Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 224

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

రంగస్థల, సినీ దిగ్గజం పృథ్వీరాజ్ కపూర్:

జీవితంలో ఆయన ఏం చేసినా అత్యుత్తమంగా చేసేవారు – ఎవరూ సృజించలేని నాటకాలను సృష్టించారు; వెండితెరపై ప్రామాణికాలుగా నిలిచే గొప్ప పాత్రలను పోషించారు, సోహ్రాబ్ మోడీ తీసిన సికందర్, కె. ఆసిఫ్ తీసిన మొగల్-ఎ-ఆజామ్ సినిమాల్లోని పాత్రలు ఇందుకు చక్కని ఉదాహరణలు.

నాటక, సినీరంగాలకు పృథ్వీరాజ్ కపూర్ అందించించ సేవలు అయనకి ఓ దిగ్గజ హోదాని కల్పించాయి. ఆర్.కె. ఫిల్మ్స్, పృథ్వీ థియేటర్స్ వంటి రెండు సంస్థలు ఆయన ఆలోచనల్లోంచి జనించినవే. అంతే కాదు, తన వారసులు, వారి వారసులు పరిశ్రమలో ప్రవేశించి నిలదొక్కుకోవడంతో – హిందీ చలనచిత్ర రంగంలో కుటుంబ వారసత్వానికి ఆద్యుడయ్యారు.

చలనచిత్ర రంగానికి తండ్రి లాంటి వారయిన పృథ్వీరాజ్ కపూర్ 3, నవంబర్ 1906న పెషావర్‌లో సంపన్నమైన, గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించారు. ఆయన తాతగారు దేవాన్ సాహెబ్ కేశోమల్ కపూర్ పంజాబ్‌లోని లియాల్‌పూర్ జిల్లాలోని సముంద్రి పట్టణానికి ‘తహసీల్దార్’. పృథ్వీరాజ్ తండ్రి శ్రీ బశేషర్ నాథ్ కపూర్ ఒక పోలీసు అధికారి, ఆయనది తరచూ బదిలీలు జరిగే ఉద్యోగం, కాబట్టి పృథ్వీరాజ్ బాల్యంలో కొన్నేళ్ళు తాతగారింట ఉన్నారు. మూడేళ్ళ వయస్సులో పృథ్వీరాజ్ తల్లి మరణించగా, తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నారు, పృథ్వీరాజ్‌కు నలుగురు సవతి సోదరులు ఉన్నారు – త్రిలోక్, అమర్, విశి, రామ్. క్రమశిక్షణ కలిగిన తాతగారితో ఉన్న అనుబంధం – ఆయనకు ఎన్నో నేర్పింది – మానవుల సమానత్వం, లౌకికవాదం, పెద్దల పట్ల గౌరవం – వీటిల్లో ముఖ్యమైనవి; జీవితాంతం విలువలు పాటించేలా చేసింది, గొప్ప సంస్కృతిని అలవర్చింది. ఉదాహరణకు, కుటుంబంలోని పిల్లలంతా ఇంటి వృద్ధ సేవకుని పాదాలను తాకడం తప్పనిసరి – దీనివల్ల ఎంత వినమ్రత అలవడిందో!

పృథ్వీరాజ్ ప్రాథమిక విద్యాభ్యాసం సముంద్రిలోని ఆంగ్లో-వెర్నాక్యులర్ డిస్ట్రిక్ట్ బోర్డ్ మిడిల్ స్కూల్‌లో జరిగింది. ఎనిమిదేళ్ల వయసులో పృథ్వీరాజ్ రామాయణం ఆధారంగా రూపొందించిన ఒక నాటకంలో లక్ష్మణుడిగా తొలిసారి వేదికపై కనిపించారు, మరొక నాటకంలో హరిశ్చంద్ర పాత్రను కూడా పోషించారు. తరువాత 9, 10 తరగతులు పూర్తి చేయడానికి లియాల్‌పూర్‌లోని ఖల్సా హైస్కూల్‌లో చేరారు. ఈ పాఠశాలలో – ప్రసిద్ధ దర్శకుడు లేఖ్ టాండన్ తండ్రి గారైన ఎఫ్.సి. టాండన్, పృథ్వీరాజ్ స్నేహితులలో ఒకరు. ఆయనకు నటన లోనే కాకుండా – అథ్లెటిక్స్, కబడ్డీ, రెజ్లింగ్ వంటి పాఠ్యేతర అంశాలలో కూడా ఆసక్తి మెండు.

