[శ్రీ బొందల నాగేశ్వరరావు గారు రచించిన ‘అక్కాచెల్లెలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆటో వచ్చి ఇంటి ముందాగింది. అందులో నుంచి దిగింది ప్రగతి. ఆటో వాడికి డబ్బులిచ్చేసి సూట్‌కేసును తీసుకొని గేటు తెరచుకొని లోపలికి నడుస్తుండగా కూతుర్ని చూసిన తల్లి సరస్వతమ్మ ఎదరే వెళ్ళి సూట్కేసుని అందుకొని.. “నా బంగారు తల్లి.. చెప్పినట్టు వచ్చేశావే! కూర్చో.. మంచినీళ్ళు తెస్తాను” అంటూ సూట్‌కేసును గదిలో పెట్టి ఫ్రిజ్‌లో వున్న మంచి నీళ్ళ బాటిల్‌ని తెచ్చి చేతికిచ్చింది.
“ఏమిటమ్మా! ఏదేని శుభవార్తను మోసుకొచ్చావా? మీ వారు రాలేదేంటీ? అల్లుడు గారిని చూసి దాదాపు మూడు నెల్లు!” ప్రశ్నలను సంధించింది సరస్వతమ్మ.
“నా సంగతి తరువాత చెపుతాను. నాన్నగారు గదిలో వున్నారా లేక ఆసుపత్రిలో వున్నారా?”
“మొన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయించుకొని తీసుకు వచ్చాను. ఆ గదిలో వున్నారు.”
“డాక్టర్లు ఏం చెప్పారమ్మా?”
“నాన్నకు క్యాన్సరుతో పాటు హార్టు, కిడ్నీ సమస్యలు కూడా వుండడంతో డబ్బెంత ఖర్చు పెట్టినా బ్రతకటం కష్టమన్నారమ్మా! మందులు వాడుతున్నాను.”
“ఇంతకు ప్రాబ్లెం థ్రోట్తో కదా! మాట్లాడగలుగుతున్నారా?”
“లేదమ్మా! ఆయనకు భోజనం పెట్టి సపర్యలు చేస్తున్నప్పుడల్లా కన్నీళ్ళతో నన్ను చూస్తుంటారే తప్ప మాట్లాడరు. నిన్నూ అక్కను చూడాలని సైగలతో చెపుతుంటారు. పద చూద్దువుగాని” కొంగుతో కన్నీళ్ళను వొత్తుకొంటూ భర్త గదిలోకి నడిచింది సరస్వతమ్మ. కూతురు ఆమెను వెంబడించింది.
“నాన్నా.. నాన్నా” కదుపుతూ పిలిచింది ప్రగతి.
వెళ్ళకిలా పడుకొని వున్న తండ్రి రామారావు ప్రయత్నించి కళ్ళు తెరచి చూశాడు. నోట మాట రాలేదు కాని కూతురి పిలుపుతో కన్నీళ్ళు తెచ్చుకొని ఆమె కళ్ళ లోకి చూస్తూ వున్నాడు.
ప్రగతి బాధపడింది. కేవలం చూపులకు మాత్రమే పరిమితమైన తండ్రి ప్రక్కన కూర్చొంది. బ్యాగులో వున్న బిస్కట్టు ప్యాకెట్టును తీసి ఒక బిస్కట్టును నీళ్ళలో ముంచి తినిపించి నీళ్ళు తాపింది. వయస్సులో వున్నప్పుడు ఆజానుబాహుడు, అందగాడనిపించుకున్న ఆనాటి తండ్రితో మంచానికే పరిమితమైన ఈ తండ్రిని పోల్చుకొని కన్నీళ్ళు తెచ్చుకొంది ప్రగతి.
“బాధపడకు నాన్నా! నేనొచ్చానుగా. మిమ్మల్ని గొప్ప డాక్టర్లకు చూపించి బ్రతికించుకొంటాను. నన్ను చూశావు. అక్కనూ చూడాలి. అక్క విజయవాడలో వున్నట్టు తన స్నేహితురాలు ఒక్కర్తె చెప్పి అడ్రసు ఇచ్చింది. నేను వెళ్ళి తీసుకు వస్తాను” అంటూ తండ్రి కళ్ళనుంచి కారిపోతున్న కన్నీళ్ళు తుడిచి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొంది ప్రగతి. తల్లి సరస్వతమ్మ కూడా తన ప్రక్కన కూర్చొంది.
“అమ్మా! ఇప్పుడేం చేద్దాం?” తల్లిని అడిగింది ప్రగతి.
