Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 303

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటి ఇందురాణి:

నటి ఇందురాణి అసలు పేరు ఇష్రత్ జెహాన్ ఇమాముద్దీన్. 1922 జూన్ 22న ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి మునావర్ జెహాన్ ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయంలో కొత్తగా ప్రారంభించబడిన హకీమ్ అజ్మల్ ఖాన్ పాఠశాలలో మొదటి విద్యార్థినులలో ఒకరు. లేడీ డాక్టర్‌గా, హకీమ్‌గా పట్టా పొందిన తర్వాత, మునావర్ జంజిరా మరియు టోంక్ సంస్థానాలలో పనిచేశారు. మునావర్ తండ్రి షేక్ ఇమాముద్దీన్ 17 గుర్రపు బండ్ల (విక్టోరియాలు మరియు టోంగాలు) దళానికి యజమాని. ఆయనకి మొత్తం 7 మంది పిల్లలు. ఇష్రత్ మూడవ సంతానం. ఢిల్లీలోని మిషన్ గర్ల్స్ ఉర్దూ పాఠశాలకు చెందిన మహిళా విద్యార్థులను రవాణా చేయడం ఆయన కాంట్రాక్ట్ తీసుకున్న బాధ్యత. ఇష్రత్‌, ఆమె సోదరీమణులు ఆఫ్రోజ్, రోషన్‌లు ఈ పాఠశాలలోనే చదివేవారు. వీరితో పాటు నసీమ్ బానో (అసలు పేరు రోషన్; నటి, సైరా బానో తల్లి) కూడా అక్కడే చదివేవారు.

ఇష్రత్ అక్క రోషన్ జెహాన్ ధైర్యసాహసాలు గలది. ఆమె ఒక ఫిల్మ్ స్టూడియోతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తన ఫోటోను పంపింది. వారు ఆమెకు నెలకు రూ.300ల జీతంతో ఉద్యోగం ఇస్తామని తిరిగి రాశారు. వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియగా, మొదట ఆమెను మందలించి తిట్టారు. కానీ, ఆ సమయంలో, జూదమాడే అలవాటు కారణంగా, ఆయన అప్పుల్లోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నారు, దాంతో, తన కుమార్తెలు సినిమా తారలుగా తన కోసం డబ్బు సంపాదించవచ్చని భావించారు.

ఇష్రత్‌ సుమారు 12–13 సంవత్సరాల వయస్సులో, ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు, ఆమె తండ్రి ఆమెని, రోషన్‌ని సినిమాల్లో పని కోసం పూనాకు తీసుకువచ్చారు. టాకీ సినిమాలు ప్రారంభమవుతున్న రోజులవి. చిత్రనిర్మాతలు ఉర్దూ/హిందీలో అనర్గళంగా మాట్లాడగల అందమైన అబ్బాయిలు, అమ్మాయిల కోసం వెతుకుతున్నారు. ఈ సోదరీమణులకు దాదాసాహెబ్ తోర్ణే గారి సరస్వతి సినీటోన్‌లో పని దొరికింది. ఇష్రత్‌కి ఇందురాణి అనీ, రోషన్‌కు సరోజిని అని పేరు మార్చారు. ఆ రోజుల్లో, చాలా మంది ముస్లిం కళాకారులు ఏవో కారణాల వల్ల హిందూ పేర్లను పెట్టుకున్నారు. పూనాలో ఉన్నప్పుడు, సోదరీమణులు నెలకు రూ. 300/- జీతం పొందేవారు. సోదరీమణులను వారి అమ్మమ్మ సంరక్షణలో ఉంచి, వారి తండ్రి మూడు నెలల ముందస్తు చెల్లింపులు తీసుకొని ఢిల్లీకి వెళ్లిపోయారు. పూనాలో, వారు సహనటుడు వసంతరావు పెహెల్వాన్ (తరువాత మాస్టర్ భగవాన్ స్టంట్ చిత్రాలలో విలన్ పాత్రలు పోషించారు) తో స్నేహం చేశారు. వారు ఆయనని ‘మామాజీ’ అని పిలిచేవారు.

ఇందురాణి మొదట మరాఠీ చిత్రం ‘సావిత్రి’లో చెల్లెలిగా చిన్న పాత్రలో నటించింది. దురదృష్టవశాత్తు దాదాసాహెబ్ తోర్ణే నటించిన మరాఠీ చిత్రం పరాజయం పాలయై, వారి స్టూడియో మూసివేయాల్సొచ్చింది. ఉద్యోగ అవకాశాల కోసం ఆ సోదరీమణులు బొంబాయికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వసంతరావు పెహెల్వాన్ వారికి బొంబాయిలోని దాదర్ హిందూ కాలనీలో అద్దెకు ఒక ఫ్లాట్ ఇప్పించారు.

