Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు-90

సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఫోటోగ్రఫి నుంచి సినెమాటోగ్రఫీ వరకు – దిగ్దంతి మార్కస్ బార్‌ట్లే

దక్షిణ భారతీయ చలనచిత్రాలలో ఛాయగ్రాహకులుగా అద్భుతాలు సృష్టించిన దిగ్గజం మార్కస్ బార్‌ట్లే.  ఫోటోగ్రఫీ నుంచి సినెమాటోగ్రఫీ వరకు తన ప్రస్థానం ఎలా సాగిందో ఆయన మాటలలోనే తెలుసుకుందాం.

***

“మొదటిసారిగా నా చేతికి బ్రౌనీ కెమెరా వచ్చి, దానితో తీసిన ఫోటోలను నేను డెవెలప్ చేసిన క్షణంలో – నాకు తెలిసిపోయింది, ఏదో ఒక రోజు నేను సినెమాటోగ్రఫర్‍ని అవుతానని! ఇది జరిగినది 1931లో. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు, మద్రాసులో చదువుతున్నాను. అవి టాకీల రోజులు. సినిమాల్లో చక్కని పాటలు, అందమైన చిత్రీకరణ ఉండేవి. అలాంటి అందాలు నా ఫోటోలలో ఉండాలని అనుకునేవాడిని…

నాన్న డెంటిస్ట్, సైన్యంలో పని చేసేవాడు. సైన్యంలో తన బాధ్యతల చివరి దశలో ఉండేవాడు. ఎక్స్‌రేలతో పని చేసేవాడు, వాటిని మెడికల్ విభాగం డెవెలప్ చేసేది. నాకు అందులో ఆసక్తి కలిగింది. నా అంతట నేనుగా కొంత పని చేసేవాడిని. అప్పుడే నాకనిపించించి – డెవలప్ చేయడం కన్నా ఫోటోలే తీయచ్చు కదా అని! నా ఈ ఆసక్తి అంటే నాన్నకి కూడా ఇష్టమే. బ్రౌనీ కెమెరా చేతికి రావడంతో ఎంతో థ్రిల్ అనిపించింది. ఆ కెమెరాలోంచి ఫోటోలు బయటకి రావడం ఇంకా థ్రిల్లింగ్‍గా ఉండేది. వాటిని ప్రింట్ చేయడం ప్రారంభించాను, ఏవైనా గొప్పగొప్పవి ఫోటోలు తీయాలనుకునేవాడిని. కాని నేను అప్పటికి ఇంకా బడిలోనే వున్నాను, అందుకని వారాంతాలు ఉపయోగించుకునేవాడిని. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో దూరం నడిచేవాడిని. గ్రామీణ ప్రాంతాలను, గ్రామీణ జీవితాలను చిత్రించేవాడిని. నాన్న నాకు నెలకో కెమెరా రోల్ కొనిచ్చేవారు. నెలకి కనీసం ఎనిమిది మంచి ఫోటోలయినా తీయాలని హెచ్చరించేవారు. అయితే నా ఈ ఆసక్తి మా ఉపాధ్యాయులకి నచ్చేది కాదు. ఇదంతా నా చదువుకి, పరీక్షలకి ఆటంకమని వారు భావించేవారు. కానీ నాకు నాన్న మద్దతు ఉండడంతో నేను పెద్దగా పట్టించుకోలేదు. 1933లో నాన్న ఓ కొత్త కెమెరా కొని నాకు బహుమతిగా ఇచ్చారు. దానిలో ఒక స్లయిడ్ ఉంచి, ఒక మంచి ఫోటో కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగేవాడిని. అలా ఓ చక్కని ఫోటో తీసుకుని ఇంటికి వచ్చేవాడిని. ఈ రకంగా నేను ఎన్నో ఫోటోలు తీసి వాటిని ‘ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’కి పంపేవాడిని. వాటిని ‘మై ఫోటో’ అనే కాలమ్‍లో ప్రచురించేవారు. మద్రాసులోని వార్తాపత్రికలు కూడా నా ఫోటోలు ప్రచురించేవి, ముఖ్యంగా సాయంత్రం పూట వచ్చే ‘మద్రాస్ మెయిల్’లో ఎక్కువగా వచ్చేవి. జాన్ విల్సన్ అనే ఆర్ట్ డైరక్టర్ – నాలో ప్రతిభ ఉందని నమ్మి, చక్కని ఫోటోలు తీసేందుకు నాకెన్నో సూచనలు ఇచ్చారు. నాకు నిర్దిష్టమైన ఎసైన్‍మెంట్స్ ఇచ్చి, నాకు వృత్తిపరమైన పేరుని పెట్టారు. స్పోర్ట్స్ అండ్ జనరల్ ఏజన్సీ ద్వారా నా ఫోటోలను ఎన్నో విదేశీ పత్రికలకు పంపమన్నారు. ఈ విధంగా నా ఫోటోలు అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. ఇదంతా నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండేది.

