Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 292

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్వరకర్త వసంత్ దేశాయ్:

హిందీ సినిమా స్వర్ణయుగంలో అత్యంత నిష్ణాతులైన స్వరకర్తలలో వసంత్ దేశాయ్ ఒకరు. ‘దో ఆంఖేన్ బరా హాత్’ (1953), ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (1955), ‘గూంజ్ ఉటీ షెహనై’ (1959), ‘సంపూర్ణ రామాయణ్’ (1961), ‘ఆశీర్వాద్’ (1968), ‘గుడ్డి’ (1971) వంటి చిత్రాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత, భావపూర్ణ బాణీలకి ప్రసిద్ధి చెందారు.

వసంత్ దేశాయ్ జూన్ 9, 1912న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లోని సోన్వాడ్ గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. వసంత్ దేశాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి; ఎల్లప్పుడూ సంగీతంపై ఆసక్తి కలిగి ఉండేవారు, మంచి గాయకుడు అయినప్పటికీ, ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ వారి ‘ఖూనీ ఖంజర్’ (1930) సినిమాతో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత ‘అయోధ్యా కా రాజా’ (1932) లో ‘జై జై రాజాధిరాజ్’ పాటతో ప్రారంభించి కొన్ని పాటలు పాడారు. ఆయన పాడిన మరో ముఖ్యమైన పాట ‘అమృత్ మంథన్’ (1934) లోని ప్రసిద్ధ కజ్రీ ‘బర్సన్ లాగీ’. సినిమాల్లో సరైన పాత్రలు రాకపోవడంతో, సంగీతంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు, సంగీత దర్శకుడు మాస్టర్ కృష్ణారావుతో ‘ధర్మాత్మ’ (1935) సినిమాకి పనిచేశారు. సంగీత దర్శకుడు కేశవరావు భోలేతో ‘సంత్ జ్ఞానేశ్వర్’ (1936) వంటి ప్రభాత్ చిత్రాలలో పాటలు స్వరపరిచారు. వసంత్ దేశాయ్ ‘ధర్మాత్మ’లో ‘ఆజ్ భాగ్ జాగ్ గయే లోగో హమారే’, ‘అమర్ జ్యోతి’లో ‘కారాజ్ కీ జ్యోత్ సదా హీ జారే’, ‘సంత్ సఖు’లో ‘కారాజ్ కీ జ్యోత్ సదా హీ జారే’, ‘వహన్’లో ‘హై దునియా మే పాప్ గులామీ’ వంటి పాటలను పాడారు.

మంచి సంగీతకారుడు కావాలంటే తనకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ అవసరమని ఆయన ఈ సమయంలోనే గ్రహించారు. వసంత్ దేశాయ్ ఉస్తాద్ ఆలం ఖాన్ గారి వద్ద, ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ గారి వద్ద వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. కొన్ని సంవత్సరాల పాటు సంగీతాన్ని, స్వరాల కూర్పు లోని నైపుణ్యాన్ని అభ్యసించారు.

స్వతంత్ర స్వరకర్తగా ఆయన తొలి హిందీ చిత్రం వాడియా మూవీటోన్ వారి ‘శోభ’ (1942). ఆ తర్వాతవి ‘ఆంఖ్ కీ షర్మ్’ (1943), ‘మౌజ్’ (1943). ఆయన ప్రభాత్ ఫిల్మ్స్‌ను వదిలి వి. శాంతారామ్‌తో కలిసి రాజ్‌కమల్‌ సంస్థలో చేరారు. 1943లో ‘శకుంతల’ చిత్రం ఆయనకు విజయ ద్వారాలు తెరిచింది. ఇది ఒక గొప్ప మ్యూజికల్ హిట్, దాంతో ఆయన రాజ్‌కమల్‌ బ్యానర్‍లో ముఖ్యమైన భాగం అయ్యారు.

1940లలో, ‘పర్బత్ కే అప్నా డేరా’ (1944), ‘సుభద్ర’ (1946), ‘జీవన్ యాత్ర’ (1946), ‘మత్వాలా షైర్ రామ్ జోషి’ (1947), ‘ఉధార్’ (1949), వంటి మరెన్నో చిత్రాలకు సంగీతం అందించారు వసంత్ దేశాయ్.

