సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
దేవ్ ఆనంద్ మొదటి హీరోయిన్ కమలా కోట్నీస్:
తన కాలం ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన దేవ్ ఆనంద్ హిందీ చిత్రసీమలో ప్రవేశించడానికి కారణమైన హీరోయిన్ గురించి ఈ వారం తెలుసుకుందాం.
1940లలో తెలుగు, హిందీ చిత్రాలలో నటించిన భారతీయ నటి కమలా కోట్నీస్. ఈమె 1946లో విడుదలైన హీరో దేవ్ ఆనంద్ మొదటి చిత్రం ‘హమ్ ఏక్ హై’ చిత్రంలో కథానాయికగా నటించడం విశేషం!
కమలా కోట్నీస్ 1928లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన పండ్ల వ్యాపారం చేసే కుటుంబంలోని యువతికి, హైదరాబాదులో బ్రిటీష్ సైన్యంలో పనిచేసే బ్రిటీష్ జాతీయుడైన సిపాయికి జన్మించారు. కర్నూలుకి చెందిన ఓ ధనవంతుడైన జమీందారు ఆమెని దత్తత తీసుకు విలాసవంతంగా పెంచారు. అప్పట్లో తెలుగు కుటుంబాలలో ఉన్న అలవాటు ప్రకారం ఆమె పేరు కమలాబాయి అని పెట్టారు. కొంతకాలానికి ఆమె తల్లిదండ్రులు మద్రాసుకి తరలి వెళ్ళారు. అక్కడి శాంథోమ్ హై స్కూల్‍లో ఆరవ తరగతి వరకు చదివారామె. చిన్నతనం నుంచే ఆమెకి సినిమాలంటే బాగా ఇష్టం, నటించాలని అనుకునేవారు కూడా. పాటలు పాడడం, డాన్సులు చేయడం తనకు తానుగా నేర్చుకున్నారు. వారి పొరుగింట్లో ద్రోణంరాజు చిన కామేశ్వరరావు ఉండేవారు. ఆయన కమలని సుప్రసిద్ధ నటులు నారాయణ రావుకి పరిచయం చేశారు. “సినిమాల్లో నటిస్తావా?” అని ఆయన అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారట కమల. అయితే ఆమె తండ్రికి మాత్రం సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. తల్లి తటస్థంగా ఉండిపోయారు. ద్రోణంరాజు గారు తరువాత ఆమెను మీర్జాపురం జమీందారుకి పరిచయం చేశారు. అప్పట్లో అంటే 1940లో ఆయన ‘జీవన జ్యోతి’ అనే సినిమా నిర్మిస్తున్నారు. అందులో ద్వితీయ కథానాయిక పాత్ర ఇచ్చారు. అప్పుడామె వయసు 12 ఏళ్ళు. నిజానికిది ఆమె తొలి సినిమా కావాలి, కానీ ఈ సినిమా కన్నా ముందు ‘కాళిదాసు’ సినిమా విడుదలయింది. దీన్ని కూడా మీర్జాపురం జమీందారు గారే నిర్మించారు. ఈ సినిమాలో ఆమె కాళికాదేవి పాత్ర పోషించారు. ‘జీవన జ్యోతి’ తర్వాత ఆమె ‘బాలనాగమ్మ’ చిత్రంలో చిన్నప్పటి సూర్యనాగమ్మగా నటించారు. 1943లో నాగయ్య హీరోగా నటించిన ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో రెండో హీరోయిన్‍గా నటించారు. తరువాత ‘సీతారామ జననం’ చిత్రంలో కైకేయిగా నటించారు. 1943లో తమిళ నిర్మాత సౌందర్ రాజన్ తమిళ తెలుగు భాషలలో నిర్మించిన ‘చెంచులక్ష్మి’ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్ అయ్యారు. 1944లో ‘తహసీల్దార్’ చిత్రంలో నారాయణ రావుకి భార్యగా నటించారు.ఈ రెండు సినిమాలు గొప్ప హిట్ అయ్యాయి. దీని తర్వాత ఆమెకి హిందీ చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