బొంబాయిలో ఉండగా, ఇందురాణికి దర్యాణి ప్రొడక్షన్స్ వారి ఫిదా-ఇ-వతన్ (1936), ప్రతిమ (1936), బుల్‌డాగ్ (1937), ఇన్సాఫ్ (1937) వంటి చిత్రాలలో పని లభించింది. ప్రతిమ మరియు ఇన్సాఫ్ సినిమాలు చేస్తున్నప్పుడు, ఆమె తన అందమైన సహనటుడు ప్రేమ్ అదీబ్‌తో ప్రేమలో పడింది. అయితే, తన కుటుంబానికి వ్యతిరేకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి అతను తగినంత ధైర్యం చేయలేడని స్పష్టమైనప్పుడు (అతను ఒక హిందూ కాశ్మీరీ పండిట్, ఆమె ఒక ముస్లిం), ఆమె సంబంధాలను కొనసాగించడానికి నిరాకరించింది. ఆమె నిజంగా చాలా దృఢమైన మహిళ.

త్వరలోనే ఇద్దరు సోదరీమణులు నటనకి అందుబాటులో ఉన్నారని వార్త వ్యాపించింది. ఆ సోదరీమణులకు బొంబాయిలో పెద్దగా ఏమీ తెలియదు, ఎక్కడికీ వెళ్ళలేరు. కాబట్టి నిర్మాతలే వారి వద్దకు వచ్చారు. మొదట వి. శాంతారాం, ఇందురాణికి నెలకు 300 రూపాయలకు ఉద్యోగం ఇచ్చారు. ఆమె తన అక్కకి, ‘మామాజీ’కి కూడా పని ఇప్పించాలని పట్టుబట్టింది. శాంతారాం సరోజినికి అవకాశం ఇవ్వడానికి అంగీకరించారు కానీ వసంతరావు పెహెల్వాన్‌ను నిరాకరించారు, దాంతో ఆ ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత ‘మామాజీ’ వెళ్ళిపోయారు. ఒకరోజు సోహ్రాబ్ మోడీ, కేకి మోడీ వారిని వెతుక్కుంటూ వచ్చారు. సోహ్రాబ్ మోడీ వారికి నెలకు 450 రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి స్టూడియోకి ఆహ్వానించారు. వారు మినర్వా మూవీటోన్ చేరుకున్నప్పుడు, అక్కడ లీలా చిట్నిస్ ఓ లాంగ్ హోల్డర్‌తో ధూమపానం చేయడం చూశారు. యువ ఇందురాణికి అది నచ్చింది, దాంతో లీలా చిట్నిస్ లానే చేయడానికి ప్రయత్నించగా; ఆమెను తన కూతురిలా చూసుకున్న సోహ్రాబ్ మోడీ- ఆమెకది సరిపోదని చెప్పడంతో ఆమె మానుకున్నారు.

ఒకరోజు మోహన్ పిక్చర్స్ కు చెందిన రామ్నిక్ లాల్ షా, అతని స్నేహితుడు నానాభాయ్ భట్ (మహేష్, ముఖేష్ భట్‌ల తండ్రి) ఫోన్ చేశారు. ఆ సమయానికి నానాభాయ్ భట్ తన స్టార్ నటి షిరిన్ బానోతో సంబంధం పెట్టుకున్నారు. రామ్నిక్ లాల్ వారికి నెలకు 500 రూపాయల జీతం ఇస్తానన్నారు, ఇది మినర్వా సంస్థ కంటే ఎక్కువ, కాబట్టి ఆ ఆఫర్‌ని అంగీకరించారు సోదరీమణులు. ఈ ప్రక్రియలో ఇందురాణి మినర్వా వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలో పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. వారి పాత పాఠశాల నేస్తం నసీమ్ బానో మినర్వాలో ఉన్నారు, మినర్వా నిర్మించిన ‘పుకార్’ (1939) చిత్రంలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించారు. ఆ సోదరీమణులకు సలహా ఇవ్వడానికి ఎవరూ లేరు, కాబట్టి వారు ప్రభాత్ సంస్థలోనూ, మినర్వాలో అవకాశాలను కోల్పోయారు. ఆ విధంగా 1938 నుండి, రామ్నిక్ లాల్ షా వారిని తన అధీనంలోకి తీసుకున్నాడు.