“అక్కను చూడాలని వుందమ్మా నాన్నకు! ఎందుకంటే.. నువ్వూ అక్కలా ప్రేమించి పెళ్ళి చేసుకొని దూరంగా వెళ్ళిపోయినా అప్పుడప్పుడు అల్లుడిగారితో వచ్చి కనబడుతున్నావు. నీ గూర్చి మాకు దిగుల్లేదు. కాని అక్క ఆ వసంత్‌తో వెళ్ళిపోయి సంవత్సరం కావస్తోంది. ఎక్కడుందో, ఎలా వుందో, ఏం చేస్తోందో! అసలు మన దేశంలో వుందో లేదోనన్న బాధతో కుమిలిపోతున్నాం. ఇప్పుడు తను విజయవాడలో వున్నట్టు చెప్పావుగా. వెళ్ళి తీసుకురామ్మా!” బ్రతిమాలింది తల్లి.
“అలాగేనమ్మా! రేపే విజయవాడకు వెళతాను” అంటూ ఆన్లైన్లో టిక్కెట్టు బుక్ చేసుకుంది ప్రగతి.
నిజం చెప్పాలంటే అక్కా, వసంత్‌లు లేచిపోయి విజయవాడలో వుండటానికి ఏర్పాట్లు చేసిన స్నేహితుల్లో ప్రగతి పాత్ర కూడా వుంది. కాకపోతే అమ్మానాన్నలకు అక్కపై వున్న కోపం తగ్గిన తరువాత వాళ్ళను ఇంటికి తీసుకురావాలనుకొంది. అందుకు సందర్భం – సమయం ఇప్పుడు కలిసి వచ్చాయి.
అక్కకు జరిగినట్టే ప్రగతి జీవితంలోనూ ఊహించని సంఘటన చోటు చేసుకొంది. అదే లవ్. అవును. ప్రగతి కూడా కాలేజీలో ప్రతాప్ అనే కుర్రాడితో ప్రేమలో పడి అతని నిర్బంధంతో తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా గుల్లో పెళ్ళి చేసుకొని కొన్నాళ్ళపాటు దూరంగా వుండిపోయింది. తరువాత తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ వాళ్ళకు దగ్గరయ్యింది. అంతే కాదు తను తల్లిదండ్రుల వద్ద కొస్తే వాళ్ళకు అవసరమైన పనులను చేసి పెట్టి తన వల్ల జరిగిన తప్పును వాళ్ళు మరచిపోయేలా చేసుకొంది. ఇవాళ తనకులాగే అక్కా, వసంత్ లను కూడా అమ్మానాన్నలకు దగ్గర చేయాలనుకొంది.
మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా టాక్సీలో బస్ టెర్మినస్‌కు వెళ్ళింది ప్రగతి. బస్సెక్కి సూట్‌కేసు పైన పెట్టి సీట్లో కూర్చొంది. సీట్లో కూర్చొందే తప్ప ఆమె మనసు రకరకాల ఆలోచనలతో మెదడు వేడెక్కిపోగా నొసలు తడుముకొంటూ అటు కిటికీలోనుంచి బయటికి చూసింది. అక్కడో జంట బెంచీలో కూర్చొని ఘర్షణ పడుతోంది. వాళ్ళని గమనించిన తను వాళ్ళ మాటలను వినసాగింది.
“నిన్ను నమ్మి ఇల్లు వదలి వచ్చేశాను సూర్యా! తిరిగి వెళ్ళలేను. మనం ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకొందాం! కొన్నాళ్ళు మీ, మా అమ్మా నాన్నలకు దూరంగా వుందాం” అంటోందా అమ్మాయి.
“తరువాత..!” అడిగాడా అబ్బాయి.
“మెల్లగా విషయాన్ని మా అమ్మానాన్నలకు చెప్పి వాళ్ళను ఒప్పించి మా ఇంటికి వెళదాం.”
“అది కుదరదు సిరి! నేను మీ నాన్న కంట పడితే రౌడీలతో నన్ను చంపిస్తాడు.”
“అందుకూ..?”
“ఏదో ప్రేమ పిచ్చంటూ కొన్నాళ్ళు తిరిగాం. ఇవాల్టినుంచి అలా తిరగడం మానుకొని ఆ ప్రేమకు కాస్త స్వస్తి చెప్పి విడిపోదాం!” నసుగుతూ అన్నాడు.
“ఛీ! నువ్వు ఇంతటి పిరికివాడివా! అలాంటి వాడవు నన్నెందుకు ప్రేమించావు?” రెచ్చిపోయి షర్టు పట్టుకొని వూపిందా అమ్మాయి. మౌనంగా నేలను చూస్తూ వుండి పోయాడా అబ్బాయి. అంతలో అక్కడికి ఓ కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఇద్దరు మగవాళ్ళు దిగి ఆమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్ళి పోయారు.
