సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
గీతా బాలి, షమ్మీ కపూర్‍ల ప్రేమ కథ:
షమ్మీ కపూర్ నటి గీతా బాలిని తొలిసారిగా కలిసింది కేదార్ కపూర్ దర్శకత్వం వహించిన ‘మిస్ కోకా కోలా’ (1955) చిత్రం షూటింగ్‍లో. మ్యూజికల్ హిట్ అయిన ఈ చిత్రంలో గీత ‘మిస్ కోకా కోలా’ అనే నైట్ క్లబ్ డాన్సర్‍గా నటించగా, ఆమెకు సహాయపడే యువ ధనవంతుడి పాత్రలో షమ్మీ నటించారు. అప్పటికే స్టార్ అయిన గీతా సమక్షంలో వర్ధమాన నటుడైన షమ్మీకి మాట పెగిలేది కాదట. అయితే ఆమెది చక్కని వ్యక్తిత్వం, కలుపుగోలు స్వభావం కావడంతో అందరితోనూ చక్కగా మసలుకునేవారు. వీరిద్దరూ త్వరలోనే స్నేహితులైపోయారు. అంతకుముందు మూడేళ్ళ క్రితం షమ్మీ – నాదియా గమాల్ అనే ఈజిప్టుకు చెందిన బెల్లీ డాన్సర్‌ని దాదాపుగా పెళ్ళి చేసుకున్నంత పని అయ్యింది. వారిద్దరూ కొలంబోలో కలిసారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే ఆమె షమ్మీని తన దేశం వచ్చి కైరోలో స్థిరపడాలని కోరడంతో వారి వివాహం జరగలేదు. పైగా అప్పటికి ఆమెకి 17 ఏళ్ళేనట. గీత పరిచయం వల్ల షమ్మీ నాడియాని మర్చిపోగలిగారు. తరువాత గీతపై షమ్మీ ఎంత అభిమానం పెంచుకున్నారంటే, రేడియోలో తరచూ ఆమె పాటలు వివేవారట. గీత, షమ్మీ మళ్ళీ ‘రంగీన్ రాతే’ (1956 విడుదల) చిత్రం షూటింగ్ సందర్భంగా కలిసారు.
ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కిదర్ శర్మ షమ్మీ అన్నయ్య రాజ్ కపూర్‍కి గురువు లాంటివారు. ఈ సినిమాలో గీతా బాలి కాకుండా, చాంద్ ఉస్మానీ, మాలా సిన్హా కూడా ఉన్నారు. నిజానికి ఈ సినిమాలో గీతా బాలిది చాలా చిన్న, అప్రాధాన్యమైన పాత్ర. అయినా షమ్మీకి దగ్గరగా ఉండాలన్న ఆలోచనతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారామె. కిదర్ శర్మ క్రమశిక్షణని గట్టిగా పాటించే వ్యక్తి. ఆయన నిశితంగా గమనిస్తున్నప్పటికీ, షమ్మీ, గీతలు తమ ప్రేమని కొనసాగించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం అందమైన ప్రకృతి ఉన్న రాణిఖేత్‍లో చిత్రీకరించారు, ఆ అందమైన ప్రకృతి దృశ్యాల వల్ల కూడా వీరి ప్రేమ బలపడిందని అంటారు. షూటింగ్ పూర్తి చేసుకుని బొంబాయి తిరిగివచ్చేసరికి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. షమ్మీ ఎలాగైనా గీతని పెళ్ళి చేసుకుంటానని ప్రమాణం చేశారు. కానీ అదంత సులభం కాదని ఇద్దరికీ తెలుసు. ఎందుకంటే గీత షమ్మీ కంటే వయసులో ఒక ఏడాది పెద్ద. పైగా ఆమె అంతకుముందు రాజ్ కపూర్ సరసన ‘బవ్రే నైనా’ (1950) చిత్రంలోనూ, పృథ్వీరాజ్ కపూర్ గారి ‘ఆనంద్‌మఠ్’ (1952) సినిమాలో నటించి ఉన్నారు. అందుకని ఆమెని సీనియర్ హీరోయిన్‍గా పరిగణించేవారు. అలాంటి ఆమెను పెళ్ళి చేసుకోడమంటే నియమాలని ఉల్లంఘించడం లాంటిదే. వాళ్ళ పెళ్ళికి కపూర్ కుటుంబం అంత తేలికగా ఒప్పుకోదన్నది విదితమే. షమ్మీ ప్రతిరోజూ ఫోన్ చేసి షమ్మీ ప్రొపోజ్ చేస్తూనే ఉండేవారు, ఆమె తిరస్కరిస్తూనే ఉండేవారు. అయితే ఒకరోజు సరే పెళ్ళి చేసుకుందాం అన్నారట ఆమె. కానీ వెంటనే పెళ్ళి జరిగిపోవాలని షరతు పెట్టారట.
