Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలవాటులో గ్రహపాటు

[వడలి రాధాకృష్ణ గారు రాసిన ‘అలవాటులో గ్రహపాటు’ అనే హాస్య కథని అందిస్తున్నాము.]

“వాహ్! క్యా బాత్ హై!” కేకలాంటి అరుపుతో అనేశాడు వీరకాసులు.

“కెవ్వు కేక!!” భర్త అరుపులకు తాలింపు తానుగా వీరవతి కూడా అందుకొంది.

విషయం తెలిసిన వీరకాసులుకి వీరగా అన్పిస్తూంటే, పట్టిసీమలాకులో నీరు లాగ పొంగిపోతున్నాడు.

“నా కూతురు అంటే ఎవరునుకున్నావు.. కెవ్వుకేక!” వీరవతి గర్వంతో ఊగిపోతూనే ఉంది. వీరకాసులుకు మహాదానందంగా ఉంది.

“నాకు ఎంత మంచి కూతురు నిచ్చావయ్యా!” సూత్రధారులు సినిమాలో సుజాత నాగేశ్వరరావుని వాటేసుకొని ముద్దులు గుమ్మరించేసినట్టు, తన భర్తకు ఓ తీపి ముద్దును పడేసింది.

“ఏమండీ ! మన బిడ్డ.. మన సుకుమారి” ఆనందంతో కంపించిపోతూ అనేసింది. భార్యను చూసిన వీరకాసులు కూడ తనలోని సంతోషాన్ని అదుపు చేసుకోలేక ఆమెను వీరగా వాటేసుకున్నాడు. ముద్దులతో ముంచెత్తుతున్నాడు.

“ఇదేమన్నా బాగుందంటారా!” గుమ్మంలోకి వచ్చి వాలిన భజనరావును చూసే సరికి, వీరకాసులులోని కోపం వీర లెవెల్లో నషాలానికి ఎక్కేసింది.

“నడిరోడ్డు మీద వెంట పడిన పాపానికి కనీసం మగాడని చూడకుండా జుట్టు పట్టుకొని ఉతికి పారేస్తుందా! నా కొడుకు అమాయకుడు. ఇప్పుడు ఇంటి దగ్గర తలుపేసుకొని ఎంత ఫీలవుతున్నాడో తెలుసా మీకు!!”

“అందమైన ఆడది కనబడితే చాలు! వెంటపడడాలు, కన్నుగీటడాలూను!!”

“అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావని కన్ను గీటి చెప్పాడు! దానిలో తప్పేముందట!!” భజనరావు కొడుకుని వెనకేసుకొస్తూ పలికాడు.

“నువ్వు గొప్ప అందంగా ఉన్నావని బసవరాజు గాడు కన్ను గీటాడు. థ్యాంక్యూ రా రాజా అంటూ మా సుకుమారి నాలుగు పీకి పారేసింది. దానిలో తప్పేముందట?” వీరవతి కూతురును వెనకేసుకొస్తూ అంది.

అంతే భజనరావు అయోమయంలో పడిపోతున్నాడు.

“అవునయ్యా! వీరా వారి ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావ్ నువ్వు. మేము ఎప్పుడూ మాన మర్యాదలకు ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం!!” వీరకాసులు మాటలు ఐమాక్స్ థియేటర్‌లో స్టీరియోఫోనిక్ సిస్టమంత ఘనంగా అన్పిస్తున్నాయి.. జస్టిస్ చౌదరి సినిమాలో యన్.టి.ఆర్. డైలాగ్స్ అంత పవర్‌పుల్ పంచ్ లను కలిగి ఉన్నాయి.

బసవరావు మటుకు గంగ వెర్రిలెత్తిపోతున్నాడు. ఇంటి దగ్గర హడలెత్తిపోతున్నాడు.

“వాహ్! క్యా బాత్ హై!” వీరకాసుల్ని ఆనందం వీర పిచ్‌లో వచ్చి ఆవహించేస్తోంది.

“సుకుమారి, నా కూతురు వీరా!!” మరలా సూత్రధారులు ఎ.ఎన్.ఆర్. అయిపోతూన్నాడు.

“కెవ్వు కేక! కాదన్న డెవడండీ!!” జాకెట్ లో దాచి పెట్టిన మొగుడు కట్టిన మంగళ సూత్రాలన్ని బయటకు లాగి పారేసి భక్తితో కళ్ళకు అద్దుకుంటూ అంటోంది.

“లేకపోతే దగుల్బాజీ రాస్కెల్! వెంటపడి కన్ను గీటుతాడా!!”