పృథ్వీరాజ్ మెట్రిక్యులేషన్ పరీక్షలలో ఫస్ట్ క్లాస్‌‌లో పాసయి, ఇస్లామియా కాలేజీలో ఆర్ట్స్‌లో చేరారు, అక్కడ కాలేజ్ అమెచ్యూర్ డ్రమాటిక్స్ క్లబ్ సెక్రటరీగా డ్రమాటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 17 ఏళ్ళ వయసులో, పృథ్వీ – రమను వివాహం చేసుకున్నారు. పృథ్వీ కళాశాలలో ఉన్నప్పుడే వారి పెద్ద కుమారుడు రాజ్ కపూర్ డిసెంబర్ 14, 1924న జన్మించారు! 1927లో బి.ఎ. సెకండ్ క్లాస్‍లో పాసయిన పృథ్వీరాజ్ లాహోర్ లా కళాశాలలో చేరారు. కాని ఆయన హృదయం, ఆత్మ మాత్రం రంగస్థలాన్నే కోరుకున్నాయి. ఫలితంగా న్యాయ విద్యార్థిగా మొదటి సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయారు. కుటుంబం వ్యతిరేకించినప్పటికీ నటనను వృత్తిగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూకీ చిత్రాల యుగంలో – కలకత్తా, బొంబాయిలలో మాత్రమే సినిమా నిర్మాణాలు జరిగేవి. పరిశ్రమలో అడుగిడడానికి పృథ్వీరాజ్ కలకత్తా చేరుకున్నారు, అక్కడ అవకాశాలు లభించక పోవడంతో, నిరాశ చెందిన పృథ్వీరాజ్ బొంబాయికి వచ్చారు.

పృథ్వీరాజ్ సెప్టెంబరు 29, 1929న బొంబాయి చేరుకున్నారు, అక్టోబరు 2న ఇంపీరియల్ స్టూడియోస్‌కు చెందిన ఖాన్ బహదూర్ అర్దేశీర్ ఇరానీని కలుసుకోగలిగారు. ఈ సమావేశం ఫలించింది. ఆ విశిష్ట సంస్థలో పృథ్వీరాజ్ ‘ఎక్స్‌ట్రా’ గా చేరారు. బిపి మిశ్రా దర్శకత్వం వహించిన ‘ఛాలెంజ్’ లేదా ‘దో ధరి తల్వార్’ (చాలా చిత్రాలకు ఆ రోజుల్లో రెండు పేర్లు ఉండేవి) ఆయన మొదటి సినిమా అసైన్‌మెంట్.

పి.వి. అల్తేకర్ దర్శకత్వం వహించిన ‘వెడ్డింగ్ నైట్’ లేదా ‘వాసల్ కీ రాత్‌’లో కూడా పృథ్వీరాజ్ కనిపించారు. అయితే ఎక్కువ కాలం, ‘ఎక్స్‌ట్రా’ పాత్రలు పోషించలేదు. ప్రధాన పాత్రలు దక్కాయి. అలనాటి మూకీలో ప్రసిద్ధికెక్కిన బిపి మిశ్రా గారి ‘సినిమా గర్ల్‌’లో పృథ్వీరాజ్ ప్రధాన పాత్రను పోషించారు, మూకీ సినిమాల్లో పెద్ద స్టార్ అయిన ఎర్మెలైన్ సరసన కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. బిపి మిశ్రా దర్శకత్వంలో సాగర్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ‘చిల్డ్రన్ ఆఫ్ ది స్టార్మ్’ లేదా ‘తూఫాన్’ (1930)తో పృథ్వీరాజ్ ఎర్మెలైన్ – తమ విజయాన్ని పునరావృతం చేశారు.

ధ్వని ద్వారా మోషన్ పిక్చర్ టెక్నాలజీ విప్లవాత్మకంగా మారింది. అర్దేషిర్ ఇరానీ స్వయంగా దర్శకత్వం వహించిన భారతదేశపు మొట్టమొదటి టాకీ ‘ఆలం అరా’లో పృథ్వీరాజ్, ముఖ్యమైన పాత్ర పోషించారు. తరువాత పృథ్వీరాజ్ – షేక్స్‌పియర్ క్లాసిక్‌లతో సహా వివిధ నాటకాలను ప్రదర్శించడానికి బ్రిటిష్ నటుడు గ్రాంట్ ఆండర్సన్ గారి థియేటర్ కంపెనీలో చేరారు. కలకత్తాలో స్థిరపడకముందు ఈ బృందంతో పృథ్వీరాజ్ దేశమంతటా తిరిగి ఆరేళ్లపాటు నాటకాలు వేశారు.

గ్రాంట్ ఆండర్సన్ థియేటర్ గ్రూప్ నష్టాల్లో కూరుకుపోయింది, అయితే ప్రసిద్ధమైన న్యూ థియేటర్స్ స్టూడియోస్ పృథ్వీరాజ్ కపూర్‌ని అనేక చిత్రాలకు ఎంపిక చేసింది – వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి – దుర్గా ఖోటే సరసన నితిన్ బోస్ గారి ‘రాజ్ రాణి మీరా’ (1933), (విదేశాల్లో అవార్డు గెలుచుకున్న మొదటి పౌరాణిక చిత్రం); ఇంక్విలాబ్ (1934); దేబకి బోస్ దర్శకత్వం వహించిన విద్యాపతి (1937); మంజిల్ (1938) (ఇందులో నెగటివ్ రోల్‍లో కనిపించారు); దుష్మన్ (1939) (ఈ సినిమాలో దిగ్గజ నటుడు కె.ఎల్. సైగల్‌తో కలిసి నటించారు).