‘నిజమే! బహుశా ఇలా ప్రేమించుకోవటం, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని ఒప్పించి పెళ్ళి చేసుకొని స్థిరపడ్డమన్నది ఏ కొందరికో కాని అందరికీ కాదు’. అందుకే అన్నారు.. ‘పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు గట్టిగా ముడిపడి విడదీయరాని బంధంతో కొనసాగుతాయ’ని. ‘నిజానికి తల్లితండ్రులు కుదిర్చిన పెళ్ళిళ్లే వంద శాతం వుత్తమ మైనవి’ అని మనసులో అనుకొంటూ వుండగా “టిక్కెట్టు ప్లీజ్!” అడిగాడు కండక్టరు. అతనికి మెసేజ్‌లో వున్న టిక్కెట్టు వివరాలను అందజేసి శూన్యంలోకి చూస్తూ నాడు అక్క ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి పోయిన సన్నివేశాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంది ప్రగతి.
***
ఆ రోజు రాత్రి పది గంటలకు..
అక్కకు, తనకు ఒకే పడగ్గది. అక్క ఫోర్త్ ఇయర్ బి.టెక్. తను థర్డు ఇయర్. అక్క, తన క్లాసుమేటు వసంత్‌తో ప్రేమలో పడి సంవత్సరం నుంచి రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోంది. కొన్నాళ్ళకు వాళ్ళ సంగతి తల్లిదండ్రులకు తెలిసి పెళ్ళికి కుదరదనటంతో లేచిపోదాం అన్న వసంత్ మాటలకు తలొగ్గిన అక్క సూట్‌కేసులోకి బట్టలు సర్దుకొంటోంది. అది గమనించిన ప్రగతి..
“ఏంటక్కా! బట్టలు సర్దేసుకొంటున్నావ్. వసంత్‌తో వెళ్ళిపోతున్నావా?” అడిగింది.
“అవును! వసంత్‌తో నా పెళ్ళికి అమ్మా నాన్నలు ఒప్పుకోవటం లేదుగా! వసంతేమో మా పెళ్ళి జరక్కపోతే ఏ అఘాయిత్యమో చేసుకొని చచ్చిపోతానంటున్నాడు. అందుకే ఈ నిర్ణయం.”
“ఓకే! ఇది నీ జీవితం. దానిపై నిర్ణయం తీసుకునే హక్కు నీకే వుంది. కాకపోతే చెల్లిగా నాదో ప్రశ్న!”
“ఏమిటో అడుగు?”
“నీకు ఇరవై రెండేళ్ళు. నువ్వు ప్రేమించిన వసంత్‌తో వెళ్ళిపోయి హాయిగా బ్రతగ్గలవన్న నమ్మకం నీకుంది. మరి నిన్ను కని పెంచి చదివించి ఇంతటి దాన్ని చేసిన అమ్మా నాన్నల సంగతేంటి? వాళ్ళకు దిక్కెవరు?” నిలదీసింది ప్రగతి.
“ఏం.. బుద్ధిమంతురాలివి, వాళ్ళ ముద్దుల కూతురివి నువ్వున్నావుగా.. జాగ్రత్తగా చూసుకో! ఇక నా గూర్చి అమ్మానాన్నలు నాలుగు రోజులు బాధపడతారు. తరువాత మరిచిపోతారు. చూడూ! ఇన్నాళ్ళు మా ప్రేమను ప్రోత్సహించిన నువ్వు మేము వెళ్ళిపోవటానికి కూడా సహాయం చెయ్యవే ప్లీజ్! భయపెట్టకు” అంటుండగా బయట బైకు హారన్ మోగింది. అక్క సూట్‌కేసు తీసుకొని వెళ్ళి బైకెక్కి కూర్చొని చెయ్యూపుతూ.. “దయచేసి నేను వసంత్‌తో వెళ్ళి పోతున్నసంగతి అమ్మా నాన్నలకు చెప్పకు. మేము ఎక్కడుంటామోనన్న సంగతి నీకు ఫోన్లో చెపుతాను” అంది.
అక్క అన్నట్టే అమ్మానాన్నలు వారం పాటు తిండి తిప్పలు మానుకొని ఆమె కోసం వెతికారు. బంధువుల ఇళ్లకు ఫోన్లు చేశారు. ఆచూకీ తెలియక పోయేసరికి పోలీసు కంప్లయింటు ఇవ్వాలని ప్రయత్నిస్తుండగా ప్రగతే చాలా తెలివిగా ‘మన పరువు బజారు పాలౌతుంది నాన్నా! పోలీసు కంప్లయింటు ఇవ్వకండి’ అని చెప్పి అక్క ఎక్కడుందో కనుక్కొని ఇంటికి తీసుకు వచ్చే బాధ్యత తనదేనని వాళ్ళను నమ్మించింది.