“కన్ను గీటినా కన్ను కొట్టినా వాడూ వీడని చూడరాదు, నాయల్ది ఉతికి పారెయ్యాలి!” వీరవతి భర్త ఊపుకు ఏ మాత్రం తగ్గడం లేదు. స్వరం పెంచి ఆడిపోసుకుంటోంది. ఇంతలో అక్కడొకొచ్చిన సుకుమారి..

“నేను మీ ముద్దుల కూతుర్ని మమ్మీ! మీకు చెడ్డ పేరు తెచ్చే ఏ పనీ ఈ సుకుమారి చెయ్యదు.. చేయబోదు కూడాను!!” అంది.

కూతురు కూడా తమ ధోరణిలో కలగలిసిపోతుంటే పరవశంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు వీరకాసులు.

అందుకే వీరా వారి కుటుంబమంటే అరివీరవరంలో అమితమైన పేరు ప్రఖ్యాతలున్నాయి. నిప్పు లాగ బ్రతికే మనుషులని, మానమర్యాదలతో అలరారే వారని, నిప్పును సయితం లిరిల్ సబ్బుతో కడిగేసుకొని శుభ్రం చేసుకొనే దివ్యమైన ఫ్యామిలీ అని మహాగా పేరు వచ్చేసింది.

***

మరలా అదే రకమైన సీను పునరాతమై పోతూ ఉంది.

“వాహ్! క్యా బాత్ హై!!..” కేకలాంటి స్వరంతో కూతుర్ని చూసుకొని వీరవతి పొంగిపోతోంది.

“కేవ్వు కేక!” వీరకాసులు ఆనందం అవధులు దాటిపోతోంది.

సుకుమారి విహార యాత్రలకని కాలేజి స్టూడెంట్స్‌తో నాగార్జున సాగర్ వెళ్ళింది. వీరరాజు గారబ్బాయి వీరబ్బాయి సుకుమారికి క్లాస్ మేట్ మరియు క్లోజెస్ట్ ఫ్రెండ్.

“ఈ నాగార్జున సాగర్ వాటర్ ఫాల్స్ ఎంత ముద్దొస్తున్నాయో తెలుసా సుకూ..”  ఫ్రెండ్లీగా అన్నాడు.

“ఎంత!” నవ్వుతూ పలికింది.

“ఇంకెంత.. నీ అంత!” స్నేహితుడు తనను అలా పొగిడేసరికి సుకుమారికి ముచ్చటగా అనిపించింది. థాంక్స్ చెప్పేసింది.

అంతే వీరబ్బాయ్ నోట అక్కడి కృష్ణవేణి జలపాతంలాగ, అంత వేగంగాను కవిత్వం ఎగతన్నుకొచ్చేసింది.

ఫ్రెండ్ నోట ప్రేమ కవిత్వం. సుకుమారిని అబ్బురపరుస్తుంది! తనకు తెలియకుండానే తన కనురెప్పలు ఆడడం ఆగిపోయాయి!!

“ఈ డ్యామ్ దగ్గర నువ్వుంటే, సాగర్ డ్యామ్‌కే గొప్పగా అన్పిస్తూండింది తెలుసా” చిన్నగా కన్ను గీటాడు. గీటిన కుడికన్నుని మరల మరల ఆడించాడు. అదే చిలిపిగా, చిన్నగా కన్ను కొట్టాడు.

వాడు అలాగే చెప్పుకుపోతూంటే సుకుమారి ఉన్నట్టండి కాలి చెప్పు తీసింది. అందరి ముందూ చెప్పు తెగేదాకా వాయించి పారేసింది. ప్రక్క నున్న స్టూడెంట్స్ అందరూ బిత్తరపోయారు. సముదాయించడానికి ప్రయత్నించారు. సుకుమారి తగ్గడం లేదు. విషయం అంతగా అర్థం గాక బుర్ర పట్టుకుంటున్నారు.

“కన్ను అదిరితే చెప్పు తీయాలా! ఫ్రెండ్ అని కనీసం చూడ కుడా ఎడాపెడా దవడలు వాచిపోయేలా వాయించి పారేయాలా!!” వీరబ్బాయి అవమానంతో బిక్క చచ్చిపోయి పలికాడు.

“ఒక చెప్పు తెగిపోయింది.. మరో చెప్పు మిగిలిపోయింది. నీ ఇష్టం ఇక” ఆవేశంతో చెప్పుకుపోతోంది సుకుమారి.

“అసలు సుకూని ఎందుకు అదిలించావురా సన్నాసీ! పైగా కన్ను గీటడాలు, కన్ను కొట్టడాలు.. ఆనక సిగ్గు లేక చెప్పులతో కొట్టించుకోవడాలు..!!” వచ్చిన లెక్చరర్స్ అంతా అదే పనిగా వీరబ్బాయ్‌ని ఆడిపోసుకుంటున్నారు.