1934లో చదువుకి పూర్తిగా స్వస్తి చెప్పాను, మద్రాస్ మెయిల్‍లో చేరితే ఎలా ఉంటుందని ఆయన్ని అడిగాను. బ్యూరోక్రాటిక్ అమరిక నాకు అంత వీలుగా ఉండదని భావించారు. ఆ తరువాత బొంబాయిలో ‘ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ పత్రికలో స్టాన్లీ జెన్‌సన్‌తో పాటు నన్ను కూడా ప్రెస్ ఫోటోగ్రాఫర్‌గా చేర్పించారు. నెలకి 70/- రూపాయలు జీతం. అప్పట్లో నేను కేవలం ఫోటోగ్రాఫర్‍నే, కానీ వాళ్ళు నాకు డార్క్ రూం అప్పగించారు. నాకా పని నచ్చలేదు. ప్రెస్ ఫోటోలంటే నాకెప్పుడూ ఆసక్తి లేదు. వాటిలో సౌందర్యాన్ని జొప్పించలేము. నేను ఫిర్యాదు చేశాకా, నాకు ఎసైన్‍మెంట్లు ఇవ్వసాగారు. నేను తీసిన ఫోటోలకు కాప్షన్‍ ఇవ్వమనేవారు. నేను వాళ్ళకి రైటప్స్ ఇచ్చేవాడిని, అందుకని నన్ను అలా అడిగేవారు. బహుశా దేశంలో నేనే తొలి ఫోటో-జర్నలిస్ట్ అయి ఉండవచ్చు. 1936 డిసెంబర్‍లో బ్రిటీష్ మూవీ టోన్ వారు యుద్ధ దృశ్యాలను ఫోటో తీయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాను నియమించుకున్నారు. బ్రిటీష్ మూవీ టోన్ వారి జనరల్ మేనేజర్ హెర్బర్ట్ స్మిత్. ఆయన నన్ను పిలిచి ప్రొఫెషనల్ సినీ కెమెరా వాడడం తెలుసా అని అడిగారు. మరో ఆలోచన లేకుండా వచ్చని అబద్ధం చెప్పాను. బ్రిటీష్ మూవీ టోన్ వారు ఫోత్ డెబీ కెమెరా పంపారు. నిజానికి నాకా కెమెరాని ఉపయోగించడం రాదు. కానీ దాన్ని బాంబే టాకీస్ లాబొరేటరీ ఇన్‍ఛార్జ్ వద్దకు తీసుకెళ్ళాను. ఆయన కూడా నా బాస్ లానే జర్మన్ దేశస్థుడు. నా బాస్ ద్వారా ఆయన నాకు పరిచయం. ఆయన దయతో, ఆ కెమెరాని ఎలా ఉఫయోగించాలో, ఫోటోలు ఎలా తీయాలో నేర్పారు. నేను తీసిన ఫోటోలను అక్కడే డెవలప్ చేసాకా ఎంతో తృప్తిగా అనిపించింది. అప్పుడే నాకు పండరీపురం ఉత్సవాలను ఫోటోలు తీసే ఎసైన్‍మెంట్ దొరికింది. నేను చేసే న్యూస్ కవరేజ్ బ్రిటీష్ మూవీ టోన్ వారికి బాగా నచ్చింది.

న్యూస్ రీల్ కెమెరామన్‍గా లార్డ్ వెల్లింగ్‌టన్ వీడ్కోలు పర్యటనను ఫోటోలు తీసే అవకాశం లభించింది (లార్డ్ వెల్లింగ్‌టన్ 18 ఏప్రిల్ 1931 నుంచి 18 ఏప్రిల్ 1936 వరకు భారతదేశానికి 22వ వైస్రాయ్, గవర్నర్ జనరల్‌గా వ్యవహరించారు). ఆయన గ్వాలియర్, బికనేర్, బరోడా, జామ్‌నగర్, జునాగఢ్, జోధ్‌పూర్‍లలో ప్రయాణించారు. నేను కూడా ఆయన వెంట ఈ రాజాసంస్థానలలో పర్యటించాను. నేను తీసిన ఫోటోలకి ప్రశంసలు దక్కాయి.

న్యూస్ రీల్ కెమెరామన్‍గా నాకెదురైన కష్టతరమైన పని – 1937లో బొంబాయిలో జరిగిన మతఘర్షణలను చిత్రీకరించడం. ఈ బాధ్యతలో నాకు పోలీసుల కన్నా గొడవలు చేసిన వారి నుంచే సహకారం అధికంగా అందింది. అదో దురదృష్టవంతమైన రోజు. అల్లర్లు చేసేవాళ్ళు బలవంతంగా దుకాణాలు మూయించారు. దొరికిన వాటిని బద్దలు కొడుతున్నారు. నేను షాట్స్ తీస్తూ వెళ్ళాను, నాకు అది మతఘర్షణలా అనిపించలేదు. అంతర్జాతీయ ఘర్షణల్లా ఉన్నాయి. కొందరు చైనీయులు, జపనీయులు కూడా కనిపించారు. ఒక మేడ బాల్కనీమీద నుంచి కొందరు కిందనున్న వారిమీద రాళ్లు దొర్లించడం చూశాను. ఇది చూసిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తుపాకీతో రెండు రౌండ్లు కాల్చారు. మేడమీదినుంచి ఇద్దరు మనుషులు కింద పడిపోయారు. ఇదంతా నేనో సాక్షిగా, నా కెమెరాతో రికార్డు చేశాను. అది గమనించిన ఆ పోలీసు అధికారి నా వెంటపడ్డాడు, కెమెరా లాక్కుని ఫిలిం నాశనం చేదామని. కానీ నేను ఆయనకి దొరకలేదు! రెండు వీధులు దాటుకుని పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డుమీదకు వచ్చి అక్కడ ముందే ఏర్పాటు చేసుకున్న కారులో ఎక్కి థామ్సన్ రాయిటర్స్ కంపెనీకి రీల్ అందచేశాను. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మా ఆఫీసుకు వచ్చి ఆ రీల్‍ని నాశనం చేయాలని చెప్పారు, కానీ అప్పటికే అది ఎయిర్ మెయిల్‍లో ఇంగ్లండు వెడుతోంది. ఈ కవరేజ్‍ని బ్రిటీష్ న్యూస్ రీల్ ఇండియాలో చూపించినప్పుడు, ఆ దృశ్యాలన్నీ ఎడిటయిపోయాయి. అయితే న్యూయార్క్, లండన్, ప్యారిస్ ప్రేక్షకులు మాత్రం వాటిని చూడగలిగారు. దీంతో నా జర్మన్ బాస్‌కి నా మీద అసూయ కలిగింది. నా పురోగతిని నియంత్రించడానికి నన్నో గూఢచారి పనిలో పెట్టారు. బొంబాయి హార్బర్‍లో జరిగే స్మగ్లింగ్ వ్యవహారాలు ఫోటోలు తీయమన్నారు. దాదాపు 200 ప్రింట్లు తీసి, జర్మనీకి పార్సెల్ చేశాకా, ఆయనపై నాకు అనుమానం వచ్చింది. నా ఫోటోలు వెలుగు చూడలేదు. నాకు విసుగెత్తి, 1937లో ఆ ఉద్యోగం మానేశాను. మూడు నెలలు ఖాళీగా ఉన్నాను. అలా అని సమయం వృథా చేయలేదు. చికాగో రేడియోలో ఉన్న మోత్వానితో మాట్లాడాను. హరిపురాలో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశాన్ని కవర్ చేయవలసిందిగా ఆయన చెప్పారు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులను ఫోటోలు తీశాను. అది తలచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రెస్ ఫోటోగ్రఫీలానే, న్యూస్ ఫిల్మ్స్ కూడా విసుగ్గా అనిపించాయి. వీటిలో నా సృజనాత్మకతని ఎలా ప్రదర్శించడం? న్యూస్ రీల్ కెమెరామన్‌గా పని చేశా కాబట్టి, సినిమా కెమెరా కూడా వాడగలను. అందుకని సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నాను. బాంబే టాకీస్‍లో చేరాలనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. నా కుటుంబంతో మద్రాసు తిరిగి వచ్చేశాను.

