Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు-44

సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మధుబాల విషాద ప్రేమ గాథ!

మధుబాల ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే రోజున జన్మించారు. అది ప్రేమికుల దినం. ప్రేమలో విఫలమైన హృదయమే మధుబాల జీవితం అకాలంగా ముగిసిపోవడానికి కారణం. 27 ఏళ్ళ వ్యక్తికి ఇక నీ జీవితకాలం మరో రెండేళ్ళే అని చెబితే ఆ వ్యక్తి మనఃస్థితి ఎలా ఉంటుంది? చివరి రోజుల్లో మధుబాల (జూయెల్ థీఫ్ చిత్రంలోని) ‘రులా కే గయా సప్నా మేరా’ అనే పాటనే తరచూ వినేవారంటే ఆశ్చర్యం ఏముంది? కేవలం 36 సంవత్సరాలే జీవించిన మధుబాల సినీరంగంలో ఎదిగిన ఎత్తు, హఠాత్ నిష్క్రమణ గురించిన కథనం ఇది.

బాల్యం నుంచి మధుబాల (ముంతాజ్ జహాన్ బేగమ్ దహల్వి) షూటింగులలో తీరిక లేకుండా ఉండేవారు. సాంప్రదాయిక పఠాన్ ముస్లిం కుటుంబానికి చెందినవారైన ఆమె తండ్రి (అతావుల్లా ఖాన్) తన పిల్లలకి చదువు ముఖ్యం కాదనుకున్నారు. మధుబాల మాత్రమే సంపాదనాపరురాలు. ఆమె తండ్రి పెషావర్‍లో ఉన్న బ్రిటీష్ వారి ఇంపీరియల్ టొబాకీ కంపెనీలో పనిచేసేవారు. పఠాన్ కావడంలో ఆత్మగౌరవం, మాట పడకపోవడం ఉండేవి. తనతో సరిగా వ్యవహరించలేదని, 15 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యోగాన్ని క్షణాలలో వదిలేసి, కుటుంబంతో సహ బొంబాయికి వచ్చేశారు. అప్పడు ఏడేళ్ళ వయసులో ఉన్న మధుబాలకు ప్రతిభ ఉంది. పాటలు పాడి నృత్యం చేసేవారు. అందుకని బాలనటిగా తొలి సినిమా ‘బసంత్’లో నటించారు. చివరి వరకూ ఆమే కుటుంబాన్ని పోషించారు. ఆమె తండ్రి క్రమశిక్షణని నిక్కచ్చిగా పాటించే వ్యక్తి. మధుబాల ఉదయం 9 గంటలకల్లా షూటింగ్ మెదలుపెట్టాల్సిందే. సాయంత్రం 6 గంటలకి స్టూడియోకి కారు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువచ్చేది. ఆమె తండ్రి ఎన్నడూ స్టూడియోలకి షూటింగులకి వెళ్ళేవారు కాదు. అందరూ అనుకునేట్టు ఆయన కఠినమైన వ్యక్తి కాదు. క్రమశిక్షణ గలిగిన వ్యక్తి, సమయపాలనను పాటించే వ్యక్తి. అవే లక్షణాలు ఆమెకీ వచ్చాయి. ఒకసారి రంజిత్ స్టూడియోలో షూటింగ్ ఉంది. కానీ విపరీతమైన వాన పడుతోంది. “నువ్వు తప్పనిసరిగా వెళ్లాలి, నీకు చెడ్డపేరు రాకూడదు” అన్నారు ఆమె తండ్రి. ఆ రోజుల్లో బాంద్రా లోని వాళ్ళింటి నుంచి రంజిత్ స్టూడియోకి వాహనంలో వెళ్తే 15 నిమిషాల సమయం పడుతుంది అంతే! కానీ ఆ రోజు వానలో స్టూడియోకి చేరడానికి గంటన్నర పట్టింది. కానీ స్టూడియో గేట్లు తాళాలు వేసేసి ఉన్నాయి. ఎవరూ బయటకు రాలేదు. ఆమె అరగంట ఎదురుచూసి, ఇంటికి వచ్చేసారట.