అప్పుడు షమ్మీ జానీ వాకర్‍ను సంప్రదించారు. ఎందుకంటే ఆ రోజుల్లో జానీ వాకర్ ఎంత వ్యతిరేకత ఎదురైనా, నటి షకీలా సోదరి నూర్‍ని వివాహం చేసుకున్నారు. అందుకే జానీ – హృదయం మాట వినమని తన మిత్రుడిని ప్రోత్సహించి, గీతని పెళ్ళి చేసుకోమని చెప్పారట. ఏదైనా గుడికి వెళ్ళండి అని అన్నారట జానీ. వెంటనే షమ్మీ గీతని పిలిపించి, జానీతో సహా నిర్మాత హరి వాలియా వద్దకు వెళ్ళారు. ఆయన వాళ్ళని బొంయిలోని ప్రసిద్ధ బన్‌గంగా ఆలయానికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే రాత్రి అయిపోవడంతో గుడి మూసేశారు. పూజారి మర్నాడు ఉదయం తప్పకుండా వివాహం జరిపిస్తానని చెప్పడంతో – మళ్ళీ గీత మనసు మార్చుకుంటారేమోనని భావించిన షమ్మీ తన మిత్రుడింట ఉండమని గీతకి చెప్పారట. షమ్మీ, గీత, జానీ, హరి వాలియా ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారట. ఉదయం నాలుగు గంటలకే నలిగిన బట్టలతో గుడికి వెళ్ళిపోయారట. దగ్గర్లోని పూల కొట్టు నుంచి రెండు పూలదండలను కొన్నారట జానీ. అంత పెద్ద నటులని అలా నలిగిన బట్టల్లో చూడడం పూజారికి వింతగా ఉన్నా, ఆయన తన మాటకి కట్టుబడి వాళ్ళ పెళ్ళి జరిపించారు. ఐతే హడావిడిలో సిందూరం తెచ్చుకోవడం మర్చిపోయారు గీత. ఆమె నుదుటన సిందూరం పెట్టమని పూజారి చెప్పినప్పుడు షమ్మీకి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు తన వద్దనున్న లిప్‍స్టిక్ తీసి, దాన్ని సిందూరంలా నుదుటన ఉంచమని చెప్పారట గీత. ఆ సమయంలో కపూర్ కుటుంబం ఊర్లో లేదు. వచ్చాకా ఈ పెళ్ళి వార్త తెలుసుకుంది. విస్తుపోయినా, తేరుకుని, ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. గీతతో పెళ్ళి తరువాత షమ్మీకి అదృష్టం కలిసొచ్చింది. ఆయన కెరీర్ పుంజుకుంది. నాసిర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన ‘తుమ్సా నహీ దేఖా’ (1957) బ్లాక్ బస్టరై షమ్మీ కెరీర్‍ని మార్చేసింది. షమ్మీ రెబల్ స్టార్‍గా గుర్తింపు పొంది బాలీవుడ్‍ని ఏలుతున్న ఆనాటి త్రిమూర్తులు దిలీప్-రాజ్-దేవ్ లకు గట్టి పోటీ ఇచ్చారు.