అప్పట్లో కె. సుబ్రహ్మణ్యం, ఎన్.ఎస్. కృష్ణన్, టి.ఏ. మధురం సినిమాలలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కె. సుబ్రహ్మణ్యం ఆ దంపతులతో రెండు రీళ్ల చిన్న సినిమా తీద్దామని ఆలోచిస్తున్నారు. అది ఒక హాస్య చిత్రం. చిన్న సినిమా కావడంతో పేరున్న కెమెరామన్లు ఎవరూ పనిచేయడానికి ముందుకు రాలేదు. నేను ఆయనతో మాట్లాడి, కెమెరామన్‌గా పనిచేస్తానన్నాను. ఆ సినిమా మొత్తం ఎం.పి.పి.సి. స్టూడియోలో చిత్రీకరించాం. నాకు పారితోషికంగా యాభై రూపాయలు ఇచ్చారు. ఆ సినిమా చూసినప్పుడు నా ఫోటోగ్రఫీ ఎంతో ఘోరంగా ఉందని అనిపించింది. అయితే ఆ దంపతుల కారణంగా, ఆ చిన్న సినిమా విడుదలయి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో కృష్ణన్-మధురం తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తరువాత సుబ్రహణ్యం నాకు మరో ఎసైన్‍మెంట్ ఇచ్చారు. ‘యాత్రా స్పెషల్’ పేరిట దక్షిణ రైల్వేపై ఒక డాక్యుమెంటరీ తీయమన్నారు. 1938 నాటికి నాకు కెమెరామన్‍గా నెలకి 200/- రూపాయల జీతానికి స్థిరమైన ఉద్యోగం ప్రగతి స్టూడియోస్‍లో దొరికింది. ఈ స్టూడియోలో రెండు సినిమాలకి పని చేశాను. మొదటిది ఎవిఎం వారి ‘తిరువళ్ళువర్’, రెండోది నందలాల్ జస్వంత్ దర్శకత్వంలో వచ్చిన ‘వాయాడి’. నందలాల్ ఓ మేధావి, ప్రతిభాశాలి అయిన దర్శకులు. నాపై ఆయన ప్రభావం అపారం. పిక్టోరియల్ కంపోజీషన్ అంటే ఏంటో నేర్పి, నా కెరీర్‍లో నాకెంతో తోడ్పడ్డారు. ఫోటోగ్రఫీలో నిర్ణయాత్మక క్షణం ఉంటుంది, మనం దాన్ని గుర్తించాలి. మొత్తం కథని అది చెప్పేయాలి. కానీ సినెమాటోగ్రఫీలో సన్నివేశాల క్రమంలో ఆలోచించాలి. టైమ్-ఫ్రేమ్ మరీ పెద్దది. అయితే దీనికి మారడానికి నేను పెద్దగా కష్టపడలేదు. స్టిల్ ఫోటోగ్రఫీలో నా అనుభవం మోషన్ పిక్చర్స్‌లో బాగా ఉపయోగపడింది. మోషన్ పిక్చర్స్‌లో సహజసిద్ధమైన వెలుగును అనుసరించాలి. సూర్యకాంతే అన్ని సార్లూ ఉండాలని అనుకోనక్కరలేదు. కిటికీ లోంచి వచ్చే కాంతి అయినా, లేదా నేల మీద పడి ప్రతిబింబించే కాంతి అయినా సరిపోతుంది. ఒక బింబాన్ని మీరు ఊహించి, కృత్రిమ వెలుగుతో దాన్ని సృష్టించగలగాలి. ఇప్పుడిది రెండవ ప్రకృతి. ఒకప్పుడు నేను కృత్రిమ వెలుగుని తిరస్కరించేవాడిని. కానీ ఇప్పుడు ఆధునికమైన లెన్సులూ, ఫిల్ములూ ఉన్నాయి. కృత్రిమ వెలుగునూ ఉపయోగించుకోవచ్చు. రంగుల చిత్రాలు కొంచెం కష్టమయ్యేది ఆ రోజుల్లో. టెక్నికలర్ లిమిటెడ్ వంటి కంపెనీలదే ఆధిపత్యం. వాళ్ళు షరతులు పెట్టేవారు. వాటిని అంగీకరించవల్సి వచ్చేది, కాని నాణ్యత ఉత్తమమైనది. వారి పరికరాల అవు‍ట్‌లే బాగా ఎక్కువ. అందుకని వాటిని అధికంగా చార్జ్ చేయాల్సి వచ్చేది. తర్వాతి కాలంలో ఈస్ట్‌మన్ వారు మోనోపాక్ నెగటివ్ తీసుకొచ్చాక, మాకు పని సులవయింది. దానికి స్పెషల్ ప్రాసెసింగ్, ప్రింటింగ్ అవసరం లేదు. క్రమంగా మోనోపాక్ ప్రాధాన్యత పెరిగింది. కెమెరాలు బాగా బరువుగా ఉండడం వల్ల టెక్నికలర్‌లో చిత్రీకరించడం కష్టంగా ఉండేది. ‘గాన్ విత్ ది విండ్’ చిత్రాన్ని తీసిన కెమెరా ఓ విశేషం. నేనా కెమెరాని చూశాను. దానికి కెమెరామన్ అక్కర్లేదు, కూలీలు ఉంటే చాలు! కానీ వాళ్ళకి ఆ కెమెరా అలవాటయిపోయి, దానితోనే పని కానిచ్చారు. అయితే అన్నిటికన్నా గొప్ప కెమెరా మిచెల్ వాళ్ళది. దాన్ని తర్వాతి యాభై ఏళ్ళకి కూడా వాడచ్చు. కాని ఇప్పుడు ఈ కెమెరాని స్పెష్టల్ ఎఫెక్ట్స్ కోసమే వాడుతున్నారు.

