శ్రీ అశోక్ కంటె గారు వ్యవస్థాపక ఎడిటర్ మరియు అధినేతగా ఉన్న ఏ.కే. తెలుగు మీడియా కార్యాలయం, బాంద్రా (పశ్చిమ), ముంబయిలో, తేది 08-08-2026 న సాయంత్రం 6.00 గంటలకు ఘనంగా ప్రారంభమయింది.
ప్రముఖ తెలుగు సినీ నటి, మరాఠీ, హిందీ రంగస్థల నటి జిజ్ఞాస చిల్క గారి హస్తాలతో ఏ.కే. తెలుగు మీడియా కార్యాలయం, ప్రారంభోత్సవం, ఆహ్వానితుల కరతాళ ధ్వనుల మధ్య కన్నుల పండువగా జరిగింది.
గత మూడు దశాబ్దాలనుండి శ్రీ అశోక్ కంటె గారు మహారాష్ట్రలోని తెలుగు వారికై ఎన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ముంబయి పశ్చిమ శివార్లలోని ప్రజల కోరికపై ఇప్పుడు బాంద్రా (పశ్చిమ), ముంబయిలోని ‘ఎల్కో ఆర్కేడ్’ భవన సముదాయంలో తమ కార్యాలయం, శ్రీ అశోక్ కంటె గారు ప్రారంభించారు. ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, తెలుగు వారికై ఎన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు చేస్తూ, మహారాష్ట్రలో జరిగే తెలుగు వారి కార్యక్రమాలకు తన ఏ.కే. తెలుగు మీడియా ద్వారా, శ్రీ అశోక్ కంటె గారు ఉచిత ప్రచారం కల్పిస్తున్నారు. అంతే కాదు, ముంబయి నగర పశ్చిమ శివార్ల సౌకర్యం కొరకు, తాను కార్యదర్శిగా ఉన్న మహారాష్ట్ర తెలుగు సంస్థల సమాఖ్య (ఫెడెరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఇన్ మహారాష్ట్ర -ఎఫ్.టామ్) కార్యకలాపాలు కూడా ఇదే కార్యాలయం నుండి నిర్వహిస్తామని శ్రీ అశోక్ కంటె గారు తెలిపారు. అలాగే శ్రీ నరేష్ బుట్కూర్ గారి “ఏన్.పి. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ” కూడా అదే కార్యాలయం నుంచి పని చేస్తుందని అన్నారు.
ప్రముఖ తెలుగు సినీ నటి, మరాఠీ, హిందీ రంగస్థల నటి జిజ్ఞాస చిల్క గారు ఏ.కే. తెలుగు మీడియాతో ముఖాముఖిలో, తన కుటుంబ నేపథ్యం, నటిగా తన ప్రయాణం గురించి వివరించారు. తాను పుట్టింది అహిల్యానగర్ లోనైనా, పెరిగింది మాత్రం ముంబయి శివార్లలోని ఠాణేలో అని చెప్పారు. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన తను, అనుకోకుండా నటనవైపు మొగ్గానని చెప్పారు. విజయ్ దేవరకొండ నటించిన ‘ద ఫామిలీ స్టార్’లో అనుకోకుండా ఒక పాత్రలో నటించే అవకాశం గురించి చెప్పారు. తనకు ఏ సీనీ నేపథ్యం లేని కారణంగా కథానాయిక పాత్ర కొరకు ఎదిరి చూడకుండా తనకు వచ్చిన చిన్న పాత్రల్లోనైనా నటించడానికి ఒప్పుకుంటున్నానన్నారు.
డా. అంబల్ల జనార్దన్, శ్రీ గంజి జగన్ బాబు గార్లు అతిథులుగా హాజరైన ప్రారంభోత్సవం తర్వాత, శ్రీ అశోక్ కంటె గారు మాట్లాడుతూ ముంబయి పశ్చిమ శివార్లలో కొన్ని లక్షల తెలుగు ప్రజలు ఉన్నారనీ, వారందరిని ఒక్క త్రాటిపై తెచ్చి, ముంబయిలో మన తెలుగు వారికి మంచి గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యాలయం ద్వారా ఫీజులు చెల్లించలేని బీద పిల్లలకు శ్రీ అజయ్ గారిచే కంప్యూటర్ శిక్షణ ఇచ్చే ఆలోచన ఉందన్నారు. ఇతర భాషీయుల లాగా ముఖ్యంగా మనం కూడా రాజకీయంగా ఎదిగి, పుర పాలక సంఘంలో, శాసన సభలో ప్రాతినిథ్యానికి ప్రయత్నం చేయాలన్నారు. దానికి, మన తెలుగు వారి ఐకమత్యమే మార్గం అని సూచించారు. శ్రీ గంజి జగన్ బాబు గారు మాట్లాడుతూ గుజరాతీ, మార్వాడీయుల్లాగ మనం, తోటి తెలుగు వారిని ప్రోత్సహించి ఆర్థికంగా మెరుగుపడాలన్నారు. ఆ కార్యాలయం ద్వారా మొబైల్ రిపేరింగ్, డ్రైవింగ్, ల్యాప్ టాప్ రిపేరింగ్ లాంటి చిన్న చిన్న వృత్తుల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలని డా. అంబల్ల జనార్దన్ గారు తన అభిప్రాయం వెలిబుచ్చారు.
హాజరైన మహిళలలకు టీ షర్ట్లు బహుమతిగా ఇచ్చారు. అందరికి అల్పాహారం సరఫరా చేశారు.
కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికి శ్రీ నరేశ్ బుట్కూర్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

