సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హాలీవుడ్‌లో ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ – ది గ్రేట్ ఎడిత్ హెడ్:
మరే మహిళ గెలుచుకోనన్ని ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న దిగ్గజ కాస్ట్యూమర్ ఎడిత్ హెడ్. హాలీవుడ్‌లో ఫ్యాషన్ ట్రెండ్స్ ఆరంభించి, వస్త్రాలంకరణకు సంబంధించిన ఆచారాలను సమూలంగా మార్చారు.
ఆమె 1897లో కాలిఫోర్నియాలో జన్మించారు. పూర్తి పేరు ఎడిట్ క్లెయిర్ పోస్‌నర్. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఫ్రెంచ్ ఆనర్స్‌తో సహా, బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ లెటర్స్ అండ్ సైన్సెస్ లో డిగ్రీ సాధించారు. ఆపై, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి రొమాన్స్ లాంగ్వేజెస్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. తొలుతగా ఫ్రెంచ్, ఆర్ట్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించారు.
1924లో 26 ఏళ్ళ వయసులో ఆమె పారమౌంట్ పిక్చర్స్ వారి వద్ద కాస్ట్యూమ్ స్కెచ్ ఆర్టిస్ట్‌గా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. అప్పటికి ఆమెకి ఆ రంగంలో పూర్వానుభవం లేదు. అయితే ఆ ఉద్యోగం వచ్చాకా, ‘తాను Chouinard Art College తన తరగతిలోని తన స్నేహితులు గీసిన స్కెచ్‌లను అరువు తీసుకున్నాన’ని చెప్పారు. మూకీ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం ప్రారంభించారు. తొలిసారిగా మంచిపేరు 1933లో Mae West వారి ‘She Done Him Wrong’ చిత్రానికి వచ్చింది. 1938లో ఆమె పారమౌంట్ పిక్చర్స్‌లో కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్‌కి అధిపతి అయ్యారు. అక్కడ 1967 వరకు పని చేశారు. ఆ తర్వాత యూనివర్సల్ పిక్చర్స్‌లో చేరి, 1981లో చనిపోయేంత వరకు అక్కడ పనిచేశారు.
తన మొత్తం కెరీర్‌లో ఆమె 35 సార్లు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అవగా, 8 సార్లు ఆ పురస్కారాన్ని పొందారు. చరిత్రలో మరేఇతర మహిళా ఇన్ని ఆస్కార్ అవార్డులు గెలుపొందలేదు. The Heiress, Samson and Delilah, All About Eve, A Place in the Sun, Roman Holiday, Sabrina, The Facts of Life ఇంకా The Sting చిత్రాలను గాను ఆమె ఆస్కార్ అందుకున్నారు. Samson and Delilah (కలర్), All About Eve (బ్లాక్ అండ్ వైట్) చిత్రాలకు ఆస్కార్‌ను 1951లో అందుకున్నారు. 1948 నుంచి 1967 వరకు కలర్, బ్లాక్ అండ్ వైట్ విభాగాలలో కాస్ట్యూమ్స్‌కి విడి విడిగా అవార్డులిచ్చేవారు.
అలనాటి హాలీవుడ్ తారామణులు… Barbara Stanwyk నుంచి Grace Kelly, Audrey Hepburn, Bette Davis వరకు… ఎడిత్ అత్యంత విశ్వాసపాత్రురాలు. ఇంకా ఎందరీ నటీమణులు తమ కాంట్రాక్టులలో – తమ అన్ని చిత్రాలలో తమకు దుస్తులు ఎడిత్ రూపొందిచాలని పేర్కొనేవారు.
తారలకు తెరమీద దుస్తులు రూపొందించడమే కాకుండా, ఎడిత్ ఎందరో నటీమణులకు అవార్డు ఫంక్షన్‌లలో ధరించే ప్రత్యేక దుస్తులు రూపొందించారు. ఆస్కార్ అవార్డు అందుకునే సమయంలో – 1954, 1955లో Audrey Hepburn, Grace Kelly ఎడిత్ డిజైన్ చేసిన దుస్తులనే ధరించారు. ఆ రోజు గ్రేస్ కెల్లీ ధరించిన పౌడర్ బ్లూ డ్రెస్ – ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులని అంటారు. దాని తయారీకైన ఖర్చు అప్పట్లో 4000 డాలర్లని అంటారు. అలాగే Hepburn ఆనాడు ధరించిన దుస్తులు – ఎడిత్ నిజానికి ‘రోమన్ హాలిడే’ చిత్రానికి రూపొందించినవి. చివరి సీనులో కనబడుతుంది.