సుప్రసిద్ధ దర్శకులు దేవకీ బోస్ సహాయకుడు ఆమెని చూసి, హిందీ చిత్రసీమకి ఆహ్వానించారు. ‘సల్హా’ (ఈ సినిమా గురించి నేను వినలేదు) చేస్తుండగా, ప్రభాత్ ఫిల్మ్స్ వారు ఈమెని చూసి, ఐదేళ్ళ కాంట్రాక్ట్ ప్రతిపాదించారట. అయిష్టంగానే ఒప్పుకున్నారు కమల. ప్రభాత్ స్టూడియో యాజమాన్యం తమ స్టూడియోని ఒక ఆలయంగా చూసుకునేవారు. అప్పట్లో బాబూ రావ్ పాయ్ మేనేజింగ్ డైరక్టరుగా ఉండేవారు. నటీనటులు ఒకరితో ఒకరి కలవడం గానీ, ఒకరి మేకప్ రూమ్ లలోకి మరొకరు రావడం గాని నిషేధం. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన నటీనటులతో కాంట్రాక్టు రద్దు చేసుకుని, వారిని పంపించేసేవారు. ఈ బ్యానర్ ఆర్టిస్టుల నుండి ప్రతీ సినిమాకి 200 కాల్షీట్లు తీసుకునేది. అది వారి నిబద్ధత. పరిపూర్ణత కోసం వారు పడే తాపత్రయం. 1943లో ఈ ప్రభాత్ ఫిల్మ్స్ బ్యానర్ తెలుగులో ‘భట్టి విక్రమార్క’ అనే సినిమా తీస్తోంది. కమల కాబోయే భర్త పాండురంగ కోట్నీస్ ఆ సినిమాకి దర్శకులు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వారి మధ్య ప్రేమ జనించింది. ఇది ఆమె చివరి తెలుగు సినిమా అయ్యింది. 1943లో ఆమె పాండురంగ కోట్నీస్‍ని వివాహం చేసుకున్నారు. అప్పటి ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ డి.యస్. కోట్నీస్‍కి స్వయానా సోదరులాయన. పాండురంగ కోట్నీస్, దినకర్ కోట్నీస్ – చైనా వెళ్ళి యుద్ధంలో వీర మరణం పొందిన – డా. ద్వారకానాథ్ శాంతారమ్ కోట్నీస్ – గారి తమ్ముళ్ళు. 1946లో వి.శాంతారాం ఆయన గురించి ‘డా. కోట్నీస్ కీ అమర్ కహానీ’ అనే చిత్రం తీశారు. ఈ చిత్రంలో నటులు శశి కపూర్ (సీనియర్) – పాండురంగ కోట్నీస్ పాత్ర పోషించారు.
కమలా, కోట్నీస్‍లిద్దరూ మద్రాసులోని మైలాపూర్‍లోని శాంథోమ్ హై రోడ్ లోని ఇంటి నెంబరు 2/38 బంగ్లాలో నివాసముండేవారు. ఒకరోజు ఒక అభిమాని ఆమె నివాసముండే ఇంటిని గుర్తించి తలుపు తట్టాడట. లోపలికి ఆహ్వానించి కూర్చోమనేసరికి అతను ఆశ్చర్యపోయాడట. ‘మీరెవరు’ అని ఆమె నెమ్మదిగా ప్రశ్నించగా, ‘మీ అభిమానిని’ అని చెప్పాడట. అప్పుడే కోట్నీస్ గారు లోపలికి వచ్చి, అతిథికి ఒక సిగార్ అందించారట. ఇంతలో కాఫీలు వచ్చాయి. అందరూ తాగసాగారు. కాఫీ తాగుతూ, సిగార్ ఎందుకు వెలిగించలేదని అతిథిని కోట్నీస్ అడిగితే, తానింకా విద్యార్థినే అనీ, కాఫీతో పాటుగా సిగార్ కాల్చే స్థితికి తానింకా చేరుకోలేదని చెప్పాడట. అందరూ హాయిగా నవ్వేశారట. ఉన్నట్టుండి తనలో ఏవైనా మార్పులు కనిపిస్తున్నాయా అని కమల అతనిని అడిగారు. ‘చెంచులక్ష్మి’ చిత్రంలో కనిపించినదానికన్నా ఇంకా సన్నబడ్డారని అతను చెప్పాడు. కమల చిన్నగా నిట్టూర్చి తాను 30 పౌండ్లు తగ్గినట్టు చెప్పారు. ఇలా బరువు తగ్గడంలో రహస్యాన్ని, నాగయ్యకు, పుష్పవల్లికి చెబుతారా అంటూ హాస్యమాడాడు ఆ అతిథి. రహస్యమేమీ లేదని ఆవిడ అన్నారు. ఉదయం బీచ్‌లో జాగింగ్ చేస్తూ ఎక్కువ దూరం పరిగెత్తడం, రాత్రి పూట అన్నం బదులుగా చపాతీలు తినడం వల్లే బరువు తగ్గానని ఆమె చెప్పారు. ‘మీరు కారు నడుపుతారా?’ అని అడిగాడతను. ‘కారు నడపడమే కాదు, నాకు ఈత వచ్చు, గుర్రపు స్వారీ వచ్చు. సైకిల్ తొక్కగలను, మోటార్ సైకిల్ నడపగలను’ – అన్నారామె. ‘అభినందనలు. అయితే తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని స్టంట్ సినిమాలో చూడొచ్చు అన్నమాట’ అన్నాడతను. ఆమె మరోసారి నిట్టూర్చి, ‘తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా పౌరాణికాలు, జానపదాలు చూస్తారు. సాంఘిక సినిమాలపై వారికి ఆసక్తి తక్కువ’ అన్నారు. అప్పుడా విద్యార్థి ఆమెకి ఇష్టమైన వాటి గురించి అడిగితే, ఇలా చెప్పారు:
- ఇష్టమైన తెలుగు సినిమా – ‘గృహలక్ష్మి’ 1938
- అభిమాన తెలుగు సినీ దర్శకుడు – సి. పుల్లయ్య, వై. వి. రావు
- అభిమాన తెలుగు నటులు – వై. వి. రావు, నాగయ్య
- అభిమాన హిందీ నటులు – రమోలా, అశోక్ కుమార్
- ఇష్టమైన హాలీవుడ్ నటీనటులు – టైరన్ పవర్, బెట్టీ డేవిస్
(ఇక్కడ కోట్నీస్ జోక్యం చేసుకుని టైరోన్ పవర్ ఏ సినిమాను కమల చూడకుండా ఉండరని చెప్పారు. పైగా స్వర్గసీమ/మేహా సుహాగ్ లు టైరన్ పవర్ సినిమా ‘బ్లడ్ అండ్ సాండ్’ ఆధారంగా తీసినవే అని చెప్పారు). విద్యార్థి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు.
ప్రభాత్ బ్యానర్‍లో నటించడం వల్ల, దేవ్ ఆనంద్ హిందీ చిత్రసీమలో ప్రవేశించేందుకు కమల కారణమయ్యారు. ప్రభాత్ ఫిల్మ్స్ వారు ‘హమ్ ఏక్ హై’ చిత్రాన్ని నిర్మిద్దామని తలచి, కమలని హీరోయిన్‍గా ఎంపిక చేసుకున్నారు. తొలుత కరణ్ దేవన్‍ని హీరోగా అనుకున్నా, వీరి జోడి అంతగా ఆకట్టుకోలేదనిపించిందట. అందుకని కొత్తవాళ్ళకి పిలుపునిచ్చారు. ఔత్సాహిక నటుల నుంచి అసంఖ్యాకంగా ఫోటోలు అందాయట. బాబూ రావ్ పాయ్ ఆ ఫోటోలన్నీ కమల ముందు ఉంచి, హీరోని ఎంపిక చేయమన్నారట. తన హీరోని – కమల రూపానికి, ఎత్తుకి సరిపోయే వ్యక్తిని ఎంచుకునే బాధ్యత తనకే అప్పగించారు. ఓ ఫోటోని తీసి బాబూ రావ్ గారికి చూపించారట. ఆ కుర్రాడు అందరికీ నచ్చాడు. అతనే దేవ్ ఆనంద్. దీని తర్వాత ఆమె 1946లో ‘గోకుల్’, 1949లో ‘సీదా రాస్తా’, 1949 లోనే ‘ఆగే బఢో’, జీనత్ మహల్ వంటి సినిమాలలో నటించారు. పూనేలో తన భర్త పాండురంగ కోట్నిస్ దర్శకత్వంలో నిర్మించిన ‘భక్త విక్రమాదిత్య’ (మరాఠీ) చిత్రంలో నటించారు. ఆయన అంతకుముందు జయా స్టూడియో వారితో కెమెరామాన్‍గా పనిచేసేవారు. 1945లో తెలుగులో సూపర్ హిట్ అయిన ‘స్వర్గసీమ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయగా, ఆమె హీరోయిన్‍గా నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. రీమేక్‌లో హీరోయిన్‍గా ఆమెని ఎంపిక చేసినందుకు దర్శకుడు బాధ పడగా, తాను చేసిన తప్పేంటని అడిగారట. స్వర్గసీమలో జయమ్మ ఓ సాదాసీదా గృహిణిగా ఉంటుంది, అందుకే ఆమె భర్త ఓ నాట్యగత్తె వెంట పడతాడనీ; కానీ ఇక్కడ కమల ఎంతో అందంగా ఉందనీ, ఆమె భర్తకి మరో స్త్రీ వద్దకి వెళ్ళడానికి ఆస్కారమే లేదని అన్నారట దర్శకుడు. నిస్పృహకి లోనయిన కమల సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అదే 1949లో వచ్చిన హిందీ సినిమా ‘సతీ అహల్య’. తనకి శశి కపూర్ (సీనియర్) బాగా పరిచయం ఉండడంతో ఆయనకు శ్రీరాముడి వేషం ఇచ్చారు. తర్వాత ఎప్పుడో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో – ఆ సినిమాలో తనకి మేకప్ కమలే వేశారని శశి కపూర్ (సీనియర్) చెప్పారు. అదే ఆమె చివరి హిందీ సినిమా. కాగా 1950లో ఆమె భర్త పాండురంగ కోట్నీస్ ధనం, నగలు తీసేసుకుని ఆమెని విడిచిపెట్టేసారు. ఆమెతో ఇక ఏ సంబంధాలు ఉండవని ఒక నోట్ రాశారు.
