Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు- 176

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అనన్య ప్రతిభాశాలి రాజ్ ఖోస్లా:

బాలీవుడ్‍లో ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఫిల్మ్‌మేకర్స్‌లో ఒకరిగా రాజ్ ఖోస్లా ఎదిగిన తీరు అబ్బురపరుస్తుంది.

రచయిత, దర్శకుడు, నిర్మాతగా హిందీ చిత్రసీమలో రాణించిన రాజ్ ఖోస్లా 31 మే 1925 నాడు జన్మించారు. తొలుత దిగ్గజ దర్శకుడు గురు దత్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసి, అనంతరం భిన్న తరాల ప్రేక్షకులను అలరించిన ఆల్-టైమ్ క్లాసిక్స్ అనదగ్గ చిత్రాలకు దర్శకత్వం వహించారు రాజ్ ఖోస్లా. వీరి అద్భుతమైన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.

  1. రాజ్ ఖోస్లా శిక్షణ పొందిన గాయకుడు. పాటగాడిగా కెరీర్ కొనసాగిద్దామనుకుంటున్న తరుణంలో దేవ్ ఆనంద్ ఆయనను దిగ్గజ దర్శకుడు గురు దత్‍కి సహాయకుడిగా తీసుకున్నారు. గురు దత్ తీసిన ‘బాజీ’ (1951), ‘జాల్’ (1952), ‘బాజ్’ (1953), ‘ఆర్ పార్’ (1954) సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన రాజ్ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు.
  2. రాజ్ ఖోస్లా ‘మిలాప్’ (1954) అనే సినిమాతో దర్శకుడయ్యారు. కానీ ఆ సినిమా పరాజయం పాలయ్యింది.
  3. ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘సి.ఐ.డి’ (1956) తో ఆయన ప్రతిభ అందరికీ తెలిసింది. బాలీవుడ్‍లో రూపొందిన అద్భుతమైన క్రైమ్ డ్రామాలలో ఆ సినిమా ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా హిందీ చిత్రరంగానికి వహీదా రెహమాన్‍ను పరిచయం చేశారు.
  4. సంగీతంలో శిక్షణ పొందినవారు కావడంతో, తన సినిమాల్లో అద్భుతమైన సంగీతం, చక్కని పాటలు ఉండేలా చూశారు రాజ్ ఖోస్లా. ‘సి.ఐ.డి’ (1956) లో ‘లేకే పెహ్లా ప్యార్’, ‘యె హై బాంబే మేరీ జాన్’ వంటివి ఉదాహరణలు.
  5. రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన తొలి ఐదు సినిమాలలో [‘మిలాప్’ (1954), ‘సి.ఐ.డి.’ (1956), ‘కాలా పానీ’ (1958), ‘సోల్వా సాల్’ (1958), ‘బొంబాయి కా బాబూ’ (1960)] దేవ్ ఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు.
  6. ‘కాలా పానీ’ (1958) చిత్రానికి దేవ్ ఆనంద్ తొలిసారిగా ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఇదే సినిమాకి గాను నళిని జయవంత్‌కి ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది.
  7. ‘సోల్వా సాల్’ (1958) సినిమా ఆనాటికి ఓ విభిన్నమైన చిత్రం. ఒక రాత్రి జరిగిన సంఘటనలతో రూపొందింది ఈ చిత్రం. ‘హై అప్నా దిల్ తో ఆవారా’ అనే హిట్ సాంగ్ ఈ సినిమా లోనిదే.
  8. ‘బొంబాయి కా బాబూ’ (1960) సినిమాలో దేవ్ ఆనంద్ సరసన హీరోయిన్‍గా తొలుత అనుకున్నది మధుబాలని. అయితే ఆమె అనారోగ్యం కారణంగా నటించలేకపోయారు. ఆమె స్థానంలో సుచిత్రా సేన్ నటించారు. ఖోస్లా తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఇది. నేరప్రవృత్తిగల నాయకుడు ఓ సంపన్న కుటుంబానికి చెందిన తప్పిపోయిన వారసుడిలా చెప్పుకోవడం, తనని సోదరుడిగా భావించే యువతిని పట్ల ప్రేమని పెంచుకోవడం వంటివి ఆనాటి ప్రేక్షకులను ప్రేక్షకులను విస్తుపోయేలా చేసింది.
  9. ‘ఏక్ ముసాఫిర్ ఏక హసీనా’ (1962) ఆ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్ళు రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది. ఓ.పి.నయ్యర్ ఈ సినిమాకి చక్కని బాణీలను అందించారు.
