వలసదేశం ఫిజీ లోను మన దేశం నుంచి తీసుకొని వెళ్ళిన వలస కార్మికులు అక్కడి పంచదార పరిశ్రమ విస్తరణకు కృషి చేశారు. స్త్రీ పురుషుల నిష్పత్తిలో చాలా తేడా వుండి, స్త్రీ పురుషులు సుఖరోగాల పాలయ్యారు, కుటుంబ జీవితం ఛిన్నాభిన్నమైంది. చిన్న నేరాలకు కూడా మన వాళ్లు కారాగారవాస శిక్షలు అనుభవించారు. మెథడిస్టు మిషనరీలు భారతీయల మహిళల జీవితాలను మెరుగుపరిచే కృషి చేపట్టారు. మొత్తం మీద ఆ ద్వీపంలో ఇండెంచర్ కార్మిక వ్యవస్థ 1920 కల్లా రద్దు చేయబడింది. వీరిని గురించి, ప్రవాసుల గురించి మన దేశంలో ప్రజలు క్రమంగా పట్టించుకోడం మానేశారు. వలసదారుల కృషి వల్ల ఫిజీ దేశం ఆర్థికశక్తి కేంద్రంగా మారింది. మహిళా కార్మికుల మీద జరిగిన అత్యాచార ఘటనలతో ఫిజీలో ఒప్పంద కార్మిక వ్యవస్థ రద్దయింది.

కరేబియన్ ఉత్తర అమెరికాలోని ట్రినిడాడ్, టొబాగో దేశాలలో ఆఫ్రికన్ బానిసత్వం పూర్తిగా రద్దయ్యాక, భారతీయ కార్మికులను తోటల యజమానులు ‘దిగుమతి’ చేసుకున్నారు. సూయజ్ కాలువ రాకముందు నౌకా ప్రయాణం సుమారు 320 రోజులు పైగా పట్టేది. ప్రయాణంలో చనిపోతే కెరటాలకు ఆహారమయ్యేవారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాల నుంచి ‘ఆర్కటీలు’ (దళారులు) శ్రామికులను సేకరించేవారు. కరువులు వలసలకు ప్రధాన కారణం. జనసాంద్రత మరొక కారణం.

రామారావు ఈ వలస కార్మికుల మీద అనేక రకాల అధ్యయనం చేసి, బ్రిటిష్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్ల కరవు కాటకాలు, తీవ్రమై, వలసలకు దారితీశాయని రాశారు. ఈ ప్రస్తకంలో స్త్రీల స్థితిగతులను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించారు. ట్రినిడాడ్‌కు వలస వెళ్ళిన వారిలో 20 శాతం మాత్రమే తిరిగివచ్చారు. మిగతా శ్రామికులు ఆ ద్వీపంలో స్థిరపడ్డారు. ట్రినిడాడ్‌లో మన గుళ్ళు, గోపురాలు, హోటళ్లు, విద్యాలయాలు, కళాశాలలు వెలశాయి. అక్కడ మనవాడు ప్రధాన మంత్రిగా కూడా ఎన్నికయ్యాడు. ఇంగ్లీషు నవలా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత వి. ఎస్. నైపాల్ ట్రినిడాడ్ వాడు. భారతీయ వారసత్వం, ట్రినిడాడ్ జీవన శైలి కలిసిపోయి, అక్కడి రచయితల రచనల్లో బాగా ప్రతిబింబించింది. ఏమైనా వలసలు వెళ్లిన వారి బ్రతుకులు కొత్త దేశాల్లో నిరంతర పోరాటమే. “స్త్రీల పరిస్థితి మరి చెప్పక్కరలేదు”.

మరో కరేబియన్ దేశం జమైకా. వాణిజ్య పంటల తోటల్లో పనికి బ్రిటన్, స్పెయిన్ వంటి దేశాలు బానిసలను అమ్మారు. 1838లో బానిసత్వం అంతరించి, తోటల వ్యవస్థ కూలిపోయింది. కరేబియన్ ద్వీపాలకు వెళ్ళిన ఒప్పంద కార్మికులు ‘ఈస్టు ఇండియన్స్’ పేరుతో గుర్తింపు పొందారు.

