Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అజ విలాపము – నరాల రామా రెడ్డి గారి అనువాదము

[సెప్టెంబరు 30 అంతర్జాతీయ అనువాద దినోత్సవం పురస్కరించుకుని డా. రాజేశ్వరి దివాకర్ల ఈ వ్యాసాన్ని అందిస్తున్నారు.]

జవిలాపము అనేది కాళిదాసు రచించిన సంస్కృత మహా కావ్యం ‘రఘువంశం’ లోని ఒక ఘట్టం, ఇందులో అజమహారాజు తన భార్య ఇందుమతి మరణానికి ఆమెను కోల్పోయిన తీవ్ర దుఃఖాన్ని వ్యక్తపరుస్తాడు.

అజుడు సున్నిత మనస్కుడు. భార్యా వియోగానికి పరి పరి విధాల భావోద్వేగాన్ని పొందాడు.

అజ మహారాజుకు ప్రియ భార్య ఇందుమతి పై మిక్కిలి ప్రేమ. ఆమెకు కలిగిన కుమారుడు దశరథుడు. దశరథుని పుత్ర వియోగము ఆతని కుమారుడు రామునికి కలిగిన భార్యా వియోగాల దుఖ ప్రసంగాలను పరికించినప్పుడు రఘు వంశీయులు యుద్ధ రంగంలో ఎంత పరాక్రమవంతులో కుటుంబ బాంధవ్యాల యందు, అంత సున్నిత హృదయులు అనిపిస్తుంది. రఘువంశ కావ్యంలో అజుని విలాపము లలిత సరళమైన మనస్సు గల ఆ రాజు పరితాపము మమైకమయిన దుఖపుటంచులను తాకుతుంది.

హఠాత్తుగా కలిగిన విఘాతానికి ధైర్యవంతుడు దుర్బలుడవుతాడు. అనంతమైన వేదనలో ఈ మానవ జీవనము అస్థిరమైనది కదా అని విలపిస్తాడు. విధి క్రూరతను నిష్ఠురమాడుతాడు. ప్రకృతి లోని విపర్యాసాలను బ్రతుకు సంఘటనకు సరిపోల్చు కుంటాడు.

మహా కవి కాళిదాసు రచించిన రఘువంశము లోని ‘అజ విలాప’ ఘట్టాన్ని ఈ నడుమ అవధాన ఉద్దండులు శ్రీ నరాల రామా రెడ్డిగారు తెలుగు చేసారు. వారికి 2025 జూన్ రెండవ తేదీ సహధర్మ చారిణి సరోజమ్మ గారి ఆకస్మిక అపఘాత మరణంతో సతీ వియోగం కలిగింది. వారు స్వీయ వియోగ విలాపాన్ని అవధరించేందుకు తమకు గ్రాహ్యమైన ధారణాక్షరాలు ఎన్నైనా చాలవని తలచారు. అలనాటి రామచంద్రుని తాత అజునకు కలిగిన హఠాత్ వియోగమే తమకు కలిగింది కనుక నర నరాల ఆ కావ్య మనోజ్ఞతను తనివి తీరా తలచుకున్నారు. ఆ ఘట్టాన్ని తాము అనువాద ప్రజ్ఞతో అనుసరించారు.

ఆత్మీయులకు అందరికీ తమ విలాప వైక్లబ్యాన్ని మధురమైన ఉపమానాలతో దృష్టాంతాలతో ప్రకటించి కొంత ఉపశాంతిని పొందారు.

అజ విలాపము -నరాల రామా రెడ్డి అవధాని గారి అనువాదముల రేఖా మాత్ర పరిశీలన ఈ వ్యాస ఉద్దేశము.

రఘువంశాంతర్గతమైన అజవిలాపము తెలుగు అనువాద గ్రంథం పఠితలకు ‘అమూల్య’మైనది గా వారు అందించారు. మూలం లోని చిన్న చిన్న శ్లోకాలకు చిన్న పద్యాలతో సమతులనం కావించిన ఈ విలాపం నలభై ఒక్క పద్యాల ఆర్ద్రతాభివ్యక్తిని కావించింది.

