[శ్రీ రాజ మోహన్ ఇవటూరి గారు రచించిన ‘అగ్నిపరీక్ష’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆసుపత్రి నుంచి వచ్చినప్పటినుంచి రమ మనసు మనసులో లేదు. వైద్యురాలు శుభవార్తలా చెప్పిన విషయం ఆమెకి చాలా చేదుగా అనిపించింది.
వారం క్రితం ఆమెకి నలతగా ఉందని గమనించిన చలం కొంచెం ఎక్కువే కంగారుపడి ఆమెని ఆసుపత్రికి తీసుకుపోయాడు.
డాక్టర్ సుమతి ఒకప్పుడు చలంతో చదువుకున్న మిత్రులే. ఆమె రమకికొన్ని టెస్టులు చేయించమంది. ఆ పరీక్షలు ఏమిటో అర్థం చేసుకున్నప్పుడే రమ మనసులో ఆందోళన మొదలయ్యింది.
చలంకి ఆ పరీక్షల వివరాలేమీ తెలియవు గానీ మర్నాడు టెస్టులకి తీసుకెళ్ళటానికి సెలవు పెట్టాడు.
“అనవసరంగా సెలవులెందుకు వ్యర్థం చేసుకుంటారు? దగ్గిరే కదా! నేను మనింటావిడని తోడు తీసుకుని వెళ్ళొచ్చేస్తాను” అంది.
“ఆవిడ ఖచ్చితంగా వస్తుందా? అలా అయితేనే నేను సెలవు కేన్సెల్ చేసుకుంటాను” అన్నాడు చలం.
“అనవసరంగా కంగారు పడకండి. అసలే చాలా పని ఉంటోంది మీకు” అని అతన్ని ఒప్పించి తను ఒంటరిగా వెళ్ళింది. ఇంటావిడని తీసుకెళ్తే పత్రికలలో వార్తలివ్వక్కరలేదు.
ఆ తర్వాత కూడా చలాన్ని రానివ్వకుండా తనే రిపోర్ట్ తీసుకుని మళ్ళీ ఒంటరిగా వెళ్ళింది.
సుమతి ఆమె రిపోర్టులతో పాటు ఆమెని మళ్ళీ పరీక్ష చేసి “రమా! శుభవార్త! నువ్వు తల్లివి కాబోతున్నావు. రెండో నెల. ఇంత త్వరగా తెలియటం అదృష్టం. పార్టీ ఎప్పుడు?” అంది.
సుమతి అనుకున్న స్పందన రమ ముఖంలో కనిపించకపోతే కొద్దిగా నిరాశ చెందుతూ “పార్టీ అని ఊరికే అన్నాను. ఇక్కడ రూల్స్ ప్రకారం మేమేమీ తీసుకోకూడదు.” అంది సుమతి.
“అబ్బే అదేమీ కాదు సుమతీ. మాకిప్పటికే ఇద్దరు పిల్లలు. ఇక వద్దని అనుకున్నాం. జాగ్రత్తగానే ఉన్నాం గానీ ఇప్పుడిలా అయ్యింది.” అని సమాధానమిచ్చింది రమ.
“అరెరే. వద్దనుకున్నారా? ఇప్పుడెలా?”
“మీరే వెంటనే గర్భం తీసెయ్యండి ప్లీజ్. రెండు నెలలే కనుక శస్త్ర చికిత్స అవసరం ఉండదేమో!” అంది రమ కంగారుగా.
“మరి చలంతో మాట్లాడాలేమో!” అంది సుమతి.
“వద్దు. మేమిద్దరం వద్దనుకున్నాం కనుక అతనికి ఎలాగూ అభ్యంతరం ఉండదు. దయచేసి వెంటనే పని మొదలు పెట్టండి”
సుమతి కొంచెం సేపు మౌనంగా ఉండి “సరే! చేసేద్దాం. కానీ ఇక్కడ రూల్స్ తెలుసుకుంటాను. భర్త అనుమతి తప్పనిసరి కాకపోతే మరింత సులువుగా అయిపోతుంది. రేపు ఎక్కువ సేపు ఉండేలా రండి.” అంది.
