సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
నటి నిరుపా రాయ్ డైరీలోని కొన్ని పేజీలు:
హిందీ సినిమాల్లో తల్లి పాత్రల్లో విశేషంగా రాణించక ముందు, నటి నిరుపా రాయ్‌ది మంచి కెరీర్. సాంఘిక చిత్రాలలోనూ, పౌరాణికాల్లోనూ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్నప్పుడు ‘చిబి’ అనే పిలిచేవారట ఆమెని. తొలిసారిగా గుజరాతీ సినిమా ‘రనక్‍దేవి’ (1946)లో నటించారు. కమల్ బల్సారాతో వివాహం అయ్యాకా, ఆమె ‘కోకిల బల్సారా’గా మారారు. నిరుపా రాయ్ అనేది తెర పేరు.
నిరుపా రాయ్ డైరీలోని కొన్ని పేజీలు చదవండి. మధుబాలతో తన స్నేహం గురించి, నర్గిస్‌తో కలిసి పారిస్‍లో చేసిన షాపింగ్ గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
~
బాల్యం:
మాది బల్సార్ అనే చిన్న గ్రామం. రోజూ నన్ను బడికి పంపే ముందు గట్టిగా జడ దువ్వి, నూనె రాసి పంపేది నాయనమ్మ. ఒక్క వెంట్రుక కూడా కదిలేది కాదు. బడి బాగానే ఉండేది.
నాకు మా క్లాస్ అంటే ఇష్టమే, కానీ ఆడుకోవడానికి బండి గంట కొట్టినప్పుడు నాకు మరీ ఇష్టంగా ఉండేది. పిల్లలందరం గట్టిగా అరుచుకుంటూ ఆడుకునేవాళ్ళం. నాకు ఇల్లంటే మరీ ఇష్టం. ఒకరోజు మా అమ్మ, “కోకిల ఇంటి పక్షి” అని బామ్మతో అనడం విన్నాను. అది నిజమే. ఇంటి పనులు చేయడం నాకెంతో ఇష్టం. బావి నుంచి నీళ్ళు తోడేదాన్ని, బియ్యం కడిగేదాన్ని, బట్టలు ఉతికేదాన్ని. పైగా దగ్గరలోని కొట్టు నుంచి ఇంటికి కావల్సిన సరుకులు తెచ్చేదాన్ని.
బామ్మ బాగా పెద్దదయిపోయింది. తనకి సాయం చేయడం నాకిష్టం. ఒకరోజు ఇంటికి అతిథులు వస్తున్నారు. వంటలో సాయం చేస్తే అణా ఇస్తానంది బామ్మ. నాకు అది పెద్ద పనేం కాదు.
పైగా నాకు వంట చేయడం చాలా ఇష్టం.. నాకు నా అణా దక్కింది. నాన్న మరో అణా ఇచ్చారు. నాకెంతో సంతోషం కలిగింది. దాన్ని నా డబ్బుల డబ్బాలో దాచి తాళం వేసుకున్నాను. మళ్ళీ ఇవాళ తెరిచాను. దాన్ని నాన్న నాకు ఇచ్చి నాలుగు నెలలు అవుతోంది. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది.
మర్నాడు ఉదయం నిద్ర లేచినప్పుడు నా మొదటి ఆలోచన – నాకెందుకు అంత సంతోషంగా ఉంది అని. నా డబ్బాలో ఉన్న అణా గుర్తొచ్చింది. ఎవరూ చూడకుండా ఆ డబ్బాని తెరిచి, అణాని చూస్తూ మురిసిపోయాను. మళ్ళీ డబ్బాని దాచేసాను.
తర్వాత:
మా పక్కింట్లో ఒక కుట్టుపని కొట్టు ఉండేది. ఓ ముసలావిడ నడిపేది దాన్ని. చేయడానికి పనేమీ లేనప్పుడు నేను ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ పనిని గమనిస్తుండేదాన్ని. ఒకరోజు ఆవిడ, “కోకిలా, నీకు కుట్టడం ఇష్టమా? జాకెట్లకి నువ్వు కుట్టిన ప్రతి 16 బటన్‍హోల్ (హుక్ తగిలించే వలయం) లకి ఒక అణా ఇస్తాను. కుడతావా?” అని అడిగింది.
నాకు హుషారుగా అనిపించింది. ప్రతీరోజూ కుట్టి పెట్టాలనుకున్నాను. అలా కుట్టడం ప్రారంభించి మూడు నెలలు అయింది.
అయితే ఆమె కోసం నేను రోజూ పని చేయలేదనే చెప్పాలి. నాకు వేరే పనులు కూడా ఉండేవి. పైగా ఎక్కువ సేపు నేను ఆడుకునేదాన్ని.