అజ విలాప ఘట్టాన్ని శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు తమ ‘రఘువంశ’ కావ్యానువాదంలో ఎలా నిరూపించారో అక్కడక్కడ పరిశీలించడం జరిగింది {గ్రంథాలయ సర్వస్వము వాల్యూము 3 no1 (1918)} రాళ్ళపల్లి వారు ‘శ్లోకమైన శోకము’గా పేర్కొన్నారు. ఆదికావ్యం వాల్మీకి రామాయణం శోకము నుండే శ్లోకము జనించింది.

అంతనొకనాడు జనహితడైన యజుడు
ఇందుమతి తన తోడుగా నింపు నింప
స్వర్గ వని శచీసహితడౌ శక్రునట్లు
ఉపవనమున విహరించె నుల్ల సిలుచు.(1)

విషాద కథనానికి పూర్వరంగం ఇది. ఒక రోజు అజుడు శచీ దేవితో కూడిన ఇంద్రుని వలె సంతోషంగా తన భార్య ఇందుమతితో ఉపవనంలో విహరిస్తున్నాడు. ఆ సమయంలో గోకర్ణ సాగర తీర ప్రాంతంలో పార్వతీశుని తన వీణా నాదంతో సేవించడానికి నారదుడు స్వర్గ మార్గంలో వెళ్తున్నాడు. నారదుడు తన వీణకు స్వర్గ సుమధామాన్ని అలంక రించాడు. అంతలో అనిలుడు దానిని తాను ధరించాలని అనుకున్నట్లుగా అపహరించాడు. మూలంలో “కుసుమైః గ్రథితామ పార్థివైః/స్రజ మాతోద్య శిరో నివేశితాం/ అహరత్ కిల తస్య వేగవాన్ / అదివాస స్పృహ యేవ మారుతః” – శ్లోకానికి “దాని తొడవుగ దా దాల్ప బూనెననగ /అనిలుడుద్ధతి నద్దాని నపహరించె” అని ‘అధివాస స్పృహ’ పదానికి ‘తొడవుగ తా దాల్ప బూనెననగ’ అని నరాల రామా రెడ్డి గారు తెలుగుతనాన్ని తొడిగారు.

నారదుని వీణపై నుండి జారిన ఆ మాలిక మహారాజు భార్య ఇందుమతీ దేవి స్తన చూచుకములపై వచ్చి వాలి పడింది. గ్రహణ సమయంలో రాహువు మింగిన చంద్రుని వెన్నెల అదృశ్యమైనట్లు, “హృత చంద్రా తమ సేవ కౌముదీ” – “చటుల రాహుగ్రస్త చంద్రిక వలె” ఇందుమతి కనులు మూయుచు తెలివిదప్పింది. (గత ప్రాణి అయింది).

స్తన యుగమున క్షణమాత్ర సఖిగనున్న
విబుధమాలను వీక్షించి విహ్వలించి
చటుల రాహుగ్రస్త చంద్రిక వలె
పుడమిఱేని ప్రియాంగన మూర్ఛ పోయె (6)

అని రామా రెడ్డి గారి అనువాదము కాగా

నిద్దంపు జన్ను గవ పయి నిలిచి నిమిష
మాత్ర సఖి యైన యా సుమ మాల గాంచి,
సోలి కన్నులు మూసె భూపాల దయిత;
నెలను రాహువు మ్రింగ వెన్నెలెయు బోలె,

– రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు తెలుగు దయితానువాదము కావించారు.

దీప జ్వాల నేలకు జారునప్పుడు తైల బిందువును ఆధారంగా చేసుకున్నట్లు, ఇందుమతిని పట్టుకుని ఉన్న అజుడు సైతము నేలపై కూలాడు. ఈ ఉపమానం వల్ల దీపం మాసి పోయినట్లు ఇందుమతి మరణించిందని, తైలబిందువు శేషముగా మిగిలినట్లు అజుడు బ్రతికి ఉన్నాడని దృష్టాంతము. అపుడు పరిజనులకు దుఖము కలిగినట్లు పక్షుల అరపు లో కూడ శోకము వ్యక్తమయింది.

