సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గానం, నేపథ్యం:
1960 మధ్య కాలం నాటికి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గొప్ప శాస్త్రీయ సంగీత కళాకారిణిగా పేరు పొందారు. ప్రసిద్ధ Edinburgh festival డైరెక్టర్ అయిన లార్డ్ హేర్‌వుడ్ 1962లో, ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రంలో రేడియోలో ఎం.ఎస్. గానాన్ని విన్నారు. ఆమె గళంలోని మాధుర్యానికి ముగ్ధుడై ఆయన, సంగీత కచేరీని ప్రత్యక్షంగా ఆస్వాదించడానికి మద్రాసు వెళ్లారు. మరుసటి సంవత్సరం జరిగే Edinburgh festival లో కచేరి చేయమని ఎం.ఎస్. సుబ్బులక్ష్మిని ఆహ్వానించారు. అదే ఉత్సవానికి ఎం.ఎస్. తో పాటుగా, దిగ్గజ భరతనాట్య కళాకారిణి బాలసరస్వతిని కూడా ఆహ్వానించారాయన. 1963లో ఈ ఇద్దరి కార్యక్రమాలు వీక్షకుల మన్ననలు పొందాయి, సంబంధిత వార్తలు లండన్ పత్రికలలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి.
అప్పట్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్న యు. థాంట్, ఇంకా, చెఫ్ డి కాబినెట్ సి. వి. నరసింహన్ గార్లు – 1965 సంవత్సరాన్ని పండిట్ జవహర్‍లాల్ నెహ్రూకి అంకితం చేస్తూ, అంతర్జాతీయ సహకార సంవత్సరంగా పాటిస్తున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో కచేరీ చేయమని ఎం.ఎస్. సుబ్బులక్ష్మిని ఆహ్వానించారు. అయితే, ఆ సంవత్సరం భారత-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం మొదలవటంతో, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి – ఐక్యరాజ్యసమితికి వెళ్ళలేకపోయారు. మరుసటి సంవత్సరం యు. థాంట్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి మళ్ళీ ఆహ్వానం పంపారు, ఈసారి అక్టోబర్ 23న ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని జనరల్ అసెంబ్లీ హాల్‌లో ప్రతినిధుల సమక్షంలో కచేరీ చేయమని ఆమెను అభ్యర్థించారు. సుబ్బులక్ష్మి, ఆమె భర్త సదాశివం ఈ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించారు.
ఇటువంటి కచేరీలను నిర్వహించడంలో సదాశివం గారిది అందె వేసిన చేయి. అన్నీ సజావుగా సాగేలా ఆయన చూశారు. మొత్తం కచేరీ ప్రణాళిక రూపొందించటం, నిమిష నిమిషం ఏం జరగాలన్నది తయారు చేసుకోవటం, శాస్త్రీయ సంగీతంతో పాటు తేలికపాటి భజనల వంటి లలిత సంగీతం కూడా కార్యక్రమంలో ఉండేట్టు చూడటం.. మొదలైనవన్నీ దగ్గరుండి పర్యవేక్షించారాయన. సుబ్బులక్ష్మికీ, కుమార్తెలు రాధ, విజయలకు కాంచీపురంలోని ముత్తుచెట్టి తమ మగ్గాల నుండి ప్రత్యేకంగా చీరలు నేయించి పంపారు. పాటలను, ఫోటో సెషన్లను పలు మార్లు రిహార్సల్స్ చేశారు.
పరమ ధార్మికులైన ఈ కుటుంబ సభ్యులు ఇద్దరు మహాత్ములను సంప్రదించనిదే ఏ పని చేసేవారు కాదు. ఒకరు కంచి కామకోటి పీఠం యొక్క 68వ జగద్గురువులు, కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894-1994), మరొకరు ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తికి చెందిన సత్యసాయి బాబా (1926 -2011). వారు వెంటనే కాంచీపురం వెళ్ళి, పరమాచార్యను సందర్శించి, ఆయన ఆశీస్సులు పొందారు. పరమాచార్య సంస్కృతంలో గొప్ప పండితులు, బహుభాషావేత్త. వారు ఒక ప్రార్థనా గీతాన్ని సూచించారు. దాన్ని వారు సార్వత్రిక స్నేహ గీతంగా పేర్కొన్నారు. అది:
మైత్రీం భజత అఖిలహృజ్జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత।
యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత
త్యజత పరేషు అక్రమమాక్రమణమ్॥
జననీ పృథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకలదయాలుః।
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానామ్॥
దీని అర్థం:
“అందరి హృదయాలను జయించేలా స్నేహాన్ని పెంపొందించుకోండి
ఇతరులను మీలాగే చూసుకోండి
యుద్ధాన్ని త్యజించండి, పోటీని వదులుకోండి
ఇతరులపై తప్పుడు దూకుడును వదిలివేయండి
మన కోరికలన్నీ తీర్చడానికి మాతృభూమి సిద్ధంగా ఉంది
ప్రభువు, మన తండ్రి, అందరిపై దయగలవాడు
ప్రపంచ ప్రజలారా! సంయమనంతో, ఉదారంగా మరియు కరుణతో ఉండండి,
అందరూ సుఖ సంతోషాలతో ఉండుగాక!”
‘దామ్యత, దత్త, దయధ్వం’ అనే పదాలు బృహదారణ్యక ఉపనిషత్తు నుండి తీసుకోబడ్డాయి.
పరమాచార్య ఆశీస్సులు స్వీకరించిన అనంతరం, సదాశివం ప్రముఖ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ (1912 -1975) గారిని సంప్రదించారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కోసం రాగమాలిక రూపొందించారు వసంత్ దేశాయ్. ఇందుకోసం వసంత్ దేశాయ్‍కి 501 రూపాయల చెక్ అందించారు సదాశివం. అయితే ఎం.ఎస్. కుటుంబంతో కలిగిన ఈ అనుభవానికి ఎంతో సంతోషించిన వసంత్ దేశాయ్, ఆ చెక్‌ని బ్యాంకులో ప్రెజెంట్ చేయలేదు. దాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం భద్రంగా దాచుకున్నారు.
అక్టోబర్ 23, 1966న ఐక్యరాజ్యసమితిలో సుబ్బులక్ష్మి తొలిసారిగా కచేరీ చేశారు. అంతే కాకుండా, తన జీవితాంతం, దాదాపు తదుపరి అన్ని కచేరీలలో ఈ గీతం పాడటం ఒక నియమంగా మార్చుకున్నారు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.
~
ఈ గీతాన్ని ఎం.ఎస్. స్వరంలో యూట్యూబ్‍లో వినవచ్చు/చూడవచ్చు:
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.