సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణికి నివాళి:
ఈ వ్యాసంలో – ఇటీవల స్వర్గస్థులైన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (24 డిసెంబర్ 1924 – 16 ఫిబ్రవరి 2025) గారి సినిమాల గురించి, వారితో నా వ్యక్తిగత పరిచయం గురించి వివరిస్తాను.
~
కృష్ణవేణి గొప్ప నటి, తెలివైన నిర్మాత. శోభనాచల స్టూడియో సహ యజమాని. భర్త మీర్జాపురం జమీందారుతో కల్సి పలు సినిమాలు నిర్మించారు.
మీర్జాపురం రాజావారు (జమీందారు) [11 నవంబర్ 1896 – 4 మే 1974] కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. ఆయన అసలు పేరు మేకా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్.
ఆయన చెన్నైలోని ఆళ్వార్‌పేటలో జయ ఫిల్మ్స్ అనే సినీ స్టూడియోను స్థాపించారు.
నిర్మాతగా ఆయన తొలి చిత్రం ‘జరాసంధ’. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య, ఎం.వి. రాజమ్మ నటించారు.
నటి సి కృష్ణవేణి ఆయన రెండవ భార్య, నిర్మాత అనురాధ దేవి ఆయన కుమార్తె.
తరువాత జయ ఫిల్మ్స్ శోభనాచల పిక్చర్స్‌గా మారింది. ఈ కొత్త బ్యానర్ పై ‘భక్త ప్రహ్లాద’ మొదటి చిత్రం.
తెలుగులో టాకీ సినిమాలు ప్రారంభమైన మొదటి రెండు దశాబ్దాలలో 1949 విశిష్టమైన సంవత్సరం. ఆ ఏడాది విడుదలైన ఏడు చిత్రాలలో, ఐదు ఘన విజయాలు సాధించాయి.
అక్కినేని నటించిన ‘కీలు గుర్రం’ చిత్రంతో రాజావారు దర్శకుడిగా మారారు. ఆయన అంజలీదేవి (గొల్లభామ), చదలవాడ నారాయణరావు (జీవన జ్యోతి), ఎన్.టి.రామారావు (మన దేశం), ఘంటసాల (లక్ష్మమ్మ), కమలా కోట్నిస్, రమేష్ నాయుడు (దాంపత్యం), త్రిపురనేని గోపీచంద్ (లక్ష్మమ్మ), జూనియర్ శ్రీరంజని (భీష్మ), పి. లీల (మన దేశం), జిక్కీ వంటి మహామహులను సినీరంగానికి పరిచయం చేశారు.
ఆయన దర్శకత్వం వహించిన ‘కీలు గుర్రం’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.40 లక్షలు వసూలు చేసి రికార్డులు సృష్టించింది, ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. జమీందారు (రాజావారు) ఎంతో సంతోషించి తన చిన్న కూతురు అనురాధ దేవికి ఎంతో విలువ చేసే భారీ వెండి కీలు గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
జానపద కథల వాణిజ్య విజయంతో ఆకర్షితులైన రాజావారు తన రచయితలను ఇలాంటి ఇతివృత్తంతో కథని తయారుచేయమని కోరారు. తాపీ ధర్మారావు గారు, కాశీ మజిలీ కథల నుండి ప్రేరణ పొంది, ప్రముఖ కథకుడు సదాశివబ్రహ్మం (అయితే క్రెడిట్స్‌లో వారి పేరు లేదు) సహాయంతో ఆ చిత్రానికి సంభాషణలు, పాటలు రాశారు. గతంలో రాజావారు నిర్మించిన అన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణమూర్తి, ‘కీలు గుర్రం’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించి, ఘోస్ట్ డైరక్టర్‌గా వ్యవహరించారు.
ఈ చిత్రం 19 ఫిబ్రవరి 1949న విడుదలైంది. ‘కీలు గుర్రం’ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. విజయవాడలోని మారుతి టాకీస్‌లో 148 రోజులు, 10 ఇతర కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడింది. తమిళంలోకి డబ్ చేయబడిన మొదటి తెలుగు చిత్రం కూడా ఇదే. బాలరాజు (1948) తర్వాత, ‘కీలు గుర్రం’ సినిమా నాగేశ్వరరావును చాలా డిమాండ్ ఉన్న హీరోగా నిలబెట్టింది.
కృష్ణవేణి ‘కీలు గుర్రం’ సినిమాలో పాటలు పాడారు [కృష్ణవేణి తన కోసం పాడితేనే ఆ చిత్రంలో నెగటివ్ రోల్‌లో నటిస్తానని అంజలీదేవి షరతు విధించారట.]
