Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అక్షరాంజలి: పత్రికే ప్రజాపాశుపతాస్త్రం

[3.10.2025న తమ తండ్రిగారు శ్రీ యం యస్ ఆచార్య శతజయంతి సందర్భంగా శ్రీ మాడభూషి శ్రీధర్ అందిస్తున్న రచన.]

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్ తొక్కుకోవలసిందే.  ఎడిటర్ అయ్యే దాకా చిన్నప్పడినుంచే సైకిల్ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్ నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి.

ఆ పోరాటశీలి  యం. యస్. ఆచార్య 1924 లో జన్మించారు. 3 అక్టోబర్ 2024 శతజయంతి సంవత్సరం.

సాధారణంగా జయంతి, తరువాత వర్థంతి సంవత్సరం సంఖ్యతో సాగిస్తారు. పుట్టిన తరువాతే కదా జీవనం మొదలయ్యేది! మధ్యలో చెప్పవలసింది ఇంకేమీ లేదా? ఇదీ ప్రశ్న. దంపతులిద్దరికీ వివాహ దినోత్సవం కూడా ముఖ్యమే. కాని వారికి కేవలం సొంతమైన వ్యవహారం. చదువు, ఉద్యోగాలు, కష్టాలు ప్రతి వ్యక్తికీ మామూలే.  కొందరి వ్యక్తులను గుర్తు చేసుకుంటాం. ఆచార్య దివంగతులైన తరువాత మరిచిపోవడం కూడా సాధారణమే.

జనన మరణాల మధ్య ఆచార్య జీవన పోరాటంలో మైలురాళ్లు ఉన్నాయి.

1994 జులై 12 దాకా చివరి ఊపిరి ఆగిపోయే వరకు నుంచి 70-71 ఏళ్ల వయసులో పత్రికల ద్వారా చైతన్యం ఆలోచనలను కల్పించారు. అప్పడినుంచి స్ఫూర్తిగా కొనసాగుతున్నారు.

ఒక్క పేజీలో సరిపోయే మూడు నాలుగు పేజీల్లో విస్తరించి ప్రభుత్వానికి మోసం చేస్తూ కోట్లాది రూపాయలు తీసుకోవచ్చు అనే అవకాశం ఉంది కాని, ఎం ఎస్ ఆచార్య అందుకు ఒప్పుకోలేదు. పోతే పోయింది. ఇన్నాళ్ల పాటు బతుకున్న నీతిని ధర్మాన్ని జనధర్మాన్ని రక్షించుకోవడానికి అవినీతికి అమ్ముకోవద్దని నిర్ణయించుకున్నారు.

నిజాల కోసం బతికి, నిజాం దుర్మార్గాలకు బతుకు బలిచేసే దశల్లో తానే కాక, మొత్తం కుటుంబాన్ని, పత్రికనీ, పత్రికా స్వాతంత్ర్యాన్ని బతికించిన వ్యక్తి కథ ఈ రచన. తండ్రిగారు యం యస్ ఆచార్యగారికి, వారి జననీ జనకులకు, ధర్మపత్ని మా అమ్మ కు వారి పూర్వీకులకు వందలాది నమస్కరిస్తున్నాను.

తెలంగాణ సాహిత్యానికి, సాంస్కతిక వారసత్వానికి సముచిత గౌరవ ప్రాభవాలను కల్పించడానికి ఈ పత్రికల ద్వారా వేదికను ఏర్పరచాడు. సామాజిక సమస్యలను చర్చించడానికి పరిశోధనాత్మక వార్తాంశాలను గుప్పించడానికి, సమకాలీన సంకర విలువలను ఎండగట్టడానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగపడినాయి. వరంగల్ కోసం, తెలంగాణ కోసం, జన్మభూమి కోసం జీవితమంతా ధారబోసిన యం యస్ ఆచార్య జీవన పోరాటం.

దాదాపు 30 ఏళ్ల కిందట జనదర్మ వారపత్రిక ఆగిపోయినా, చేతులు మారిన వరంగల్ వాణి పత్రిక వరంగల్లు కొనసాగుతున్నది. యం. యస్. ఆచార్య..

~

అక్షరాంజలి: పత్రికే ప్రజాపాశుపతాస్త్రం

తెలుగు పత్రికలపై నిషేధమ్ము ధిక్కరించి పత్రికలు పంచి లాఠీలు తిన్నవాడు
తెలుగు వద్దన్న నిజాము దుష్ట పాలనలోన తెలుగు వర్ధిల్ల వార్తలు వ్రాసినాడు
కుంభకోణాలు కనిపెట్టి, నకిలీ ఎన్ కౌంటర్ల పసిగట్టి ఆనాడె అధికార దుర్నీతి తిట్టినాడు
రజాకార్ రాక్షసాల బాధితులకు అండగా కాగడాపట్టి నిశి రాత్రుల గస్తీ కట్టినాడు