1939లో 17 సంవత్సరాల వయసులో ఇందురాణి రామ్నిక్ లాల్ షాను రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆమె అక్క సరోజిని కూడా మోహన్ పిక్చర్స్ ప్రధాన దర్శకుడు నానుభాయ్ వకీల్‌ను వివాహం చేసుకున్నారు (అజ్రా వారి కుమార్తె). ఇందురాణికి ఆరుగురు పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు పుట్టుకతోనే మరణించారు. ఆ ఘటన ఆమెకు చాలా బాధ కలిగించింది. 1943 తర్వాత, ఆమె కెరీర్ మందగించడం ప్రారంభమైంది. 1949 నాటికి, ఆమె చివరి చిత్రం విడుదలైంది.

ఇందురాణి గట్టి సంకల్పం ఉన్న మహిళ. ఆ రోజుల్లో, ఆమె వయస్సు ప్రకారం చూసినా కూడా, ఆమె ఆదర్శప్రాయమైన ప్రణాళికని, దూరదృష్టిని కలిగి ఉన్నారు. భవిష్యత్తు కోసం సరైన ప్రాధాన్యతలను ఎంచుకున్నారు. విద్యావంతుల కుటుంబం నుండి వచ్చిన ఆమెకి, విద్య ప్రాముఖ్యత తెలుసు. తన పిల్లలందరూ సౌకర్యవంతమైన జీవితాలను గడపడానికి వీలుగా సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను పొందేలా చూసుకున్నారు. ఆమె పిల్లలు శాంతా క్రూజ్‌లోని ప్రతిష్ఠాత్మక మిషనరీ పాఠశాల ది సేక్రేడ్ బాయ్స్ హై స్కూల్‌లో చదివారు. సైరా బానో సోదరుడు సుల్తాన్, శశధర్ ముఖర్జీ కుమారులు రోనో, జాయ్, దేబు,  షోము ముఖర్జీ, అలాగే మిలన్ రాయ్ చౌదరి (గీతా దత్ తమ్ముడు) కూడా అదే పాఠశాలలో చదువుకున్నారు. ఆమె పిల్లలందరూ యునైటెడ్ స్టేట్స్‌లో విజయవంతంగా స్థిరపడ్డారు.

ఆమె జీవితంలోని మూడు ప్రాథమిక అంశాలను అర్థం చేసుకున్నారు: కూడు, గుడ్డ, ఇంకా నీడ. ఆమె డబుల్ షిఫ్టులలో పనిచేశారు, 1940లో (సుమారు 18 సంవత్సరాల వయస్సులో) శాంతా క్రూజ్ (బొంబాయి పశ్చిమ శివారు)లో తన సొంత బంగళాను నిర్మించుకోవడానికి తగినంత డబ్బును ఆదా చేశారు! ది టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక, మొదటి పేజీ కథనంలో, ఆమెను ఆ రోజుల్లో బొంబాయిలో అతి పిన్న వయస్కురాలైన ఇంటి యజమానిగా పేర్కొంది. ఆ ఇంటిని ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ నూరానీ డిజైన్ చేశారు.

ఆమె తన జీవితపు చివరి రోజులు సంతోషంగా గడవడానికి తగినంత డబ్బు ఆదా చేశారు. ఆమె తన చివరి 35 సంవత్సరాలు అమెరికాలో గడిపారు, తన మొత్తం కుటుంబంతో జీవితాన్ని ఆస్వాదించారు. అదే సమయంలో పేదరికం వల్లా, నిర్లక్ష్యం వల్లా మరణించిన వందలాది కళాకారుల గాథలు మనకు తెలుసు!

ఇందురాణి సోదరుడు నసీమ్ సిద్ధిఖీ మోహన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రాల నిర్మాత మరియు దర్శకుడు. అతని స్నేహితుడు హసన్ సెహ్రాయ్ సంభాషణల రచయిత; ‘కహ్కాషన్’ అనే సినిమా మ్యాగజైన్‌కు సంపాదకుడు. గేయ రచయిత షెవాన్ రిజ్వి కూడా అతని స్నేహితుడే. నసీమ్ సిద్దిఖీ చెల్లెలు షిరిన్ హసన్ సెహ్రాయ్‌ను వివాహం చేసుకుంది. ఇందురాణి సోదరి సరోజిని (రోషన్ జెహాన్) అదే సమయంలో సినిమాల్లో పనిచేసింది.  హిందీ సినిమా గీత్ కోష్ (HFGK) ప్రకారం ఆమె దాదాపు 17 చిత్రాలలో పనిచేశారు, కొన్ని పాటలు పాడారు. సరోజిని, ఇందురాణి మూడు చిత్రాలలో కలిసి నటించారి, అవి జాదుయి కంగన్ (1940), హతిమ్ తాయ్ కి బేటీ (1940), తాజ్ మహల్ (1941).