1940లో నాకు ప్రగతి వాళ్ళతో గొడవయింది. ఉద్యోగం వదిలేశాను. ఆరు నెలలు నిర్యుద్యోగిగా ఉన్నాను. ఆ సమయంలో – కృష్ణుడి పాత్రలో విజయవంతమైన నటుడు సెరకులతూర్ శామా – నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. ఆయన పూనామల్లీ హై రోడ్ లోని నేషనల్ మూవీ టోన్ స్టూడియోని లీజుకు తీసుకుని దాని పేరు భారత్ సినీటోన్‍గా మార్చారు. ఆయనతో సగం పూర్తి చేసిన ఒక సినిమాకి పనిచేశాను. ఆ తర్వాత ఆ సినిమాని మూలన పడేశారు, నాకేమీ డబ్బులు రాలేదు. ఆయనే మరో సినిమా తీస్తుంటే దానికీ పని చేశాను. అది కూడా సగంలో ఆగిపోయింది, డబ్బులు రాలేదు. ఈ రకంగా ఆయనతో ఏడాది పని చేశాను. 1941లో నేను న్యూటోన్ స్టూడియోలో చేరాను. వీరితో పని చేయడం నాకు అదే మొదటిసారి. వీళ్ళతో 1947 వరకు ఉన్నాను. తమిళ్ కణ్ణగి, కుబేర కుచేల, మహా మాయ వంటి సినిమాలకు పని చేశాను. ఆ సమయంలో వాహిని సంస్థ వారు స్వర్గ సీమ సినిమా తీయడానికి న్యూటోన్‌కి వచ్చారు. వాళ్ళు నా పనితనం గమనించి, స్వర్గ సీమ సినిమాకి పని చేయడం కోసం నాతో ఒప్పందం చేసుకున్నారు. ఇది నా కెరీర్‍లో ఒక పెద్ద, గొప్ప మలుపు! వాళ్ళు అప్పట్లో వాహినీ స్టూడియో కూడా నిర్మిస్తున్నారు. నామీద ఎంతో నమ్మకం ఉంచి, ఫిల్మ్ లేబొరేటరీని స్థాపించే బాధ్యతా, అందులోని నాణ్యమైన పరికరాల బాధ్యతా నాకే అప్పగించారు. ఆ రోజుల్లో మద్రాసులోని ఏ ఫిల్మ్ లేబ్‌ని నేను విశ్వసించేవాడిని కాను. ఈ కొత్త బాధ్యత వల్ల నా కళని మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. నా పనితనంలోనూ గొప్ప మార్పు వచ్చింది. అక్కడ్నించి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వాహినీ సంస్థతోనే ఉండి, యోగి వేమన, గుణసుందరి కథ, ఆ తర్వాత విజయ సంస్థలో షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చూసి చూడు, చంద్రహారం, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, జగదేక వీరుని కథ…. ఇలా ఎన్నో సినిమాలకి పనిచేశాను.

నేను వెన్నెల దృశ్యాలకి పేరుపొందానని నాకు తెలుసు. అది తొలి రోజుల నైపుణ్యం! చిన్నప్పుడు నాన్నతో కలిసి అడవిలో వెన్నెలలో షికారు వెళ్ళేవాడిని. జాగ్రత్తగా గమనించేవాడిని. వెన్నెల ఎలా నేల మీద పడుతోంది, ఎందుకు వెన్నెలకి నీలిరంగు కలసిన బూడిద రంగు ఎందుకుంటుంది? అని! స్టూడియోలో చేయాల్సిందిల్లా – దాన్ని పునః సృష్టించడమే! వాహిని వారి ఏ సినిమాలోనైనా వెన్నెల పాట ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నా ప్రత్యేక ప్రతిభ గురించి తెలుసు, వెన్నల దృశ్యాలంటే విజృంభిస్తానని తెలుసు (ఆయనకి హిందీ తెలియదు, కొద్దిగా తమిళం, కొద్దిగా తెలుగు తెలుసు. కానీ స్క్రిప్ట్ రైటర్ తోనూ, దర్శకుడితోనూ కలిసి కూర్చుని స్క్రీన్‍ప్లేని అర్థం చేసుకుని తన లైటింగ్ స్టైల్ మీద పని చేసేవారు. స్పెషల్ ఎఫెక్ట్స్ – అందునా పౌరాణిక సినిమాలలో – అయన ప్రత్యేకత. తన లైట్ బోయ్స్‌ని, అసిస్టెంట్లని ఆయనే జాగ్రత్తగా ఎన్నుకునేవారు. వాళ్ళు నిశ్శబ్దంగా పని చేస్తూ, ఇచ్చిన ఆదేశాలను పాటించేవారు. అయితే ఆయన తన లెన్స్‌లని ఎవరికీ ఇచ్చేవారు కాదు. హోలీ గ్రెయిల్ అంత జాగ్రత్తగా వాటిని పట్టుకునేవారు. తన పనిపై బాగా దృష్టి పెట్టి, అసలు షూటింగ్‌కి ముందే రాత్రిళ్ళు పని చేసి, సెట్‍లో లైటింగ్ చక్కగా ఉండేలా చూసుకునేవారు. అందాల నటీనటీలతో కలిసి పని చేసినా, వాళ్ళతో ఎన్నడూ తిరిగేవారు కాదు. డాన్సు చేయని ఆంగ్లో ఇండియన్ అంటూ ఆయనను ఏడిపించేవారట).