***

వీరకాసులు మంచి అల్లుణ్ణే వెతికి తెచ్చుకున్నాడు. సుకుమారి పెళ్ళి సూరంపూడి జమిందారు సుబ్బురత్నం గారి అబ్బాయి సుబ్బరాజుతో నిశ్చయమైపోయింది.

వీరకాసులు ఆనందానికి అవధులు అగుపించడం లేదు. తనవంటి మధ్య తరగతి కుటుంబీకునికి బాగా పరపతి కలిగిన కోటీశ్వరుడు గారి అబ్బాయి అల్లుడుగా దొరకడం ఏ పూర్వ జన్మ పుణ్యంగానో అన్పిస్తూ ఉంది.

“వాహ్! క్యా బాత్ హై!!” వీరకాసులు నోటిమాట సంతోష సాగరమై ఉరకలు వేస్తోంది.

“కెవ్వు కేక!” వీరవతీ అయితే సరే సరి. అల్లుడు గారింటి పరపతిని, ఆస్తుల్ని పాస్తుల్ని తల్చుకొని మురిసిపోతోంది.

సుకుమారికి పెళ్ళి కళ వచ్చేసింది. సిగ్గుమొగ్గలన్నీ విప్పారసాగాయి. ఆనక పుష్పించిన మొగ్గలు మందార మకరంద పుష్పాలవుతున్నాయి. అందరిలోను అవధులు ఎరుగని సంతోషం నెలకొని ఉంది. పెళ్ళికి ముందర సూరంపుడి జమిందార్ కాబోయే వియ్యంకుడి గురించి బాగానే వాకబు చేశాడు.

గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబమని ‘క్లీన్ చిట్స్’ లభించేశాయి. ఇక సుబ్బరాజు కాబోయే భార్య సుకుమారిని అదే పనిగా తల్చుకుంటూ ప్రేమవాహినిలో పడి జలకాలాడేస్తూ ఉన్నాడు. వీరకాసులు కూతురు పెళ్ళి ఏర్పాట్ల చాలా గొప్పగా చేసేశాడు. ఖర్చులకు ఏ మాత్రము వెనకాడటం లేదు.

ఆకాశం కన్నా ఎత్తున పందిరి వేయించినాడు. భూదేవి కన్నా గొప్పదయిన వేదికను ఏర్పాటు చేశాడు. జమిందారుగారింటి వారందరూ పెళ్ళకి తరలి వచ్చేశారు.

పెళ్ళి కూతురు కుందనపు బొమ్మలాగ ఉంది. తాంబూలానికి వెనకాడకుండా పెళ్ళిళ్లు చేయించడంలో గొప్ప ఘనాపాటిగా పేరు గాంచిన మెంతుపాలెం పంతులు అదే పరమ శాస్త్రిగారిని ప్రత్యేకంగా పిలిపించాడు. ఆ ప్రాంతంలో శాస్త్రిగారి నోటి వాక్కు చాలా గొప్పదన్న మంచి పేరే ఉంది.

విమానానికి కెప్టెన్ లాగ, ఎక్స్‌ప్రెస్ రైలుకి డ్రైవర్ లాగ పరమశాస్త్రిగారి పౌరోహిత్యం మును ముందుకు దూసుకుపోతూ ఉంది. ఇంతలో ముహూర్తపు ఘడియలు రానే వచ్చేశాయి.

కన్యాదాన సమయంలో మామగారి చేత అల్లుడి కాళ్ళు కడిగించాడు. తర్వాత అతగాడి కళ్ళలోకి చూస్తూ ‘మమ’ మంత్రాలన్నీ చెప్పించారు. అల్లుడి చేత ‘మమ’ అనిపించేశారు. బయట బాజా భజంత్రీలు మోతమోగిస్తూంటే పరమ శాస్త్రిగారు వధూవరుల చేత ఒకరి తల మీద ఒకరిని జీలకర్రా బెల్లాన్ని పెట్టించేశారు. ఆ శుభ సమయంలోనే ‘చూపులు’ కలుసుకోవలని సూచించారు.

సుకుమారి బుట్టలో కూర్చున్న బుట్టబొమ్మలాగ ఉంది. సిగ్గల్ని ఒలకబోస్తూ వంకర్లు తిరిగిపోతోంది. ప్రేమగా శ్రీవారి కళ్ళలోకి చూసింది. సుబ్బరాజు కూడా పెళ్ళికొడుకు హోదాలో పేట్రేగిపోతూ ఉన్నాడు. పెళ్ళాన్నిమించిన పెనిమిటి అయిపోతూ ఉన్నాడు. తన్మయత్వంతో భార్యామణి, అదే సుకుమారి కళ్ళలోకి తొట్రుబాటు లేకుండా తొంగిచూశాడు.

