Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 264

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

దర్శకనిర్మాత హోమీ వాడియా:

హోమీ వాడియా మే 22, 1911న సుప్రసిద్ధ వాడియా కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రముఖ చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్ అయిన జెబిహెచ్ వాడియా తమ్ముడు. యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ సినిమాలకూ, భయంలేని కథానాయికలకు పర్యాయపదంగా మారిన నిర్మాణ సంస్థ వాడియా మూవీటోన్ స్టూడియో స్థాపకుడు.

సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్న హోమి వాడియా కాలేజీ చదువులు మధ్యలో మానేశారు. తరువాత వివేకానంద లేబొరేటరీలో చేరి, అక్కడ రెండు సంవత్సరాల పని చేసి ఫిల్మ్ లేబ్‌లో తనకు అవసరమైనవన్నీ నేర్చుకున్నారు. తరువాత తన సోదరుడు జంషెడ్జీ వాడియా వద్ద సహాయకుడిగా చేరారు. ఇక్కడ ఆయన తన మనస్సును సినీ నిర్మాణం, దర్శకత్వం వైపు మళ్ళించారు.

దర్శకుడిగా ఆయన తొలి చిత్రం వీర్ భారత్ (1924). గుర్రపు స్వారీకి గుర్రాన్ని ఉపయోగించిన మొదటి చిత్రం ఇది; ఆయన స్వయంగా స్వారీ చేశారు. అప్పటికి ఆయన భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన దర్శకుడు, అప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు.

ఆయన సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా కూడా నైపుణ్యాన్ని సంపాదించారు. తన అన్ని సినిమాలను ఆయనే ఎడిట్ చేశారు. ఎడిటర్‌గా ఆయన ఎంత పరిపూర్ణంగా ఉండేవారంటే, ఆయన తన పని పూర్తి చేసిన తర్వాత ఒక్క ఫ్రేమ్‌కు కూడా ఎవరూ అదనంగా, తీసివేతని లేదా మార్పును సూచించలేకపోయేవ్వారు.

వాడియా సోదరులు చిత్ర పంపిణీదారు మాంచెర్షా బి. బిల్లిమోరియా, అతని సోదరులు బుర్జోర్, నాదిర్షా టాటాలతో కలిసి వాడియా మూవీటోన్ స్టూడియోను స్థాపించారు, ఇది యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ సినిమాలకు పర్యాయపదంగా మారింది.

హోమీ వాడియాకు అత్యంత ఎక్కువగా సహకారం లభించినది ఫియర్‌లెస్ నాడియా నుంచి. తొలుత ఆమెను జె.బి.హెచ్. వాడియా గుర్తించారు, ఆమె క్రీడా నైపుణ్యానికి బాగా ఆకర్షితులయ్యారు. ‘దేశ్ దీపక్’ (1933) చిత్రంలో ఆమెను బానిస అమ్మాయిగా, తరువాత ‘లాల్-ఎ-యమన్’ సినిమాలో స్టంట్ ఉమెన్‌గా నటింపజేశారు.

1935లో, హోమీ వాడియా తీసిన ‘హంటర్‌వాలీ’ సినిమాలో నాడియా జీవితాంతం గుర్తుండిపోయే పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆమె, తన తండ్రి రాజ్యంలో జరుగుతున్న అన్యాయాలు, రాజద్రోహంపై – ముసుగు ధరించి రహస్యంగా పోరాడే యువరాణి మాధురి పాత్రను పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది, ఆ దశాబ్దపు అగ్ర చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఆమెకు ‘ఫియర్‌లెస్ నాడియా’ అనే కీర్తిని తెచ్చిపెట్టడంతో పాటు, హోమీ వాడియాను ఒక ప్రముఖ చిత్రనిర్మాతగా కూడా స్థిరపచిరిచింది.

ఆమె హోమీ వాడియా దర్శకత్వం వహించిన ‘మిస్ ఫ్రాంటియర్ మెయిల్’ (1936), ‘పంజాబ్ మెయిల్’ (1939), ‘డైమండ్ క్వీన్’ (1940), ‘బొంబైవాలీ’ (1941), ‘జంగిల్ ప్రిన్సెస్’ (1942), ‘హంటర్‌వాలీ కి బేటీ’ (1945), ‘ఫ్లయింగ్ ప్రిన్స్’ (1946), ‘11 ఓ’క్లాక్’ (1948), ‘ధూమ్‌కేతు’ (1949), ‘జంగిల్ కా జవహర్’ (1953) వంటి అనేక చిత్రాలలో నటించారు. 1967–68లో, ఆమె 50ల చివరలో ఉన్నప్పుడు, ఆమె ఖిలాడి (ది ప్లేయర్) అనే జేమ్స్ బాండ్ స్పూఫ్‌లో కనిపించారు.