1938లో ఆమె పారమౌంట్ పిక్చర్స్‌లో కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్‌కి అధిపతి అయినప్పుడు – ఒక ప్రముఖ సంస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి మహిళ అయ్యారు. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్‌ని తరచూ కలుస్తూ, ఆయనతో కలిసి 11 సినిమాలకు పనిచేశారు ఎడిత్. వీటిల్లో చాలా వాటిలో గ్రేస్ కెల్లీ నటించారు. To Catch a Thief తన అభిమాన చిత్రంగాను, కెల్లీ తన అభిమాన నటిగారు ఎడిత్ చెప్పేవారు. “నేను వేలాది మంది నటులకు, నటీమణులకు, జంతువులకు దుస్తులు రూపొందించాను. నీ అభిమాన నటి ఎవరు అని నన్ను అడిగితే మాత్రం గ్రేస్ కెల్లీ అని చెప్తాను” అన్నారు ఎడిత్. “ఆమె గొప్ప అందగత్తె, నాకు మంచి నేస్తం” అన్నారు. “ఓ కాస్ట్యూమ్ డిజైనర్ పని – మాయకీ, మభ్యపెట్టడానికి మధ్యలో ఉంటుంది. తమది కాని రూపంలోకి నటీనటులను మార్చి మేం ఒక భ్రమ కల్పిస్తాం. ఓ కళాకారుడి ప్రదర్శన చూసిన ప్రతిసారి – కొత్త వ్యక్తిగా నమ్మాలని ప్రజలకి సూచిస్తాం” అన్నారామె.
ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకున్నారు. తాను ధరించే దుస్తుల గురించి ఎవరు ఏమన్నా ఆమె పట్టించుకోలేదు. స్టూడియోలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కూడా తనకి ఎలా సౌకర్యంగా ఉంటుందో అలాగే ఉన్నారు. ‘ది ఇన్‌క్రెడిబుల్స్’ చిత్రంలో సూపర్ డిజైనర్ ఎడ్నా మోడ్ పాత్రకి ఎడిత్‌ని ప్రేరణగా తీసుకున్నారని పుకార్లు వినిపిస్తాయి.
1951 లో A Place in the Sun చిత్రానికి గాను ఎలిజబెత్ టేలర్‌కి దుస్తులు రూపొందించడం సంచలనం సృష్టించింది. ఎడిత్ రూపొందించిన full-skirted strapless layered chiffon gown ఎందరికో తెగ నచ్చేసింది. చాలామంది డిజైనర్లు దాన్ని అనుకరించారు. అమెరికా అంతటా హైస్కూళ్ళలోనూ, వివాహాలలోనూ అటువంటి గౌన్‌లనే ధరించారు. దీన్ని వెండితెర పై కనిపించిన తొలి స్ట్రాప్-లెస్ డ్రెస్‌గా పరిగణిస్తారు. ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్న ‘prom-style’ డ్రెస్ ఎడిత్ రూపొందిన గౌన్ ఆధారంగానే తయారైంది. ఈ సినిమాకి ఎడిత్‌కి మూడవ ఆస్కార్ లభించింది. అలాగే ఎలిజబెత్ టేలర్‌కీ, ఎడిత్ మధ్య గాఢ మైత్రికి దారితీసింది.
1925 నుండి 1982 వరకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఆమెకి మొత్తం 444 క్రెడిట్స్ లభించాయి. తాను చూడని సినిమాలకి కూడా తాను దుస్తులు రూపొందించినట్టు ఆమె ఒకసారి వెల్లడించారు.
ఆమె 8వ, చివరి ఆస్కార్ 1973లో వచ్చిన, Robert Redford, Paul Newman నటించిన The Sting అనే చిత్రానికి మెన్స్‌వేర్ విభాగంలో డిజైన్స్‌కి లభించింది.
