Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలౌకిక ఆనందాన్ని కలిగించిన కాశీ యాత్ర

జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుని ఆలయమున్న, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన విశాలాక్షి మందిరమున్న ఈ కాశీని, జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకోని హిందువులుండరంటే అది అతిశయోక్తి కాదు! ఐతే, కాశీ విశ్వనాథుని దర్శనం చెయ్యాలంటే మనమనుకుంటే చాలదు, శివుని ఆజ్ఞ లేకుండా మనం కాశీలో అడుగు పెట్టలేమని చెప్తారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, పవిత్ర గంగానదికి పశ్చిమాన ఉంటుంది. ఈ ఆలయంపై ఎన్నోసార్లు దండయాత్రలు జరిగి, ఆలయ ప్రాంగణంలో ముస్లిం పాలకుడు ఔరంగజేబు మసీదుని నిర్మించాడని, ప్రస్తుతమున్న ఆలయాన్ని 1780 లో ఇండోర్‌ రాణి అహల్యాబాయి నిర్మించారని చరిత్ర చెప్తుంది.

గంగానది

కాశీనగరం శివ స్థాపితమని పురాణాలు ఉటంకిస్తే, ప్రళయకాలంలో కూడా నీటిలో మునగని ప్రదేశం ఇదొక్కటేనని హిందువుల విశ్వాసం. అలాగే సప్త ముక్తిపురాలలో ఇదొకటి (మధుర, గయ, ద్వారక, అయోధ్య, అవంతిక, కంచి మిగిలినవి). ప్రపంచంలో అతి పురాతన నివాస నగరాలలో ఇదొకటి. కాశీ నగరం ఆధ్యాత్మికంగా గానే కాదు, పారిశ్రామికంగా (బెనారస్ పట్టు వస్త్రాలు), విద్యాపరంగా (బెనారస్ హిందూ యూనివర్సిటీ) కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగివుంది.

వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడ గంగా నదిలో కలుస్తాయి. అందుకే వారణాసి అయిందంటారు. అసలు కాశీ రెండుగా విభజింప బడింది. మణికర్ణిక ఘాట్ నుండి ఆదికేశవ ఘాట్ వరకు విష్ణుకాశీ అని, మణికర్ణిక ఘాట్ నుండి. అస్సి ఘాట్ వరకు శివకాశీ అని చెప్తారు.

ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని నాకు చాలా కోరిక. గాని, వారణాసి వెళ్లాలని ఎప్పుడూ కోరిక కలగలేదు. బహుశా కాశీ వెళ్ళిన ఒకామె, కాశీ అంతా బురద బురదగా ఉంటుంది. కోవెలకు వెళ్ళే త్రోవలో అడుగెక్కడ పడుతుందో తెలియదు, త్రోవంతా ఆవులుంటాయి, వాటి పేడ ఉంటుందని వినడం కారణం కావొచ్చు. మరొకరు ఏమన్నారంటే, ఇవన్నీ ఉన్నా, మరల కాశీ వెళ్లాలనిపిస్తుందని. కాశీలో మరణిస్తే శివుడే మోక్ష మంత్రాన్ని చెవిలో ఊదుతాడని హిందువుల నమ్మకం. అందుకని చాలామంది తమ అంత్యకాలంలో కాశీని నివాసంగా చేసుకుంటారు.

శివుడు నాకెప్పుడూ అవకాశం ఇస్తాడా అని మాత్రం ఎదురుచూసాను. కాశీలో తొమ్మిది రాత్రులు ఉండాలన్న మావారి కోరిక రూపంలో నాకా అవకాశం వచ్చింది. మేము భువనేశ్వర్ మీదుగా కాశీ చేరుకున్నాం.

మేం హోటల్ గేట్ వే కైలాస్ లో దిగాం. మేమున్న హోటల్ ఎదురుగా గేట్ నెంబర్ 1 (ఆది శంకరాచార్య గేట్). అక్కడనుండి 100-150 మీటర్ల దూరం ఉంటుందేమో విశ్వనాథుని కోవెల.

