Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలాగే ఉండిపోనీ

[శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు గారు రచించిన ‘అలాగే ఉండిపోనీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

‘గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..
ఎద లోతులో.. ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి..
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..’

నా ఆటోగ్రాఫ్ సినిమాలో చంద్రబోసుగారు వ్రాసిన ఆ పాట నాకెంతో ఇష్టమయిన పాటలలో ఒకటి. అది ఈ రోజు బాగా గుర్తుకువస్తోంది. గుర్తుకొస్తోంది అనడం కన్నా వదలటం లేదు అంటేనే బాగుంటుంది. కారణం సుమారుగా నలభై అయిదేళ్ళ తరువాత నేను ఆ ఊర్లో అడుగుపెట్టబోతున్నాను. ఆ ఊరు నాకు తెలుసుగానీ ఆ ఊర్లో నన్ను తెలిసిన వాళ్ళెవరయినా ఇప్పుడు ఉంటారా అంటే ‘ఏమో చెప్పలేన’నే అంటాను. అప్పట్లో ఆ ఊర్లో మా పిన్ని, చిన్నాన్నగార్లు ఉండేవారు. ఆ ఊరికి పది కిలోమీటర్లు దూరంలో మేము ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నత పాఠశాలలో నేను ఏడు నుంచి పదవ తరగతి వరకు చదువు కొన్నాను. సెలవులొచ్చినప్పుడల్లా పిన్నిగారింటికి వెడుతుండేవాడిని. పిన్నిగారి పిల్లలు, నా ఈడు వాడొకడు ఒక అక్క, చెల్లి. వాళ్ళతో ఆడుకొంటుండేవాడిని. వాళ్లతో బాటు వాళ్ళ స్నేహితులు కూడా కలిసే వారు తరువాత మా నాన్నగారికి బదిలి కావడంతో దూరంగా వెళ్ళిపోయాము. కాలక్రమంలో చదువులు పూర్తి అవ్వడం, బాంక్ ఉద్యోగం, పెళ్ళి, సంసారం.. తల్లితండ్రులు పిన్ని బాబాయిలు గతించటం జరిగిపోయాయి. బ్యాంక్ అధికారిగా నేను పొరుగు రాష్ట్రాలలో పనిచెయ్యవలసి రావడం పిల్లల చదువులు ఇత్యాది కారణాల వలన నేను మరల ఆ ఊరు వెళ్ళలేకపోయాను. మూడేళ్ళ క్రితమే స్వరాష్ట్రానికి వచ్చినా సెలవు సమస్య వలన ఆ ఊరు వెళ్ళలేకపోయాను. గత వారంలోనే ఉద్యోగ విరమణ చేశాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కువగా నేను ఒక చోటా, సంసారం ఒక చోటా ఉండవలసి వచ్చేది పిల్లల చదువుల కోసం. మేము ఎక్కువగా యాత్రలు చేసింది కూడా లేదు. ఆ విషయం తెలిసిన తోటి ఉద్యోగి నా ఉద్యోగ విరమణ సభలో మాట్లాడుతూ “ఈయనకి ఎప్పుడూ బ్యాంకే అన్నయ్య గారు.. మేము ఒక్క తిరపతి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు” అంటూ మా శ్రీమతి చెప్పేదని తెలుపుతూ “ఇప్పుడయినా కాశీరామేశ్వరాలో, కలకత్తా బొంబాయిలో చూడటం మొదలుపెట్టండి” అన్నాడు. సభ చివర్లో నా స్పందనలో నేను ఎప్పటి నుంచో చూడదలచుకొంటున్న ఊరు పేరు చెప్పి త్వరలో అక్కడికి వెడుతున్నట్లు చెప్పాను. నేను ఏ కాశీయో కాశ్మీరో చెబుతున్నాననుకొన్న మిత్రులు ఆశ్చర్యపోయారు. ఆ పేరు విని అందరరూ ఆశ్చర్యపోయారు.. కారణం తూర్పుగోదావరి జిల్లాలో ఓ టౌన్ అది. పంచారామాలలో ఒకటి. ఆ ఊరికి అంతకు మించి చెప్పుకోదగిన ప్రత్యేకతలేమీ లేవు. నాకు మాత్రం ఆ ఊరు చాల ప్రత్యేకం మరి..