ఆమె అందం గురించి ఎవరు ఏమి చెప్పగలరు? ఆమె చనిపోయిన తర్వాత, ఇన్నేళ్ళయినా ఆమె గురించి మాట్లాడుకోవడమే దానికి సాక్ష్యం. ఆమె తమ ప్రక్కన ఉంటే ఆమె సోదరీమణులలో న్యూనతాభావం కలిగేదట. పఠాన్లు కావడం వల్ల అందరూ పొడుగ్గా, పొడుగాటి కేశాలతో ఉండేవారు. అయితే సోదరీమణులకెవరికీ మధుబాల రూపం రాలేదు. వాళ్ళమ్మగారు పొట్టిగా ఉండేవారు. పిల్లలందరికీ తండ్రి పొడుగు వచ్చింది. వాళ్ళకి మధుబాలతో పోలిక లేదు. మధుబాలకి ఏ డిజైన్ లేని తెల్ల చీరలంటే ఇష్టం. ఇంట్లో ఉంటే మాక్సీలు ధరించేవారు. ఆమెకి మల్లెపూలు పెట్టుకోవడమంటే ఇష్టం. బంగారు నగలు, ఆభరణాలు ఇష్టం. ఆమెకి కాస్త ఉర్దూ తెలియడంతో, షేర్ షాయరీ అంటే అభిమానించేవారు. ఇంటి వద్ద చదువు నేర్పేందుకు ఒక ఇంగ్లీషు ట్యూటర్ వచ్చేవారు. మధుబాలకి ఛాట్, రగడ పట్టీస్, పానీ పురీ, ఇంకా కుల్ఫీ అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ డైటింగ్ చేసేవారు కాదు. ఆ రోజులలో హీరోయిన్‍లు ఆరోగ్యంగా ఉండేవారు, నేటి జీరో-సైజ్ హీరోయిన్ల వలె కాదు. ఆమె తన కుటుంబ సభ్యులని తమ ఇంపోర్టెడ్ కార్లు.. హిల్‍మాన్, Buick, స్టేషన్ వాగన్‍ కార్లలో చౌపట్టీ తీసుకెళ్ళేవారు. తనని మరుగున ఉంచుకోడానికి బుర్ఖా ధరించేవారు. ఎవరైనా ట్రాఫిక్ పోలీస్‍ అభ్యంతరం చెపితే, “దయచేసి ధరించనీయండి, లేదండే జనాలు నన్ను చుట్టుముట్టేస్తారు” అనేవారుట. సినిమాలు చూడడానికి కూడా ఆమె బుర్ఖాలోనే వెళ్ళేవారు. మధుబాల అంటే క్రేజ్ పెరిగిపోయేసరికి, ఆమె జనాల్లో కనబడడం మానేశారు. ఏ ఫంక్షన్‌కీ, సినిమా ప్రీమియర్‍లకి హాజరయ్యేందుకు ఆమెకి అనుమతి లేదు. ఆమెకెవరూ స్నేహితులు లేరు. ఆమె ఎన్నడూ ఎదురుతిరగలేదు. వినయంగానే నడుచుకునేవారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే క్రమంలో ఆమె తండ్రి చండశాసనుడయ్యారు. ఆమెని సినిమాలో ఎందుకు చేర్చావని అడిగితే, “నాకు 12మంది పిల్లలు. ఆకలితో మాడిపోయేవాళ్ళం. నాకు సహాయంగా ఉంటారనుకున్న మగపిల్లలు పోయారు” అని చెప్పారు.

మధుబాలది మొదటి నుంచి ఎమోషనల్ అయ్యే స్వభావం. క్షణాల్లో కన్నీరు వచ్చేసేది. ఏమయిందో కుటుంబ సభ్యులకి అర్థమయ్యేది కాదు. అలాగే క్షణాల్లో నవ్వేసేవారు. నవ్వడం మొదలుపెడితే, చాలా సేపటివరకు ఆపేవారు కాదు. ఒకసారి షూటింగ్ కూడా ఆపేయవలసి వచ్చింది! ఆమెకి మతమంటే దురభిమానం లేదు కానీ, దైవమంటే భయం ఉంది. ఉపవాసాలు ఉండకపోయినా, రోజుకొకసారి ప్రార్థన చేసేవారు.

