Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు-106

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సహజ నటుడు వినోద్ మెహ్రా:

స్వర్గీయ నటుడి వినోద్ మెహ్రాను తలచుకోగానే మనకు గుర్తొచ్చేది అందమైన నవ్వు, సహజమైన నటన! ఇంకా గర్తొచ్చేది – చాలా తొందరగా ఈ ప్రపంచాన్ని వదిలేశారనే వాస్తవం. సజీవంగా ఉండి ఉంటే సినిమాలలో మరిన్ని మంచి పాత్రలు పోషించేవారు కదా అని అనిపించక మానదు.

ఆయన 13 ఫిబ్రవరి 1945 న అమృత్‌సర్‌లో జన్మించారు, అదే నగరంలో మూడేళ్ళ క్రితం రాజేష్ ఖన్నా జన్మించారు. వీరిద్దరి జీవితాలు మళ్ళీ 1965లో కలిసాయి, ఈ ఇద్దరూ – యునైటెడ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్‌పేర్ నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ పోటీలో రాజేష్ ఖన్నా విజేతగా నిలవగా, వినోద్ మెహ్రా రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో వినోద్ గోల్డ్‌ఫీల్డ్ మర్కంటైల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‍గా పనిచేస్తుండేవారు. రూప్. కె. షోరే గారు బొంబాయిలో గేలార్డ్ రెస్టారెంట్‍లో వినోద్‍ని గమనించి, పరిశ్రమలో ప్రవేశపెట్టారు.

వినోద్ తండ్రి పేరు పరమేశ్వరీదాస్ మెహ్రా, తల్లి పేరు కమలా మెహ్రా. బొంబాయిలో వ్యాపారాలుండడంతో స్వాతంత్ర్యానంతరం పరమేశ్వరీదాస్ అమృత్‍సర్ నుంచి బొంబాయికి మకాం మార్చారు. 1970 లో వినోద్ తన సినీ కెరీర్ ఆరంభించక ముందే అతని అక్క శారద అనేక సినిమాల్లో నటించారు. వినోద్ తన పాఠశాల చదువుని శాంతాక్రజ్ లోని సేక్రడ్ హార్ట్స్ బోయ్స్ హైస్కూలులో పూర్తి చేసారు. ఆ తరువాత సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుంచి బాచిలర్స్ డిగ్రీ పొందారు. 1950లలో వినోద్ బాలనటుడిగా నటించారు (1958నాటి రాగిణి సినిమాలో చిన్నప్పటి కిషోర్ కుమార్‌గా నటించారు). ‘బాలయోగి ఉపమన్యు’ అనే చిత్రంలో వినోద్ నటించారు. ఆ సినిమాలోని ఫోటోని చూడవచ్చు.

వినోద్ మొదటిసారిగా హీరోగా (తనూజ సరసన) 1971లో ‘ఏక్ థీ రీటా’ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా బాగా ఆడింది. 1971లోనే శేఖర్ అనే పాత్రలో వినోద్ నటించిన ‘లాల్ పత్థర్’ చిత్రం విడుదలయింది. ఆ సినిమాలో రాజ్ కుమార్, హేమ మాలిని, రాఖీ ఉన్నారు. రాజ్ కుమార్, హేమ మాలినికి శక్తివంతమైన పాత్రలు దొరికాయి. అయినప్పటికీ బక్కపలచని వినోద్ వారి మధ్య తన పాత్ర కూడా మెరిసేలా నటించారు. ఈ సినిమాలో పియానో ముందు కూర్చుని వినోద్ ‘గీత్ గాతా హుఁ మై, గున్‌గునాతా హుఁ మై’ (కిషోర్ దా స్వరంలో) అని పాడడం ఎవరు మరిచిపోగలరు? ఆయన ఎందరి హృదయాలనో దోచుకున్నారు. పెద్దయ్యాకా, అది ఆయన మొదటి సినిమా.

