Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 270

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

బహుముఖ ప్రజ్ఞాశాలి జి.ఎం. దుర్రానీ:

గులాం ముస్తఫా దుర్రానీ ఏప్రిల్ 1919లో పెషావర్‌లో జన్మించారు. ఆయన 9 నెలల శిశువుగా ఉన్నప్పుడు తల్లి మరణించగా, అమ్మమ్మ పెంచారు. దుర్రానీ ఇస్లామియా హైస్కూల్లో చేరారు. పాటలు పాడడం ద్వారా బడిలో పేరు తెచ్చుకున్నారు, తరచుగా సైగల్ వంటి గాయకులను అనుకరిస్తూ పాడేవారు. దుర్రానీకి చిన్నప్పటి నుంచీ పాటలు పాడటమన్నా, సంగీతమన్నా ఆసక్తి ఎక్కువ. ఆయన మాతృభాష పస్తో, కానీ ఆయనకి హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలపై కూడా మంచి పట్టు ఉంది, అది తరువాత గాయకుడిగా ఆయనకెంతో సహాయపడింది. పెషావర్‌లో ఉన్నప్పుడు, గురువుగా భావించే ప్రఖ్యాత నటుడు-సంగీతకారుడు రఫీక్ దుర్రానీతో పరిచయం ఏర్పడింది. జి.ఎం. దుర్రానీ కూడా సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నారు. ఇది ఆయనకి ఒక పిచ్చిలా మారింది, దాంతో జేబులో 22 రూపాయలతో ఇల్లు వదిలి లాహోర్‌కు పారిపోయారు.

లాహోర్‌లో, రేడియో ప్రసారకుడు జుల్ఫికర్ అలీ బుఖారీ మార్గదర్శకత్వంలో దుర్రానీ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. త్వరలోనే బొంబాయికి వెళ్లి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఆయన తనను తాను ఒకే శైలికి పరిమితం చేసుకోలేదు; అతని ప్రదర్శనలో విషాద గీతాలు, శృంగార గీతాలు, దేశభక్తి గీతాలు, ఖవ్వాలిలు, గజళ్లు, ఇంకా భజనలు ఉన్నాయి. ముఖ్యంగా, హిందూ భక్తి గీతాలను ఆలపించిన మొట్టమొదటి ముస్లిం గాయకులలో ఆయన ఒకరు. కళాకారుడిగా తన బహుముఖ ప్రజ్ఞని, నిష్కాపట్యతను ప్రదర్శించారు.

దుర్రానీ ప్రతిభని గుర్తించి, చిత్ర నిర్మాత సోహ్రాబ్ మోడీ 1936లో ‘సాయెద్-ఎ-హవాస్’ చిత్రంలో ఒక పాత్రలో నటించేందుకు అవకాశం ఇవ్వడం వల్ల దుర్రానీ కెరీర్ ముఖ్యమైన మలుపు తిరిగింది. అదే చిత్రంలో ఆయన ‘మస్తోన్ కో షెమ్ ఫర్జ్ హై పీనా షరబ్ కా’ అనే తన మొదటి పాటను శాస్త్రీయ సంగీతకారుడు తాన్-తల్వార్ బుండు ఖాన్‌గా ప్రసిద్ధి చెందిన ఉస్తాద్ బునియాద్ హుస్సేన్ ఖాన్ సంగీత దర్శకత్వంలో పాడారు.

తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లి హెచ్.ఎం.వి. లో నెలకు 50 రూపాయల జీతంతో నాటక కళాకారుడిగా చేరారు. కానీ అది ఆయన ఆశయాలకు అస్సలు నప్పని ఉద్యోగం. అక్కడ ఉండడానికి ఇష్టపడక, తన కెరీర్‌ను కొనసాగించడానికి 1937లో బొంబాయికి బయలుదేరారు. అది ఆయనకి పరీక్షా కాలం, ఎందుకంటే ఆరు నెలల పాటు అవకాశాలు రాలేదు. తరువాత నెలకు 40 రూపాయల జీతంతో ఆకాశవాణిలో చేరారు. ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేశారు. అద్భుతమైన గాయకుడిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అక్కడ దుర్రానీ – రఫీక్ ఘజ్నవిని కలిశారు, అతని కోసం పాటలు పాడే అవకాశం పొందారు. అతని ద్వారా దుర్రానీ గాయకుడు/స్వరకర్త/నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన కెరీర్‌ను ప్రారంభించారు.