సరేనని వచ్చేసింది రమ. కానీ మనసు కుదురుగా లేదు. ‘ఒకవేళ భర్తకి చెప్పకుండా అబార్షన్ కుదరందంటే?’ అనుకుని వణికిపోతోంది.
***
చలం, రమ పెళ్లి చేసుకుని ఆరేళ్ళయింది. ఎటువంటి కలతలూ లేవు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆర్థిక ఇబ్బందులూ లేవు. కొన్ని నెలల క్రితమే ఇద్దరూ మాటాడుకుని ఇక పిల్లలు చాలు అనుకున్నాక తను ఆపరేషన్ చేయించుకుంటానంది.
“అయ్యో! నీకు ట్యూబెక్టమీ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నేనే చేయించుకుంటాను.” అని చలం వైద్య కేంద్రానికి వెళ్లి మూడు గంటల తర్వాత స్కూటర్ మీద మహారాజుతో ఇంచక్కా ఇంటికి వచ్చేసాడు.
అందరూ ఆశ్చర్యపోతుంటే “చూసావా? నేను చేయించుకుంటే ఇలా సులువుగా అయిపొయింది. నీకయితే ఒక వారం కష్టపడాల్సి వచ్చేది” అన్నాడు.
“ఇంత త్వరగా ఎలా అయిపొయింది! అసలు చేయించుకున్నారా?” అంది రమ నవ్వుతూ.
“మంచి అనుమానమే.” చలం కూడా నవ్వేశాడు.
***
గతం గుర్తు తెచ్చుకుంటూ ‘ఆరోజు భర్తని ఒప్పించి నేనే ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది’ కాదు అనుకుంది రమ.
చలం ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసేవాడు. రెండు నెలల క్రితం అలాగే అతను వెళ్ళినపుడు పిల్లలు కూడా సెలవులకి తాతగారి ఊరు వెళ్ళటం వలన రమ ఒంటరిగా ఉంది.
ఆ సమయంలో చలం స్నేహితుడు కుమార్ వచ్చాడు.
అతను వచ్చిన సమయం రాత్రి పదకొండు గంటలకి కావటం వలన అతన్ని అక్కడే పడుకోమనక తప్పలేదు. అతను కొంచెం మాటకారి కావటం వల్లనో ఎక్కువ చొరవ తీసుకునే గుణం ఉండటం వలనో ఇద్దరి మధ్యా తప్పు జరిగిపోయింది. తర్వాత ఎంతో పశ్చాత్తాపపడి ఈ మద్యే మరిచిపోతున్నా ఆమె ఆమెని ఇంకా క్షోభ పెడుతూనే ఉంది. ఒక బలహీన క్షణంలో జరిగిన తప్పు అని మరిచిపోవాలనుకుంది. కానీ ఆ తప్పు ఇప్పుడిలా వెంటాడుతుందనుకోలేదు.
“దేవుడా! ఈ ఆపద లోంచి రక్షించు. నేనెప్పుడూ భర్తని మోసం చెయ్యలేదు. వేరే వారి మీద మోజు పడలేదు. అతనే నా ప్రాణం. అనుకోకుండా జరిగిన ఈ తప్పు వలన మా జీవితాల్లో సంక్షోభం కలగకుండా కాపాడు. మళ్ళీ ఇటువంటి తప్పు నా జీవితంలో జరగకుండా జాగ్రత్త పడతాను.” అని కళ్ళు మూసుకుని ప్రార్థిస్తోంది. రమ.
ఇంతలో “తథాస్తు” అని వినిపించింది.
ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే చిరునవ్వుతో చలం కనిపించాడు. పిచ్చి ఆలోచనలతో తలుపు మూయటం కూడా మరిచిపోయిందన్న మాట.