ప్రేమించడం, కోల్పోవడం:

మధుబాల మొదట నటుడు ప్రేమ్‌నాథ్‍ని ఇష్టపడ్డారు. వారి మధ్య బంధం ఆరు నెలలు కొనసాగింది. మతం కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఆమెని మతం మారమని ఆయన కోరగా, ఆమె తిరస్కరించారు. తదుపరి దిలీప్ కుమార్‍ని ఇష్టపడ్డారు. ఆమె ‘తరానా’ సినిమా సెట్ల మీద దిలీప్‍ కుమార్‌ని కలిశారు. తర్వాత వాళ్ళిద్దరూ సంగ్‍దిల్, అమర్, మొఘల్-ఎ-అజామ్ సినిమాలలో నటించారు. వారి మధ్య ప్రేమ తొమ్మిదేళ్ళు కొనసాగింది. వాళ్ళకి నిశ్చితార్థం కూడా అయింది (ఆయన సోదరి ఆచారం ప్రకారం చున్నీ ధరించి వచ్చేవారు). దిలీప్ కుమార్ కూడా పఠాన్ కావడం, ఆమె తండ్రి వారి వివాహానికి ఏ అభ్యంతరమూ తెలపలేదు. అప్పటికి వారి వద్ద తగినంత డబ్బు ఉండేది, కుటుంబానికి ఆర్థిక భద్రత ఉండేది. వాళ్ళిద్దరూ ఒకరికొకరులా ఉండేవారు. ఆయన తరచూ వాళ్ళింటికి వెళ్ళేవారు. ఆమె సోదరీమణుల్ని గౌరవంగా ‘మీరు’ అని సంబోధించేవారు. వారిద్దరూ సరదాగా ‘డ్రైవ్’కి వెళ్ళేవారు లేదా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. 1950ల మధ్యలో ‘నయాదౌర్’ సినిమాకి సంబంధించి ఓ కోర్టు కేసు సందర్భంగా దిలీప్ కుమార్‍తో విభేదాలు తలెత్తి విడిపోవలసి వచ్చింది. గ్వాలియర్ సమీపంలో షూటింగ్ జరపాల్సి వచ్చింది ఆ యూనిట్‍కి. అదే లొకేషన్‌లో జబీన్ జలీల్ నటిస్తున్న మరో సినిమా షూటింగ్ సందర్భంగా కొందరు గుంపుగా వచ్చి దాడి చేసి ఆడవాళ్ళ బట్టలు చింపేసారట! మధుబాల తండ్రి కంగారు పడి, లొకేషన్ మార్చమని కోరారుట. అంటే ఆమెని అవుట్ డోర్ షూటింగ్‍లకి వెళ్ళనివ్వలేదని కాదు. అంతకుముందు మధుబాల మహాబలేశ్వర్, హైదరాబాద్, తదితర ప్రాంతాలలో షూటింగ్ జరిపారు. కోర్టులో ‘మధుబాల తండ్రి ఓ నియంత’ అని చెప్పి దిలీప్ కుమార్ చోప్రాల పక్షం వహించారు (ఆ సినిమాకి స్వర్గీయ బి.ఆర్. చోప్రా దర్శకులు). దీన్ని మధుబాల కుటుంబం తట్టుకోలేకపోయింది. దిలీప్ కుమార్‍ని ప్రశ్నించింది – తన ప్రేయసి వైపు ఎందుకు నిలబడలేదని. లొకేషన్ మార్చమని చెప్పి ఉండాల్సింది లేదా కనీసం తటస్థంగా ఉండి ఉండవలసిందని అన్నారు. దిలీప్ కుమార్‍తో తెగతెంపులు అయ్యాకా, మధుబాల చాలా రోజులు దుఃఖించారు. విభేదాలను సర్దుబాటు చేసుకోడానికి ఫోన్ ద్వారా మాట్లాడుకోడానికి ప్రయత్నించారు. “మీ నాన్నని విడిచిపెట్టేయ్, మనం పెళ్ళి చేసుకుందాం” అని తరచూ అనేవారట దిలీప్ కుమార్. “నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను, కానీ ఒక్కసారి ఇంటికి రండి, నాన్నకి క్షమించమని అడిగి ఆయనని హత్తుకోండి” అనేవారుట మధుబాల. వారి ప్రేమని విఫలం చేసింది అహంభావమే. అయితే ఆమె తండ్రి మాత్రం నిశ్చితార్థం రద్దు చేసుకోమని గానీ, దిలీప్ కుమార్ నుంచి క్షమాపణ గాని కోరనే లేదట.