పైగా, అది పెళ్ళిళ్ళ సీజన్. నేను హాజరవ్వాల్సిన పెళ్ళిళ్లు చాలా ఉందేవి. అయినా వీలు చేసుకుని కుట్టడం పూర్తి చేశాను. మొత్తం 16 రూపాయలు సంపాదించాను.
14 ఏళ్ళకి:
సిగ్గు.. పిరికితనం.. కలవరపాటు.. ఈ రోజు పెద్దవాళ్ళు నా పెళ్ళి గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. అతడెవరో?
బొంబాయి:
ఈ నగరమే మరో ప్రపంచం. నా భర్త కమల్ లేకపోతే ఏం చేయాలో నాకు తెలిసేదే కాదు. ఇక్కడ బతకడం చాలా కష్టం. సినిమాల్లోకి వెళ్ళాలి అనేవారు. ఎలాగో తెలిసేది కాదు.
నాకు పెద్దగా ఆసక్తి లేదు. కాని దాని గురించి ఆలోచించమని కమల్ నన్ను ప్రోత్సహించారు. ఒక రోజు ఓ సినిమా షూటింగ్ చూశాము. అది ఇంకో ప్రపంచం. ఒక ప్రపంచంలో ఎన్నెన్ని ప్రపంచాలో!
‘రనక్‍దేవి’ సినిమాలో అవకాశం వచ్చింది. నిర్మాత శ్రీ. వి. ఎం. వ్యాస్ – నేనే హీరోయిన్‍నని మావారితో చెప్పారట. రోజులు గడిచిపోయాయి.. ఈ రోజు నన్ను హీరోయిన్ పాత్ర నుంచి సైడ్ హీరోయిన్ పాత్రకి మార్చేశారు.
చివరికి కోరస్ గర్ల్‌ని చేశారు. ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. లైట్లు.. ఎన్నో లైట్లు.. ఎందరో అమ్మాయిలు పాట పాడుతున్నారు. వాళ్ళతో పాటు నేను!
రంజిత్ స్టూడియోస్:
రోజూ నా పనికి రైల్లో వెళ్ళేదాన్ని. నాకింకా హిందుస్థానీ రాదు. “ఎప్పటికీ గుజరాతీ సినిమాల్లోనే నటిస్తావా” అని కమల్ అనేవారు. “గుజరాతీ సినిమాలు తీయడం ఆపేస్తే ఏం చేస్తావు?” అని అడిగారు. “సరే హిందుస్థానీ నేర్చుకుంటాను” అన్నాను.
నేను చేసే పనులను క్రమం తప్పకుండా చేస్తాను. ప్రతీ రోజు ఉదయం ఒకే రైలు ఎక్కేదాన్ని. దాదర్ స్టేషన్‍లో, నా వయసే ఉన్న ఒక అమ్మాయిని గమనించాను. మేమిద్దరం ఒకే వీధి గుండా నడిచేవాళ్ళం.
నేను నేరుగా రంజిత్ స్టూడియోకి వెళితే, తను ఎడమ వైపు తిరిగేది. అక్కడ శ్రీ సౌండ్ స్టూడియో అనే మరో స్టూడియో ఉండేది. ఈరోజు ఉదయం దాదర్ స్టేషన్‌లో ఆ అమ్మాయితో మాట్లాడాను. తను కూడా నన్ను గమనిస్తోంది. హిందుస్థానీ భాష నేర్చుకోవడంలోని ఇబ్బందులను తనకి చెప్పాను.
తన పేరు ముంతాజ్ జహా బేగమ్. తను ఢిల్లీలో పుట్టింది. పెద్ద నటి అవ్వాలని కోరుకుంటోంది, ఉర్దూ నేర్చుకుంటుంది. తన చదువులో నన్ను కూడా చేరమని అడిగింది (తనే, నేటి మన మధుబాల).
ఇండోర్:
ఇప్పుడు నా పేరు నిరుపా రాయ్. నిన్నటికీ ఇవాల్టికీ మధ్య కొన్ని విజయవంతమైన పౌరాణిక సినిమాలు నాకున్నాయి. నేను నటించిన ఒక సినిమా ప్రీమియర్ షో కోసం ఇండోర్ వచ్చాము.
థియేటర్‍లో ఒక సాధువు జనాలందరినీ దాటుకుని, మంత్రాలు చదువుతూ వచ్చి నాకు పూలమాల వేశాడు. నేను వెనక్కి జరిగాను. హిప్నటైజ్ చేసి, దోచుకునే వారి గురించి విన్నది గుర్తొచ్చింది.
నా ఆలోచనలు ఆయనకి తెలిసినట్లున్నాయి, నాకు భరోసా నిచ్చారు. తానో సాధువును గౌరవించడానికి వచ్చినట్టు చెప్పాడు, ఆ రోజు నేను నటిని కాను. నాలోనూ ఏదో ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసింది.