ప్రతి హిందువూ చనిపోయేలోగా ఒక్కసారైనా కాశీ యాత్ర చెయ్యాలనుకుంటారు. అటువంటిది కాశీ వచ్చి దర్శనానికి వెళుతున్నామంటే, కాశీ వచ్చేశాం, విశ్వనాథుని చూడబోతున్నానని మనసులో ఒకటే ఉత్సాహం. దర్శనానికి చెప్పులు లేకుండానే బయలుదేరాం. త్రోవంతా ఒకటే బురద. మనుషులు జాగ్రత్తగా నడవక పోతే ఒకరినొకరు గుద్దు కోవలసిందే. అంత చిన్న వీధులు. ఇవేవీ నా ఆతృతని, ఉత్సాహాన్ని ఆపలేక పోయాయి. ఒక గంట క్యూలో వెయిట్ చేశాక విశ్వనాథుని దర్శనమయింది.

విశ్వనాథుని ఆలయం మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల్లా పెద్దదిగా ఉండదు. గర్భగుడి ఆలయ గోపురం, గోపురాని కిరువైపులా కాస్త పెద్దవిగా ఉన్న మరో రెండు గోపురాలు.. ఈ మూడు గోపురాలూ బంగారంతో నిర్మించబడ్డాయని చెప్పారు. విశ్వనాధ్ ఆలయంలో గర్భగుడికి వెళ్లే మార్గంలో చాలా శివలింగాలుంటాయి. క్యూలైన్లో వాటిని దర్శించుకుంటూ గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. శివలింగముండే గర్భగుడి చతురస్రాకారంగా, చిన్నగానే ఉంటుంది. మరీ మధ్యలో కాకుండా ఒక ప్రక్కగా, కొద్దిగా క్రిందకు వెండి పానిపట్టం, అందులో సుమారుగా రెండడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది. నాలుగు దిక్కులా ద్వారాలున్నాయి. రెండు ద్వారాల నుండి ప్రవేశముంటుంది. మిగిలిన రెండు ద్వారాల గుండా బయటికొస్తాం. శివలింగం దగ్గరగా వెళతాం. శివలింగం చుట్టూ బారికేడ్స్ ఉన్నాయి. అభిషేకం చేసుకోవచ్చు. గుడి వెలుపల పాలు అమ్ముతారు. మనను శివలింగాన్ని ముట్టుకోనివ్వరు. గాని రాత్రి 6-7pm వరకూ చరణస్పర్శ అంటే మనం శివలింగాన్ని తాకవచ్చు. రెండో రోజు మేము చరణ స్పర్శకు వెళ్ళాం. కొంతమంది శివలింగాన్ని చేతులతో రుద్దినట్లు చేసేస్తున్నారు. మరి స్వామికి నొప్పి కలుగుతుందేమో అనిపించింది. నేను కూడా స్పర్శించాను కదా! నేను కూడా స్వామిని ఇబ్బంది పెట్టానా అనుకున్నాను.

ప్రస్తుతం గర్భగుడిలోనికి ప్రవేశం లేదు. గర్భగుడికున్న నాలుగు ద్వారాల దగ్గర నుండి, పొడవైన ఇత్తడి దొప్పలను అమర్చారు. వాటిలో అభిషేక ద్రవ్యాలను పోస్తే, అవి శివలింగం పైన పడేటట్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చరణస్పర్శకు కూడా అవకాశం లేదు. కాశీలో అడుగడుగునా దేవాలయాలుంటాయి. మేమున్న హోటల్ టెర్రస్ మీద నుండి చూస్తే ఎన్ని ఆలయాలు కనిపించాయో! గాని ఇక్కడ ఆలయాలు పెద్దవిగా ఉండవు. కొన్ని ఆలయాలకు గోపురముంటే, కొన్ని ఆలయాలు మందిరాల్లా ఉంటాయి. శిల్పకళ పెద్దగా కానరాదు.

పరమపావన గంగలో స్నానం చేసి, విశ్వనాధుని దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం. కాశీ వచ్చాక గంగానదిలో స్నానం చేసి, గంగా నదీజలాన్ని తీసుకెళ్ళి రామేశ్వరంలో పూజ చేసి, అక్కడ ఇసుక తెచ్చి ఇక్కడ గంగలో కలుపుతారు. ఇది హిందువుల నమ్మకం. అలాగే కాశీలో మనకు అత్యంత ప్రీతిదాయకమైనది విడిచి పెట్టాలంటారు.

విశ్వనాధుని మందిరం లోపలే అన్నపూర్ణాదేవి మందిరం, పార్వతి మాత మందిరం ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు రాధాకృష్ణుల మందిరముంది. పెద్ద వినాయకుని విగ్రహముంది.

