Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అక్షయపాత్ర – పుస్తక పరిచయం

‘పెద్దమ్మ చెప్పిన పిల్లల కథలు’ అనే ఉపశీర్షికతో వెలువడిన అక్షయపాత్ర అనే పిల్లల కథా సంకలనంలో 45 కథలున్నాయి. తన తెలిసిన కథలను, తమ కుటుంబంలో సంప్రదాయంగా చెప్పుకుంటూ వచ్చిన కథలను గ్రంథస్తం చేసి పిల్లలు అందరికీ అందించాలనుకుని రచయిత్రి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. భాస్కర్, శ్రీనివాస్ ఆయా కథలకు అందమైన బొమ్మలను అందించారు.

***

“ఈ కథాసంపుటిలో పెద్దమ్మ చెప్పిన కథలే ఎక్కువ వున్నాయి. అయితే ఇంట్లోని ఇతర పెద్దలు చెప్పిన కథలు, నేను చిన్నతనంలో చదివిన, విన్న కథలు నాకు ఎంతో నచ్చినవి కూడా అదనంగా చేర్చడం జరిగింది. ఈ కథలన్నీ కూడా పిల్లలకు, పెద్దలకు ఎంతో ఆనందం కలిగిస్తాయిని నమ్మతున్నాను. ఆమె చెప్పిన కథలు మమ్ములను సేదతీర్చినాయి. నవ్వించి కవ్వించినాయి. ఊరడించినాయి. జీవితంపై ఆశలకు చివుళ్లు తొడిగించినాయి.

ఆమె చెప్పిన కథలు గుర్తొచ్చినప్పుడల్లా… పిల్లలకు చెబుతున్నప్పుడల్లా చల్లని ఆరుబయలు, వెన్నెలకు చల్లగా అయిపోయిన పరుపులు, చందమామ, నక్షత్రాలు, దగ్గర్లోని వేపచెట్టు గాలి, కాస్త దూరంలో వీరభద్రుని గుడి ముంగిట నిలిచి, చిన్నగాలికైనా పెద్ద చప్పుడు చేసి భయపెట్టే గంగరావి చెట్టు గలగలలు, పెద్దమ్మ పక్కన పడుకొని అక్కలు, అన్నలు, చెల్లెళ్లు, తమ్ముళ్లు అందరితో కలిసి కథలు వినడం గుర్తొస్తుంది. చలికాలం, వానాకాలాల్లో అయితే ఉయ్యాలల్లాంటి నులక, నవారు మంచాలపై పరుపులు వేసుకొని, దోమతెరలు కట్టుకొని తలలు మాత్రం బయట పెట్టి పెద్దమ్మ చెప్పే కథలు వినేవాళ్లం.

వాటిల్లో మాకు గుర్తున్న కొన్ని మా పిల్లలకు, మనవలకు, మనవరాళ్లకూ చెప్పుకుంటున్నాం. ఈ కథలన్నీ వందేళ్ళ పైబడినవే. వీటిని నేటి పిల్లలకు అందించాలన్నదే ఈ ప్రయత్నం.

పిల్లలూ! ఈ ‘పెద్దమ్మ చెప్పిన పిల్లల కథలు’ అనే కథల అక్షయపాత్రలో నుంచి మీరు కథలు హాయిగా వడ్డించుకోండి! పకపకా నవ్వుకోండి. మనసు ప్రసన్నంగా వుంటే జీవితం ప్రశాంతంగా వుంటుంది. అయితే ఈ కథల అక్షయపాత్రను కూడా జాగ్రత్తగా దాచుకోవాలి సుమా! దీనిని మీ ముందు తరాల వారికి భద్రంగా అందించాలి” అన్నారు నంద్యాల సుధామణి తమ ముందుమాటలో.

***

“కథలంటే పిల్లలకి ప్రాణం. కథలు పిల్లల్ని నవ్విస్తాయి. కవ్విస్తాయి. ఆనందింపజేస్తాయి. ఉహాలోకాల్లో విహరింప చేస్తాయి. జ్ఞాపకశక్తిని, తార్కికశక్తిని, సృజనాత్మక శక్తిని పెంపొందించి సమాజంలో మానవీయ విలువలుగల వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. వీటికుండే శక్తి అపారం. అపూర్వం. అందుకే కథలు చెప్పి పాణ్యం సరస్వతమ్మలాంటి పెద్దమ్మలకు అప్పట్లో సమాజంలో చాలా గౌరవం వుండేది. వాళ్ళ ప్రభావం పిల్లల వ్యక్తిత్వ రూపకల్పనలో ఎంతగానో వుండేది.