వాడియా మూవీటోన్ సంస్థ కోసం హోమీ వాడియా – హింద్ కేసరి (1935), తూఫానీ టార్జాన్ (1937), లుటారూ లల్నా (1938), వనరాజా కర్జన్ (1938), ఏక్తా (1942) అనే సినిమాలకు దర్శకత్వం వహించారు.

వాడియా మూవీటోన్ మూతపడటంతో 1942లో హోమీ వాడియా బసంత్ పిక్చర్స్‌ను స్థాపించారు, ఇది వారి అద్భుతమైన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ బ్యానర్ పై – బచ్‌పన్ (1945), ఫ్లయింగ్ ప్రిన్స్ (1946), అమర్ రాజ్ (1946), బాలం (1949) వంటి ప్రేక్షకులను ఆకర్షించే చిత్రాలను నిర్మించడం కొనసాగించారు. బసంత్ పిక్చర్స్ సంస్థ బొంబాయిలోని చెంబూర్‌లో విస్తారమైన భూమిని కలిగి ఉండేది. ఇందులో అత్యాధునిక యంత్రాలు, రికార్డింగ్ పరికరాలతో అమర్చబడిన సౌండ్ ట్రాక్, మిచెల్ కెమెరా ఉన్నాయి. అక్కడ ఆయన షేర్-ఇ-బాగ్దాద్ అనే అరబ్ కాలం నాటి కాస్ట్యూమ్ డ్రామాను నిర్మించి దర్శకత్వం వహించారు.

ఆయన సినిమాలు వినోదాన్ని అందించడమే కాకుండా, ఓ మాధ్యమంగా చలనచిత్రాల సరిహద్దులను విస్తరించాయి, పురాణాలని, సాహసాలని, ప్రేమను – మరపురాని సినిమా అనుభవాలలో మిళితం చేశాయి. ఆయన పౌరాణిక చిత్రాలలో – ఎస్.ఎన్. త్రిపాఠి, త్రిలోక్ కపూర్‌లతో – శ్రీ రామ్ భక్త హనుమాన్ (1948), మీనా కుమారి, మహిపాల్‌తో – శ్రీ గణేష్ మహిమ (1950), ఎస్.ఎన్. త్రిపాఠితో – హనుమాన్ పాతాళ్ విజయ్ (1951), మహిపాల్, అనితా గుహాతో సంపూర్ణ రామాయణం (1961), సచిన్, హీనా, జయశ్రీ గడ్కర్‌లతో శ్రీ కృష్ణ లీల (1971) ముఖ్యమైనవి.

హోమీ వాడియా – అల్లాదీన్ ఔర్ జాదుయ్ చిరాగ్ (1952), అలీబాబా అండ్ 40 థీవ్స్ (1954), హతీమ్ తాయ్ (1956), జింబో (1958), జబాక్ (1961), చార్ దెర్వేష్ (1964), అలీబాబా అండ్ 40 థీవ్స్ (1966), తూఫాన్ ఔర్ బిజ్లీ (1975), అడ్వెంచర్స్ ఆఫ్ అల్లాదీన్ (1978) వంటి అనేక ఫాంటసీ చిత్రాలను కూడా నిర్మించారు.

తన కెరీర్ మొత్తంలో హోమీ ఎప్పుడూ అభిమానులకు కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు.. ఒక స్టార్ హార్స్, ఒక అడవి కథ, ఒక బేబీ స్టార్, ఒక బంగారు జుట్టు గల హీరోయిన్! ప్ర్రతీదాన్నీ ప్రగతిశీల కోణం నుండి చూసేవారు.

వాడియా సోదరులు మరో ముఖ్యమైన విజయాన్ని సాధించారు. బాధ్యతాయుతమైన, అవగాహన కలిగిన భారతదేశ పౌరులుగా, వారు 1947 కి ముందు భారతదేశంలోని రాజకీయ కార్యకలాపాల గురించి కూడా తెలుసుకున్నారు. వారి వద్ద ముఖ్యమైన చిత్రాలతో పాటు – డాక్యుమెంటరీ న్యూస్‌రీల్స్, ఫీచర్-లెంత్ డాక్యుమెంటరీ ‘ది ఇండియన్ గెజిట్’, హరిపురా కాంగ్రెస్ సమావేశపు డాక్యుమెంటరీ, భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన ఇతర రాజకీయ సంఘటనలు, ప్రజల నిరసనలు, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల ర్యాలీలు, మహాత్మా గాంధీ వంటి నాయకుల ర్యాలీల చిత్రీకరణలు ఉన్నాయి.

