Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 265

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటుడు దేబ్ ముఖర్జీ:

ప్రసిద్ధ నటుడు దేబ్ ముఖర్జీ 22 నవంబర్ 1941 నాడు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి శశధర్ ముఖర్జీ దిగ్గజ భారతీయ చిత్రనిర్మాతలలో ఒకరు. శశధర్ 1930లలో బాంబే టాకీస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. తరువాత 1943లో రాయ్ బహదూర్ చునీలాల్, అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీలతో కలిసి ‘ఫిల్మిస్తాన్’ స్టూడియో స్థాపించారు. 1950లలో, ఆయన తన స్వతంత్ర స్టూడియో, ‘ఫిల్మాలయ’ను ప్రారంభించారు, ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

దేబ్ ముఖర్జీ తల్లి సతీదేవి ముఖర్జీ – అశోక్ కుమార్, అనుప్ కుమార్, కిషోర్ కుమార్‌ల సోదరి. దేబ్ తోబుట్టువులు జాయ్ ముఖర్జీ, షోము ముఖర్జీ, రోనో ముఖర్జీ, సుబ్బీర్ ముఖర్జీ, శిబాని మౌలిక్ ముఖర్జీ.

దేబ్ ముఖర్జీ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆయనకు మొదటి వివాహం ద్వారా సునీత అనే కుమార్తె పుట్టింది. సునీత చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్‌ను వివాహం చేసుకున్నారు. దేబ్ – అమృత్ ముఖర్జీని ద్వితీయ వివాహం చేసుకున్నారు, ఈ జంటకి అయాన్ ముఖర్జీ జన్మించారు. అయాన్ – వేక్ అప్ సిద్, యే జవానీ హై దీవానీ, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలకు దర్శకుడిగా ప్రసిద్ధులు.

దేబ్ ముఖర్జీ గారి గురించి కొన్ని వివరాలు:

  1. దేబ్ ముఖర్జీ 1965లో రోనో ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘తు హి మేరీ జిందగీ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో సలోమే, ఛాయాదేవి మరియు గజానన్ జాగిర్దార్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
  2. మిథున్ చక్రవర్తి, కాజల్ కిరణ్, యోగిత బాలి నటించిన 1983 సినిమా ‘కరాటే’కు దేబ్ ముఖర్జీ దర్శకత్వం వహించి నిర్మించారు.
  3. దేబ్ ముఖర్జీ చివరిసారిగా 2009లో షాహిద్ కపూర్ మరియు ప్రియాంక చోప్రా నటించిన ‘కమీనే’ చిత్రంలో కనిపించారు.

దేబ్ ముఖర్జీ 14 మార్చి 2025 నాడు మరణించారు. ఆయనకి నివాళులు అర్పించడానికి అనేక మంది ప్రముఖులు అయాన్ ముఖర్జీ ఇంటికి వచ్చారు. వారిలో కరణ్ జోహార్, అశుతోష్ గోవారికర్, లలిత్ పండిట్, హృతిక్ రోషన్, కాజోల్, అలియా భట్, రణబీర్ కపూర్, జయా బచ్చన్, కిరణ్ రావు ఉన్నారు.

ముంబైలోని జుహులోని పవన్ హన్స్ శ్మశానవాటికలో దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరిగాయి.

దేబ్ ముఖర్జీ సంబంద్, అధికార్, జిందగీ జిందగీ, హైవాన్, మై తులసి తేరే ఆంగన్ కీ, కరాటే, బాతోన్ బాతోన్ మే మరియు జో జీతా వోహి సికందర్ వంటి చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందారు.