నంద్యాల సుధామణిగారు అందించిన ఈ కథలన్నీ ఆకట్టుకునే చక్కని శైలిలో, సరదాగా సాగిపోయే కథనంతో గిలిగింతలు పెట్టే హాస్యంతో, హాయిగా ఆహ్లాదంగా పండు వెన్నెలలా వుంటాయి. ఇందులోని కథల్లో కొన్నయినా పెద్దవాళ్ళకు తెలిసి వుండవచ్చు. ఇవి మరిచిపోయిన మన జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. బాల్యంలోకి పట్టి లాక్కెడతాయి. ఆనందంలో ముంచెత్తి కాలాన్ని వెనక్కి పరుగులెత్తిస్తాయి. సమస్త దుఃఖాలనీ కాసేపు మరచిపోయి పసిపిల్లవానిలా మార్చేస్తాయి. మిద్దెమీదనో, వేపచెట్ల నీడలోనో చాపలు పరచుకొని, మంచాలు వాల్చుకొని వెన్నెల రాత్రులలో కథలు చెప్పి, అమ్మమ్మ నానమ్మలను, పెద్దమ్మ చిన్నమ్మలను అతుక్కొని వాళ్ళు చెప్పే కథల్ని నవ్వుతూ, ఆశ్చర్యపోతూ, భయపడుతు విన్న రోజులను మనకళ్ళ ముందు ప్రత్యక్షం చేపిస్తాయి” అన్నారు డా. ఎం. హరికిషన్ తమ ముందుమాట ‘ఇది నిజంగా అమూల్యమైన అక్షయపాత్రే’లో.

***

ఈ కథల పుస్తకం పేరు అక్షయపాత్ర. ఈ కథల వెల్లువ పిల్లల హృదయాలను కదిలించి, కరిగించి మానవత్వం నేర్పుతుంది. పెద్దల హృదయాలను రిఫ్రెష్ చేస్తుంది.

పెద్దమ్మ కథలలోకి వెడితే…. ఆరంభంలోనే ఆకట్టుకునే శీర్పిక – “చిన్న పిల్లల కథలలో హింస ఎందుకు?” ఈ శీర్షిక ఒక్కటి… చాలు, పెద్దమ్మ కథల ముఖ్యోద్దేశం తెలియడానికి.. ‘పెద్దమ్మకి ఎంత విచక్షణ!’ అని అనిపించకమానదు.

వెన్నపూసలాంటి పసిమనసులు విషాదాంతాన్ని తట్టుకోలేవు అన్న సంగతి అసలు ఏ మహారచయితలు అయినా గుర్తించారా? పెద్దమ్మ గుర్తించిండండీ..! ఎందుకంటే పెద్దమ్మది ‘అమ్మ’ మనసు మాత్రమే కాదు ‘అతి పెద్ద’ అమ్మ మనను కనుక.

ఈ ‘అక్షయ పాత్రలో వున్నవి చాలా వరకు అందరికీ తెలిసిన కథలే… కవల ముగింపులో చక్కని మలుపులు కనబడతాయి. విషాదాంతాలయిన కథలను సుఖాంతంగా మలచిన తీరు ప్రశంసనీయం” అన్నారు ‘అక్షయపాత్రకు అక్షరాంజలి’ అనే తమ ముందుమాటలో డా. సూరంపూడి సుధ.

***


అక్షయపాత్ర
అనుసృజన: నంద్యాల సుధామణి
ప్రచురణ: గాయత్రి గ్రాఫిక్ పాయింట్, హైదరాబాద్
పుటలు: 117, వెల: ₹ 150/-
ప్రతులకు: (1) నంద్యాల సుధామణి, ఫ్లాట్ నెం. 73, ఫేజ్-4, సిబిఐ కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్-70. ఫోన్ 9449683750.
(2) పాణ్యం నాగార్జున, గాయత్రి గ్రాఫిక్ పాయింట్, జి-53, ఎంఐజి (ఓజి), బ్లాక్-1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44. ఫోన్ 04066772580,
(3) నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.

Exit mobile version