Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 236

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

గురుదత్ – బహుముఖీన ప్రతిభ – విషాద జీవితం:

దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, నృత్యదర్శకుడిగా, రచయితగా హిందీ చలనచిత్ర రంగంపై తనదైన ముద్ర వేసిన గురుదత్ పూర్తి పేరు గురుదత్ శివశంకర్ పదుకొణె. ఆయన 1925లో మంగళూరులో – కాశ్మీర్‌తో అనుబంధం ఉన్న సంప్రదాయ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కూడా సృజనాత్మకత ఉన్నవారే.

యాసర్ ఉస్మాన్ రచించిన ‘గురుదత్, అన్‍ఫినిష్డ్ స్టోరీ’ అనే జీవిత చరిత్రలో గురుదత్ సోదరి, ప్రముఖ కళాకారిణి లలితా లాజ్మీ – తమ తండ్రిగారు చాలా సృజనాత్మక వ్యక్తి అనీ,  సాహిత్యవేత్త అనీ వెల్లడించారు. గురుదత్ 1947లో ‘కష్మాకష్’ కథను రాశారు. దాన్నే 1957లో ‘ప్యాసా’ సినిమాగా తీసారు. గురు మెట్రిక్యులేషన్ రాసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వారి అమ్మగారు కూడా మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఆవిడ ‘మిథున్’ అనే ఒక బెంగాలీ నవలను కన్నడంలోకి అనువదించారు. ఆర్థిక అస్థిరత, కుటుంబ సమస్యల కారణంగా గురుదత్ తన చదువును నిలిపివేసి, టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరారు. తరువాత హిందుస్థాన్ లివర్ కంపెనీలో చేరారు.

అతని తల్లి తరఫు బంధువైన సినిమా ప్రచారకర్త బి.బి. బెనెగల్ గురుదత్‍ను దత్తత తీసుకున్నారు. గురుదత్‌ని సినిమాల్లోకి ప్రవేశపెట్టింది ఆయనే. గురు తన పదహారేళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పాసయిన తర్వాత ఉదయ్ శంకర్ గారి ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో చేరారు, అక్కడ నృత్యం, ఇతర ప్రదర్శన కళలలో శిక్షణ పొందారు.

గురుదత్ మేనమామ ఆయనని పూనాకు తీసుకెళ్ళి ప్రభాత్ స్టూడియో భాగస్వామి బాబూరావు పటేల్‌ గారికి పరిచయం చేశారు, అక్కడ గురు నృత్య దర్శకుడిగా చేరారు. ఇక్కడ ఉండగా, 1945లో గురు ‘Lakshrani’ అనే చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారు. ప్రభాత్ స్టూడియోస్ తర్వాత, గురుదత్ – ఎ. బెనర్జీ వద్ద, జ్ఞాన్ ముఖర్జీ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అమియా చక్రబర్తికి చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. గురుదత్ సృజనాత్మక మేధ, తోటి మానవుల పట్ల స్పష్టమైన సానుభూతి – ఆయనని అప్పటి ప్రధాన స్రవంతి హిందీ సినిమా నుండి వేరు చేసింది.

గురుదత్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ, ఆయన జీవితకాలంలో ఆయన ఉదాసీనతనే ఎదుర్కున్నారనే చెప్పాలి. ఇతర హిందీ చిత్రనిర్మాతలతో పోల్చినప్పుడు గురుదత్ మేధ విశదమవుతుంది. జీవితాన్ని ఆలోచింపజేస్తూ సినిమాలు తీయడానికి ధైర్యం చేసిన కొద్దిమందిలో గురుదత్ ఒకరు. సహజసిద్ధమైన మానవీయ విలువలతో కూడిన సినిమాలను నిర్మించారు, దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలు – ప్యాసా, కాగాజ్ కే ఫూల్, సాహిబ్, బివి ఔర్ గులామ్, చౌదవీ కా చంద్ – హృదయాలకు హత్తుకుంటాయి. జీవితం, వాస్తవికత, ఉనికి, తాత్త్వికత; ఇంకా కళకీ జీవితానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఎన్నో విషయాలు నేర్పుతాయి.

