[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘అగ్గి పుల్లా సబ్బుబిళ్ళా..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
“ఆ మావయ్యగారూ, నేను, మా బాబాయి, మా అన్నయ్య ట్రైన్లో వస్తున్నాం. ఇప్పుడే రాజమండ్రిలో ఆగింది. మరికొన్ని గంటల్లో మీ ఇంట్లో ఉంటాం. వచ్చాక వివరంగా వివరాలు మాట్లాడుకుందాం. ఉంటానూ” అంటూ ఫోన్ పెట్టేశాడు మధు.
ఇంతలో ఎవరో ఒక అమ్మాయి గబగబా బోగీలోకి వచ్చింది. ఆమెతో పాటు ఒక ఆరేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. మధు వాళ్ళ వంక, ముఖం చిట్లించి మరీ చిరాగ్గా చూస్తూ, “ఇది రిజర్వేషన్ బోగి, పొండి అవతలకి” అన్నాడు
“సారీ సారూ, వచ్చేప్పటికే రైలు సరసారా కదిలి ముందుకుపోతుంటే, సరే అని సరాసరి ఈ బోగీలోకి ఎక్కేసాం. మేవూ విజయవాడలోనే దిగిపోతాం.” దణ్ణం పెడుతూ అంది.
“నాన్సెన్స్, ముందు దూరంగా నుంచోండి, పోండి” అసహనంతో ఊగిపోతూ అన్నాడు మధు.
వాళ్ళ బాబాయ్ మధు వైపు చూస్తూ, “చీప్ మనుషులతో మాటలేంటి నీకు. వాళ్ళతో మాట్లాడకు, మన విలువ కాలవలో కలిసిపోతుంది” మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు.
“ఆ ముక్క నా నోటి లోపల నానుతోంది, నువ్వు బయటికి అన్నావ్ బాబాయ్.” తాన తందానా అంటూ వంత పాడాడు మధు వాళ్ళ అన్నయ్య.
కొద్దిసేపటికి మధు వాళ్ళ బాబాయ్ అరటిపళ్ళు బయటికి తీసి కసా, పిసా తింటున్నాడు. ఆ అమ్మాయితో పాటు ఉన్న ఆ పిల్లాడు “సార్ నాకు ఒకటి ఇవ్వరా, కొంచెం ఆకలిగా ఉంది” అన్నాడు.
“కొనుక్కుని తిను పో, ఉన్నవే నాలుగు, అవి నాకే సరిపోవు” అంటూ మూడోది తినడం స్టార్ట్ చేశాడు.
ఇంతలో వాళ్ళ బాబాయ్ చిన్న కన్నింగ్ నవ్వు నవ్వుతూ, “నువ్వు గడి పాటు గుండాపిండై పోకుండా గమ్మున ఉండ్రా, రైలు ఎక్కినప్పటి నుండీ ఒకేటే బోరుగా ఉంది. వీడితో ఉచితంగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పొందుదాం” అంటూ ఆ పిల్లాడి వంక నవ్వుతూ చూస్తూ, “నేను అరటి పండు తొక్క తీసే లోపు, నువు నీ చొక్కా విప్పగలిగితే అప్పుడు ఇస్తాను” అన్నాడు.
వాళ్ళ అక్క వద్దు, వద్దంటున్నా పిల్లాడు గబ, గబా చొక్కా తీసేసి అరటిపండు తీసుకొని తిన్నాడు.
దానికి మధు వాళ్ళు పడి, పడి నవ్వారు. వాళ్ళ అక్కకి అది మింగుడు పడలేదు. కానీ ఆ ముగ్గురిలో ఎవరు అది వారించకపోగా నవ్వుతూ అదేదో పెద్ద కామెడి స్కిట్ లాగా ఎంజాయ్ చేశారు.
ఆ అమ్మాయి కోపంగా చూసింది మధు వంక.
“మెంటలా, పెంట కుప్పని చూసినట్టు ఎంటా చూపు. కొంపదీసి నన్ను నీ చూపులతోనే భస్మం చేసేస్తావా ఏంటి” నవ్వాడు .
“ఒక్క చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవిని తగలెట్టగలదు, సబ్బు బిళ్ళ మీద కాలేస్తే ఎంత పహిల్వాన్ అయినా జారి నేల కరవాల్సిందే. కనుక దేనినీ తక్కువగా చూడకూడదు” అని మరో చోటికి వెళ్ళి నిలబడింది.
విజయవాడ దిగిన తర్వాత, పెళ్లి వాళ్ళ ఇంటికి ముగ్గురూ వెళ్లారు. అమ్మాయి తండ్రి ఆహ్వానించి లోపల కూర్చోబెట్టాడు.
మాటలు అయ్యాక “రమణీ, కూల్ డ్రింక్స్ పట్రా” అన్నాడు పెళ్లికూతురి తండ్రి.
ఒకమ్మాయి నాలుగు గ్లాసుల్లో కూల్ డ్రింక్స్‌ని ట్రే లో తెచ్చి ఇచ్చింది.
