Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 307

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటి ముంతాజ్ శాంతి:

అలనాటి నటి ముంతాజ్ శాంతిని ‘జూబ్లీ గర్ల్’ అని పిలిచేవారు. ఆమె పదిహేడేళ్ల వయసులో భారతదేశమంతటా సినీ ప్రేక్షకులకు అభిమాన నటిగా మారారు. ఆమె కీర్తి నిచ్చెనపై అగ్రస్థానంలో నిలిచారు.

***

1954లో ఆమెను ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్ళిన విలేఖరి అందించిన వివరాలివి.

విలేఖరి వెళ్ళినప్పుడు ముంతాజ్ శాంతి – మేకప్ లేకుండా, గ్లామర్ లేకుండా, శివాజీ పార్క్‌లోని తన చక్కగా అలంకరించబడిన ఇంటి విశాలమైన డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని, ప్రశాంతంగా ఉండే పంజాబీ గృహిణి యొక్క అందమైన చిత్రాన్ని గీస్తున్నారు, ఒకప్పటి ‘వైభవ దినాల’ను విచారం లేదా చిన్నపాటి అసూయతో గుర్తుచేసుకున్నారు.

“నా అసలు పేరు ముంతాజ్. కానీ సినిమాల్లో నటించేందుకు నా పేరుని మార్చుకోవాలనుకోలేదు.” అని చెప్పారామె. “కాబట్టి నిర్మాత/దర్శకులు రాజీపడి నా పేరుకి చివర ‘శాంతి’ని జోడించారు, తద్వారా అది హిందూ-ముస్లిం ఐక్యత అవసరాన్ని సూచించేది!”

ముంతాజ్ బేగం పంజాబ్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే అనాథగా మారిన ఆమెను అత్త పెంచారు, ఆమె ఇంట్లో ఇంటి పనులు, వంట పనుల బాధ్యతను ఆమెకు నేర్పింది, తద్వారా ఆమె వివాహం చేసుకున్నప్పుడు, ఆ చిన్నారికి గృహనిర్వహణలో శిక్షణ లభించలేదని ఎవరూ అనలేరు.

అయితే, ఆమె మామ తన చిన్న మేనకోడలు ప్రసిద్ధి చెందాలని నిశ్చయించుకున్నాడు. ఆయన ఆమెను పాటలు, నాట్యం నేర్చుకోవాలని ప్రోత్సహించారు. తరువాతి కాలంలో ఆమెను లాహోర్‌లో నిర్మాత వల్లి గుర్తించి, సినీరంగంలో అడుగుపెట్టమని ప్రేరేపించారు.

1937లో, ముంతాజ్ తన మొదటి పంజాబీ చిత్రం ‘సోని కుమ్హరన్’లో నటించడానికి కలకత్తా వెళ్ళింది. ఆ చిత్రం రజతోత్సవం జరుపుకుంది, వృద్ధుడైన మామ తన ప్రతిభావంతురాలైన మేనకోడలు భవిష్యత్తు గురించి గతంలో కంటే ఎక్కువ కృతనిశ్చయతతో ఉన్నారు.

అయితే, ఆశయం కంటే సాంప్రదాయవాదానికే ఎక్కువ విలువిచ్చే ఆయన, ముంతాజ్ నిర్మాత వల్లిని వివాహం చేసుకుని, ఆ తర్వాత తన కెరీర్‌ను కొనసాగించడం సముచితమని భావించారు.

ఆ యువనటి ఆ ఆలోచనకే బెదిరిపోయారు. ఆ పెద్ద నగరం ఆమెను భయపెట్టింది, వేల రూపాయలు సంపాదించాలనే ఆలోచన ఆమెను అయోమయంలో పడేసింది. హృదయంలో, ఆమె ఇప్పటికీ ఇంటిని ఎలా చూసుకోవాలో, మంచి గృహిణిగా ఎలా ఉండాలో చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఓ మామూలు పల్లెటూరి అమ్మాయి మాత్రమే.