ఈ దంపతులకు పెళ్ళయిన ఏడాదికి 1956లో ఆదిత్య రాజ్ కపూర్ అనే కొడుకు పుట్టాడు. ఆ తరువాత ఐదేళ్ళకి 1961లో కంచన్ అనే కూతురు పుట్టింది. అయితే వీరి సంతోషం తాత్కాలికమే అయింది. గీత మశూచి వల్ల 1965లో మరణించారు. ఆ సమయంలో షమ్మీ ‘తీస్రీ మంజిల్’ అనే సినిమా షూటింగ్‍లో ఉన్నారు. గీతకి బాగా సీరియస్‍గా ఉందని విని ఇంటికి వచ్చేసారు. అయితే వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. తర్వాత 1969లో షమ్మీ భావ్‍నగర్ మాజీ రాచకుటుంబానికి చెందిన నీలా దేవిని వివాహం చేసుకున్నారు.
షమ్మీ కపూర్ – నీలా దేవి:
తెర పైన షమ్మీ ఎందరో అందగత్తెలో ప్రేమాయణం నడిపి ఉండచ్చు. కానీ నిజ జీవితంలో ఆయన హీరోయిన్ ఆయన ఇంట్లో ఉన్నారు. అస్థిమితమైన ఆయన జీవితాన్ని కుదుటపరిచారామె. తన భర్త సంతానాన్ని జాగ్రత్తగా పెంచేందుకు తాను పిల్లల్ని కనకుండా ఉన్నారామె. ఆమే నీలా దేవి గోహిల్. భావ్‍నగర్ రాజకుటుంబానికి చెందిన నీలా షమ్మీకి వీరాభిమాని. షమ్మీతో పెళ్ళి ప్రస్తావన వచ్చినప్పుడు – ఆయనతో జీవితం కథలా సాగదని ఆమెకి తెలుసు. అయినా ఆమె లోని రాచరిక స్వభావం ఆ సవాలుని స్వీకరించేలా చేసింది. “నాకప్పుడు 27 ఏళ్ళు. సినిమా హీరోని పెళ్ళి చేసుకుంటున్నాను అని తెలిసి ఎగిరి గెంతేసే వయసు కాదు. ఆయన గురించి మంచీ, చెడూ అన్నీ నాకు తెలుసు. ప్రముఖ హీరోగా ఆయన కీర్తి ప్రతిష్ఠలు తెలుసు” అన్నారు నీలా. షమ్మీ ఆమె కంటే 10 ఏళ్ళు పెద్ద. ఇంట్లోని పెద్దవాళ్ళు రెండు నెలలు గడువిచ్చారు. అయితే నీలా పెళ్ళికి అంగీకరించి, కుటుంబాన్ని తీర్చిదిద్దారు.
ఐతే ఈనాటి నీలా అలనాటి నీలకి ఛాయ లాంటి వారు. వృద్ధాప్యం మీద పడడం, ఆభరణాలు ధరించకపోవడం వంటి మార్పులు వచ్చాయి. “తాను చనిపోవడానికి కొద్ది రోజుల ముందు – నా పుట్టిన రోజు కోసం షమ్మీ నాకొక వజ్రాల హారం కానుకగా ఇచ్చారు. నాకు 70, ఆయనకు 80 నిండుతున్నాయి. ఆ రోజు ఆయన నా ఫోటో కూడా తీశారు. ఆ హారం ధరించడం అదే ఆఖరిసారని నాకు తెలుసు.” అన్నారామె. వారి 42 ఏళ్ల సహచర్యం ముగిసిపోయింది. “నేను ఆయనకెంతో దగ్గరయ్యాను. మేమిద్దరం ఒక్కటే. మా పెళ్ళయ్యాకా, ఒక్క రాత్రి కూడా నేను మా పుట్టింట్లో గడపలేదు. నేను షమ్మీని విడిచి ఒక్క రోజూ కూడా ఉండలేదు. ఇప్పుడు ఆయన నన్ను శాశ్వతంగా విడిచివెళ్ళారు” అన్నారామె.
