[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘అక్షర దీపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వత్తి నూనెల అక్కర లేని మట్టి ప్రమిద,
అక్షర దీపాల వెలుగు నిస్తుంది.
యాపిల్ బుగ్గల పసిడి తోటలో..
చీకటి సోకని
కంటి కాంతుల
కాపుదలతో,
నాణ్యమైన పళ్ళ గుత్తుల పంటను
గంపలకెత్తుతుంది.
ఇంటి ఆవరణను దాటిన
విశాల గగనం లో
ఉషోదయాలకు,
సహవాసకిరణాల మైత్రీ బలాన్ని
గుప్పిట ధరించి చూపుతుంది.
గణితంలో బ్రతుకు తెరువు
చిక్కుముడులను విప్పింది.
భౌతిక శాస్త్ర బోధనలో
శక్తి విన్యాసాల
పని మెలకువ తెలిపింది.
విజ్ఞాన వికాస ప్రతిభలకు
వియత్తల ప్రయోగాల
విశ్వ భ్రమణాన్ని చూపింది
తేట తెలుగు భాషా సౌందర్యానికి,
కావ్య శ్రావ్యతల ఘనతను వివరించింది.
ఆమె ఉపాధ్యాయినిగా
వృత్తి గౌరవాన్ని పెంచింది.
ఇప్పటికీ శుభోదయాల
మాధ్యమ సందేశాలకు,
మరువని విశ్వాసాలకు,
కనురెప్పల తడి
మినుకు మంటుంది.
అప్పటి తరగతి పాఠంలో
శిక్షణ పొందిన విద్యార్థి
అనుసరించిన ప్రగతి పథానికి,
తెరచి ఉంచిన గవాక్షాన
జ్ఞాన పుంజ మొకటి
ప్రసరించి వచ్చి
గురు దక్షిణ నిచ్చినట్లు
మనసు నింపుకుంటుంది.
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