ఉత్తరాన ఒక నుయ్యి ఉంది. దాన్ని జ్ఞానబావి అంటారు. ముస్లింల దండయాత్ర సమయంలో, వాళ్ళకు శివలింగం దొరకకుండా ప్రధాన పూజారి శివలింగాన్ని పట్టుకుని ఈ బావిలో దూకేసాడట. ఆ పక్కనే పెద్ద నంది ఉంటుంది. ఆ పక్కనే చిన్న సభా మంటపముంది. కచేరీలు జరుగుతాయిక్కడ.

అడుగడుగునా ఆర్మీ సెక్యూరిటీ ఉంటుంది. మనలను పూర్తిగా చెక్ చేసి లోపలకు పంపిస్తారు. మొబైల్ ఫోన్లను ఎలౌ చెయ్యరు.

ఆలయం దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల్లాగ పెద్ద ఎత్తున కళాత్మకంగా గాని, శిల్పపరంగాగాని భాసిల్లదు. చుట్టూ కూడా పెద్ద విశాలంగా లేదు. మనం దూరం నుండి కూడా, శిఖరాన్ని కూడా ఫోటో తియ్యకూడదు. పారా మిలటరీ ఫోర్స్ అడుగడుగునా ఉంటారు. ఇరవైనాలుగు గంటలూ సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే మసీదు ఉంది. ఆలయం కన్నా అదే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది వాడుకలో ఉందో లేదో తెలియదు.

దర్శనమయ్యాక బయటికొచ్చి, అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళే దారిలో ఢుండి గణపతి మందిరం, చిన్నదే ఉంటుంది. మనమొచ్చామని ఢుండి గణపతికి చెప్పాలట. మాఘ శుద్ధ చవితిరోజు ఢుండి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు.

మనం విశ్వనాధ్ ఆలయానికి వెళ్ళే త్రోవలో షాపుల మధ్య సాక్షిగణపతి మందిరముంటుంది.

సాక్షిగణపతి మందిరము

కాశీ విశ్వనాథ్ థామ్ ప్రాజెక్టు– ఇరుకిరుకు సందుల ద్వారా మణికర్ణికా ఘాట్ నుండి, విశ్వనాధ్ ఆలయానికి వెళ్లే మార్గాన్ని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేటట్లు, ఆ మార్గంలో ఉన్న గృహ, వాణిజ్య సముదాయాలను వేరే చోటికి తరలించి, ఆ మార్గాన్ని విశాలంగా పునర్నిర్మించారు. దీనిని డిసెంబర్ 2021 లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.

అన్నపూర్ణాదేవి ఆలయం: కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయముంది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం. అన్నపూర్ణమ్మ తల్లి అలంకారంలో చాలా ముద్దుగా ఉంటారు. ఆ కళ్ళు చిన్నపిల్లల కళ్ళలా అమాయకంగా అగుపిస్తూ… ఎంత ముద్దొస్తున్నారో! అక్కడనుండి కదలాలనిపించలేదు. 100 రూపాయల టికెట్ తీసుకుంటే గర్భగుడి లోపలికి వెళ్ళవచ్చు. ఈ మందిరం ప్రవేశం దగ్గర శివలింగం ఉంటుంది. దాని దర్శనానికి మెట్లు దిగి కొంచెం క్రిందకు వెళ్ళాల్సి ఉంటుంది.

ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక ప్రక్కగా సూర్య భగవానుడు, కొంచెం లోపలకు వెళ్తే కాళీమాత, జగన్నాధ, సుభద్ర, బలభద్ర మందిరాలున్నాయి. గాని ఇక్కడంతా డబ్బు మహిమ. ఒక వంద ఇస్తే, టికెట్ కాదు, లోపలకు పోనిస్తారు. చేతికొక తోరణం కట్టి, ఓ వంద వసూలు చేస్తారు.

ఈ ఆలయం లోపలనే ఉచిత అన్నదానం, నిర్వహించ బడుతుంది. ఇక్కడ భోజనం సుష్టుగా పెడతారు. గాని, వడ్డించేటప్పుడు చాలా వృధా చేస్తారు. అన్నదానానికి విరాళమివ్వవచ్చు. మనకు కావలసిన రోజులలో అన్నదానం చెయ్యమని చెప్పవచ్చు. పోస్టులో మనకి ప్రసాదం కూడా పంపిస్తారు.

