Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అల్లం కథ

[ఆరోగ్యానికి అల్లం చేసే మేలు గురించి వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

వంకర టింకర ‘శో’
వాని తమ్ముడు ‘అ’
నల్లగుడ్ల ‘మి’
నాలుగు కాళ్ళ ‘మే’ –

ఈ పాత కాలం పొడుపుకథ వినే ఉంటారు. ఇందులో మొదటిది ‘శొంఠి’ రెండోది ‘అల్లం’ మూడోది ‘మిరియాలు’ నాలుగోది ‘మేక’ అని తెలుసు కదూ పిల్లలూ!

ఇందులోని అల్లం గురించి మనమీ రోజు తెలుసుకుందాం. అల్లంటీ, అల్లం చెట్నీ అల్లం ముక్కలేసిన పెసరట్టు, అల్లం పలుకులతో చేసిన ఉప్మా.. ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో పెద్ద లిస్టే వస్తుంది. అల్లం, వెల్లుల్లి పాయ కలిపి నూరిన ముద్ద ప్రతి కూరలోనూ తగలాల్సిందే. మన వంటకాలలో అల్లం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది.

మామూలుగా మనం కూరల్లో మసాలా దినుసుగా వాడినప్పటికీ ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదంలో దీనిని మందుగా ఉపయోగిస్తారు. ఇది వాంతులు రాకుండా ఆపుతుంది. మరీ ముఖ్యంగా సీసిక్నెస్, మార్నింగ్ సిక్నెస్, కీమో థెరపీలలో వచ్చే వాంతులను అరికడుతుంది. అల్లాన్ని చాలా రకాల ఇబ్బందులకు మందుగా నోటి ద్వారా ఆహారంగా ఔషధంగా తీసుకుంటుంటారు. ఈ మధ్య శాస్త్రవేత్తలు Post-operative nausea కు కూడా ఉపయోగపడుతుందని తేల్చారు. అంతేకాక దీనిని ఎండబెట్టి పొడిగా చేసుకొని కూడా అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు.

ఈ జింజర్ పౌడర్ ప్రైమరీ డిస్మెనోరియాకు బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. అయితే ఔషధంగా ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకొన్నప్పుడు కడుపులో మంట మొదలైనవి వస్తాయి.

ఈ అల్లం జింజిబరేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది పుష్పించే మొక్క. దీని యొక్క శాస్త్రీయనామం ‘జింజబర్ అఫిషినాలె’ క్రీ.శ 1వ శతాబద్దంలో ఈ అల్లం యూరప్‌కు ఎగుమతి అయ్యేది. దీనిని ప్రాకృత భాషలో Singabera అనీ సంస్కృతంలో ‘శృంగవేరం’ అనీ అంటారు. శృంగం అంటే ‘కొమ్ము’. వేరా అంటే శరీరం అని అర్థం. చెట్టు యొక్క రైజోమ్‌నే అల్లం అంటాము. దీని యొక్క ఆకారాన్ని బట్టే దీనికా పేరు వచ్చింది. 14వ శతాబ్దంలో పూర్వపు ఇంగ్లీషు పదమైన జింజిఫర్ నుంచే ఈ జింజర్ అనే పదం వచ్చింది. భారతదేశంలో జన్యు వైవిధ్యమైన అనేక రకాలను సాగు చేస్తున్నారు.

అల్లం చెట్టు మీటరు ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకుపచ్చని ఆకులు, పసుపు పచ్చని పువ్వులతో ఉంటాయి. మొగ్గలుగా ఉన్నపుడు తెలుపు పింక్ రంగులలో ఉన్నప్పటికీ పూలు మాత్రం పసుపు రంగులోనే పూస్తాయి. 100 గ్రాముల ఎండబెట్టిన అల్లంలో చాలా ఎక్కువ మోతాదులో కావలసినన్ని పోషక పదార్థాలు లభిస్తాయి. ముఖ్యంగా మాంగనీసు ఖనిజం ఎక్కువగా లభిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా నీటి శాతం 80 శాతం ఉంటుంది. వంద గ్రాముల అల్లాన్ని తిన్నట్లయితే 336 కి. కాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్, 3.3 గ్రాముల చక్కెర నిల్వలు, 4. 24 గ్రాముల కొవ్వులు లభిస్తాయి.

Exit mobile version