దాంతో, ఆమె శ్రీ వల్లిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి వల్లి, ఇంకా యుక్తవయస్సులోనే ఉన్నారు, ఆమె ప్రతిభావంతులైన భర్త మార్గదర్శకత్వంలో, పర్యవేక్షణలో పనిచేయడం కొనసాగించారు, ఆయన చిత్ర నిర్మాతగా ఉండటమే కాకుండా నగర ఆరోగ్య శాఖలో ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు.

ముంతాజ్ శాంతి రెండవ చిత్రం షోరే గారి ‘మాంగ్తి’. ఇది వజ్రోత్సవ వేడుక జరుపుకుని, దాని యువ తారకు వ్యక్తిగత విజయాన్ని అందించింది.

ఈ గొప్ప విజయం తర్వాత కొంతకాలానికి, ముంతాజ్ శాంతి హిందీ తెరపై అరంగేట్రం చేశారు.

పంజాబ్‌లో అత్యుత్తమ నృత్యకారిణిగా గుర్తింపు పొందిన ఆమె, నటి వీణ నటించిన ఒక చిత్రంలో ఒక నృత్య ప్రదర్శన ఇవ్వవలసి వచ్చింది. ఇది ‘అతిథి’ పాత్ర లాంటిది, ఎందుకంటే ముంతాజ్ శాంతి మొదటి నుండి తెరపై ఎల్లప్పుడూ ప్రముఖ మహిళ.

బాంబే టాకీస్‌లో అప్పట్లో అథారిటీగా పనిచేసిన దివంగత రాయ్ బహదూర్ చునీ లాల్, ముఖ్యంగా చిత్రంలో వీణ పనిని చూడటానికి లాహోర్ వెళ్ళాడు. కానీ అతను నిజంగా గమనించినది అందమైన ముంతాజ్ శాంతి నాట్యం చేస్తున్న పాదాలని, ఇంకా ఆమె సౌందర్యాన్ని.

హిందీ చిత్రాలలో నటించడానికి ఆమె తనతో పాటు బొంబాయికి తిరిగి రావాలని ఆయన పట్టుబట్టారు. అయితే, ఆమె భర్త ప్రయాణం చేయలేనంత బిజీగా ఉండటంతో, ఆమె విధి నిర్వహణకి ప్రాముఖ్యతనిచ్చి ఆ ప్రతిపాదనను తిరస్కరించారామె.

కానీ విధి మరో అవకాశం ఇచ్చింది. వలి సాహెబ్‌కు బొంబాయిలో చిత్రాలను నిర్మించే కాంట్రాక్ట్ లభించింది, 1941లో భార్యాభర్తలు కలిసి ముంతాజ్ శాంతి కీర్తి శిఖరాగ్రానికి చేరుకున్న ఈ ప్రధాన నగరానికి వచ్చారు. ‘బసంత్’, ‘కిస్మత్’ సినిమాలు తెరపై అత్యంత అద్భుతమైన రెండు విషయాలను గుర్తుచేస్తాయి. ‘కిస్మత్’లో ముంతాజ్ శాంతి, ఆమె అందమైన బ్యాలెట్ (“ఘర్ ఘర్ మే దివాళి హై, మేరే ఘర్ మే అంధేరా” అనే ప్రసిద్ధ పాటతో పాటు) పేరుతో చలనచిత్ర ప్రపంచం ప్రతిధ్వనించింది, సినీ అభిమానులు ఈనాటికీ ఈ పాటని, ఆమెను గుర్తుంచుకుంటారు.

రెండు సినిమాలు విడుదలైన ప్రతిచోటా జూబ్లీ వేడుకలు జరుపుకున్నాయి. కలకత్తాలోని రాక్సీ థియేటర్‌లో ‘కిస్మత్’ మూడు సంవత్సరాలు అద్భుతంగా ప్రదర్శితమైంది. మరియు, తన స్క్రీన్ పేరును సమర్థించుకున్నట్లుగా, ముంతాజ్ శాంతి హిందువులకు, ముస్లింలకు ఇద్దరికీ ఆదర్శంగా మారింది.

