Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 301

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

మీనా కుమారి – కమల్ అమ్రోహి దాంపత్యంలో వివాదాలు-2:

కమల్ అమ్రోహి ‘బిటియా’ (తన రెండవ భార్యకు పుట్టిన ఏకైక కుమార్తెను ఆయన అలా ప్రేమగా పిలిచేవారు), రుఖ్సార్ అమ్రోహి ఓ పత్రికతో మాట్లాడుతూ ప్రసిద్ధుడైన తన తండ్రి ప్రతిష్ఠను, ఆయన మూడవ భార్య జీవితాన్ని దెబ్బతీసిన కథలను, పుకార్లను త్రోసిపుచ్చారు. ఆమె స్వయంగా ప్రఖ్యాత కవయిత్రి, ‘దర్ద్-ఇ-దిల్ లిఖూఁ కబ్ తక్’ అనే పుస్తకం రాశారు. ఆమె తన తండ్రితోనూ, మీనా కుమారితో గడిపిన సంవత్సరాలను చాలా స్పష్టంగా గుర్తుంచుకున్నారు.

1952లో, మీనా కుమారి, కమల్ అమ్రోహి ఒక సినిమా సెట్స్‌లో కలుసుకున్నప్పుడు అది తొలి చూపులోనే ప్రేమగా మారింది. ఆ సమయంలో ఆమెకు 19 సంవత్సరాలు, ఆయనకి 34 సంవత్సరాలు. ఆయనకి అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ వారిద్దరూ వివాహం చేసుకుని, వారి స్వంత ప్రేమకథగా భావించే డేరా (1953) చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాకీజా ప్రాజెక్ట్ వచ్చింది. కానీ త్వరలోనే ఈ జంట మధ్య సంబంధాలు చెడిపోయాయి, ఘర్షణలు చెలరేగి, చివరికి విడిపోయారు. పాకీజా నిర్మాణానికి దాదాపు 14 ఏళ్ళు పట్టింది. ఈ జంట విడిపోయారు, ఆ చిత్రాన్ని దాదాపు ఆరేళ్ళు నిలిపివేశారు. ఆ సంవత్సరాల్లో ఈ జంట ఎన్నో అపవాదులను, ద్వేషపు పుకార్లను మోసింది.

“భారతీయ మీడియాలో ఈ అబద్ధాలన్నీ విని నాకు విసుగేస్తోంది” అని రుఖ్సర్ అమ్రోహి చిరాకుతో అన్నారు. “వారి సంబంధాన్ని దెబ్బతీయాలని నేను కోరుకోవడం లేదు, కానీ నాన్న ఆమెను వివాహం చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను. నాన్న మీనా కుమారి ఎప్పుడూ విడాకులు తీసుకోలేదు, వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల లేఖలన్ని నా దగ్గర ఉన్నందున నేను సప్రమాణంగా చెబుతున్నాను. అహంకారపు ఘర్షణల కారణంగా వారు కలిసి జీవించలేకపోయారు,” అని ఆమె చెప్పారు. “నాన్నకి వ్యతిరేకంగా జనాలు మీనాజీ బుర్రలో విషబీజాలు నాటారు, దాంతో వాళ్ళిద్దరూ విడిపోయారు” అని ఆమె జోడించారు.

మీనా కుమారి వైవాహిక జీవితానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని, షూటింగ్ తర్వాత నేరుగా ఇంటికి తిరిగి రావాలని కమల్ అమ్రోహి కోరుకున్నారని రుఖ్సర్ చెప్పారు. మీనా ఇతరులతో కలిసి ఉండటం ఆయనకు ఇష్టం లేదని రుఖ్సర్ చెప్పారు. “నాన్న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినవారు. మీనా కుమారి తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆయన కోరుకున్నారు” అని రుఖ్సర్ అమ్రోహి పేర్కొన్నారు. అయితే, విజయాన్ని, కీర్తిని రుచి చూసిన యువ మీనా కుమారికి మరింత స్వేచ్ఛ అవసరం.

1964 మార్చిలో ఒక రాత్రి, బొంబాయి (నేటి ముంబై) లోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో ‘పింజీరే కే పంఛీ’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, పరిశ్రమలోని ఓ ప్రముఖుడితో మీనా కుమారి చాలా సేపు మేకప్ రూమ్‌లో గడిపారని రుఖ్సర్ అన్నారు. అతనెవరో పేరు చెప్పడానికి ఇష్టపడలేదు రుఖ్సర్.