చివరి సంవత్సరాలు:

ఆ తర్వాత మధుబాల కిషోర్ కుమార్ పట్ల ఆకర్షితులయ్యారు. అప్పట్లో కిషోర్ కుమార్ రుమా దేవి గుహ (నటి, గాయని)తో విడాకులు తీసుకునే క్రమంలో ఉన్నారు. ఆయన పట్ల మధుబాల ఎందుకు ఆకర్షితులయ్యారో చెప్పలేం… బహుశా ఆయన గాన కళ కావచ్చు లేదా నవ్వించే గుణం కావచ్చు. ‘చల్తీ కా నామ్ గాడీ’, ‘హాఫ్ టికెట్’ షూటింగుల సమయంలో మూడేళ్ళ పాటు వారి మధ్య ప్రేమ కొనసాగింది. 1960లో వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పుడామె వయసు 27 ఏళ్ళు. పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరూ లండన్ వెళ్ళారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన ఓ డాక్టర్ ఆమె మరో రెండేళ్ళు మాత్రమే జీవిస్తారని చెప్పారు. తిరిగొచ్చిన తర్వాత ఆమెని పుట్టింట్లో దింపేసారు కిషోర్ కుమార్, తాను ఎక్కువ అవుట్ డోర్ షూటింగులలో ఉంటాను, సరిగా చూసుకోలేనని. అయితే ఆమె మాత్రం ఆయనతోనే ఉండాలనుకున్నారు. కిషోర్ కుమార్ రెండు నెలలకొకసారి వచ్చి చూసి వెళ్ళేవారట. బహుశా ఆయన ఆమెతో తన బంధాన్ని బలహీనపరుచుకోవాలనుకున్నారేమో, ఎందుకంటే తుది వీడ్కోలు బాధించకూడదని. అయితే ఆయన ఎన్నడూ ఆమెను దుర్భాషలాడలేదు. ఆమె చికిత్స ఖర్చులన్నీ ఆయన పెట్టుకున్నారట. వారి వైవాహిక బంధం తొమ్మిదేళ్ళు కొనసాగింది. 1954లో ఆమె మద్రాసులో జెమినీ ఎస్.ఎస్. వాసన్ గారి చిత్రం ‘బహుత్ దిన్ హుయే’ షూటింగ్ చేస్తుండగా ఆమె గుండెలో రంధ్రం (ventricular septal defect) ఉందని వైద్యులు తెలుసుకున్నారు. ఆమె రక్తం కక్కుకున్నారు. వైద్యులు మూడు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పినా, సినిమాలకి ఇబ్బంది అవుతుందని ఆ సలహా పాటించలేదు. మొఘల్-ఎ-ఆజామ్ షూటింగ్‍లో భాగంగా ఆమెకి సంకెళ్ళు వేసారు. ఆమె వాటితోనే నడిచేవారు. అది బాగా ఇబ్బందిపెట్టింది. సాయంత్రమయ్యేసరికి ఆమె చేతులు నీలంగా మారేవి. తాను జైలు సన్నివేశాలలో నీరసంగానూ, అలసినట్టుగాను కనిపించాలని ఆమె ఆహారం కూడా తీసుకునేవారు కాదు. దిలీప్ కుమార్, మధుబాల పై తీసిన (హిందీ సినిమాలో అత్యంత రొమాంటిక్ సీన్‍గా భావించబడే) ‘ఫెదర్ సీన్’ని వాళ్ళిద్దరూ విడిపోయాకా చిత్రీకరించారు. ఆమె వ్యాధి కారణంగా, ఆమె శరీరం ఎక్కువ రక్తాన్ని ఉత్పత్తి చేసేది. అదంతా ముక్కు నుండి, నోటి నుండి బయటకు వచ్చేది. వైద్యులు ఇంటికి వచ్చి, సీసాలలో రక్తాన్ని బయటకి తీసేవారు. పైగా ఆమె ఊపిరితిత్తుల సమస్యతో కూడా బాధపడేవారు. ఎప్పుడూ దగ్గుతూ ఉండేవారు. ప్రతి నాలుగు లేదా అయిదు గంటలకి ఒకసారి ఆమెకి ఆక్సీజన్ ఎక్కించవలసి వచ్చేది లేకుంటే శ్వాస ఆడేది కాదు.