***
అంతలో “మేడం! విజయవాడ వచ్చేశాం. దిగండి!” అని కండక్టరు అంటూనే ఈ లోకంలోకి వచ్చి పడ్డ ప్రగతి సూట్‌కేసును తీసుకొని క్రిందకు దిగింది. ఆటోలో అక్కా, వసంత్‌లు వుంటున్న ఇంటికి వెళ్ళింది. ఆటో దిగి గేటు తీసుకొని లోనికెళుతుంటే భార్యభర్తలిద్దరూ ప్రగతికి ఎదరే వచ్చారు.
“ఏం ప్రగతీ! బాగున్నావా?” అడిగాడు వసంత్.
‘ఊఁ’ అని “అక్కా! నీతో మాట్లాడాలి” సోఫాలో కూర్చొంది. వసంత్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
“అవునూ.. ఈ మధ్య నువ్వు ఫోన్ చేయటం లేదు. ఏమైంది నీకు?” అక్క ప్రశ్నించింది.
“అదిప్పుడంత ముఖ్యమా?!. నేను చెప్పేది విని వెంటనే ఇంటికి బయలుదేరండి. నాన్నా నిన్ను వసంత్‌ను చూడాలంటున్నారు. అయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇప్పుడో ఇంకాసేపటికోనన్నట్టు వున్నారు. బహుశా నాన్నకు ఇది చివరి కోరికేమో!..” అంది ప్రగతి.
ఆ మాటతో అక్క కళ్ళమ్మటి కన్నీళ్ళు జలజల రాలాయి. అమెకు నాన్నంటే బాగా ఇష్టం. అలాగే నాన్నకూ అక్కంటే ఎంతో ఇష్టం. అయితే అక్క వసంత్‌తో లేచి పోవటంతో నాన్న ఇన్నాళ్ళు చాలా కోపంతో వున్నాడు. కాని ఇవాళ అక్కను, వసంతును చూడాలంటున్నాడు.
“నిజమా ప్రగతీ! నాన్న నన్ను చూడాలంటున్నాడా? ఆయనకు మా మీద కోపం లేదా?” ప్రిజ్ లోని నీళ్ళ బాటిల్‌ని తెచ్చి చేతికిస్తూ అంది అక్క.
“చూస్తారుగా.. ఆఫీసుకు నాలుగు రోజులు సెలవు చెప్పుకొని బయలు దేరండి” అని అక్కను అలా పరిశీలనగా చూసింది ప్రగతి. అక్క వసంత్‌తో చాలా హాపీగా వున్నట్టనిపించింది తనకు.
కాని తన జీవితమే అగమ్యగోచరంగా మారిపోయింది. అవును. ప్రతాప్‌తో ప్రేమలో పడ్డ తను అతని నిర్బంధం వల్ల తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్ళి చేసుకొని నిత్యం ఘర్షణలతో తృప్తి లేని జీవితం సాగించింది. అందుకే అక్క ప్రతాప్‌ను గూర్చిఅడిగితే ఎలాంటి వివరణ ఇచ్చుకోకుండా మాటను దాటవేస్తోంది.
వూరికి బయలుదేరటానికి డ్రస్ చేసుకొంటున్న అక్కకు ప్రగతి మీద ఏదో సందేహం రాగా “ప్రగతీ.. ఇటు గదిలోకి రా!” అని పిలిచింది.
అక్క పిలుపుకు వులిక్కిపడ్డట్టు “ఇదిగో వస్తున్నా!” అంటూ గదిలోకి వెళ్ళింది.
“కాస్త ఈ చీర కుచ్చిళ్ళు సరిచేయి” అంది ప్రగతి ముఖంలోకి చూస్తూ అక్క.
“అలాగే!” అని క్రిందకు వొంగి చీర కుచ్చిళ్ళు సరి చేస్తోంది ప్రగతి. “అవునూ! వచ్చినప్పటినుంచి ప్రతాప్‌ను గురించి అడుగుతున్నాను. విషయాన్ని దాట వేస్తున్నావే తప్ప ఏమీ చెప్పవు. ఏమిటి దెబ్బలాడుకున్నారా!” అడిగింది అక్క.
