సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
ట్రావెన్‍కోర్ సిస్టర్స్:
తర్వాతి కాలంలో ‘ట్రావెన్‍కోర్ సిస్టర్స్’గా పేరుపొందిన ముగ్గురు సోదరీమణుల కథ ఇది.
ఈ సోదరీమణులు శాస్త్రీయ నృత్యకారులుగా మరియు సినిమాల్లో నాట్యగత్తెల్లా, నటీమణుల్లా చురుకైన జీవితాన్ని గడిపారు. వారు మలయాళం, తమిళం మాత్రమే కాకుండా కన్నడ, తెలుగు, హిందీ సినిమాలలో కూడా నటించారు. వారు ఆ కాలంలోని అగ్ర హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జెమిని గణేషన్, ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ వంటి వారితో కలిసి నటించారు.
పద్మిని నటించిన ప్రముఖ హిందీ చిత్రాలలో రాజ్ కపూర్‍తో కలిసి నటించిన ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ (1960), ఇంకా అంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం ఆయన తండ్రి పృథ్వీరాజ్ కపూర్‌తో కలిసి ఇండో-రష్యన్ సహకారంతో నిర్మించిన ‘పరదేశి’ ఉన్నాయి. రష్యన్లు ‘మేరా నామ్ జోకర్’ లో పద్మిని నటనకు ఎంతగానో ముగ్ధులయ్యారు, 1971 లో ఆమె గౌరవార్థం ఆమె స్టాంపును విడుదల చేశారు. భరతనాట్యం కళాకారులుగా, తెరపై కథానాయికలుగా ముగ్గురు సోదరీమణులలో ప్రతి ఒక్కరి గురించి మరియు వారి వ్యక్తిగత విజయాల గురించి మనం ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు.
ట్రావెన్‌కోర్ సోదరీమణులు అనేక పెద్ద ఉత్సాదనల ప్రచార ప్రకటనలలో నటించారు. లక్స్ నుండి ఎయిర్ ఇండియా వరకు, అనేక ఇతర పెద్ద బ్రాండ్‌ల వరకు, ఆ దశాబ్దాలలో వారు అనేక ప్రకటనలు ప్రచారం చేశారు. అయితే, వారి వ్యక్తిగత జీవితాల్లో ఏదీ సరిగ్గా లేదు. రాగిణి భర్త మాధవన్ తంపి ఆమె కంటే ఒక దశాబ్దం చిన్నవాడు. తాగుబోతు, జూదగాడు, స్త్రీలోలుడు, దండగమారి భర్త అయిన అతను రాగిణితో తరచూ దెబ్బలాడేవాడు, దీని వలన ఆమెకు వ్యక్తిగతంగా ఎంతో వేదన కలిగింది. దీనికి తోడు 1971లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత పరిస్థితి దిగజారింది. రాగిణి 1976లో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది. వెండితెరపై ఆమె సమకాలీనులు – మధుబాల, మీనా కుమారి, గీతా బాలి లానే ఆమెకు కూడా నలభై సంవత్సరాలు నిండలేదు.
వారి విస్తృత కుటుంబంలో శోభన, వినీత్ వంటి నటులు, నృత్యకారులు ఉన్నారు. చాలా మంది నటులు, నృత్యకారులు మరియు కథానాయికలు కేరళ నుండి ఉద్భవించి పేరు సంపాదించారు. కానీ ట్రావెన్‌కోర్ సోదరీమణులు ఒకప్పుడు చూపిన విధంగా ఆకర్షణీయమైన, శక్తివంతమైన ప్రభావాన్ని ఎవరూ చూపలేదు.
***
శోభా వారియర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్యూలో పద్మినికి తమ గురించి ఇలా చెప్పారు: ట్రావెన్‍కోర్ సోదరీమణులు సినిమాల్లోకి ప్రవేశించడం అనుకోకుండా జరిగింది, మా మామ ఒకరు ముంబైకి వెళ్ళినప్పుడు ప్రఖ్యాత నృత్యకారుడు ఉదయ్ శంకర్‌ను విందుకు ఆహ్వానించారు. ఉదయ్ శంకర్ తాను నృత్యం ఆధారంగా నిర్మించాలనుకుంటున్న చిత్రంలో నటించడానికి మమ్మల్ని మద్రాస్‌కు పిలిపించాడు.