విశాలాక్షి మందిరం: కాశీవిశ్వనాధ ఆలయానికి కొద్ది దూరంలో, సందులు తిరుగుతూ వెళితే, విశాలాక్షి అమ్మవారి ఆలయం వస్తుంది. విశ్వనాధుని దర్శించుకున్న తర్వాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం. ఇది 17వ శక్తి పీఠం. ఇక్కడ అమ్మవారి చెవిపోగు పడిందట. కాని ఇక్కడ పూజారులు అమ్మవారి ముఖం పడిందని అంటారు. ఆ ముఖం స్వయంభువుగా వెలసింది అంటారు.ఈ విగ్రహం ముందు ఇంకొక విగ్రహం ఉంటుంది. అది ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టింప బడిందట. ఇలా రెండు విగ్రహాలెందుకు ఉన్నాయంటే, వెనుక స్వయంభువు విగ్రహానికి వేళ్ళలో చిన్న లోపముందట. అందుకని ఇంకొకటి ప్రతిష్టించారని చెప్పారు.

ఈ ఆలయం ఇళ్ళ మధ్యలో, సందుల మధ్య, మణికర్ణికా ఘాట్ కు దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయంలోపల శివుని మందిరం, నవగ్రహాలు ఉన్నాయి.

గంగానది: హిందువులకు పరమ పవిత్రమైన నది గంగానది. ఆ నదీతీరంలో సుమారు 84 ఘాట్లున్నాయి. అందులో దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదారేశ్వర ఘాట్, పంచగంగ ఘాట్ లు ముఖ్యమైనవి. దహన సంస్కారాలు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ లలో జరుగుతాయి. ఎక్కువ జన సమ్మర్థమైనది దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు పది అశ్వమేథ యాగాలిక్కడ చెయ్యబట్టి, దీనికా పేరు వచ్చిందట. గంగానది కాలుష్యం గురించి ఎంతో వినివున్నాం. గాని ఇప్పుడా పరిస్థితి లేదు. శుభ్రంగానే ఉంది. ఘాట్లు కూడా శుభ్రంగా ఉంచుతున్నారు. ఇక్కడకు వచ్చిన యాత్రీకుల్లో ఎక్కువమంది మన తెలుగువాళ్ళే.

కాల భైరవుడు, బిందు మాధవులను దర్శించ కుండా కాశీ పర్యటన పూర్తి కాదు.

గంగా హారతి: ఎంతో ప్రసిద్ధి పొందింది. మన ప్రధానమంత్రి గారు కూడా గంగాహారతిని తిలకించారంటేనే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. సాయంకాలం 4.30 నుండి అందరూ దశాశ్వమేధ ఘాట్ కు చేరుకుంటారు. ముందు వెళ్ళేవాళ్ళు చక్కగా ముందు కూర్చుని చూడవచ్చు. విదేశీయులు కూడా చాలామంది వస్తారు. కుర్చీలు వేసి ఉంటాయి. వాటిపై కూర్చోవడానికి కొద్దిగా డబ్బులు వసూలు చేస్తారు. అరుగుల మీద కంబళ్ళు పరుస్తారు కూర్చోవడానికి. నదివేపు ఉన్న అరుగుల మీద పూలరేకులు చల్లి ఉంచారు. అక్కడకు, అందంగా ముస్తాబై వేదాధ్యయనం చేస్తున్న వారొచ్చి హారతి ఇస్తారు. ఒక వేపు నుండి మ్యూజిక్ వినిపిస్తుంటుంది. పాట వినిపిస్తుంటుంది. హారతి… ముందు ఊదొత్తులతో, తర్వాత ధూపం, దీపాలు, వింజామరతో సేవ చేస్తూ ఇస్తారు. అందరూ ఒకేసారి క్రమపద్ధతిలో హారతిస్తుంటే చాలా, చాలా బాగుంటుంది. ఇది చూడడానికి కొంత మంది నదిఒడ్డున కూర్చుంటే, కొంతమంది, నదిపైన పడవల మీద నుండి చూస్తారు.

ఒకరోజు కాశీవిశ్వనాధుని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షి అమ్మవారిని, గంగానదిని, గంగా హారతి చూడడానికి సరిపోతుంది.

కాశీ మరియు ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను చూడడానికి ఒకరోజు పడుతుంది.