(తెలుగు సినిమా అప్పటిదాకా చూడనిది ఆయన సినెమాటోగ్రఫీ. పాతాళ భైరవి చిత్రంతో తన అద్భుతమైన నైపుణ్యంతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. దీనిని మాయాబజార్‍లో కొనసాగించారు. సినీరంగానికి మార్కస్ అందించిన సేవలకి ఈ చిత్రం గొప్ప ఉదాహరణ. ఎ.ఎన్.ఆర్., సావిత్రిలపై చిత్రించిన లాహిరి లాహిరి లాహిరిలో పాట నేడు ఎందరో సినెమాటోగ్రఫర్స్‌కి ఒక కేస్ స్టడీ అయింది. ఆ సన్నివేశాన్ని మద్రాసు శివార్లలోని ఎన్నోర్‍లో చిత్రీకరించారు. అవుట్‍డోర్ షాట్ కేవలం 10 నుంచి 15 సెకన్లే ఉంటుంది. బార్‌ట్లే సహాయకుడు అంబూ రావు వెల్లడించిన ప్రకారం, వెన్నెల దృశ్యాలని స్టూడియో తీసారట. భారతీయ సినిమాల్లో ఈ టెక్నిక్ వాడడం అదే మొదటిసారట.  ఆ పాటని చూడండి, ఎంత మనోహరంగా ఉంటుందో. 300 మినియేచర్‍లతో ద్వారక నగరాన్ని అద్భుతంగా చూపిండంలోని ఘనత తనది కాదని, దాన్ని సృష్టించిన ఆర్ట్ డైరక్టర్ మాధవపెద్ది గోఖలేదని వినమ్రంగా చెప్తారు. ఇక వంటగదిలో ఘటోత్కచుడు భోజనం చేసే దృశ్యాన్ని చిత్రీకరించడానికి నాలుగు రోజులు పట్టించట. ప్రతీది స్టాప్-మోషన్ పద్ధతిలో చిత్రీకరించారుట… దీనితో తెలుసు సినీరంగంలోకి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రవేశించాయి).

మలయాళం సినిమా ‘చెమ్మీన్’ నా కెరీరో మరో మలుపు, గొప్ప మైలురాయి. అప్పుడే నేను వాహినీ సంస్థని విడిచాను. ఎందుకంటే అక్కడ – ఇబ్బందులు కలిగించే వ్యక్తిగా – నాపై ముద్ర పడింది (బార్‌ట్లేతో పని చేయడం కష్టమని, ఆయన టెంపర్ బాగోదని అనేవారు. నిజానికి ఆయన ఓ పర్‍ఫెక్షనిస్ట్. ప్రతీదీ సరిగ్గా రావాలనుకునేవారు. ప్రొఫెషనల్‍గా ఉండనివారు నచ్చేవారు కాదు. తారతమ్యాలు లేకుండా అందరినీ ఒకేలా గౌరవించేవారు, తాను పనిచేసే సినిమాల్లోని నటీనటుల పేర్లు ఆయనకి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. వాళ్ళంతా సమయానికి వస్తే చాలు ఆయనకి). ఆ తరువాత జెమినీ స్టూడియోలో చేరాను. కానీ ఖాళీగానే ఉన్నాను. 13 నెలలు అక్కడున్నా, నాకు అప్పజెప్పింది, ఒక రీమేక్ సినిమాలోని రీ-టేక్ షాట్లే. అదే సమయంలో రాము కారియత్ తన సినిమా ‘చెమ్మీన్’‌కు నన్ను పంపమని అడిగారు. కొత్త, సృజనాత్మక దర్శకులతో పనిచేసే అవకాశం లభించినందుకు నేను అంగీకరించాను. కానీ ఆ సినిమాకి నాకు డబ్బులేమీ రాలేదు. నెలవారీ జీతం మాత్రం జెమినీ నుంచి వచ్చింది. ఆ సినిమా సముద్రపు అలజడిని చూపింది. ఋతుపవనాల కాలంలో సముద్రం ఎలా ఉంటుందో ఆ సినిమా గొప్పగా చూపించింది. రెండు మైళ్ల దూరం నుంచి అరవై అడుగుల ఎత్తుల అలలు దూసుకువచ్చేవి. నా విజువల్స్ కథపై ఆధిపత్యం చలాయిస్తేయేమోనని, నిర్మాణ వ్యయం అధికమైపోతుందేమోనని వారు భావించారు. అయితే ఋతుపవనాలు ఉచ్చదశలో ఉండగా, అరేబియన్ సముద్రం ఎలా ఉంటుందో ఎవరూ చూసి ఉండరు. ‘ర్యాన్స్ డాటర్’ సినిమాలో అట్లాంటిక్ మహాసముద్రం ఎలా ఉంటుందో, అలా ఉంటుంది. ఈ విధంగా ఈ సినిమా నుంచి నేను తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా ఛాయగ్రహణం గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నా, నాకు జాతీయ అవార్డు రాలేదు” (ఇందులోని కొన్ని సన్నివేశాలు మరో కెమెరామన్ తీయడం విచారకరం, అందుకే బార్‌ట్లేకి జాతీయ అవార్డు రాలేదు. చాలా ఏళ్ళ తరువాత – అసంఫూర్తిగా మిగిలిన దృశ్యాలను చిత్రీకరించింది తానేనని సీనియర్ కెమెరామన్ యు. రాజగోపాల్ వెల్లడించారు).