శివాజీ పార్క్ ఫ్లాట్:
ఇక్కడ నేను నా బంధువులతోనూ, వారి పిల్లలతోనూ ఉండేదాన్ని. పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఒక టీచరు వచ్చేవారు. ప్రతీ రోజు ఉదయం రాగానే నేరుగా ఆవిడ నా గదికి వచ్చి, నా పాదాల వద్ద కూర్చుని ఒక భజన పాడేవారు.
తరువాత నా పాదాల్ని తాకి, మరో మాట మాట్లాడకుండా పిల్లలకి పాఠాలు చెప్పేవారు. ఇటువంటి ఘటనలు సాధారణమయిపోయాయి. నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నా, వాటి నుంచి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
వారిలో ఇటువంటి భావాలు రేకెత్తిస్తున్న నేను వారి పట్ల మరింత బాధ్యతగా ఉండాలని అర్థమైంది. వారి వల్ల నేను గతంలో కన్నా ఎక్కువ వినయంగా, మరింత ఆధ్యాత్మికంగా ఉంటున్నాను.
మెరైన్ డ్రైవ్ ఫ్లాట్:
మరో రోజున ఇక్కడా అదే జరిగింది. స్టూడియోలో రాత్రి పని చేసి వచ్చి, నిద్రపోయాను. పగలయినా మెలకువ రాలేదు.
సుమారు తొమ్మిది గంటల సమయంలో నలుగురు స్త్రీలు వచ్చారు. నేను నిద్రపోతున్నానని మా అత్తగారు చెప్పారు. వాళ్ళు అక్కడే కూర్చుని పూజ, భజన చేశారు. భజన పూర్తయ్యాకా వెళ్ళిపోయారు.
పారిస్:
రష్యా నుంచి వస్తూ మేము పారిస్‍లో ఆగాము. నేను నర్గిస్ షాపింగ్‍కని బయటకి వెళ్ళాము. పారిస్ ఎంతో గొప్ప నగరం. ప్రతి ఒక్కరూ స్నేహంగా మసలుకొన్నారు. మేము ఒక షాప్‍కి వెళ్ళాము, అక్కడ నాకు ఓ విచిత్రమైన చెవి రింగులు కనబడ్డాయి. చూడంగానే నచ్చేసాయి. రెండు జతలు ఇవ్వమని అడిగాను.
ఆ కొట్లో ఒకే జత ఉందట, కొనేశాను. మర్నాడు మళ్ళీ వస్తాననీ, రెండో జత తెప్పించమని వాళ్ళతో చెప్పాను. వారు కూడా సిద్ధంగా ఉంచుతామన్నారు.
కానీ మర్నాడు నేను ఆ షాపు ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాను. ఎంత వెతికినా పట్టుకోలేకపోయాను. ఆ షాపు మాయమైపోయింది! దిశలను గుర్తించడంలో నా జ్ఞానం పరిమితం అనిపించి భయం వేసింది!
ఆప్టే:
బొంబాయి నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ప్రశాంతమైన చిన్న గ్రామం ఇది. ‘సంత్ రఘు’ అనే పౌరాణిక సినిమా షూటింగ్ కోసం ఈ లొకేషన్‍కి వచ్చాము. గ్రామస్థులు స్నేహపూర్వకంగా ఉన్నారు.
పడవలో ప్రయాణించే సీన్ తీస్తున్నాము. కదులుతున్న పడవలో నేను ఊగుతూ నిలుచున్నాను. అంతా సిధ్ధంగా ఉంది. కెమెరా రోల్ అవుతోంది. నేను పడవను అటూ ఇటూ ఊగిస్తున్నాను, రాబోయే అవాంతరం గురించి నాకు తెలియదు.
ఉన్నట్టుండి పడవ తిరగబడింది. అదృష్టవశాత్తు అది లోతు లేని ప్రాంతం కావడంతో, లేచి వెళ్ళి బట్టలు మార్చుకుని మళ్ళీ షూటింగ్‍కి సిద్ధమయ్యాను. కొన్ని సీన్లు తీశాకా, నీటిలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంది. నాతో పాటు అసిస్టెంట్ డైరక్టర్, ఇద్దరు జాలర్లు పడవలో ఉన్నారు.
వాళ్ళతో నేను తెగ మాట్లాడుతూ, పడవలో అటూ ఇటూ కదులుతూ ఉన్నాను. ఇంతలో వయసులో పెద్దవాడైన ఒక జాలరి తన ఓర్పు కోల్పోయాడు.