బెలిజ్ ఉత్తర అమెరికాలో మరొక బ్రిటిష్ వలసదేశం. ప్రథమ స్వాతంత్య సంగ్రామం తర్వాత అందులో పాల్గొన్న వెయ్యిమంది భారతీయ తిరుగుబాటుదారులను బెలిజ్ తోటలకు శ్రామికులుగా ఎగుమతి చేశారు. భారతీయ సంతతి ప్రజలు తమ మూలాలను కాపాడుకొంటూ ఆ దేశంలో స్థిరపడి వర్తక వ్యాపారాలు చేపట్టారు. ఇప్పటికీ వాళ్ళు రంగురంగుల దుస్తులతో కట్టూబొట్టుతో తమ సంప్రదాయలను కొనసాగిస్తున్నారు. డెమెరార (బ్రిటిష్ గయానా) కు సుమారు రెండున్నర లక్షల ఒప్పంద కార్మికులు పంపబడ్డారు. భారతీయి కార్మికులను ఇక్కడ దారుణంగా హిసించి, అణచివేశారు. గయనాలో శ్రామికుల దీనగాథల మీద చాలా సాహిత్యం వెలువడింది. రామారావు ప్రజలు పాడుకొనే పాటలను, ముద్రిత సాహిత్యాన్ని అనువదించి ఈ గ్రంథంలో ఉదాహరించారు.

ఏం పాపం చేశాం ప్రభూ!
ఈ కష్టాలు మాకిచ్చావు?
ఒక గయానా పాట.

గయానా ఒప్పంద కార్మికుల కొన్ని కవితల తెలుగు అనువాదాల్ని ఇందులో చేర్పారు.

దక్షిణ ఆఫ్రికాలో నటాల్ భూములు చెరకు పంటకు అనుకూలంగా ఉన్నాయని గ్రహించి బ్రిటిష్ వలసవాదులు నైపుణ్యంగల కార్మికులను – భారతదేశం నుంచి తీసుకొని వచ్చారు. 1916లో వలస కార్మికుల వ్యవస్థ రద్దయ్యేవరకూ, ఈ ప్రక్రియ నిరాఘటంగా కొనసాగింది. దాదాపు లక్షా ఏభైవేల పై చిలుకు శ్రామికులను కలకత్తా, మద్రాసు రేవుల నుంచి రవాణా చేశారు. నటాల్‍లో భూమి, సంపద, అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్న మధ్యవర్తుల మాటలు నమ్మి జనం ఓడలెక్కారు. తప్పుడు వాగ్దానాలతో బాటు భారతదేశంలో ‘ఒక రకమైన కులవ్యవస్థ’ నుంచి బయట పడాలనుకును వారు కూడా వలస వెళ్ళారు. తప్పుల తడకల గానైనా బ్రిటిష్ గుమాస్తాలు రూపొందించిన ఓడల, ఓడ ప్రయాణీకుల జాబితాలు ఇప్పుడు పరిశోధకులకు వలస వెళ్ళినవారి వివరాలు తెలుసుకోను ఆకరాలు అయ్యాయి. వలసలు వెళ్ళే శ్రామికులు తమ కళ్ళ ముందున్న ఆగాధమైన జలనిధిని ‘కాలాపానీ’, అంటే తిరిగి రాలేని నిర్బంధ జీవితాన్ని సూచించే నమ్మకంగా భావించుకున్నారు. స్థానికులు భారతీయులను శత్రువులుగా భావించారు తప్ప ఆదరించలేదు. నటాల్ వెళ్ళిన శ్రామికుల్లో స్త్రీలు దోపిడికి గురయ్యారు.. స్త్రీలు శ్వేత జాతీయుల ఇళ్ళల్లో ఆయాలుగా, వంటలక్కలుగా, కావలివారుగా రకరకాల పాత్రలు పోషించారు. మొత్తం మీద ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి జడిసి 1917లో ఒప్పంద కార్మికుల విధానం రద్దుపరచడంతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలలో గణనీయమైన భాగమయ్యారు. గుజరాతీ వ్యాపారులు వలసదారులు స్థిరపడిన దేశాల్లో విస్తరించి వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో వలసలు వెళ్ళిన భారతీయుల హక్కుల కోసం చేసిన పోరాటాలు జగద్విదితమే! నటాల్‌కు వలసలు వెళ్ళిన భారతీయుల మతం, కులంవారీగా అనేక ఆసక్తికర అంశాలు రచయిత ఇందులో ఇచ్చారు.

