Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 194

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

విశిష్ట నటి దుర్గాఖోటే:

1930ల నుండి 1980ల వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్రాల ప్రేక్షకులకు చిరపరిచితమైన నటి దుర్గా ఖోటే. ఆ కాలంలోని ఇతర సినీ తారలకు ఆమెంతో భిన్నం. స్త్రీలు పెద్దగా చదువుకోని, పాఠశాలలకి వెళ్ళని ఆ కాలంలో – ఆమె అనేక రకాల రికార్డులను సృష్టించారు. మిషనరీ పాఠశాల నుండి తన ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేశారు, తదుపరి బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరారు.

స్త్రీ పాత్రలు పురుషులే పోషించిన కాలంలో, ఆమె ఒక రకమైన మార్గదర్శకురాలిగా నిలిచారు – బహిరంగంగా కనిపించి ధైర్యంగా స్త్రీ పాత్రలు పోషించారు. ఆమె మరణించి దాదాపు మూడు దశాబ్దాలైనా, దుర్గా ఖోటేను సినీ ప్రేక్షకులు మర్చిపోలేదు, ఇప్పటికీ గౌరవిస్తారు. తన పేరుగల దేవతతో సమానంగా ప్రతిభావంతురాలైన దుర్గా ఖోటే అలనాటి బాలీవుడ్‍పై చెరగని ముద్ర వేశారు.

తొలినాళ్ళు:

ఆమె బొంబాయిలో స్థిరపడిన మహారాష్ట్ర/కొంకణి కుటుంబంలో 14 జనవరి 1905న జన్మించారు. ఆమె అసలు పేరు వీటా లాడ్‌. వారిది ఉన్నత కుటుంబం కాబట్టి ఆమె కేథడ్రల్ హై స్కూల్‌లో విద్య అభ్యసించగలిగారు. ఆ తర్వాత బొంబాయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‍లో చేరారు. ఆమె కళాశాలలో ఉండగానే – బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన విశ్వనాథ్ ఖోటే అనే మెకానికల్ ఇంజనీర్‌తో వివాహం జరిగింది.

ఈ జంట సామరస్యపూర్వకమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. వారికి ఇద్దరు కుమారులు కలిగారు. అయితే వీరి వైవాహిక జీవితం స్వల్ప కాలానికే ముగిసిపోయింది. 26 ఏళ్ళ వయసుకే దుర్గ తన భర్తని కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలతో మిగిలారు. ఆమె తన అత్తమామలతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నా, వారిపై ఆధారపడటానికి ఇష్టపడలేదు. ఉదారవాద సామాజిక వాతావరణం నుండి వచ్చినందున, పాశ్చాత్య విద్యను అభ్యసించినందున సినీ ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మంచిదని ఆమె భావించారు. ఆమెకు మొదటి నుంచి రంగస్థలం, నాటకరంగం అన్నా ఇష్టం, పైగా నటన పట్ల ఆసక్తి ఉండేది. ఆమె సోదరి షాలిని – నిర్మాత జెబిహెచ్ వాడియాకు స్నేహితురాలు. వారి మూకీ చిత్రం ‘ఫరేబీ జాల్’ (1931)లో నటించేందుకు దుర్గని ఒప్పించడంతో మొదటి అవకాశం వచ్చింది. చాలా సహజంగానే, తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సమాజపు ఉన్నత వర్గానికి చెందిన కుటుంబపు మహిళ అటువంటి అవమానకరమైన వృత్తిని ఎంచుకోడాన్ని ప్రజలు హర్షించలేకపోయారు. అయితే దుర్గా ఖోటే తన నిర్ణయానికి కట్టుబడి మరిన్ని చిత్రాలలో నటించడం కొనసాగించారు. ఆ విధంగా ఆమె మార్గదర్శకురాలయ్యారు, తరువాతి కాలంలో ఆమెను ప్రేరణగా తీసుకుని చాలా మంది గౌరవప్రదమైన కుటుంబాల మహిళలు సినీరంగంలోకి ప్రవేశించారు.