అన్నట్లుగానే మరుసటి వారంలోనే శ్రీమతితో కలసి బయలుదేరాను.. చిన్నప్పుడు నేను చదువుకున్న ఊరని పంచారామాలలో ఒకటని కూడా చెప్పాను శ్రీమతికి. స్టేషన్‌లో దిగి తెలిసిన వాళ్ళెవరూ లేకపోవడం వలన లాడ్జిలో దిగి తయారై కుమారారామాన్ని దర్శించుకొని టిఫిన్ చేసి మా పిన్ని బాబాయిలు నివసించిన ఇంటి చిరునామాని గుర్తుచేసుకొంటూ బయలుదేరాను.

***

నాకు ఎందుకోగానీ జ్ఞాపకాలను నెమరువేసుకోవటం అంటే ఎంతో ఇష్టం. నా బాల్యం, విద్యాభ్యాసం అంతా రాష్ట్రంలో నలుమూలలా గడిచింది. కారణం నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ప్రతీ మూడు నాలుగు సంవత్సరాలకు ఒకచోట నుంచి మరొక చోటుకు బదిలీలు కావడం వలన. నేను బ్యాంక్ ఉద్యోగిని కావడంతో నేను పొరుగు రాష్ట్రాలలో కూడా గడపవలసి వచ్చింది. అందువలన నాకు చాలా ఎక్కువమందితో పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. ఒకేచోట ఉంటే అన్ని ఏర్పడేవి కావేమో! జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండటంతో చాలా చిన్నప్పటి సంఘటనలు, స్నేహాలు ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి. చిన్ననాటి స్నేహితులలో కొందరిని ఫేస్‌బుక్ సాయంతో వెదికి పట్టుకొని స్నేహాన్ని పునరుద్ధరించటం కూడా జరిగింది. ఇటీవలనే నా అయిదో తరగతి మిత్రుడిని పట్టుకోగలిగాను. అయితె కొందరిని కలిసి నలభై ఏళ్ళయింది కూడా.

