Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 211

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

రచయిత, దర్శకుడు ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల

ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ శాస్త్రి. జంధ్యాల, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా 14 జనవరి 1951 నాడు విజయవాడలో జన్మించారు. తండ్రిగారి పేరు జంధ్యాల నారాయణ మూర్తి. జంధ్యాల తాతగారు శివన్న శాస్త్రి గారు  గొప్ప కవి.

జంధ్యాల విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.కామ్ చదివారు. ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ జంధ్యాలకు బాల్య స్నేహితులు. వీరిద్దరు నాల్గవ తరగతి నుంచి డిగ్రీ వరకూ కలిసి చదువుకున్నారు. ఇరుగు పొరుగు ఇళ్ళలో ఉండేవారు.

బాల్యం నుంచే నటన అంటే ఆసక్తి ఉన్న జంధ్యాల, విన్నకోట రామన్న పంతులు నాటక బృందంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు, తరువాత కాలేజీ రోజుల్లోనూ నటనను కొనసాగించారు. 1969లో, అంతర్ విశ్వవిద్యాలయాల నాటక పోటీలో ‘తస్మత్ జాగ్రత్త’లో నటనకు గాను ఉత్తమ నటుడి బహుమతిని గెలుచుకున్నారు.

ఆయన 12వ ఏట రాసిన తొలి కథ ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. “కన్యాశుల్కం, కీర్తిశేషులు నన్ను నాటకాలు రాయడానికి ప్రేరేపించాయి. వాటిని పాఠ్యపుస్తకాల వలె చాలా సార్లు చదివాను” అని జంధ్యాల ఒకసారి చెప్పారు. ఆయన రాసిన మొదటి నాటకం ‘జీవన జ్యోతి’. ఆ తర్వాత ఆయన రాసిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’, ‘గుండెలు మార్చబడును’, ‘ఓ చీకటి రాత్రి’, ‘మండోదరి మహిళా మండలి’ మొదలైన నాటకాలు ప్రాచుర్యం పొందాయి. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ ఆయనకి ప్రశంసలు తెచ్చిపెట్టడమే కాకుండా అనేక భాషలలోకి అనువదించబడింది. ఆయన సాంఘిక నాటకం ‘సంధ్యారాగంలో శంఖారావం’ పలువురి ప్రశంసలు పొందింది, ఆయన సినీ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. వీటన్నింటికీ ముందే జంధ్యాల విజయవాడలో రేడియోల వ్యాపారం చేశారు. తన వ్యాపారం కోసం ఆయన అద్భుతమైన రేడియో నాటకాలు 20 దాకా రాశారు. అవన్నీ ఆమోదించబడి, ఆయనకి పేరు తెచ్చిపెట్టాయి. తన నాటకాలను ప్రదర్శించడానికి ఇతరులను అనుమతించేందుకు దాదాపు అందరూ వారి అనుమతిని కోరేవారు.

1974లో ‘సంధ్యారాగంలో శంఖారావం’ అనే నాటకాన్ని ప్రదర్శించేందుకు జంధ్యాల మద్రాసు వచ్చారు. ఈ నాటకాన్ని వీక్షించిన ప్రముఖ చిత్రనిర్మాత బిఎన్ రెడ్డికి జంధ్యాల ప్రతిభ ఎంతగానో నచ్చింది. బీనాదేవి నవల ‘ఓ పుణ్య భూమి కళ్ళు తెరు’ ఆధారంగా నిర్మించబోయే ఒక చిత్రానికి పని చేయడానికి జంధ్యాల సంతకం చేశారు. బిఎన్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

తర్వాత ఎ. ఆనంద మోహన్‌ గారి ‘పెళ్లి కాని పెళ్లి’ సినిమాకి, వి.హనుమాన్‌ ప్రసాద్‌ గారి ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి జంధ్యాల సంతకం చేశారు. అయితే మొదట విడుదలైన చిత్రం ‘దేవుడు చేసిన బొమ్మలు’ (1976). ‘పెళ్లి కాని పెళ్లి’ తర్వాత 1977లో విడుదలైంది. కె. విశ్వనాథ్ గారి ‘సిరి సిరి మువ్వ’ (1976) పెద్ద హిట్ అవడంతో రచయితగా జంధ్యాల ప్రజాదరణ పొందారు. ‘అడవి రాముడు’ (1977), ‘వేటగాడు’ (1979) వంటి కమర్షియల్ సినిమాలతో పాటు ‘సీతామాలక్ష్మి’ (1976), ‘శంకరాభరణం’ (1980), ‘సప్తపది’, ‘సీతాకోక చిలుక’ (1981) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు కూడా రాస్తూ బహుముఖ రచయితగా స్థిరపడ్డారు. 1976-1981 మధ్య కాలంలో అస్సలు తీరిక లేకుండా ఉన్న రచయిత జంధ్యాల. ఆ ఐదేళ్లలో దాదాపు 200 చిత్రాలకు కథ అందించారు. కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, డైలాగ్ రైటర్‌గా వివిధ పాత్రల్లో పనిచేశారు. ఆ కాలంలో ఏ సమయంలోనైనా నాలుగైదు సినిమాలకు పని చేసేవారు.