వారాహీ మాత: లలితాదేవి సర్వ సేనాని. కాశీ పట్టణ రక్షణ బాధ్యత వారాహీ మాతదే. అందుకని ఆమె రాత్రంతా తన బాధ్యతను నిర్వహించి, వేకువ జామున, తన మందిరాన్ని చేరుకుని, పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. అందుకని ఆమె దర్శన వేళలు ఉదయం 10-11am తో ఆపుతారు. ఉదయం ఆమెకు పూజ చేసి 7am కు మందిరం తలుపులు తెరిచి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వారాహీ అమ్మ అండర్ గ్రవుండ్ లో ఉంటారు. మనం ఒక కిటికీ ద్వారా ఆమెను చూడవచ్చు. కానీ పూర్తిగా ఆమె ముఖం మనకు కనిపించదు. అలంకారం అడ్డేస్తుంది. ఇంకొక కిటికీ సరిగ్గా ఆమె ముందు ఉన్నట్లుంటుంది. అక్కడ నుండి ఆమె పాదాలు మాత్రం కనిపిస్తాయి. ఈ ఆలయం దశాశ్వమేధ ఘాట్ కి దగ్గరలో ఉంటుంది. ఇళ్ళ మధ్య సందులో ఉంటుంది.

నేపాల్ టెంపుల్: ఇది పశుపతినాథ్ ఆలయానికి నకలు. నేపాలీల ఆధ్వర్యంలో నడుస్తుంది.

రాజరాజేశ్వరీ టెంపుల్: ఇది నేపాల్ టెంపుల్ కు దగ్గరలో ఉంటుంది. సందులు తిరుగుతూ పోవాలి. అమ్మవారి విగ్రహం అందంగా, అలంకరించి ఉంది.

త్రైలింగ స్వామి టెంపుల్: ఇతను మన ఆంధ్రప్రదేశ్ లోని, విజయనగరంలో 1607 నవంబర్ 27 న పుట్టారని, 280 సంవత్సరాలు జీవించి 1887, డిసెంబరు 26 న ఇక్కడ సమాధి అయ్యారని చెప్పారు. ఇతను గంగానది మీద నడుచుకుంటూ వెళ్లేవారని ప్రతీతి. త్రైలింగస్వామి విగ్రహం వెనుకగా కాళీమాత విగ్రహం ఉంటుంది. ఆ ప్రక్కనే మఠం ఉంది.

త్రైలింగస్వామి ఆలయం

బిందుమాధవ టెంపుల్: ఇది పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి. (వేణీ మాధవ్- ప్రయాగ, సేతు మాధవ్- రామేశ్వరం, కుంతి మాధవ్- పిఠాపురం, సుందర మాధవ్- తిరువనంతపురం). బిందు మాధవుని పాదాల నుండి గంగ, యమున, సరస్వతి, కిరణ, ధుత్సప గంగలు, (ఇవే పంచ గంగలు) ప్రవహిస్తాయట. ఈ పంచ గంగలలో స్నానం చేసి బిందు మాధవుని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని విశ్వాసం. బిందు మాధవుడు ఎంత అందంగా కనిపిస్తాడంటే చూడడానికి రెండు కళ్ళూ చాలవు. స్వామి స్వయంభువు. శాలగ్రామం అని చెప్పారు. పాంచజన్యం, సుదర్శనం, కమలం, కౌమోదకిని నాలుగు చేతుల్లో ధరించి ఉన్నారు.

బిందుమాధవ

అగ్నిబిందు మహర్షి, గండకీ నదీతీరంలో, ముక్తినాథ్ దగ్గర విష్ణువు కోసం తపస్సు చేస్తే, ఆయన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, తన విగ్రహాన్ని కాశీలో ప్రతిష్టించమని ఆదేశిస్తే, ఆ ఋషి పేరు మీదుగా బిందు మాధవుడని కొలవబడుతున్నారని చెప్పారు.

స్వామి విగ్రహంలోనే కొంచెం క్రిందుగా అమ్మవారి ముఖం ఉంటుంది. అక్కడ పూజారి చక్కగా అన్నీ చెప్పారు. ఈ టెంపుల్ పంచగంగ ఘాట్ దగ్గర ఉంటుంది. ఎక్కువ మందికి తెలియదు. పట్టుకోవడం కష్టం. ఈ ఆలయంలో చాలా శివలింగాలు ఉంటాయి.

రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్: మణికర్ణికా ఘాట్ దగ్గర ఉంటుంది. ఇది భూమిలోనికి ఒరిగినట్లు ఉంటుంది.