కాలం గడిచేకొద్దీ వలస వెళ్ళినవారికి భారతదేశంతో సంబంధాలు తెగిపోయాయి. దక్షిణాఫ్రికాలో జన్మించిన వారి శిశువులు మతాంతర వివాహాలు చేసుకొన్నారు. వారు మరల మాతృదేశానికి వెళితే అనేక అవమానాలు, కళంకాలు భరించవలసి వచ్చేది. గుజరాతీలు మాత్రం తమ ‘కుల స్పృహ’ని పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటించారు. ఇతరుల్లో కులస్పృహ అదృశ్యమైంది. కూలీలుగా ఇక్కడికి వస్తే కులాలను కోల్పోతారని ఒక అభిప్రాయం ఏర్పడింది. కొందరు ఒప్పంద కార్మికులు తోటల యజమానులు కూడా అయ్యారు.

రచయిత తమ తాతయ్య, నాయనమ్మల వివరాలు తెలుసుకొనేందుకు వెళ్ళి, ఆ క్రమంలో ఆ దేశానికి వలసవెళిన మొత్తం శ్రామికులు లక్షా ఏభైవేల మంది పైచిలుకు వివరాలు సేకరించి ఈ గ్రంథం రాయగలిగారు. ఆసక్తి వున్నవారు ఆంధ్రదేశంలో ఏ ఏ జిల్లాల నుంచి ఎంతమంది దక్షిణాఫ్రికా వెళ్ళారో, గణాంకాలతో సహా ఈ పుస్తకంలో చూచుకోవచ్చు.

తూర్పు ఆఫ్రికాలో కెన్యా నుంచి ఉగాండా వరకు రైలు మార్గాన్ని నిర్మించడానికి పాలకులు మన శ్రమశక్తినే నమ్ముకొన్నారు. 32 వేల శ్రామికులకు ఈ రైలు మార్గ నిర్మాణంలో ఉపాధి లభించింది. ఎందరో కార్మికులు సింహాల దాడిలో ప్రాణాలు విడిచారు. దోమకాటు, స్థానిక ఆఫ్రికా తెగల దాడుల్లో ఎన్నెన్నో ప్రమాదాలలో కార్మికులు చనిపోయినా, ఆరేడు సంవత్సరాల కాలంలో రైలు మార్గ నిర్మాణం పూర్తయింది.

ఫ్రెంచి, డచ్ దేశాలు కాంట్రాక్ట్ కూలీలను కరేబియన్ దీవులకు తీసుకొని వెళ్ళి తమ తోటల పనుల్లో పెట్టుకొన్నారు. ఒప్పంద కూలీ వ్యవస్థ ముగిసేనాటికి నాలుగు లక్షలమంది భారతీయులు ఆ దీవులకు వెళ్ళారు. వీరిలో ఎక్కువ మంది ఆ దీవుల్లోనే స్థిరపడ్డారు. కరేబియన్ దీవులకు ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచే వలసలు వెళ్ళగా, ఫ్రెంచి అధికారంలోని దీవులకు తెలుగు, తమిళం మాట్లాడేవారు వెళ్ళారు. తొలి రోజుల్లో దాదాపు నెలల ఓడ ప్రయాణం. వెళ్ళిన వాళ్ళు స్థానికుల నుండి, పాలక సామాజిక వర్గాల నుంచి వివక్ష ఎదుర్కుని క్రమంగా ఆ సంస్కృతి ఆచారాలకు మారారు. అయినా కొన్ని కొన్ని భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందిన అంశాలు వారి దైనందిన జీవితంలో మిగిలిపోయాయి. కరేబియన్ దీవులకు వెళ్ళిన భారతీయ శ్రామికులు ఐదు లక్షల మందిలో 1.75 లక్షల మంది స్వదేశానికి రాగలిగారు. మిగతావారు అక్కడే ఉండిపోయారు.