అలా 14 ఏళ్ల వయసులో నేను నటిగా మారాను. నా తొలి తమిళ చిత్రం ‘మనమగల్’ పెద్ద హిట్ అయింది, నేను తమిళంలో హిట్ అయ్యాను. నా సోదరీమణులు మలయాళ చిత్రాలపై మాత్రమే దృష్టి పెట్టారు, నేను తమిళంలో ఎక్కువగా నటించాను. అయితే మలయాళ చిత్రం ‘అధ్యాపిక’ (టీచర్) లో టీచర్ పాత్ర పోషించాను. ఈ సినిమా త్రివేండ్రంలో కేవలం 13 రోజుల్లో పూర్తయింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది”.
సంభాషణని కొనసాగిస్తూ, “మేము ఒకే వృత్తిలో ఉన్నందున ఆ రోజుల్లో మా అక్కచెల్లెళ్ళం చాలా బాగా గడిపాము. మేము సినిమాల్లో నటించేవాళ్ళం, వేదికపై నృత్యం చేసేవాళ్ళం. మేము డాన్సర్స్ ఆఫ్ ఇండియా అనే బృందాన్ని ఏర్పాటు చేసాము” అని జోడించారు.
ఆ నృత్య బృందంలో ముగ్గురు సోదరీమణులు మాత్రమే కాకుండా వారి బంధువులైన సుకుమారి, అంబిక కూడా ఉన్నారు, ఆ ఇద్దరూ మలయాళంలో ప్రసిద్ధ నటీమణులు. (నిజానికి, సుకుమారి సినిమాల్లో నటిస్తారు, కానీ నృత్యం అంటే వారికి చాలా ఇష్టం, సినిమాలు ముఖ్యం కాదు) వారు సినిమాల్లో ప్రదర్శించినవి – పాములవారు, కృష్ణ లీల, రాధాకృష్ణుల కథ మొదలైనవి – రంగస్థలం నుండి నేర్చుకున్నారు. వారు తమ బృందంతో ప్రపంచమంతా తిరిగేవారు. వారి ప్రసిద్ధ నృత్య నాటకాలలో ఒకటైన రామాయణంలో, పద్మిని సీతగా, ఆమె చెల్లెలు రాగిణి రాముడిగా నటించారు. పెద్దామె లలిత రావణుడిగా, సుకుమారి హనుమంతుడిగా, అంబిక భరతుడిగా నృత్యం చేశారు.
“పొడవైనది కావడంతో, రాగిణి ఎల్లప్పుడూ పురుష పాత్రలను పోషించేది. నేను అందరికంటే పొట్టి కాబట్టి, అన్నిటిలోనూ మహిళా ప్రధాన పాత్రను పోషించాను.” చెప్పరామె.
“నేను ఎక్కువగా విషాద పాత్రలను పోషించేదానిని. రాగిణి హాస్య పాత్రలలో, లలిత పిశాచ పాత్రలలో బాగా నటించేవారు.”
ఆ తర్వాత పద్మిని – తాము సినీరంగంలో మెరిసిన 1940లను 1990ల నాటి పరిస్థితులతో పోల్చారు. “అప్పటికి, నేటి కాలానికి మధ్య పెద్దగా తేడా లేదు. సాంకేతికంగా సినిమాలు చాలా మెరుగుపడ్డాయి. ఆ రోజుల్లో, మేము ఒకసారి ఒక సినిమాపై మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళం. మేము పూర్తి స్క్రిప్ట్ చదివి, అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన దర్శకుడితో చర్చించేవాళ్ళం. ఆ రోజుల్లో చాలా మంది దర్శకులు స్టూడియో యజమానులు, వారే నిర్మాతలు.”