దిగ్గజ దర్శకుడు వి శాంతారామ్ తన ద్విభాషా చిత్రం (ముఖ్యంగా వారి మొదటి టాకీ) ‘అయోధ్య కా రాజా’ (1932)లో తారామతి పాత్రను దుర్గా ఖోటేను ఎంచుకున్నారు. దుర్గా ఖోటే అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం విజయవంతమై, ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలలో సైరంధ్రి (1933), అమర్ జ్యోతి (1936), మహాత్మా విదుర్ (1943), వీర్ కునాల్ (1945) వంటి విశిష్టమైన చిత్రాలలో పాటు అనేక ఇతర చిత్రాలలో నటనతో పాటు ఆమె తన బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. చారిత్రిక సినిమాలు, పౌరాణికాలు, సాంఘిక చిత్రాలలో ఒకే ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ గొప్పగా నటించారు. దుర్గా ఖోటే పాత్రలు ఆమె వ్యక్తిత్వాన్ని, మహిళా సాధికారత యొక్క ఉన్నతమైన ఆదర్శాన్ని ప్రతిబింబించడం ఆసక్తికరం. ఆమె పోషించిన స్త్రీ పాత్రలు గట్టి డోర్‌మ్యాట్‌లు కాదు –  ఆ పాత్రలు తమ స్వంత నిబంధనల ప్రకారం ప్రపంచాన్ని ఎదుర్కొన్నారు, అన్ని రకాల సవాళ్లను ఆమోదించారు. ఉదాహరణకు, ‘అమర్ జ్యోతి’ సినిమాలో, ఆమె ఒక రాజ్యాన్ని కూలదోయాలని కుట్ర చేసిన మహిళా సముద్రపు దొంగగా నటించారు. ‘భారత్ మిలాప్’ (1942) చిత్రంలో, ఆమె తన సవతి కొడుకు నుండి సింహాసనాన్ని చాకచక్యంగా చేజిక్కించుకున్న కైకేయి అనే నీచమైన స్త్రీ పాత్రలో నటించారు. అయితే ఎలా చూసినా, బ్లాక్‌బస్టర్/క్లాసిక్ ‘మొఘల్-ఎ-ఆజం’ సినిమాలో జోధాబాయి పాత్రలో ఆమె అత్యంత అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అక్బర్ చక్రవర్తి భార్యగా, సలీం (జహంగీర్) తల్లిగా సందర్భోచితంగా నటించారు. ఆమె సహజసిద్ధమైన హుందాతనాన్ని, స్థాయిని ప్రదర్శించి – శక్తివంతమైన అక్బర్‌గా నటించిన గొప్ప నటుడు పృథ్వీరాజ్ కపూర్‌కి పోటీగా తన పాత్రలో జీవించారు. అందులోనూ ఆమె సత్తా ఉన్న మహిళగా, మేధస్సు కలిగిన స్త్రీగా నటించారు. నిజానికి ఆమె ఆ పాత్రలో తన భర్త పట్ల కర్తవ్యం, తన కొడుకు పట్ల ప్రేమ మధ్య నలిగిపోతారు. తన రాజ్యాన్ని సర్వనాశనం చేయడం ఇష్టంలేని దయగల రాణిగా సలీంను వేడుకుంటారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగా, దర్శకుడు కె. ఆసిఫ్ తారాగణాన్ని మారుస్తూ వచ్చారు, అయితే మొదటి నుండి చివరి వరకు దుర్గా ఖోటేను మాత్రమే ఉంచారు! దీన్ని బట్టే ఆమెను ఆసిఫ్ ఎంతో గౌరవించారో మనకు తెలుస్తుంది.

ఆమె ఘనతలలో మరొకటి ముఖ్యమైనది. నటీనటులు ఒక స్టూడియోతో ప్రత్యేకమైన ఒప్పందాన్ని కలిగి ఉండి, ఆ సంస్థ నిర్మించే చిత్రాలలోనే నటించేలా ఉన్న ‘స్టూడియో సిస్టమ్’ సంకెళ్లను తెంచివేయడం. ఆ విధంగా ఆమె ఫ్రీలాన్సర్‌ అయ్యారు. ప్రముఖ దర్శకుడు విజయ్ భట్ నేతృత్వంలోని ప్రకాష్ పిక్చర్స్‌తో పాటు, న్యూ థియేటర్స్, కలకత్తాకి చెందిన ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కో వంటి నిర్మాణ సంస్థకు పని చేయడం మొదలుపెట్టారు.