ఆమె దాదాపు తొమ్మిదేళ్ళు మంచానికే పరిమితమయ్యారు. శుష్కించి ఎముకల గూడుగా మారారు. రోదిస్తూ, “నాకు బతకాలని ఉంది, చావాలని లేదు. నా రోగానికి మందు ఎప్పుడు దొరుకుతుందో” అనేవారు. అయితే ఆమె 23 ఫిబ్రవరి 1969 నాడు మరణించారు. అప్పటికి ఆమె వయసు 36 సంవత్సరాలు. ఆమెకి అనారోగ్యంగా ఉన్నప్పుడు దిలీప్ కుమార్ ఎప్పుడూ వాళ్ళింటికి వెళ్ళకపోయినా, స్మశానంలో చివరిసారి నివాళి అర్పించడానికి మద్రాసుకి వెళ్ళారు. వారి ఆచారం ప్రకారం తమ ఇంటి నుంచి మూడు రోజుల పాటు ఆమె ఇంటికి ఆహారం పంపారు. దిలీప్ కుమార్ సైరా బానును వివాహం చేసుకున్నప్పుడు మధుబాల బాధపడ్డారు, ఎందుకంటే ఆమె ఆయనను ప్రేమించారు కాబట్టి. “ఆయనకి ఆమె (సైరా బాను) రాసి పెట్టుంది. నేను కాదు” అన్నారు. అయితే, “ఆయనకి అందమైన భార్య దొరికింది. పైగా గుణవతి. నాకెంతో సంతోషంగా ఉంది” అని కూడా అన్నారు. కాని ఆమె హృదయంలోని వెలితిని మాత్రం ఎవరూ పూడ్చలేకపోయారు. కొన్నేళ్ళ తర్వాత ఆమె సమాధి కూలగొట్టబడింది, ఎందుకంటే అది వహాబీల స్మశానంలో ఉంది (వహాబీలంటే – ముస్లింలలో సమాధులు కట్టడం నిషిద్ధమైన ఒక వర్గం). ఈ విధంగా ఓ గొప్ప నటి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి.

ఈ బాధాకర ఘటన నుంచి ఆమె తండ్రి కోలుకోలేదు. వాస్తవానికి ఆమె విగత శరీరాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. ఆమె తండ్రి తరచూ ఆమె సమాధి వద్దకు వెళ్ళి దుఃఖించేవారు. ‘తనకు బదులుగా నేను పోయినా బావుండేది’ అనేవారు. ఆరేళ్ళ తర్వాత 1975లో ఆయన గుండెపోటుతో మరణించారు.

మధుబాల తండ్రితోనూ, దిలీప్ కుమార్‍తోనూ ఉన్న ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.

తండ్రితో మధుబాల
దిలీప్ కుమార్‌తో మధుబాల

నటుడు అనపర్తి నాగేంద్ర రావు/లవకుశ ఫేమ్ నాగరాజు:

కొన్ని సినిమాలు కొందరు నటులకు గొప్ప పేరు తెస్తాయి. చిత్రం పేరు ఆ నటుడికి ఇంటిపేరులా మారిపోతుంది. అలాంటి వారిలో ‘లవకుశ’లో లవుడిగా నటించిన నాగరాజు ఒకరు. ఈ వారం నాగరాజు గురించి తెలుసుకుందాము.