  10. ఖోస్లా సాధన హీరోయిన్‍గా మూడు సస్పెన్స్ సినిమాలను వరుసగా తీశారు. అవి ‘వో కౌన్ థీ’ (1964), ‘మేరా సాయా’ (1966), ‘అనిత’ (1967). ‘వో కౌన్ థీ’ సినిమాని బాలీవుడ్‍లోని అత్యంత గొప్ప మిస్టరీ సినిమాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ‘లగ్ జా గలే’ ఈ సినిమాలోని అద్భుతమైన లవ్ సాంగ్. ‘అనిత’ (1967) చిత్రంలోని ఓ ‘మలుపు’ హాలీవుడ్ సినిమా ‘వెర్టిగో’ (1958)తో పోలి ఉంటుంది.
  11. సూపర్ హిట్ అయిన ‘మేరా సాయా’ (1966) 1964 నాటి మరాఠీ సినిమా ‘పాఠ్‍లాగ్’కి రీమేక్. ఈ సినిమాలోని ‘ఝుంకా గిరా రే’ అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది.
  12. రాజ్ తీసిన ‘దో బదన్’ (1966) – 1951 నాటి చిత్రం ‘దీదార్’ నుంచి ప్రేరణ పొందింది. కథానాయకుడు మనోజ్ కుమార్ అందించిన ఐడియాతో ఈ సినిమా రూపొందింది.
  13. ‘దో రాస్తే’ (1969) చిత్రం ఆ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్ళు రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది. అదే సంవత్సరంలో కొద్ది నెలల ముందు విడుదలై సూపర్ హిట్ అయిన రాజేష్ ఖన్నా సినిమా ‘ఆరాధన’ ఈ సినిమా విజయానికి దోహదం చేసింది.
  14. ఖోస్లా యాక్షన్ డ్రామా ‘మేరా గావ్ మేరా దేశ్’ (1971) చిత్రం ఆ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్ళు రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తరవాతి కాలంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘షోలే’ (1975)కి ప్రేరణగా నిలిచింది. ఈ సినిమాలోని బందిపోటు ‘జబ్బర్ సింగ్’ ని గుర్తుచేసేలా ‘షోలే’లో బందిపోటు పాత్రకి ‘గబ్బర్ సింగ్’ అని పేరు ఉంటుంది.
  15. ‘మై తులసీ తేరీ ఆంగన్ కీ’ (1978) సినిమా ఆ ఏడాది విడుదలై విజయవంతమైన సినిమాలలో ఒకటి. నూతన్‍కి ఉత్తమ నటిగా ఐదోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుని అందించింది. ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు విజయ్ ఆనంద్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు.
  16. ఖోస్లా దర్శకత్వం వహించిన ‘దోస్తానా’ (1980) సినిమాని కరణ్ జోహార్ తండ్రి యశ్ జోహార్ నిర్మించారు. అది నిర్మాతగా ఆయన మొదటి చిత్రం. తదుపరి కాలంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి కుఛ్ కుఛ్ హోతా హై (1998), కభీ ఖుషీ కభీ ఘమ్ (2001), కల్ హో నా హో (2003) వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
  17. సునీల్ దత్ తన కుమారుడిని హీరోగా పెట్టి తన దర్శకత్వంలో ‘రాకీ’ (1981) అనే సినిమా మొదలుపెట్టారు. అయితే ఆయన భార్య నర్గిస్ జబ్బు పడడంతో, ఆయన అమెరికాలో ఆమె వెంట ఉండాల్సిరావడంతో, ఈ సినిమాని పూర్తి చేయడంలో ఖోస్లా సాయం చేశారు.
  18. ఖోస్లా దర్శకత్వం వహించిన ‘సన్నీ’ (1984) సినిమాలో నిజజీవితంలో తండ్రీ కొడుకులైన ధర్మేంద్ర, సన్నీ డియోల్‍ – తండ్రీ కొడుకుల్లా నటించారు.
  19. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం ‘నఖాబ్’ (1989). ఈ సినిమా పరాజయం పాలుకావడం ఖోస్లా పై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత రెండేళ్ళకే 66 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు.
  20. రాజ్ ఖోస్లా జీవిత గాథ త్వరలో పుస్తకంగా వెలువడనుంది. ఆయన కుమార్తెలు ఉమా కపూర్, అనిత ఖోస్లా సహకారంతో ఆంబ్రోయిష్ రాయ్ చౌదరి రచిస్తున్నారు.