దుర్రానీ ఆ కాలంలోని అనేక మంది ప్రముఖ స్వరకర్తలతో కలిసి పనిచేశారు, వారిలో ఖుర్షీద్ అన్వర్, నౌషాద్, శంకర్ రావు వ్యాస్, ఎ.ఆర్. ఖురేషి ఉన్నారు. ‘దర్శన్,’ ‘భారత్ మిలాప్,’ ‘చూడియాన్,’ ‘కిసీ సే నా కహ్నా,’ నై దునియా,’ ‘శారదా,’ ‘స్టేషన్ మాస్టర్,’ ‘ఆబ్రూ,’ ‘ఇషారా,’ ‘నయీ కహానీ,’ ‘నమస్తే,’ ‘అంబన్’, ‘సాస్సీ పన్ను,’ ‘సోహ్ని మహివాల్,’ ‘దో భాయ్,’ ‘డోలీ,’ ‘గిత్ గోవింద్,’ ‘హీరా,’ ‘మీర్జా సాహిబాన్,’ ‘రోమియో అండ్ జూలియట్,’ ‘ఆజ్ కీ రాత్,’ ‘దుఖియారీ,’ ‘ఘర్ కి ఇజ్జత్,’ ‘హీర్ రంఝా,’ ‘హీర్ రంఝాత్,’ కనీజ్,’ ‘నజారే,’ ‘సునేహ్రే దిన్,’ ‘బెకసూర్,’ ‘హంస్తే అన్సూ,’ ‘ఖేల్,’ ‘మధుబాల,’ ‘దీదార్,’ ‘ఇజ్జత్,’ వంటి ఎన్నో వంటి చిత్రాల సౌండ్‌ట్రాక్‌లను ఆయన స్వరం అలరించింది.

అంగూరి (1943), విజయలక్ష్మి (1943), భాగ్యలక్ష్మి (1944), ధరకన్ (1946), కిస్మత్ పలత్ కే దేఖ్ (1961), స్టేట్ ఎక్స్‌ప్రెస్ (1961) వంటి చిత్రాలకు కూడా దుర్రానీ సంగీతం అందించారు.

దుర్రానీ సమర్థుడైన నటుడు కూడా. యాద్ (1942), ఇస్మత్ (1944), రెట్ మహల్ (1949), హమ్ లోగ్ (1951), ఆస్మాన్ (1952), శ్రీ కృష్ణ భక్తి (1955), ముంతాజ్ మహల్ (1957), భోలా షికార్ (1958), అర్ధాంగిని (1958), జమానా బదల్ గయా (1961), స్టేట్ ఎక్స్‌ప్రెస్ (1961), కైసే కహున్ (1964), బాఘీ హసీనా (1965), తీస్రా కౌన్ (1965), బహరెన్ ఫిర్ భీ ఆయేంగీ (1966), బహు బేగం (1967), జవాబ్ అయేగా (1968), ప్రన్ జాయే 1969), ప్రిన్స్ (1969) (1971), భూమిక (1977), బేషరం (1978) వంటి చిత్రాలలో నటించారు.