లవకుశ ఫేమ్ నాగరాజు గురించి రాయడం మొదలుపెడితే, ఆయన తండ్రి, నటులు ఎ.వి. సుబ్బారావు గురించి చాలా తక్కువ మందికి తెలుసు అని అనిపించింది. ఎ.వి. సుబ్బారావు ‘కీలుగుర్రం’, ‘పల్లెటూరి పిల్ల’, ‘తిలోత్తమ’, ‘మాయలమారి’ తదితర చిత్రాలలో నటించారు. నాగరాజుగా పరిచితులైన అనపర్తి నాగేంద్ర రావు 1950లో జన్మించారు. ఒక డాక్టరు తన పిల్లలు కూడా డాక్టర్లు కావాలని అనుకుంటారు, అలాగే ఇంజనీర్లు, లాయర్లు కూడా అనుకోవడంలో తప్పు లేదు. కానీ, కష్టపడి అవకాశాలు పొందిన సినీనటులు మాత్రం తమ పిల్లలు సినీరంగంలోకి రాకూడని అనుకుంటారు. వారు బాగా చదువుకుని, గొప్ప ఉద్యోగాలు సంపాదించుకుని సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఇవన్నీ కొన్ని మినహాయింపులు ఉన్న సాధారణ అభిప్రాయాలు. అయితే నటులు ఎ.వి. సుబ్బారావు గారివి కూడా ఇవే అభిప్రాయాలు. తన కొడుకు సినిమాల్లో చేరటం ఆయనకి ఇష్టం లేదు. అయితే, దురదృష్టవశాత్తు, ఎ.వి. సుబ్బారావు అకాలమరణంతో ఆయన కొడుకు – చదువు మానుకుని, సినిమాలలో ప్రవేశించి, వాటినే తన వృత్తిగా చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆయన కథ.

18 నవంబర్ 1955 నాడు ఎ.వి. సుబ్బారావు తన కొడుకు నాగరాజు సుళ్ళూరుపేటలో ప్రదర్శితమవుతున్న ‘భక్త రామదాసు’ నాటకంలో రఘురాముడి పాత్ర ధరించేందుకు అయిష్టంగానే అంగీకరించారు. అయిదేళ్ళ వయసులో ఎంతో అందంగా ఉన్న నాగరాజు ఆ పాత్రకి బాగా నప్పారు. నాటకం ముగిసే సరికి అందరూ తండ్రి ఎదురుగానే ఆయనని పొగడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకరు “నటుడిగా మీ వాడు మీకన్నా గొప్ప పేరు తెచ్చుకుంటాడు” అని అన్నారట. ఆ పొగడ్తలన్నింటినీ తీసిపారేస్తూ ‘ఏడ్చాడు వెధవ!’ అన్నారుట ఎ.వి. సుబ్బారావు. తండ్రి కూడా తనని మెచ్చుకుంటారని ఆశించిన చిన్నారి నాగరాజుకి బాధ అనిపించింది. సుప్రసిద్ధ నటులు నాగయ్య ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చారు. నాగరాజు ఓ చిరు కానుకనిచ్చి, ఆశీర్వదించారు నాగయ్య. తర్వాతి కొద్దిరోజుల పాటు ఆనాటి ప్రశంసల జల్లు తడిసి ముద్దయ్యారట నాగరాజు. మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నారట. అయితే తండ్రి ముందు నిలబడి, నటించేందుకు మరో అవకాశం కోసం అడిగే ధైర్యం లేకపోయింది. తండ్రంటే అంతటి భయం ఉండేది. ఆరు నెలల తర్వాత, ఎ.వి. సుబ్బారావు వి.ఎన్. ఫిల్మ్స్ ఆఫీసుకు వెళ్ళి, నాగరోజు కోసం ఆ కంపెనీ వారి కారు పంపారు. వి. నాగయ్య ‘భక్త రామదాసు’ చిత్రం తీస్తున్నారనీ, అందులో రఘురాముడి పాత్ర తనకే దక్కిందని నాగరాజుకి తెలిసింది (గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా 1955లో ప్రారంభమయినా 1964లో విడుదలయింది. ‘లవకుశ’ కూడా 1958లో ప్రారంభమై, 1963లో విడుదలయింది. ఆయన నటించిన ఈ రెండు సినిమాలు బాగా ఆలస్యమయ్యాయి). ఈ మేరకు ఒప్పందం కుదరగానే, ఆయన సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అనపర్తి నాగేంద్ర రావు అనే పేరును నాగయ్య ‘నాగరాజు’గా మార్చారు. ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ సినిమాలో ఆయన తండ్రి ఎ.వి. సుబ్బారావు కూడా నటించారు. ఆయన మొదటి షాట్ – తండ్రి, కన్నాంబ, ఋష్యేంద్రమణి, లింగమూర్తి గార్లతో. పిల్లవాడు అతి సులభంగా నటిస్తుండడంతో నాగయ్య ఎంతో సంతోషించి, ఆయన్ని హత్తుకున్నారట. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కినంత ఆనందం కలిగిందట నాగరాజుకి. కానీ ఆయన తండ్రి ప్రతిస్పందన మాత్రం ఎప్పటిలానే నిరుత్సాహపరిచేదిలా ఉందిట. ‘ఏడ్చాడు కుర్రకుంక’ అన్నారుట. బహుశా, అందుకే ఆయన తండ్రి పేరుని ఎక్కువగా ప్రస్తావించరు. గట్టిగా ఏడవాలనిపించిందట, కానీ ఆ మహామహుల ముందు ఏడిస్తే బాగుండని ఆగిపోయారట.