***

చివరికి బార్‌ట్లేకి శాంతినివాసం చిత్రానికి 1969/1970 సంవత్సరానికి గాను జాతీయ అవార్డు వచ్చింది. 1978లో కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ‘చెమ్మీన్’ ప్రదర్శితమైనప్పుడు బార్‌ట్లేకి స్వర్ణపతకం లభించింది. ఇటువంటి గొప్ప కళాకారులకు అవమానం జరిగితే నా హృదయం బద్దలవుతుంది. బార్‌ట్లే గురించి ది హిందూ దినపత్రికలో వచ్చిన వ్యాసంలోంచి ఈ వివరాలు చదవండి.

~

“అతి చిన్న, సన్నిహితమైన ప్రెస్ ఫోటోగ్రాఫర్ల బృందం నుంచి బార్‌ట్లే వచ్చి – ఎల్లిస్ ఆర్ దుంగన్, శాంతిలాల్ షా, సిమ్లా స్టూడియోస్‌కి చెందిన బి.కె. దిల్వాలి, కార్లో మార్కోని, హోమయ్ వ్యారావాలా వంటి వారిని కలిసారు. ఫోటోగ్రఫీలో బార్‌ట్లేకి నియత శిక్షణ లేదు. కానీ బాగా శ్రమించేవారు, చిన్నా చితకా పనులు కూడా చేసేవారు. ఆయన అన్నింటిని శ్రద్ధగా గమనించేవారు, బాగా చదివేవారు, అన్నీ గ్రహించేవారు. ఒక ప్రెస్ ఫోటోగ్రాఫర్‌కి ఒక రీల్ ఇచ్చి ఫోటోలు తీయమంటే, బహుశా ఐదు స్పష్టమైన ఫోటోలు వస్తాయోమో అనేవారు శాంతిలాల్. కానీ బార్‌ట్లే దాదాపు 36 కి 36 స్పష్టంగా తీసేవారు (ఏం మనిషి!). శాంతిలాల్‍కీ, బార్‌ట్లేకి 1956లో పరిచయం. విశాలమైన నీలి నేత్రాల బార్‌ట్లే అప్పట్లో బి.నాగిరెడ్డి, చక్రపాణి గార్ల యాజమాన్యంలోని వాహినీ స్టూడియోస్‍లో ఫోటోగ్రఫీ విభాగానికి అధినేతగా ఉండేవారు.

~

(బార్‌ట్లే గురించి ఆయన అసిస్టెంట్ అంబూ రావు ఏమన్నారో చదవండి – “ఆయన్ని ఉద్దేశించి చెప్పాలంటే ‘గురువు’ అనే పదం సరిపోదు. నామీద ఆయన ప్రభావం అపారం. ఈరోజున నేనిలా ఉన్నానంటే, అది ఆయన వల్లే. అప్పట్లో నాది ఉత్సాహం ఉరకలు వేసే వయసు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలు వస్తుండేవి, నా ఆలోచనలను స్వేచ్ఛగా వెల్లడించమనేవారు బార్‌ట్లే. ఒక్కోసారి కఠినంగా ఉన్నా, నాలోని ఉత్సహాన్ని నిరంతరం నిలిపి ఉంచారు ఆయన. మాయాబజార్ చిత్రం, ఒక ముఖ్యమైన సన్నివేశం జరుగుతుండగా, ఆ రోజు నేను అక్కడ నిలబడి ఉన్నాను. దర్శకులు కె.వి.రెడ్డి గారు నన్ను చూసి, “ఎవరీ కుర్రాడు? వెళ్ళమనండి… ఇది చాలా ముఖ్యమైన సీన్” అని అన్నారు. బార్‌ట్లే గారు “అతను నా అసిస్టెంట్. నేనే ఉండమన్నాను” అన్నారు. కానీ తర్వాత సైగలతో నన్ను తిట్టారు. వెన్నెల దృశ్యాలు ఆయన ప్రత్యేకత. ఆ రోజుల్లో ఒక తెర మీద ఒక వృత్తం గీసి, చందమామలా భ్రమింపజేసేవారు. దానిని నేపథ్యంలో ఉంచినప్పుడు అక్కడ వేరే కాంతి ఉండకూడదు. ఎంత కష్టంగా ఉన్నప్పటికీ, పాత్రధారులంతా తమ నీడలను చందమామకి దూరంగా ఉండేలా చూసుకునేవారు. ఇవేకాక, ఆయన సినిమాల్లోని అంశాలన్నీ ఫేడ్-ఇన్, ఫేడ్-అవుట్ టెక్నాలజీ తోనే తీశారు. నేటి కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో తీసే ఎన్నో షాట్స్ కన్నా అవెంతో మెరుగయినవి.”

~

కె.వి.రెడ్డి గారి సిబ్బంది పాటించే నియమాలలో ఒకటి – కెమెరా లెన్స్ గుండా చూసే అధికారం బార్‍ట్లేకీ, కె.వి. రెడ్డి గారికి మాత్రమే ఉండేది. మాయాబజార్ సెట్‍లో పని చేస్తున్నప్పటి నుండి కనీసం ఒక్కసారైనా ఆ లెన్స్ గుండా చూడాలని కోరుకున్నారు అంబూ రావు.