***

గతంలో మా పిన్నిగారు నివసించిన ఇంటి ప్రాంతానికి చేరుకొన్నాము. పేదలు పేదవారిగానే ఉన్నట్లుగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు కొన్నీ చిన్న టౌన్లులో పెద్దగా మార్పు ఉండటం లేదు. పెద్ద పట్టణాలు మాత్రం అడ్డంగా నిలువుగా ఎటు ఖాళీ దొరికితే అటు ఆకాశ హార్మ్యాలతో పైపైకీ పెరిగిపోతున్నాయి. చిరునామాని గుర్తు చేసుకొంటూ ఆ వీధులలో తిరిగాను. అక్కడక్కడ పాత ఇండ్ల స్థానాలలో బిల్డింగ్లు వచ్చినా చెప్పుకోదగ్గ మార్పు లేదు. మా పిన్నిగారు ఉండేది ఓ నాలుగొందల గజాల స్థలంలో రెండు వాటాల డాబా ఇల్లు. చుట్టూ ప్రహారీ గోడ. వెనుక గోడనానుకుని మరుగుదొడ్లు బాత్రూంలు ఉండేవి. గిలకబావి ఉండేది. జల చాలా లోతుగా ఉండేది. మగవాళ్ళందరం నూతి గట్టుమీదే తోడుకొని స్నానాలు చేసేవాళ్ళం. శీతాకాలంలో బాయిలర్ వాడేవాళ్ళం. పెద్ద ఆవరణ అందులో మామిడి, జామ, ఉసిరి చెట్లు ఉండేవి. ఇప్పుడు ఇండ్ల నిర్మాణాల విషయంలో విధిస్తున్న సెట్ బాక్స్ ఆ ఇంటిని చూసే పెట్టారేమో అనిపిస్తుంది. ఒక వాటాలో మా బాబాయి పిన్ని కుటుంబం, రెండవ వాటాలో ఇంటి స్వంతదారుని కుటుంబం ఉండేవి. వారికీ మా బాబాయికీ కూడా ఇద్దరేసి ఆడపిల్లలు ఒక అబ్బాయి. వాళ్ళు వాళ్ళ స్నేహితులతో కలిసి నేనూ ఆడుకొనేవాడిని. అందరం 7, 8, 9, 10 తరగతులలో ఉండేవాళ్ళం. మేము ఉండేదీ ఓ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న టౌన్లోనే కాబట్టి రెండురోజులు సెలవులొస్తే చాలు వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు బాబాయీ వాళ్ళూ మా ఊరు వచ్చేవాళ్ళు. కాని మేము వెడితేనే వాళ్ళ స్నేహితులతో కూడా ఆడుకొనే అవకాశం ఉండేది. కాబట్టి అక్కడికి వెళ్ళడానికే ఉవ్విళ్ళూరేవాడిని. అక్కడ స్నేహబృందంలో నా ప్రధాన ఆకర్షణ గీతాంజలి. మా బాబాయి ఇంటి ఎదురు ఇంట్లో ఉండేది గీతాంజలి కుటుంబం. తెల్లగా నా ఫేవరేట్ జమునలా ఉండేది. భరతనాట్యం నేర్చుకొంటుండేది. కొండపల్లి బొమ్మ తలను తడితే ఊగినట్లు గీతాంజలి తల ఊపే భంగిమ నాకు ఇప్పటికీ గుర్తు. ఎన్నెన్నో ఆటలు.. దాగుడుమూతలు, ఏడు పెంకులాటలు, కుంటాట, నేలా బండా, అష్టాచెమ్మా, వైకుంఠపాళి ఎన్నో.. “మగ పిల్లలతో ఏమిటే ఆ ఆటలు” అంటూ వాళ్ళమ్మ గారు గీతని వెనక్కు లాగేది.. కానీ ఆవిడా అటు వెళ్ళగానే అందరం ఆడ ఆటలు, మగ ఆటలు అని తేడా లేకుండా అన్ని కలిపి ఆడేసే వాళ్ళం. గీతాంజలి బ్యాడ్మింటన్ బాగా ఆడేది. నేను చాలా సార్లు ఆమె చేతిలో ఓడిపోయాను. ..ఆమెనే చూస్తూ సరిగ్గా ఆడకపోవటం వలన. ‘నువ్వు బాగా ఆడతావు కదరా అందరిని గెలిచి, గీతతో మాత్రం ఓడిపోతావేమిటి రా’ అనేది నా చేతిలో ఎన్నో సార్లు ఓడిపోయిన వాణక్క. అది ‘ఏమిటో ఎందుకో తెలియని పరిస్థితి’.

తొమ్మిదో తరగతిలో అనుకొంటా.. అమ్మ పిన్ని వాళ్ళ వూరు వెడుతూ నన్ను తీసుకెళ్లింది. రెండు రోజులు స్కూలు పోతుందిరా అని మందలించినా వినక ఏడుపు మొహం పెడితే.. అక్కడికి వెడితే కజిన్స్ తో వాళ్ళ స్నేహితులతో.. ముఖ్యంగా గీతాంజలితో ఆడుకోవచ్చు, అది నా ఉద్దేశం. రెండు రోజులయినా మాతో ఆడటానికి గీతాంజలి రాలేదు. వాళ్ళింట్లో హడావిడి కనిపించింది. గీత పెద్దమనిషయిందనుకోవటం విన్నాను. సగం అర్థమయ్యింది. ఆ కార్యక్రమానికే మా అమ్మ వచ్చిందట. కూడా నేనూ, నాన్నగారు రాలేదు. మేము మరునాడు వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నేను కేరంబోర్డ్ ఆడుతున్నానే కానీ నా దృష్టంతా గీతాంజలి ఇంటివైపే వుంది. వస్తుందా.. పోనీ కనబడుతుందేమోనని చూస్తున్నాను. నేను గీతాంజలి కోసం చూస్తున్నానని వరుసగా గేమ్స్ గెలుస్తున్న మా కజిన్ వాణి గ్రహించింది. మా బృందంలో తనే సీనియర్. ఆ సంవత్సరమే ఫిఫ్త్ ఫారం, ఎస్ఎస్ఎల్సీలు తీసేసి ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు పెట్టారు. ఆమె పరీక్ష పోయింది. సెప్టెంబర్లో సప్టిమెంటరీ వ్రాసింది. అప్పట్లో మార్చి – సెప్టెంబర్ – మార్చి అనేవాళ్ళు. “ఇప్పుడు గీతాంజలి రాదురా.. మళ్ళీ వచ్చినప్పుడు పిలుస్తానులే” అంది నాకేసి చూస్తూ. నేను దొరికిపోయినా దొరకనట్లు మొహం పెట్టడానికి చాలా కష్టపడ్డాను. సాయంత్రం మేము వెళ్ళిపోయాము.