1958లో ఒకరోజు కన్నడ సినిమా ‘స్కూల్ మాస్టర్’లో నటిస్తుండగా (ఈ సినిమా ‘బడిపంతులు’ పేరిట తెలుగులో డబ్ అయింది. ఎన్.టి.ఆర్ నటించిన 1972 నాటి ‘బడిపంతులు’ సినిమా కాదు) ప్రఖ్యాత దర్శకులు ఎస్.డి.లాల్ ఆయన నటన చూసి మెచ్చుకుని, నిర్మాత శంకర్ రెడ్డికి సిఫార్సు చేశారట. శంకర్ రెడ్డి అప్పట్లో ‘లవకుశ’ సినిమా తీయాలని చూస్తున్నారట. దర్శకులు సి. పుల్లయ్య నాగరాజుకు నటనలో ఓనమాలు నేర్పారు. చిన్నవాడు కావడంతో అందరితో సరదాగా ఉండేవారు నాగరాజు. పుల్లయ్య గారి మీసాలను లాగేవారట. ప్రతీ సీన్‍కి ముందు పుల్లయ్య తన మీసాలను దువ్వుకుని, ఎలా నటించాలో నాగరాజుకు చూపేవారట. దీన్ని ఆయన జీవితాంతం గుర్తుంచుకున్నారు. సి. పుల్లయ్య చివరి చిత్రం ‘భామా విజయం’లో బాలార్కుడి పాత్ర పోషించడం తన అదృష్టమని భావిస్తారు. ‘టైగర్ రాముడు’ చిత్రంలో తాను నటించేందుకు కారణమైన పుల్లయ్య కుమారులు సి.ఎస్. రావుని (‘లవకుశ’ చిత్రీకరణ సమయంలో పుల్లయ్య అనారోగ్యానికి గురయితే, సి.ఎస్.రావు చిత్రీకరణ పూర్తి చేశారు) కూడా ఎన్నటికీ మరువలేనని నాగరాజు చెప్పారు. 1963లో ‘లవకుశ’ సినిమా విడుదలయ్యాక లవుడు, కుశుడి ఇద్దరు పాత్రధారులకి మంచి పేరు వచ్చింది. తర్వాత ఈ సినిమా ఇతర భాషలలోకి డబ్ అయింది. లవుడి పాత్రని నాగరాజు ధరించగా, కుశుడి పాత్రని అప్పటికే రంగస్థల నటుడైన ఉయ్యూరి సుబ్రహ్మణ్యం పోషించారు. చిత్రీకరణ 1958లో నాగరాజుకి ఎనిమిదేళ్ళ వయసులో ప్రారంభమైంది. ఆయనకి 13 ఏళ్ళు వచ్చాక విడుదలయింది. ఒక తెలుగు ఛానెల్ ‍కిచ్చిన ఇంటర్వ్యూలో – తను పోషించిన లవుడి పాత్రను గుర్తు చేసుకుంటూ నాగరాజు చెప్పారు – “అందరూ మేం బాగా చేశామని మెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రల గొప్పదనం గురించి నాకు తరువాతే తెలిసింది. మా పాత్రలకి మేం బాగా నప్పేలా మమ్మల్ని తీర్చిదిద్దారు. విల్లంబులు వాడడంలో శిక్షణ నిచ్చారు. సెట్‌లో దర్శకులు సి. పుల్లయ్య మాతో కూర్చుని మాకు అన్నీ నేర్పేవారు, సన్నివేశాల గురించి వివరించేవారు. మా డైలాగులన్నీ మాకు నోటికి వచ్చేవి. ఫిల్మ్ ఫాన్స్ అసోసియేన్స్ వంటివి మాకెన్నో అవార్డులిచ్చాయి. ఓ చిన్నపిల్లాడిలా జనాలు నన్ను భుజానికెత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం నేను ఎన్నటికీ మరిచిపోను.”