ఇరవై ఐదు సంవత్సరాల సినీ జీవితంలో, జంధ్యాల మూడుసార్లు రాష్ట్ర నంది అవార్డులు, ఒకసారి సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ ఎనిమిదేళ్లపాటు జంధ్యాల దగ్గర 22 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి తర్వాత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

జంధ్యాల 1981లో ‘ముద్ద మందారం’ సినిమాతో దర్శకుడిగా మారారు. తన సొంత చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే ఇతర దర్శకుల చిత్రాలకు రాయడం కొనసాగించారు. జంధ్యాల తన చివరి ఇంటర్వ్యూలలో పేర్కొన్నట్లుగా, 1981-2001 మధ్యలో 150 చిత్రాలకు పైగా వ్రాశారు, 42 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ముద్ద మందారం’ తర్వాత, 1982లో రొమాంటిక్ డ్రామా ‘నాలుగు స్తంభాలాట’కు దర్శకత్వం వహించారు. 1983లో తెలుగు కన్నడ ద్విభాషా నృత్య చిత్రం ‘ఆనంద భైరవి’కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ విభాగంలో నంది అవార్డులు లభించాయి.

ఆ తర్వాత 1983లో ‘రెండు జెళ్ళ సీత’, 1984లో ‘శ్రీవారికి ప్రేమలేఖ’, 1986లో ‘రెండు రెళ్లు ఆరు’, 1986లో ‘చంటబ్బాయి’, 1987లో ‘పడమటి సంధ్యారాగం’, 1988లో ‘వివాహ భోజనంబు’, ‘చూపులు కలసిన శుభవేళ’ సినిమాలకు దర్శకత్వం వహించారు. జాతీయ సమైక్యతపై ‘నెలవంక’ (1983) అనే చిత్రానికి, ‘అమరజీవి’ (1983), ‘సీతారామ కళ్యాణం’ (1986) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన చివరి చిత్రం గజల్ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘విచిత్రం’ (1998).

50 సంవత్సరాల వయస్సులో తీవ్రమైన గుండెపోటు కారణంగా, జంధ్యాల 19 జూన్ 2001న మరణించారు. చిత్ర పరిశ్రమలో పాతికేళ్ళు పూర్తి చేసుకున్నారు.

జంధ్యాలకు బూతు హాస్యం నచ్చదు. ఆయన సాధారణమైన, సహజమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇచ్చారు. మాటలు వాస్తవిక సంభాషణలుగా ఉండాలని, దానితో ప్రేక్షకులు పాత్రలతో తమను తాము చూసుకోగలరని ఆయన నమ్మారు. వారి హాస్య శైలి గురించి, ది హిందూ పత్రికలో ఇలా రాశారు: “ఆయన సంభాషణలలోనూ, దర్శకత్వంలోనూ వైవిధ్యం ఉండేది. జంధ్యాల సినిమాల్లో – వివిధ రకాల నవాబులు, సాధారణ తెలుగు కుటుంబాలలోని మధ్య తరగతి మనుషులు, పల్లెటూరి దోపిడీ దొంగలు, దయనీయమైన దురదృష్టవంతులు, రహస్య కాలుష్య కారకులు, పన్నులు ఎగవేతదారులు, చక్కదిద్దే న్యాయవాదులు, విచిత్రమైన వైద్యులు, జిడ్డు అకౌంటెంట్లు, చాలా తేలికగా బయటపడిన ప్రతివాదులు, ఎక్కువగా మాట్లాడే ప్రముఖులు అధికంగా కనిపిస్తారు.”

రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నరేష్, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, శ్రీలక్ష్మి వంటి నటీనటులు జంధ్యాల చిత్రాల ద్వారా హాస్య నటులుగా స్థిరపడ్డారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో జంధ్యాల విగ్రహం

జంధ్యాల ‘హాస్య బ్రహ్మ’గా ప్రసిద్ధి చెందారు. ది హిందూ దిన పత్రిక ఆయనను ‘టాలీవుడ్‌ హాస్య రారాజు’ అని సంబోధించింది. “జంధ్యాలకు ముందు సినిమాల్లో కామెడీ చాలా తక్కువగా ఉండేది, కమెడియన్లు హీరోకి లేదా విలన్‌ పక్కన సహాయక పాత్రల్లా ఉండేవారు. హాస్యాన్నే పూర్తి స్థాయి సబ్జెక్టుగా సినిమాలు తీసి విజయం సాధించవచ్చని తెలుగు చిత్ర పరిశ్రమకు జంధ్యాల నిరూపించారు. ఈ ప్రయత్నంలో గొప్ప విజయాన్ని సాధించారు. ఆయన సినిమాలు ఎలాంటి అసభ్యకరమైన భాష లేదా ద్వంద్వార్థాలు లేకుండా కుటుంబ ప్రేక్షకులకు నచ్చే క్లీన్ ఎంటర్‌టైనర్లుగా పేరు పొందాయి” అని పేర్కొంది.

Exit mobile version