తరువాత, మళ్లీ నాలుగు నెలలకి గాని గాని బాబాయి ఇంటికి వెళ్ళడం కుదరలేదు. నేను టెన్త్ క్లాసులోకి వచ్చాను. ఆ సాయంత్రం బాబాయి పిల్లలు మిగిలిన స్నేహితులతో ఆడుతున్నప్పుడు వచ్చింది గీతాంజలి. లంగా ఓణీలో చాలా బాగుంది. నన్ను చూసి సిగ్గుపడింది. ఇది వరకులా మాట్లాడలేదు. నాకూ సిగ్గువేసింది. నేను నిక్కర్లో ఉన్నాను. మరునాడే ఫాంట్స్ లోకి మారిపోయాను. మరునాడు తనని నాతో మాట్లాడేటట్లు చేసింది వాణి. తరువాత నాలుగు రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. మరునాడు వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మ. అమ్మతో తనూ వెడుతూ వాణి “నువ్వూ రారా” అని నన్ను తీసుకెళ్ళింది. వెళ్ళొస్తానని కళ్ళతోనే చెప్పా. ఆమె బుగ్గలు ‘అలాగే’ అన్నాయి. ఆ సంవత్సరం ఎక్కువసార్లు ఇదివరకులా వాళ్ళ ఊరు వెళ్ళడం కుదరలేదు. “వచ్చే ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకొంటే సరిపోదురా నువ్వు 400 ల మార్కులు తెచ్చుకోవాలిరా” అనేవాళ్ళు మా టీచర్లు. 400 ల మార్కులంటే అప్పట్లో చాలా గొప్ప విషయం. అదే సమయంలో నాన్నగారికి ప్రమోషన్ మీద హైదరాబాద్ బదిలీ అయ్యింది. మరింత దూరంగా వెళ్ళిపోయామన్న మాట.

హైదరాబాద్లో ఇంటర్లో చేరాను. ఆ సంవత్సరమే హఠాత్తుగా బాబాయి పోయారు. పరామర్శకి వెళ్ళినప్పుడు గీతాంజలి వాళ్లూ వూర్లో లేరు. బాబాయి పోవడంతో పిన్నివాళ్ళు అక్కడనుంచి మా మావయ్య ఉంటున్న ఊరికి వెళ్ళిపోయారు. దానితో గీతాంజలి ఊరితో సంబంధం తెగిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు వాణక్క పెళ్ళి అయ్యింది. పెళ్ళికెళ్ళినప్పుడు గీతాంజలి గురించి వాణిని అడిగాను. “ఇంకా గీతని మర్చిపోలేదురా!” అని “నీలాగే డిగ్రీ చదువుతోందని తెలిసిందిరా. మేమూ అక్కడ నుంచి వచ్చేసి మూడేళ్ళయింది కదరా” అన్నది. నేను డిగ్రీ పూర్తిచేసి బ్యాంక్ జాబులో చేరాను. గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు గీతాంజలి పెండ్లి విషయం తెలిసింది.. అమ్మ, వాణి వెళ్ళారు.

***

గుండె బరువెక్కడం అంటె ఏమిటోమొదటిసారిగా తెలిసింది.