1939లో చందూలాల్ షా గారి రంజిత్ స్టూడియోస్‌లో చేరడానికి – ప్రఖ్యాత నటుడిగా బొంబాయికి తిరిగి వచ్చారు పృథ్వీరాజ్. ఈ సంస్థలో ఎ.ఆర్. కర్దార్ దర్శకత్వం వహించిన ‘పాగల్’ వంటి అనేక హిట్‌లతో పృథ్వీరాజ్ విలువ పెరిగింది.  మినర్వా మూవీటోన్ బ్యానర్ పై సోహ్రబ్ మోడీ దర్శకత్వం వహించిన ‘సికందర్‌’ సినిమాతో పృథ్వీరాజ్ తన కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. సోహ్రాబ్ మోడీ దృశ్యకావ్యానికి పృథ్వీరాజ్ అందించిన ఆకర్షణ, హుందాతనం, ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఆరు దశాబ్దాలకు పైగా ఏ స్టార్ కూడా సరిపోలలేదు. హిందీ చిత్రసీమలో ‘సికందర్’ చిత్రం ఒక మైలురాయిగా మిగిలిపోయింది. రూపసి అయిన పృథ్వీరాజ్ అచ్చంగా – పుస్తకాలలో వర్ణించినట్లుగానే ప్రసిద్ధ గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ లానే కనిపించారు, తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

1941లో, వి. శాంతారామ్ ‘శకుంతల’ చిత్రానికి రూపకల్పన చేస్తున్నప్పుడు, పృథ్వీరాజ్ ఒక పాత్ర కోసం వారిని సంప్రదించారు. పృథ్వీరాజ్‍ని దుష్యంతుడిగా ఎంపిక చేసేందుకు శాంతారామ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్నాళ్ల తర్వాత పృథ్వీరాజ్ శకుంతల నాటకాన్ని ప్రదర్శిస్తూ శాంతారామ్‌కి ప్రత్యేక ఆహ్వానం పంపారు. దుష్యంతుడిగా నటించిన పృథ్వీరాజ్‌కి ప్రేక్షకుల చప్పట్లు, ప్రశంసలతో నాటకం ముగిసింది. ఇది ఒక కళాకారుడి ఆవేదనను సృజనాత్మక మార్గం ద్వారా మరొకరికి తెలియజేసింది. నాటకం పూర్తయ్యాక తర్వాత పృథ్వీరాజ్‌ని కలిసిన శాంతారామ్‌ భావాల్లో పశ్చాత్తాపం, అపరాధభావం కనిపించాయట! పృథ్వీరాజ్, తర్వాత రాజ్‌కమల్ వారి ‘దహేజ్‌’లో కెరీర్ లోనే అత్యుత్తమ పాత్రల్లో ఒకదాన్ని పోషించారు!!

పృథ్వీరాజ్ తన స్వంత థియేటర్ కంపెనీని స్థాపించాలని నిర్ణయించుకునే వరకు సినిమాలు, నాటకాలు జంట అభిరుచుల్లా ఉన్నాయి. బొంబాయిలో 1944 జనవరి 15న స్థాపితమైన పృథ్వీ థియేటర్స్ – బొంబాయిలో నాటకరంగ పునరుజ్జీవనాన్ని ప్రారంభించింది. దేశ విభజనపై ‘దీవార్’, సెక్యులరిజంపై ‘పఠాన్’, విభజన అనంతర ముస్లిం శరణార్థుల దుస్థితిపై ‘గద్ధార్’, అల్లర్ల సమయంలో అపహరణకు గురైన బాలికపై ‘ఆహుతీ’, నగరానికి చెందిన కళాకారుడు పల్లెటూరి యువతితో పెళ్లి చేసుకునే ఇతివృత్తంతో ‘కళాకర్’, సంపద కల్గించే చెడు ప్రభావాల పై ‘పైసా’, క్రూరమైన వడ్డీ వ్యాపారులను ఎదుర్కొంటున్న రైతుల దుస్థితిపై – ‘కిసాన్’ – వంటి అన్ని నాటకాలు గొప్ప రచనాకౌశలంతో నేర్పుగా రూపొందించబడ్డాయి. చక్కని దర్శకత్వ ప్రతిభకు, అద్భుతమైన నటీనటుల ప్రదర్శన తోడయ్యింది.

