తేది 31-05-2026 న ఉదయం 10.00 గంటలకు మారుమూల అహేరి, గడ్చిరోలి ప్రాంతం లోని ఆర్య వైశ్య వారి సభాగృహంలో మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమం, విజయవంతంగా జరిగింది. మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా జరుగుతున్న సాహితీ కార్యక్రమాలను పురస్కరించుకొని ఈసారి మారుమూల అహేరి, గడ్చిరోలి ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు గిరిజన ప్రజల సౌకర్యార్థం సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది గత ఏడు నెలల్లో జరిగిన పదకొండవ తెలుగు కార్యక్రమం. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు శ్రీ హరీశ్, కృష్ణ, తెలుగు కార్యక్రమ సమన్వయకులు శ్రీ అశోక్ కంటె, డా. అంబల్ల జనార్దన్, అహేరి కార్యక్రమ సమన్వయకురాలు శ్రీమతి శోభారాణి పురం గార్లు నిర్వాహకులుగా వేదికనలంకరించారు.
తొలుత అతిథులచే దీప ప్రకాశనంతో తర్వాత, మహారాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభమయింది. కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటె గారు, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ హరీశ్ గారిని తన ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరారు. శ్రీ హరీశ్ గారు, మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నెలకొల్పడంలోని ఉద్దేశ్యం విశద పర్చారు. మహారాష్ట్రలోని తెలుగు-మరాఠీ ప్రజల మధ్య సుహృద్భావం ఏర్పరచి, మరాఠీ-తెలుగు సాహిత్య – సంస్కృతులను పరస్పరం ఇచ్చి పుచ్చుకుని ఇరు భాషీయులు సఖ్యంగా ఉండాలన్నారు. అందుకే తెలుగు వారు ప్రాముఖ్యంగా ఉన్న అన్ని ప్రాంతాలలో తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
అటు పిమ్మట వ్యాఖ్యాత సూచనపై, ప్రముఖ తెలుగు రచయిత, డా. అంబల్ల జనార్దన్ గారు మాట్లాడుతూ, ఒక తెలుగేతర రాష్ట్రంలో తెలుగు సాహిత్య అకాడెమీ స్థాపించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మన తెలుగు కార్యక్రమాల నిర్వహణకై సహకరిస్తున్న మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యదర్శి శ్రీ సచిన్ నింబాళ్ కర్ గారికి కృతజ్ఞతలు చెప్పారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగు వారిని ఒక్క త్రాటిపైకి తెచ్చి, మన సాహిత్య – సంస్కృతులను కాపాడుకునే అవసరం ఎంతో ఉందన్నారు. మహారాష్ట్రలో తెలుగు వారు, తెలుగు మూలాలున్న వారు దాదాపు కోటి మందికి పైగా ఉన్నారని ఆంచనా. వారంతా సాటి తెలుగు వారితో, తమ పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని పిలుపు నిచ్చారు. అలాగే తెలుగు అక్షర జ్ఞానం కూడా కలిగి ఉంటే, మన మాతృభాషను పరిరక్షించుకోగలమనీ, మన అస్తిత్వాన్ని కాపాడగలుగో గలమని అన్నారు.
ఈ కార్యక్రమానికి భగవంత్ రావ్ ప్రాథమిక్ పాఠశాల, భామరాగడ్ మరియు జై పర్సాపెన్ మాధ్యమిక, హైస్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు ఇతర స్థానిక తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీమతి స్మిత, ఆహార్యం, మేకప్, నృత్య దర్శకత్వ నిర్వహణలో, విద్యార్థులు తమ గిరిజన సాంప్రదాయక నృత్యాలతో విశేష ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించారు. ఒక గిరిజన ప్రాంతంలో, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను, ప్రేక్షకులు ఘనంగా ప్రశంసించారు.
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం, స్థానిక తెలుగు కవులతో సాహిత్య గోష్టి జరిగింది. ఆ సాహిత్య గోష్టిలో మరాఠీ సాహితీవేత్త, శ్రీమతి అర్చనా శ్రీఖండే, మరాఠీ నవలా సాహిత్యం గురించి వివరించి, ఆదివాసీ జీవన నేపథ్యంపై రచించిన కవితలను హృద్యంగా వినిపించారు. యువ తెలుగు కవయిత్రి సోనాక్షి పాండ్రే, ఆహేరి పట్టణ వైభవం, చారిత్రక ప్రాధాన్యత, సాంస్కృతిక విశిష్టతలను ప్రతిబింబించే గేయాన్ని ఆలపించి సభికుల ప్రశంసలు పొందారు. శ్రీమతి మీన ప్రదీప్ బీరెల్లివార్ గిరిజన సంస్కృతి గురించి వివరించి, ఒక కవిత ఆలపించారు. శ్రీమతి షాలిని దిలీప్ దొంతులవార్, మహారాష్ట్రలో తెలుగు సాహిత్య రంగం, దాంట్లో ప్రవాస తెలుగువారి భూమిక గురించి వివరించిన విధానం సభికులను ఆలోచింప చేసింది. శ్రీమతి సరళక్ష్మి అనీష్ బండావార్ గడ్చిరోలి యొక్క ప్రకృతి సంపద, పర్యావరణంలో అనేక మార్పులకు గల కారణాలు, మన కర్తవ్యాలను చక్కగా వివరించడమే గాక, వాటిపైన కవిత చెప్పడం వలన సభ్యులందరూ కరతాళ ధ్వనులతో స్పందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి స్మిత, ఆశ్రమ పాఠశాల భాపడా ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రదీప్ బావ్ణే, ఆశ్రమ పాఠశాల బామ్రాగఢ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రదీప్ మొండల్, కవయత్రులు శ్రీమతి అర్చన దీపక్ శ్రీఖండే, శ్రీమతి సోనాక్షి పరాగ్ పాండ్రే, శ్రీమతి శాలిని దిలిప్ దొంతుల్ వార్, శ్రీమతి సరళక్ష్మి అనీష్ బండావార్, శ్రీమతి మీనా ప్రదీప్ బిరెల్లివార్, అహేరి కార్యక్రమ సమన్వయకురాలు శ్రీమతి శోభారాణి పురం గార్లను మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
శ్రీ హరీశ్ గారి వందన సమర్పణ తర్వాత జాతీయ గీతాలాపనతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