***

మరి మూడేళ్ళకి నేనూ వివాహబంధంలోకి అడుగుపెట్టాను. పెళ్ళిలో చెప్పింది వాణి. “గీత భర్త రైల్వేస్‌లో చేస్తాడట. ఖరగ్పూర్‌లో ఉంటోంది. కొడుకు పుట్టాడట” అని. కాలచక్రం గిర్రున తిరగసాగింది. నాకు కలకత్తా బదిలీ అయింది. వెళ్ళివస్తున్నప్పుడల్లా ఖరగ్పూర్ స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు భావోద్వేగం తలెత్తేది. కారణం ప్రేమా..?!!! కాదు. ఎందుకంటే అంత దూరం వెళ్లలేదు. మరి ‘ఎడోల్సేంట్ ఇన్ఫాట్యుయేషన్?’ ‘తొలి యవ్వనపు ఆకర్షణ.., ‘ఫస్ట్ క్రష్’ అంటే ఇవేనా..? ఏమో. తెలీదు జస్ట్ ఇష్టం.. ఇష్టమేనా.. ఏమో.. ఈ పేర్లేవి అప్పుడు తెలియదు. కానీ అవి వర్ణించే అనుభూతులని అనుభవించాను. ‘చూడాలని ఉండటం’, చూస్తూనే ఉండాలనుకోవడం, ‘చూడలేకుండా వుండలేననుకోవడం’.

***

వేర్వేరు రాష్ట్రాలలో పనిచేసి రిటైర్మెంట్ ముందు హైదరాబాద్ చేరుకొన్నాను. పదేళ్ళక్రితం యాక్సిడెంట్లో వాణక్క పోవడంతో గీతాంజలి వివరాలు తెలియచేసే వారు కూడా లేరు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక్క తిరుపతి తప్ప మరెక్కడికి యాత్రలు చెయ్యలేదు. ఇప్పుడు మా ఆవిడ కాశీరామేశ్వరాల వంటి యాత్రలకు వెడదామండీ అంటే “ఇదిగో ముందు ఈ ఊరు వెళ్ళొచ్చి వెడదాం. నేను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నాను. ఆ ఊరు కూడా పంచారామాలలో ఒకటి కూడా: అని చెప్పి బయలుదేరదీసాను.

***

నాది ఫోటోగ్రాఫిక్ మెమరీ కావడంతో నలభైఐదేళ్ళ క్రితం మా పిన్నిగారు నివసించిన డాబా ఇంటి ప్రాంతానికి చేరుకున్నాను. డాబా ఇల్లు కాస్తా ఇప్పుడు రెండంతస్థుల మేడగా మారిపోయింది. పెద్ద గేటు. ఆ ఇంటిని గుర్తుపట్టిన వెంటనే నేను చేసిన మొదటి పని ఆ ఇంట్లోకి వెళ్ళడం కాదు. ఆ ఇంటి ఎదురు డాబా ఇంటికేసి చూడటం. ఆ ఇల్లు.. అదే గీతాంజలి కుటుంబం నివసించిన ఇల్లు అలాగే ఉంది. గేటుకి తాళం వేసి ఉంది. గేట్ లోపల ఇంటి ఆవరణలో చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు ఆ ఇంట్లో ఎవరూ నివసించటం లేదని చెబుతున్నాయి. ఆ ఇండ్ల గురించి ఎవరిని విచారించాలి అనుకొంటూ నడిచాను. పిన్నిగారి మేడ ఇంటి ప్రక్కనే ఓ పాతకాలం నాటి పెంకుటిల్లు కనబడిరది. ఎవరో నివసిస్తున్నట్లు ఆనవాళ్ళున్నాయి. ఎవరినో కన్నా ప్రక్క ఇంటివారినే అడిగితే కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకొని లోనికెళ్ళి తలుపు తట్టాను.