1972లో వచ్చిన ‘అమర్ ప్రేమ్’ చిత్రంలో వినోద్ ఆనాటి సూపర్ స్టార్‌తో తెరని పంచుకున్నారు. రాజేష్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన ఈ క్లాసిక్ చిత్రం – ఎదిగిన నందుగా- చక్కని ప్రదర్శన చేసే అవకాశం వినోద్‍కి కల్పించింది. బాలుడిగా నందూని షర్మిలా అమితంగా ప్రేమించి, ముద్దు చేస్తుంది. నందూ పెరిగి పెద్దయి చాలా ఏళ్ళకి కలిసినప్పుడు -ఆమె మీద తల్లి ప్రేమతో నందూ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు.

కానీ హృశీకేశ్ ముఖర్జీ గారి ‘అనురాగ్’ (ఇదీ 1972లోదే) చిత్రం వినోద్ మెహ్రా గురించి అందరికీ బాగా తెలిసేలా చేసింది. వాణిజ్యపరంగా సినిమా విజయం సాధించింది. ‘అనురాగ్’ చిత్రంలో చక్కని పాటలు ఉన్నాయి, అవి వినోద్ కెరీర్‍కి మేలు చేశాయి. మౌసమి ఛటర్జీ (‘అనురాగ్’ ఈమె మొదటి చిత్రం), వినోద్ మెహ్రాలది చక్కని జోడీగా పేరు వచ్చింది.

‘ఘర్’ చిత్రంలో వినోద్ అద్భుతమైన నటన ప్రదర్శించారు. అందమైన సరళమైన వదనం బాధలని, సంతోషాలని… అన్ని రకాల భావాలను పలికించగలిగేది. ‘ఘర్’ చిత్రంలోని పాటలు – ‘తేరే బినా జియా జాయె నా’, ‘ఆప్ కీ ఆంఖోం మె కుఛ్ మెహ్కె హుయె సె రాజ్ హైఁ’, ‘ఫిర్ వహీ రాత్ హై, రాత్ హై ఖ్వాబ్ కీ’ వంటివి నేటికీ వినబడుతూనే ఉన్నాయి.

మనిషిగా, నటుడిగా – నిరాడంబరత, మౌనం, అహంకారం లేని, మర్యాదస్థుడు వినోద్ మెహ్రా.

వ్యక్తిగత జీవితం:

1970 దశకం మధ్యలో వినోద్ నటి రేఖకి సన్నిహితమయ్యారు. వాళ్ళు పెళ్ళి చేసుకున్నారన్న వార్తలూ వినిపించాయి. కానీ 2004లో సిమి గరేవాల్‍కి ఇచ్చిన ఒక టివి ఇంటర్వ్యూలో రేఖ ఈ ప్రస్తావనని తోసిపుచ్చారు. వినోద్ తన శ్రేయోభిలాషి మాత్రమే అని చెప్పారు. కానీ యాసర్ ఉస్మాన్ రచించిన రేఖ జీవిత కథ ‘ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ఈ ఉదంతం మరోలా ఉంది. “రేఖకి భర్తగా భావించబడుతున్న వినోద్ – కలకత్తాలో వివాహం చేసుకున్నాకా ఆమెని తమ ఇంటికి తీసుకువెళ్ళారు. వినోద్ తల్లి ఉగ్రురాలై, రేఖను తమ కోడలిగా అంగీకరించలేదు. తన పాదాలని తాకాలని రేఖ ప్రయత్నిస్తే ఆమె తోసేసారు.”.

వినోద్ మెహ్రా మొదటి వివాహం – మీనా బ్రోకా – తో తల్లి కుదిర్చినదే. పెళ్ళి తరువాత వినోద్‍కి గుండెపోటు రావడంతో వారికి తొలిరాత్రి జరుగలేదు. జబ్బు నుంచి కోలుకున్నాకా, వినోద్ సహనటి బిందియా గోస్వామితో పారిపోయారు. విడాకులు కోరడం తప్ప మీనాకి మరో మార్గం లేకపోయింది. బిందియా గోస్వామితో వినోద్ సంబంధాలు తాత్కాలికమే అయ్యాయి, ఆమె ఆ తర్వాత దర్శకుడు జె.పి. దత్తాను వివాహం చేసుకున్నారు.