“నేటికీ నా అభిమానుల మెయిల్‌లో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి ‘బసంత్’, ‘కిస్మత్’ చిత్రాలలో నా పనిని గుర్తుచేసుకుంటూ లేఖలు వస్తున్నాయి, మరియు వారి అద్భుతమైన ప్రదర్శనల కారణంగా పాతకాలపు వారిని వారి అభిమానులు ప్రస్తుత తరం తారలుగా గుర్తుంచుకుంటారని నేను నమ్ముతున్నాను” అని ముంతాజ్ దృఢంగా చెప్పారు.

ఆసక్తిగల నిర్మాతలు ఆఫర్ చేసిన ఒప్పందాలతో ముంతాజ్ శాంతి అనేక చిత్రాలలో కనిపించారు, వాటిలో ‘బదల్తీ దునియా’, ‘సవాల్’ ‘భారతారి’, ‘దూస్రీ షాదీ’, ‘ఘర్-కీ-ఇజ్జత్’ కూడా ఉన్నాయి.

కలకత్తా జర్నల్ నిర్వహించిన ప్రముఖ పోల్‌లో ఆమె వరుసగా మూడు సంవత్సరాలు ‘ఉత్తమ నటి’గా నామినేట్ అయ్యారు. కానీ ఈ ప్రశంసలేవీ ముంతాజ్ శాంతిని చెడగొట్టలేదు. అది ఆమెను పెద్దగా సంతోషపెట్టలేదు. ఆమె హృదయం తన ఇంట్లోనే ఉంది. ‘ఉత్తమ నటి’ కావడం గురించి ఆమెకు పెద్దగా పట్టింపు లేదు. ఆమె మంచి భార్య కావాలని కోరుకున్నారు.

ముంతాజ్ శాంతి ఈ విషయంలో చాలా నిజాయితీపరురాలు. ఆమె ఇలా చెప్పారు – “సినిమా తారలు వంట చేయడం, కుట్టడం, ఇంటిని చూసుకోవడం ఇష్టపడతారని చెప్పడం ఒక ఫ్యాషన్ అని నాకు తెలుసు. అయినప్పటికీ, నా జీవితమంతా నా ఇంటి చుట్టూనే కేంద్రీకృతమై ఉందని నేను నిజాయితీగా చెప్పగలను. నేను అలా ఆలోచించేలా పెరిగాను, కీర్తిప్రతిష్ఠలు నా తొలినాటి శిక్షణను మరచిపోయేలా చేయలేదు.”

ఇల్లు, కెరీర్ అనే జంట బాధ్యతను విజయవంతంగా మిళితం చేయగలిగిన ముంతాజ్ శాంతి, తన భర్త నిర్మించిన చిత్రాలలో మాత్రమే పని చేస్తూనే ఉండాలని కోరుకున్నారు.

తరువాత ఆమె వ్యాస్ గారి ‘సంస్కార్’, వల్లి గారి ‘జమానే-కి-హవా’ అనే సినిమాల్లో నటించారు తరువాతి చిత్రంలో, ఆమె తనకు ఇష్టమైన నటి బెట్టే డేవిస్‌ను అనుకరించడానికి ప్రయత్నించారు. ఆమె జోన్ క్రాఫోర్డ్, ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్‌లను కూడా ఇష్టపడ్డారు.

తనకు అత్యంత ఇష్టమైన చిత్రంగా భావించే ‘జమానే-కి-హవా’లో, ముంతాజ్ శాంతి ‘ప్రపంచ మహిళ’ పాత్రను పోషించారు. ఆమె పొగ త్రాగారు, మద్యం తాగేరు, మెరిసే దుస్తులు ధరించారు, రెచ్చగొట్టే కేశాలంకరణ చేసుకున్నారు. ఈ పాత్రను పోషించడం పట్ల ఆమె ఆనందించారు, అయినప్పటికీ సరళమైన, విషాదకరమైన పాత్రలు తన వ్యక్తిత్వానికి మరే ఇతర పాత్రల కంటే ఎక్కువగా సరిపోతాయని ఆమె అంగీకరించారు.

పాత్రలు నటులకు సరిపోకపోవడమే సినిమాలు పరాజయం పాలవడానికి, తారలు తమ వైభవాన్ని కోల్పోవడానికి కారణమని ఆమె నొక్కి చెబుతారు.