ఆమెతో పాటు అతడు కూడా కూడా మూర్ఛిల్లాడు. ఈ సందర్భంలో కవి “ఆయుస్సు మిగిలియున్న చేసినట్టి చికిత్స సంసిద్ధి పొందు” అని మూర్ఛనుండి తేరుకున్న అజుని పరిస్థితిని రామారెడ్డి గారు వివరించారు. అతడు విగత సత్వయైన వీణ తంత్రులు తెగినట్లు దయనీయ స్థితిలో ఉన్న ఇందుమతిని అమిత వాత్సల్యముతో అంకమున చేర్చుకున్నాడు. అప్పుడు “అజుడు కళావిహీనమగు చిహ్నాన్ని ధరించిన చంద్రుని వలె ఉన్నాడు. మృగలేఖాముషసీవ చంద్రమా” అన్న మూలానికి “నీల మృగలేఖ నెదను దాల్చు /చంద్రబింబ మట్టుల రాజ చంద్రుడుండె” అని విశేషణముతో సమన్వయించారు (11).

అజుడు ధైర్యాన్ని కోల్పోయాడు. అమితంగా విలపించాడు “అభితప్తమయోపి మార్దవం/భజతే కైవ కథా శరీరిషు” -అన్న మూలానికి “అనల కీల తప్తమౌ యినుము కూడ /మేటి గట్టి తనము పోవ మెత్తబడును” అని ఆ దుఃఖ పరితప్తుడు ధైర్యం కోల్పోయిన సందర్భాన్ని మూలాన్ని అతిక్రమించకుండా అనువాదం చేసారు (12). ఇదే శ్లోకానికి “ఇనుము కూడ దాప మెనసిన మెత్తనౌ/తనువు కల్గువారి దడవ వలెనె” అని రాళ్ళపల్లి వారు తెలుగు చేసారు.

“కుసుమాన్యపి గాత్ర సంగమాత్ /ప్రభవంత్యాయురపోహితుం యది” – అన్న మూల శ్లోకానికి – “సుమ వితానము. దేహ సంగమము వలన/ఆయువు నపహరింప సమర్థమైన/మారణము చేయు క్రూర విధికి /నింకవేరొక సాధన మేది వలయు” అని వాపోవడం అతి సుకుమారమైన భావన. కర్కశమైన విధిని దూషించడం సందర్భ సహితమైన కల్పనా సాంద్రతను నిరూపిస్తుంది. విధి దేనితోనైనా చంపగలదు. ఈ వాక్యాన్నే అనంత కృష్ణ శర్మ గారు “పూలు మై సోకగానే ప్రాణాన్ని పోగొట్టినప్పుడు పాపిష్టి దైవానికి చంపడానికి మరితర మైనవి ఎందుకు?” అన్నారు

కోమలమైన వస్తువును కోమలమగు వస్తువు చేతనే చంపుటకు ఆరంభిస్తుంది. మంచు కురిసినప్పుడు నశించిన పద్మమే ఒక సాక్షి. ఇప్పుడు పుష్పమాల ఇందుమతిని చంపుట రెండవ ఉదాహరణ.

విధి తలుచుకుంటే “విషమప్యమృతం క్వచిత్భవే/దమృతం వా విషమీశ్వరేచ్ఛయా” – అమృతం విషమౌతుంది -విషం అమృతమౌతుంది కదా అంటారు (15). ఇక్కడ విధిని అంతా ఈశ్వరేచ్ఛ అన్నారు రాళ్ళపల్లి.

కాక మామక దురదృష్ట కారణమున
నలువ మాలనే పిడుగుగా మలచెనేమొ.
కాని కాల్పక యద్ది వృక్షంబు కాల్చె
వృక్షమందున ప్రాకిన వీరుధమునె. (16)

శోకముదైవమును దోషిగా నిర్ణయించింది. మ్రానినియ్యది కూల్పక/దాని నాశ్రయించిన లేదీగ నగడు వరచె అని రాళ్ళ పల్లి వారు, ఇరువురు అనువాద గరిమను చూపారు.