1988లో వినోద్ – కెన్యాకి చెందిన రవాణా వ్యాపారి కూతురు – కిరణ్‍ని పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన రెండేళ్ళకే వినోద్ మరణించడంతో ఈ వివాహ బంధం చెదిరింది. కిరణ్ ద్వారా వినోద్‍కి ఇద్దరు పిల్లలు జన్మించారు. మొదట కూతురు సోనియా (1988లో జననం), తరువాత (వినోద్ మరణాంతరం) కొడుకు రోహన్ జన్మించారు. వినోద్ 45 ఏళ్ళ వయసులో 30 అక్టోబరు 1990నాడు గుండెపోటుతో మరణించారు.

వినోద్ మరణం తరువాత కిరణ్ తమ తల్లిదండ్రులతోనూ, సోదరి తోను కలిసి ఉండేందుకు కెన్యా వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ మొంబాసా పెరిగారు, ఉన్నత చదువులు ఇంగ్లండ్‍లో చదివారు. ఈ ఇద్దరు చివరకు హిందీ చిత్ర సీమలో ప్రవేశించారు. సోనియా 2007లో ‘విక్టోరియా నం. 203’ అనే చిత్రంతో బాలీవుడ్‍లో అడుగుపెట్టారు. అదే పేరుతో ఉన్న 1972 నాటి క్లాసిక్ సినిమాకి ఇది రీమేక్. నిఖిల్ అద్వాని తీసిన ‘బాజార్’ (2018)తో రోహన్ నటుడయ్యారు.

తమ పెళ్ళి గురించి, తన భర్తకి రేఖతో ఉన్న సంబంధాల గురించి కిరణ్ మెహ్రా చాలా విషయాలు చెప్పారు. ఆయన జీవితంలో చివరివరకు రేఖ ఉన్నదని అన్నారు. ఆమె ఆయన్ని ప్రేమించందని, క్షమించిందని అన్నారు. తమ పెళ్ళికి రేఖ హాజరయిందని కూడా చెప్పారు. ఇప్పుడు కలిసినా, ఒకరినొకరు కౌగిలించుకుంటామని అన్నారు. రేఖ స్థాయి వ్యక్తిని తనని పోల్చుకోకపోయినా, తామిద్దరం ఒకలాంటి వ్యక్తులమే అన్నారు.

వినోద్ మెహ్రా మామగారు తొలుత తన కూతురు కిరణ్‍తో పెళ్ళి చేయడానికి విముఖత చూపారట. ‘పెళ్ళిళ్లు కనుక స్వర్గంలో నిర్ణయించబడకపోతే, కిరణ్ వినోద్‍ల వివాహం జరిగేది కాదు’. వినోద్ మామగారు తన పంతం నెగ్గించుకున్నట్లయితే, ఆ పెళ్ళి జరిగేది కాదు. తమ ప్రేమ, పెళ్ళి గురించి మాట్లాడుతూ – తాను మొదట వినోద్ ప్రేమలో ఎలా పడ్డానో చెప్పారు కిరణ్.

“మేం మొదట ఉమ్మడి స్నేహితుల ద్వారా కలిసాం.  రెండు రోజుల తర్వాత లంచ్‍కి కలుద్దామా అని అడిగారు. నాతో పాటు లండన్‌కి వచ్చారు. కొద్ది రోజులకే మేం ప్రేమలో పడ్డాం. మేం ఫోన్‍లో మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత నేను ఇండియాకి వచ్చాను”.