గ్రెనెడా (వెస్ట్ ఇండీస్ లోనిది) మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో, తర్వాత బ్రిటిష్ పాలన కింద వుండి, 1976లో సంపుర్ణ స్వాతంత్య్రం పొందింది. దాదాపు లక్షా ఏభై వేలమంది శ్రామికులను ఘనా, నైజీరియా నుంచి తీసుకొని వచ్చారు. గ్రెనెడాలో భారతీయుల సంఖ్య సుమారు పదివేలు మాత్రమే. భారతీయులు అక్కడి ఆఫ్రికన్లతో, యూరోపియన్లలతో వివాహాలు చేసుకొని ఆ జీవన స్రవంతిలో భాగమయ్యారు. క్రైస్తవం స్వీకరించి పూర్తిగా ‘ఆంగ్లీకరించ’బడ్డారు. ఇప్పుడ గ్రెనెడాలో హిందువులు, ముస్లింలు లేరు. శిలాజాల్లాగా తలనీలాలు తీయించడం, సాంప్రదాయిక భారతీయ వంటకాలు కొన్ని మిగిలిపోయాయి.

ఉత్తర అమెరికాలోని సెయింట్ లూసియాకు ఉత్తర భారతం నుంచి వలసలు సాగాయి. ‘చిన్న’ కులాలవారు, పేదరైతులు ఆర్థిక కారణాలతో డబ్బు కూడబెట్టుకొని తిరిగి రావాలనే వలసలు వెళ్ళారు. ఒప్పంద మహిళా కార్మికుల్లో భారతీయ మహిళలు వితంతువులు, మాజీ వేశ్యలు, ఒంటరి తల్లులు, వివాహ బంధం తెంచుకొని పారిపోయిన స్త్రీలు అధికం. వీళ్ళు 1891 నాటికి తమ పిల్లల కోసం ఆ దేశంలో కొన్ని ఇళ్ళు కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. లూసియాలో ఒప్పందకాలం పూర్తి చేసినా చాలామంది ఆర్థిక వనరులు వల్ల వెనక్కిరాలేక, క్రమంగా మత మార్పిడి జరిగి అక్కడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

ఉత్తర అమెరికాలోని శరొక దేశం సెయింట్ విన్సెంట్ జనాభాలో భారతీయులు ఐదుశాతం ఉన్నారు. తమ జీవిత విధానంలో చాలా భాగం స్థానిక పద్ధతులను అనుసరించినా, కొన్ని ఆచారాలు, వేషం, అలంకారాలను మాత్రం నిలుపుకోసాగారు. సెయింట్ కిట్స్ (ఉత్తర అమెరికా) కు వెళ్ళిన మన దేశ శ్రామికులు చాలా వరకూ క్రైస్తవం పుచ్చుకొని అక్కడి ప్రజల్లో కలసిపోయారు. మరొక వలస రాజ్యం నెవిస్‍లో ఇండెంచర్డ్ లేబరర్స్‌కు 1879లో స్వేచ్ఛ లభించింది. అయినా చాలామంది స్వేచ్ఛా శ్రామికులుగా అలానే ఉండిపోయారు. ఇరవై శాతం మాత్రమే స్వదేశానికి రాగలిగారు.