***

తన తండ్రి రాజ్ ఖోస్లా గురించి అనిత ఖోస్లా ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఆవిడ మాటల్లోనే –

నాకిష్టమైన మా నాన్న:

నాన్న మామూలు నాన్న కాదు, ఆయన వృత్తి కూడా మామూలు వృత్తి కాదు. నాన్న రకరకాల మూడ్‍లలో ఉండేవారు. కానీ అన్నివేళలా భావోద్వేగాలతో ఉండేవారు. నేను బాగా చిన్నపిల్లని కావడంతో 1960ల నాటి సంగతులు నాకు గుర్తులేవు.  కానీ పెద్దయ్యాక, మా మీద ఆయన ప్రభావం నాకర్థమైంది. మేం బాంద్రా లోని మరీనా అపార్ట్‌మెంట్‍లో ఉండేవాళ్ళం (తర్వాతి కాలంలో ఈ బిల్డింగ్‌ని అమీర్ ఖాన్ కొన్నారు). నాకు నలుగురు తోబుట్టువులు – ఉమ, సునీత, రీనా, సోనియా. మా అమ్మకి మాతోనే సరిపోయేది. నాన్నకి రీనా అంటే బాగా ఇష్టం, చాలా ముద్దు చేసేవారు. నన్నెప్పుడూ తిడుతూ ఉండేవారు. నాది కాస్త తిరుగుబాటు స్వభావం. నేను నా పద్ధతిలో ఉండాలనుకునేదాన్ని. కానీ ‘నువ్విది చేయకూడదు’, ‘నువ్వది చేయకూడదు’ అనే ఆజ్ఞలే నాకెదురయ్యేవి. అయితే నన్ను దూరం చేసుకోవడం నాన్నకి ఇష్టం లేదు. నేను కాలేజీకి వచ్చేసరికి నాన్న స్థాయి అర్థమయింది. ఆయన సంతానంలో నాకొక్కదానికి సినిమాలంటే ఆసక్తి కలిగింది. నేను చదివిన మాస్ మీడియా కోర్స్ (సోఫియా కాలేజ్, ముంబై)లో నాకొచ్చిన మార్కులని బట్టి సినిమా రంగం వైపు వెళ్ళాలనుకున్నాను. కానీ నాన్న ఒప్పుకోలేదు. ఏదైనా సెట్‌లో నన్ను చూస్తే, “ఎప్పుడొచ్చావు? ఇంటికి వెళ్ళు” అనేవారు. ఆయన ఉద్దేశంలో – ఆడపిల్లలకి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపేయాలి, అదీ ఆడపిల్లలంటే ఆయనికి ఉన్న భావన. మమ్మల్ని పాంట్ వేసుకోనిచ్చేవారు కాదు, దుపట్టా లేకుండా బయటకి వెళ్లనిచ్చేవారు కాదు. మా సంభాషణల్లో ‘ప్లీజ్’, ‘థాంక్యూ’ తప్పనిసరిగా ఉండాలి. ఎవరి గదిలోకైనా వెళ్ళేముందు తప్పనిసరిగా తలుపు తట్టి వెళ్ళాలి. ఓ ధనవంతుడి కూతుర్లమనే భావనే ఆయన మాకు కలగనివ్వలేదు. మాకు ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి ఉన్న సంబంధాలొస్తే, మేం నేల మీద