కింది లింక్‌లో ‘మోహన మహా’ పాటను చూడండి. కృష్ణవేణి చాలా మధురంగా ఆలపించారు.
https://www.youtube.com/watch?v=akfnvSzvotc
***
నిర్మాతగా కృష్ణవేణి – విడుదల కాని సినిమాలు – కొన్ని ఫోటోల వెనుక కథ:
కృష్ణవేణి తమ స్వంత బేనరుపై 1953లో లేడీ డాక్టర్ అనే సినిమా మొదలుపెట్టారు. దీనికి హిందీ సినిమా ‘బాజీ’ ఆధారం. హిందీలో కల్పనా కార్తీక్ పోషించిన పాత్రను కృష్ణవేణి, గీతాబాలీ పాత్రను సావిత్రి, దేవ్ ఆనంద్ పాత్రను విజయ్ కుమార్ పోషించాలని నిర్ణయించారు. అయితే డిస్ట్రిబ్యూటర్‌తో వచ్చిన విభేదాల కారణంగా, సినిమాని విడుదల చేయలేదు. ఈ సినిమాలో నటించమని సావిత్రిని అడగాటానికి వెళ్ళినప్పుడు – సావిత్రి ఇంట్లో ఓ గాజు బల్ల, దానికింద రూపాయల నోట్లు అమర్చి కనబడ్డాయట. సావిత్రి గారి పెదనాన్న సినిమాకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడారట.
(ఈ ఫోటోలో కృష్ణవేణి, విజయ కుమార్, రాజారెడ్డి ఉన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా తీసిన ఫోటో)
(ఈ ఫోటోలో కృష్ణవేణి, ఎస్. వి. రంగారావు ఉన్నారు. విడుదల కాని సినిమాలోని స్టిల్)
(ఈ పోటోలో కృష్ణవేణి, విజయ కుమార్ ఉన్నారు. ఆయన కృష్ణవేణికి బంధువు. అందుకే హిందీలో దేవ్ ఆనంద్ పోషించిన పాత్రకి ఎంచుకున్నారు)
***
కృష్ణవేణిగారితో పరిచయం, వెండి జగ్గు వృత్తాంతం:
దూరదర్శన్‌లో ప్రముఖ యాంకర్ అయిన విజయదుర్గ గారు నన్ను కృష్ణవేణి గారి ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు. కృష్ణవేణి గారు, వారి అమ్మాయి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.
మేము వెళ్ళేసరికి మధ్యాహ్న భోజన సమయం కావడంతో, మమ్మల్ని కూడా వారితో పాటు భోంచేయమన్నారు. బల్ల మీద మాకు అందరికీ వెండి కంచాలు, వెండి గ్లాసులు అమర్చారు. నాకు బాగా దాహంగా ఉండడంతో, ఓ గ్లాసులో నీళ్ళు ఒంపుకుని తాగాలనుకున్నాను. పక్కనే ఉన్న వెండి జగ్గును అందుకోవాలనుకున్నాను. కానీ అది చాలా బరువుగా ఉండి, కదలలేదు. అప్పటికే 90 ఏళ్ళు దాటిన కృష్ణవేణి గారు ఆ వెండి జగ్గును ఒక చేత్తో సునాయసంగా ఎత్తి నా గ్లాసులోకి నీళ్ళు పోశారు. నేను విస్తుపోయి చూడగా, నాకేసి చూసి చిరునవ్వు నవ్వారు. బహుశా పాతకాలపు ఆహారపుటలవాట్లు వారికా బలాన్నిచ్చాయేమో!
***
కృష్ణవేణిగారితో వారి సినిమాల గురించి సంభాషణ:
తరువాత మరోసారి వారింటికి వెళ్ళాను. నా వద్ద ఉన్న వారి అరుదైన చిత్రాలను ఆమెకు చూపించాను. మా చర్చ సినిమాల గురించి సాగింది.
‘గొల్లభామ’ (1947) చిత్రంలో ఆమె ప్రధాన నటి. ఆ సినిమాలో వ్యాంప్ పాత్ర పోషించడానికి ఒక నటి అవసరం. రేలంగి గారు ఓ అందమైన మహిళ అందుబాటులో ఉందని, కానీ ఆమె అప్పుడే ప్రసవించి చాలా బలహీనంగా ఉందని చెప్పారు. కృష్ణవేణి ఆమెను తన దగ్గరకు తీసుకురమ్మని, తాను ఆమెని బలం పుంజుకునేలా చేస్తానని చెప్పారు. ఆ మహిళ మరెవరో కాదు, అంజలీదేవి. ఆమె బలాన్ని పెంచడానికి అంజలికి దానిమ్మ రసంతో సహా పండ్ల రసాలు ఇచ్చి హడావిడిగా, షూటింగ్ ప్రారంభించారు. తరువాత అంజలీదేవి తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మూడు సంవత్సరాల తరువాత కృష్ణవేణి ‘లక్ష్మమ్మ’ అనే సినిమాను ప్రారంభించారు. అంజలీదేవి కూడా అదే సబ్జెక్ట్‌తో మరో సినిమా షూటింగ్ ప్రారంభించారు. రెండు సినిమాలు పోటాపోటీగా చిత్రీకరణ జరుపుకున్నాయి. సినిమాల్లో అవకాశమిచ్చిన తనకే అంజలి ఇలా చేసినందుకు కృష్ణవేణి బాధపడ్డారు. ‘లక్ష్మమ్మ’ హిట్ అయిందనీ, అంజలీదేవి ‘లక్ష్మమ్మ కథ’ ఫ్లాప్ అని నేను చెప్పాను. కృష్ణవేణి “దేవుడున్నాడు” అని క్లుప్తంగా జవాబిచ్చారు!