తరువాత కొన్నాళ్ళకి ఓ రైలు ప్రయాణంలో చంద్ర దేవ్ ప్రకాశ్ సిన్హాని కలిసారు. వారి మాటలు కలిసాయి, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆయనో మంచి మనిషని, ధనవంతుడని, తెలివైన వారని ఆమె నమ్మారు. ఆయన కశ్మీరు మహారాజు మనుమడు. పెళ్ళి చేసుకుందామని ఆయన ప్రతిపాదించగా, ఆమె అంగీకరించారు. పెళ్ళి చేసుకున్నాకా, ఆయన అభీష్టం ప్రకారం నటన నుంచి విరమించుకున్నారు కమల. విదేశాలలో నివసించారు. అక్కడ కమల టెన్నిస్ నేర్చుకున్నారు. అందుకు చాలా డబ్బు ఖర్చు చేశానని ఆమె చెప్పారు. 1967లో పెరియార్ లేక్‍లో బోటింగ్ చేస్తూ, ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రకాశ్ సిన్హా మరణించారు. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని టెన్నిస్‍కే అంకితం చేశారు. అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా, ఆమె అంగీకరించలేదు. మద్రాసులో రెండు సార్లు నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచి, ఎన్నో ట్రోఫీలు గెలుపొందారు. తనని తాను ఫిట్‍గా ఉంచుకునేందుకు ప్రతీ రోజూ ఈత కొట్టేవారు. భగవంతుడామెకు ఆరోగ్యం, సంపద ఇచ్చాడు. వాటిని అనుభవిస్తూ మద్రాసులో తృప్తిగా జీవించారు. ఆమె చెల్లెలు లీలారాణికి రామ్‍నాడ్‍లోని రాచకుటుంబానికి సంబంధాలుండేవి. ఆవిడ భర్త షణ్ముగ రాజేశ్వర సేతుపతి. వారి కూతురు నళినికి సినిమాలంటే ఆసక్తి. చెల్లెలు వ్యతిరేకించినప్పటికీ, నళిని సినిమాల్లో ప్రవేశించేందుకు కమల ప్రోత్సాహించారు. నళిని సినిమాల్లోకి వచ్చి ‘ఎంజిఆర్ లత’ లేదా ‘లత సేతుపతి’ పేరుతో రాణించి పేరు తెచ్చుకున్నారు. నళిని సోదరుడు కూడా నటుడే. అతని పేరు రాజ్ కుమార్. అతని మొదటి సినిమాలో హీరోయిన్ రతి అగ్నిహోత్రి. ఆ సినిమా 1980లో విడుదలైన ‘అందాల రాశి’ (దీని తర్వాత రతి ‘ఏక్ దూజే కేలియే’కి ఎంపికయ్యారు, ఇక మిగిలినది చరిత్రే). కమలా కోట్నీస్ 2000 సంవత్సరంలో మరణించారు.
2020 జనవరిలో నేను నటి లత గారిని కలిసాను. ఆవిడ ఎంతో ఆదరంగా స్వాగతించారు. నాకు పరిచయం చేయడానికి ఆవిడ తన పెద్దక్కని పిలిచారు. ఓ మహిళ లోపల్నించి నవ్వుతూ బయటకిచ్చారు. ఆవిడ కేసి చూసి విస్తుపోయాను… ఆవిడ అచ్చు గుద్దినట్టు కమలా కోట్నీస్‍లా ఉన్నారు!!!