అదే తన ప్రియమైన సుకుమారిని కళ్ళతో కవ్వించాడు. సుకుమారి మరిసిపోయింది. ప్రేమతో మూతిని ముప్పైమూడు వంకర్లు తిప్పేసింది. మైకం కమ్మిన ప్రేమ మత్తుగా మూలిగే సరికి భార్యను కళ్ళతోనే కవ్వించాడు. అదే చిలిపిగా కను సైగలు చేశాడు. ఆగక చిన్నగా కన్నుగీటాడు. ఆ పైన చిలిపిగా కన్ను కొట్టేశాడు. అంతే షరా మామూలే!

అక్కడ రభస రభస.. రసాభాస అయిపోయింది. ఉన్నట్టుండి సుకుమారిలో కోపం నషాలానికి ఎక్కిపోయింది.

బుట్టలోంచి రివ్వున పైకి లేచింది! ఆవేశం తన్నుకొస్తుంటే తమాయించుకోలేకపోయింది!! తన తల మీద జీలకర్రా బెల్లం ముద్ద పెట్టిన సుబ్బారావు చేతిని విరిచి పారేసింది!!! అంతే ఆ హఠాత్త పరిణామానికి బిక్కచచ్చిపోయాడతడు.

సుబ్బారాజును అందరి ముందరా బాదేసింది! ఆనక ఉతికిపారేసింది!! ‘నా మాన మర్యాదలు నావి!’ అనుకుంటూ పెళ్ళి మండపంలో ‘రఫ్’ ఆడించేసింది. అటూ ఇటూ కాళ్ళతో తన్నుతూ పుట్‌బాల్ ఆట ఆడేసింది.

సుకుమారి పుట్‌బాల్ ఆటను చూసి పరమశాస్త్రిగారు భయపడిపోతున్నారు. పూటుగా కూల్ డ్రింకులు, బాదం మిల్క్‌లు త్రాగి కూర్చున్న మండపంలోని జనాలు హాహాకారాలు చేస్తూ, చెల్లా చెదురయి పోతున్నారు.

సూరంపూడి జమిందారు సుబ్బరత్నం గారికి అంతుబట్టడం లేదు. వీడియో వాళ్ళకి, ఫోటోగ్రాఫర్ లకు కెయస్‌ఆర్. దాస్ ఫైటింగ్ సినిమా చూస్తున్నట్టుంది. ప్రతి కదలికను, భంగిమలను దేనినీ వదలకుండా చిత్రించి పారేస్తూన్నారు. మండపమంతా కోలాహలంగా ఉంది.

“ఏమిటండీ మాకీ అవమానం! ఈ దొమ్మీల సంత మాకు వద్దుగాక వద్దు!!”

సుబ్బరత్నం జమీందారు గారు ఒక్కమాటలో తేల్చి పారేశారు అందరికీ. ఆనక ప్యాకప్ చెప్పేశారు.

“నాన్న వాడు నాకు కన్నుకొట్టాడు ! నన్నేం చేయమంటావు. నా మాన మర్యాదలు..” అమ్మాయి మాటలు వీరకాసులుకి అస్సలు విన్పించడం లేదు. అయినా లోపల ఉడుక్కుంటూ విషయాన్ని అస్తిన పెట్టుకుంటూనే ఉన్నాడు. వీరవతికి మాత్రం తల్లిగా కూతుర్ని వెనకేసుకు రాక తప్పడం లేదు. వచ్చిన పెళ్ళోళ్ళందరూ పెట్టినవి తినేసి తిన్నగా జారుకుంటున్నారు.

వీరవతిలోని ఆవేశం కట్టలు త్రెంచుకుంటోంది!

“కెవ్వు కేక!” గట్టిగా అరిచింది.

“వాహ్! క్యా బాత్ హై!!!” నీరసంగా భార్య కేకకి జతకలిపాడు వీరకాసులు.

“…………..”

“నాకు ఎంత మంచి మంచి కుతుర్ని ఇచ్చినావయ్యా !” షరా మామూలే. సూత్రధారులు సినిమాలో సుజాత అయిపోతూ ఉంది. పెనిమిటిని అమాంతం వాటేసుకొంది. పెళ్ళాం చేష్టలు అతగాడిని కలవర పెట్టడం లేదు.

“నాకు ఎంత తీరువయిన కూతుర్ని కని ఇచ్చినావు వీరా!” హిస్టీరియా వచ్చిన వాడిలాగా ఊగిపోతూ భార్యలో ఒదిగిపోతూ ఉన్నాడు.

ఈసారి మటుకు వారి మాటలలోగాని, చేష్టలలోగాని ‘రసధ్వని’ అనేది ఏ మాత్రము కానరావడం లేదు.

Exit mobile version