తన తొలి చిత్రం ‘అనసూయ’లో, కృష్ణవేణి, గాయని రావు బాలసరస్వతి బాలనటులుగా నటించారు. షూటింగ్ సమయంలో వారు కలిసి ఆడుకునేవారు. కృష్ణవేణి ఆమెను “బాలా” అని పిలిచేవారు. కాలక్రమేణా వారు విడిపోయారు, ఎవరి జీవితంలో వారు స్థిరపడిపోయారు. ఒకానొక సమయంలో ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకుని, ఒకరినొకరు కలవాలని అనుకున్నారు కానీ, దురదృష్టం! ఆ సమావేశం జరగనేలేదు.
1948లో వచ్చిన ‘మదాలస’ సినిమాలో కృష్ణవేణి ఒక పెద్ద పామును తన చుట్టూ చుట్టుకున్నారు. నేను దాని గురించి ఆమెను అడిగితే, ఆమె నిర్లక్ష్యంగా నవ్వారు! అది పెంపుడు జంతువుగా మారిందని, దానితో ఆడుకున్నాననీ చెప్పారు. నేను విస్తుపోయాను.
ఎన్.టి. రామారావును తమ బ్యానర్ ద్వారా ఎలా పరిచయం చేశారో అందరికీ తెలిసిందే. కాబట్టి మేము దాని గురించి మాట్లాడుకోలేదు.
‘తిరుగుబాటు’ (1950) చిత్రంలో, కృష్ణవేణి వ్యాంప్ పాత్రను పోషించారు. సిహెచ్ నారాయణరావు కాముకతకు లోబడిపోయి, తన భార్య శాంతకుమారిని, ఇద్దరు పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు. అతని భార్య దీనిని తేలికగా తీసుకోదు, తిరుగుబాటు చేస్తుంది. మా అమ్మమ్మ ఈ సినిమా చూసి, ఈ చిత్రంలో కృష్ణవేణి ఎంత అందంగా కనిపించారో వర్ణించి చెప్పింది. చాలా స్టైలిష్‌గా, ఆమె ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించారు. ఆమె నటిగా తక్కువ సినిమాలు చేయడం ఎంతో బాధాకరం.
‘పాతాళభైరవి’లో ఎన్.టి.ఆర్. సరసన హీరోయిన్‍గా – తాము తొలి అవకాశమిచ్చిన ఎన్.టి.ఆర్. పక్కన నటించమని ఆఫర్ వచ్చిందట కదా అని అడిగితే, అవునన్నారు. అయితే ఆవిడ భర్త (రాజావారు) తమ సొంత బ్యానర్‍లో నిర్మించే చిత్రాలలోనే నటించాలని ఆంక్ష విధించారట.
ఈ సందర్భంలోన్, రాజావారి మంచితనం గురించి చెప్పుకొచ్చారు కృష్ణవేణి. అప్పట్లో బి. ఎ. సుబ్బారావు వారి దగ్గర పనిచేసేవారు. బి.ఎ. సుబ్బారావు సినిమా తీయాలని రాజావారి దగ్గరికి వచ్చి సహాయం కోరారు. రాజావారు అందుకు సరేనన్నారు, దాంతో ఆయన 1950లో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, అంజలి నటించిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమా తీశారు.
సూపర్ మార్కెట్ బిల్లులా కనిపించే ఒక పొడవైన కాగితాన్ని ఆమె బయటకు తీసి, దాన్ని చదవమని నాకిచ్చారు. ఆ రాత చదవడానికి వీలుగా లేదు. అదే మాట ఆవిడతో చెప్పాను.
వారు గన్నవరంలో తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు, దాంతో ప్రభుత్వం అక్కడ విమానాశ్రయాన్ని నిర్మించింది. అలాంటి ఆస్తులు చాలా ఉన్నాయి, అవసరమైన పత్రాలు కూడా వారి దగ్గర లేవు. వారి కూతురు అనురాధ దేవి, “వెంగళరావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరివన్నీ ఎందుకు అడగలేదు? ఆయన మీకు సన్నిహితులేగా” అని అంది. ఇద్దరూ దాని గురించి బాధపడలేదు. వారు తమ దృక్పథంలోనూ రాజకుటుంబ సభ్యులే అని నేను గ్రహించాను!
సినిమా రంగానికి కృష్ణవేణి చేసిన సేవలకు గుర్తింపుగా, 2004లో ఆమెను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన కృషికి కృష్ణవేణి గారికి ఫాల్కే అవార్డు రావాలని నేను కోరుకున్నాను.
ఆమె ఫిబ్రవరి 16 2025న మరణించారు. ఆమె జీవితాన్ని సంపూర్ణంగా జీవించారు. ఆమెకు నా ప్రణామాలు, నివాళి!
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.