ఉండాలని మమ్మల్ని ఆర్భాటాలకి పోనివ్వలేదాయన. మాకు కారు అందుబాటులో ఉందేది. క్లబ్‍కి వెళ్ళచ్చు. అంతే. మేం బయటి సినిమా థియేటర్లకే వెళ్ళలేదు. సునీల్ దత్ గారి అజంత థియేటర్‍లో నాన్న సినిమాల ప్రివ్యూలు చూసేవాళ్ళం. నాన్న ఎంతో మొండిమనిషి. నేను గ్రాడ్యుయేషన్ కోసం చంఢీఘర్ వెళ్తానన్నాను, నాన్న వద్దన్నారు. కానీ నేను పట్టుబట్టి వెళ్ళాను. తర్వాత నాన్న నాకు చెక్ పంపి, ఉన్ని దుస్తులు కొనుక్కోమన్నారు. నాకు ఇంటి బెంగ కలగకుండా ఉండేందుకు తరచూ ఉత్తరాలు రాసేవారు. ఓసారి మాస్ మీడియా కోర్సులో భాగంగా ఒక క్రూరమైన సినిమా చూడాల్సి వచ్చింది. నాకెంతో భయం వేసింది. అప్పుడు నాన్న నా ఆలోచనలని మళ్ళించడానికి నన్ను డిన్నర్‍కి తీసుకువెళ్ళారు. ఓరోజు ఫిరోజ్ ఖాన్ గారి ‘ఖుర్బానీ’ (1980) ప్రీమియర్‍కి తీసుకువెళ్లారు. ఆ వేడుకకి వెళ్ళడానికి నాకు కొత్త బట్టలు కొన్నారు. అప్పుడు అక్కడ నాజియా హసన్ ‘ఆప్ జైసే కోయీ’ పాటని లైవ్‍లో పాడుతున్నారు. ఎంతో అద్భుతంగా పాడారు. ఓ సమయంలో పెళ్ళి చేసుకోమని ఇంట్లోవాళ్ళు నా మీద విపరీతమైన ఒత్తిడి చేశారు. అప్పుడు నాన్న నా పరిస్థితి అర్థం చేసుకుని, ఇంట్లో వాళ్ళకి సర్దిచెప్పి మమ్మల్ని కశ్మీరు తీసుకువెళ్ళారు. సీ-రాక్, గాజెబో, ఓట్టర్స్ క్లబ్ వంటి ప్రదేశాలకు మేమంతా వెళ్ళాం. అలాగే మహబలేశ్వర్, ఖండాలాకు కూడా వెళ్లాం. ‘దాసి’ (1981) సినిమా షూటింగ్ సందర్భంగా సెట్‍లో రేఖ గారిని చూసి తనయత్వానికి లోనయ్యాను. ఎరుపు, ఆకుపచ్చని చీరలో ఆమె ఉజ్జ్వలంగా ఉన్నారు. మా సోదరీమణులతో పోలిస్తే, నేను ఛాయ తక్కువ, అందుకని నాలో కొంత న్యూనతా భావం ఉండేది. నన్ను తేలికపర్చడానికి “నేను నీకు మేకప్ వేస్తాను, రేఖలా ఉంటావు” అనేవారు నాన్న. నేను అందంగా ఉన్నట్టు భావించేలా చేసేవారు.  ఒకసారి కశ్మీరు నుంచి నాకు రెండు అందమైన చీరలు తెచ్చారు. ‘ఇవి నీకు బాగా నప్పుతాయి’ అన్నారు. నా పెళ్ళి ఘనంగా చేశారు. నా trousseau, హజీ మస్తాన్ కూతురి trousseau ని ఒకే వ్యక్తి డిజైన్ చేశారు.