ఆ సంఘటనని గుర్తుచేసుకుంటూ, “షాట్ పూర్తి చేయడానికి చోటి అమ్మీని సెట్‌లకు పిలిచారు, కానీ ఆమె మేకప్ రూమ్ నుండి బయటకు రాలేదు. మేకప్ రూమ్‌లు సినిమా పరిశ్రమ లోని అన్ని కుంభకోణాలకు మూలమని, ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలని నాన్న ఎప్పుడూ ఆమెకు చెప్పేవారు. మీనాజీతో ఎప్పుడూ షూటింగ్‌లలో ఉండే మా నాన్న సెక్రటరీ బకార్ సాహెబ్ కూడా ఆమెను హెచ్చరించాడు, దానితో ఆమె చాలా బాధతో, కోపంగా తలుపు తెరిచింది. నాన్నను వెంటనే స్టూడియోకి పిలవమని అరిచింది, తనను తన భర్త నియంత్రించడానికి వ్యతిరేకించింది.

“ఆ రాత్రి నాన్న ఫిల్మిస్థాన్‌కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన బహిరంగంగా గొడవ సృష్టించకూడదని భావించారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చి సమస్య పరిష్కరించుకోవాలని ఆయన కోరుకున్నారు, కానీ ఆమె తన సోదరి మధు (నటుడు మెహమూద్ భార్య) ఇంటికి వెళ్ళింది. రాత్రి ఆలస్యంగా, నాన్న, చోటి అమ్మీని ఇంటికి తీసుకురావడానికి మధు ఇంటికి వెళ్ళారు, కానీ ఆమె తన గది తలుపు తెరవలేదు. ఆ తర్వాత వారు విడిపోయారు.”

తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నప్పుడు రుఖ్సర్‌ వయసు 10 సంవత్సరాలు. “నేను మా అమ్మతో (కమల్ అమ్రోహికి రెండవ భార్య మెహమూదీ) అమ్రోహాలో ఉండేదాన్ని. ఆ సమయంలో నాన్న ముంబైలో ఉండేవారు. చోటి అమ్మీ నన్ను ప్రేమించింది, జాగ్రత్తగా చూసుకుంది. నాన్నను ప్రేమించమని, చోటి అమ్మీని తల్లిగా గౌరవించమని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. నాన్న మా అమ్మకి అపారమైన గౌరవం, ప్రేమ ఇచ్చారని నాకు తెలుసు, కానీ అమ్మ ఆయన మెహబూబా (ప్రియమైనది) కాదు. అది ఎల్లప్పుడూ మీనాజీనే!”

మీనా కుమారి వరుసగా రెండు సినిమాలలో దుఃఖంతో ఉండే యువతి పాత్రలలో నటించారు, సాహెబ్, బీబీ ఔర్ గులాం (1962) సినిమా ఆమెకు ‘ట్రాజెడీ క్వీన్’ బిరుదును సంపాదించిపెట్టిన అనేక చిత్రాలలో మొదటిది. “తెరపై దుఃఖంలో మునిగిపోయిన స్త్రీగా నటించడానికి ఆమెకు సరైన వదనం ఉన్నప్పటికీ, మీడియాలో ముద్రించిన అన్ని కల్పిత కథలు నిజమని మీనాజీ నమ్మడం ప్రారంభించింది” అని చెప్పారు రుఖ్సర్. “ఆమె తనకి ఎంతో పేరు తెచ్చిన ట్రాజెడీ క్వీన్ పాత్రలలో జీవించడం ప్రారంభించింది. నిజ జీవితంలో కూడా తాను ట్రాజెడీ క్వీన్ అని ప్రజలు నమ్మాలని కోరుకుంది. ఆమె ముఖం కూడా బాధపడే స్త్రీ, విచారకరమైన స్త్రీ ముఖం” అని గుర్తుచేసుకున్నారు రుఖ్సర్.