‘నీంద్ హమారీ ఖ్వాబ్ తుమ్హారే’ (నయీ కహానీ, 1943), ‘దిల్ కే పట్ ఖోలే కే దేఖే’ (నమస్తే, 1943), ‘ఏ దిల్ ముఝే రోనే దే,’ ‘సంజే ది జిసే అప్నా,’ (చాంద్, 1944), యేతో బతా మేరా ఖుదా లూట్ గయా మేరా ప్యార్ క్యూఁ’ (నర్గీస్, 1946), ‘ఏక్ యాద్ కిసీ కి యాద్ రహీ’ (షామా, 1946), ‘హమ్ తో తేరే దిల్ కే బంగ్లే మే ఆనా మంగ్తా’ (మగ్రూర్, 1950), ‘దో బిచ్డే హూయే దిల్’ (కవిత 1950), ‘నజర్ ఫేరో నా హమ్ సే’ (దీదార్, 1951), ‘దిల్ ఐంజ్ ఐంజ్ కర్దా’ (కుర్మాయి), ‘హాత్ సీనే పే జో రఖ్ దొ తో గరార్ ఆ జాయే’ (మీర్జా సాహిబన్, 1947), ‘దిల్ ఎ బేకరార్ కహే బార్ బార్’ (బాగ్దాద్, 1952), ‘ఢూండతా హూఁ హర్ జగహ్ కహీ నహీ తెరా పతా’ (ఇజ్జత్, 1952), ‘ఉదర్ చాంద్ నిక్లా’ (ఖుష్బు, 1954), ‘హమ్ కో హఁస్తా దేఖ్ జమానా జల్తా హై’ (హమ్ సబ్ చోర్ హై, 1956),’ ‘కదం లార్జీదా లార్జీదా’ (కిస్మత్ పలట్ కే దేఖ్, 1961), ‘ఏ ఘర్ ఆప్ కా హై’ (సునేహ్రే ఖాదం, 1966),  ఇంకా మరెన్నో పాటలు ఆయన పాడిన ప్రసిద్ధ పాటల్లో ఉన్నాయి.

భారతీయ సినిమాకు దుర్రానీ చేసిన అత్యంత ముఖ్యమైన సేవలలో ఒకటి, ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీపై ఆయన ప్రభావం! రఫీ దుర్రానీని ఆదర్శంగా భావించి, తన తొలినాళ్లలో ఆయన శైలిని అనుకరించారు. దుర్రానీ యొక్క ప్రత్యేకమైన స్వరం, శైలి బాలీవుడ్‌లో నేపథ్య గానం యొక్క భవిష్యత్తును ఏర్పరచడంలో సహాయపడింది.

తరువాతి సంవత్సరాలలో, దుర్రానీ లతా మంగేష్కర్‌తో అసభ్యంగా ప్రవర్తించారనే కథనం వెలుగులోకి వచ్చింది. చాందినీ రాత్ (1949)లోని ‘హే చోర్ కీ జాత్ బడి బేవాఫా’ పాట రికార్డింగ్ సమయంలో, దుర్రానీ లతాతో అతిగా స్నేహంగా ఉండేవారని, ఆమెను నిరంతరం ప్రశంసించేవారని ఆ కథనం పేర్కొంది. లత ఆయనతో రికార్డ్ చేయడానికి నిరాకరించారు, తరువాత దుర్రానీతో ఎప్పుడూ ఏ పాట పాడలేదు. ఈ కథనం బాగా ప్రసిద్ధి చెందినప్పటికీ; ‘ఖామోష్ ఫసానా హై దునియా సే ఛుప్ చుప్ కే బలామ్ కో సునానా హై’ (హీర్ రంఝా, 1949), ‘దో బిచ్‌ డే హుయే దిల్’ (షాయర్, 1949), ‘కర్ సకేగా నా జుదా తుమ్కో’ (1949), ‘గాయే చలా జా’ (హమ్ లోగ్, 1951) వంటి పాటలు, మరియు మరికొన్ని పాటలు లత పాడినందున ఆ కథనం నిజం అనిపించదు.

దుర్రానీ నటి జ్యోతి (సితారా బేగం) ను వివాహం చేసుకున్నారు, ఆమె 1950ల నాటి ప్రముఖ నటి వాహిదా (నటి నిమ్మీ తల్లి) చెల్లెలు. సినీపరిశ్రమ నుంచి రిటైర్ అయ్యాకా, దుర్రానీ ఆధ్యాత్మికతలో లీనమయ్యారు. అమీన్ సయానీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, భౌతిక విషయాల పట్ల ఇకపై తనకు ఆసక్తి లేదని ఆయన అన్నారు; తాను అంతర్గత శాంతిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

జి.ఎం. దుర్రానీ సెప్టెంబర్ 8, 1988న మరణించారు, సంగీత పరిశ్రమలో గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. ఆయన జీవిత చరిత్ర ఔత్సాహిక కళాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉండి భారతీయ సినిమా స్వర్ణయుగాన్ని గుర్తుచేస్తుంది.

***

జి.ఎం. దుర్రానీ ప్రసిద్ధమైన పాట

https://www.youtube.com/watch?v=Ncv5fhit59Y

Exit mobile version