గురుదత్ సోదరి వెల్లడించిన సమాచారం ప్రకారం – ప్యాసా కథ వారి తండ్రిదే, కొంత గురుదత్‍ది కూడా. భారతీయ పెట్టుబడీదారీ వ్యవస్థ, తన నీచ స్వభావాన్ని చాటిన చిత్రం ప్యాసా. సాహిర్ గీతాలు, ఎస్. డి. బర్మన్ సంగీతం ఆ సినిమాని అజరామరం చేశాయి. ‘హర్ ఏక్ జిస్మ్ ఘయాల్, హర్ ఏక్ రూహ్ ప్యాసి, నిగాహోం మే ఉల్ఫత్, దిలోం మే ఉదాసి, యే దునియా హై యా ఆలం ఈ బాద్ హవాసి, యే దునియా అగర్ మిల్ బి జాయే తో క్యా హై’ అనే పాట ఇప్పటికీ ప్రేక్షకులని/శ్రోతలని కట్టిపడేస్తుంది. ప్యాసా’ విజయ్ అనే కవి విషాద జీవితపు కథ. ఈ సినిమాలో గురుదత్ మనుషుల్లోని స్వార్థాన్ని, వ్యక్తి లోని కళని డబ్బుతో తూచే స్వభావాన్ని కళ్ళకు కడతారు. నిజానికి ఈ సినిమాని గురుదత్ – దిలీప్‍కుమార్‍తో తీయాలని అనుకున్నారట. కానీ కుదరకపోవడంతో ప్రధాన పాత్రలో తానే నటించారు.

గురుదత్ తన సినిమాల్లోని మహిళల పట్ల అసాధారణమైన శ్రద్ధతో వ్యవహరిస్తారు. ప్యాసా లోని గులాబో, కాగజ్ కే ఫూల్‌ లోని శాంతి, సాహిబ్‌ లోని జబా, బీవీ ఔర్ గులామ్ ఇందుకు గొప్ప ఉదాహరణలు.

భారతదేశంలో మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రం ‘కాగజ్ కే ఫూల్’ నిర్మించి, దర్శకత్వం వహించినప్పుడు గురుదత్ వయస్సు 34 సంవత్సరాలు. చలనచిత్ర చరిత్రకారుడు, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత నస్రీన్ మున్నీ కబీర్ తన పుస్తకం ‘గురు దత్, ఎ లైఫ్ ఇన్ సినిమా’లో పేర్కొన్నట్లుగా, గురుతో సన్నిహితంగా ఉన్న, వారితో కలిసి పనిచేసిన చాలా మంది వ్యక్తులు – అది తన కోసం తాను తీసిన చిత్రం, కల్పిత స్వీయచరిత్ర చిత్రం అని చెప్పారు. “గురూ, ఈ సినిమా చేయవద్దు, ఇది మీ జీవితం కదా” అని ఎస్. డి. బర్మన్ సలహా ఇస్తే, “నేను నా పని చేస్తాను, మీరు మీ సంగీతంపై దృష్టి పెట్టండి” అని బదులిచ్చారట గురుదత్. ఈ సినిమా తరువాత వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి పని చేయలేదు. విడుదలైనప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్‌ అయింది, అయితే చాలా ఏళ్ళ తరువాత ఓ కల్ట్ క్లాసిక్‌గా మారింది.

కాగజ్ కే ఫూల్, ప్యాసా, సాహిబ్, బీవీ ఔర్ గులామ్ వంటి సినిమాలు – కోరికలు తీవ్రంగా; బాధలు ఎక్కువగా ఉండే ప్రపంచాన్ని వర్ణిస్తాయి. వ్యవస్థ, సమాజం విచ్ఛిన్నమయ్యాయనీ, ఆత్మను దురాశ అనే అంటువ్యాధి నుండి రక్షించడానికి ఏకైక మార్గం పారిపోవడమో లేక స్వీయ నాశనం చేసుకోవడమోనని గురుదత్‌ భావించారు. తన సినిమాల ద్వారా ప్రపంచంలోని నకిలీ విలువలను ఖండించి, సమాజపు చంచలమైన మనస్తత్వాన్ని ఎత్తి చూపారు.

వహీదాని గుర్తించి, ప్రోత్సహించిన గురుదత్ – ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహిబ్, బీవీ ఔర్ గులామ్ వంటి గొప్ప చిత్రాలలో నటింపజేశారు. కాగజ్ కే ఫూల్‌లో శాంతి, సురేశ్ సిన్హాల మధ్య ఉన్న సంబంధం – వహీదా రెహ్మాన్, ఆమె తండ్రికి మధ్య ఉన్న నిజ జీవిత సంక్లిష్ట సంబంధాన్ని ప్రతిబింబించింది. అయితే సాహిబ్, బీవీ ఔర్ గులామ్ సినిమా తర్వాత – గురుదత్, వహీదాల మధ్య సంబంధం చెడింది.  ఆ సినిమా తరువాత గురుదత్ తన సినిమాల్లో వహీదాని తీసుకోలేదు.

ఆ సినిమా పరాజయం పాలైన కొన్ని రోజుల్లో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న తన అందమైన బంగ్లాను కూల్చివేశారు. కారణం అడిగితే, ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని, అందువల్ల తమ సంబంధం దెబ్బతింటుందని తన భార్య గీత నమ్ముతున్నందున, దాన్ని కూలగొట్టించానని చెప్పారు. ఆ తర్వాత అద్దె ఇంటికి మారారు. కూల్చివేత తర్వాత, కుటుంబంతో సమయం గడపడానికి, భార్యతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కుటుంబంతో కలిసి కాశ్మీర్‌ను సందర్శించారు.