సినిమాలు కాకుండా నాన్న:

సినిమాలు కాకుండా నాన్నకి క్రికెట్ అన్నా, గుర్రాలన్నా ఇష్టం. మహాలక్ష్మి రేస్ కోర్సులో ఉత్తేజం నిండిన వాతావరణం ఆయనకి ఇష్టం. నాన్నకి చెస్ కూడా ఇష్టం. చివరి సంవత్సరాలలో, హృశీకేశ్ ముఖర్జీగారితో ఎక్కువగా చెస్ ఆడారు. నాన్నకి ఉన్న సంగీతాభిరుచి మాక్కూడా అంటింది. నాన్న ఒక్కోసారి హార్మోనియం వాయించేవారు, ఒక్కోసారి ఏదైనా పాటని హమ్మింగ్ చేసేవారు. నాన్నకి కె.ఎల్. సైగల్ గారంటే బాగా ఇష్టం. ‘ఏక్ బంగ్లా బనే న్యారా’ (ప్రెసిడెంట్, 1937) పాట ఎప్పుడూ నాన్న పెదాలపై ఆడుతూండేది. నాన్న తీసిన బ్లాక్‌బస్టర్ ‘దో రాస్తే’ (1969) చిత్రంలో కూడా ఈ పాటని ఉపయోగించారు. ఒక్కోసారి నాన్న ‘గోరే గోరే చాంద్ సీ ముఖ్ పర్’ (అనిత, 1967) పాటని తెల్లగా ఉన్న మా అక్క ఉమ కోసం పాడేవారు. ‘యారీ హోగయీ యార్ సే’ (దో చోర్, 1972) పాటలో వచ్చే ‘లక్ తును తును’ అనే పదబంధం నాన్న సృష్టించినదే. ఉర్దూ అభిమాని అయిన నాన్న వద్ద జగ్‌జీత్ సింగ్ ఆల్బమ్‍ల రికార్డులు ఉండేవి. గులాం ఆలీ గారి ప్రైవేట్ మెహఫిల్‌కి మేం హాజరయ్యాం. ఫైజ్ అహ్మద్ ఫైజ్ నాన్నకి ఇష్టమైన కవి. ఆయన రాసిన ఓ పుస్తకంలోని ‘తేరీ ఆంఖోం కే సివా’ అనే పదాలను అండర్‍లైన్ చేసుకున్నారు నాన్న. వాటిని ‘చిరాగ్’ (1969)లో ఉపయోగించారు. వాటిని విస్తరిస్తూ మజ్రూహ్ సుల్తాన్‍పురీ గారు పాట రాశారు. రచయిత డా. రహి మసూమ్ రజా గారి నుంచి ఉర్దూ నేర్చుకోమని నాన్న నన్ను ప్రోత్సహించారు. నాతో బలవంతంగా షేక్‌స్పియర్ రచనలు చదివించారు. షేక్‌స్పియర్ రాసిన కవితలని నేను ప్రస్తావిస్తే, నాన్న ఎంతో సంతోషపడ్డారు. సునీల్ దత్ గారు నాన్నకి ఆప్తమిత్రులు. మనోజ్ కుమార్, విజయ్ ఆనంద్, జానీ బాషీ కూడా నాన్నకి దగ్గరి స్నేహితులే. సునీల్ దత్ గారు వాళ్ళబ్బాయితో ‘రాకీ’ (1981) అనే సినిమా మొదలుపెట్టారు. అయితే ఆయన భార్య నర్గిస్ జబ్బు పడడంతో, ఆయన అమెరికాలో ఆమె వెంట ఉండాల్సిరావడంతో, ఈ సినిమాని పూర్తి చేయడంలో నాన్న సాయం చేశారు.

దర్శకనిర్మాతగా నాన్న:

దర్శకనిర్మాతగా నాన్న తనని తాను ఎప్పుడూ కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు. ఆయన 20లలో ఉండగా – సి.ఐ.డి. (1956), కాలా పానీ, సోల్వా సాల్ ( రెండూ 1958లోవే) వంటి థ్రిల్లర్స్ తీశారు. సి.ఐ.డి. గురించి, సోల్వా సాల్ గురించి ఎంత ఇష్టంగా మాట్లాడుతారో, నాకప్పుడు అర్థమైంది ఆయన మీద గురు దత్ గారి ప్రభావం ఎంతగా ఉందనేది. గురు దత్ ఆత్మహత్య చేసుకున్నారా అని అడిగితే, నాన్న సమాధానం చెప్పలేదు. అంతకు మించి ఏదో ఉంది.  తరువాతి కాలంలో నాన్న మిస్టరీ సినిమాలు, మెలోడ్రామా, యాక్షన్ సినిమాలు.. అన్ని రకాల సినిమాలు తీశారు. అయితే తన సినిమాల్లో భావోద్వేగాలు ఉండేట్టు చూసేవారు. నటులు విస్తుపోయేవారు. పుకార్లు ఎని ఉన్నా, ఆయన తన హీరోయిన్స్‌తో సరసాలాడలేదు. స్త్రీలంటే నాన్నకి చాలా గౌరవం. 18 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు ఉన్న ఏ స్త్రీనైనా ఆకర్షించగలిగేవారు. నాన్న హీరోయిన్స్ షార్ట్స్ గానీ, స్విమ్ సూట్ గాని వేసుకోలేదు. ఆయన సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవి. ఎందుకంటే ఆయన జీవితాన్ని అలాగే చూశారు. ఆయన స్త్రీ హుందాతనాన్ని ఆరాధించారు – అది ఆయన భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, లేదా హీరోయిన్ కావచ్చు. నాన్న రొమాంటిక్, అదే సమయంలో ఎమోషనల్ కూడా. ‘ఓ కౌన్ థీ’ సినిమాలో సాధన మనోజ్ కుమార్‌ని ‘ఆప్ క్యూం రోయే’ అని అడుగుతారు. ఇది నాన్న స్వభావాన్ని సూచించే ప్రశ్న. తన అన్ని బంధాల లోనూ నాన్న తాను పొందిన దానికంటే ఎక్కువే తిరిగిచ్చారు. సాధన గారికి నాన్నకీ మంచి స్నేహం ఉండేది. సాధన గారి భర్త (స్వర్గీయ ఆర్.కె. నయ్యర్) గారికి ఆహారంలో రుచులు కావాలి. తరచూ వాళ్ళింటికి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించేవారు. ‘తేరీ మాంగ్ సితారోం సే భర్‌దూం’ (1982) షూటింగ్ సందర్భంగా నూతన్ గారు చాలా త్వరగా, నాన్న కంటే ముందు సెట్‌కి వచ్చేసేవారు. తొందరగా వచ్చేసినందుకు ఆవిడ సారీ చెప్పేవారు. ‘దోస్తానా’ (1982) తీస్తున్నప్పుడు – వెస్టర్న్ ఇమేజ్ ఉన్న జీనత్ అమన్‍ని చీరలలో నటింపజేశారు. అమితాబ్ బచ్చన్ గారి సమయపాలన అందరికీ తెలిసిందే. ఆయన ఖచ్చితంగా ఉదయం 9.30 కి సెట్‍లో అడుగుపెడతారు. నాన్నకి ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు. అందుకని అమితాబ్ గారిని మరీ అంత త్వరగా రావద్దని అడిగారు. రాజేష్ ఖన్నా గారితో ‘దో రాస్తే’ (1969), ‘ప్రేమ్ కహానీ’ (1975)  సినిమాలు తీసినా ఆయన స్వభావం ఎందుకో నాన్నకి నచ్చేది కాదు. ధర్మేంద్ర గారితో అంతా సరదాగా సాగిపోయేది. 1988లో రాజ్ కపూర్ చనిపోయినప్పుడు, దినపత్రికల్లో ఆయనవి అందమైన ఫొటోలు వేసారు. తాను వాటిని చూడలేనంటూ న్యూస్ పేపర్‍ని పక్కన పడేశారు. రాజ్ కపూర్‍కి వీరాభిమాని అయిన నాన్న ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు.

పరాజయాలు, ఏకాంతం:

ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, ఇంటికొచ్చి ‘హిట్ అయింది’ అని చెప్పేవారు. అలా చాలా ఏళ్ళ పాటు సాగింది. కానీ 80వ దశకంలో ఆయనకి చెడ్డకాలం మొదలయింది. ఒక్క దోస్తానా తప్ప – వరుసగా – దాసి, తేరీ మాంగ్ సితారోం సే భర్‌దూం, మేరా దోస్తా మేరా దుష్మన్, మాటీ మాంగే ఖూన్, నఖాబ్ – ఐదు సినిమాలు పరాజయం పాలయ్యాయి. నాన్న అలసిపోయారని మాకు తెలుస్తోంది. కానీ తగ్గేందుకు ఆయన ఒప్పుకోలేదు. ‘తర్వాతి సినిమా హిట్ అవుతుందేమో, నేను సాధించగలను’ అనేవారు. 30లలో ఉండగా చేసినవి 60లలో చేయలేమని ఒప్పుకోడాని ఆయనకి అహం అడ్డు వచ్చింది. ఒక సెట్ నుంచి మరో సెట్‌కి తిరుగుతూండేవారు. కానీ త్వరలోనే క్రుంగుబాటుకి లోనయ్యారు. తన గదికే పరిమితమైపోయి, ఎవరితోనూ కలవక, చదువుకుంటూ ఉండేవారు. కొంత విరామం తీసుకుని ఉంటే బాగుండేదని మాకనిపించింది. ఇల్లు మారి – సముద్రానికి ఎదురుగా ఉండే కార్టర్ రోడ్ అపార్ట్‌మెంట్‌కి మారదామని చెప్పాము. కదిలే అలలతో నిండిన సముద్రం ఆయన జీవితంలో సానుకూల తరంగాలను తెస్తుందని నమ్మాం. కానీ ఆయన వినలేదు, ఆ ఇల్లు వదిలి రాలేదు. నాన్నేమీ తాగుబోతు కాదు, పరిమితంగానే తాగేవారు. నాన్న తాగి ఉండడం వల్ల షూటింగులు రద్దయ్యాయి అన్నవన్నీ వట్టి పుకార్లే. అయితే నాన్న పరాజయాలు మమ్మల్ని ఆర్థికంగా బాధించలేదు, ఎందుకంటే మేం దుబారా చేసే వాళ్ళం కాదు.

తుది దశ:

చివర్లో ఆయనకి కామెర్లు సోకాయి. జస్‍లోక్ ఆసుపత్రిలో చేర్చాము. ఆయన అంత త్వరగా వెళ్లిపోతారని ఎవరూ అనుకోలేదు. చివరి వరకూ అప్రమత్తంగానే ఉన్నారు. 21 మే 1991 నాడు జరిగిన రాజీవ్ గాంధీ హత్యతో బాగా క్రుంగిపోయారు. నాన్న చనిపోయిన రోజున (9 జూన్ 1991) ముంబైలో కుంభవృష్టి కురిసింది. విమానాలు రద్దు కావడం వల్ల నేను ఢిల్లీ నుంచి రాలేకపోయాను. ఆగకుండా వానలు కురవడం వల్ల మూడు రోజుల పాటు పార్థివదేహాన్ని ఇంటికి తేలేకపోయారు. అప్పటికే కెరీర్ మసకబారడంతో నాన్న మరణం కూడా ఓ సాధారణ విషయంగా మారిపోయింది. నాన్న పోయిన రెండేళ్ళకి అమ్మ కూడా వెళ్లిపోయింది. దాదాపు ఏడేళ్ళ పాటు నేను మ్యూజిక్ వినలేకపోయాను.. ఎందుకంటే మ్యూజిక్ అంటేనే నాన్న. సంగీతం, కవిత్వం,  సినిమాల పట్ల నాన్న కున్న  ప్రేమ నాలో వారసత్వంగా దక్కింది. నాన్న తీసిన సినిమాల రీల్స్‌ని మేం ఆస్తుల్లా పంచుకున్నాం. తన సినిమాల మీద హక్కులని పదేళ్ళ పాటు దూరదర్శన్‌కీ, శాటిలైట్ టెలివిజన్‍కి ఇచ్చాము. నాన్న తన సినిమాలలోని పాటల ద్వారా ఎప్పటికీ మన మధ్య నిలిచే ఉంటారు. ఆయన ఎంతో మేధావో ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఒకటే విచారం.. మాలో ఎవ్వరినీ సినీరంగంలో ప్రవేశించేందుకు ఆయన ప్రోత్సహించలేదు. ‘నాకన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నావారెందరూ సినీరంగంలోకి ప్రవేశించలేకపోయారు. నేను అదృష్టవంతుడిని, అంతే’ అని అనేవారు.

***

రాజ్ ఖోస్లా గురించి ఆయన కూతురు చెప్పిన విషయాలివి.

Exit mobile version