గౌరీ కేదారేశ్వర ఆలయం: కేదారనాథ్ లో ఉన్నట్లు శివ లింగం, పూర్తిగా లింగాకారంగా కాకుండా ఉబ్బెత్తుగా వున్న రాయిలా ఉంటుంది. చుట్టూ పానిపట్టం. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే, ఆ లింగం సగంలో చీలినట్లు ఉంటుంది. అంటే, సగం గౌరి, సగం ఈశ్వరుడు- అదే గౌరీ సమేత కేదారేశ్వరుడు. చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. బియ్యం, పెసర పప్పుతో చేసిన నైవేద్యం స్వామికిక్కడ ప్రీతితో అర్పిస్తారు. ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఇంకా సమస్త దేవతలూ ఉన్నారు.

ఇది కేదారేశ్వర ఘాట్ దగ్గర ఉంటుంది. ఆలయానికి ఎరుపు, తెలుపు రంగులు వేసి ఉంటాయి. దూరానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. ఇక్కడకు బోట్ లో కూడా వెళ్ళవచ్చు. బిందుమాధవుని టెంపుల్ నుండి 400/- ఇచ్చి కేదారేశ్వర్ ఘాట్ కు వెళ్ళాం.

లోలార్క్ మహాదేవ్ టెంపుల్: ఇది సూర్యునిచే ప్రతిష్టించబడ్డ లింగం. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే కుండం 50 అడుగుల లోతుంటుంది. దిగడానికి మెట్లుంటాయి.ఈ నీరు పాతాళలోకం నుండి వస్తుందని ప్రతీతి. ఇందులో స్నానం చేస్తే సంతానవంతులు అవుతారని ప్రతీతి. అందుకని సంతానం కోసం దంపతులు వచ్చి ఇందులో స్నానం చేసి మహాదేవుని అర్చిస్తారు.

లోలార్క్ ఆదిత్య ఆలయం

లోలార్క్ కుండం

తిలా భండేశ్వర్ మహాదేవ్ మందిరం: చాలా పురాతనమైనది. ఇక్కడి శివలింగం పెరుగుతుందని ప్రతీతి. ఇక్కడ శివకోటి స్తూపం ఉంది. సరస్వతి దేవి విగ్రహం, పార్వతి మాత, రామ మందిరం, గణేష్ మందిరాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి మందిరం ఉంది. మదంపురా వీవర్స్ కోలనీ దగ్గర ఉందిది.

కాశీ చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ దేవాలయాలను ఏదైనా వెహికిల్ బుక్ చేసుకుని ఒక రోజులో చూడవచ్చు. ఈ దిగువ వాటి వివరాలను ఇస్తున్నాను.

వారాహిమాత మందిరం

కాలభైరవ మందిరం: కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈయన దర్శనం కానిదే, కాశీయాత్ర పూర్తి కాదు.

మృత్యుంజయ (శివుడు) మందిరం: కాలభైరవ మందిరంకు సమీపంలో ఉంటుంది. ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని, ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తారు.

కవళీ మాత (గవ్వలమ్మ) గుడి: ఈమె గవ్వలమ్ముకుని జీవిస్తూ, కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకున్నాక భుజించేది. ఒకనాడు ఆమెను ఒక అస్పృశ్యుడు ముట్టుకున్నాడని మరల గంగలో స్నానం చేసి బయటకు రాగానే, మరల ఆ అస్పృశ్యుడు ముట్టుకోవడం, మరల స్నానం చేయడం, అలాగ రాత్రి అయిపోయింది. ఆమెకు విశ్వనాధుని దర్శనం లేదు. భోజనం లేదు. కాశీలో ఎవరూ అభోజనంగా ఉండకూడదు. అందుకని అన్నపూర్ణాదేవి వచ్చి భోజనం చెయ్యమన్నా, విశ్వనాధుని దర్శనం కాలేదని ఆమె భోంచేయదు. దాంతో అన్నపూర్ణా దేవికి కోపం వచ్చి, కాశీ విడిచి వెళ్ళమని శపిస్తుంది.

తల్లడిల్లిన ఆమె, శివుని ప్రార్ధించి తన అపరాధమేమిటని అడుగగా, నా దృష్టిలో అందరూ సమానులే, నీవు అస్పృశ్యుని పట్ల చేసిన తప్పిదం వలన నీకు ఈ శాపం. అయినా నీ భక్తికి మెచ్చాను. నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు ” అని చెప్పి అదృశ్యం అయ్యాడు.

