Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 300

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

 

~

మీనా కుమారి – కమల్ అమ్రోహి దాంపత్యంలో వివాదాలు:

భారతీయ సినిమాల ట్రాజెడీ క్వీన్ గా పిలువబడే మీనా కుమారి, ఆమె పాత్రల విషాద సౌందర్యాన్ని ప్రతిబింబించే జీవితాన్ని గడిపారు. వెండితెరపైకి తెచ్చిన ప్రకాశవంతమైన చిరునవ్వు, లావణ్యం వెనుక హృదయ విదారకమైన ఒంటరితనం, కళాత్మక కోరికల ప్రపంచం దాగి ఉంది. చిత్రనిర్మాత కమల్ అమ్రోహితో సృజనాత్మక భాగస్వామ్యంగా ప్రారంభమైన ఆమె సంబంధం చివరికి ఆమె జీవితంలో అత్యంత సంక్లిష్టమైన, బాధాకరమైన అధ్యాయాలలో ఒకటిగా మారింది.

కవి, దర్శకుడు అయిన కమల్ అమ్రోహి, మీనాలో కళాకారిణిగా అసాధారణమైన ప్రతిభను తొలినాళ్లలోనే గుర్తించారు. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయ్, డేరా, పాకీజా వంటి కళాఖండాలలో కలిసి పనిచేసేటప్పుడు వారి బంధం బలపడింది, పాకీజా ఆమె చివరి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నట ప్రదర్శనగా మారింది. అయితే, వారి వ్యక్తిగత సంబంధం ప్రేమగా వికసించినప్పుడు, అమ్రోహికి అప్పటికే వివాహమైంది, పిల్లలున్నారు. వారి సంబంధం సామాజిక నిబంధనలను ధిక్కరించింది, విస్తృతమైన తిరస్కరణను ఎదుర్కొంది, అయినప్పటికీ ఆ ప్రేమ కొంతకాలం విజయం సాధించింది – వారు 1952లో మీనా కుమారికి కేవలం 18 సంవత్సరాల వయసు ఉండగా వివాహం చేసుకున్నారు.

2019 లో న్యూస్ 18 ఉర్దూతో జరిగిన సంభాషణలో, కమల్ అమ్రోహి మొదటి భార్యకు జన్మించిన కుమార్తె రుఖ్సర్ అమ్రోహి, మీనా కుమారితో తన తండ్రికి ఉన్న బంధాన్ని సన్నిహితంగా పరిశీలించారు. ఆమె తన తల్లి, మీనా ఇద్దరు వేర్వేరు మహిళలకు ప్రతిబింబాలని అన్నారు – తన తల్లి సరళమైనది, సాంప్రదాయికమైనది అనీ, తన తండ్రి సాహిత్యపు ఆత్మలో లోతుగా ప్రతిధ్వనించే కవితాత్మక, శృంగార ప్రకాశం మీనా కుమారి అని అన్నారు.

కమల్ అమ్రోహికి, మీనా ఆదర్శవంతమైన కావ్యదేవత వంటివారు – ఆయన రాసిన కవితల మాదిరిగానే నిగూఢమైనది, అందమైనది మరియు భావోద్వేగపరంగా తీవ్రమైనది. కవికి ప్రియమైన పాత్రను పోషించడానికి జన్మించిన వ్యక్తిగా మీనాను తమ కుటుంబం అంగీకరించిట్లుగా రుఖ్సర్ తెలిపారు.

అమ్రోహి మీనాను దుర్భాషలాడారని చాలా కాలంగా వస్తున్న ఆరోపణలను రుఖ్సర్ త్రోసిపుచ్చారు, ఆ జంట ప్రేమను తట్టుకోలేని బయటి వ్యక్తుల నుంచే అలాంటి ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. ఆమె చెప్పిన ప్రకారం, మీనాపై తన తండ్రి విధించిన ఆంక్షలు – ఆమెను వెంటనే ఇంటికి తిరిగి రమ్మని అడగడం లేదా ఆమె మేకప్ రూమ్ తలుపు తెరిచి ఉంచడం వంటివి – ఆమె ప్రతిష్ఠ పట్ల ఆయనకున్న ఆందోళనను ప్రస్తావించాయి.