ఒకావిడ తలుపు తీసింది. నాకన్నా పెద్దావిడలాగే కనిపిస్తోంది. పెద్దవాళ్ళను అడిగితేనే పాత విషయాలు తెలుసుకోవచ్చని ఆవిడని పరిచయం చేసుకొన్నాను. ప్రక్క ఇంట్లోనే మా బాబాయి కుటుంబం ఉండేదని నేను వచ్చినప్పుడల్లా వాళ్ళ పిల్లలతో ఆడుకొనేవాడినని ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకొంటూ ఆ ఇంటిని ఒకసారి చూద్దామని వచ్చినట్లు చెప్పాను. ఆమె కూడా గతాన్ని గుర్తు చేసుకొంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆమెకి వివాహమయ్యింది. ఆ ఇంట్లోకే కాపురానికి వచ్చింది. మా పిన్ని బాబాయిలు తెలుసట. మేము ఆడుకోవటం ఆ గోలకి వాళ్ళ అత్తగారు కేకలేస్తూ ఉండటం గుర్తు చేసుకొంది. హమ్మయ్య ఒక లింక్ దొరికిందని సంతోషిస్తూ నెమ్మదిగా గీతాంజలి ఇంటివైపు చూపిస్తూ ఆ వివరాలు తెలుసా అని అడిగాను. “ఆ ఇంటివాళ్ళు పోయి చాలా కాలం అయిందండి. వాళ్ళకి ఒక్కర్తే అమ్మాయి. గీత అనుకొంటా. ఒరిస్సాలో ఎక్కడో ఉంటారు. మీ బాబాయి వాళ్ళ ఇల్లు అమ్మేసారు. కొన్నవాళ్ళు డాబా ఇల్లు తీసేసి ఇదిగో ఈ మేడ కట్టుకొన్నారు. గీత మాత్రం తన ఇంటిని అమ్మలేదు. అలాగే ఉంచేసింది. సంవత్సరానికొకసారి వచ్చి కొన్ని రోజులుండి వెడు తుంది . ఏడాది క్రితం అనుకొంటా మనవడిని తీసుకొని వచ్చి నాలుగురోజులుండి వెళ్ళారు” అని చెప్పింది. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని అడిగాను. లేదండి. నాకు ఆవిడ పరిచయమే గాని అంత క్లోజ్ కాదు. అప్పుడెప్పుడో వీధిలో ఎదురు బడినప్పుడు ‘ఆ ఇంటిని జ్ఞాపకంగా ఉంచుకొన్నట్లు, భర్త మాత్రం అమ్మెయ్యమ’ని చెబుతున్నట్లు చెప్పింది. ఆ అవును.. చెప్పడం మరిచాను ఇటీవల ఆ గీతమ్మకి బాగోటం లేదని, అందుకని అమ్మకానికి పెట్టినట్లుగా మా పనిమనిషి ద్వారా విన్నాను. ఇంతకీ దేనికండీ” అని అడిగిందావిడ. “ఏం లేదు మా బాబాయి పిల్లలతో ఆడుకొనేటప్పుడు తనూ కలిసేది. ఇప్పుడెలా వున్నారో తెలుసుకొందామని” అని మాత్రం అన్నాను. అన్ని వివరాలిచ్చిన ఆవిడకు కృతజ్ఞతలు చెబుతూ “మీ వారేం చేస్తారండి” అన్నాను. ఆమె మొహం కొద్దిగా రంగుమారింది. గోడవైపు చూపించింది. దండ వేసిన ఓ పాతికేళ్ళ కుర్రాడి ఫొటో కనబడిరది. “నా పెళ్ళయిన సంవత్సరానికే ఆయన పోయారండి” అని చెప్పింది దుఃఖాన్ని ఆపుకొంటూ.. నేను షాక్ తిన్నాను. “సారీ అమ్మా” అనగలిగాను.

ఆమె ఉంటున్న ఇల్లు ఆమె భర్తది బావగారిదీనట ఆమె తల్లితండ్రులు స్థితిమంతులు కాకపోవటంతో, అన్నా వదినలు మొహం చాటేయడంతో భర్త అన్న వదినల పంచన అక్కడే ఉండిపోయారట. ఆ కాలంలో అంత సులువుగా ఆడవారికి పునర్వివాహాలు అయ్యేవి కావుగా. ఆమె సుమారు 18 ఏండ్ల వయసులోనే భర్తను కోల్పోయింది. భర్త జ్ఞాపకంగా పిల్లలు కూడా లేరు. బావగారు పోయారుట. తోటి కోడలు మంచం పట్టింది. తనకు ఆశ్రయం ఇచ్చిన ఆమెకు సేవ చేసుకొంటూ భర్త పిలుపుకై ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారట.