హిందీ సినిమా గీత్ కోష్ ప్రకారం, ఇందురాణి 21 (1 మరాఠీతో సహా) చిత్రాలలో నటించారు. ఆమెను ఇందు, ఇందురాణి, ఇందుబాల అని కూడా వివిధ పేర్లతో వ్యవహరించారు. అయితే మరొక ఇందుబాల కూడా ఉంది, కానీ ఆమె కలకత్తాలో కలకత్తా నిర్మాతలు నిర్మించిన చిత్రాలలో పనిచేసింది. ఆ చిత్రాలను హిందీ సినిమా గీత్ కోష్ యొక్క ఈ జాబితా నుండి మినహాయించారు.

ఇందురాణి తన కాలంలోని అనేక మంది ప్రసిద్ధ హీరోలతో కలిసి పనిచేశారు, ప్రేమ్ అదీబ్, జయంత్, జీవన్, యాకూబ్, ముబారక్, సుశీల్ కుమార్, యూసుఫ్ ఎఫెండి, నజీర్, నవీన్ యాగ్నిక్, యశ్వంత్ దవే మొదలైనవారు ముఖ్యులు. జి.ఆర్. సేథి, రామ్ దర్యాణి, ద్వారకా ఖోస్లా, జె.పి. అద్వానీ, కె. అమర్‌నాథ్, మోహన్ సిన్హా, మరియు నానుభాయ్ వకీల్ వంటి మంచి దర్శకులు ఆమె చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె దర్యాణి ప్రొడక్షన్స్‌లో పనిచేస్తున్నప్పుడు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు, ఈ నేపథ్యంతో, ఆమె ఈ మూడు చిత్రాలలో ఒక్కో సినిమాకి రెండేసి పాటలు పాడారు. ఆమె అనిల్ బిశ్వాస్ ఆధ్వర్యంలో నాలుగు పాటలు, మధోలాల్ మాస్టర్ ఆధ్వర్యంలో రెండు పాటలు పాడారు.

రామ్నిక్‌ లాల్ షా, ఇందురాణి ఇద్దరూ చాలా ఉదార స్వభావులు. అవసరమైనవారికి ఎంతో సహాయం చేసేవారు. బాలనటి మీనా కుమారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె తండ్రి రామ్నిక్‌భాయ్ సాయం కోరగా, ఆయన ఆలోచించకుండా 5000 రూపాయలు ఇచ్చి; తిరిగి ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. మీనా కుమారి ఈ దయగల చర్యను ఎన్నడూ మర్చిపోలేదు. రామ్నిక్ భాయ్‌ని ఎల్లప్పుడూ గౌరవించేది.

నటి నిర్మలా దేవి ఇందురాణికి స్నేహితురాలు, ఆమె భర్త అరుణ్ అహుజా (నటుడు గోవింద తండ్రి) ఆమెకి ‘రాఖీ సోదరుడు’. అహుజా కుటుంబం ఆర్థికంగా కుదేలయినప్పుడు, రెండు నెలల పాటు వారి నెలవారీ ఖర్చులను ఇందురాణి భరించారు. తరువాత అహుజాలు జుహులోని తమ ఇంటిని అమ్మేసి విరార్‌కు మారారు, కానీ వారు మొత్తం డబ్బును ఇందురాణికి తిరిగి ఇచ్చేశారు. దర్శకుడు-నిర్మాత-నటుడు నజీర్, అతని భార్య, నటి స్వర్ణలత (రావల్పిండికి చెందిన సియల్ జాట్ సిక్కు) విషయంలో దీనికి విరుద్ధంగా జరిగింది. వారు తమ రోల్స్ రాయిస్‌ కారులో ఇందురాణిని సందర్శించారు, ఆమె నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా, కొన్ని రోజుల్లోనే, చడీ చప్పుడూ లేకుండా పాకిస్తాన్‌కు వలస వెళ్లారు.

1960ల ప్రారంభంలో, ఇందురాణి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయారు, ఆపై అందరూ అమెరికాలో స్థిరపడ్డారు. రామ్నిక్‌భాయ్ షా 1973లో మరణించారు. తరువాత ఇందురాణి కూడా అమెరికాకు వెళ్లి తన కుమారులతో కలిసి ఉన్నారు. ఆమె పన్నెండు మంది మనవరాళ్ళు మరియు ఆరుగురు మునిమనవళ్లతో సంతోషంగా గడిపారు. ఫలవంతమైన, సంతృప్తికరమైన జీవితం తర్వాత, ఫిబ్రవరి 17, 2012న 90 సంవత్సరాల వయసులో ఇందురాణి అమెరికాలో మరణించారు. ఆమె సమాధి కాలిఫోర్నియాలోని కామరిల్లో పట్టణంలోని వెంచురా కౌంటీలో ఉంది.

Exit mobile version