నే చేసిన తప్పుల వలననే ఈ గతి ప్రాప్తించింది. తన ప్రాణము ఇందుమతి వెంట వెళ్ళి ఆమెతో తిరిగి రాక ఒంటరిగా వచ్చిన తప్పుకు ప్రాయశ్చిత్తము అయినదని బాధలో ధీరువు భీరువుగా పాశ్చాత్తాపమును పొందాడు.

సురతము వలన కలిగిన స్వేదమింకా ఆరనే లేదు, ప్రాణం పోయింది.మనిషి బ్రతుకెంత అస్థిరమో కదా! పూలను దాల్చి ఆమె వంకీలు తిరిగిన కేశాలు గండు తుమ్మెదల వలె గాలికి కదలాడుతుంటే మళ్ళీ ఆమె బ్రతుకుందని ఆశ కలిగింది. పేరుకు మాత్రమే తాను భూమి పతి, కాని ప్రేమకు మాత్రము భార్యా పతి. ఆమెను ఆ నిద్ర నుండి లేచి విషాదమును తొలగించమన్నాడు. అజుడు తన విషాదాన్ని హిమాచల గుహా గతమైన అంధకారం తోనూ, ఆమె మేల్కొన్నచో ఆ తమమును తృణ జ్యోతిర్లత వలె తొలగించునని ఉపమాన సదృశమును ఆశ్రయించాడు.

అంతరమున నళిరవమాగిపోవ
నీరవమ్మయి నిద్రించు నీరజమటు
అలకలూగగ సల్లాపమంతరింప
నీదు వదనము చూడ విషాదముబ్బు (24)

లోన చిక్కిన తేంట్ల నిస్వానమణుగగా రాత్రి నిదురించిన క్రొందామరలా ఉన్న ఆమె ముఖాన్ని చూచి కనలాడు. చందమామను రాత్రి, చక్రవాకము జంటను ,వీడి మళ్ళీ కలుసుకోగలమని వియోగ భారాన్ని సహిస్తాయి, కాని మృతిని చెందిన ఆమె విరహాన్ని అతడెలా ఓర్చగలడు?

ఆమె నిదురించి నప్పుడు మొలనూలు (రహస్య సఖి) గమన విలాసము లేక చనిపోయినట్లు, గల్లుమని మ్రోగు మేఖల నిశ్శబ్దమై మరణించినట్లున్నది.

పల్లవమ్ములు పఱచిన పాన్పు నందు
పవ్వళింపగ సైపని పల్లవాంగి!
కఱకు కట్టెలు పేర్చిన కఠినమైన
చితి పడకమీద నేరీతి చేరగలవు?(26)

నవపల్లవ సస్తరేపి తే
మృదు దూయేత యదంగమర్పితం
తదిదం విషహిస్యతే కథం
వద వామోరు! చితాధిరోహణమ్।।

చిగురాకు పానుపుపై పవళించినా ఆమె మేను కంది పోతుంది. అలాంటిది చితిపై ఉంచినప్పుడు ఎలా సహించగలదు? ఈ భావము గాఢమైన వియోగాను రాగాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది సార్వకాలికమైన మనుజ అనురాగ బాంధవ్యాలకు ఉదాహరణ. ఈ శ్లోకమును అనువదించునపుడు కాళిదాసు లోకజ్ఞత, అనువాదకుని నిజ సంవేదన మమేకమైనట్లుంటుంది.

ఇపుడాతడు అచేతనుడు. చేయి దాటిన పరిస్థితిలో, అమితమైన ప్రేమ ఆమె చేసిన పని దారుణమనిపించింది.

సతత సమదుఃఖసుఖులు నీ సకియలెల్ల
ప్రతిపదబ్జ సన్నిభుడు నీ బాలసుతడు
ప్రాణ ప్రదముగ నిను నే వలచుచుంటి
నిశ్చయము నీదు కృత్యము నిష్ఠురమ్ము.(34)

సతము చెలులు కష్ట సుఖాలను పంచుకున్నారు, గారబు సుతుడు క్రొన్నెలను పోలుతున్నాడు. ఆమెను నమ్ముకున్న వాడు తాను, ఆమె పట్టిన పట్టు ఎంత నిష్ఠూరమో కదా! అంటూ పరితపించాడు.