“సరే, సరే!” అన్నాడు మరాఠీలో, ఏదో ఓ చిన్న పిల్లతో మాట్లాడుతున్నట్లు.. “ఇంక చాలు ఈ వాగుడు. కదలకుండా కూర్చో. లేకపోతే మళ్ళీ నీళ్ళలో పడతావు” అన్నాడు. “మర్యాదగా మాట్లాడు” అన్నాడు అసిస్టెంట్ డైరక్టర్.
“నువ్వు నిరుపా రాయ్‍తో మాట్లాడుతున్నావని నీకు తెలుసా?” అన్నాడు.
అయితే ఎన్నో ఏళ్ళ తరువాత ఒకరు నన్ను గద్దించడం నాకు నచ్చింది. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్‌ని బాగా ఆస్వాదించాను.
గ్రామస్థులు దయగలవారు, ఆతిథ్యప్రియులు. ఆప్టే లో ఒక గ్రామస్థుడు, అతని భార్య నాకు రుచికరమైన భోజనం వండిపెట్టి, చక్కని పాత్రలో వడ్డించారు. తమతో ఉండమని కోరారు కూడా.
కలకత్తా:
ఓ నటిగా ఒక ఇమేజ్‍లో పడిపోయి, బయటికి రాలేని పల్లంలోకి జారిపోతున్నానా అనే భయం కల్గుతుంది. ఓ స్టార్‍కి తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. పైగా నేను కూడా ప్రతీసారీ ఒకే తరహా పాత్రలే వేస్తున్నాను.. అయితే ఇక్కడ కలకత్తాలో నేను ‘దో బీఘా జమీన్’ చిత్రంలో ఒక రైతు భార్య వేషం వేస్తున్నాను.
ఈ వేషం నాకిచ్చినప్పుడు జనాలు రకరకాలుగా అనుకున్నారు. నేను చేయలేనని కొందరన్నారు. అయితే వారికి తెలిసింది కొంతే! నేను చేయలేని పాత్ర లేదు.
నేను చేయాల్సిందల్లా నా చిన్నతనంలో నేను చేసిన పనులే. నేనే ఆ రైతు మహిళని. ఇప్పుడు మీరు చూసేందంతా కవరింగ్, అలంకరణ మాత్రమే.
బిమల్ రాయ్ ఒక బస్ స్టాప్‍లో కెమెరా పెట్టారు. ముందు స్టాపులో నేను బస్ ఎక్కి, ఆ స్టాపులో తోటి ప్రయాణీకులతో కలిసి దిగాలి. నేను నా చీరకొంగుతో ముఖాన్ని కప్పుకున్నాను.
చెప్పులు లేకుండా ఉన్నాను, తోటి ప్రయాణీకులు నాకేసి వింతగా చూస్తున్నారు, నేనెవరో అని అనుకుంటున్నారు. తర్వాతి స్టాపులో వాళ్ళకి తెలిసిపోయింది. కలకత్తా వీధుల్లో షూటింగ్ అంటే సందడిగా ఉంటుంది. ఓ ఇంట్లోకి వెళ్ళి కాసిని మంచి నీళ్ళు అడిగాను.
చుట్టు పక్కల ఇళ్ళ నుండి అందరూ పరుగెత్తుకొచ్చారు, “మా ఇంటికి వచ్చి నీళ్ళు తాగండి” అన్నారు. కొందరు భోజనానికి పిలిస్తే, మరికొందరు వాళ్ళ ఇళ్ళల్లో బస చేయమన్నారు.
పెద్ద కోరిక:
ఆ తర్వాత ఎన్నో నెలలు గడిచాను, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాకు వస్తున్నవన్నీ దేవత పాత్రలు లేదా రైతు భార్య పాత్రలే!
సినీ నిర్మాతలు కాస్త కొత్తగా ఊహించి, కళాకారులకు విభిన్నమైన పాత్రలు సృష్టించవచ్చు గదా? నాలో పెద్ద కోరిక కలుగుతోంది.
భద్రతా, సౌకర్యం భావనలు మంచివే, కానీ జీవితాన్ని నిస్సారంగా చేసేస్తాయి. కొత్త ఎత్తులు అధిరోహించాలని మనసు కోరుతోంది.
తరచూ ఎన్నో కలలు కంటాను.. అవేవీ నిజం కావు. వచ్చే పాత్రలు సవాళ్ళతో కూడినవి కావు.. ఎన్నో విదేశీ చిత్రాలు చూసి, ‘ఆమె చేయగా లేనిది, నేనెందుకు చేయలేను, అంతకన్నా బాగా చేస్తాను’ అనుకుంటాను.
ఫిల్మ్‌ఫేర్ 1957.
(వచ్చే వారం మీనాకుమారి డైరీలో కొన్ని పేజీలు).
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.