“సినిమాలోని కొన్ని భాగాలను మన అగ్ర తారల కోసం ప్రత్యేకంగా రాయాలని నేను భావిస్తున్నాను” అని ముంతాజ్ శాంతి అన్నారు. తనకు ఇష్టమైన నటీమణి ఉదాహరణను ఉటంకిస్తూ ఆమె ఇలా కొనసాగించారు: “బెట్టే డేవిస్‌ను చూడండి. ఈ వయస్సులో కూడా ఆమె ప్రజాదరణ పొందుతోంది, ఎందుకంటే ఆమె పాత్రలు ఆమె ప్రత్యేక వ్యక్తిత్వానికి చాలా అద్భుతంగా సరిపోతాయి.”

తన భర్త సినిమాలకు కథలు, నటుల ఎంపికలో ఎల్లప్పుడూ సహాయం చేశారు. భర్తకి తగిని సలహా ఇచ్చే ముంతాజ్ శాంతి, ఎవరైనా తనను చిత్ర పరిశ్రమకు అధికారిక సలహాదారుగా నియమిస్తే, ఎన్నో అద్భుతాలు చేయగలనని గట్టిగా విశ్వసించారు!

‘బసంత్’, ‘కిస్మత్’ చిత్రాలలో తన పాత్రలకు బాగా గుర్తుండిపోయిన ముంతాజ్ శాంతికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారు. ఆమె బయటకు అడుగుపెట్టినప్పుడల్లా ఆమెను చుట్టుముట్టేవారు. స్వతహాగా సిగ్గరి అయినందున, సంయమనం పాటించే ఆమె తన షాపింగ్ ట్రిప్‌లకు వెళ్ళినప్పుడు బుర్ఖా ధరించి వెళ్ళేవారు.

ఆమె ఇంటిపనితోనూ, కంటికి రెప్పలా కాపాడుకునే కుమారుడు సికందర్ వల్లి సంరక్షణా బాధ్యత, ఆమెను తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు బిజీగా ఉంచేవి. ఆమెకు పనిమనిషిని పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు, వంట చేయడం, బట్టలు ఉతకడమే కాకుండా, ఎంత బిజీగా ఉన్నా డోర్ బెల్ మోగితే, ఆమే స్వయంగా తలుపుతీసేవారు.

ఆమె రోజువారీ పనుల కోసం పంజాబీ దుస్తులను ధరించేందుకు ఇష్టపడేవారు. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చీర ధరించేవారు. సినిమాల మధ్య ఆమె బరువు పెరుగేవారు, కానీ అది ఆమెను బాధించలేదు, ఎందుకంటే “నేను బరువు తగ్గడం సమస్య కాదు. నేను ఎప్పుడైనా తగ్గిపోగలను.” అనేవారు.

ముంతాజ్ శాంతి ఎప్పుడూ విదేశాలకు వెళ్ళలేదు, కానీ ఆమె వీలైనంత త్వరగా సెలవు తీసుకోవాలని భావించారు. తన చిన్న కొడుకు ఉత్తమ విద్యను పొందగలిగేలా ఇంగ్లాండ్‌లోని తన ఇంటికి వెళ్లాలని అనుకున్నారు.

ఆమె అభిరుచుల గురించి అడిగినప్పుడు, తనకు ఎలాంటి అభిరుచులు లేవని చెప్పారు. తర్వాత ఆమె “నేను మంచి ఇల్లాలిగా, విధేయత గల భార్యగా పనిచేయడం ఒక అభిరుచిగా మార్చుకున్నాననే వాస్తవాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి.” అని అన్నారు.

***

ముంతాజ్ శాంతి 19 అక్టోబర్ 1994న పాకిస్తాన్‌లో మరణించారు.

ముంతాజ్ శాంతి, దేశ విభజనకు ముందు బాలీవుడ్‌లో చిత్ర దర్శకుడు మరియు రచయిత అయిన వల్లి సాహబ్‌ను వివాహం చేసుకున్నారు, తరువాత విభజన తర్వాత వారిద్దరూ పాకిస్తాన్‌కు వెళ్లారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1977లో సాహబ్ గుండెపోటుతో మరణించారు.

Exit mobile version