రంగస్థలం మీద సృజనాత్మకత శిఖరాలను అధిరోహించడంతో పాటుగా – కె ఆసిఫ్ తీసిన ‘ఫూల్’ (1945), ‘శ్రీ కృష్ణ అర్జున్ యుద్ధ్’ (1946), వి శాంతారామ్ ‘దహేజ్’ (1950), ‘ఆవారా’ (1952) మరియు మొఘల్-ఎ-ఆజామ్ (1960) వంటి చిత్రాలు సంచలనం సృష్టించడంతో పృథ్వీరాజ్ – 40, 50వ దశకాలలో తన చలనచిత్ర జీవితాన్ని స్థిరంగా కొనసాగించారు. వారి పెద్ద కుమారుడు రాజ్ కపూర్ 1947లో కేదార్ శర్మ గారి ‘నీల్ కమల్‌’తో హీరోగా అరంగేట్రం చేసారు. తరువాత కాలంలో ఆర్.కె. స్టూడియోస్ స్థాపించి స్వీయ దర్శకత్వంలో ‘ఆగ్’ (1948) సినిమా తీశారు. పృథ్వీరాజ్ 1951లో నిర్మాణం జరుపుకున్న రాజ్ కపూర్ ‘ఆవారా’లో అద్భుతంగా నటించారు. రెండు సంవత్సరాల తర్వాత, పృథ్వీరాజ్ రెండో కుమారుడు షమ్మీ కపూర్ మహేష్ కౌల్ గారి ‘జీవన్ జ్యోతి’తో సినీరంగంలో ప్రవేశించారు. కె. ఆసిఫ్ అద్భుతమైన ఇతిహాసం ‘మొఘల్-ఎ-ఆజం’ చిత్రంలో కన్పించిన –  ఒక సంవత్సరం తర్వాత పృథ్వీరాజ్ చిన్న కుమారుడు శశి కపూర్ 1961లో నందా సరసన ‘చార్ దివారీ’లో ప్రధాన పాత్రలో కనిపించారు.

పృథ్వీ థియేటర్స్ శిక్షణా సంస్థగా నిలవటంతో, ఈ కుటుంబం హిందీ సినిమా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వంశంగా స్థిరపడింది. ఈ థియేటర్ గ్రూప్ – శంకర్-జైకిషన్, ప్రయాగ్ రాజ్, రణధీర్ కపూర్, రిషి కపూర్, కె.ఎ. అబ్బాస్, జోహ్రా సెహగల్, బల్‌రాజ్ సాహ్ని, మోహన్ సెహగల్ వంటి ప్రముఖులను పరిశ్రమకి అందించింది.

పృథ్వీరాజ్ కపూర్ రాజ్యసభకు నామినేట్ అయి ఎనిమిదేళ్లపాటు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో సన్నిహితంగా ఉండేవారు. నాటక, సినీరంగాలకి ఆయన అందించిన సేవలను నెహ్రూ ఎల్లప్పుడూ ప్రశంసించేవారు. పృథ్వీరాజ్‌కు 1969లో పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. కె.ఎ. అబ్బాస్ తీసిన ‘ఆస్మాన్ మహల్’ (1965)లో పృథ్వీరాజ్ నటనకు చెకోస్లోవేకియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ వారి అవార్డు లభించింది.

పృథ్వీరాజ్‌ గారి హావభావ ప్రదర్శన అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయడంలో సహాయపడింది. జెమిని వారి ‘తీన్ బహురానియాఁ’ (1968), మనవడు రణధీర్ కపూర్ సినిమా ‘కల్ ఆజ్ ఔర్ కల్’ (1971)లో పృథ్వీరాజ్ పోషించిన హాస్య పాత్రలు బాగా గుర్తుండిపోతాయి.

‘పాపాజీ’ అని ఆప్యాయంగా పిలవబడే పృథ్వీరాజ్ 27 మే 1972న కన్నుమూశారు. ప్రతిభ, కీర్తి వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు. వారి మనవలు రణధీర్, రిషి 70, 80వ దశకాలలో బాక్సాఫీస్‌ను శాసించారు, వారి మనవరాలు సంజన (శశి కపూర్ కుమార్తె) పృథ్వీ థియేటర్స్‌ను నిర్వహించింది. వారి ముని మనుమలు ఆర్.కె. బావుటాను ఎగురవేసారు – కరిష్మా 90ల నాటి ప్రముఖ నటీమణులలో ఒకరు. కరీనా, రణబీర్ కపూర్ కొత్త మిలీనియం పాపులారిటీ చార్ట్‌లలో ప్రముఖ స్థానాలలో ఉన్నారు. కపూర్‍లు షోబిజ్‌లో 75 సంవత్సరాలకు పైగా వెండితెరపై ప్రభావం చూపుతున్నారు.

Exit mobile version