ఆమెని చూస్తూనే ముగ్గురూ నీళ్ళు చప్పరిస్తూ నల్ల మొహాలు వేశారు.
ఇందాక ట్రైన్లో వాళ్ళు అవమానించిన అమ్మాయే ఈ అమ్మాయి. దాంతో మధు గుండెల్లో గుండ్రాయ్ పడింది.
ఇంతలో పెళ్లి కూతురు తండ్రి “బాబూ మధూ, అమ్మాయి, వాళ్ళమ్మతో కలిసి ఇక్కడే దగ్గర్లోనే చిన్న షాపింగ్‌కి వెళ్ళింది. ఓ పావుగంట, అరగంటలో వచ్చేస్తుంది”. అని ఒక క్షణం ఆగి, “అల్లుడుగారిని పైన ఉన్న బెడ్ రూమ్‌కి తీసుకెళ్ళు. కొంచెం మొహం అదీ కడుక్కుని కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. అమ్మాయి వచ్చిన తర్వాత నేను కబురు పెడతానులే, అప్పుడు బయటకు వస్తారు. అప్పట్లోగా వాళ్ళ అన్నయ్య, బాబాయ్‌తో కలిసి పెళ్లి పనులు, కట్న కానుకల్లాంటివి మాట్లాడుకుంటాం” చెప్పాడు రమణితో.
ఆమె “సరే అయ్యగారూ, అలాగే” అంటూ బెడ్ రూమ్‌కి దారి చూపెడుతున్నట్టుగా ముందు నడుస్తూ “రండి సారూ” అంది.
తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్ళాక, మధు కొంచెం బిక్కుబిక్కుగా చూస్తూ, “చూడూ, నువ్వు తూచ్ అనుకుని అన్నీ మర్చిపోవాలి. వాళ్లకు విషయం చెబితే లేని పోని ఇబ్బందులు రావొచ్చు. పెళ్లి కూడా ఆగిపోవచ్చు, కనుక నువ్వు వాళ్ళకి ఏవీ చెప్పకు. ఈ డబ్బులు తీసుకుని, మీ తమ్ముడికి బోలెడు అరటి పళ్ళు కొనివ్వు, కడుపునిండా తింటాడు, సరేనా” అన్నాడు బలవంతంగా పళ్లికిలించి ఓ రెండు వందలు ఆమెకి అందిస్తూ.
ఆమె ఆ డబ్బులు తీసుకుని, “పళ్లికిలించి పళ్ళకి డబ్బులు ఇస్తే నా కోపం చల్లారదు. విషయం వాళ్ళకి చెప్తాను, రెండు పుల్లలు ఎక్కువ వేసి మరీ చెప్తాను. అలా నా పగ తీర్చుకుంటాను” చెప్పింది ఎర్రగా చూస్తూ.
“ఇదిగో అలా అనడం కరెక్ట్ కాదు. నీ కోపం పోవాలంటే ఏం చేయాలి” అడిగాడు టెన్షన్‌గా ఆమె వైపు చూస్తూ
“అలా అయితే, మా తమ్ముడు చొక్కా మీరు విప్పించారు. మీరు కూడా ఇపుడే మీ చొక్కా నా ఎదురుగా విప్పితే నా కోపం చల్లారుతుంది. ఇక్కడితో ఈ విషయం వదిలేస్తాను, లేదంటే మీ ఇష్టం” అంది వెళ్లిపోబోతూ.
“సరి, సరే, టైమ్ నీది” అని ఆమెతో అనేసి, ‘పెళ్లి అవనీ నిన్ను ఏం చేయాలో అది చేస్తాను’ అని మనసులో అనుకుని, ఆమె వంక కొరుక్కు తినేసేలా కోపంగా చూస్తూ, ‘బోడి ఈ నాలుగు గోడల మధ్య ఓ సారి చొక్కా విప్పితే ఏం పోతుంది. కనుక ఓ సారి టకటకా విప్పేసి మళ్ళీ వేసేసుకుంటాను’ అని గబగబా బొత్తాలు తీసి ఇలా చొక్కా విప్పి, వేసుకునేంతలో రమణి చేయి కొరుక్కుని కెవ్వుమని అరిచి బయటికి పరిగెత్తింది. కింద నుండి పెళ్లి కూతురి వాళ్ళ నాన్న, మధు వాళ్ళ అన్నయ్య, బాబాయ్ కూడా లేచి తాటి చెట్టుల్లా నిలబడ్డారు.
రమణి, “ఇతను, ఇతను” అంటూ మధు ఇచ్చిన రెండు వందలు కింద పడేసి, “వ్వా, దేవుడా” అని ఏడుస్తూ కిందకి వచ్చింది. మధు చొక్కా పట్టుకుని బయటకు వచ్చాడు.
పెళ్లి కూతురి తండ్రి కోపంగా మధు వంక చూస్తూ “గెటవుట్” అన్నాడు.
రమణి ముఖంలో ఓ చిన్న నవ్వు మెరిసింది.