అంతకు ముందు ఐదేళ్ళ క్రితం షమ్మీ 75వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద పార్టీ ఇచ్చారు నీలా. ఆయనతో నటించిన హీరోయిన్‍లందరిని సగౌరవంగా ఆహ్వానించారు. వాళ్ళంతా హాజరయ్యారు. వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
షమ్మీ నీలాల తొలి పరిచయం:
పృథ్వీరాజ్ కపూర్ గారి నాటక బృందం ప్రదర్శనల కోసం భావ్‍నగర్ రావడంతో ఈ రెండు కుటుంబాలకి స్నేహం కలిసింది. షమ్మీ నీలాదేవి అన్నగారు రఘువీర్ సింగ్‍కి మిత్రుడయ్యారు. అప్పట్లో తన మిత్రుడి చెల్లెలయిన తొమ్మిదేళ్ళ నీలాని ఆటపట్టించేవారట షమ్మీ. చాలా ఏళ్ళ తరువాత కృష్ణ కపూర్ (రాజ్ కపూర్ భార్య) – నీలాని చూసి – భార్యని కోల్పోయిన తన మరిది షమ్మీకి చక్కని జోడి అవుతారని భావించారు. “రీతూ (రాజ్ కపూర్ – కృష్ణ కపూర్‍ల పెద్దమ్మాయి) నా కాలేజీలో నాకు స్నేహితురాలు. కృష్ణ గారికి నేనంటే ఎంతో అభిమానం. అందుకని షమ్మీ గారిని, పిల్లల్ని చూసుకునేందుకు నన్ను ఆయనని పెళ్ళి చేసుకుంటావా అని అడిగారు” చెప్పారు నీలా. రీతూ సంగీత్ సమయంలో కృష్ణ గారు, ఉర్మి గారు (షమ్మీ సోదరి) – నీలాని కలవమని షమ్మీకి చెప్పారు. అయితే ఆ రోజు షమ్మీ షూటింగ్‍లో చాలా బిజీగా ఉన్నారు. “ఆ రోజు రాత్రి సుమారు 1.30కి షమ్మీ మా ఇంటికి ఫోన్ చేశారు. నాతో మాట్లాడాలని అన్నారుట. ఫోన్ ఎత్తిన మా సోదరి మొదట ఫోన్ చేసింది షమ్మీ అంటే నమ్మలేదు. ఎవరో ఆకతాయి అనుకుందట. చివరికి రాత్రి 2 గంటలకి మొదలైన మా సంభాషణ తెల్లారేవరకూ కొనసాగింది. ఆయన తన గురించి అన్ని విషయాలు ఉన్నదున్నట్టుగా చెప్పారు. ఏదీ దాచలేదు. చివరగా, ‘రేపు ఉదయం మా ఇంటికి బ్రేక్‍ఫాస్ట్‌కి రా, ఇక జీవితాంతం మా ఇంట్లో ఉండిపో. నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను’ అని అన్నారు” గుర్తు చేసుకున్నారు నీలా. “గీతా బాలిని వివాహం చేసుకున్న గుడిలోనే, ఆ సమయంలోనే పెళ్లి చేసుకుందాం అన్నారు. కానీ మనమేమీ నేరం చెయ్యడం లేదు, మన తల్లిదండ్రుల సమక్షంలో చిన్న వేడుకగా పెళ్ళి చేసుకుందాం అన్నాను. మర్నాడు మా మామగారు పృథ్వీరాజ్ కపూర్ గారొచ్చి వాళ్ళబ్బాయితో పెళ్ళికి నా అంగీకారం అడిగారు. ఆ మర్నాడే (27 జనవరి 1969) మా పెళ్ళి జరిగింది. ఫిబ్రవరి 1న రీతూ పెళ్ళయింది” చెప్పారు నీలా.