***

బరువెక్కిన హృదయంతో వెనుదిరిగాను. నేను ఏవో తీపి జ్ఞాపకాల చిరునామాని వెతుక్కొంటూ వెళ్ళి ఓ అభాగ్యురాలి చేదు జ్ఞాపకాలను కెలికాననిపించింది. జ్ఞాపకానికి రెండు వైపులా పదునెక్కువే. కాపురానికి వచ్చి సంవత్సరం తిరగకుండానే ఆమె భర్తను కోల్పోయింది. మనసు చివుక్కు మంది. నేనేమో హాయిగా సంసారం చేసుకొంటూ ఇంకా చిన్ననాటి తీపి జ్ఞాపకాల జాడల వేటలో ఉంటే ఆమె నీలి నీడలు ఇబ్బంది పెట్టాయి.

***

ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం ఖరగపూర్ నుంచి గీతాంజలి, తను వచ్చేముందు ప్రక్క కాలనీలో ఉండే తన బంధువుకి ఫోన్ చేస్తే ఆయన గీతాంజలి ఇంటి తాళాలు పనిమనిషికిచ్చి శుభ్రం చేయిస్తాడట. ఆ బంధువుని పట్టుకొంటె గీతాంజలి కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది.. ‘ఆ ఇంటిని జ్ఞాపకంగా ఉంచుకొన్నాను ఒక ప్రక్క మా అయన అమ్మెయ్యమంటున్నా’ అని గీతాంజలి అన్నదట. నాలో ‘ఏ జ్ఞాపకం’ అనేది తెలుసుకోవాలనే ఆరాటం మొదలయింది. కానీ ఆ ఆరాటాన్ని ‘గీతమ్మగారికి బాగోటం లేదట అందుకని ఇప్పుడు అమ్మేద్దా మనుకొంటున్నారట’ అన్న పనిమనిషిచ్చిన సమాచారం చంపేసింది. దాంతో పనిమనిషిని పట్టుకొని కాంటాక్ట్ నెంబర్ పట్టుకొందామనుకొన్న ఆలోచన కలిగింది. ఇంతలో “ఏవండీ ఇంక వెడదామా” అంటూ మా ఆవిడ తన ఉనికిని తెలియ చేసింది. నా విచారణలలో, ఆలోచనలో నేనున్నాను. శ్రీమతి బాగా అలిసిపోయింది. భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొంటే బాగుంటుంది అనిపించి హోటల్ రూముకీ చేరుకున్నాం.. తాను పడుకున్నాక నేను వెళ్లి పనిమనిషిని పట్టుకొందామానుకొంటున్నాను.

“పెళ్ళాం ప్రక్కన పడుకొని ప్రియురాలి గురించి ఆలోచిస్తున్నావేంటి” అడిగింది అంతర్మాత్మ.

“ఛా.. అవేం మాటలు. అసలు అంత సీన్ లేదు.. ఏదో చిన్నప్పుడు గడిపిన ప్రదేశాలన్నీ తిరిగి ఎవరైనా స్నేహితులు కలుస్తారేమో అని చూడటం నా హాబీ. అంతే” అన్నాను

“చూడు బాసు నీది సరే ఫోటోగ్రాఫిక్ మెమొరీ.. కానీ అందరూ అలా వుండరుగా.. ఈ కోణంలో చూడు.. అసలు గీతాంజలి నిన్ను ఎప్పుడో మర్చిపోయి వుండొచ్చుగా.. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నేను ఫలానా.. అని చెప్పావనుకో.. ‘సారీ.. అండీ గుర్తు రావటం లేదు’ అంటే నీ గుండె తట్టుకోగలదా.. లేదా ‘ఓ మీరా ఎలా వున్నారు..’ అని వెంటనే ‘పిల్లలు సెటిల్ అయ్యారా’ అని అడిగిందనుకో, ఏదో ఫార్మల్‌గా.. నీ భావోద్వేగాలన్నీ బూడిద పాలేగా.”

“మరి అంత క్రూరంగా వూహించకు.. నిజంగా నేను తట్టుకోలేను.”

“ఇలాంటి విషయాలలో ఆడవాళ్లు ఇంత ఎమోషనల్‌గా వుండరు. పెళ్లి అయినా మరునాడే మారిపోతారు. ఇలాంటి వాటిని పట్టుకొని ఊహలల్లుతూ వుండరు. అయినా మీ మధ్య అదేమీ లేదు కదా.. జస్ట్ ఇష్టం.. ఫస్ట్ క్రష్ లాంటిది. దీన్ని ఆడవాళ్లు సాగదియ్యరు. ఆమె ఇక్కడ లేదు. ఎక్కడ ఉందో తెలియదు.. వదిలేయ్” చాలా ప్రాక్టికల్‌గా చెప్పింది అంతరాత్మ.