ముఖంలో నవ్వు తెచ్చుకుని “త్వరగా వచ్చేసారే” అంది.
“అదే ఈ ఉద్యోగంలో ఉన్న సమస్య. ఒక్కొక్కప్పుడు రోజుకి 24 గంటలు చాలవు. మరొకప్పుడు ఇలా ఖాళీ దొరుకుతుంది.” అంటూ కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళాడు చలం.
అతను ఏవేవో సరదా కబుర్లు చెబుతున్నా రమ ఆస్వాదించలేకపోతోంది. అలాగే రోజు గడిచిపోయింది.
పడక గదిలో చలం ఏదో ఆలోచిస్తూ పడుకుంటే ‘అలా ఉండటం మంచిది’ అనుకుని అతన్ని మాటాడించకుండా రమ మంచం రెండో వైపుకి వాలింది.
కొంత నిశ్శబ్దం తర్వాత హఠాత్తుగా చలం నోరు విప్పాడు.
“నీకు తెలియకుండా నేనొక తప్పు చేసాను రమా!”
రమ ఉలిక్కిపడింది.
“నన్ను క్షమిస్తానంటేనే చెప్తాను” అన్నాడు.
రమ మనసులో రకరకాల భావాలు మెదిలాయి. కుదిరితే తను కూడా చేసిన తప్పు చెప్పుకుని మనసులో భారం దించుకోవాలనే భావం కూడ ఉంది.
“నిన్ను క్షమించగలిగే గొప్పదానేమీ కాదు. అసలేమయ్యింది?” అంది.
చలం చెప్పటం మొదలుపెట్టాడు. “నేను వేసెక్టమీ చేయించుకోవటం కోసం వెళ్ళినపుడు వైద్యులు ఆపరేషన్ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ మధ్యలో ఏవో లేవని బైటికి వెళ్లారు. హఠాత్తుగా నాకు చాలా భయం వేసింది. సమయం గడిచేకొద్దీ ఆ భయం పెరిగిపోయింది. మరి తట్టుకోలేక మంచం దిగి వెనకనుంచి వాళ్ళు పిలుస్తున్నా పరుగెత్తుకుని స్కూటర్ ఎక్కేసాను” అన్నాడు .
రమ నిర్ఘాంతపోయింది. ఆమె గుండెలు వడివడిగా కొట్టుకున్నాయి.
“ఈ రోజు నేను అంత తొందరగా ఇంటికి రావటానికి కారణం అదే. లేకపోతే ఎంత చిన్న ఆపరేషన్ అయినా చేయించుకున్నాక అంత సులువుగా స్కూటర్ నడుపుకుని వచ్చేస్తానా?” అన్నాడు చలం.
“మీరు చెప్పేది నిజమా?” అంది ఇంకా మిగిలిన సంశయంతో.
“నిజం రమా! నిన్ను మోసం చేశాను. అప్పటినుంచి నీ రుతుక్రమం గమనిస్తూ మనకి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాను.” అన్నాడు చలం.
“భగవంతుడా! పరిష్కారం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే నువ్విలాంటి మాయలు చేస్తావన్నమాట” అనుకుంది మనసులో.
వెంటనే మళ్ళీ అనుకుంది “లేదు. అయినా నేను నిజం చెప్పేస్తే మంచిది. ఆయన అంత నిజాయితీగా చెప్తుంటే నేను కూడా అంత నిజాయితీగా ఉండాలి” అని ఆమె ఆలోచిస్తోంది.
“నన్ను క్షమించగలవా రమా! నేనెంత జాగ్రత్త పడినా ఎప్పుడైనా మన ప్లాన్ పనిచేయక జరిగిన తప్పు వలన పిల్లలు పుట్టే పరిస్థితి వస్తే వారిని ఈ లోకంలోకి రాకుండా ఆపేద్దామా! లేక కందామా?” అన్నాడు.
