Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అహంకార త్యాగమే భగవత్సేవ

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అహంకార త్యాగమే భగవత్సేవ’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్రీమద్భగవద్గీత, 12వ అధ్యాయం, 6వ శ్లోకం

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే॥

తమ కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి, ఆయననే పరమగమ్యముగా భావిస్తూ, అనన్యభక్తితో నిత్యము ధ్యానించే భక్తులు నాకు అత్యంత ప్రియులని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకములో బోధిస్తున్నాడు.

భగవద్గీత ద్వాదశ అధ్యాయము భక్తియోగానికి హృదయముగా భావించబడుతుంది. నిరాకార బ్రహ్మోపాసన కఠినమైనదని వివరించిన అనంతరం, సాధారణ మానవుడు అనుసరించవలసిన సులభమైన మార్గాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో తెలియజేస్తాడు. భగవంతుని చేరుకోవడానికి అడవులకు వెళ్లి కఠోర తపస్సులు చేయాల్సిన అవసరము లేదని, ప్రతిరోజూ చేసే కర్తవ్యాలను దైవార్పణ భావముతో నిర్వర్తిస్తే అదే భక్తియోగమని స్పష్టముగా ఉపదేశిస్తున్నాడు.

“సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య” అనే పదాలు ఈ శ్లోకములోని ప్రధాన సందేశము. ఇక్కడ సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడము కాదు, కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టడము. “నేనే చేశాను”, “ఇది నా విజయము”, “ఇది నా సంపాదన” అనే అహంకారాన్ని తొలగించి, ప్రతి కార్యాన్ని భగవంతునికి సమర్పణగా చేయడమే నిజమైన కర్మసన్యాసము. అలాంటి ఉదాత్తమైన భావముతో చేసిన పని మనిషిని బంధించదు, విముక్తి వైపు నడిపిస్తుంది.

ఈ పరమ భావాన్ని శ్రీకృష్ణుడు గీతలో మరొకచోట కూడా బోధించాడు. “యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్, యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్” అనగా నీవు చేసే ప్రతి పని, తినే ప్రతి ఆహారము, చేసే ప్రతి యజ్ఞము, దానము, తపస్సు భగవంతునికి అర్పణగా చేయాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఈ దైవార్పణ భావమే భక్తిని పరిపక్వము చేస్తుంది. భక్తి అనేది కేవలము ఆలయములో పూజ చేయడము మాత్రమే కాదు. నిజాయితీగా విధిని నిర్వర్తించడము, ఇతరులకు మేలు చేయడము, ధర్మాన్ని పాటించడము కూడా భక్తియోగములో భాగమే. కర్తవ్యము భగవత్సేవగా మారినప్పుడు జీవితము యజ్ఞస్వరూపమవుతుంది.

ఈశావాస్యోపనిషత్ కూడా ఇదే సత్యాన్ని బోధిస్తోంది. “కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః” అనగా ధర్మబద్ధమైన కర్మలను ఆచరిస్తూనే జీవించాలని ఉపనిషత్ సూచిస్తోంది. కర్మ నుంచి పారిపోవడము కాదు, దానిని పవిత్రముగా చేయడమే ఆధ్యాత్మికత అని ఈ వాక్యము తెలియజేస్తుంది.

శ్రీమద్భాగవతము కూడా భక్తి యొక్క పరమార్థాన్ని ఇలా వివరిస్తుంది. “స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే, అహైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి” అని నిస్వార్థమైన, నిరంతరమైన భక్తియే మానవుని అత్యున్నత ధర్మమని, అలాంటి భక్తి మనస్సుకు నిజమైన ప్రశాంతతను ప్రసాదిస్తుందని భాగవతము చెబుతోంది.

నారద భక్తి సూత్రాలు భక్తిని “అనన్యత్వము”గా నిర్వచించాయి. భగవంతునిపై అచంచల విశ్వాసము, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయనను స్మరించడము, ప్రతి కర్మను ఆయన సేవగా భావించడము నిజమైన భక్తి అని నారద మహర్షి వివరించాడు. శ్రీ రామచరితమానసములో తులసీదాసు “రామహి కేవల ప్రేమ పియారా” అన్నారు. భగవంతునికి కావలసింది ఆడంబరము కాదు, నిర్మలమైన ప్రేమ, నిష్కపటమైన భక్తి మాత్రమే. అదే ఈ గీతా శ్లోకములోని “మత్పరాః” అనే పదానికి సారాంశము.

నేటి కాలములో ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ బాధ్యతలు, సామాజిక జీవనము వంటి అనేక కర్తవ్యాల మధ్య మనిషికి ఆధ్యాత్మిక సాధనకు సమయము దొరకడము లేదని చాలామంది భావిస్తారు. అయితే ఈ శ్లోకము చెప్పేది వేరే సత్యము. మన దైనందిన కర్తవ్యాలను నిజాయితీగా, స్వార్థరహితముగా, భగవంతునికి సమర్పణ భావముతో నిర్వహిస్తే అదే యోగము, అదే ధ్యానము, అదే భక్తి. కర్మను ఆరాధనగా మార్చినప్పుడు జీవితము దైవమయము అవుతుంది.

అందుకే శ్రీకృష్ణుని ఈ ఉపదేశము ప్రతి యుగానికీ మార్గదర్శకము. దేవుణ్ని చేరుకోవడానికి కర్తవ్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరము లేదు. కర్తవ్యాన్నే భగవత్సేవగా భావించి, ఫలాపేక్ష లేకుండా, అనన్యభక్తితో నిర్వర్తించినప్పుడు ప్రతి పని పూజగా, ప్రతి శ్వాస ధ్యానముగా, ప్రతి రోజు యోగముగా మారుతుంది. అలాంటి భక్తుని జీవితమే కర్మయోగానికి, భక్తియోగానికి, మోక్షమార్గానికి సజీవ ఉదాహరణగా నిలుస్తుంది.

Exit mobile version