Cuckoo Moore – విషాదాంత జీవితం!:
భారతీయ చిత్రరంగంలోని సుప్రసిద్ధ నాట్యరాణుల్లో కుక్కూ మోరే (Cuckoo Moore) ఒకరు. ఇలాంటి నాట్యగత్తెలు ఆమెకి ముందు ఎందరో ఉన్నారు – ‘అజూరీ’ అనే నాట్యగత్తెతో సహా! కుక్కూ ఈవిడనే ఆదర్శంగా తీసుకున్నారు. అయితే శరీర భంగిమల ప్రదర్శన, మత్తెకించే హావభావాల విషయానికొస్తే, హిందీ సినీరంగపు నాట్యరాణుల్లో కుక్కూ మేటి అనే చెప్పాలి. కేబరే నృత్యం ఈమెతోనే మొదలై, 1950 – 1970ల మధ్య వచ్చిన సినిమాల్లో తప్పనిసరి భాగం అయింది.
అది 1944వ సంవత్సరం. టాకీ సినిమాలు మొదలై అప్పటికే 13 సంవత్సరాలు అయ్యింది. దేవికారాణి, శోభనా సమర్థ్‌లు అప్పటికే తమ స్థానాన్ని నిలుపుకున్నారు. అందంగా ఉన్నప్పటికీ, కొత్త వాళ్ళు ప్రధాన నాయిక కాలేని రోజులవి – ఇక కాళ్ళూ చేతులు ఆడించే నాట్యగత్తెల పాత్రల మాట దేవుడెరుగు! ఆ సమయంలో ఓ అందమైన రూపంతో, తాజా ముఖంతో ఒక ఆంగ్లో-ఇండియన్ యువతి – ‘పెహ్లీ నజర్’ (ఈ సినిమాలోని – దిల్ జల్తా హై తో జల్నే దో – పాటతో ముఖేశ్ సినీరంగ ప్రవేశం జరిగింది), ‘ముజ్రిమ్’ – అనే రెండు సినిమాలలో తన అద్భుతమైన నృత్యాలతో ప్రేక్షకులని అలరించింది. ఆ సినిమాల టైటిల్స్‌లో ఆమె పేరు ‘కుక్కూ’ అని వేశారు.
తొలినాటి హిందీ సినిమా చరిత్రలో లానే, కుక్కూ చాలాకాలం వెలుగులోకి రాలేదు. ఆమె గురించి, ఆమె అసలు పేరు గురించి ఎక్కువమందికి తెలియలేదు. ఆమె ఎప్పుడూ హుందాగా, ఒక్కోసారి నిష్క్రియగా, ఒక్కోసారి అల్లరిగా ఉండేవారు. అయితే తెర మీద మాత్రం హొయలు ఒలకపోస్తూ, ప్రేక్షకులను దాదాపు 20 ఏళ్ళు అలరించారు. మొదటి చిత్రంతోనే గొప్ప క్రేజ్ సంపాదించుకున్న కుక్కూ, తరువాతి ఐదేళ్ళలో నమ్మశక్యం కాని రీతిలో 49 సినిమాల్లో ఆడిపాడారు. వాటిల్లో మెహబూబ్ ఖాన్ ‘అనౌఖీ అదా’ (1948), హెచ్.ఎస్. రావైల్ ‘పతంగ’ (1949), దేవేంద్ర గోయల్ ‘ఆంఖేఁ’ (1950) ఉన్నాయి. ఆనాటి సుప్రసిద్ధ సినీ దర్శక/నిర్మాతలతో – కుక్కూ డాన్స్ పెట్టని ఒకే ఒక్కరు వి. శాంతారాం. చాలా సినిమాలలో ఒక పాటలో నర్తించే వెళ్ళిపోయే పాత్రే కావచ్చు, కానీ, ఆమె ప్రభావం ఎలాంటిదంటే – డిస్ట్రిబ్యూటర్లు – సినిమాకి హీరోయిన్‌లా, కుక్కూ కూడా తప్పనిసరిగా ఉండాలనేవారు. ఈ ఆటా పాటలకి – తరువాతి కాలంలో హెలెన్-ఆశా జోడీ వలె, – కుక్కూ, షంషాద్ బేగం జోడి కట్టారు. ఈ ఇద్దరూ కలిసి మరుపురాని హిట్ పాటలనెన్నో అందించారు.