గృహిణీ సచివః సఖీ మిథః
ప్రియశిష్యా లలితే కళావిధౌ।
కరుణావిముఖేన మృత్యునా
హరతా త్వాం వద కిం న మే హృతమ్

గృహిణవీవు, మంత్రిణివీవు, హృదయసఖివి
శిష్ట లలిత కళావిధి శిష్య వీవు,
కనికరము లేని మృత్యువు కర్కశముగ
దోచె నిన్ను – నా సర్వము దోచుకొనెను. (36)

ఈ శ్లోకానువాదము అనువాదకుని ఆర్తిని అత్యత సహజంగా వెలార్చింది పఠితల హృదయార్చిని వెలిగించింది. ఆమె గృహిణి, మంత్రి, సఖి, కళా ప్రయోగమున శిష్యురాలు. అటువంటి ఆమె మృత్యువు చేత హరింప బడినప్పుడు తనకు మిగిలిన దేమున్నది ఆమె సంపదల సమిష్టి రూపిణి. ఆమె బ్రతికి ఉన్నప్పుడు మధుపానము చేయించిన తాను ఇప్పుడు తిలాంజలినీయ వలసి వచ్చినది. మధుపాన ప్రసక్తి వచ్చినప్పుడు మదిరాక్షి అను సంబోధన ఎంతో ఉచితము అనిపిస్తుంది.

ఎన్ని సంపదలుండిన నీవు లేక
యజునకింతయే సుఖమని యనగవలయు
లోకభోగాంతరములకు లొంగ జాల
నాదు సౌఖ్యాలునీయందు పాదుకొనియె. (38)

‘అహృతస్య విలోభనాంతరై’ అనడం ఆతని మనస్సు నందు ఆమె సాక్షాత్కరించి ఉండుట వలన అన్య విషయములాతనిని ఆకర్షించు ప్రసక్తి లేదు. నరాల రామారెడ్డి గారి అనువాదం లో ‘లొంగజాల’ పదం సార్థక్యాన్ని పొందింది.

ఎంత వైభవముండిన నేమి అజున/కెల్ల సుఖములు ముగిసిన వెరుగుమింక/వేరు పేరాస లేక జీవించు నాకు,/ సుఖములన్నియు నీతోడి సొత్తులబల – అను రాళ్ళపల్లి వారి అనువాదము ‘విలపన్నితి కోశలాధిపః’ అను పదానికి ఇందుమతిని గూర్చి అజుడిటు లేడ్చు చుండ (39) అను రామారెడ్డిగారి అనువాదము ఆత్మీయతను కలిగించింది

ఇలా కరుణ రస పూరితంగా ప్రియురాలిని గూర్చి దుఖించిన అజుడు వృక్షములను కూడ మకరందములనే కన్నీటి చేత మలినమైనట్లుగా చేసాడు. ఇక్కడ వృక్షాలు చదువరులని భావం. ‘కరుణార్ద్ర గ్రథితం’ – ‘కరుణ రస పూరితములైన వాక్యములు పలికి’ అనడంలో ఈ కావ్య ఖండము కరుణ రస ప్రధానమని చెప్పడం జరిగింది.

ఆమె ఎదమీద పడిన కుసుమ మాలను తుది అలంకారంగా చేసి చందనాగురు కాష్ఠాలతో చితాగ్నికి సమర్పించాడు.

మగువకోసము భూపతి మరణమొందె
ననెడు లోకనిందకు వెఱగంది యజుడు
స్వీయ దేహమునగ్ని కర్పింప లేదు
అంతియే గాని బ్రతుకు పై ఆశ కాదు.(41)

అనువాదము కరుణకు పతాకగా నిలిచింది

శ్రీ నరాల రామా రెడ్డి గారు అనువాద కళలో సిద్ధహస్తులు. అనుభవగతమైన శోక విలాపము ఈ అనువాదంలో హృదయ జన్యమైన సహజ సిద్ధతను పొందింది.

Exit mobile version