బ్రిటిష్ కాలనీలతో పాటుగా ఫ్రెంచి కాలనీలు కూడా భారతీయ కార్మికులను నియమించుకున్నాయి. ఈ కాలనీలలో స్థిరపడిన భారత సంతతివారు పూర్తిగా మాతృభాషను, దేశాన్ని, మతాన్ని విస్మరించారు. ఒక్క గ్వాడెలూప్‌లో మాత్రం స్థానిక ఆర్థిక వ్యవస్థలో కలసిపోయినా, భారతీయ సంప్రదాయాలను రక్షించుకోగలిగారు.

మారిషస్‌కు ఆఫ్రికాకు మధ్యన ఉన్న ‘రీయూనియన్’ ద్వీపం మరణశిక్ష పడిన ఖైదీలను పంపేందుకు కేటాయించినది. ఫ్రెంచివారు దాన్ని స్వాధీనం చేసుకొని చెరకు తోటల పెంపకానికి ఆఫ్రికా దేశం నుంచి బానిసలను తీసుకొని వచ్చారు. బానిసత్వం రద్దయిన తర్వాత భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులను తీసుకొని వచ్చారు. తెలుగు, తమిళ శ్రామికులను వలస పాలకులు క్రైస్తవ మతంలోకి బలవంతంగా మార్చినా, కొందరు రహస్యంగా స్వమతాన్ని ఆచరించారు. ఏమైనా కాలంతో పాటు వారి మాతృభాషలూ అంతరించాయి. 1936 నాటికి ఈ మహా ద్వీపంలో లక్షా ఇరవై వేల పైచిలుకు ఒప్పంద కార్మికులయ్యారు. చివరకు తాము ఫ్రెంచి జాతీయులైనా ఆధ్యాత్మకంగా, సాంస్కృతికంగా ‘మేము భారతీయులము’ అని ఈ శ్రామికులు చెప్పుకున్నారు.

ఫ్రెంచ్ గయానా (కరేబియన్ దక్షిణ అమెరికా) ఇప్పటికీ ఫ్రాన్స్ దేశంలో భాగమే. ఫ్రెంచ్ గయానాకు వచ్చిన భారతీయ ఒప్పంద కార్మికుల వారసులు ఈనాడు కూడా సుమారు 12,000 మంది ఉన్నారు. ఈ దేశ రాజధాని కాయెన్ పేరు మీద కాయెన్ పెప్పర్ ప్రపంచ ప్రఖ్యాతి చెందినది.

ఉత్తర అమెరికా సమీపంలోని గ్యాడెలోప్ ద్వీప సముదాయంలో నల్లజాతి, ఫ్రెంచి, అమెరికాలకు సంబంధించిన ప్రజల సమూహాలు స్థిరపడ్డాయి. ఇక్కడి జనాభాలో సుమారు 13 శాతం ప్రజలు భారత సంతతికి చెందినవారే. పాలకుల ఒత్తిడి వల్ల మనవాళ్ళు ఆ భాష, సంస్కృతిని, కేథలిక్ మతాన్ని అనుసరించవలసి వచ్చింది. మన ఒప్పంద కార్మికుల చేత రోజుకు 16 గంటలు పని చేయించారు. వారిలో 30 వేల మంది పైగా శ్రామికులు మరణించారు. ఈ ‘చారిత్రిక విషాదం ప్రధాన స్రవంతి చరిత్రకారులు పట్టించుకోలేద’ని రామారావు వ్యాఖ్యానించారు. గ్వాడెలోప్‌లో జన్మించిన తమిళుడు హెన్రీ చిదంబరాన్ని కరేబియన్ గాంధీ అంటారు. ప్రజల హక్కుల కోసం పోరాడి అయిన 27 సంవత్సరాలు క్రూరమయిన కారాగార శిక్షను అనుభవించారు.

అగ్ని పర్వతాలతో నిండిన సెయింట్ మార్టినిక్ ఫ్రెంచి అధికారం కింద ఉన్న ద్వీపం. 1883లో 25 వేల భారతీయ కార్మికులు ఇక్కడ స్థిరపడేందుకు వెళ్ళారు. అక్కడి దారుణ పరిస్థితుల్లో చాలామంది శ్రామికులు ‘ఈగల్లా చనిపోయారు’. నేడు ఈ దేశంలో స్థిరపడిన మన వారి చరిత్ర స్వదేశీ సంస్కృతి, పాలక జాతుల జీవవ విధానంతో కలగలిసి మిశ్ర సంస్కృతి ఏర్పడింది. వలసలు వెళ్ళిన శ్రామికులు మలేరియా వంటి సంక్రామిక వ్యాధులతో దుర్భర జీవితాలు గడిపారు.

