Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అక్షర శంఖారావం

[శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి రచించిన ‘అక్షర శంఖారావం’ అనే కవితని అందిస్తున్నాము. సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితలో పోటీలో బహుమతి పొందిన కవిత.]


ప్రేమంటే ఇరువురి కలయిక కాదు,
అది ఆత్మను శోధించే నిరంతర జ్వాల
జిహాద్ అంటే పరాయిని కూల్చడం కాదు,
నీలోని అహంకారాన్ని జయించే ధర్మయుద్ధం!

ఖురాన్ సూక్తుల అంతరార్థం ఉన్మాదంతో ఖరాబు కానీయకు,
ఆత్మశుద్ధితో అహంపై సమరమని గ్రహించి మసలుకో!
సహనం కన్నీటి సంద్రం కాదు, కాలాన్ని శాసించే కలమ్,
అది ఆవేశాన్ని అక్షరం చేసి లోకాన్ని మార్చే సంగ్రామమని తెలుసుకో!

మతమంటే మనుషుల మధ్య గోడ కాదు, అది విరిసే మమకారం,
హృదయం ఒక మసీదుగా, కరుణే ఒక ప్రార్థనగా సాగే మహాకార్యం.
కత్తి అంచున ధర్మం మొలవదు, అది కేవలం అధికార దాహం,
పసి ప్రాణాలు బలితీసే చోట సాగేది.. అధర్మపు అట్టహాసం!
మారణహోమాన మానవత్వం మంటగలిస్తే అది విజయమెలా అవుతుంది?
రక్తపు మడుగున న్యాయం మునిగిపోతే, ఆ చరిత్ర రేపటికి ఏం బోధిస్తుంది?
పశుత్వాన్ని చంపుకోమన్న ధర్మయుద్ధానికి చిన్నారుల హాహాకారాలు, అబలల ఆక్రందనలా?
ఇదేనా మతం నేర్పిన జిహాద్ మర్మం? ఇదా ధర్మం చెప్పిన పవిత్ర యుద్ధం?

ప్రేమకు రంగులు పూయకండి, మతం ముసుగులో మారణకాండను సాగనీయకండి,
మౌనాన్ని వీడి.. సిద్ధాంతాల వెనుక దాగిన అధర్మాన్ని ఎండగట్టండి!

ఓ మనిషీ మేలుకో! మనిషిగా నీ మనుగడకే పొంచి ఉన్న ముప్పును ఎదుర్కో!
మౌనం మరణంతో సమానం.. అక్షరమై నీ హక్కును అడుగు!
జ్ఞానమనే ఆయుధాన్ని విసిరి.. వ్యవస్థల అరాచకాన్ని నిలదీయు!
ఈ నిలదీతకు తోడుగా, వివేకపు వెలుగుతో కుట్రల మూలాలను నరికేయ్,
మతపిచ్చిని తుడిచేసే మానవతావాద విద్యావ్యాప్తిని ఇల్లాలుగా చేసుకో!

ధర్మంపై బురద జల్లే మేధస్సు ఆడబిడ్డల ఆత్మగౌరవం ముక్కలవుతుంటే మూగబోరాదు,
విమర్శలో ఉన్న వేగం వివక్షను ఎదిరించడంలో వెనుకాడరాదు.
ప్రేమ అన్న పిలుపులో తీవ్రవాదపు ఛాయలు
నీడలా వంచన వెంటాడుతుంటే,
తీరాల దాటించే కుట్రలు మన కళ్లముందే జరుగుతుంటే..
మౌనంగా ఉండటం మన బలహీనతా?

కాబోదు! ఆ చట్టాల కోరలకు పదును పెట్టి, నిఘా నేత్రాలై ఊరువాడ కాపలా కాయాలి,
మోసపూరిత వంచనల వెనుక ఉన్న ఉచ్చులను చదువుకున్న బిడ్డలే ఛేదించాలి!
కన్నవారి కళ్లల్లో కన్నీటి సుడులు, కూతుర్ని కోల్పోయిన గుండెల్లో అగ్నిగుండాలు,
ఆడబిడ్డల ఆత్మగౌరవం అంగడి సరుకవుతుంటే
లోపం ధర్మంలోనా? సమాజంలోనా? లేక సంస్కారాన్ని నేర్పని కుటుంబంలోనా?

కుటుంబాలే తొలి బడులై, స్త్రీ గౌరవమే పరమార్థంగా ప్రతి ఇంటా సంస్కారం మొలవాలి,
లింగభేదం లేని సమసమాజ స్థాపనకు ప్రతి తల్లిదండ్రీ పునాది రాయి వేయాలి!
మతం ముసుగులో మనిషిని మింగేసే మృగాలు,
అధికార అహంకారంతో పశుబలాన్ని చూపే నీచులు..
ప్రేమ పేరుతో ప్రాణాలను బలితీసుకుంటుంటే
సమాజతేజమా నువ్వు నిశ్శబ్దంగా ఉండకు!

న్యాయస్థానాల వేగాన్ని పెంచి, మృగాలకు తక్షణ శిక్షల ఉరితాడు బిగించాలి,
భయమే లేని సమాజంలో భద్రత అనే గొడుగును ప్రతి ఆడబిడ్డకూ తొడగాలి!

అంకురార్పణ ఎక్కడో అక్కడ జరగాలి..
ప్రభుత్వ దరఖాస్తుల నుండి మొదలవ్వాలి!
పొట్టకూటి కోసం చేసే ఉద్యోగానికి కులం అనే విభజన ఎందుకు?
సాయం కోరే అభ్యర్థికి మతం అనే ముద్ర ఎందుకు?
అర్హతను కొలిచే చోట అడ్డుగోడలెందుకు?
ప్రతిభను తూచే తూకంలో ఈ వివక్షల తడబాటులెందుకు?

నిజమే! ప్రభుత్వ పత్రాల నుండి మత, కులాల గడులను శాశ్వతంగా తొలగిద్దాం,
ప్రతిభే ఏకైక ప్రామాణికంగా, మానవత్వమే పరమ అర్హతగా సరికొత్త చట్టాలు తెద్దాం!
దరఖాస్తు నుండి వివక్షను తుడిచేద్దాం.. మనుషుల మధ్య మమకారాన్ని మాత్రమే నింపుదాం!

సమాజమని సమూహమైన ఓ సగటు మనిషీ!
ఎన్నాళ్ళీ మౌనం.. ఇంకెన్నాళ్ళీ నరరూప రాక్షసకాండల వేడుక చూస్తావు?
నీ కళ్లముందే ఆడబిడ్డల ఆత్మగౌరవం ముక్కలవుతుంటే,
మతం ముసుగులో వంచన మారణహోమం చేస్తుంటే,
ఇంకా ఎంతకాలం గుడ్డిగా, మూగగా మిగిలిపోతావు?
ఈ అరాచకపు హాలాహలాన్ని నీ గొంతులో నింపుకో,

కళ్లు తెరువు.. నీ చదువును ఆయుధంగా మార్చు,
నీ గొంతును సామాన్యుడి కంఠారావంగా మార్చు!
మత్తులో నిద్రపోతున్న సమాజాన్ని..
నీ కంఠారావంతో తట్టిలేపు!
నిరసనల గొంతుకలతో పాటు, ప్రతీ ఇల్లూ ఒక చైతన్య కేంద్రం కావాలి,
అక్షరమే ఆయుధమై, చట్టమే రక్షణ కవచమై, ఐక్యతతోనే ఈ చీకటిపై సమరం గెలవాలి!

Exit mobile version