ఎడిత్ 24 అక్టోబరు 1981న తన 84వ జన్మదినానికి కొద్ది రోజుల ముందు, నయం కాని మజ్జ వ్యాధితో కన్ను మూశారు. ఆమె సమాధి కాలిఫోర్నియాలోని గ్లెన్‌డేల్ లోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్‌లో ఉంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి రంజన్:
అలనాటి నటులు శ్రీ రంజన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే – ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలి అనాలి. ఆయన ప్రసిద్ధి పొందిన నాట్యకారులు, సంగీత విద్వాంసులు, నాటక రచయిత, జర్నలిస్ట్, విమర్శకులు, విద్యావేత్త, ఏవియేటర్, అథ్లెట్, పెయింటర్ ఇంకా మెజీషియన్ కూడా! ఇది 1950ల నాటి ఆయన ప్రొఫైల్. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా హిందీ సినీ వీక్షకులు కూడా ఆయనను ఎంతో అభిమానించేవారు. ఇన్ని రంగాలలో ఆయన ప్రతిభని తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత గొప్ప జీవితాన్ని గడిపారో అనిపిస్తుంది.
ఇన్ని రంగాలలో నైపుణ్యాన్ని ఆయన ఎలా సాధించగలిగారో? ఆయన సాధించిన ఎన్నో విజయాల రహస్యం ఏంటంటే, ఒక్క బద్ధకానికి తప్ప మిగతా వాటన్నింటికి ఆయన వద్ద సమయం ఉండడమే! సినిమాల షూటింగులు లేకపోతే, ఆయన తనకున్న ఆసక్తులలో ఏదో ఒకదానిలో నిమగ్నమయిపోతారు. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలని అనిపిస్తే, బొంబాయిలోని బాంద్రాలోని యూనియన్ పార్క్‌లో ఉన్న తన బంగ్లాలో బొమ్మలు గీస్తూ రిలాక్స్ అయ్యేవారు. పొర్ట్రయిట్ పెయింటింగ్ ఆయన విశేషత, ఆయన ఉపయోగించే రంగుల మేళవింపు అసాధారణం.
రంజన్ 1918లో మద్రాసులోని మైలాపూర్‍లో జన్మించారు. ఆయన అసలు పేరు రామనారాయణ వెంకటరమణ శర్మ. వారి కుటుంబం శ్రీరంగానికి చెందినది. ఎనిమిది మంది మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న సంతానంలో రంజన్ ఒకరు. రంజన్, ఆయన అన్నగారు వైద్యనాథన్ చిన్నతనంలోనే సంగీతం పట్ల ఆసక్తి కనబరిచారు. వారి తండ్రి గారు వాళ్ళని దక్షిణాదిన ప్రసిద్ధులైన గురువుల వద్ద చేర్చించి సంగీతం నేర్పించారు.
వైద్యనాథన్ పై చదువులకు కేంబ్రిడ్డ్ వెళ్ళారు. యువ రంజన్ కూడా అదే యూనివర్శిటీలో చదివి కెరీర్ ఏర్పర్చుకోవాలనుకున్నారు. కానీ ఆయన కాలేజీ చదువుల్లో ఉండగానే యుద్ధం జరగడంతో, అక్కడకు వెళ్ళే అవకాశాలు సన్నగిల్లాయి.
15 ఏళ్ళ వయసుకే వయోలిన్ అద్భుతంగా వాయిస్తూ, కళానురక్తుడిగా పేరు తెచ్చుకొన్నారు. స్కూల్ స్థాయిలో సంగీతంలో ప్రతిభకు ఎన్నో పురస్కారాలు గెల్చుకున్నారు, మద్రాసు యూనివర్శిటీ నుంచి సంగీతంలో డిప్లొమా పొందిన అతి పిన్న వయసు విద్యార్థి.
నాలుగేళ్ళ తరువాత రంజన్ మద్రాసు లోని క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఫిజిక్స్‌లో ఆనర్స్‌తో డిగ్రీ పూర్తి చేశారు. మరుసటి సంవత్సరం ఆయనకు రీసెర్చ్ స్కాలర్‍షిప్ లభించింది. లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసంలో ఆయన యూరోపియన్, జపనీస్, చైనీస్ సంగీతాల గురించి చర్చించారు. నిజానికది, ప్రపంచ సంగీతపు చరిత్ర. తన సిద్ధాంత వ్యాసంపై పనిచేస్తూ రంజన్ పాశ్చాత్య సంగీతాన్ని అధ్యయనం చేశారు, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ వారి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వయోలిన్, ఇంకా ఇతర భారతీయ వాయిద్యాలను వాయించడంలో ప్రావీణ్యం గల రంజన్ పెయింటింగ్‌లోనూ విశేష ప్రజ్ఞ కనబరిచారు.
నాట్య కళ కూడా ఆయనను ఆకర్షించింది. తీరిక లేకుండా ఉన్నా కూడా ఆయన నాట్యాన్ని అధ్యయనం చేసి భరత నాట్యం, కథాకళి, కథక్ లలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం సాధించారు.