వి. శాంతారామ్‌తో వసంత్ దేశాయ్ సహకారం ఫలితంగా ‘డా. కోట్నిస్ కీ అమర్ కహానీ’ (1946), ‘దహేజ్’ (1950), ‘షీష్‌మహల్’ (1950), ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (1955), ‘తూఫాన్ ఔర్ దియా’ (1956), మరియు ‘దో ఆంఖేన్ బరా హాత్’ (1957) వంటి సినిమాలు క్లాసిక్‌లుగా పరిగణించబడుతున్నాయి. ఈ చిత్రాల సంగీతం కోసం దేశాయ్ చాలా కష్టపడ్డారు; ఈ చిత్రాల కోసం స్వచ్ఛమైన శాస్త్రీయ, జానపద, నేపథ్య సంగీతాన్ని సంపూర్ణంగా ఉపయోగించారు.

‘జనక్ జనక్ పాయల్ బాజే’ (1955) సంగీతం దేశాయ్ సృష్టించిన కళాఖండాలలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఈ చిత్రం పూర్తిగా శాస్త్రీయ నృత్య ఇతివృత్తంపై ఆధారపడి ఉంది, కాబట్టి దేశాయ్ శాస్త్రీయ నృత్య బాణీలను స్వరపరిచారు. ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ కోసం ఆయన దిగ్గజ గాయకుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ స్వరాన్ని ఉపయోగించారు. ‘నైన్ సో నైన్ నాహి మిలావ్,’ ‘సైయాన్ జావో జావో మోసే నా బోలో,’ మరియు ‘కైసీ యే మొహబ్బత్’ వంటి పాటలు కూడా చిత్రాలలో ఉన్నాయి.

ఆయన ఫిల్మోగ్రఫీలో మరొక ముఖ్యమైన చిత్రం ‘దో ఆంఖేన్ బరా హాత్’ (1957), ఇందులో ‘ఏ మాలిక్ తేరే బందే హమ్’ అనే పాట ఉంది, ఇది చాలా పాఠశాలల్లో అత్యంత ప్రసిద్ధమైన ప్రార్థనా గీతాలలో ఒకటిగా మారింది. ఈ సినిమాలో ‘హో ఉమద్ ఘుమద్ కర్ ఆయీ రే ఘటా’ అనే వాన పాట, ‘సైయన్ ఝూతోన్ కా బడా సర్తాజ్ నిక్లా,’ ‘తక్ తక్ ధూమ్ ధూమ్ తక్’ వంటి ఉత్సాహం కలిగించే పాటలు కూడా ఉన్నాయి.

ఆయన ఇతర ముఖ్యమైన పాటల్లో కొన్ని – పరేషాన్ హూఁ కీ క్యోం మేరీ పరేషానీ నహీఁ జాతీ (పర్బత్ పే అప్నా డేరా), చిత్ దోలే నిత్ డోలే (డా. కోట్నిస్ కీ అమర్ కహానీ), ఆ జా నిగాహోం మే ఆ జా (దహేజ్), జిసే డూంఢీ ఫిర్తీ హై మేరీ నజర్ (శీష్ మహల్), నిర్బల్ సే లడాయి బల్వాన్ కీ యే కహానీ హై దియా కీ ఔర్ తూఫాన్ కీ (దియా ఔర్ తూఫాన్), దిల్ హమ్ తో హారే (అర్ధాంగిని), ఛుమ్ ఛనానానా బిచ్చువా బోలే రే (దో బెహ్నేఁ), ఇంకా మరెన్నో.

వి. శాంతారామ్ ‘నవరంగ్’ (1956) నుండి వసంత దేశాయ్‌ను తొలగించి, ఆయన స్థానంలో సి. రామచంద్రను ఎంచుకున్నప్పుడు వి. శాంతారామ్‌తో వసంత్ దేశాయ్ సంబంధం బీటలువారింది, ఇది దేశాయ్ హృదయాన్ని బద్దలు కొట్టింది.

ఆ తర్వాత ఆయన తక్కువ సంఖ్యలో సినిమాలు చేశారు, కానీ తన బాణీల శైలిని, మాధుర్యాన్ని కొనసాగించగలిగారు. ఈ కాలంలో ఆయన సంగీతంలో శాస్త్రీయ సంగీతం ఉపయోగం స్పష్టంగా కనిపించింది. ఈ కాలంలో మౌసి (1958), అర్ధాంగిని (1959), స్కూల్ మాస్టర్ (1959), సంపూర్ణ రామాయణ్ (1961), యాదేఁ (1964), భారత్ మిలాప్ (1965), లడ్కీ సహ్యాద్రి కీ (1966), రామ్ రాజ్య్ (1967), ఆశీర్వాద్ (1968), గుడ్డి (1971) రాణి ఔర్ లాల్ పరీ (1975) విడుదలయ్యాయి.