ఎస్వాసుగా కలమెత్తి చెడును ఎండగట్టినాడు ఎదురెవరైన బెదరని గట్టి వాడు
అక్షరాలనధికార మదాంధులకమ్మి పదవులు తోటల పొలాల బిచ్చమెత్తని వాడు
మిగిలిన నాలుగురాళ్లు తగిలిన నాలుగురాళ్లు పత్రికా సౌధపు పునాదులన్నవాడు
నీతిని నిర్భయతను నిలిపి కడగండ్లనెదురొడ్డి నిలకడకు నిలువెత్తు రూపైన వాడు

పర్సెంటేజీలు ఇచ్చి ప్రభువుల ప్రకటనల అవినీతి గడ్డి కాశపడక
ప్రకరణ ప్రచురణలు కూళలకమ్మి అప్పడుపుకూడు వద్దన్న పోతన్నవాడు
తనవారు పరవారు ఎవరు ఏమన్న జనస్వామ్యదొంగల కుట్రలెన్నిన వాడు
జనచైతన్యమ్మె తన ఆశయమ్మని వార్తా వ్యవసాయ వర్క్ హాలికుడైన వాడు

జనధర్మమ్ము తన ధర్మమ్మని ఎంచి జనధర్మ పత్రిక నడిపిన వాడు
పెద్దమనుషుల ఒప్పంద ఉల్లంఘనల నాలుగేళ్లలోనె వెల్లడించిన వాడు
విశాలాంధ్ర ఆశలు నీరు కాగ కుటిలాంధ్ర కులనీతిపైన గళమెత్తిన వాడు
గోదారి దొంగల దారిమళ్లింపుల నడ్డివిరిచి సమతా సమరసేనాని ఐన వాడు

‘వరంగల్ వాణి’ అని జిల్లాల ప్రాంతాల పరిమితులెందుకని నేను ప్రశ్నించ
న్యూయార్క్ టైంస్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల పక్కవారు చదవరా అన్నవాడు
తెలంగాణ స్వాభిమాన స్వాతంత్ర్య దీప్తికై అక్షరాయుధాలనిచ్చిన వాడు
ప్రజానాయకుల వాకిలి కుక్క కాదు పత్రిక ప్రజల పాశుపతమ్మన్న వాడు

నీలాలకు కాసులకు నియమాలు వదిలి భజన సేయు కొన్ని కలాలకన్న
అక్షరాక్షరాన కాకతీయ పౌరుషమ్మునింపి, చురుకైన వాక్యాల చురకలిచ్చి
అహోరాత్రముల ముద్రాక్షరాల యోగముద్ర దాల్చి ప్రభువుల నిద్ర కాల్చి
దుర్జననేతల గుండెల రైళ్లు నడిపి జనవరేణ్యుడైన జనధర్మ జర్నలిస్టు

పఠితల మెదళ్ల బూజుదులిపి, పాతక పాలక ఖాదీల దుమ్ముదులిపి
జనము వైపు నిలిచి జనహితమ్ము దీప్తించిన జనధార్మికుడతడు
కవులకు కలము, రచయితలకు బలము, కళాకారుల వెన్నుదన్ను
జనధర్మపు మాటయై బాటయై వరంగల్లు వాణియైబాణియైన పెన్ను

వచనాలు వ్యాసాలు నవలలు లేఖలు ఎవేవో ఎవరెవరో ఇక్కడ
ఈ అక్షర కర్మాగారాన ఘర్మజలము చిందిన సత్ కర్మవీరులైరి
నాలుగు పేజీల విస్తరించిన నవరంగ జీవరస వ్యాసతరంగ గంగ
సువిశాల భావాల భగీరథ చక్రవర్తి మాడభూషి శ్రీనివాస మూర్తి

జనధర్మమ్మింక రాలేకపోయినా వరంగల్లు వాణి కొంత జీరబోయినా
నీ రాతలు చెరిగిపోవు, నీ విలువలు తరిగిపోవు, ఆ ఫలాలు రాలిపోవు
సైబర్ వీధుల ఆరచనలు మెలుగు గాక, నీ స్ఫూర్తి నారచనలై వెలుగు గాక
తెలుగు విజ్ఞానదీప్తియై నిత్యమ్ము నీ వచనరచన ఇంకింత మెరయుగాక

నిలువెత్తు నీవు, విలువెత్తు నీవు, ఎలుగెత్తి నీవు తెలుగెత్తుదువీవు
వర్ణమై పదమై వాక్యమై కావ్యమై తెలుగైన నీకు తెలివెలుగైన నీకు
ఎవరు మాత్రమేమివ్వగలరు గనుక, నీ వారసుడీ శ్రీధరుడి
హృదయముప్పొంగి స్రవించిన అశ్రువుల రాసినదీ అక్షర నివాళి.

Exit mobile version