ఈ పౌరాణిక చిత్రం ఉత్తర రామాయణం లోని సీతారాముల కవల పిల్లలు లవకుశుల జీవితం ఆధారంగా నిర్మించబడింది. రాముడిగా నందమూరి తారక రామారావు, సీతగా అంజలీదేవి నటించారు. పూర్తి నిడివి కలర్‍లో నిర్మించబడిన తొలి తెలుగు చిత్రం ఇది. ఆ ఏడాది ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా 18 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్ లోని మిగతా కేంద్రాలలో 75 వారాలు నడిచింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నాగరాజుకు పలు అవకాశాలు వచ్చాయి. దురదుష్టవశాత్తు ఆయన తండ్రి సుబ్బారావుకి పక్షవాతం వచ్చి, కన్నుమూశారు. ఇక నటనను అభిరుచిగా కాకుండా, కుటుంబాన్ని పోషించడం కోసం వృత్తిగా తీసుకున్నారు నాగరాజు.

నందమూరి తారక రామారావు నాగరాజుని ప్రోత్సహించి తన స్వంత సినిమాలు అన్నిటిలోనూ అవకాశమిచ్చారు. తను నటించే ఇతర సినిమాలలో కూడా నిర్మాతలకి చెప్పి నాగరాజుకి తగిన పాత్రలు ఇప్పించారు. కాబట్టి తాను నటించిన అందరి స్టార్‍ల కంటే ఎక్కువగా ఎన్.టి.ఆర్.తో చనువు అధికం నాగరాజుకి. వారిద్దరూ కలిసి సుమారు 50 చిత్రాలలో నటించారు. లవుడి పాత్ర మాత్రమే కాకుండా ఇంద్రజిత్/సతీ సులోచన, టైగర్ రాముడు, భీష్మ తదితర చిత్రాల్లో చిన్నప్పటి ఎన్.టి.ఆర్ పాత్రలని పోషించి తన నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించారు నాగరాజు. సిపాయి కూతురు, స్కూల్ మాస్టర్, వెంకటేశ్వర మహత్యం, కృష్ణ కుచేల, ఉమ్మడి కుటుంబం, శ్రీకృష్ణ సత్య, బికారి రాముడు, మహాకవి కాళిదాసు, శ్రీ శైల మల్లికార్జున, సీతారామ కళ్యాణం, వాగ్దానం, బభ్రువాహన, అంతస్తులు, పాదుకా పట్టాభిషేకం, సతీ సుమతి, కుంకుమ భరిణ, శ్రీకృష్ణావతారం, నిలువు దోపిడి, అన్నతమ్ములు, తల్లా? పెళ్ళామా?, వంటి హిట్ చిత్రాలలో నటించారు. లక్ష్మణుడిగా శ్రీరామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం చిత్రాలలో నటించారు. నాగరాజు బుల్లితెరపై కూడా నటించారు. ‘గోమాత వైభవం’ అనే టీవీ సీరియల్‍లో కపిల మహర్షి పాత్ర పోషించారు.

తదుపరి కాలంలో నటన నుంచి విరమించుకుని చివరి రోజులలో ఆధ్యాత్మిక మార్గం పట్టారు. సెప్టెంబరు 2020లో శ్వాసకోస ఇబ్బందులతో సికింద్రాబాదులోని గాంధీనగర్‍లో తన ఇంట్లో మరణించారు నాగరాజు. ఆయనకి భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. తెలుగు, మలయాళం, కన్నడంలో కలిపి ఆయన దాదాపు 300 చిత్రాలలో నటించారు. తెలుగు సినీపరిశ్రమకి చెందిన కళాకారులెందరో నాగరాజు మృతికి సంతాపం తెలిపారు. పరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు.

Exit mobile version