~

దేబ్ ముఖర్జీ సినిమా ‘సంబంధ్’ లోని ‘చల్ అకేలా’  అనే పాటని ఈ వీడియో చూడండి. గానం ముకేశ్. గీత రచన ప్రదీప్ కుమార్. సంగీతం ఓపి నయ్యర్.

https://www.youtube.com/watch?v=hctp4EJbZy8


నటి కె.ఎల్‌.వి. వసంత:

1943 సెప్టెంబర్ 5న నటి కె.ఎల్‌.వి. వసంతకు చెందిన వసంత మహల్ గృహప్రవేశం జరిగింది. ఈ మహల్ యొక్క వైభవాన్ని చూసి ఆహ్వానితులు ముగ్ధులయ్యారు, కొందరు దీనిని స్వర్గం అని, మరికొందరు దీనిని ప్యాలెస్ అని పిలిచారు. ఈ మనోహరమైన మహల్‌లో కొత్తదనం, విలాసవంతమైన జీవితం ఉన్నాయి. అలంకరణలు విలాసవంతంగా ఉన్నాయి, గచ్చు పింక్ మార్బుల్, రంగుల మొజాయిక్‌తో రూపొందించారు. దీనికి వెస్టింగ్‌హౌస్ ఫిట్టింగ్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బల్బుల ఎన్‌కేస్ ఫిల్మ్ బాక్స్‌ల మాదిరిగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ రూమ్ చాలా విలాసవంతంగా ఉంది, అక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్‌లతో ఆమె మేకప్ చేసుకోగలరు.

సినిమా కళాకారులు, నిర్మాతలు, పంపిణీదారులు, జర్నలిస్టుల భారీ సమూహం ఈ ఇంట్లో ఆమెకు శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు!

కె.ఎల్‌.వి. వసంత గారి గురించి కొన్ని వివరాలు:

వసంత 1923లో రామనాథపురం జిల్లాలో ఉన్న కుంద్రత్తూర్‌లో జన్మించారు. చిన్నతనంలో ఆమె పాటలు పాడటం, నృత్యం చేయడంలో చురుకుగా పాల్గొన్నారు. నటి ఎస్.డి సుబ్బులక్ష్మి ప్రకారం, వసంత ‘పావలక్కోడి’ (1934) సినిమాలో చిన్న, గుర్తింపు లేని పాత్రలో నటించారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత, ఆమె బి.ఎన్. రావు గారి ‘రాంబాయిన్ కాతల్’ (1939)లో నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి వసంతను ఓ స్టార్‌గా మార్చింది. తరువాత రావు గారి ‘భూలోక రంభ’ (1940) సినిమాలో నటించారు, ఇది కూడా ఒక హిట్.

1941లో జెమిని స్టూడియోస్ ప్రారంభమైనప్పుడు, జెమిని వ్యవస్థాపకుడు ఎస్.ఎస్. వాసన్ ఆర్థిక సహాయంతో నిర్మించిన తొలి నిర్మాణం ‘మదనకామరాజన్‌’లో వసంత ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం విజయంతో వసంత ఖ్యాతి మరింత పెరిగింది. 1943లో వాసన్ ‘చంద్రలేఖ’ సినిమాని ప్లాన్ చేసినప్పుడు, వసంత నాయికగా నటిస్తారని ప్రకటించారు, కానీ చివరికి ఆమె స్థానంలో టి.ఆర్. రాజకుమారి వచ్చారు.

వసంత సేలంకు మకాం మార్చి టి.ఆర్. సుందరం మోడరన్ థియేటర్స్‌లో చేరారు. రాజరాజేశ్వరి (1944), బర్మా రాణి (1945), సులోచన (1947) వంటి సుందరం గారి చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. చివరికి వసంత సుందరం గారిని వివాహం చేసుకున్నారు.

వసంత అప్పటికే ఒక నిష్ణాతులైన నర్తకి, గాయని, కాబట్టి ఆమె తన చాలా చిత్రాలలో నాట్యం చేశారు, పాటలు పాడారు. ‘మదనకామరాజన్‌’లో ఆమె డాన్స్-డ్రామా సన్నివేశం గుర్తించదగినదిగా మారింది. 1946లో, ఆమె రెండు మోడరన్ థియేటర్స్ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు: వహాబ్ కాశ్మీరీ దర్శకత్వం వహించిన ‘చిత్ర’ విజయవంతం కాలేదు, మరో సినిమా ‘సుభద్ర’.

మరికొన్ని చిత్రాలలో నటించిన తర్వాత, ఆమె మద్రాస్‌కు తిరిగి వచ్చి 2008లో మరణించే వరకు అక్కడే నివసించారు.

Exit mobile version