తన గొంతు హస్కీగా ఉన్నప్పటికీ, ఆమె తన అన్ని చిత్రాలలో స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. “నేను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించేదానిని. నాకు ఏ భాషలోనూ డబ్బింగ్ చెప్పించే అవసరం రాలేదు. దాని కోసం, మీరు చాలా కష్టపడాలి. ఏ డబ్బింగ్ ఆర్టిస్టు కూడా మీరు తెరపై చేసే దానికి పూర్తి న్యాయం చేయలేరని నేను నమ్ముతాను. నేటి నటీమణులు తమ స్వరాన్ని డబ్బింగ్ చేయడానికి ఎందుకు అంగీకరిస్తారో నాకు అర్థం కావడం లేదు. సమయం లేకపోవడమా? లైన్స్ నేర్చుకోవడానికి సోమరితనమా? మేము మూడు షిఫ్టులలో పని చేసేవాళ్ళం కానీ మేకప్ చేసేటప్పుడు, డైలాగ్ రైటర్ మాకు లైన్స్ చదివి వినిపించేవాడు. అలా మేము లైన్స్ నేర్చుకున్నాము.” అన్నారామె.
సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌కి మారినప్పుడు మేకప్ ఎలా మారుతుందో కూడా ఆమె చెప్పుకొచ్చారు. “నా మొదటి కలర్ చిత్రం తమిళంలో ‘వల్లి’. మేకప్ రంగులో పూర్తిగా భిన్నంగా ఉండేది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, మేము షేడ్స్ ఉన్న డార్క్ మేకప్ వేసుకునేవాళ్ళం, కానీ కలర్ సినిమాలలో, అది గులాబీ రంగులో, ప్లెయిన్‌గా ఉండేది.”
***
1952లో పద్మిని ‘కల్పన’ అనే చిత్రంలో నృత్యం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ ఆమెకు పూర్తి నిడివి పాత్ర ‘మిస్టర్ సంపత్’ (ఈ చిత్రం ఆర్.కె. నారాయణ్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది) లో మోతీ లాల్ సరసన లభించిది. ‘మిస్టర్ సంపత్’ను మొదట తమిళంలో పుష్పవల్లి (రేఖ తల్లి) తో నిర్మించారు, హిందీలో ఆ పాత్రను పద్మిని పోషించారు.
నర్గీస్ ఆర్కే స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అందులో చేరిన మొదటి నటి పద్మిని. ఆ సోదరీమణులు నర్గీస్‌కు, రాజ్ కపూర్ కు 1953 నుండి తెలుసు. బొంబాయి, మద్రాస్ సినీ తారల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో వారు నర్గీస్‌ను కలిశారు. పద్మిని మద్రాస్ తరపున అత్యధిక స్కోరు సాధించగా, నర్గీస్ బొంబాయి తరపున అదే చేశారు. ఆ రోజు నుండి, ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.
నర్గీస్, రాజ్ కపూర్ మద్రాసులో ‘చోరీ చోరీ’ షూటింగ్ కోసం వచ్చినప్పుడు, పద్మిని తల్లి వారికి ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు, అది ఆ సోదరీమణులు నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉండేది. కాబట్టి వారు ప్రతిరోజూ కలుసుకునేవారు. నర్గీస్ పద్మిని షూటింగ్‌కు వెళ్లేవారు, పద్మిని – సెట్స్‌లో నర్గీస్‌ను చూడటానికి వెళ్లేవారు. కానీ పద్మిని కంటే, ఆమె చెల్లెలు రాగిణి నర్గీస్‌తో సన్నిహితంగా ఉండేవారు.
1957లో, లలిత వివాహం చేసుకుని సినిమాలు మానేసి త్రివేండ్రంలో స్థిరపడ్డారు. 1961లో, పద్మిని డాక్టర్ రామచంద్రన్‌ను వివాహం చేసుకున్నారు. 1970లో, వారు అమెరికాకు వలస వెళ్లారు.
1996 నాటికి పద్మిని తప్ప, లలిత, రాగిణి ఇద్దరూ లేరు.
***
“నేను వారిని చాలా మిస్ అవుతున్నాను” అని అన్నారు పద్మిని. “ఒకసారి లలిత అమెరికాకు వచ్చినప్పుడు, 23 సంవత్సరాల తర్వాత ఆమెను వేదికపై నృత్యం చేయించాను. మేము చికాగోలో కలిసి ప్రదర్శన ఇచ్చాము. రాగిణి వచ్చినప్పుడు, మేము కలిసి వేదికపై ప్రదర్శన ఇచ్చాము. అవి మరపురాని క్షణాలు.” అన్నారామె.
