Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అక్షర సేద్యం.. ఆశల యుద్ధం!

[కాదాసి అమరేందర్ గారు రచించిన ‘అక్షర సేద్యం.. ఆశల యుద్ధం!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

హైదరాబాద్ మహానగరపు
వేగవంతమైన కోలాహలంలో,
చిక్కడ్‌పల్లి కేంద్ర గ్రంథాలయ క్యూలైన్ల నిశ్శబ్దంలో,
అఫ్జల్‌గంజ్ చారిత్రక గోడల నీడన,
కరిగిపోతున్న వసంతాల సాక్షిగా..
సాగుతోంది ఒక అదృశ్య నిరుద్యోగ పోరాటం..!

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా,
పుస్తకాల గుట్టల మధ్య ప్రాణాన్ని పణంగా పెట్టి,
నోటిఫికేషన్ల క్యాలెండర్‌పై ఆశల చూపులు నిలిపి,
చివరి మైలురాయి వద్ద చేజారిన విజయాన్ని చూసి,
హుస్సేన్ సాగర్ అలల సాక్షిగా గుండెల్లోనే ఏడ్చిన క్షణాలు ఎన్నో..!!

పండుగలకు ఊరు వెళ్ళలేని నిస్సహాయత,
“ఇంకెన్నాళ్లీ చదువులు?” అనే సమాజపు నిందాస్వరాలు,
పుస్తకాల ఖర్చులు, కోచింగ్ ఫీజుల భారంతో నలిగిపోతూ,
కన్నవారి కళ్లలోని ఆశల బరువును మోస్తున్న భుజాలు,
కాలాన్ని ఎదురిస్తూ చేస్తున్న ఈ ప్రయాణం ఒక తీరని వేదన..!!

ఐటి కారిడార్ మెరుపుల వెనుక దాగి ఉన్న చీకటిలా,
సిటీ బస్సుల ప్రయాణాల అలసటలో,
ఓటమి ఎదురైన ప్రతిసారీ సమాజపు వెటకారపు చూపులు,
అపరాధ భావనతో సొంతూరి ముఖం చూడలేక,
లోలోపల రగిలిపోతున్న నిరుద్యోగ గుండెల గాయాలు ఎన్నో..!!

కానీ.. ఈ హైదరాబాద్ నగరం కేవలం పరీక్షించడమే కాదు,
సమరశీల చైతన్యాన్ని కూడా నరనరాల్లో నింపుతుంది!
ఈ చారిత్రక జ్ఞాన వేదికల సాక్షిగా ప్రకటిస్తున్నాం..
ఈ కన్నీళ్లు వృథా కావు, ఈ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కాదు…!!

చీకటిని చీల్చుకుని ఉదయించే బాలసూర్యుడిలా,
ఒకరోజు నోటిఫికేషన్ విజేతగా నిలిచి,
ఈ నగరపు వీధుల్లో గెలుపు జెండా ఎగరేస్తాం..
ఈ సమాజపు విమర్శల శబ్దాలన్నింటికీ,
మా నిశ్శబ్ద విజయమే ఒక గట్టి సమాధానం..!!

Exit mobile version