గురుదత్‍కు బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అవి తన మానసిక స్థితిపై ప్రభావం చూపాయని ఆయన సోదరి ఓ ఇంటర్య్వూలో తెలిపారు. గీతా రాయ్‍ని వివాహం చేసుకునే విషయంలోనూ – ఆయన ఎంతో అపనమ్మకంగా ఉండేవారని లాజ్మీ తెలిపారు. గీతని వివాహం చేసుకున్నాక – వహీదాతో సన్నిహితంగా ఉంటున్నారని వచ్చిన వార్తలు గీతాదత్‍ను కలవరపరిచాయి. వహీదా సోదరుడు – తన సోదరిని పెళ్ళి చేసుకునేందుకు గురుదత్ మతం మారుతున్నారంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఆ సమయంలోనే గురుదత్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. మూడు రోజుల తరువాత స్పృహలోకి వచ్చిన ఆయన, ముందుగా భార్య గీత కోసం వెతుక్కున్నారని గురుదత్ మిత్రుడు అబ్రార్ అల్వీ తెలిపారు గీతకి ఇష్టం లేదని తాను తీయదలచిన ‘గౌరి’ అనే సినిమాని ఆపేశారు. వారి వ్యక్తిగత జీవితం ఎంతో సంక్షుభితం!

కొత్త తరం చిత్రనిర్మాతలు, రచయితలపై గురుదత్ ప్రభావం చాలా ఉంది. గురు బంధువు, ప్రముఖ దర్శకనిర్మాత శ్యామ్ బెనెగల్ – ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గురుదత్‌ని చూసే తాను సినిమా వైపు మొగ్గు చూపానని తెలిపారు. తాను గురుదత్‌ని కలవడానికి బొంబాయికి వచ్చానని, అయితే ఆ అవకాశం రాకముందే ఆయన మరణించడం వల్ల కుదరలేదని ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయిత, గీత రచయిత జావేద్ అఖ్తర్ తన పుస్తకం ‘Talking Films and Songs, In conversation with Javed Akhtar’ లో రాశారు. తన పుస్తకం ‘జియా జలే: ది స్టోరీస్ ఆఫ్ సాంగ్, ఇన్ కాన్వర్సేషన్ విత్ గుల్జార్’లో, ప్రముఖ కవి, రచయిత, దర్శకుడు, గీత రచయిత గుల్జార్ మరియు నస్రీన్ మున్నీ కబీర్‌లు “గురుదత్ పనిలో, అతని సినిమాల్లో సంభాషణకు ప్రాధాన్యత లేదు. విజువల్స్ ముఖ్యం. నేను అతనిని కలవనందుకు చాలా విచారిస్తున్నాను” అని అన్నారు.

గురుదత్ స్నేహితుడు, సన్నిహితుడు అబ్రార్ అల్వీ ఇలా వ్రాశారు, “గురుదత్ ఎప్పుడూ తన పనిలో మునిగిపోతారు. ఒకసారి బరోడా మహారాజా కొంతమంది బ్రిటీష్ మహిళలతో తన స్టూడియోని సందర్శించినప్పుడు, అతను వారితో కొన్ని నిమిషాలు మర్యాదపూర్వకంగా మాట్లాడి తిరిగి చిత్రీకరణకు వెళిపోయాడు” అని చెప్పారు. గురుదత్ అనేక చిత్రాలలో ఆయనకి సహాయం చేసిన సోదరుడు ఆత్మా రామ్ ఒక ఇంటర్వ్యూలో “గురుదత్ సామాజిక జీవితాన్ని గడపలేదు” అని చెప్పారు. తమ తల్లి ‘ముద్ర, 1979’ లో ప్రచురించిన తన జ్ఞాపకాలలో గురు నిశ్శబ్ద జీవితాన్ని ఇష్టపడుతున్నాడని వ్రాసారు. సుదూర ప్రాంతాలలో, లానోవ్లాలో, రెండు గదుల ఫ్లాట్‌ను నిర్మించి, వ్యవసాయం చేసేవారు. వారాంతాల్లో అక్కడ ఉండేవారు, ఆయన సోదరి లలితా లాజ్మీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ప్యాసా, కాగజ్ కే ఫూల్‌లో చిత్రీకరించినట్లుగా అతనికి అశాంతి కలిగింది. అతను చాలా అంతర్ముఖుడు. నాకు ఫోన్ చేసి, నేను నీకు ఏదో చెప్పాలి అని అన్నాడు కానీ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు” అని చెప్పారు.