అమెరికా తీరంలోని ఈశాన్య భాగంలోని సురినామ్‌లో అనాదిగా స్థానిక ప్రజలు నివసిస్తున్నారు. సురినామ్‌ను డచ్ వాణిజ్య కంపెనీ స్వాధీనం చేసుకొని ఆఫ్రికా నుంచి బానిసలను ఇక్కడికి తరలించింది. భానిసత్వం రద్దయిన తర్వాత తోటలలో శ్రామికుల కొరత ఏర్పడి, భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులను తెచ్చుకొన్నారు. ఆ దేశంలో స్థిరపడిన భారతీయ శ్రామికులు సురినామ్ సమాజంలో గణనీయమైన పాత్ర నిర్వహించి, అక్కడి స్థానిక సంస్కృతిలో మన పండుగలు, ఆచారాలు ప్రవేశ పెట్టారు.

ఇప్పుడు సురినామ్ జనాభాలో 35 శాతం కంటే మించిన ప్రజలు భారత సంతతి వారే. సురినామ్‌కు వెళ్ళిన శ్రామికుల ప్రయాణానికి గుర్తుగా ‘కలకత్తా ఓడరేవు’ సురినామ్‌లో ఒక స్మృతి చిహ్నంగా నిర్మంచబడింది. ఈ స్మృతి చిహ్నం ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. మున్షీ రెహమాన్ ఖాన్ ఆత్మచరిత్ర రూపంలో సురినామ్ లోని ఒప్పంద కార్మికుల జీవితాన్ని వర్ణించారు. ప్రజల జ్ఞాపకాల్లో, జానపద గీతాల రూపంలో సజీవంగా ఉన్న వాటిని సేకరించి ఈ పుస్తకం చివర చేర్పారు రామారావు.

చరిత్ర పుటల్లో నిశ్శబ్దంగా నిదురించిన, భారతీయ ప్రధాన జీవన స్రవంతి మరచిపోయిన, వలసలు వెళ్ళిన వారి దీన గాథలను, దాచేస్తే దాగని సత్యాలను ఇందులో రికార్డు చేశారు. సబ్ ఆల్‌ట్రన్ (subaltern) చరిత్ర రచనకు ఇటువంటి పుస్తకాలు మార్గదర్శకంగా ఉంటాయి.

‘అగమ్య గమ్యాలు’ పుస్తకం పేరులోనే ఇందులో ఇంత విషాదం, కరుణ రసాత్మక బతుకు పోరాటం లిఖించబడిందని సూచన వుంది.

అనేక చిత్రాలు, చారిత్రిక పత్రాలు, గణాంకాలు పుస్తకం చివర చేర్చారు. పుస్తకానికి రాసిన పరిచయాలు లోపలి విషయాన్ని ముందుగానే పరిచయం చేస్తాయి. రచయిత ఎంత నేర్పరైనా, పుస్తకానికి సంపాదకుల అవసరం ఉంటుంది. ఎ.కె. ప్రభాకర్ ఈ పుస్తకాన్ని, సమర్థవంతంగా ఎడిట్ చేసి ‘రీడబిలిటీ’ బాగా పెంచారు. ఎనభై ఏళ్ళు దాటినా ఇంత బృహద్రచనకు పూనుకొని కృతార్థులైన ఆత్మీయులు శ్రీ ముకుంద రామారావును హార్ధికంగా అభినందిస్తున్నాను.

***

అగమ్య గమ్యాలు
రచన: ముకుంద రామారావు
పేజీలు: 350
వెల: ₹ 350/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/agamya-gamyalu?

Exit mobile version