భారతీయ మీడియా, ఇంకా ఆమె చుట్టూ ఉన్నవారు ఆమె ప్రతిష్ఠను చూసి – ఆమెకి వచ్చిన ఈ ఇమేజ్‌ను కొనసాగించేలా చేసినప్పటికీ, మీనాజీ ‘బాలీవుడ్‌లో బాగా కోరుకునే ప్రముఖ మహిళగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న నటి మాత్రమే’ అని రుఖ్సర్ చెప్పారు. “ఆమె తన కాలంలోని అగ్ర కథానాయికలలో ఒకరిగా మారింది, కానీ ఈ ప్రక్రియలో తనని ప్రేమించే భర్తను కోల్పోయింది” అని జోడించారు రుఖ్సర్.

కమల్ అమ్రోహి వల్లే మీనా కుమారి మద్యాన్ని ఆశ్రయించారనే ఆరోపణలను రుఖ్సర్ అమ్రోహి త్రోసిపుచ్చారు. “నాన్నతో ఆమె వివాహం సమయంలో, ఆమెను ఆ వస్తువులను ముట్టుకోనివ్వలేదు. వారు విడిపోయిన తర్వాత ఆమె తాగుబోతుగా మారింది.”

రుఖ్సర్ తన తండ్రి వాదనలో మరో విషయాన్ని కూడా ప్రస్తావించింది:

“కమల్ అమ్రోహి సినిమాలు ఎప్పుడూ మహిళల పట్ల సమాజం చూపే కపటత్వాన్ని చిత్రీకరిస్తాయి. అలాంటప్పుడు అతను తాను ప్రేమించిన స్త్రీతో ఎలా దుర్భాషలాడగలడు? దానికి ‘పాకీజా’ నిదర్శనం. ప్రీమియర్‌లో మీనా కుమారి నాన్న చేయి పట్టుకుని హాలులోకి ప్రవేశించడం నాకు గుర్తుంది. ఆమె సినిమా అంతటా ఏడుస్తూ, ‘చందన్, నువ్వు నన్ను చాలా అందంగా చేశావు. నేను నమ్మలేకపోతున్నాను’ అని చెబుతూ ఉండటం నేను చూశాను!”

ఇది కేవలం అహంకారం కాదు, ఎందుకంటే మీనా కుమారి అప్పుడు లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. నర్గీస్, సునీల్ దత్ కోరిక మేరకు ఆమె పాకీజాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, తాను తన చిన్నతనంలో ఉన్నంత అందంగా కనిపించనని భయపడ్డారు. “మునుపటి సన్నివేశాలలో ఆమె కనిపించినంత అందంగా కనిపించేలా చేస్తానని నాన్న ఆమెకు హామీ ఇచ్చారు. ఆమె ముఖానికి కన్‌సీలర్స్‌ పులిమి క్లోజప్ షాట్స్ తీసారు. చివరి రోజుల్లో పద్మ ఖన్నా అనే కళాకారిణి మీనాజీకి డూప్‌గా వ్యవహరించింది, పాకీజాలోని చివరి పాట, ‘తీర్-ఇ-నజర్ దేఖేంగే జక్మీ జిగర్ దేఖేంగే’ కోసం నృత్యం కూడా చేసింది.”

తన చివరి రోజుల్లో, నొప్పి ఆమెకు నిత్య సహచరుడిగా ఉన్నప్పుడు, మీనా కుమారి తన అపార్ట్‌మెంట్‌కు కమల్ అమ్రోహిని మాత్రమే పిలిచేవారు. ఆమె అప్పటికీ అతనిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. “తీవ్రమైన నొప్పితో, ఆమె గంటల తరబడి ఏడుస్తున్నప్పుడు నేను నాన్నతో పాటు ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లేదానిని” అని చెప్పారు రుఖ్సర్.

“ఒకసారి ఒక పార్టీలో, నాన్నకు కిళ్ళీ ఇచ్చారు. అది తినగానే ఆయనకి తల తిరుగుతున్నట్లైంది, సగం స్పృహలో ఇంటికి చేరుకున్నారు. మేమంతా చాలా ఆందోళన చెందాం, నేను చోటి అమ్మీకి ఫోన్ చేసాను. ఆమె వెంటనే మా అపార్ట్‌మెంట్‌కు కారులో వచ్చింది. ఆమె మెట్లు ఎక్కలేకపోయింది, దాంతో మేము ఆమెను కలవడానికి కిందకు వెళ్ళాము. ఆమె నిజంగా ఆందోళన చెందింది, భవిష్యత్తులో ఏ పార్టీకి నాన్నని వెళ్లనివ్వవద్దని చెప్పింది.