కవళీమాత మందిరం

కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్నా, ఆ ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో “ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాం. కాశీ విశ్వనాధుని దర్శన ఫలితం నాకివ్వమని ప్రార్థించిన భక్తులకు కాశీ దర్శన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు. పూజాసామగ్రితో పాటు, ఐదు గవ్వలిస్తారు. అందులో నాలుగు గవ్వలు కవళీమాత దగ్గర పెట్టి, ఒక గవ్వ వెనుకకు ఇస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం: కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరమొకటి. ఈ మందిరం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ఇది చాలా విశాలమైన ఆవరణలో, చుట్టూ వృక్షాలతో సుమారుగా అరణ్యం మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ సెల్ ఫోన్లు లోపలకు తీసుకెళ్ళనివ్వరు.

ఈ ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర్య సమరవేత్త, “బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం” వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. మధ్యయుగానికి చెందిన సన్యాసి, రామాయణ (తులసి రామాయణం) సృష్టికర్తైన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో, ఈ ఆలయం నిర్మించబడిందని కథనం. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ, శనివారాలలో విశేష పూజలు నిర్వహించబడతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్య దైవాలైన సీతారాముల వారి మందిరం, హనుమాన్ మందిరం ఎదురుగుండా ఉంటుంది. ఇక్కడ భక్తులు స్వామికి నైవేద్యంగా స్వీట్స్ సమర్పిస్తారు. ఆలయం కాంప్లెక్సులోనే స్వీట్స్ షాపు కూడా ఉంది.

దుర్గా టెంపుల్: దుర్గా మాతను మరీ చూడాలనిపించేంత అందంగా అలంకరించారు. ఇక్కడ తీపి మిఠాయిలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక్కడ నిత్యం హోమం చేస్తారు. సంకట్ మోచన్ రోడ్డులో ఉందిది. ఎరుపురంగు పెయింటుతో ఆకర్షణీయంగా ఉంటుందీ ఆలయం.

దుర్గ గుడి

తులసీ మానస మందిరం: ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. రెండు అంతస్తులలో ఉంటుంది. క్రింద అంతస్తులో సీతారాముల విగ్రహాలుంటే, పై అంతస్తులో తులసిదాస్ విగ్రహముంది. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాలు మీద తులసీ రామాయణం లిఖింబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే కొన్ని రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కూడా ఇక్కడ భధ్రపరచబడి ఉన్నాయి.

బిర్లా మందిరం: ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో, బిర్లా కుటుంబంచే నిర్మించబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది, పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత. ఈ ఆలయం కూడా రెండు అంతస్తులుగా ఉంటుంది. క్రింద అంతస్తులో పెద్ద శివలింగముంటే పై అంతస్తులో కలశముంటుంది. శివలింగానికి నిరంతరం అభిషేకం జరిగేలా, కలశం నుండి నీటిధార చుక్కలు, చుక్కలుగా పడుతుంది. క్రింద అంతస్తులో ఇంకా పార్వతీదేవి, నటరాజస్వామి, గణేష్, సరస్వతీ మాత, హనుమాన్, పంచముఖ మహాదేవ్, నంది ఉపాలయాలు ఉన్నాయి. ప్రాంగణంలో పూలమొక్కలతో చక్కని తోటను పెంచుతున్నారు.

బిర్లా మందిరం

మేం వెళ్ళిన సమయంలో భక్తుల రద్దీ లేదు కనుక, రోజుకు రెండు మూడుసార్లు విశ్వనాధుని దర్శనం చేసుకునే వాళ్ళం. అయోధ్య, ప్రయాగ, సారనాథ్, కాశీ చుట్టుపక్కల ఆలయాలకు వెళ్లిన రోజుల్లో కూడా దర్శనం చేసుకునే బయలుదేరే వాళ్ళం.

గంగా హారతి, ఘాట్లను చూసుకుంటూ గంగా నదిలో పడవ ప్రయాణం, అన్నపూర్ణమ్మ మందిరంలో భోజనం, ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడు వెళ్లి, చేసుకున్న విశ్వనాధుని, అన్నపూర్ణమ్మ, విశాలాక్ష్మమ్మల దర్శనాలు మాకు అలౌకిక ఆనందాన్ని కలుగచేశాయి. మరల పునర్దర్శన ప్రాప్తినిమ్మని విశ్వనాథుని కోరుకుంటూ విశాఖకు తిరుగు ప్రయాణమయ్యాం.

Exit mobile version