‘గూంజ్ ఉఠీ షెహనాయ్’ (1959) సినిమాలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారితో షెహనాయి వాయింపజేశారు. ఇది వారి చారిత్రాత్మక సహకారాలలో ప్రముఖంగా నిలిచింది. ఈ చిత్రంలో ‘కహ్ దో కోయి నా కరే యహాఁ ప్యార్’, ‘దిల్ కా ఖిలోనా హై టూట్ గయా’, ‘తేరే సుర్ ఔర్ మేరే గీత్’, ‘అఖియాఁ భూల్ గయీ’ వంటి చిరస్మరణీయ పాటలు కూడా ఉన్నాయి.

సునీల్ దత్ నటించిన ‘యాదేఁ’ (1964) సినిమాని వసంత్ దేశాయ్ కెరీర్ లోనే కాకుండా హిందీ సినిమాలన్నింటిలోనూ ఒక మైలురాయిగా పరిగణిస్తారు. ఇది ఒకే ఒక్క కళాకారుడితో తీసిన సినిమా. నేపథ్య సంగీతం, సంభాషణల సహాయంతో కథను చిత్రీకరించారు. దీనికి సంగీతం సమకూర్చడం వసంత్ దేశాయ్‌కి చాలా పెద్ద పనే అయినప్పటికీ, ఆయన పరిపూర్ణమైన నేపథ్య సంగీతం అందించారు. లతా మంగేష్కర్ పాడిన ‘దేఖా హై సప్నా కోయి’ పాటను అద్భుతంగా స్వరపరిచారు.

వసంత్ దేశాయ్ తరువాతి రోజుల్లో స్వరపరిచిన కొన్ని ముఖ్యమైన పాటలు – ‘దిల్ కా ఖిలౌనా హే టూత్ గయా,’ ‘జీవన్ మే పియా తేరా సాత్ రహే,’ ‘కహ్ దో కోయి నా కరే యహాఁ ప్యార్’ (గూంజ్ ఉఠీ షెహనాయీ), ‘మేరే గోదీ మే గోపాలా’ (ప్యార్ కీ ప్యాస్), ఏక్ థా బచ్‍పన్, ‘రైల్ గాడీ రైల్ గాడీ చుక్ చుక్’ (ఆశీర్వాద్), ‘బోలే రే పాపిహారా,’ ‘హమ్‍కో మన్ కీ శక్తి దేనా,’ ‘హరి బిన్ కైసే జియూఁ రే’ (గుడ్డి), బిఖ్రే తార్ మిలే ఫిర్ మాన్ కే (గ్రహణ్), ఇంకా మరెన్నో.

తరువాత, 1974లో, గుల్జార్ ‘అచానక్’ అనే పాటలు లేని సినిమా తీస్తున్నప్పుడు, దానికి సంగీతం అందించవలసిందిగా వసంత్ దేశాయ్‌ని కోరారు. ఈ సినిమాలో నేపథ్య సంగీతానికి గొప్ప అవకాశం ఉందని, ఆ పనికి వసంత్ సరైన వ్యక్తి అని గుల్జార్‌కు తెలుసు. వసంత్ ‘జల్‌జలా’, ‘ఫెర్రీ’, ‘కభీ అంధేరా కభీ ఉజాలా’ చిత్రాలకు కూడా నేపథ్య సంగీతాన్ని అందించారు.

వసంత్ దేశాయ్ తన 1968 నాటి చిత్రం ‘ఆశీర్వాద్’ కోసం ప్రముఖ నటుడు అశోక్ కుమార్ గాత్రాన్ని ఉపయోగించారు. అశోక్ కుమార్ ‘రైల్‌గాడి రైల్‌గాడి’, ఇంకా ‘నావ్ చలి’ పాట అనే పాడారు. ‘నావ్ చలి’ పాట బహుశా హిందీ సినీరంగంలోని తొలి ‘ర్యాప్ సాంగ్’. అశోక్ కుమార్ ఈ చిత్రంలో ‘సాఫ్ కరో, ఇన్సాఫ్ కరో’, ‘కన్నో కీ ఏక్ నాగరి థీ’ అనే మరికొన్ని పాటలు పాడారు. ఈ చిత్రంలో ‘రాగ్ పూరియా ధనశ్రీ’లో స్వరపరిచిన ‘ఏక్ థా బచ్‌పన్’ పాటని లతా మంగేష్కర్ పాడారు. అలాగే రాగ్ శివరంజినీలో మన్నా డే ‘జీవన్ సే లంబే హై బంధు’ అనే పాట పాడారు.

