Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 306

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కమల్ ఘోష్:

కమల్ ఘోష్ (1910-1983) భారతీయ సినీ పరిశ్రమలో పేరెన్నికగల సినిమాటోగ్రాఫర్, దర్శకుడు.

ఆయన కోల్‌కతాకు చెందినవారైనా, దక్షిణ భారత సినిమాలపై అమిత ప్రభావం చూపారు. లెన్స్, లైట్ మాస్టర్ అయిన కమల్ ఘోష్ గారిది సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా విశిష్టమైన కెరీర్‌.

చంద్రలేఖ (1948) సినిమాతో చరిత్ర సృష్టించడమే కాకుండా, ‘పరోపకారం’ (1953) వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు, అనేక విజయాలను సాధించారు.

కమల్ ఘోష్ – ప్రఖ్యాత చిత్రనిర్మాత, రచయిత, నటుడు దేబకి బోస్ గారి మేనల్లుడు. ప్రసిద్ధుడైన తన మేనమామ వద్ద కోల్‌కతాలోని న్యూ థియేటర్స్‌లో చిత్రనిర్మాణంలోని వివిధ అంశాలలో శిక్షణ పొందారు ఘోష్.

న్యాయవాది నుండి చిత్రనిర్మాతగా మారిన కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కారణంగా ఘోష్ దక్షిణాదికి వచ్చారు. ప్రముఖ దర్శకుడు ఆర్.ప్రకాష్ దర్శకత్వంలో జూపిటర్ పిక్చర్స్ నిర్మించగా విజయవంతమైన ‘అనాథై పెన్’ (1938) చిత్రానికి ఆయన సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో నాయికానాయకులు ఎం.కె. రాధా, టి.ఎ.సుందరంబాల్. ఈ సినిమాలో ఘోష్ ఫోటోగ్రఫీ, ముఖ్యంగా లైటింగ్ చాలా ప్రశంసలు పొందింది.

కె. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ‘కచ దేవయాని’ (1941),  సినిమాటోగ్రాఫర్‌గా ఘోష్‌కు మరో హిట్ అందించింది. ఆయన హీరోయిన్ టి.ఆర్. రాజకుమారిని స్లీవ్‌లెస్ బ్లౌజులలో చిత్రీకరించిన విధానం ఆనాటి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది; ఆమెను దక్షిణ భారత సినిమాకు తొలి సెక్స్ సింబల్ గా మార్చింది.

ఘోష్ కెరీర్‌లో అత్యంత కీర్తిని సంపాదించినది జెమినీ స్టూడియోస్  నిర్మాణంలో ఎస్.ఎస్. వాసన్ నిర్మాతాదర్శకుడిగా రూపొందించిన కళాఖండం ‘చంద్రలేఖ’లోని సుప్రసిద్ధ డ్రమ్ డ్యాన్స్ సీక్వెన్స్. 1940లలో ఐదు లక్షల రూపాయల ఖరీదు చేసిన ఈ డ్యాన్స్ సీక్వెన్స్‌ను చాలా మంది పొరపాటుగా మరొక కెమెరా మాంత్రికుడు కె. రామ్‌నాథ్‍కు ఆపాదిస్తారు. కానీ ఈ డ్రమ్ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరించబడటానికి ముందే రామ్‌నాథ్ జెమినీ స్టూడియోస్‌ను విడిచిపెట్టారు. కాబట్టి ఈ ఘనత అంతా కమల్ ఘోష్‌కే చెందుతుంది.

ఆనాటి తెలుగు సినిమా అగ్రతార పసుపులేటి కన్నాంబ, ఆమె భర్త కడారు నాగభూషణంతో ఘోష్ మంచి స్నేహం ఉంది. తమిళం, తెలుగు భాషలలో వారి చిత్రాలకు ఘోష్ కెమెరామెన్‌గా పనిచేశారు.

జెమిని స్టూడియోస్‌తో పని చేసిన కాలంలో కమల్ ఘోష్ – ఎ. విన్సెంట్, సివి రామకృష్ణన్ (తంబు), సి. ఎల్లప్ప వంటి అనేక మంది అగ్రశ్రేణి కెమెరామెన్‌లకు శిక్షణ ఇచ్చారు.

ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సినిమా క్రెడిట్లలో ఆయన పేరు ‘కమాల్’ (హిందీలో దీని అర్థం ఘనత/అద్భుతం) ఘోష్ అని వ్రాస్తారు. తాను చేస్తున్నవి అద్భుతాలే కదా అని భావించారేమో, దానిని సరిదిద్దాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదట.

Exit mobile version