ఒక రోజు ధైర్యం చేసి తన మనసులోని మాటని కె.వి.రెడ్ది గారి చెవిన వేశారు. కె.వి.గారు అంబూ కేసి ఒకసారి చూసి, బార్‍ట్లే గారిని కేకేసారట. ఆయన వెనక్కి తిరిగి అంబూని చూసి విషయం అర్థం చేసుకున్నారట. రమ్మన్నారు. అంబూ కెమెరా కేసి పరిగెత్తారు. తన పక్కన ఆజానుబాహుడిగా బార్‌ట్లే. అంబూ రావు పొట్టి వ్యక్తి, పైగా కెమెరాన హై-ఇన్ పొజిషన్‍లో ఉండడంతో – హై చైర్ తెమ్మని చెప్పారట బార్‌ట్లే. అది ఎక్కి అంబూ సరైన స్థానంలో నిలబడగానే లైట్స్ ఆన్ చేయమన్నారట బార్‌ట్లే. ఆ విధంగా తన కోరిక తీర్చుకున్నారు అంబూ రావు. “లెన్స్ గుండా చూసినప్పుడు నా చిరకాల వాంఛ నెరవేరింది. నా జీవితంలోనే మరపురాని క్షణం. అత్యుత్తమ క్షణం. బార్‌ట్లే దృక్కోణాన్ని ఆయన లెన్స్ గుండా చూడగలిగాను. నమ్మండి, నమ్మకపొండి – మళ్ళీ అలాంటి లైటింగ్ నేనెక్కడా చూడలేదు. ఇదే విషయాన్ని ‘భైరవ ద్వీపం’ షూటింగ్‍లో కెమెరామన్ కబీర్‌తో చెప్పాను” అన్నారు అంబూ రావు.

చివరి సంవత్సరాలు:

బార్‌ట్లే ఆరోగ్యం బాగోలేదు. చాలా కాలంగా మధుమేహంతో బాధపడ్డారు. కానీ వైద్యుడి వద్దకు వెళ్ళకుండా సొంత చికిత్స చేసుకున్నారు. 1988 నాటికి అయనలో ప్రగాఢ ఆసక్తి నశించింది. చాలా అశాంతిగా, ఒంటరిగా ఉండేవారు. సినెమాటోగ్రఫీని విడిచిపెట్టి, లెన్స్ రిపేర్ చేసే పని స్వీకరించారు. నిజానికిది ఛాయాగ్రహణం కన్నా పెద్ద పని! అర్రిఫ్లెక్స్ వారు ఆయనను ఆథరైజ్డ్ సర్వీస్ పర్సన్‌గా నియమించుకున్నారు. ఆయన ఏకాంతంగా కూర్చుని, గంటల పాటు మౌనంగా లెన్స్‌లను రిపేర్ చేసేవారు. ఆయనకి కబుర్లు చెప్పుకునే మిత్రబృందం లేదు. పైగా గంభీరమైన స్వభావం, నిబద్ధత మామూలు సంభాషణలలోకి దిగేట్టు చేయవు. ఆయన కొడుకు అలాన్ ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాడు, కానీ నాగిరెడ్డి గారు బార్‌ట్లేని విజయ హాస్పిటల్‍కి మార్పించారు. అక్కడ ఆయనకి వ్యక్తిగత శ్రద్ధ లభించింది. వాహినీ స్టూడియోస్ నుంచి విజయ హాస్పిటల్ వరకు – ఆయన జీవితచక్రం సంపూర్ణంగా తిరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయారు. ఆయన ఇంటికి వెళ్ళే దారులన్నీ జనాలతో నిండిపోయాయి. కార్లను వదిలి జనాలు నడిచి వెళ్ళారు. వందలాది మంది ఏడ్చారు. స్నేహితులు బాధతో విలవిలలాడారు. ఆయన భౌతిక కాయం పూలదండలతో నిండిపోయింది. ఆయన తోటివారూ, సినీ పరిశ్రమకి చెందిన ప్రతీ శాఖలోని అసోసియేషన్ వారు అక్కడ ఉన్నారు.

ఇప్పటి తరానికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ మార్గదర్శిగా, క్రాంతదర్శిగా, మేధావిగా, గురువుగా ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటారు. అత్యంత ప్రతిభావంతులైన రాజీవ్ మీనన్, మధు అంబట్ వంటి వారు మార్కస్ బార్‌ట్లేని ఎన్నటికీ మరువలేరు!


వాణిశ్రీ సినీ ప్రస్థానం:

సింహపురి, నెల్లూరు నుంచి మద్రాసుకి సాగిన తన జీవన ప్రస్థానం గురించి క్లుప్తంగా వివరించారు అలనాటి నటదిగ్గజం శ్రీమతి వాణిశ్రీ.  ఆమె ఏం చెప్పారో, ఆమె మాటల్లోనే…

