Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 243

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

విలక్షణ నటుడు, విస్మృత దర్శకుడు ఐ.ఎస్. జోహార్:

ఐ.ఎస్. జోహార్‌గా ప్రసిద్ధికెక్కిన ఇందర్ సింగ్ జోహార్ (16 ఫిబ్రవరి 1920 – 10 మార్చ్ 1984) నటుడు, రచయిత, నిర్మాత, దర్శకులు. బహుముఖ ప్రజ్ఞాశాలి. 1950ల నుండి 1980ల తొలినాళ్ళ వరకు అనేక హిందీ చిత్రాలలో నటించారు. హ్యారీ బ్లాక్ (1958), నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ (1959), లారెన్స్ ఆఫ్ అరేబియా (1962), డెత్ ఆన్ ది నైల్ (1978) వంటి అంతర్జాతీయ చిత్రాలలో అతిథి పాత్రలు పోషించారు. అమెరికా టీవీ సిరీస్ ‘మాయ’ (1967)లో నటించారు. పృథ్వీరాజ్ కపూర్‌తో కలిసి ‘చద్దియన్ ది డోలీ’ (1966), ‘నానక్ నామ్ జహాజ్ హై’ (1969); హెలెన్‌తో ‘యమ్లా జాట్‌’ అనే పంజాబీ చిత్రాలలో కూడా నటించారు.

దేశ విభజన ఆధారంగా రూపొందిన ఉత్తమ హిందీ చిత్రాలలో ఒకటైన ‘నాస్తిక్’ (1954) కు కథ రాసి, నటించి, దర్శకత్వం వహించారు ఐ.ఎస్. జోహార్.

అనేక చిత్రాలను కథలు రచించారు, పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన వాటిలో ‘జోహార్-మెహమూద్ ఇన్ గోవా’, ‘జోహార్ ఇన్ హాంగ్‌కాంగ్’ అనే సినిమాల్లో హాస్యనటుడు మెహమూద్‌తో కలిసి నటించారు. ఇవి బాబ్ హోప్-బింగ్ క్రాస్బీ స్టైల్ రోడ్ టు.. సిరీస్‌లోని హాస్య చిత్రాల నుండి ప్రేరణ పొందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, జోహార్ ఒక ప్రత్యేకమైన మరియు విలక్షణమైన వ్యక్తి అని తెలుస్తుంది. ఆయన జీవితాంతం ఉదారవాదిగా (కాకపోతే స్వేచ్ఛాజీవి. ఐదు వివాహాలు చేసుకున్నారు, భారతీయ ప్రమాణాల ప్రకారం ఇదో అసాధారణ సంఖ్య, అప్పుడైనా, ఇప్పుడైనా) ఉన్నారు.

డెత్ ఆన్ ది నైల్ (1978) సినిమాలోని తోటి నటీనటులతో జోహార్

జోహార్ సరదా మనిషి. ఏదెలా ఉన్నా ఆయనెప్పుడూ జీవితాన్ని ఓ వేడుకగానే గడిపారు. క్రమానుగత, సంప్రదాయవాద భారతీయ జీవనశైలికి ఆయన ఈ వైఖరి నప్పలేదు. అత్యంత వ్యక్తిగతమైన, చమత్కారమైన వారి స్క్రీన్‌ప్లేలకు సరైన ఆర్థిక తోడ్పాటు లభించకపోవడం వల్ల జీవితమంతా బి-గ్రేడ్ సినిమాలను రూపొందించడానికే పరిమితమయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన, నటించిన అనేక చిత్రాలలో, సోనియా సాహ్ని కథానాయికగా చేశారు, ‘జోహార్-మెహమూద్ ఇన్ గోవా’ (1964) సినిమాలో ఆమెది ముఖ్యమైన పాత్ర.

ఆయన తన ఇంటిపేరు -సినిమా టైటిల్స్‌లో ఉన్న – ‘మేరా నామ్ జోహార్’, ‘జోహార్ ఇన్ కాశ్మీర్‌’, ‘జోహార్ ఇన్ బాంబే’ వంటి చిత్రాలలో నటించారు. కొందరు దీన్ని అహంభావంగా పరిగణించగా, మరికొందరు దీనిని ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా భావించారు. ఆయన సినిమా చూస్తే హాయిగా నవ్వుకోవచ్చని, భారతీయ ఆచారాలపైన, అంధవిశ్వాసాలపైన, వ్యవస్థలపైన ఆయన వేసే వ్యంగ్య చురకలని ఆస్వాదించవచ్చని సామాన్య ప్రేక్షకులు అనుకునేవారు.

ఆయన దర్శకత్వంలో 1978లో వచ్చిన ‘నస్బందీ’ (వాసెక్టమీ) అనే సినిమా – ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి అమలు చేయించిన విఫల, నిర్బంధ జనాభా నియంత్రణ విధానంపై ఒక చెణుకు. తొలిసారి విడుదలైనప్పుడు ఈ సినిమాని నిషేధించారు.

యష్ చోప్రా ఐ.ఎస్. జోహార్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించడం విశేషం.

1963లో ఆయన మారియో కామెరిని దర్శకత్వం వహించిన – ‘కలి యుగ్, లా డియా డెల్లా వెండెట్టా’ (కలి యుగ్, గాడెస్ ఆఫ్ వెంజెన్స్); ‘ఇల్ మిస్టెరో డెల్ టెంపియో ఇండియానో’ (ది సీక్రెట్ ఆఫ్ ది హిందూ టెంపుల్) అనే రెండు ఇటాలియన్ సినిమాలలో ‘గోపాల్’ పేరు గల పాత్రలో నటించారు.

Exit mobile version