Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 252

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

అలనాటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఫాతిమా బేగం:

ఫాతిమా బేగం (1892–1983) భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత, స్క్రీన్ రైటర్. భారతదేశపు తొలి సినీ దర్శకురాలామె. సినీరంగంలో ప్రవేశించిన నాలుగు సంవత్సరాలలోనే, ఆమె అనేక చిత్రాలకు రచన, నిర్మాణం చేశారు, దర్శకత్వం వహించారు. ఆమె తన స్వంత నిర్మాణ సంస్థ, ఫాతిమా ఫిల్మ్స్‌ను ప్రారంభించారు, అది తరువాత విక్టోరియా-ఫాతిమా ఫిల్మ్స్‌గా మారింది. 1926లో ఆమె మొదటి చిత్రం ‘బుల్బుల్-ఎ-పరిస్తాన్‌’కు దర్శకత్వం వహించారు.

ఫాతిమా బేగం భారతదేశంలో ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబంలో జన్మించారు. వారిది ఉర్దూ నాటకరంగ నేపథ్యం గల కుటుంబం. ఆమె కుటుంబంలో అందరూ ఉర్దూ మాట్లాడేవారు. ఆమె నాటకరంగంలో శిక్షణ పొందారు, ఎక్కువగా ఉర్దూ, హిందీ నాటకాలలో నటించారు.

ఆమె ఉర్దూ నాటక రంగం ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత సినిమాలకు మారారు. అర్దేశిర్ ఇరానీ గారి మూకీ చిత్రం ‘వీర్ అభిమన్యు’ (1922) ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో నాటకాలు, చలనచిత్రాలలో స్త్రీ పాత్రలను పురుషులు పోషించడం సర్వసాధారణం. దాంతో ఆమె కొద్ది రోజుల్లోనే మహిళా సూపర్‌స్టార్‌గా మారారు. ఫాతిమా బేగం తెల్లని రంగులో ఉండేవారు, తెరమీద సెపియా/బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు సరిపోయే ముదురు రంగు మేకప్ వేసుకునేవారు. చాలా పాత్రలకు హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా విగ్గులు అవసరమయ్యేవి.

1926లో, ఆమె ఫాతిమా ఫిల్మ్స్‌ను స్థాపించారు, అది తర్వాత 1928లో విక్టోరియా-ఫాతిమా ఫిల్మ్స్‌గా పేరుగాంచింది. ఆమె ఫాంటసీ సినిమాకి మార్గదర్శకురాలు. ఆ రోజుల్లోనే ఆమె స్పెషల్ ఎఫెక్ట్‌ల కోసం ట్రిక్ ఫోటోగ్రఫీని ఉపయోగించారు. ఆమె కోహినూర్ స్టూడియోస్, ఇంపీరియల్ స్టూడియోస్‌లో నటిస్తూనే, ఫాతిమా ఫిల్మ్స్‌లో తన స్వంత చిత్రాలకు కథలు వ్రాసి, దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తూ నటించారు.

బేగం తన 1926 చిత్రం ‘బుల్బుల్-ఎ-పరిస్తాన్‌’తో భారతీయ సినిమాకి మొదటి దర్శకురాలయ్యారు. ఈ సినిమా ప్రింట్‌లు ప్రస్తుతం అలభ్యం. పలు స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న హై బడ్జెట్ ఫాంటసీ మూవీగా వర్ణించబడింది. ఇది నిజమైతే, ఈ చిత్రం, జార్జ్ మెలీస్ వంటి ఫాంటసీ సినిమా ప్రారంభ మార్గదర్శకుల సరసన ఫాతిమా బేగంను నిలుపుతుంది. ఆమె అనేక ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించారు, ఆమె చివరిగా 1929లో ‘గాడెస్ ఆఫ్ లక్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. స్వంతంగా సినిమాలు నిర్మించడం, నటించడం కొనసాగిస్తూనే, ఫాతిమా 1938లో కోహినూర్ స్టూడియోస్, ఇంపీరియల్ స్టూడియోస్ కోసం ‘దునియా క్యా హై?’ అనే చిత్రానికి పనిచేశారు.

ఆమె 1940లో తన చివరి చిత్రం ‘డైమండ్ క్వీన్‌’లో ఫైమా పాత్రలో కనిపించారు.

ఆమె సచిన్ స్టేట్‌కి చెందిన నవాబ్ సిది ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ IIIని వివాహం చేసుకున్నారని అంటారు. అయితే, నవాబ్ మరియు ఫాతిమా మధ్య వివాహం లేదా ఒప్పందం జరిగినట్లు ఎటువంటి రికార్డులు లేవు. అంతేకాదు, ముస్లిం ఫామిలీ లా ప్రకారం చట్టపరమైన పితృత్వానికి ఆవశ్యకత అయినా కూడా, నవాబ్ ఆమె పిల్లలలో ఎవరినీ తన సొంత బిడ్డలుగా గుర్తించినట్లు లేదు. ఆమె మూకీ సూపర్‌స్టార్లు జుబేదా, సుల్తానా షాజాదీలకు తల్లి. ఆమె హుమాయున్ ధనరాజ్‌గిర్, దుర్రేషహవర్ ధనరాజ్‌గిర్‌, జమీలా రజాక్ లకు అమ్మమ్మ. హుమాయున్, దుర్రేషహవర్ – జుబేదా, మహారాజా నర్సింగిర్ ధనరాజ్‌గీర్‌ల కొడుకూ కూతుర్లు. సుల్తానా, సేఠ్ రజాక్‍ల కుమార్తె జమీలా రజాక్. సేఠ్ కరాచీకి చెందిన సుప్రసిద్ధ వ్యాపారవేత్త. మోడల్ నుండి నటిగా మారిన రియా పిళ్లైకి – ఫాతిమా ముత్తవ్వ అవుతారు. ఫాతిమా మనవరాలు దుర్రేషహవర్ ధనరాజ్‌గిర్ కుమార్తె రియా.

ఫాతిమా 1983లో 91 ఏళ్ల వయసులో మరణించారు.

Exit mobile version