“నా సొంతూరు సింహపురి, నెల్లూరు. ఎందరో మహానుభావులు జన్మించారిక్కడ. తెలుగులో ఒక సామెత ఉంది, ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అని. నా విషయంలో అలా జరగలేదు. నా చిన్నప్పుడు నేనంత అందంగా ఉండేదాన్ని కాదు. మేము అయిదుగురు తోబుట్టువులం. మా దురదృష్టవంతురాలు… అతి తక్కువ సమయంలో  భర్తని, ఇద్దరు కొడుకులని, ఒక కూతురుని పోగొట్టుకుంది. అమ్మకి నేనూ, అక్కా మిగిలాం, అంతే! మా అక్క చదువుకోడానికి మద్రాసు వెళ్ళి, అక్కడ ఓ హాస్టల్‍లో ఉండేది. అప్పట్లో నేను బాగా అల్లరిచిల్లరిగా ఉండేదాన్ని. అందుకని నన్ను కూడా అక్క ఉంటున్న హాస్టల్‍లో పడేసింది మా అమ్మ. బడిలో, మా తరగతిలో విజయలక్ష్మి అనే అమ్మాయి ఉండేది. తనకి భరతనాట్యం వచ్చు. అందుకని అందరూ తన చుట్టూ మూగేవారు. బడిలో ఈ వేడుక జరిగినా ఆ అమ్మాయి నాట్యం తప్పనిసరిగా ఉండేది. ఇదంతా చూసి, నాకూ నాట్యం నేర్పించమని అమ్మని ఒత్తిడి చేశాను.  విజయలక్ష్మి నాట్యం నేర్చుకునే టి.ఆర్. మాలతి గారి వద్దే నేనూ చేరాను. దీనివల్ల నా చదువు ఆగిపోయింది. మద్రాసు పంపినందుకే ఇలా అయిందని అమ్మ భావించింది. నేను చూడ్డానికి నటి సావిత్రిగారిలా ఉంటాననీ, నన్ను సినిమాల్లో చేర్పించమని కొందరు అమ్మతో చెప్పారు. మా అక్క కూడా అదే అంది. అమ్మకి మాత్రం బాగా కోపం వచ్చింది, బాగా చదువుకోకపోతే పెళ్ళి చేసేస్తాను అని హెచ్చరించింది. చివరికి, ఎలాగైతేనేం సినిమాల్లో చేరేందుకు అమ్మని ఒప్పించగలిగాను. వేణుగోపాల్ స్వామి మాస్టర్ వద్ద సినిమా నృత్యాలు నేర్చుకున్నాను. కానీ సినిమాల వాతావరణం నన్ను నిరుత్సాహపరిచింది. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకుని, పట్టుదలగా ప్రయత్నించాను. తెలుగు సినిమాల్లో తొలి ప్రయత్నంగా, ‘భీష్మ’ చిత్రంలో నృత్యం చేసే అవకాశం దొరికింది. ఆ తర్వాత అన్నీ చిన్న పాత్రలే వచ్చాయి. అలాంటి పాత్రలతో ఎంత కాలం నెట్టుకురావడం? అందుకని నాటకాల వైపు మళ్ళాను. నా అదృష్టం కొద్దీ స్థానం నరసింహారావు గారు దర్శకత్వం వహించిన ఒక నాటకంలో వేషం దొరికింది. ఆయన నాలో ప్రతిభని గుర్తించి ఆశీర్వదించారు. నేను బాగా ప్రసిద్ధమవుతానని చెప్పారు. అప్పటి నుంచి నాటకాల్లో నాకు మంచి వేషాలు దొరికాయి. నేను ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ నాటకం వేసినప్పుడు ముఖ్య అతిథిగా ప్రసిద్ధ నటులు నాగయ్య గారు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, “చిట్టెమ్మ వేషం వేసిన అమ్మాయి సావిత్రిలా ఉంది. బాగా నటించింది. నటిగా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది” అన్నారు. దీని తరువాత నాకు ఓ కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. నాకు కన్నడం రాదని వాళ్ళకి చెప్పాను. డైలాగులోని తెలుగులో రాసుకున్నాను. సరైన ఉచ్చారణ ఎలా ఉండాలో వాళ్ళు నేర్పారు. జనాలు ఈ సినిమా రషెస్ చూసిన తరువాత నాకు వరుసగా కన్నడ సినిమాలు వచ్చాయి. వాణి ఫిల్మ్స్ అధినేత భావనారాయణ గారు నా కన్నడ సినిమాలు చూశారు. ‘తెలుగులో నటిస్తారా’ అని అడిగారు. నేను తెలుగమ్మాయినే అని ఆయనకి చెప్పారు. నా కన్నడ ఉచ్చారణ చూసి నేను కన్నడ హీరోయిన్‍నని అనుకున్నారట ఆయన.

ఆ తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ అవన్నీ హాస్య పాత్రలే. బి.విఠలాచార్య గారు తీసిన ‘నవగ్రహ పూజా మహిమ’ చిత్రంలో నాకు మంచి వేషం దొరికింది, పేరొచ్చింది. అప్పటిదాక నేను నా అసలు పేరు ‘రత్నకుమారి’ అనే పేరుతోనే నటిస్తున్నాను. ఎస్.వి.రంగారావు గారి శ్రీవాణి బ్యానర్ వారికి నా పేరు నచ్చలేదు. వారి బ్యానర్ పేరుని తిరగేసి, నాకు ‘వాణిశ్రీ’ అని పేరు పెట్టారు. వాళ్ళు నాతో తీద్దామనుకున్న ఆ సినిమాని తీయలేదు కానీ నా పేరు మాత్రం ‘వాణిశ్రీ’గా మిగిలిపోయింది. ఈలోపు మా అక్కకి పెళ్ళయ్యింది. మా బావగారు మద్రాసులోనే పనిచేసేవారు. నా పెళ్ళయ్యే వరకూ నా కెరీర్‍కు వాళ్ళిద్దరూ అండగా ఉన్నారు. నా జీవితంలో అప్పుడు నేను కన్నడం, తమిళంలో హీరోయిన్ పాత్రలు వేస్తున్నాను. తెలుగులో మాత్రం హాస్య, సహాయక పాత్రలే దక్కేవి. ‘మరపురాని కథ’ సినిమాకి నన్ను హీరోయిన్‌గా తీసుకున్నందుకు రాజ్యలక్ష్మి పిక్చర్స్ డూండీ గారికి, సుందర్‍లాల్ నహతా గారికి నేనెంతో ఋణపడి ఉంటాను. ఆ సినిమా కనుక ఫ్లాప్ అయితే, తెలుగులో నాకు హాస్య పాత్రలు కూడా రావని చాలామంది భయపెట్టారు. అయినా మొండిగా, ఆ సినిమా చేశాను. ఆ సినిమా గొప్ప హిట్ అయి, నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. బి.ఎన్.రెడ్డి గారి ‘బంగారు పంజరం’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత దుక్కిపాటి మధుసూదనరావు గారు ‘ఆత్మీయులు’ చిత్రంలో నాకు హీరోయిన్‍గా అవకాశం ఇచ్చారు. అది హిట్ కావడం, ఆ తరువాత మరెన్నో అవకాశాలు రావడం, చాలా సినిమాలు విజయవంతమవడం జరిగింది. తర్వాత అంతా చరిత్రే!”

Exit mobile version