కుక్కూ కెరీర్‍లో మెహబూబ్ ఖాన్ సినిమాలు గొప్ప పాత్ర పోషించాయి. ఆయన తీసిన ‘అనౌఖీ అదా’ లో కుక్కూ చేసిన నృత్యాలు తదుపరి కాలంలో ఆమెని అగ్రశ్రేణి నాట్యగత్తెగా నిలిపాయి. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, నర్గిస్ నటించిన రొమాంటిక్ మెలోడ్రామా ‘అందాజ్’ కుక్కూ లోని నటనా సామర్థ్యాన్ని వెలికితీసింది.
హెలెన్ వచ్చి, తన స్థానాన్ని ఆక్రమించేదాకా, కుక్కూ హిందీ సినిమాలో ఉన్నత స్థాయి నాట్యగత్తెగా ఉన్నారు. అలాగే గొప్ప నాట్యతార వైజయంతీమాల సినీ ప్రవేశం కూడా కుక్కూ సినిమాలపై ప్రభావం చూపింది. అయితే 13 ఏళ్ళ హెలెన్‌ని – గ్రూప్ డాన్సర్లలో ఒకరిగా పరిచయం చేసింది కుక్కూనే కావడం విశేషం.
కుక్కూ 1960ల వరకు సినిమాల్లో నర్తించారు, చివర్లో గ్రూప్ డాన్సర్లలో ఒకరిగా కూడా నృత్యం చేశారు.
తన గురువు కుక్కూ మోరేని గుర్తు చేసుకుంటూ హెలెన్ ఇలా చెప్పారు:
“బాలీవుడ్ ‘కేబరే క్వీన్’, నాట్య దిగ్గజం కుక్కూ మోరే విలాసంగా జీవించారు. విచ్చలవిడిగా ఖర్చు చేశారు, చేతిలో పైసా లేకుండా మరణించారు. ఆమె మూడు కార్లు (ఒక కారు ఆవిడ ఉపయోగించుకునేవారు, రెండవ కారులో ఆమె కుక్కలని బయటకి తీసుకువెళ్ళేవారు, మూడవ కారులో ఈ శిష్యురాలిని, అక్కతో సహా తిప్పేవారు), ఆమె ఫ్లాట్స్, ఆమె కున్న బంగారం అన్నీ పోయాయి, ఎందుకంటే ఆమె ఇన్‍కమ్ టాక్స్ ఎగ్గొట్టారు. ఆమె ఒక సినిమాకి ఆరువేల రూపాయలు వసూలు చేసేవారు. 1950 నాటి సినిమాలకి అది పెద్ద మొత్తమే. తన జీవితమంతా ఒక దర్శకుడికి ధారపోస్తే, ఆమెకి అవసరమైన సమయంలో ఆయన ఆదుకోలేదు. 52 ఏళ్ళ వయసులో కుక్కూ క్యాన్సర్‍తో మరణించారు. ఆమె చివరి రోజుల్లో మందులు కొనుక్కోడానికి కూడా ఆమె వద్ద డబ్బు లేదు. ఆమె ఎన్నడూ భద్రత గురించి, రేపటి గురించి ఆలోచించేవారు కాదు.”
హెలెన్ ఇంకా మాట్లాడుతూ… “అయితే ఆమె అద్భుతమైన వ్యక్తి! అవకాశాలు ఆగిపోయినప్పుడు, ధనం లోపించినప్పుడు, ఆమె కళ్ళ నుండి ఒక చుక్క కన్నీరు రాలేదు. బదులుగా తన అవస్థల పైన హాస్యమాడారు. కొందరు నటులు సాయం చేసినా, అప్పటికే బాగా ఆలస్యమైపోయింది.” అని చెప్పారు.
***
***
కుక్కూ మోరే నర్తించిన కొన్ని సినిమా పాటలు యూట్యూబ్‍లో చూడవచ్చు:
‘బర్సాత్’ సినిమాలోని ‘పత్లీ కమర్ హై’ పాట:
~
‘అనౌఖీ అదా’ సినిమాలోని నాట్యం:
~
‘బుజ్‌దిల్’ చిత్రంలో నాట్యం
~
‘షైర్’ చిత్రంలో నాట్యం:
~
‘అఫ్సానా’ చిత్రంలో నృత్యం:
~
‘దిల్‍రూబా’ చిత్రంలోని ‘చిరయ్యా ఉడి జాయే రే’ పాట:
~
‘ఆవారా’ చిత్రంలోని ‘ఏక్ దో తీన్’ పాట:
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్‍లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.