రమ నోటివెంట మాట లేదు.
“నా మనసులో ఇదే బెంగ ప్రతిరోజూ ఉంది రమా! పిండాన్ని బైటపడే ముందు చంపినా అది హత్యే కదా! అందుకని నా పొరబాటు వలన నీకు భవిష్యత్తులో గర్భం వస్తే నువ్వు దయచేసి వద్దు అనకు.” అన్నాడు చలం.
రమ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మనసులో భారం దిగిపోయింది.
“మనకి ఆర్ధికంగా ఇబ్బంది లేదు కనుక ఇంకొక బిడ్డని పెంచుకోవచ్చు.” అంది.
“అంటే నీకేం కోపం లేనట్టే కదా! హమ్మయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.” అంటూ ఉత్సాహంగా లేచాడు చలం.
“మనం ఈ మాట మీదే ఉందాం. బిడ్డ పుడితే పెంచుకుందాం. కానీ ఒక విషయం..” అన్నాడు మళ్ళీ.
“ఏమిటది?” అడిగింది రమ మళ్ళీ కలిగిన సంశయంతో.
“మనం ఒకప్పుడు వద్దనుకున్నట్టు ఆ బిడ్డకి ఏమాత్రం తెలియకుండా పెంచుకోవాలి. ఈ తప్పు ఆ బిడ్డని బాధించకూడదు. సరేనా?” అన్నాడు.
రమ కన్నీళ్లు ఆపుకుంటూ “అలాగేనండీ” అంది.
రాజమోహన్ ఇవటూరి స్వస్థలం విశాఖపట్నం. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. టెక్ మహీంద్రాలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి, 2021 నుంచి సొంత సంస్థను నడుపుతున్నారు. 1994 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ ‘ఓ తమ్ముడి కథ’.. రచనలో ప్రచురితమయింది. ఇప్పటివరకూ యాభైకి పైగా కథలు రాశారు. తిక్క శంకరయ్య కథ, విమర్శకుల ప్రశంసలు పొందడంతోపాటు ‘మిసిమి’ పత్రికలో అచ్చయ్యింది. ఆరాధన (రచన), అవ్వగారు (సహరి), వారసత్వం (ముల్కనూర్ గ్రంధాలయం), చక్ర భ్రమణం (కథా మంజరి), క్రూరమైన వాస్తవం (ఉష పత్రిక), జీవితం నిత్య నూతనం (కథా మంజరి), యుగ ధర్మం (వెల్చేరు కళా వేదిక), బొమ్మా బొరుసు (పుణ్యమూర్తుల స్మారక కథల పోటీ), అమ్మ ప్రేమ (వారణాశి సాహితీ వారధి 2024) కథలకి బహుమతులు దక్కాయి. “జీవితం నిత్య నూతనం” కథ కన్నడ భాషలో అనువదింప బడినది. వీరి తండ్రి జ్యేష్ఠ పేరిట ఏర్పాటుచేసిన ‘జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 1990 నుంచి ఏటా ఉత్తమ కథ, ఉత్తమ కథా సంకలనాలకు పురస్కారాలు అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రచయితల ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. ఎక్కువ కథలు స్వీయానుభవం ఆధారంగా రాసినవే.
శ్రీయుతులు జ్యేష్ఠ, ముళ్లమూడి, నామినిసుబ్రహ్మణ్యంనాయుడు, డాక్టర్ కేశవరెడ్డి, గురజాడ, ఇంద్రగంటి జానకి బాల, యండమూరి రచనలని అభిమానిస్తారు. కొత్త తరం రచయితలు చాగంటి ప్రసాద్, పెమ్మరాజు విజయకుమార్, వేణు మరీదు, కైకాల సుమలత, గార్ల రచనలు ఇష్టపడతారు.
సహజ నటుడు చంద్ర మోహన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గార్లకి వీరాభిమాని.