“‘అతనిపై అసూయతో ప్రజలు అతనికి విషం పెడతారు’ అని ఆమె చెప్పింది. చివరికి, ఆమె కోమాలోకి వెళ్ళినప్పుడు, మీనా కుమారి భర్తగా వైద్యులు నాన్నని సంప్రదించి, ఆమె క్లినికల్‌గా చనిపోయిందని చెప్పి, ఆమె లైఫ్ సపోర్ట్‌ను తీసివేయడానికి అనుమతి మంజూరు చేయమని కోరారు. అప్పుడాయన పలికిన మాటలు: ‘మంజు, ఖుదా హఫీజ్’!” అని గుర్తుచేసుకున్నారు రుఖ్సార్. పాకీజా విడుదలైన రెండు నెలల తర్వాత, 1972 మార్చిలో మీనా కుమారి 40 సంవత్సరాల వయసులో మరణించారు.

రుఖ్సర్ మాట్లాడుతూ, ఇక్కడితో అయిపోలేదనీ, మరో గుండె చెదిరే మరో విషయం ఉంది అన్నారు: “మీనాజీ చనిపోయి, నాన్న ఆమెను సమాధి చేశారు. ఆమె తన వ్యక్తిగత డైరీలను, కవితలను ఓ సన్నిహితుడికి ఇచ్చిందని మరుసటి రోజు వార్తాపత్రికలలో చదివారు. నాన్న గుండె బద్దలైంది. తాను ఆమె భర్త అయితే లేదా వారు ఎప్పుడైనా ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఆమె తన వ్యక్తిగత రచనలను తన భర్తకి (కమల్ అమ్రోహికి) ఇచ్చి ఉండాలని చెప్పారు.”

ఇప్పుడు కమల్ అమ్రోహి, మీనా కుమారిల సమాధులు ముంబైలోని ఒక స్మశానవాటికలో పక్కపక్కనే ఉన్నాయి. “మా అమ్మని కూడా నాన్న సమాధి స్థలం పక్కనే ఖననం చేశాం” చెప్పారు రుఖ్సర్.

తన తండ్రిపై భారతీయ మీడియా మోపిన నిందలను తొలగించే బాధ్యతను రుఖ్సార్ అమ్రోహి స్వయంగా తీసుకున్నారు. “వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన 500 లేఖలను నేను బహిర్గతం చేయలేను. కానీ అవే నిజమైన రుజువులు. నేను చనిపోయిన తర్వాత వాటిని పారేయమని నా పిల్లలకు చెప్పాను. ఎవరూ వాటిని చదవకూడదు, ఎందుకంటే వాటిని తప్పుగా అర్థం చేసుకుంటారు, పైగా దుర్వినియోగం చేయబడతాయి. కమల్ అమ్రోహి, మీనా కుమారి దంపతులుగా ఇకపై అపవాదులకు గురికాకూడదు, ముఖ్యంగా నాన్న.

ఆమె నటిగా విజయవంతమయ్యాకా, పెళ్లి చేసుకునే ముందు నాన్నకి ఇచ్చిన వాగ్దానాలు ఏవీ ఆమెకు గుర్తు రాలేదు. తాను గృహిణిగా లేదా పిల్లలను కనే యంత్రంగా ఉండలేనని కూడా ఆమె చెప్పింది. ఆమె ఎప్పుడూ పిల్లలను కోరుకోలేదని నేను ‘ఆన్ రికార్డు’గా చెబుతున్నాను. నేనే దీనికి సాక్షిని. నేను దానిని నిరూపించగలను. వారిద్దరూ రాసుకున్న ఆ లేఖలే – ఆమె ఎప్పుడూ పిల్లలను కోరుకోలేదనేందుకు రుజువు. ఆమె ఎప్పుడూ పిల్లలను కనాలని కోరుకోలేదని చూపించే డైరీ కూడా నా దగ్గర ఉంది. ఆమె గర్భవతి అయింది కానీ ఆమె అబార్షన్ చేయించుకుంది.”

ఈ విధంగా కమల్ అమ్రోహి, మీనా కుమారిల గురించి వినబడే వదంతులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు రుఖ్సర్.

Exit mobile version