అప్పుడే కిరణ్ తండ్రికి ఈ వ్యవహారం గురించి తెలిసింది. “మా నాన్న అప్పటికే కెన్యాలో స్థిరపడిపోయారు. ఇండియా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవాలనుకున్నారు (ప్రేమని మొగ్గలోనే తుంచేసి, పెళ్ళి దాకా తీసుకురాకూదనుకున్నారు, కానీ అలా జరగలేదు). వినోద్ మా నాన్నతో మాట్లాడేరు. నన్నూ, మా సోదరికి నార్త్ ఇండియా ట్రిప్‌కి తీసుకువెళ్తున్నాని వినోద్‌కి చెప్పి మాకు కెన్యా టికెట్లు తీశారు నాన్న” చెప్పారు కిరణ్.

ఈ విషయం తెలిసిన వినోద్ ఆఘమేఘాలపై ఢిల్లీ చేరారు. “ఢిల్లీలో నాన్నకీ, వినోద్‍కీ సమావేశం జరిగింది. నేనే వినోద్‍కి ఫోన్ చేసి నాన్న మమ్మలి కెన్యా తీసుకువెళ్ళిపోతున్నారని చెప్పాను. ఆ సమావేశంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఆ తర్వాతి వారమే మా పెళ్ళి జరిగిపోయింది” అన్నారు కిరణ్.

కిరణ్ తండ్రి వినోద్‌తో పెళ్ళి ఎందుకు వద్దన్నారు? అంతకు ముందు తోటి నటీమణులతో ఉన్న సంబంధాల గురించి విని వద్దన్నారా? “ఏవేవో కథలుంటాయి. కానీ, చూడండి, మేం పరిశ్రమకి చెందిన వాళ్ళం కాదు. పైగా ఇండియా మా దేశం కాదు. పోతే, మా కుటుంబంలో నేను చిన్నదాన్ని. అలాంటి నాకు – నాకన్నా 20 ఏళ్ళు పెద్దయిన వ్యక్తితో పెళ్ళి చేయాలంటే నాన్న ఆలోచించరా?” అడిగారు కిరణ్.

కానీ వినోద్, కిరణ్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగడంతో, కిరణ్ తండ్రి బెంగలు తీరాయి. ఏడాది తరువాత ఆయన ఈ పెళ్ళిని సంతోషంగా ఆమోదించారు.

***

నటుడు రోహన్ మాట్లాడుతూ తాను తన తండ్రిని చూడకపోయినా, ఆయన మంచి మనిషి అని, చక్కని నటుడని తెలిసిందని చెప్పారు. “నాది ఓ విచిత్రమైన ఉదంతం, ఎందుకంటే, నేను నా తండ్రిని ఎన్నడూ చూడలేదు. నేను అమ్మ కడుపులో ఉండగానే ఆయన మరణించారు. అందుకే నేను బాలీవుడ్‍కి దూరంగా పెరిగాను. ఇండియా నుంచి ఇరవై ఏళ్ళు దూరంగా ఉన్నాను. అందుకే నాన్న గురించి తెలిసిన వాళ్ల ద్వారా వివరాలు వింటూ ఆయన గురించి తెలుసుకుంటున్నాను” అన్నారు రోహన్.

“పైగా ఆయన సినిమాలు ఎటూ ఉన్నాయి. అయినా అవన్నీ సెకండ్ హ్యాండ్ ఇన్‍ఫర్మేషనే అవుతుంది, ఎందుకంటే తన అనుభవాల గురించి చెప్పడానికి ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. అవన్నీ (తను విన్న కథల గురించి) జరిగిపోయినవి, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడెందుకు? కానీ నాన్నకి కళల పట్ల, సినిమా పట్ల గొప్ప అభిరుచి ఉందని అర్థమైంది. పైగా నటుడిగా కన్నా ఆయన ఓ మంచి మనిషిగా ఉండడానికి ఇష్టపడ్దారు. కొన్నిసార్లు మంచి మనిషిగా ఉండడం గొప్ప నటుడిగా విజయవంతం కావడానికి దోహదం చేయకపోవచ్చు” అన్నారు రోహన్.