తరువాత, వారు తమ ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌లన్నింటినీ ప్రభుత్వానికి, ఇతర మ్యూజియంలకు విరాళంగా ఇచ్చారు. 1947 కి ముందు కాలం నుండి మనం నేడు చూసే ఫోటోలు, రీల్స్ ఏమైనప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం వాడియా సోదరులు చిత్రీకరించినవే. ఈ చారిత్రక పత్రాల చిత్రాలు, రీల్స్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మన ప్రజల పోరాటం గురించి మనకు ఒక అవగాహనను కల్పిస్తాయి. ఇందుకు మొత్తం ఘనత వాడియా సోదరులకే చెందుతుంది.

వాడియా సోదరులు వాడియా మూవీటోన్ వారి వెరైటీ ప్రోగ్రామ్ కింద తొలినాటి క్లాసికల్, సెమీ-క్లాసికల్ సంగీతకారులు, గాయకుల కార్యక్రమాలను కూడా చిత్రీకరించారు. వీరిలో ఫిరోజ్ దస్తూర్, బాల గంధర్వ, మాలికా పుఖ్రాజ్, పండిట్ తీర్థంకర్ వంటి ప్రముఖ కళాకారులు ఉన్నారు.

హోమీ వాడియా దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు, 1954లో స్థాపించబడిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యులు కూడా.

హోమీ వాడియా – నటి, స్టంట్ ఉమన్ ఫియర్‌లెస్ నాడియాను వివాహం చేసుకున్నారు, వీరి భాగస్వామ్యం తెరపైనే కాకుండా వెలుపల కూడా బాగా అభివృద్ధి చెందింది. వీరిద్దరూ కలిసి భారతీయ సినిమాకి – ధైర్యం, కొత్తదనం, సాహస స్ఫూర్తిని అందించారు.

1981లో, యూనియన్ నాయకుడు దత్తా సామంత్‌తో కార్మిక వివాదంలో చిక్కుకోవడంతో, హోమీ వాడియా బసంత్ స్టూడియోలను మూసివేశారు.

హోమి వాడియా 2004లో ముంబైలో 93 సంవత్సరాల వయసులో మరణించారు.

హంటర్‌వాలీ (1935) చిత్రంలోని ఒక దృశ్యాన్ని చూడండి.

https://www.youtube.com/watch?v=MpLLHuojeSs


దర్శకనిర్మాత డబ్యూ. జెడ్. అహ్మద్:

నిర్మాత, దర్శకుడు డబ్యూ. జెడ్. అహ్మద్ పూర్తి పేరు వాహిద్-ఉద్-దిన్ జియా-ఉద్–దిన్-అహ్మద్.

ఆయన డిసెంబర్ 20, 1915 నాడు జన్మించారు. వారి లాహోర్‌లోని ఒక సంపన్న, గౌరవనీయమైన, ప్రభావవంతమైన కుటుంబం. ఆయన సోదరుడు బొంబాయి ప్రభుత్వంలో ఉన్నత అధికారి.

అహ్మద్ కోరుకుంటే తన కుటుంబ వ్యాపారంలో చేరి ఉండవచ్చు లేదా భారత ప్రభుత్వంలో ఉన్నత అధికారి అయి ఉండవచ్చు, కానీ ఆయన సినిమాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన ఉన్నత విద్యావంతులు, 8 భాషలు తెలిసినవారు.

ఆయన ఉన్నత విలువలు కలిగిన చిత్రాలను, గొప్ప చిత్రాలను ఎంచుకున్నారు, డబ్బు మాత్రమే ముఖ్యం కాదని నమ్మారు.

ఆయన 1936లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కుంకుమ్, రాజ్ నర్తకి సినిమాలకు సంభాషణలు రాశారు. తరువాత షాలిమార్ ఫిల్మ్స్ సంస్థను స్థాపించారు. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులయ్యారు. 1942లో ఆయన నటి నీనాను సినిమాల్లోకి ప్రవేశపెట్టారు.

ఏక్ రాత్, ప్రేమ్ సంగీత్, మన్ కీ జీత్, గులామీ, పృథ్వీరాజ్ సంయుక్త వంటి చిత్రాలను నిర్మించారు.

Exit mobile version