అప్పుడు క్రిందకు వంగి చీర కుచ్చిళ్ళు సరిచేస్తున్న ప్రగతి కళ్ళనుంచి కన్నీటి బొట్టొకటి రాలి అక్క కాలి మీద పడింది. వెంటనే చెల్లిని పైకి లేపి చూసింది. ప్రగతి కళ్ళ నుంచి కన్నీళ్ళు కారిపోతున్నై. ఆ కన్నీళ్ళను తుడుస్తూ “ఏమైంది ప్రగతీ?!” అడిగింది అక్క.
“ప్రతాప్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడక్కా! వాడు నన్ను వదిలేశాడు. ఓ ఎన్.ఆర్.ఐ. అమ్మాయితో లేచిపోయి యు.ఎస్., లో వున్నాడని తెలిసింది!” అంది ప్రగతి. షాక్ తింది అక్క.
“ఏమిటే నువ్వంటుంది! ఇద్దరూ అంత గాఢంగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నాం అన్నావు. అమ్మా నాన్నలను ఒప్పించి ప్రతాప్‌ను మన ఇంటికి కూడా తీసుకు వస్తున్నట్టు చెప్పావు. కనీసం మీరైనా అమ్మానాన్నలకు తోడున్నారనుకున్నాం. ఇదేంటి పిడుగులాంటి వార్తను చెప్పావు!” అడిగింది అక్క.
“అవును. ఈ సంగతి నీకూ నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. తెలియకూడదు. అక్కా! నీకు దొరికిన వసంత్ మనసున్న మంచి మనిషి. నాకు దొరికిన ప్రతాప్ మనసు లేని మనిషి, ఇంకా చెప్పాలంటే క్రూరుడు. మూర్ఖుడు. నరరూప రాక్షసుడు. అయినా వాడితో కాపురం చేశాను. గర్భవతినీ అయ్యాను. కాని వాడు ‘మనకు అప్పుడే పిల్లలు వద్ద’ని అబార్షను చేయించాడు. అది కుట్రతో చేయించాడని వాడు నన్ను వదిలి పెట్టి మరో అమ్మాయితో వెళ్ళిపోయిన తరువాతే తెలుసుకున్నాను. బాధపడ్డాను. చట్టపరమైన చర్యలూ తీసుకోలేని అసమర్థురాలినైయ్యాను. మొత్తంలో ఒక్క విషయం తెలుసుకున్నాను. తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమ పెళ్ళంటూ పిచ్చి నిర్ణయాలు తీసుకునే మనలాంటి ఆడపిల్లల బ్రతుకులు బహుశా ఇలాగే వుంటాయేమో. అక్కా! నేను వన్స్ ఫర్ ఆల్ మనింటికి వచ్చేశాను. ఈ సంగతి అమ్మా నాన్నలకు తెలియనీకు” అంటూ పెద్దగా ఏడ్చింది ప్రగతి.
ప్రగతిని అమాంతం అక్కున చేర్చుకున్న అక్క “ఎవ్వరికీ చెప్పను ప్రగతీ! నా గుండెల్లోనే దాచుకుంటాను. ఒక్కటి మాత్రం నిజం. నువ్వన్నట్టు యవ్వనపు పొంగులో ప్రేమా పిచ్చంటూ అమ్మా నాన్నలను మోసం చేసి తీసుకునే పిచ్చి నిర్ణయాలు ఎప్పటికీ తప్పే! ఎలాగో భగవంతుడు నాకు వసంత్‌ను భర్తగా చేసి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. నీకే ఆ ప్రతాప్‌ను జత చేసి..! చూడూ ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు తీసుకొనే ఏ నిర్ణయమైనా సరే అది ‘మన మంచికే’! గతం గతః. అదో పీడకల అనుకొని మరిచిపోయి భవిష్యత్తును గూర్చి ఆలోచించు. పద!” అంటూ వసంత్ పిలిపించిన టాక్సీలో చెల్లెలితో పాటు ఎక్కి కూర్చొంది అక్క.
బొందల నాగేశ్వరరావు కథా రచయిత, బాల సాహితీవేత్త, నాటక రచయిత. అరవై వరకూ కథలు,నలభై వరకూ బాలల కథలు వ్రాశారు. ఈ కథలన్నీ ప్రముఖ ప్రింట్/ఆన్లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరు రచించిన 23 నాటకాలు/నాటికల్లో కొన్ని జాతీయ స్థాయి పరిషత్తుల్లో ప్రదర్శనలు జరుపుకొని బహుమతులను గెలుచుకొన్నాయి. నాగేశ్వరరావు సినిమాలకు రచనలు చేశారు. “నిర్ణయం”,”విశ్రాంతి కావాలి” అనే కథల సంపుటాలు వెలువరించారు.