రంగస్థలం

సినిమాలకి పనిచేస్తున్నా, దుర్గా ఖోటే నాటక రంగాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (IPTA)లో సభ్యురాలు, అక్కడ ఆమె బాల్‌రాజ్ సాహ్ని, పృథ్వీరాజ్ కపూర్, కె. అబ్బాస్, తదితర దిగ్గజాలతో కలిసి పనిచేశారు. షేక్స్‌పియర్ రచించిన మాక్‌బెత్ నాటకపు మరాఠీ అనుసరణ అయిన ‘రాజ్‌మకుట్’ లో లేడీ మాక్‌బెత్ పాత్రలో ఆమె ప్రశంసనీయమైన నటనను ప్రదర్శించారు.

ఆమె మానస పుత్రిక వంటి ‘దుర్గా ఖోటే ప్రొడక్షన్స్’ సంస్థ – మన దేశంలో ఒక మహిళ నేతృత్వంలో స్థాపితమైన మొట్టమొదటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ.

ఆమె ధైర్యం, పట్టుదల మరియు సంకల్పం – శోభనా సమర్థ్ (నటి తనూజ తల్లి) వంటి ఇతర ఔత్సాహిక మహిళలను నటన వృత్తిగా సినిమాల వైపు మళ్లేలా ప్రోత్సహించాయి. దుర్గా ఖోటే తెలివైన వ్యాపారవేత్త అని మనలో ఎంతమందికి తెలుసు? ఆమెకి 40 ఏళ్ళ వయసులో, ఆమె స్థాపించిన ‘దుర్గా ఖోటే ప్రొడక్షన్స్’ మన దేశంలో ఒక మహిళ నేతృత్వం వహించిన మొట్టమొదటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ప్రముఖ దూరదర్శన్ ధారావాహిక ‘వాగ్లే కీ దునియా’ను నిర్మించింది.

తరువాతి సంవత్సరాలు

దుర్గా ఖోటే – సుదీర్ఘ కెరీర్ ఎటువంటి కుంభకోణాలు లేదా వివాదాలు, మచ్చలు లేనిది. ‘మొఘల్-ఎ-ఆజం’ తర్వాత ఆమె మర్చంట్ ఐవరీ యొక్క తొలి చిత్రం ‘ది హౌస్‌హోల్డర్’ (1963)లో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కుటుంబ కథాచిత్రాలలో నటించి, విభిన్న పాత్రలు పోషించారు. బాబీ (1973) లో నాయిక నానమ్మగా, అభిమాన్ (1973)లో సుబీర్ యొక్క అత్త, బిదాయి (1974)లో మృదు హృదయం కలిగిన తల్లిగా, అనేక ఇతర పాత్రలు పోషించారు. తన కెరీర్ దాదాపు చివరి దశలో దుర్గ ఖోటే ‘కర్జ్’ (1980)లో మొదట హీరో రాజ్‌కిరణ్ తల్లిగా, తరువాత అతని పునర్జన్మ పాత్ర అయిన రిషి కపూర్ తల్లిగా నటించారు.

పురస్కారాలు, ప్రశంసలు

అదృష్టవశాత్తూ దుర్గా ఖోటే జీవించి ఉండగానే ఆమె నైపుణ్యాలు, ప్రతిభలకి గుర్తింపు లభించింది. తగిన ప్రశంసలు దక్కాయి. 1958లో చలనచిత్రాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 1942, 1943 సంవత్సరాలకు ఆమె ‘చరణోం కి దాసి’, ‘భారత్ మిలాప్’ చిత్రాలలో నటనకు గాను ఉత్తమ నటిగా బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) వారి అవార్డును గెలుచుకున్నారు. 1975లో ‘బిదాయి’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆమెకు 1968లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 1984లో ఆమెకు జీవితకాలపు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ లభించింది.

భౌతికంగా దూరమైనా, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా

22 సెప్టెంబర్ 1991 ఆహ్లాదకరమైన శరదృతువు రోజున ముంబైలో మృతి చెందారు దుర్గా ఖోటే. కొద్ది రోజులలో 87వ పుట్టినరోజు జరుపుకుంటారనగా, ఆమె వినోద, ప్రదర్శన కళల ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకున్నారు! దుర్గ భర్త సోదరుడైన నందు ఖోటే పిల్లలైన శుభ ఖోటే, విజు ఖోటే నటనలో ఆమె వారసత్వాన్ని కొనసాగించారు.

ఆమె గౌరవార్థం భారత తపాలా శాఖ 3 మే 2013న ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది.

Exit mobile version