మొదటి కొద్ది నెలలు చాలా ఇబ్బందిగా గడిచాయి. “నాకు అలవాటైన జీవన శైలి వేరు. షమ్మీ కుటుంబం జీవన శైలి వేరు. ఇక్కడ రోజూ పార్టీలయ్యేవి, నిరంతరం మాంసం, బిర్యానీల వడ్డన సాగేది. షమ్మీ కూడా బాగా తాగేవారు. దుందుడుకుగా ఉండేవారు. కానీ వీటన్నింటిని తట్టుకునే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. పైగా ఉర్మి గారు, కృష్ణ గారు నాకు మద్దతుగా నిలిచారు. మా అత్తమామలు నన్నెంతో అభిమానించారు” చెప్పారు నీలా. అయితే షమ్మీ ఎంత ప్రేమగా, బాధ్యతగా ఉన్నా, ఆమెని బయటకి తీసుకువెళ్ళడానికి మాత్రం సంకోచించేవారట. “ఆయనకి వేరే బృందం ఉంది. మొదటి ఆరు నెలలు మేమిద్దరం కలిసి ఎక్కడికీ వెళ్ళలేదు. హనీమూన్ లేదు. నేను షూటింగ్‍లకి కూడా వెళ్లలేదు. నేనెప్పుడూ ఆయనని రెచ్చగొట్టలేదు. నేనలా చేసుంటే ఆయన మరింత రెచ్చిపోతారు. ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఆయనని ప్రశాంతంగా ఉంచడం అవసరం. ఆయన తన గతం నుంచి స్వచ్ఛంగా బయటపడ్డారు. తన దుడుకు స్వభావం, వ్యామోహం వల్ల యవ్వనంలో ఆయన చేసిన పనులన్నీ నాకు తెలుసు, వాటి పట్ల ఆయనలో అపరాధభావం ఉండేది. అందువల్ల నేను ఆయన గతాన్ని ఎన్నడూ తవ్వలేదు.” చెప్పారు నీల. కొన్నాళ్ళకి నీలకి భర్తతో సయోధ్య కుదిరింది. “ఆయన తాగి వచ్చి, ఇంట్లో దురుసుగా ప్రవర్తించినప్పుడు, అప్పుడాయనకి నేనేం చెప్పేదాన్ని కాదు. కానీ ఉదయం పూట చెప్పేదాన్ని రాత్రి ఏం జరిగిందో. ఆయన నన్ను అర్థం చేసుకునేవారు. మెల్లగా మా మధ్య అవగాహన కుదిరింది” అన్నారామె. పెళ్ళయిన ఆరు నెలలకి, షమ్మీ ఆమెను బయటకు తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. “మేమిద్దరం మాత్రమే రెండు నెలలు యూరప్‍లో గడిపాం. ఆయన ఎంతో సౌకర్యంగా, శాంతంగా ఉన్నారు. ఆ తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళినా – షూటింగ్‍లయినా, వేట అయినా, వేడుకలయినా – నన్నూ తీసుకెళ్ళేవారు. అయితే ఆయన సినిమాల సెట్లకి మాత్రం నేను వెళ్ళేదాన్ని కాను, హోటల్ గదిలో ఉండిపోయేదాన్ని” చెప్పారామె.
షమ్మీ పిల్లలు – ఆదిత్య, కంచన్ – నీలాకి కీలకం. “వాళ్ళతో నేను స్నేహంగా ఉండాలనుకున్నాను. ఆదిత్యతో స్నేహం తొందరగానే కలిసింది. అప్పుడు అతనికి 12 ఏళ్ళు. సనావర్‍లోని బోర్డింగ్ స్కూల్లో ఉండేవాడు. చాలా బెంగగా ఉండేవాడు. అతన్ని ఇంటికి తీసుకొచ్చేశాను. ఇంట్లో హాయిగా ఉండేలా చూశాను. మా ఆయన షూటింగ్‍లకి వెళ్ళినప్పుడు నేనూ పిల్లలు ఇంట్లో సందడి చేసేవాళ్ళం” అన్నారు నీలా. అయితే ఏడేళ్ళ కంచన్ మనసు గెలవటం నీలాకి అంత సులభం కాలేదు. “తల్లి చనిపోయినప్పుడు కంచన్ వయసు మూడున్నర ఏళ్ళు. అప్పటికి తనకి అమ్మ గురించి పెద్దగా తెలియదు. నాన్న గురించే కాస్త తెలుసు. ఇప్పుడు నాన్నతో ఉండడానికి మరో స్త్రీ వచ్చిందన్న విషయం కంచన్ గ్రహించింది. అంతకు ముందు కొందరు స్త్రీలు వచ్చి వెడుతుండేవారు, ఈవిడ శాశ్వతంగా ఉండిపోయిందని పాప అనుకునేది” అన్నారు నీలా. ఇంట్లో పాత పనిమనుషులు ఉండడం వల్ల పిల్లలతో నీలాకి ఇబ్బందులు రాలేదు. “పనివాళ్ళకి ఇంట్లో ఎవరూ లేకపోవడం బాగా అలవాటు. ఇప్పుడు పార్టీలకీ, పేకాటలకి వెళ్ళని ఒకావిడ తమని నిరంతరం గమనిస్తూ ఉందన్న భావన వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగించింది. వాళ్ళల్లో ఒకామె తానే ఇంటి యజమానిలా ఉండేది. పిల్లల్ని నామీదకి ఉసిగొల్పింది. కానీ ఇంట్లో ఏం జరుగుతోందో ఆయనకి తెలిసింది. ఆమెని పని మాన్పించి పంపించేశారు” చెప్పారు నీలా.