“నేను ఆయన్నుంచి నేర్చుకున్నదేమయినా ఉంది అంటే అది ఓ విజయవంతమైన నటుడిగా కన్నా, మంచి మనిషిగా బ్రతకగలగడమే. అంతే. నేను ఆయన సినిమాలు చూస్తాను. ఆయన నాకిచ్చిన పెద్ద కానుక – నా జీవితాన్ని నేను గడిపేలా చేయడం” చెప్పారు రోహన్.

రోహన్ 2018లో సైఫ్ ఆలీ ఖాన్, చిత్రాంగద సిన్హాలు నటించిన ‘బాజార్’ (2018) సినిమాతో హిందీ చలనచిత్ర సీమలో ప్రవేశించారు.


60ల నాటి యాక్షన్ క్వీన్ – నటి చిత్ర:

1960లలో యాక్షన్ క్వీన్‌గా పేరు పొందిన నటి చిత్ర అసలు పేరు అఫ్సర్ ఉన్నీసా బేగమ్. చిన్నప్పుడు సెలవకి ఒకసారి బొంబాయి వెళ్ళినప్పుడు (అప్పట్లో వాళ్ళు హైదరాబాద్‍లో ఉండేవాళ్ళు) ఆమెకి సినిమాలలో నటించాలనే కోరిక కలిగింది.

ఫిల్మ్‌కార్ లిమిటెడ్ వారి కాస్ట్యూమ్ పిక్చర్ ‘మాన్’ (1954)లో అజిత్ సరసన హీరోయిన్‍గా తొలిసారి నటించారు చిత్ర.

వరుసగా అవకాశాలు దక్కడంతో, 50 లూ, 60ల మధ్య ఎన్నో ఫాంటసీలు, థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాల్లో నటించారామె.

ఆజాద్ సరసన – టార్జాన్ సినిమాలు – ‘జింబో’ (1958), ‘జింబో కమ్స్ టు టౌన్’ (1960) – హీరోయిన్‍గా నటించాకా, వీరి జోడి అడవి నేపథ్యంలోని చాలా సినిమాల్లో నటించారు. టార్జాన్ అండ్ కెప్టెన్ కిషోర్ (1964), టార్జాన్ అండ్ దెలిలా (1964), టార్జాన్ అవుర్ జల్‌పరి (1964), ఇంకా టార్జాన్ అవుర్ సర్కస్ (1965) వంటివి కొన్ని యాక్షన్ చిత్రాలకు ఉదాహరణలు. సఖి హతీం (1955), సన్ ఆఫ్ ఆలీబాబా (1955), లాల్ ఎ యమన్(1956), సైర్-ఎ-పరిస్తాన్ (1958), మాయా జాల్ (1962), పటేల్ నాగ్రి (1962), కుఫియా మహల్ (1964), మేజిక్ కార్పెట్ (1964), మై హూ జాదూగర్ (1965), నూర్ మహల్ (1965) జాదూ (1966) వంటివి ఆమె నటించిన కొన్ని ఫాంటసీ చిత్రాలు. నూర్ మహల్ చిత్రంలో ఆమె మూడు పాత్రలు పోషించడం విశేషం.

‘జింబో’ చిత్రంలో చిత్రపై చిత్రించిన ఓ ప్రసిద్ధమైన గీతాన్ని ఆశా భోస్లే పాడారు. అది యూ-ట్యూబ్ లో ఉంది. సినిమా రంగానికి ఎన్నో సేవలు అందించిన ఈ విశిష్ట నటి ఇప్పుడు మన మధ్య లేరు. సుదీర్ఘమైన అనారోగ్యం కారణంగా ఆమె 11 జనవరి 2006 నాడు మృతి చెందారు.

‘జింబో’ (1958) చిత్రంలోని ‘యె కియా తూనే కైసా జాదూ’ పాటని క్రింది లింక్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=QnSeWq6Nwg4

ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. పై పాటని తెలుగులో పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ గార్లు పాడారు. ఆ పాట లింక్:

https://www.youtube.com/watch?v=hKXwv4ixE0o

ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి.

Exit mobile version