“మనం వేరొకరి ఆనందాన్ని భరించలేని సమాజంలో జీవిస్తున్నాం. కొంతమంది ఆమె తమతో కలిసి పనిచేయాలని కోరుకున్నారు, కానీ మా నాన్న కొన్ని చోట్ల ఒక గీత గీసేవారు” అని చెప్పారు రుఖ్సర్.

రాత్రికి రాత్రే స్త్రీ ఇమేజ్‌ను పుకార్లు నాశనం చేసే యుగంలో, కమల్ అమ్రోహి నియంత్రించడం కంటే జాగ్రత్తగా ఉండేవారని రుఖ్సర్ చెప్పారు. అయినప్పటికీ, మీనా చుట్టూ ఉన్న చాలా మంది ఆమెను ఆయనకి వ్యతిరేకంగా మార్చారని, వారి మధ్య భావోద్వేగపరమైన ఎడం ఏర్పడిందని, అది ఎప్పటికీ పూర్తిగా తొలగలేదని తెలిసింది.

ఆరోపణలు, మనస్తాపం, నియంత్రణ నీడ:

అమ్రోహి కుటుంబం ఆయన ఉద్దేశాలను సమర్థించగా, మీనా జీవిత చరిత్ర రచయిత వినోద్ మెహతా చీకటి చిత్రాన్ని చిత్రించాడు. నటి తన వివాహంలో భావోద్వేగపు, శారీరక బాధలను ఎదుర్కొన్నట్లు బహుళ వర్గాలు ధృవీకరించాయని ఆయన వెల్లడించారు. అమ్రోహి బహిరంగంగా అన్ని ఆరోపణలను ఖండించినప్పటికీ, మెహతా పరిశోధన – మీనా జీవితం, మూసిన తలుపుల వెనుక, అంత ఆహ్లాదకరంగా లేదని సూచించింది.

వివాహం తర్వాత కూడా ఆమె నటన కొనసాగించినప్పటికీ, ఆమె వృత్తిపరమైన స్వేచ్ఛకు పరిమితులు విధించబడ్డాయి. కమల్ అమ్రోహి – ఆమె పనిని, సంభాషణలను నియంత్రించే కఠినమైన నియమాలను నిర్దేశించినట్లు తెలుస్తోంది. దర్శకుడు అబ్రార్ అల్వి ఒకసారి కమల్ అమ్రోహి సహాయకుడు బకార్ అలీ సినిమా షూటింగ్ సమయంలో ఆమె మేకప్ రూమ్‌లోనే ఉండి ఆమె కదలికలను ఎలా పర్యవేక్షించేవాడో గుర్తుచేసుకున్నాడు – ఇది ఆయన లోతైన అపనమ్మకం, స్వాధీనతా భావాలకు సంకేతం.

చివరికి తెర – త్వరగా మసకబారిన జీవితం:

జీవితం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, మీనా కుమారిలో కళాత్మకత ఎప్పుడూ తగ్గలేదు. కమల్ అమ్రోహి నుండి సంవత్సరాల భావోద్వేగపు ఎడం తర్వాత పూర్తయిన పాకీజా చిత్రంలో ఆమె పాత్ర వీడ్కోలుకి, ఆమె స్వంత జీవితానికి – ఆత్రుత, గాయాలకు ప్రతిబింబంలా నిలిచింది, కానీ మరపురానిదిగా మిగిలింది. అయితే, విడుదలైన కొన్ని వారాల తర్వాత, లివర్ సిర్రోసిస్ కారణంగా మీనా ఆరోగ్యం వేగంగా క్షీణించింది. మార్చి 28, 1972న, ఆమెను ముంబైలోని సెయింట్ ఎలిజబెత్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. రెండు రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళారు, మార్చి 31న 38 సంవత్సరాల వయసులో మరణించారు.

(మీనా కుమారి, కమల్ అమ్రోహీల వైవాహిక జీవితంలోని కల్లోలాలపై ప్రచారంలో ఉన్న వదంతులను రుఖ్సర్ ఖండించిన వైనం వచ్చేవారం)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version