వసంత్ దేశాయ్ ‘గుడ్డి’ సినిమాలో వాణి జయరామ్‌ను నేపథ్య గాయనిగా పరిచయం చేశారు. వాణి పాడిన ‘బోలే రే పాపిహారా’, ఇప్పటివరకు గుర్తుండిపోయిన కొన్ని వర్షపు పాటలలో ఒకటి. ‘రాణి ఔర్ లాల్ పరీ’ (1975) చిత్రంలో దిల్‌రాజ్ కౌర్‌ను నేపథ్య గాయనిగా పరిచయం చేశారు. వసంత్ దేశాయ్ గారి అత్యంత ప్రసిద్ధ పాటలలో ఒకటి, దూరదర్శన్ కోసం స్వరపరిచిన ‘ఏక్ చిడియా అనేక్ చిడియాఁ’, దీనిని ఆయన శిష్యురాలు, యువ సాధన సర్గం పాడింది. ఆమె పాడిన పాటలలో ఇది ఓ అరుదైన రత్నం.

అనేది కంచికామకోటి పీఠానికి చెందిన జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సంస్కృతంలో స్వరపరిచిన ఆశీర్వాద గీతం ‘మైత్రీం భజతాం’. ఈ పాటను వసంత దేశాయ్ రాగమాలికగా రూపొందించారు. దీనిని అక్టోబర్ 23, 1966న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి ఐక్యరాజ్యసమితిలో ఆలపించారు.

దేశాయ్ మరాఠీలో, కొన్ని గుర్తుండిపోయే పాటలు అందించారు. అమర్ భూపాలి (1951) సినిమాలో ‘సంగ ముకుంద్ కుని హా పహిలా,’ ‘ఉఠి ఉఠి గోపాల’ పాటలు, చోటా జవాన్ (1963) సినిమాలో ‘మనుసిచ్య శత్రుసంగే యుద్ధ అముచే సురు’ పాట, ‘ప్రీత్ సంగం’ (1972) సినిమా నుండి ‘దేహ్ దేవాచే మందిర్’ స్వయంవర్ జలే సిటేచే (1974) సినిమా నుండి ‘రమ్య హి స్వర్గహుని లంక’, వంటివి ముఖ్యమైనవి.

వసంత్ దేశాయ్ కేవలం 46 చిత్రాలకే సంగీతం సమకూర్చారు, కానీ ఏ సినిమాకి పనిచేసినా, తన హృదయాన్ని, ఆత్మను ఆ ప్రాజెక్టుకు అంకితం చేసేవారు. తన శాస్త్రీయ సంగీత మూలాల నుండి ఎప్పుడూ పక్కకి మళ్ళలేదు. ఆయనకు ఇష్టమైన కవులు మజ్రూహ్ సుల్తాన్‌పురి, కవి ప్రదీప్, గుల్జార్, పండిట్ నరేంద్ర శర్మ, ఇంకా అందరికంటే ముఖ్యంగా మహాకవి భరత్ వ్యాస్.

వసంత్ దేశాయ్ డిసెంబర్ 22, 1975న తన భవనంలోని లిఫ్ట్ పనిచేయకపోవడంతో లిఫ్ట్ ప్రమాదంలో నుజ్జునుజ్జై మరణించారు.

వసంత్ దేశాయ్ స్వరపరిచినన విస్తృతమైన, అద్భుతమైన పాటల భాండాగారం సంగీత వారసత్వానికి ఒక విలువైన ఆభరణం. సినిమాలకు, పాఠశాల సంగీత పాఠ్యాంశాలకు ఆయన చేసిన కృషికి ఆయనకు విస్తృత గుర్తింపు లభించకపోవచ్చు, కానీ దేశాయ్ పాటలు వాటి స్వాభావిక శ్రావ్యమైన సౌందర్యంతో, క్లాసిక్ నైపుణ్యంతో శ్రోతలకు ఆహ్లాదం కలిగిస్తూనే ఉన్నాయి.

Exit mobile version