1992లో, వారి మేనకోడలు, నటి శోభన, పద్మినిని చూడడానికి వచ్చినప్పుడు, వారు ‘వల్లి తిరుమణం’ నృత్య-నాటకాన్ని ప్రదర్శించారు. శోభన వల్లి కాగా, పద్మిని, మురుగన్.
దివంగత జి. అరవిందన్ చివరి చిత్రం, ‘వాస్తుహార’ (మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్ర పోషించారు) లో పద్మిని చిన్న పాత్ర పోషించింది. ఆమె అరవిందన్ చిత్రంలో ఎలా నటించిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. “నా కొడుకు అరవిందన్‌ను కలవడానికి వెళ్ళాడు. అరవిందన్ తాను తీసున్న ‘వాస్తుహార’లో నటిస్తారా అని నన్ను అడిగాడు. నేను అతని గురించి చాలా విన్నాను కాబట్టి అతనితో కలిసి పనిచేయాలని కోరుకున్నాను, వెంటనే ఆ పాత్రను అంగీకరించాను. అతను సెట్స్‌లో అరుదుగా మాట్లాడేవాడు. మాకు ఏదైనా చెప్పాలనుకుంటే, మా దగ్గరికి వచ్చి చాలా తక్కువ స్వరంలో చెప్పేవాడు. అతను మా నటనలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. కొంతమంది దర్శకులు చాలా గొడవ చేస్తారు. కానీ అరవిందన్ చాలా భిన్నంగా ఉన్నాడు మరియు నేను ఆ అనుభవాన్ని ఆస్వాదించాను.”
తాను నటించిన నటుల్లో శివాజీ గణేషన్, రాజ్ కపూర్‌లు తనకు అత్యంత ఇష్టమైనవారని ఆమె అన్నారు. దక్షిణాదిలో పని చాలా క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ఉండేదని, ముంబైలో ప్రతిదీ ఆలస్యంగా ప్రారంభమవుతుందని ఆమె అన్నారు. “శివాజీ కూడా గంట ముందుగానే లొకేషన్‌కు చేరుకునేవారు. ఆయన అనుసరించిన క్రమశిక్షణ అలాంటిది” అని ఆమె అన్నారు.
“నా విజయాన్ని, ఆనందాన్ని నేను దేవునికి ఆపాదిస్తాను. దేవుడు లేకుండా ఏమీ లేదు.” అన్నారామె, కీర్తి ఆమెను ప్రభావితం చేసినట్లు లేదు.
“ఇదంతా ఒక వ్యక్తి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది,” అని ఆమె సమాధానమిస్తుంది. “మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణతో పెంచింది. మేము పాటించాల్సిన “లక్ష్మణ రేఖ” ఉండేది. అమ్మ ట్రావెన్‌కోర్ నుండి ఒక వింత ప్రదేశానికి (మద్రాస్) వచ్చి, మమ్మల్ని అందరినీ స్టార్‌లుగా చేసి, మాకు పెళ్లిళ్లు కూడా చేసింది.. అన్నీ పెద్దలు కుదిర్చిన వివాహాలే. ఉత్తమ కుటుంబాల సంబంధాలే.
“మీ వారు మీకు మద్దతు ఇచ్చి, అర్థం చేసుకున్నారా?” అన్న ప్రశ్నకు, “మాది చాలా సంతోషకరమైన వివాహం,” అని ఆమె చెప్పారు. “నా భర్తను నేను చాలా మిస్ అవుతున్నాను. ఆయన సెప్టెంబర్ 16, 1981న మరణించారు. ఆయనకి కళలంటే బాగా ఇష్టం. చాలా బాగా పాడగలరు. నా నృత్య ప్రదర్శనల సమయంలో నా భర్త మొదటి వరుసలో కూర్చునేవారు. ఆయన నా ఉత్తమ విమర్శకుడు” చెప్పారు పద్మిని.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