కంచన్ గురించి చెబుతూ, “మేము ఎక్కడికి వెళ్ళినా – అది ప్రీమియర్ షో అయినా, అవుట్ డోర్ షూటింగ్ అయినా – నేను కంచన్‍ని నా వెంట తీసుకువెళ్ళేదాన్ని. ఎందుకంటే నేను వాళ్ళ నాన్నని తనకి దూరం చేశానని పిల్ల బాధపడకూడదు. క్రమంగా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఇప్పుడు కంచన్ బలమైన వ్యక్తిత్వం సంతరించుకుంది. ఎప్పుడైనా నాకు దిగులుగా ఉంటే, తనకి తెల్సిపోయినట్లుగా వెంటనే ఫోన్ చేసి ఎలా ఉన్నావంటూ అడుగుతుంది. “ఒకసారి కాలేజీ ఫార్మ్ లో అమ్మ పేరు అన్న చోట నా పేరు రాసింది. గీత గారి పేరు రాయాలి అని నేనంటే, మా అమ్మ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆమె నాకు తెలియదు. నాకు తెల్సిన అమ్మవి నువ్వే” అంది. ఇది కంచన్ నాకిచ్చిన పెద్ద కానుక” అన్నారు.
నీలా తను పిల్లలు కనకూడదనుకున్న మాట నిజం. “ఆదిత్య, కంచన్‍లను సొంత బిడ్డల్లా చూసుకోవడం పెద్ద సవాలు. అందుకే నేను పిల్లల్ని కనకూడదని అనుకున్నాను. నేను పెంపుడు తల్లినే అయినా, కన్నతల్లిలానే అన్ని భావాలు అనుభవించాను. వాళ్ళతో అతి చనువుగా ఉండి వాళ్ళని క్రమశిక్షణకి దూరం చేయడం నాకు ఇష్టం లేదు. బహుశా నాకూ పిల్లలుంటే, ఏదో ఒక సమయంలో వాళ్ళతో ఇబ్బంది వచ్చేదేమో” అన్నారు నీలా.
నీలా దేవి తన మనుమలు, మనుమరాళ్ళతో ఉల్లాసంగా గడుపుతారు. “కంచన్ కూతుళ్ళు పూజా, రాజేశ్వరి; ఆదిత్య కొడుకు విశ్వప్రతాప్, కూతురు తులసి నాకు పంచప్రాణాలు. వాళ్ళు నా దగ్గర ఏదీ దాచారు. తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి, బోయ్ ఫ్రెండ్స్ గురించి అన్నీ చెప్తారు. ‘అమ్మా, నువ్వు మాతో ఎంతో కఠినంగా ఉన్నావు, వీళ్లని మరీ ముద్దు చేస్తున్నావు’ అని కంచన్ అంటుంది. వాళ్ళని క్రమశిక్షణలో ఉంచడం నీ పని, చెడగొట్టడం నా పని అంటాను నేను” చెప్పారు నీలా.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.