ఎస్.డి. బర్మన్ ఓ ఇంటర్వ్యూలో గురుదత్ గురించి ఇలా చెప్పారు, “అతను చాలా కష్టపడి పనిచేసేవాడు, రాత్రిపూట బాగా తాగేవాడు, అయినా మర్నాడు సెట్‍కి అందరికంటే ముందే వచ్చేవాడు”. గురుదత్ చాలా నిజాయితీపరుడు, ఓ సిన్సియర్ ఫిల్మ్ మేకర్. ఒకసారి తన అసిస్టెంట్ వి. భడేకర్‌ని తొలగించారు, ఎందుకంటే భడేకర్ తనని సెట్స్‌లో అందరూ సర్ అని పిలవాలని పట్టుబట్టారు. ఒకరి మరొకరిపై ఆధారపడే సంబంధాలు పనికిరావని చెప్పి గురుదత్ ఆయన్ని తొలగించారు.

నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుని 39 ఏళ్ల వయసులోనే చనిపోయారు గురుదత్. అంతకు ముందు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఫిల్మ్ మేకింగ్‌లో కెరీర్‌లో తక్కువ కాలమే ఉన్నప్పటికీ, ఆయన తన ముద్రని వేశారు, హిందీ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ మరియు దిగ్గజ దర్శకనిర్మాతగా పరిగణించబడ్డారు.

అబ్రార్ అల్వీ 1964 అక్టోబర్ 30న ఫిల్మ్‌ఫేర్‌లో ‘హ్యామ్లెట్ ఆఫ్ ఫిల్మ్స్’ పేరుతో నివాళులర్పిస్తూ, “గురు తన జీవితమంతా ఆలోచనాపరుడుగానే ఉన్నారు, అతను నిద్రలో కూడా ఆలోచిస్తూనే ఉండేవాడు. అతను స్వచ్ఛమైనవాడు, నిజాయితీపరుడు. కల్ట్ క్లాసిక్ మూవీస్ చేయడానికి దారితీసిన మానసిక వేదన, ఇంకా భావోద్వేగ అలసటతో తన రాబోయే చిత్రం ‘బహరీన్ ఫిర్ ఆయేంగే’ లోని డైలాగ్స్ గురించి చర్చించారు” అని చెప్పారు.

అక్టోబర్ 23, 1964 న ‘స్క్రీన్’లో ప్రచురించబడిన ‘ఒక కళాకారుడికి నివాళి’లో – అతని సన్నిహితుడు, ప్రముఖ నటుడు దేవ్ ఆనంద్  – గురు విజువల్స్ మరియు రిథమ్‌ల గురించి చాలా ఆసక్తిగా ఉండే సినిమా విద్యార్థి” అని రాశారు.

‘Romancing with Life, An Autobiography’ అనే తన స్వీయచరిత్రలో దేవ్ ఆనంద్ ఇలా రాశారు: “చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం గురు నన్ను తన అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించాడు, కలిసి సినిమా చేద్దామని అన్నాడు. మేము చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. అప్పటికే అతని శరీరం పాలిపోయింది, అక్కడక్కడ వాపులు. గొంతు బలహీనమైంది, జుట్టు రాలిపోయింది. చిత్ర పరిశ్రమలో నాకు ఉన్న గొప్ప స్నేహితుడు అతను”.

మరణానికి ఒకరోజు ముందు గురుదత్ – రాజ్ కపూర్‌కీ, OP నయ్యర్‌కి ఫోన్ చేశారట, కాని ఇద్దరూ బిజీగా ఉండి మాట్లాడలేకపోయారు.

తన సినిమాలు ఆపేసి, ఇతరుల సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు గురుదత్. దిగ్గర దర్శకుడు కె. ఆసిఫ్ చిత్రం ‘లవ్ అండ్ గాడ్’లో నటిస్తున్నారు. కానీ సినిమా పూర్తి కాకముందే కె. ఆసిఫ్ కూడా చనిపోయారు. ఇక ఆ సినిమా వెలుగు చూడలేదు.

ఆయన మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత, అతని భార్య గీతాదత్ కూడా నాడీ బలహీనత కారణంగా కన్నుమూశారు. అంతకుముందు, ఆమె తన పిల్లలను కూడా గుర్తించలేని మానసిక స్థితికి చేరుకున్నారు. వారి కుమారుడు తరుణ్ దత్ కూడా 1989లో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉర్దూ కవి, గేయ రచయిత కైఫీ అజ్మీ గురుదత్‌కి నివాళులర్పిస్తూ “రెహ్నే కో సదా దేహర్ మే ఆతా నహీ కోయి, తుమ్ జైసే బి గయే ఐసే బి జాతా నహీ కోయి (ఎవరూ శాశ్వతంగా ఉండడానికి రారు, కానీ మీరు వెళ్ళిపోయినట్లు ఎవరూ నిష్క్రమించరు) అని రాశారు.

Exit mobile version