మద్రాస్ రేడియోలో పాటలు పాడారు. ఆయన స్వరం దక్షిణ భారతమంతా ప్రసిద్ధం. ఆయన కళల గురించి రేడియోలో ప్రసంగాలు కూడా చేశారు.
ఓ కళాకారుడిగా ఇంకా ఏదో సాధించాలన్న తపన ఆయనలో కలిగింది. ‘ఋష్యశృంగ’, ‘భక్త నారదార్’ అనే తమిళ సినిమాలో నటించారు. రెండింట్లోను టైటిల్ పాత్ర పోషించారు. ఈ రెండు సినిమాల విజయం ఆయనతో తృష్ణని రేకెత్తించింది. నటన కొనసాగించి, మూడవ సినిమా ‘మంగమ్మ శపత్తం’లో ద్విపాత్రాభినయం చేశారు.
వీటి తర్వాత ఆయన మళ్ళీ చదువులవైపు మళ్ళారు. మద్రాస్ యూనివర్శిటీలో భారతీయ శాస్త్రీయ నృత్యం అంశంగా రీసెర్చ్ ఫెలోగా చేరారు. “Varieties of Thirmanas and Jatis” అన్న సిద్ధాంత వ్యాసం వ్రాశారు.
సినిమాల్లో నటించాలనే కోరిక మళ్ళీ ఆయనలో తలెత్తింది. తమిళ ‘చంద్రలేఖ’ చిత్రంలో విలన్‍గా అవకాశం దొరికింది, ఆయన అంగీకరించి ఆ పాత్ర పోషించారు. ఆ తరువాత ఆ సినిమాని హిందీలో తీసినప్పుడూ విలన్‍గా నటించారు. ఆ తర్వాత ‘నిషాన్’ అనే చిత్రంలో నటించారు.
మద్రాసులో ఆయన ఓ నృత్య, సంగీత పాఠశాలను నిర్వహించారు. 1941లో ప్రారంభించినప్పటి నుండి ఈ పాఠశాల ఐదు సమ్మర్ కోర్సులను నిర్వహించింది. 1942లో రంజన్ ప్రతిభాశాలి అయిన ఓ నర్తకి, గాయనిని వివాహమాడారు. వారిద్దరూ కలిసి దక్షిణదేశమంతా తిరిగి నాట్య ప్రదర్శనలిచ్చారు. ఈ పర్యటనలో ఆయన నృత్య దర్శకత్వం వహించి, కాస్ట్యూమ్స్ రూపొందించి, భార్యతో కలిసి నృత్యంలో పాల్గొన్నారు.
ఒక రచయితగా కూడా రంజన్ ప్రదర్శన గొప్పది. ఎన్నో పుస్తకాలు, నాటకాలు రాశారు. Sheridan “Duenna” ను తమిళంలోకి అనువదించారు. సంగీతంపై ఎన్నో కరపత్రాలు రాశారు. ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాశారు. స్వయంగా ‘నాట్యం’ అనే పత్రికను చాలా ఏళ్ళ పాటు నిర్వహించారు.
రంజన్ నిపుణులైన ఏవియేటర్ కూడా. పైలట్ ఎ లైసెన్స్ ఉందాయనకు. అంతే కాదు ప్రతిభ కలిగిన అథ్లెట్ కూడా. గుర్రపుస్వారీ, ఈత, క్రికెట్, సాకర్ వంటి క్రీడలో విశేష ప్రతిభ కనబరిచారు. కత్తి యుద్ధంలోనూ నైపుణ్యం ఉంది. వాలంటీరుగా వై.ఎం.సి.ఎ క్రీడాకారులకు శిక్షణనిచ్చారు. సినీ రంగం నుంచి రోల్స్ రాయిస్ కారు కొన్న తొలి వ్యక్తి ఆయనే.
1951లో రంజన్ ‘Rhythmics In Music And Dancing’ అనే 1500 పేజీల సిద్ధాంత గ్రంథాన్ని సంగీతంలో డాక్టరేట్ కోసం మద్రాస్ యూనివర్శిటీకి సమర్పించారు.
అమెరికన్ నృత్య రీతులను, సంగీతాన్ని, రంగస్థలాన్ని అధ్యయనం చేసేందుకు గాను 1951లో అమెరికాకు చెందిన రాక్‍ఫెల్లర్ ఫౌండేషన్ ఆయనకు ప్రత్యేక స్కాలర్‌షిప్ మంజూరు చేసింది. కాని ‘మంగళ’ సినిమాకి చేయవలసిన పని ఉండిపోవడంతో, ఆయన వెళ్ళలేకపోయారు.