“’నేను గీతాంజలి ఇంకా ఆ ఊర్లోనే ఉంటుందనుకొని రాలేదు. చిన్నప్పుడు ఆడుకొన్న ఆ ప్రదేశం చూద్దామని అప్పటి స్నేహితులుంటే కలుపుకొందామని వెళ్ళాను. ఒకవేళ గీతాంజలి ఉండుంటే మనవరాలికి డాన్స్ నేర్పుతూ ఉంటుందేమో అని ఆశ. నేను ఆ మనవరాలితో నేను మీ అమ్మమ్మ చిన్ననాటి స్నేహితుడిని అని పరిచయం చేసుకొందామని దురాశ. అంతే.”

కానీ, ఆ పనిమనిషి సమాచారంతో ఆ జ్ఞాపకాల పల్లకిని మధ్యలో దింపేసినట్లుయింది.. ‘గీతమ్మ గారికి బాగోటం లేదట. అందుకని ఇంటిని అమ్మకానికి పెట్టారట’. ‘బాగోటం లేదంటే వయసు రీత్యా వచ్చే కీళ్ల నొప్పులు వంటి వాటి వల్ల తిరగలేక ఇల్లు అమ్మేద్దామనుకొంటున్నారా? అసలు ఇప్పటివరకు ఏ జ్ఞాపకం కోసం ఆ ఇంటిని ఉంచింది, ఆ జ్ఞాపకాలలో నేనున్నానా..’

నా మనసు విన్న అంతరాత్మ “వాళ్లమ్మనాన్నల జ్ఞాపకార్థంగా ఆ ఇంటిని ఉంచుకోంది. అంతే” అన్నది నన్ను ఏడిపిస్తూ.

“ఆమెకు మరి సీరియస్ వ్యాధి ఏమైనా కలిగిందా?” కీడు శంకిస్తే బుర్ర మరింత వేడెక్కి పోతొంది. ఒకసారి పనిమనిషిని పట్టుకొని గీత ఫోన్ నెంబర్ తీసుకోని మాట్లాడితే పోలా.. అనిపించి వెడదామనుకొన్నాను. కానీ మాట్లాడితే ఏం వినాల్సి వస్తుందో.. అనే భయం తొలచివేయసాగింది.

అంతరాత్మ చెప్పినట్లుగా ఆమె అతి కష్టం మీద గుర్తు తెచ్చుకొని మాములుగా మాట్లాడితే నా పరిస్థితి ఏమిటి? లేదూ గుర్తు పట్టి మాట్లాడినా ఏ కాన్సరో తోనో బాధ పడుతున్నట్లు ఇంకా ఏంతో కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పారని చెప్పినా కష్టమే. అందుకే చిన్ననాటి విషయాలన్నీ బాగా లోతుగా పరిశోధించకుండా జ్ఞాపకాలనీ ఊహలని ఎలా వున్నవి అలాగే వుంచేయటమే మంచిదనిపిస్తోంది.

***

అనుభవం కొన్ని క్షణాలే అయినా దాని తాలూకా ఆనందం అనేది మరి కొన్ని నిమిషాలే ఉన్నా దాని తాలూకా జ్ఞాపకాలు కలకాలం ఊరిస్తూ కొండొకచో వేధిస్తూ ఉంటాయి. కాలం కన్నా మనసు వేగవంతమైందీ అంటారు.. కానీ కాలం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. మనసు కొన్ని చోట్ల ఆగిపోయి కదలనటుంటుంది.. కానీ కాలం ఆగదు. మనసు ఆగిన చోటే కాలం ఆగిపోతే ఎంత బాగుండుననిపిస్తుంది. మనసు ఆగిపోయిన క్షణాల తీపి జ్ఞాపకాలనీ అలాగే ఉండనిద్దామనుకొని ఇంకా ఎవరిని కలిసే ప్రయత్నం చెయ్యకుండా కాలంతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాము.

సమాప్తం

Exit mobile version