‘మంగళ’ షూటింగ్ పూర్తవగానే, ఆయన ఓ వారం సెలవు తీసుకుని సిలోన్ వెళ్ళారు. అక్కడ ఆయన సర్ కరోల్ రీడ్‍ని కలిసారు. అప్పుడాయన అక్కడ ‘An Outcast Of The Islands’ అనే సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత రంజన్ బొంబాయి వచ్చారు. అక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు.
రంజన్ చెకోస్లోవేకియా, పోలాండ్, రష్యా వంటి దేశాలను సందర్శించి వచ్చారు. మాస్కో నుంచి ఆయన పెకింగ్ వరకు ట్రాన్స్-సైబిరీయన్ రైల్వేలో పదకొండున్నర రోజుల పాటు ప్రయాణించారు. బొంబాయికి వచ్చే ముందుగా, హాంగ్‍కాంగ్, బ్యాంకాక్ సందర్శించారు. ఈ విస్తృతమైన పర్యటనలో ఆయన పలు దేశాలకు చెందిన దాదాపు యాభై మ్యూజిక్ గ్రూపుల ప్రతినిధులను కలుసుకున్నారు.
సుర్ సింగర్ సంసద్ తరఫున 1956 రంజన్ బొంబాయిలో ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నాట్య, సంగీత సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. 1957లో జరిగిన మాస్కో ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్‍లో రంజన్ పాల్గొన్నారు. భారతీయ సంగీతకారుల నృత్యకారుల బృందానికి నాయకత్వం వహించారు.
అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఇంటర్నేషనల్ బ్రదర్‍హుడ్ ఆఫ్ మెజీషియన్స్ అన్న సంస్థలో రంజన్ సభ్యులు. పి.సి. సర్కార్ అధ్యక్షుడిగా ఉన్న ఆల్ ఇండియా మెజీషియన్స్ క్లబ్ బొంబాయి శాఖకి రంజన్ అధ్యక్షులు.
రంజన్ నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త కూడా. 1957లో మద్రాసులో హరిజనుల కోసం పాఠశాల నిర్మించి, రాజాజీతో ప్రారంభింపజేశారు.
హిందీ చిత్రసీమలో ప్రవేశించాకా, వరుసగా హిట్‍లు ఇచ్చారు. ‘మదారి’, ‘బహుత్ దిన్ హుయే’, ‘నిషాన్’, ‘సువర్ణ్ సుందరి’, ‘మాజిక్ కార్పెట్’, ‘చోర్ చోర్’, ఇంకా ‘చోర్ హో తో ఐసా’ అనే సినిమాలు ఆయనకు పేరు తెచ్చాయి.
హిందీ రంగం నుంచి తిరిగి రంజన్‍ని తమిళ చిత్ర సీమకు తెచ్చిన ఘనత చిన్నప్ప దేవర్‍కి దక్కుతుంది. ఆయన నిర్మించిన ‘నీలమలై తిరుడన్’ (1957)లో రంజన్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో రంజన్ తన స్థాయిని కాపాడుకున్నారు. రంజన్ చాలా హిందీ సినిమాల్లో నటించినప్పటికీ అవి ముఖ్యంగా కాస్ట్యూమ్ డ్రామాలు, కొన్ని సాంఘిక చిత్రాలే. 1950ల తర్వాత ఆయన ప్రాభవం క్షీణించసాగింది. తమిళ సినిమాల్లో మళ్ళీ ప్రయత్నించినా తొలినాటి విజయాలు దక్కలేదు. తమిళంలో ‘కెప్టెన్ రంజన్’ ఆయన చివరి చిత్రం.
ఆయన భార్య వైద్యురాలు. వారికి సంతానం లేదు. ఈ దంపతులు అమెరికా వెళ్ళి, అక్కడ స్థిరపడి పౌరసత్వం పొందారు.
12 సెప్టెంబరు 1983 నాడు రంజన్ ఓ అమెరికన్ హోటల్‌లో గుండెపోటుతో మరణించారు. అప్పుడాయన వయసు 65 ఏళ్ళు.
భారతీయ సినీరంగానికి విశేష సేవలందించిన రంజన్ భౌతికంగా కనుమరుగయినా, ఆయన కీర్తిప్రతిష్ఠలు చిరస్థాయిగా ఉంటాయి.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.